టీమిండియాపై 3–2తో నెగ్గి ఫైనల్ చేరిన జర్మనీ
రేపు కాంస్యం కోసం స్పెయిన్‌తో భారత్ పోరు
పారిస్: నాలుగు దశాబ్దాల తర్వాత వరుసగా రెండోసారి ఒలింపిక్స్ సెమీఫైనల్‌కు చేరిన భారత పురుషుల జట్టు.. తుదిపోరుకు అర్హత సాధించడంలో మరోసారి విఫలమైంది. మంగళవారం హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆరంభం నుంచి ఆధిక్యంలో ఉండి.. టీమిండియా 2–3 గోల్స్‌తో జర్మనీ చేతిలో పరాజయం పాలైంది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (7వ నిమిషంలో), సుఖ్‌జీత్ సింగ్ (36వ నిమిషంలో) చెరో గోల్ చేశారు.
జర్మనీ తరఫున పైలాట్ గోంజాలో (18వ నిమిషంలో), రుహెర్ క్రిస్టోఫర్ (27వ నిమిషంలో), మిల్కావు మార్కో (54వ నిమిషంలో) తలా ఒక గోల్ సాధించారు. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ఆట మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా.. జర్మనీ అనూహ్య గోల్‌తో ముందంజ వేయగా.. చివర్లో గోల్‌కీపర్‌ను తప్పించి అదనపు అటాకర్‌తో ప్రయతి్నంచినా భారత్ స్కోరు సమం చేయలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో జర్మనీపై విజయంతోనే మెడల్ దక్కించుకున్న టీమిండియా... ఈసారి మాత్రం అలాంటి ప్రదర్శన కనబర్చలేకపోయింది. మరో సెమీఫైనల్లో నెదర్లాండ్స్ 4–0తో స్పెయిన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment