T20 WC: టీ20 క్రికెట్‌.. పొట్టి ఫార్మాట్‌ కానేకాదు: కెప్టెన్‌ | Working On Mental Strength: Harman On India Preparations T20 WC 2024 | Sakshi
Sakshi News home page

T20 WC: టీ20 క్రికెట్‌.. పొట్టి ఫార్మాట్‌ కానేకాదు: కెప్టెన్‌

Published Tue, Sep 17 2024 12:14 PM | Last Updated on Tue, Sep 17 2024 12:25 PM

Working On Mental Strength: Harman On India Preparations T20 WC 2024

శారీరక ఫిట్‌నెస్‌తో పాటు మానసిక దృఢత్వం కూడా ముఖ్యమని భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పేర్కొంది. ఈ రెండూ సమతూకంగా ఉంటేనే మెగా టోర్నీల్లో విజయవంతం కాగలమని అభిప్రాయపడింది. అందుకే తాము.. మహిళల టీ20 ప్రపంచకప్‌నకు ముందు... మానసిక స్థయిర్యం సాధించేందుకు కూడా కసరత్తు చేస్తుట్లు తెలిపింది.

కాగా ఐసీసీ టోర్నమెంట్లలో భారత మహిళల జట్టు కొన్నేళ్లుగా ఆఖరి మెట్టుపై తడబడుతోన్న విషయం తెలిసిందే. గత టీ20 ప్రపంచకప్‌ ఈవెంట్లో ఆసాంతం నిలకడగా రాణించిన అమ్మాయిల జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతిని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈసారైనా గత పొరపాట్లు పునరావృతం చేయకూడదని.. ఒత్తిడి అధిగమించి టైటిల్‌ గెలవాలని పట్టుదలగా ఉంది. 

టీ20 క్రికెట్‌.. పొట్టి ఫార్మాట్‌ కానేకాదు!
ఈ నేపథ్యంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మాట్లాడుతూ.. ‘చాలా రోజులుగా మేమంతా మానసిక సంసిద్ధతపై దృష్టి పెట్టాం. మ్యాచ్‌ల్లో ఎప్పుడైనా చివరి మూడు, నాలుగు ఓవర్ల ఆట పెను ప్రభావాన్ని చూపిస్తోంది. నిజానికి టీ20 క్రికెట్‌ అందరు అనుకున్నట్లు పొట్టి ఫార్మాట్‌ కానేకాదు. ఆ రోజు 40 ఓవర్ల మ్యాచ్‌ జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

మెంటల్‌ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాం
మేం ఆఖరి నాలుగైదు ఓవర్లు మానసిక పట్టుదలను కనబరిస్తే మ్యాచ్‌లు గెలవచ్చు. ఈ ఓవర్లే ఫలితాలను తారుమారు చేస్తున్నాయి. ఏదేమైనా.. చివరిదాకా చతికిలబడటం చాలా నిరాశను మిగులుస్తోంది. అందుకే అలాంటి సమయంలో నిలకడను కొనసాగించేందుకు ఈసారి మెంటల్‌ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాం’ అని తెలిపింది.

ఇకపై గత పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చెప్పింది. జట్టులో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లతో కలిసి ఆడటం వల్ల విభిన్న సంస్కృతులు తెలుసుకునేందుకు, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశముంటుందని పేర్కొంది. 

ఒత్తిడిని అధిగమించలేక ఆఖరి మెట్టుపై బోల్తా
కాగా.. 2017 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్‌తో భారత్‌ తుదిమెట్టుపై దాదాపు గెలిచే స్థితిలో ఉండి... అనూహ్యంగా 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రెండేళ్ల క్రితం జరిగిన 2022 కామన్వెల్త్‌ క్రీడల్లోనూ ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓడి స్వర్ణాన్ని చేజార్చుకుని... వెండి పతకంతో సరిపెట్టుకుంది.

యూఏఈలో
మహిళా టీ20 ప్రపంచకప్‌-2024 ఎడిషన్‌ అక్టోబర్‌ 3- 20 వరకు జరుగనుంది.  షార్జా, దుబాయ్‌ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ఐసీసీ టోర్నీలో భారత జట్టు‌ గ్రూప్‌ ‘ఎ’లో ఉంది.

ఇక ఆరుసార్లు విజేత, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్‌లో ఈ గ్రూపులోనే ఉండటం విశేషం. దీంతో లీగ్‌ దశలో భారత్‌కు గట్టిపోటీ ఎదురుకానుంది.ఈ మెగా ఈవెంట్లో హర్మన్‌ సేన తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 4న న్యూజిలాండ్‌తో ఆడుతుంది.

అందుకే వేదిక మార్పు
అదే విధంగా.. లీగ్‌ దశలోని మొదటి మూడు మ్యాచ్‌ల్ని దుబాయ్‌లో ఆడనున్న టీమిండియా... ఆసీస్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌ను షార్జాలో 13వ తేదీన ఆడుతుంది. నిజానికి ఈ మెగా ఈవెంట్‌ బంగ్లాదేశ్‌లో జరగాల్సింది. కానీ అక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితి, హింసాత్మక ఘటనలతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వేదికను యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే.  

చదవండి: 38వ పడిలోకి స్పిన్‌ మాంత్రికుడు.. హ్యాపీ బర్త్‌ డే అశ్విన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement