జొకోవిచ్‌ అరుదైన రికార్డు | Novak Djokovic advances to semifinals of Miami Open ATP 1000 Masters tournament | Sakshi
Sakshi News home page

జొకోవిచ్‌ అరుదైన రికార్డు

Published Sat, Mar 29 2025 3:59 AM | Last Updated on Sat, Mar 29 2025 3:59 AM

Novak Djokovic advances to semifinals of Miami Open ATP 1000 Masters tournament

ఏటీపీ మాస్టర్స్‌–1000 టోర్నీ సెమీస్‌ చేరిన పెద్ద వయసు్కడిగా నొవాక్‌ 

క్వార్టర్‌ ఫైనల్లో కొర్డాపై అలవోక విజయం 

ఫ్లోరిడా: సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. మయామి ఓపెన్‌ ఏటీపీ–1000 మాస్టర్స్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. తద్వారా ఏటీపీ మాస్టర్స్‌–1000 టోర్నీ సెమీఫైనల్‌కు చేరిన పెద్ద వయసు్కడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు రోజర్‌ ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌) పేరిట ఉంది. 37 ఏళ్ల జొకోవిచ్‌ శుక్రవారం పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో 6–3, 7–6 (7/4)తో సెబాస్టియన్‌ కొర్డా (అమెరికా)పై విజయం సాధించాడు. 

1 గంట 24 నిమిషాల పాటు సాగిన పోరులో నాలుగో సీడ్‌ జొకోవిచ్‌ 11 ఏస్‌లు కొట్టగా... కోర్డా ఏడు ఏస్‌లకు పరిమితమయ్యాడు. సెర్బియా వీరుడు రెండు బ్రేక్‌ పాయింట్లు కాచుకోవడంతో పాటు ఒక దశలో వరుసగా 12 పాయింట్లు సాధించి ఆధిక్యం కనబర్చాడు. ఇప్పటికే ఆరుసార్లు మయామి ఓపెన్‌ టైటిల్‌ చేజిక్కించుకున్న జొకోవిచ్‌ ఏడోసారి చాంపియన్‌గా నిలిచేందుకు రెండడుగుల దూరంలో ఉన్నాడు. 

సీజన్‌ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆ్రస్టేలియా ఓపెన్‌ మధ్యలో గాయం కారణంగా తప్పుకున్న జొకోవిచ్‌... ఇటీవల ఇండియన్‌ వెల్స్‌ టోర్నీ తొలి రౌండ్‌లో పరాజయం పాలయ్యాడు. గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌ పీటర్‌ కొర్డా కుమారుడైన సెబాస్టియన్‌ కొర్డా... రెండో సెట్‌ ఆరంభంలో 4–1తో ఆధిక్యంలో నిలిచినా... దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంక (బెలారస్‌) 6–2, 6–2తో జాస్మిన్‌ పావోలిని (ఇటలీ)పై గెలుపొందింది. తద్వారా తొలిసారి మయామి ఓపెన్‌ ఫైనల్లో అడుగుపెట్టింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement