
నేడు స్పెయిన్‌తో భారత్ ‘ఢీ’
సాయంత్రం గం. 5:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
పారిస్: భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్ బరిలోకి దిగి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన భారత పురుషుల హాకీ జట్టు.. గురువారం కాంస్య పతకం కోసం స్పెయిన్‌తో తలపడనుంది. టోర్నీ ఆరంభం నుంచి చక్కటి ఆటతీరు కనబర్చిన హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా.. మంగళవారం సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓడి కాంస్య పతక పోరుకు చేరింది. మూడేళ్ల క్రితం జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ కాంస్య పతకమే సాధించగా... వరుసగా రెండోసారి పోడియంపై నిలిచే అవకాశం టీమిండియా ముందుంది.
జర్మనీతో సెమీఫైనల్లో భారత్ హోరాహోరీగా పోరాడి ఓడగా... మరో సెమీస్‌లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ పరాజయాం పాలైంది. బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా ‘రెడ్ కార్డు’కు గురై సెమీస్‌కు అందుబాటులో లేకుండా పోయిన డిఫెండర్ అమిత్ రోహిదాస్... ఈ మ్యాచ్‌లో ఆడనుండటం భారత్‌కు సానుకూలాంశం. జర్మనీతో పోరులో పెనాల్టీ కార్నర్ అవకాశాలను సది్వనియోగ పర్చుకోలేకపోయిన భారత్.. ఆ విషయంలో మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఈ టోరీ్నతో కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్న గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ మరోసారి కీలకం కానున్నాడు. ‘సెమీస్ పరాజయం చాలా బాధించింది.
పసిడి నెగ్గే సువర్ణ అవకాశం చేజారింది. అయితే ఆ ఓటమిని మరిచి కాంస్య పతక పోరుపై దృష్టి పెట్టాం. దేశానికి పతకం అందించేందుకు ఇదే చివరి అవకాశం. అందుకే ప్రతి ఆటగాడు దీన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్నాడు’అని శ్రీజేశ్ అన్నాడు. ఒలింపిక్స్ వేదికగా స్పెయిన్‌తో భారత్ పది సార్లు తలపడగా.. అందులో ఏడింట గెలిచింది. ఒక మ్యాచ్ స్పెయిన్ నెగ్గగా.. మరో రెండు ‘డ్రా’గా ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment