న్యూజిలాండ్ మహిళల జట్టుతో నేడు తొలి వన్డే
మధ్యాహ్నం గం. 1:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
అహ్మదాబాద్: ఇటీవల మహిళల టి20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన భారత జట్టు మరో పరీక్షకు సిద్ధమైంది. తాజా టి20 ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన న్యూజిలాండ్ జట్టుతో నేటి నుంచి మూడు వన్డేల సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తలపడనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
ఐసీసీ ట్రోఫీ కోసం చకోర పక్షిలా చూస్తున్న భారత మహిళల జట్టుకు తాజా టి20 ప్రపంచకప్‌లో చుక్కెదురైంది. దీంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై వేటు పడటం ఖాయమే అని అంతా భావించినా... సెలక్షన్ కమిటీ మాత్రం హర్మన్‌పై నమ్మకముంచింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు హర్మన్‌కే పగ్గాలు అప్పగించింది. మరి అందరికంటే అనుభవజు్ఞరాలైన హర్మన్‌ప్రీత్ జట్టును ఎలా నడిపిస్తుందో చూడాలి.
12వ తరగతి పరీక్షల కారణంగా రిచా ఘోష్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయకపోగా.. ఆశ శోభన గాయంతో జట్టుకు దూరమైంది. దీంతో నలుగురు యువ ఆటగాళ్లు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత ‘ఎ’ జట్టు ప్లేయర్లు తేజల్, సయాలీ, ప్రియా మిశ్రాతో పాటు డబ్ల్యూపీఎల్‌లో రాణించిన సైమా ఠాకూర్ మొదటిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు.
టి20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచిన 35 ఏళ్ల హర్మన్‌పై ఒత్తిడి అధికంగా ఉండగా... స్మృతి మంధాన, షఫాలీ వర్మ మెరుగైన ఆరంభాలు ఇవ్వాల్సిన అవసరముంది. మిడిలార్డర్‌లో హర్మన్‌తో పాటు జెమీమా, హేమలత, దీప్తి కీలకం కానున్నారు. మరోవైపు సోఫీ డివైన్ సారథ్యంలో టి20 ప్రపంచకప్ గెలిచి ఉత్సాహంగా ఉన్న న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.
20 భారత్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 20 వన్డేలు జరిగాయి. 10 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 9 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది.
9 తొమ్మిది సంవత్సరాల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో భారత్ వన్డే సిరీస్ ఆడుతోంది. చివరిసారి 2015లో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు 3–2తో సొంతం చేసుకుంది.
54 ఓవరాల్‌గా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 54 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. 20 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా... 33 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment