HIL
-
మహిళల హాకీ ఇండియా లీగ్ వేలం... ఉదిత దుహాన్‌కు రూ. 32 లక్షలు
హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) మహిళల టోర్నమెంట్‌కు సంబంధించి మంగళవారం వేలం కార్యక్రమం జరిగింది. భారత జట్టు డిఫెండర్ ఉదిత దుహాన్‌కు అత్యధికంగా రూ. 32 లక్షలు లభించాయి. శ్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు ఉదితను కొనుగోలు చేసింది. ఉదిత తర్వాత రెండో అత్యధిక మొత్తం నెదర్లాండ్స్ డ్రాగ్ ఫ్లికర్ యిబ్బీ జాన్సన్‌కు దక్కింది. ఒడిశా వారియర్స్ జట్టు రూ. 29 లక్షలకు యిబ్బీ జాన్సన్‌ను సొంతం చేసుకుంది. భారత జట్టు సభ్యులు లాల్రెమ్సియామి (రూ. 25 లక్షలు; శ్రాచి రార్ బెంగాల్ టైగర్స్), సునెలితా టొప్పో (రూ. 24 లక్షలు; ఢిల్లీ ఎస్జీ పైపర్స్), సంగీత కుమారి (రూ. 22 లక్షలు; ఢిల్లీ ఎస్జీ పైపర్స్)లకు కూడా పెద్ద మొత్తమే లభించింది. భారత సీనియర్ జట్టు కెపె్టన్ సలీమా టెటెను ఒడిశా వారియర్స్ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. ఇషిక (రూ. 16 లక్షలు), నేహా గోయల్ (రూ. 10 లక్షలు)లను కూడా ఒడిశా వారియర్స్ కొనుగోలు చేసింది. సూర్మా హాకీ క్లబ్ భారత మాజీ కెప్టెన్ సవితా పూనియా (రూ. 20 లక్షలు), షర్మిలా దేవి (రూ. 10 లక్షలు), నిక్కీ ప్రధాన్ (రూ. 12 లక్షలు)లను దక్కించుకుంది. హెచ్ఐఎల్ టోర్నీ డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు రాంచీ, రౌర్కెలాలలో జరుగుతుంది. -
హర్మన్‌ప్రీత్‌కు 78 లక్షలు
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) వేలంలో భారీ ధర పలికింది. ఆదివారం ప్రారంభమైన హెచ్ఐఎల్ లీగ్ తొలి రోజు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌కు చెందిన సూర్మా హాకీ క్లబ్ రూ. 78 లక్షలు పెట్టి హర్మన్‌ప్రీత్ సింగ్‌ను కొనుగోలు చేసుకుంది. వేలం మొదటి రోజు భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్ల కోసం ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అభిషేక్ కోసం బెంగాల్ టైగర్స్ ఫ్రాంచైజీ రూ. 72 లక్షలు వెచ్చించగా.. యూపీ రుద్రాస్ ఫ్రాంచైజీ హార్దిక్ సింగ్‌ను రూ. 70 లక్షలకు పెట్టి కొనుగోలు చేసుకుంది. తమిళనాడు డ్రాగన్స్ జట్టు అమిత్ రోహిదాస్ కోసం రూ. 48 లక్షలు వెచి్చంచగా... బెంగాల్ టైగర్స్ ఫ్రాంచైజీ జుగ్‌రాజ్‌కు అంత మొత్తమే ఇచ్చి తీసుకుంది. హైదరాబాద్ తూఫాన్స్ ఫ్రాంచైజీ తొలి రోజు వేలంలో అత్యధికంగా సుమిత్ కోసం రూ. 46 లక్షలు ఖర్చు చేసింది. తొలి రోజు వేలంలో భారత్ నుంచి 54 మంది ప్లేయర్లతో పాటు 18 మంది విదేశీ ప్లేయర్లు అమ్ముడుపోయారు. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు 16 కోట్ల 88 లక్షల 50 వేలు ఖర్చు చేశాయి. ఎనిమిది ఫ్రాంచైజీల్లో కళింగ లాన్సర్స్ వద్ద అత్యధికంగా రూ. 2.57 కోట్లు ఇంకా మిగిలి ఉండగా... అత్యల్పంగా బెంగాల్ టైగర్స్ వద్ద రూ. 1.44 కోట్లు పర్స్ మనీ ఉంది. హైదరాబాద్ తూఫాన్స్ ఫ్రాంచైజీ వద్ద ఇంకా రూ. 2.04 కోట్లు ఉన్నాయి. జర్మనీకి చెందిన గొంజలో పైలట్ అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్‌గా నిలిచాడు. అతడికోసం తమిళనాడు డ్రాగన్స్ జట్టు రూ. 68 లక్షలు వెచ్చించింది. నెదర్లాండ్స్‌కు చెందిన జిప్ జాన్సెన్ను రూ. 54 లక్షలు పెట్టి తమిళనాడు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. -
‘లాటే’ చేతికి హావ్మోర్ ఐస్‌క్రీమ్
న్యూఢిల్లీ: హావ్మోర్ ఐస్‌క్రీమ్ కంపెనీ (హెచ్ఐఎల్) తన ఐసీక్రీమ్ వ్యాపారాన్ని దక్షిణ కొరియాకు చెందిన లాటే కన్ఫెక్షనరీకి విక్రయించనున్నది. ఈ డీల్ విలువ రూ.1,020 కోట్లు. ఈ డీల్‌లో భాగంగా హెచ్ఐఎల్కు చెందిన వంద శాతం షేర్లను లాట్టే కంపెనీ కొనుగోలు చేయనున్నది. ఈ విక్రయం తర్వాత లాట్టే కంపెనీ తన ఐస్‌క్రీమ్ వ్యాపారాన్ని భారత మార్కెట్లో ప్రారంభించనున్నది. హావ్మోర్ ఐస్‌క్రీమ్‌ను గత 73 ఏళ్లుగా మంచి బ్రాండ్‌గా తీర్చిదిద్దామని హెచ్ఐఎల్ చైర్మన్ ప్రదీప్ చోనా చెప్పారు. తమ బ్రాండ్‌ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లే సరైన సంస్థ లాటేనని పేర్కొన్నారు. అహ్మదాబాద్ కేంద్రంగా హావ్మోర్ కంపెనీ ఐస్‌క్రీమ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి మొత్తం 14 రాష్ట్రాల్లో పార్లర్ నెట్వర్క్ ఉంది. మొత్తం రెండు ప్లాంట్ల ద్వారా 150 రకాల ఐస్‌క్రీమ్‌లను 30 వేల డీలర్ల ద్వారా విక్రయిస్తోంది. ఇక 8,000 కోట్ల డాలర్ల లాట్టే కన్ఫెక్షనరీ 2004లో భారత్‌లో ప్రవేశించింది. చెన్నై, ఢిల్లీలో చాకో–పై ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసింది. ప్రస్తుత భారత చాకో–పై మార్కెట్లో కంపెనీ వాటా 90 శాతంగా ఉంది. కాగా, గుజరాత్‌లోని హ్యుబర్ అండ్ హోలీ పేరుతో నిర్వహిస్తున్న రెస్టారెంట్, ఈటరీ, కేఫ్ చెయిన్ నిర్వహణను హావ్మోర్ కొనసాగిస్తుంది. ఈ డీల్‌కు కేపీఎమ్‌జీ, వెరిటాస్ లీగల్, ధ్రువ ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఆర్థిక సలహాదారులుగా వ్యవహరించాయి. -
హెచ్ఐఎల్ కింగ్ కళింగ
చండీగఢ్: పొగొట్టుకున్న చోటే వెతుక్కోవడం అంటే ఇదేనేమో... గత సీజన్ తుదిమెట్టుపై చేజారిన టైటిల్‌ను ఈసారి కళింగ లాన్సర్స్ ఒడిసి పట్టుకుంది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్లో విజేతగా నిలిచింది. ఫైనల్లో కళింగ జట్టు 4–1తో దబంగ్ ముంబైపై జయభేరి మోగించింది. లాన్సర్స్ ఆటగాళ్ల దూకుడుతో మొదలైన ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. మోరిట్జ్ ఫ్యుయరిస్ట్ రెండు గోల్స్‌తో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పో షించాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్ రెండు అర్ధభాగాలు ముగిసే సమయానికి మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. మొదట ఇరు జట్ల ఆటగాళ్లు చెమటోడ్చడంతో తొలి క్వార్టర్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో అర్ధభాగంలో కళింగ లాన్సర్ ఆటగాళ్లు ఒక్కసారిగా చెలరేగారు. దీంతో ఆట మొదలైన మూడో నిమిషంలోనే గ్లెన్ టర్నర్ (18వ నిమిషం) ఫీల్డు గోల్ చేయడంతో కళింగ జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచింది. హెచ్ఐఎల్ నిబంధనల ప్రకారం ఫీల్డు గోల్‌కు రెండు గోల్స్‌గా పరిగణిస్తారు. తర్వాత రెండో క్వార్టర్ కాసేపట్లో ముగుస్తుందనగా మోరిట్జ్ ఫ్యుయరిస్ట్ (30వ ని.) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో కళింగ 3–0తో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే మూడో క్వార్టర్లో దబంగ్ ముంబై ఖాతా తెరిచింది. ఆట 33వ నిమిషంలో అఫాన్ యూసుఫ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచడంతో కళింగ ఆధిక్యం 3–1కు తగ్గింది. చివరి క్వార్టర్లో మళ్లీ మోరిట్జ్ (59వ ని.) గోల్ చేయడంతో లాన్సర్ 4–1తో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. విజేతగా నిలిచిన కళింగ లాన్సర్స్‌కు రూ. 2 కోట్ల 50 లక్షలు... రన్నరప్ ముంబై జట్టుకు రూ. కోటీ 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో యూపీ విజార్డ్స్ 5–4తో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ను ఓడించింది. -
ఫైనల్లో దబంగ్ ముంబై, కళింగ లాన్సర్స్
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబంగ్ ముంబై, కళింగ లాన్సర్స్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో దబంగ్ ముంబై జట్టు 2–0తో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై గెలుపొందగా... కళింగ లాన్సర్స్ ‘షూటౌట్’లో 4–3తో యూపీ విజార్డ్స్ జట్టును ఓడించింది. నేడు ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
ఢిల్లీ వేవ్‌రైడర్స్‌కు మరో పరాజయం
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్లో ఢిల్లీ వేవ్‌రైడర్స్ పరాజయాలు కొనసాగుతున్నాయి. మంగళవారం డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 2–3తో ఓడింది. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఈ జట్టు మూడు ఓటములు, ఓ డ్రాతో పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. పంజాబ్ నుంచి 15వ నిమిషంలో వాన్‌డర్ హోర్ట్స్ ఫీల్డ్ గోల్ చేయగా 53వ నిమిషంలో వాన్‌డర్ వీర్డన్ మరో గోల్ సాధించాడు. ఢిల్లీ నుంచి వైట్ ట్రిస్టాన్ (39) ఫీల్డ్ గోల్ చేశాడు. బుధవారం జరిగే మ్యాచ్‌లో యూపీ విజార్డ్స్‌తో ఢిల్లీ ఆడుతుంది. -
భారీ విజయంతో వారియర్స్ బోణీ
రాంచీ: భారత స్టార్ ఫార్వర్డ్ ఎస్వీ సునీల్ మెరుపు ప్రదర్శనతో నాలుగు గోల్స్ సాధించడంతో... హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ వారియర్స్ బోణీ చేసింది. దబంగ్ ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో 4–10తో ఓడిపోయిన పంబాబ్... బుధవారం రాంచీ రేస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 7–0తో ఘనవిజయం సాధించింది. ఆట 25వ నిమిషంలో మింక్ వాన్‌డెర్ వీర్డెన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో వారియర్స్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సునీల్ 26వ నిమిషంలో, 34వ నిమిషంలో రెండు ఫీల్డ్ గోల్స్ చేశాడు. హెచ్ఐఎల్ నిబంధనల ప్రకారం ఫీల్డ్ గోల్‌ను రెండు గోల్స్‌గా పరిగణిస్తారు. దాంతో వారియర్స్ 5–0తో ముందంజ వేసింది. 43వ నిమిషంలో జేక్ వెటన్ ఫీల్డ్ గోల్ సాధించడంతో వారియర్స్ ఆధిక్యం 7–0కు పెరిగింది. గురువారం జరిగే మ్యాచ్‌లో రాంచీ రేస్‌తో దబంగ్ ముంబై తలపడుతుంది. -
గుర్బాజ్ సింగ్‌కు రూ.67 లక్షలు
న్యూఢిల్లీ: క్రమశిక్షణారాహిత్యంతో దాదాపు ఏడాది కాలంగా భారత జట్టుకు దూరమైనా... మిడ్‌ఫీల్డర్ గుర్బాజ్ సింగ్ హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) వేలంలో తన ప్రత్యేకత నిలబెట్టుకున్నాడు. బుధవారం జరిగిన వేలంలో రాంచీ రేస్ జట్టు గుర్బాజ్‌ను 99 వేల డాలర్లకు (సుమారు రూ. 67 లక్షలు) సొంతం చేసుకుంది. 2017 సీజన్ కోసం ఈ వేలం జరిగింది. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లూ దాదాపుగా తమ వద్ద ఉన్న ఆటగాళ్లనే కొనసాగించాలని నిర్ణయించున్నాయి. దాంతో ప్రధాన ఆటగాళ్లు పోగా... మిగిలిన కొన్ని ఖాళీల కోసం ఈ వేలంను నిర్వహించారు. గుర్బాజ్ తర్వాత 75 వేల డాలర్లతో (రూ. 51 లక్షలు) జర్మనీ ఫార్వర్డ్ క్రిస్టోఫర్ రూర్ రెండో స్థానంలో నిలిచాడు. అతడిని కూడా రాంచీ జట్టు ఎంచుకుంది. భారత యువ ఆటగాళ్లలో 18 ఏళ్ల హార్దిక్ సింగ్‌ను పంజాబ్ జట్టు 39 వేల డాలర్లకు (రూ. 27 లక్షలు) తీసుకోవడం విశేషం. -
పంజాబ్‌తో కళింగ అమీతుమీ
సెమీస్‌లో ఓడిన రాంచీ రేస్, ఢిల్లీ హాకీ ఇండియా లీగ్ రాంచీ: డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ జట్టు హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) సెమీఫైనల్లోనే నిష్ర్కమించింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ షూటౌట్ దాకా వెళ్లగా కళింగ లాన్సర్స్ 6-4తో రాంచీకి షాక్ ఇచ్చింది. దీంతో ఈ లీగ్‌లో తొలిసారిగా కళింగ ఫైనల్‌కు వెళ్లింది. ఆదివారం జరిగే తుది పోరులో కళింగ జట్టు పంజాబ్ వారియర్స్‌ను ఢీకొంటుంది. అంతకుముందు నిర్ణీత సమయంలో కళింగ, రాంచీ జట్లు 2-2తో సమంగా నిలిచాయి. విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. దీంట్లో మొదట రాంచీ రేస్ నుంచి కెప్టెన్ ఆష్లే జాక్సన్ తొలి ప్రయత్నాన్ని విఫలం చేయగా ఆ తర్వాత సర్వన్జిత్, మన్‌ప్రీత్ సింగ్ గోల్స్ చేశారు. అయితే నాలుగో షాట్‌ను మిడిల్టన్ గోల్‌గా మలచలేకపోయాడు. అటు కళింగ జట్టుకు కెప్టెన్ మోరిట్జ్ ఫ్యుయర్‌స్టే, క్యాస్పర్స్, లలిత్, జలెక్సి వరుసగా చేసిన గోల్స్‌తో జట్టు ఫైనల్‌కు చేరింది. మూడోసారి పంజాబ్ ఫైనల్లోకి.. అంతకుముందు జరిగిన తొలి సెమీస్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై 3-1తో నెగ్గిన పంజాబ్ వారియర్స్ వరుసగా మూడోసారి ఫైనల్లోకి వెళ్లింది. ఢిల్లీ నుంచి రూపిందర్ పాల్ సింగ్ 6వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత పంజాబ్ జట్టుకు అర్మాన్ ఖురేషి (13) ఫీల్డ్ గోల్ చేయగా సైమన్ ఆర్కర్డ్ (51) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి విజయాన్ని అందించాడు. ఫైనల్ మ్యాచ్ సా. 5.20 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
హెచ్ఐఎల్ ప్రైజ్‌మనీ రూ. 5.70 కోట్లు
న్యూఢిల్లీ: నాలుగో అంచె హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ప్రైజ్‌మనీని నిర్వాహకులు రూ. 5.70 కోట్లకు పెంచారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ. 2.50 కోట్లు, రన్నరప్‌కు 1.75 కోట్లు ఇవ్వనున్నారు. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 75 లక్షలు అందజేస్తారు. ఈ టోర్నమెంట్ ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఆరు నగరాల్లో జరగనుంది. ‘కోల్ ఇండియా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’కు ఇచ్చే నగదు పురస్కారాన్ని హాకీ ఇండియా (హెచ్ఐ) రూ. 50 లక్షలకు పెంచింది. ‘కోల్ ఇండియా గోల్ ఆఫ్ ద మ్యాచ్’ ఆటగాడికి రూ. 50 వేలు చెల్లిస్తారు.