యువత హాకీ వైపు అడుగులు వేస్తోంది
2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ వరకు ఆడతా
భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్ సవితా పూనియా మనోగతం
హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని... దీని వల్ల యువ ఆటగాళ్లు హాకీని కెరీర్‌గా ఎంచుకునేందుకు మక్కువ చూపుతారని భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్, మాజీ కెప్టెన్ సవితా పూనియా అభిప్రాయపడింది.
ఈ నెల 12 నుంచి 26 వరకు మహిళల కోసం తొలిసారి హెచ్‌ఐఎల్ నిర్వహిస్తుండగా... దీని వల్ల ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని సవిత ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న సవిత... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ వరకు ఆడాలనుకుంటున్నట్లు వెల్లడించింది.
కెరీర్ విశేషాలు, భవిష్యత్తు లక్ష్యాలు, దేశంలో హాకీ భవిష్యత్తుపై సవిత తన అభిప్రాయాలు వెల్లడించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
ప్రతి ప్లేయర్‌కు ఆర్థిక స్థిరత్వం ముఖ్యం. హాకీ ఇండియా లీగ్ వల్ల అది సాధ్యమవుతుంది. క్రీడా సామాగ్రి కొనుగోలు చేసేందుకు కూడా తల్లిదండ్రులపై ఆధార పడాల్సి వస్తే ఆ కుటుంబం ఎంతో ఇబ్బంది పడుతుంది. జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసినప్పుడు అవార్డులు, రివార్డులు లభిస్తాయి. అదే జూనియర్ స్థాయిలో ఆడేవాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్లకు హెచ్‌ఐఎల్ ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది.
» ఆర్థిక ఇబ్బందులు లేననప్పుడే ప్లేయర్లు తమ లక్ష్యంపై దృష్టి సారించగలుగుతారు. సీనియర్ ప్లేయర్‌గా జూనియర్లకు ఎప్పుడూ లక్ష్యాన్ని వదలొద్దనే చెబుతా. హాకీ అనే కాదు ఏ క్రీడలోనైనా అంతే.
» హాకీని కెరీర్‌గా ఎంపిక చేసుకుంటే గతంలో తల్లిదండ్రులు ఆర్థిక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు కనీసం వాళ్లు సంతోషిస్తారు. పిల్లలు మంచి ప్రదర్శన చేస్తే వారికి మెరుగైన భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం అయితే వస్తుంది.
» 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనాలని అనుకుంటున్నా. అప్పటి వరకు రిటైర్మెంట్ గురించి ఆలోచించను. నా నిర్ణయాన్ని మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ కాదనలేదు. పెళ్లి తర్వాత భర్త కూడా నన్ను అర్థం చేసుకున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప విషయం ఇంకేం ఉంటుంది.
» ప్రస్తుతం 2026 ప్రపంచకప్‌తో పాటు ఆసియా క్రీడలపైనే ప్రధానంగా దృష్టి పెట్టా. ఆటను ఆస్వాదిస్తున్నా.
» మహిళల హాకీలో హెచ్‌ఐఎల్ పెను మార్పులు తీసుకువస్తుంది. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దీనికి మంచి గుర్తింపు దక్కడం ఖాయం. ఎందరో అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు ఇందులో పాల్గొంటున్నారు. వారి అనుభవాల నుంచి భారత యువ క్రీడాకారిణులు పాఠాలు నేర్చుకుంటారు.
» భారత జట్టులో సీనియర్ ప్లేయర్‌గా నా బాధ్యతలేంటో తెలుసు. యువ ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడంతో పాటు... గోల్ కీపర్‌గా ఆటను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment