మరోసారి చెలరేగిన హర్మన్ ప్రీత్
ఆల్బరీ: ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్బాష్ లీగ్(డబ్యూబీబీఎల్)లో భారత క్రికెట్ క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ కౌర్ తన దూకుడును కొనసాగిస్తోంది. బీబీఎల్ సిడ్నీ థండర్ తరపున బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్... వరుసగా రెండో మ్యాచ్ల్లోనూ ఆకట్టుకుంది. తాజాగా మెల్బోర్న్ స్టార్స్తో జరిగిన టీ 20మ్యాచ్లో హర్మన్ ప్రీత్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో 30 పరుగులతో అజేయంగా నిలిచి థండర్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మెల్బోర్న్ స్టార్స్ నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో థండర్స్ రెండు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ థండర్ జట్టులో హర్మన్ ప్రీత్కు తోడు హైనెస్(35), స్టెఫానీ టేలర్(29), బ్లాక్ వెల్(21)లు రాణించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మెల్ బోర్న్ స్టార్స్ను హర్మన్ ప్రీత్ చావుదెబ్బ కొట్టింది. నాలుగు ఓవర్లలో 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లతో మెల్ బోర్న్ స్టార్స్ మహిళల పతనాన్ని శాసించింది. హర్మన్ ప్రీత్ విజృంభణతో మెల్బోర్న్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 116 పరుగులకే పరిమితమైంది. ఇదిలా ఉండగా, ఇరు జట్లు మధ్య జరిగిన తొలి మ్యాచ్లో సిడ్నీ థండర్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.ఆ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ 47 పరుగులతో రాణించింది.