పదకొండేళ్ల తర్వాత తొలి హాఫ్‌ సెంచరీ.. అదీ 40 బంతుల్లో! | Warner Smashes Fifty After 11 Years in BBL 2024, Is IPL 2025 hopes Still Alive? | Sakshi
Sakshi News home page

నెమ్మదిగా మొదలుపెట్టి... ధనాధన్‌ దంచికొట్టి!.. పదకొండేళ్ల తర్వాత

Published Mon, Dec 30 2024 4:27 PM | Last Updated on Mon, Dec 30 2024 4:48 PM

Warner Smashes Fifty After 11 Years in BBL 2024, Is IPL 2025 hopes Still Alive?

డేవిడ్‌ వార్నర్‌ (PC: BBL)

ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌(David Warner) ప్రస్తుతం బిగ్‌బాష్‌ లీగ్‌(Big Bash League- బీబీఎల్‌)తో బిజీగా ఉన్నాడు. ఈ టీ20 లీగ్‌లో సిడ్నీ థండర్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్‌.. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ఎట్టకేలకు అర్ధ శతకం సాధించాడు. దాదాపు పదకొండేళ్ల అనంతరం బీబీఎల్‌లో తొలిసారి యాభై పరుగుల మార్కును అందుకున్నాడు.

కెప్టెన్‌గా వార్నర్‌
అయితే, విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన పొట్టి ఫార్మాట్లో(T20 Cricket) సుదీర్ఘ విరామం తర్వాత హాఫ్‌ సెంచరీ బాదిన వార్నర్‌ భాయ్‌.. అందుకోసం ఏకంగా 40 బంతులు తీసుకోవడం గమనార్హం. కాగా డిసెంబరు 15 బీబీఎల్‌ 2024-25 సీజన్‌ ఆరంభమైంది. ఈ క్రమంల డిసెంబరు 17న వార్నర్‌ కెప్టెన్సీలో తమ తొలి మ్యాచ్‌ ఆడిన సిడ్నీ థండర్‌ రెండు వికెట్ల తేడాతో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ను ఓడించింది.

ఆరంభ మ్యాచ్‌లలో విఫలం
నాటి మ్యాచ్‌లో వార్నర్‌ కేవలం ఏడు పరుగులే చేశాడు. అనంతరం.. సిడ్నీ సిక్సర్స్‌తో తలపడ్డ సిడ్నీ థండర్‌(Sydney Thunder) ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ వార్నర్‌ మరోసారి విఫలమయ్యాడు. కేవలం పదిహేడు పరుగులే చేసి నిష్క్రమించాడు.

ఆ తర్వాత మెల్‌బోర్న్‌తో స్టార్స్‌తో మ్యాచ్‌లో వార్నర్‌ 19 పరుగులే చేసినా.. సామ్‌ బిల్లింగ్స్‌(72 నాటౌట్‌) కారణంగా.. సిడ్నీ థండర్‌ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో సోమవారం నాటి మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ గ్రెనేడ్స్‌తో మ్యాచ్‌లో మాత్రం వార్నర్‌ బ్యాట్‌ ఝులిపించాడు.

ఎట్టకేలకు బ్యాట్‌ ఝులిపించాడు
సిడ్నీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన మెల్‌బోర్న్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్‌ ఆదిలోనే కామెరాన్‌ బాన్‌క్రాఫ్ట్‌(8) వికెట్‌ కోల్పోయింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌(11), ఒలివర్‌ డేవిస్‌(10), సామ్‌ బిల్లింగ్స్‌(10) కూడా విఫలమయ్యారు.

ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్‌ గాడిన పెట్టే బాధ్యత తీసుకున్న ఓపెనర్‌ వార్నర్‌ నెమ్మదిగా ఆడాడు. వికెట్‌ పడకుండా జాగ్రత్తపడుతూ.. 40 బంతుల్లో యాభై పరుగులు మార్కుకు చేరుకున్నాడు. ఆ తర్వాత మరో పదిహేడు బంతుల్లోనే 36 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.

మొత్తంగా 57 బంతులు ఎదుర్కొని పది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో వార్నర్‌ 86 పరుగులు సాధించాడు. అతడి తోడుగా మాథ్యూ గిల్క్స్(23 నాటౌట్‌) కూడా రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సిడ్నీ థండర్‌ నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

2013లో చివరగా
కాగా డేవిడ్‌ వార్నర్‌ బీబీఎల్‌లో చివరగా 2013లో అర్థ శతకం నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్‌ ప్రస్తుతం ఫ్రాంఛైజీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. అయితే, ఐపీఎల్‌లో గతంలో మంచి రికార్డులే ఉన్నా మెగా వేలం 2025లో మాత్రం వార్నర్‌పై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.

ఒకవేళ బీబీఎల్‌లో గనుక పరుగుల వరద పారిస్తే.. అతడు ఐపీఎల్‌లో తిరిగి పునరాగమనం చేసే అవకాశం ఉంటుంది. కాగా తమ ఆటగాళ్లు ఎవరైనా గాయపడిన సందర్భంలో ఫ్రాంఛైజీలు .. వారి స్థానంలో అన్‌సోల్డ్‌గా ఉన్న క్రికెటర్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఓపెనర్‌గా ఘనమైన రికార్డు ఉన్న వార్నర్‌ సేవలను పంజాబ్‌ కింగ్స్‌ లేదంటే లక్నో సూపర్‌ జెయింట్స్‌ వాడుకునే అవకాశం ఉంది.

చదవండి: థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం ముమ్మాటికీ తప్పే..; బీసీసీఐ ఉపాధ్యక్షుడి స్పందన ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement