అరంగేట్రంలోనే రికార్డులు కొల్లగొట్టిన జూనియర్‌ రికీ పాంటింగ్‌ | Sam Konstas Announces His BBL Arrival With Fastest Fifty For Sydney Thunder | Sakshi
Sakshi News home page

అరంగేట్రంలోనే రికార్డులు కొల్లగొట్టిన జూనియర్‌ రికీ పాంటింగ్‌

Dec 17 2024 5:17 PM | Updated on Dec 17 2024 6:30 PM

Sam Konstas Announces His BBL Arrival With Fastest Fifty For Sydney Thunder

జూనియర్‌ రికీ పాంటింగ్‌గా పేరొందిన సామ్‌ కొన్‌స్టాస్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. బిగ్‌బాష్‌ లీగ్‌ 2024-25 ఎడిషన్‌లో భాగంగా అడిలైడ్‌ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జూనియర్‌ రికీ 20 బంతుల్లోనే (8 ఫోర్లు, 2 సిక్సర్లు​) హాఫ్‌ సెంచరీ చేశాడు. బీబీఎల్‌లో సిడ్నీ థండర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కొన్‌స్టాస్‌.. ఈ ఫ్రాంచైజీ తరఫున ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

గతంలో ఈ రికార్డు అలెక్స్‌ హేల్స్‌ పేరిట ఉండేది. హేల్స్‌ 2021 సీజన్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌పై 21 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. థండర్‌ తరఫున మూడు, నాలుగో వేగవంతమైన హాఫ్‌ సెంచరీల రికార్డులు డేనియల్‌ సామ్స్‌, ఉస్మాన్‌ ఖ్వాజాల పేరిట ఉన్నాయి. సామ్స్‌ 23 బంతుల్లో, ఖ్వాజా 24 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు చేశారు. మరోవైపు బిగ్‌బాష్‌ లీగ్‌ చరిత్రలోనే హాఫ్‌ సెంచరీ చేసిన అతి పిన్నవయస్కుడిగానూ (19 ఏళ్లు) సామ్‌ కొన్‌స్టాస్‌ రికార్డు నెలకొల్పాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్ట్రయికర్స్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వెథరాల్డ్‌ (19 బంతుల్లో 40), జేమీ ఓవర్టన్‌ (35 బంతుల్లో 45 నాటౌట్‌), జేమ్స్‌ బాజ్లీ (12 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఫెర్గూసన్‌, క్రిస్‌ గ్రీన్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. తన్వీర్‌ సంఘా 2 వికెట్లు దక్కించుకున్నాడు.

డేనియల్‌ సామ్స్‌ ఊచకోత
183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన థండర్‌.. సామ్‌ కొన్‌స్టాస్‌ (27 బంతుల్లో 56), డేనియల్‌ సామ్స్‌ (18 బంతుల్లో 42 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. 

ఓటమి దిశగా సాగుతున్న థండర్‌ను డేనియల్‌ సామ్స్‌ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గెలుపు బాట పట్టించాడు. సామ్స్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో లాయిడ్‌ పోప్‌ బౌలింగ్‌లో ఏకంగా 31 పరుగులు పిండుకున్నాడు. ఇందులో మూడు సిక్సర్లు, మూడు బౌండరీలు ఉన్నాయి. ఈ ఓవర్‌ మ్యాచ్‌ రూపురేఖల్నే మార్చేసింది. ఈ మ్యాచ్‌లో థండర్‌ సారధి డేవిడ్‌ వార్నర్‌ 7 పరుగులకే ఔటయ్యాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement