నేడు భారత్, న్యూజిలాండ్ మహిళల మూడో వన్డే
బ్యాటింగ్ లోపాలపై హర్మన్‌ప్రీత్ జట్టు దృష్టి
మధ్యాహ్నం గం. 1:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
అహ్మదాబాద్: ‘భారత జట్టు విజయం సాధించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఇది సిగ్గు పడాల్సిన విషయం’... ఆదివారం జరిగిన రెండో వన్డేపై న్యూజిలాండ్ మహిళల జట్టు కెపె్టన్ సోఫీ డివైన్ చేసిన వ్యాఖ్య ఇది. ప్రత్యర్థి సారథి కాస్త ఘాటుగానే చెప్పినా మన జట్టు బ్యాటింగ్ బలహీనతను అది చూపించింది. గత మ్యాచ్‌లో 260 పరుగుల లక్ష్య ఛేదనలో 18వ ఓవర్లోనే 77 పరుగులకు భారత టాప్–5 వెనుదిరగడంతోనే ఓటమి దాదాపుగా ఖాయమైంది.
9వ నంబర్ బ్యాటర్ రాధా యాదవ్ ఆదుకోకపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. కీలకమైన చివరి పోరులోనైనా బ్యాటింగ్‌లో రాణిస్తే సొంతగడ్డపై సిరీస్ గెలుచుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత్, కివీస్ టీమ్‌లు తలపడనున్నాయి. తొలి వన్డేలో కూడా భారత్ మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతోనే నెగ్గింది. రెండు వన్డేల్లో కలిపి మన బ్యాటర్లు ఎవరూ కనీసం అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు.
చివరి మ్యాచ్‌లో నెగ్గాలంటే ముగ్గురు ప్రధాన బ్యాటర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెలరేగాల్సి ఉంది. ముఖ్యంగా స్మృతి సుదీర్ఘ కాలంగా వరుసగా విఫలమవుతూ తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఈ సిరీస్‌లో ఆమె 5, 0 స్కోర్లకే పరిమితమైంది. ఇదే సిరీస్‌తో అరంగేట్రం చేసిన తేజల్‌ను తప్పు పట్టలేం కానీ జెమీమా కూడా మిడిలార్డర్‌లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అందరూ సమష్టిగా చెలరేగితేనే కివీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించవచ్చు.
మరోవైపు న్యూజిలాండ్ గత విజయం తర్వాత ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. రెండో వన్డేలో బ్యాటర్లు మూడు అర్ధ సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఓపెనర్లు సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, హ్యాలిడే, మ్యాడీ గ్రీన్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇక కెపె్టన్ సోఫీ డివైన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు ఇటు సారథిగా కూడా ఆమె జట్టును సమర్థంగా నడిపిస్తోంది. సీనియర్ పేసర్ తహుహు ఆఫ్‌స్పిన్నర్ ఈడెన్ కార్సన్‌లు ఎలాంటి బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగల సమర్థులు. లాంటి స్థితిలో స్వదేశంలో సిరీస్ కోల్పోరాదంటే హర్మన్ బృందం రెట్టింపు శ్రమించాల్సి ఉంది.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: హర్మన్ కౌర్ (కెపె్టన్), షఫాలీ, స్మృతి, యస్తిక, జెమీమా, తేజల్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా/శ్రేయాంక పాటిల్.
న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ప్లిమ్మర్, లారెన్ డౌన్, హ్యాలిడే, గ్రీన్, ఇసబెల్లా, జెస్ కెర్, తహుహు, కార్సన్, జొనాస్.
Comments
Please login to add a commentAdd a comment