Harmanpreet
-
సిరీస్ తేల్చే సమరం
అహ్మదాబాద్: ‘భారత జట్టు విజయం సాధించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఇది సిగ్గు పడాల్సిన విషయం’... ఆదివారం జరిగిన రెండో వన్డేపై న్యూజిలాండ్ మహిళల జట్టు కెపె్టన్ సోఫీ డివైన్ చేసిన వ్యాఖ్య ఇది. ప్రత్యర్థి సారథి కాస్త ఘాటుగానే చెప్పినా మన జట్టు బ్యాటింగ్ బలహీనతను అది చూపించింది. గత మ్యాచ్‌లో 260 పరుగుల లక్ష్య ఛేదనలో 18వ ఓవర్లోనే 77 పరుగులకు భారత టాప్–5 వెనుదిరగడంతోనే ఓటమి దాదాపుగా ఖాయమైంది. 9వ నంబర్ బ్యాటర్ రాధా యాదవ్ ఆదుకోకపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. కీలకమైన చివరి పోరులోనైనా బ్యాటింగ్‌లో రాణిస్తే సొంతగడ్డపై సిరీస్ గెలుచుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత్, కివీస్ టీమ్‌లు తలపడనున్నాయి. తొలి వన్డేలో కూడా భారత్ మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతోనే నెగ్గింది. రెండు వన్డేల్లో కలిపి మన బ్యాటర్లు ఎవరూ కనీసం అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. చివరి మ్యాచ్‌లో నెగ్గాలంటే ముగ్గురు ప్రధాన బ్యాటర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెలరేగాల్సి ఉంది. ముఖ్యంగా స్మృతి సుదీర్ఘ కాలంగా వరుసగా విఫలమవుతూ తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఈ సిరీస్‌లో ఆమె 5, 0 స్కోర్లకే పరిమితమైంది. ఇదే సిరీస్‌తో అరంగేట్రం చేసిన తేజల్ను తప్పు పట్టలేం కానీ జెమీమా కూడా మిడిలార్డర్లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అందరూ సమష్టిగా చెలరేగితేనే కివీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. మరోవైపు న్యూజిలాండ్ గత విజయం తర్వాత ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. రెండో వన్డేలో బ్యాటర్లు మూడు అర్ధ సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఓపెనర్లు సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, హ్యాలిడే, మ్యాడీ గ్రీన్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇక కెపె్టన్ సోఫీ డివైన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు ఇటు సారథిగా కూడా ఆమె జట్టును సమర్థంగా నడిపిస్తోంది. సీనియర్ పేసర్ తహుహు ఆఫ్‌స్పిన్నర్ ఈడెన్ కార్సన్‌లు ఎలాంటి బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగల సమర్థులు. లాంటి స్థితిలో స్వదేశంలో సిరీస్ కోల్పోరాదంటే హర్మన్ బృందం రెట్టింపు శ్రమించాల్సి ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్ కౌర్ (కెపె్టన్), షఫాలీ, స్మృతి, యస్తిక, జెమీమా, తేజల్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా/శ్రేయాంక పాటిల్. న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ప్లిమ్మర్, లారెన్ డౌన్, హ్యాలిడే, గ్రీన్, ఇసబెల్లా, జెస్ కెర్, తహుహు, కార్సన్, జొనాస్. -
Womens T20 World Cup 2023: రేణుక, స్మృతి మెరుపులు వృథా
కెబేహ (దక్షిణాఫ్రికా): మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జోరుకు ఇంగ్లండ్ బ్రేకులేసింది. గ్రూప్–2లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన 11 పరుగుల తేడాతో ఓడింది. ఇంగ్లండ్ ఈ మెగా టోర్నీలో ‘హ్యాట్రిక్’ విజయాలతో సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. రేణుకా సింగ్ (4–0–15–5) అద్భుతమైన బౌలింగ్‌తో టాపార్డర్ బ్యాటర్లు సోఫియా (10), వ్యాట్ (0), అలైస్ క్యాప్సీ (2)లను బెంబేలెత్తించింది. సీవర్ బ్రంట్ (42 బంతుల్లో 50; 5 ఫోర్లు), ఆఖర్లో అమీ జోన్స్ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఇంగ్లండ్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులే చేసింది. ఆరంభంలో ఓపెనర్ స్మృతి మంధాన (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), ఆఖరిదాకా రిచా ఘోష్ (34 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు. కానీ మిగతా బ్యాటర్లు షఫాలీ (8), జెమీమా (13), హర్మన్‌ప్రీత్ (4), దీప్తి శర్మ (7)ల వైఫల్యంతో జట్టు ఓడింది. నేడు వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయి... రేపు ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిస్తేనే భారత్ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లపై పాక్ గెలిచి... ఐర్లాండ్‌ను భారత్ కూడా ఓడిస్తే... భారత్, ఇంగ్లండ్, పాక్ ఆరు పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్ ఉన్న రెండు జట్లు సెమీస్ చేరుకుంటాయి. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సోఫియా (బి) రేణుక 10; వ్యాట్ (సి) రిచా (బి) రేణుక 0; అలైస్ (బి) రేణుక 3; సీవర్ బ్రంట్ (సి) స్మృతి (బి) దీప్తి 50; హీథెర్ (సి) షఫాలీ (బి) శిఖా 28; అమీ జోన్స్ (సి) రిచా (బి) రేణుక 40; ఎకిల్‌స్టోన్ (నాటౌట్) 11; కేథరిన్ (సి) రాధ (బి) రేణుక 0; సారా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–29, 4–80, 5–120, 6–147, 7–147. బౌలింగ్: రేణుక సింగ్ ఠాకూర్ 4–0–15–5, శిఖా పాండే 4–0–20–1, పూజ వస్త్రకర్ 2–0–24–0, దీప్తి శర్మ 4–0–37–1, రాజేశ్వరి గైక్వాడ్ 1–0–12–0, షఫాలీ 1–0–11–0, రాధ 4–0– 27–0. భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) సీవర్ (బి) సారా 52; షఫాలీ (సి) బ్రంట్ (బి) బెల్ 8, జెమీమా (సి) బ్రంట్ (బి) సారా 13; హర్మన్‌ప్రీత్ (సి) అలైస్ (బి) ఎకిల్‌స్టోన్ 4; రిచా (నాటౌట్) 47; దీప్తి (రనౌట్) 7; పూజ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 140. వికెట్ల పతనం: 1–29, 2–57, 3–62, 4–105, 5–119. బౌలింగ్: కేథరిన్ 3–0–39–0, బెల్ 4–0–22–1, చార్లీ 3–0–23–0, ఎకిల్‌స్టోన్ 4–0–14–1, సారా 4–0–27–2, బ్రంట్ 2–0–15–0. -
Commonwealth Games 2022: క్రికెట్లో కనకంపై గురి
బర్మింగ్‌హామ్: తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో భారత జట్టు సత్తా చాటింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ హర్మన్‌ప్రీత్ బృందం ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది. శనివారం ఆసక్తికరంగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుపై భారత్ 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. స్మృతి మంధాన (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు) రాణించింది. మహిళల అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (23 బంతుల్లో)ని స్మృతి నమోదు చేయడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. నాట్ సివర్ (43 బంతుల్లో 41; 2 ఫోర్లు, 1 సిక్స్), డానీ వ్యాట్ (27 బంతుల్లో 35; 6 ఫోర్లు), ఎమీ జోన్స్ (24 బంతుల్లో 31; 3 ఫోర్లు) రాణించారు. సివర్, జోన్స్ నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ సునాయాసంగా విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. చేతిలో 7 వికెట్లతో 17 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో జోన్స్ రనౌట్ కాగా... ఆ తర్వాత 8 బంతుల్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా సివర్ రనౌట్ కావడం జట్టును దెబ్బ తీసింది. ఆఖరి ఓవర్లో గెలుపు కోసం 14 పరుగులు చేసే ప్రయత్నంలో ఇంగ్లండ్ 9 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. స్పిన్నర్లు స్నేహ్ రాణా (2/28), దీప్తి శర్మ (1/18) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో తుది పోరులో భారత తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫైనల్ మొదలవుతుంది. కాంస్య పతక మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరుగుతుంది. అప్పుడు పతకం రాలేదు కామన్వెల్త్ క్రీడల్లో గతంలో ఒకే ఒకసారి (1998; కౌలాలంపూర్) క్రికెట్ పోటీలు నిర్వహించారు. పురుషుల టీమ్‌తో వన్డే ఫార్మాట్లో అజయ్ జడేజా నాయకత్వంలో భారత్ బరిలోకి దిగింది. సచిన్, కుంబ్లే, లక్ష్మణ్, హర్భజన్, రాబిన్ సింగ్, ఎమ్మెస్కే ప్రసాద్ లీగ్ దశలో 3 మ్యాచ్‌లూ ఆడారు. గ్రూప్ ‘బి’లో ఉన్న భారత జట్టు... కెనడాపై గెలిచి ఆస్ట్రేలియా చేతిలో ఓడగా, ఆంటిగ్వా అండ్ బార్బుడాతో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా ఫలితం రాలేదు. దాంతో సెమీస్ చేరకుండానే టీమిండియా నిష్క్రమించింది. -
పాకిస్తాన్ పని పట్టేందుకు!
పొట్టి ఫార్మాట్లో... అందులోనూ ప్రపంచ కప్‌లో ఎలా ఆడుతుందోనన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయింది భారత మహిళల జట్టు. పటిష్ఠమైన న్యూజిలాండ్‌ను అలవోకగా మట్టి కరిపించింది. ఇప్పుడు అదే ఊపులో పాకిస్తాన్ పని పట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సెమీ ఫైనల్ దిశగా హర్మన్‌ప్రీత్ బృందం ప్రయాణం మరింత ముందుకు సాగుతుంది. అంతర్జాతీయ టి20ల్లో ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్ జట్లు 10 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఎనిమిది మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా... రెండింటిలో పాకిస్తాన్ విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సారథ్యంలో పాక్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారతే నెగ్గడం విశేషం. ప్రావిడెన్స్ (గయానా): దూకుడైన ఆటతో కివీస్ రెక్కలు విరిచిన హర్మన్‌ప్రీత్ సేన... ప్రపంచ కప్ స్థాయికి తగిన ప్రారంభాన్ని అందుకుంది. దీంతోపాటు కావాల్సినంత ఆత్మ విశ్వాసం కూడగట్టుకుంది. ఇక ఆదివారం రెండో లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. బలాబలాల్లో ప్రత్యర్థి కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్న టీమిండియాకు దాయాదిని మట్టి కరిపించడం ఏమంత కష్టమేం కాదు. అలాగని పాక్‌ను పూర్తిగా తీసిపారేయలేం. 2016 ప్రపంచ కప్‌లో సొంతగడ్డపై భారత్‌ను ఓడించి షాకిచ్చిందా జట్టు. అప్పటిలాగా ఏమరుపాటుగా లేకుంటే టీమిండియా వరుసగా రెండో విజయాన్ని ఖాయం చేసుకోవచ్చు. ఆ ఒక్కటే లోటు... కెప్టెన్ హర్మన్‌ప్రీత్, మిథాలీ రాజ్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి... ఇలా ఒకరు కాదంటే ఒకరితో భారత బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. మిథాలీ క్రీజులోకి రాకుండానే భారీ స్కోరు నమోదైందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. న్యూజిలాండ్‌పై శతకం బాదిన హర్మన్ ఇన్నింగ్స్ ధాటిని, జెమీమా దూకుడును చూస్తే ఎంతటి ప్రత్యర్థికైనా వణుకు పుట్టాల్సిందే. హేమలత దయాలన్, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మలతో స్పిన్ విభాగమూ పటిష్ఠంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హేమలత కివీస్‌కు కళ్లెం వేసింది. మిగతావారూ తమవంతు పాత్ర పోషించారు. కాకపోతే, పేస్‌లోనే లోటుంది. తొలి మ్యాచ్ ఆడిన జట్టులో ఏకైక పేసర్ తెలుగమ్మాయి అరుంధతిరెడ్డి మాత్రమే. మాన్సి జోషి, పూజ వస్త్రకర్ పెవిలియన్‌కే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌కు మాత్రం వీరిద్దరిలో ఒకరిని తీసుకోవచ్చు. విండీస్ పిచ్‌లు నెమ్మదిగా ఉన్నందున భారత స్పిన్‌ను ఎదుర్కొనడం పాక్‌కు సవాలే. ఆ జట్టులో కెప్టెన్ జవేరియా ఖాన్, వెటరన్ స్పిన్నర్ సనా మిర్, ఆల్‌రౌండర్ బిస్మా మరూఫ్‌లు నాణ్యమైన ఆటగాళ్లు. అయితే, స్థిరమైన ప్రదర్శన కనబర్చేవారు లేకపోవడంతో వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. -
అమ్మాయిలు... అదరగొట్టేందుకు...
మహిళల క్రికెట్లో మళ్లీ పరుగుల పండగొచ్చింది... కరీబియన్ దీవుల్లో ధమాకాకు రంగం సిద్ధమైంది... పది దేశాల ప్రాతినిధ్యంతో శుక్రవారం నుంచే టి20 ప్రపంచ కప్.పదహారు రోజుల పాటు మహా సంగ్రామం. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ దుమ్మురేపుతుందా? పెద్దన్న ఆస్ట్రేలియా అదరగొ డుతుందా? వన్డే జగజ్జేత ఇంగ్లండ్ సంచలనం రేపుతుందా? కివీస్ ఈసారైనా కొల్లగొడుతుందా? టీమిండియా తడాఖా చూపుతుందా? ఇంతకూ ధనాధన్ ఆటలో దశ తిరిగేదెవరిది? ప్రొవిడెన్స్ (గయానా) మహిళల క్రికెట్లో వన్డే ప్రపంచ సమరం ముగిసిన 15 నెలలకే పొట్టి ఫార్మాట్లో జగజ్జేత స్థానానికి అమీతుమి. శుక్రవారం నుంచి ఈ నెల 24 వరకు జరిగే ఈ టోర్నీకి వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తోంది. ఇది ఆరో ప్రపంచ కప్ కాగా, ఎనిమిదేళ్ల తర్వాత తమ దీవుల్లో జరుగనున్న పోరులో కరీబియన్లు డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగిడుతుండటం విశేషం. గతంలో ఏ జట్టు సాధించని ఘనత ఇది. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ విజేత ఆస్ట్రేలియాను 2016లో సంచలనాత్మక రీతిలో ఓడించి తొలిసారిగా ఒడిసిపట్టిన ట్రోఫీని సొంతగడ్డపై నిలబెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు పూర్వ వైభవాన్ని చేజిక్కించుకోవాలని కంగారూలు ఆశిస్తున్నారు. ఇక ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న ‘ప్రపంచ విజేత’ హోదాను టి20ల్లోనైనా దక్కించుకోవాలని టీమిండియా లెక్కలు వేసుకుంటోంది. మిగిలినవాటిలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ప్రమాదకరమైనవి. ఆ ఐదారే... పేరుకు 10 జట్లు పోటీకి దిగుతున్నా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, భారత్‌లను మాత్రమే సెమీఫైనల్ చేరే సత్తా ఉన్నవిగా అంచనా వేస్తున్నారు.దక్షిణాఫ్రికా మహిళల జట్టు ప్రభావ వంతంగా లేదు. పాకిస్తాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్లను ద్వితీయ శ్రేణి వాటిగానే పరిగణిస్తున్నారు. సంచలనాలు నమోదైతే తప్ప ఇవి ముందడుగు వేసే అవకాశం లేదు. ముఖ్యంగా నాలుగో సెమీస్ స్థానానికి వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ నెలకొననుంది. అయితే, ధనాధన్ ఆటలో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి... ఏ జట్టునూ కచ్చితమైన ఫేవరెట్‌గా చెప్పలేని పరిస్థితి. గ్రూప్ నుంచి రెండేసి జట్లు... జట్లను ‘ఎ’, ‘బి’ గ్రూపులుగా వర్గీకరించారు. గ్రూప్ ‘ఎ’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, గ్రూప్ ‘బి’లో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ ఉన్నాయి. ఈ లెక్కన లీగ్ దశలో ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. విజేతకు 2 పాయింట్లు, మ్యాచ్ టై, లేదా రద్దయితే ఒక పాయింట్ ఇస్తారు. పట్టికలో 1, 2లో స్థానాల్లో నిలిచిన జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. -
మనమే చాంపియన్స్
► ప్రపంచకప్ మహిళల క్వాలిఫయింగ్ టోర్నీ విజేత భారత్ ► ఫైనల్లో దక్షిణాఫ్రికాపై వికెట్ తేడాతో విజయం ► అత్యధిక లక్ష్యాన్ని అధిగమించిన టీమిండియా ► వీరోచిత బ్యాటింగ్‌తో గెలిపించిన హర్మన్‌ప్రీత్ ఫేవరెట్ హోదాకు న్యాయం చేస్తూ భారత మహిళలు అంచనాలకు అనుగుణంగా రాణించారు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో చాంపియన్స్‌గా అవతరించారు. విజయంతో టోర్నీని ఆరంభించిన టీమిండియా చిరస్మరణీయ విజయంతోనే అద్భుత ముగింపు ఇచ్చింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన అంతిమ సమరంలో భారత్ వికెట్ తేడాతో గెలిచి ట్రోఫీని సగర్వంగా సొంతం చేసుకుంది. కొలంబో: తాత్కాలిక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్స్) వీరోచిత బ్యాటింగ్‌తో భారత్‌ను విజేతగా నిలబెట్టింది. దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో టీమిండియా వికెట్ తేడాతో గెలిచింది. 245 పరుగుల లక్ష్యాన్ని భారత్ సరిగ్గా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. రెగ్యులర్ కెప్టెన్ మిథాలీ రాజ్ గాయం కారణంగా ఫైనల్లో ఆడలేదు. దాంతో ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ నాయకత్వం వహించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ను ఓపెనర్ మోనా మేష్రమ్ (82 బంతుల్లో 59; 7 ఫోర్లు, ఒక సిక్స్), దీప్తి శర్మ (89 బంతుల్లో 71; 8 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 124 పరుగులు జోడించారు. అయితే నాలుగు పరుగుల తేడాలో మోనా, దీప్తి అవుటవ్వడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో వేద కృష్ణమూర్తి (33 బంతుల్లో 31; 3 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కలిసి నాలుగో వికెట్‌కు 38 పరుగులు చేశారు. మూడు వికెట్లకు 186 పరుగులతో భారత్ పటిష్టంగా కనిపించిన దశలో వేద అవుటైంది. ఒంటరి పోరాటం... వేద పెవిలియన్ చేరుకున్నాక హర్మన్‌ప్రీత్ ఒకవైపు ఒంటరి పోరాటం చేయగా... మరోవైపు ఇతర బ్యాట్స్‌విమెన్ వెంటవెంటనే అవుటవ్వడంతో భారత్‌కు పరాజయం తప్పదేమో అనిపించింది. కానీ హర్మన్‌ప్రీత్ సంయమనం కోల్పోకుండా ధాటిగా ఆడుతూ మ్యాచ్ చివరి బంతికి భారత్‌కు విజయాన్ని అందించింది. విజయానికి చివరి ఓవర్లో భారత్‌కు తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. లెట్సోలో వేసిన ఈ ఓవర్ తొలి బంతిని హర్మన్‌ప్రీత్ డీప్ మిడ్ వికెట్ వద్దకు ఆడింది. రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో పూనమ్ యాదవ్ రనౌట్ అయింది. చివరి బ్యాట్స్‌విమన్‌గా రాజేశ్వరి క్రీజులోకి వచ్చింది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ వరుసగా మూడు బంతులను ఎదుర్కొన్నా ఒక్క పరుగూ చేయలేదు. దాంతో విజయ సమీకరణం రెండు బంతుల్లో ఎనిమిది పరుగులుగా మారింది. ఐదో బంతిని హర్మన్‌ప్రీత్ మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్ కొట్టింది. దాంతో భారత విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. లెట్సోలో వేసిన ఆఖరి బంతిని హర్మన్‌ప్రీత్ ముందుకు వచ్చి లాంగ్ ఆన్ దిశగా ఆడింది. వెంటనే హర్మన్‌ప్రీత్, రాజేశ్వరి రెండు పరుగులు పూర్తి చేయడంతో భారత విజయం ఖాయమైంది. భారత మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో జట్టుకిదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. ఈ టోర్నీలో భారత్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది అజేయంగా నిలిచింది. భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ఫైనల్’ పురస్కారం గెల్చుకోగా... దక్షిణాఫ్రికాకు చెందిన సుని లుస్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సొంతం చేసుకుంది. మొత్తం పది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్ జూన్‌లో ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. సంక్షిప్త స్కోర్లు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 244 ఆలౌట్ (49.4 ఓవర్లలో) (మిగ్నాన్ డు ప్రీజ్ 40, లిజెల్ లీ 37, డాన్ వాన్ నికెర్క్ 37, సుని లుస్ 35, రాజేశ్వరి గైక్వాడ్ 3/51, శిఖా పాండే 2/41, ఏక్తా బిష్త్ 1/39, పూనమ్ యాదవ్ 1/37, దీప్తి శర్మ 1/46) భారత్ ఇన్నింగ్స్: 245/9 (50 ఓవర్లలో) (మోనా మేష్రమ్ 59, దీప్తి శర్మ 71, వేద కృష్ణమూర్తి 31, హర్మన్‌ప్రీత్ కౌర్ 41 నాటౌట్, శిఖా పాండే 12, మారిజెన్ కాప్ 2/36, అయబోంగా ఖాకా 2/55) -
మరోసారి చెలరేగిన హర్మన్ ప్రీత్
ఆల్బరీ: ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్(డబ్యూబీబీఎల్)లో భారత క్రికెట్ క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ కౌర్ తన దూకుడును కొనసాగిస్తోంది. బీబీఎల్ సిడ్నీ థండర్ తరపున బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్... వరుసగా రెండో మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకుంది. తాజాగా మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన టీ 20మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో 30 పరుగులతో అజేయంగా నిలిచి థండర్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మెల్బోర్న్ స్టార్స్ నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో థండర్స్ రెండు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ థండర్ జట్టులో హర్మన్ ప్రీత్‌కు తోడు హైనెస్(35), స్టెఫానీ టేలర్(29), బ్లాక్ వెల్(21)లు రాణించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మెల్ బోర్న్ స్టార్స్‌ను హర్మన్ ప్రీత్ చావుదెబ్బ కొట్టింది. నాలుగు ఓవర్లలో 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లతో మెల్ బోర్న్ స్టార్స్ మహిళల పతనాన్ని శాసించింది. హర్మన్ ప్రీత్ విజృంభణతో మెల్బోర్న్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 116 పరుగులకే పరిమితమైంది. ఇదిలా ఉండగా, ఇరు జట్లు మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.ఆ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ 47 పరుగులతో రాణించింది.