మహిళల క్రికెట్‌లో మళ్లీ పరుగుల పండగొచ్చింది... కరీబియన్ దీవుల్లో ధమాకాకు రంగం సిద్ధమైంది... పది దేశాల ప్రాతినిధ్యంతో శుక్రవారం నుంచే టి20 ప్రపంచ కప్.పదహారు రోజుల పాటు మహా సంగ్రామం. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ దుమ్మురేపుతుందా? పెద్దన్న ఆస్ట్రేలియా అదరగొ డుతుందా? వన్డే జగజ్జేత ఇంగ్లండ్ సంచలనం రేపుతుందా? కివీస్ ఈసారైనా కొల్లగొడుతుందా? టీమిండియా తడాఖా చూపుతుందా? ఇంతకూ ధనాధన్ ఆటలో దశ తిరిగేదెవరిది?
ప్రొవిడెన్స్ (గయానా)
మహిళల క్రికెట్‌లో వన్డే ప్రపంచ సమరం ముగిసిన 15 నెలలకే పొట్టి ఫార్మాట్‌లో జగజ్జేత స్థానానికి అమీతుమి. శుక్రవారం నుంచి ఈ నెల 24 వరకు జరిగే ఈ టోర్నీకి వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తోంది. ఇది ఆరో ప్రపంచ కప్ కాగా, ఎనిమిదేళ్ల తర్వాత తమ దీవుల్లో జరుగనున్న పోరులో కరీబియన్లు డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగిడుతుండటం విశేషం. గతంలో ఏ జట్టు సాధించని ఘనత ఇది. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ విజేత ఆస్ట్రేలియాను 2016లో సంచలనాత్మక రీతిలో ఓడించి తొలిసారిగా ఒడిసిపట్టిన ట్రోఫీని సొంతగడ్డపై నిలబెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు పూర్వ వైభవాన్ని చేజిక్కించుకోవాలని కంగారూలు ఆశిస్తున్నారు. ఇక ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న ‘ప్రపంచ విజేత’ హోదాను టి20ల్లోనైనా దక్కించుకోవాలని టీమిండియా లెక్కలు వేసుకుంటోంది. మిగిలినవాటిలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ప్రమాదకరమైనవి.
ఆ ఐదారే...
పేరుకు 10 జట్లు పోటీకి దిగుతున్నా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, భారత్‌లను మాత్రమే సెమీఫైనల్ చేరే సత్తా ఉన్నవిగా అంచనా వేస్తున్నారు.దక్షిణాఫ్రికా మహిళల జట్టు ప్రభావ వంతంగా లేదు. పాకిస్తాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌లను ద్వితీయ శ్రేణి వాటిగానే పరిగణిస్తున్నారు. సంచలనాలు నమోదైతే తప్ప ఇవి ముందడుగు వేసే అవకాశం లేదు. ముఖ్యంగా నాలుగో సెమీస్ స్థానానికి వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ నెలకొననుంది. అయితే, ధనాధన్ ఆటలో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి... ఏ జట్టునూ కచ్చితమైన ఫేవరెట్‌గా చెప్పలేని పరిస్థితి.
గ్రూప్ నుంచి రెండేసి జట్లు...
జట్లను ‘ఎ’, ‘బి’ గ్రూపులుగా వర్గీకరించారు. గ్రూప్ ‘ఎ’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, గ్రూప్ ‘బి’లో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ ఉన్నాయి. ఈ లెక్కన లీగ్ దశలో ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. విజేతకు 2 పాయింట్లు, మ్యాచ్ టై, లేదా రద్దయితే ఒక పాయింట్ ఇస్తారు. పట్టికలో 1, 2లో స్థానాల్లో నిలిచిన జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment