గుర్బాజ్ సింగ్‌కు రూ.67 లక్షలు
న్యూఢిల్లీ: క్రమశిక్షణారాహిత్యంతో దాదాపు ఏడాది కాలంగా భారత జట్టుకు దూరమైనా... మిడ్‌ఫీల్డర్ గుర్బాజ్ సింగ్ హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) వేలంలో తన ప్రత్యేకత నిలబెట్టుకున్నాడు. బుధవారం జరిగిన వేలంలో రాంచీ రేస్ జట్టు గుర్బాజ్‌ను 99 వేల డాలర్లకు (సుమారు రూ. 67 లక్షలు) సొంతం చేసుకుంది. 2017 సీజన్ కోసం ఈ వేలం జరిగింది. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లూ దాదాపుగా తమ వద్ద ఉన్న ఆటగాళ్లనే కొనసాగించాలని నిర్ణయించున్నాయి.
దాంతో ప్రధాన ఆటగాళ్లు పోగా... మిగిలిన కొన్ని ఖాళీల కోసం ఈ వేలంను నిర్వహించారు. గుర్బాజ్ తర్వాత 75 వేల డాలర్లతో (రూ. 51 లక్షలు) జర్మనీ ఫార్వర్డ్ క్రిస్టోఫర్ రూర్ రెండో స్థానంలో నిలిచాడు. అతడిని కూడా రాంచీ జట్టు ఎంచుకుంది. భారత యువ ఆటగాళ్లలో 18 ఏళ్ల హార్దిక్ సింగ్‌ను పంజాబ్ జట్టు 39 వేల డాలర్లకు (రూ. 27 లక్షలు) తీసుకోవడం విశేషం.