
చివరి మ్యాచ్ ఆడిన స్టార్ ప్యాడ్లర్
స్నేహిత్ చేతిలో పరాజయం
చెన్నై: భారత టేబుల్ టెన్నిస్ ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ తన ఆట ముగించాడు. వరల్డ్ టేబుల్ టెన్నిస్ స్టార్ కంటెండర్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో పరాజయంతో అతను రిటైర్ అయ్యాడు. ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో సూరావజ్జుల స్నేహిత్ (తెలంగాణ) చేతిలో శరత్ కమల్ 0–3తో ఓటమిపాలయ్యాడు. 25 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో స్నేహిత్ 11–9, 11–8, 11–9తో విజయం సాధించాడు.
శరత్ కమల్ చివరి మ్యాచ్ చూడటం కోసం నెహ్రూ స్టేడియానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. మ్యాచ్ ముగిసిన తర్వాత వారందరికీ అభివాదం చేస్తూ అతను కృతజ్ఞతలు తెలిపాడు. అంతకు ముందే పురుషుల డబుల్స్ విభాగంలో స్నేహిత్‌తోనే కలిసి శరత్ డబుల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఈ పోరులో కొరియా జోడి లిమ్ జాంగూన్ – ఆన్ జీహున్ చేతిలో 11–9, 8–11, 9–11, 6–11 స్కోరుతో శరత్ – స్నేహిత్ ఓడిపోయారు.
17 ఏళ్ల వయసులో చెన్నైలోనే జరిగిన ఆసియా జూనియర్స్ టోర్నీతో తొలిసారి ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ బరిలోకి దిగిన శరత్ కమల్ రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు. అసాధారణ రీతిలో 10 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన శరత్ అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకున్నాడు.
కామన్వెల్త్ క్రీడల్లో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు గెలిచిన అతను ఆసియా క్రీడల్లో 2 కాంస్యాలు సాధించాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో కూడా అతని ఖాతాలో 4 కాంస్యాలు ఉన్నాయి. 2004 నుంచి 2024 మధ్య ఐదు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న శరత్ కమల్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, ఖేల్‌రత్న పురస్కారాలతో గౌరవించింది.