
ఉత్కంఠ పోరులో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపు
నేడు బెంగళూరుపై నెగ్గితే నేరుగా ఫైనల్‌కు
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో అగ్రస్థానంతో నేరుగా ఫైనల్ చేరేందుకు ముంబై ఇండియన్స్ జట్టు విజయం దూరంలో నిలిచింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. మొదట ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (33 బంతుల్లో 54; 9 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించింది. తర్వాత గుజరాత్ 20 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది.
భారతి (25 బంతుల్లో 61; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) ముంబై బౌలర్లపై విరుచుకుపడింది. జెయింట్స్ ఒకదశలో 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమికి సిద్ధమవగా... భారతి ధనాధన్ ఆటతో ఆశలు రేపింది. 41 బంతుల్లో 88 పరుగుల సమీకరణం ఆఖరి ఓవర్‌కు వచ్చేసరికి 6 బంతుల్లో 13 పరుగులుగా మారింది. కానీ 20వ ఓవర్ వేసిన హేలీ... తనూజ (10)ను రనౌట్ చేసింది.
తర్వాతి బంతికి సిమ్రాన్ (18; 1 ఫోర్, 1 సిక్స్), చివరి బంతికి ప్రియా (1) వికెట్లు తీసి ఆలౌట్ చేసింది. నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిస్తే ముంబై 12 పాయింట్లతో పట్టికలో టాప్ లేపి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నా... మెరుగైన రన్‌రేట్ కారణంగా ఢిల్లీ ‘టాప్’లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment