న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ నుంచి చేదు ఫలితంతో తిరిగొచ్చిన ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ త్వరలోనే పంచ్ పవర్‌ను పెంచుకొని రింగ్‌లోకి దిగుతానని చెప్పింది. ఇందుకోసం వ్యక్తిగత కోచ్ అవసరమని... ప్రస్తుతం కోచ్‌ను నియమించుకునే పనిలో నిమగ్నమైనట్లు నిఖత్ వెల్లడించింది. మహిళల 50 కేజీల ఈవెంట్‌లో భారత్ ఆమెపై ఆశలు పెట్టుకుంది. ఈ చాంపియన్ బాక్సర్ తప్పకుండా పతకం సాధిస్తుందనే అంచనాలతో బరిలోకి దిగగా ఊహించని స్థాయిలో భారత శిబిరానికి నిరాశ ఎదురైంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆరుగురిలో అందరికంటే ముందుగా బెర్తు సాధించిన తెలంగాణ స్టార్... పారిస్‌లో ప్రిలిమినరీ దశలో ఆసియా క్రీడల చాంపియన్ వూ యు (చైనా) చేతిలో కంగుతింది.
‘లోపాలు లేకుండా ఎవరూ ఉండరు. పైగా ఆ రోజు నాకు కలిసిరాలేదు. నేను అన్‌సీడెడ్ ప్లేయర్ కాబట్టి ఆరంభంలోనే నాకు క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురైంది. చిత్రమేమిటంటే ఈ ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వారెవరైతే ఉన్నారో వాళ్లను గతంలో నేను ఓడించాను. ఇది తలచుకుంటేనే బాధేస్తుంది. ఏదేమైనా జీవితంలో అన్నింటిని స్వీకరించాలి గెలుపైనా... ఓటమైనా! నాతో ఎలాంటి ప్రణాళిక లేదు. కానీ ఎలా ఎదగాలో... ఎలా పుంజుకోవాలో తెలుసు. ఇప్పటివరకు నాకు వ్యక్తిగత కోచ్ లేడు. నేను నా శక్తిసామర్థ్యాలు పెంచుకోవాలంటే కోచ్ కావాల్సిందే. అతని శిక్షణతో రాటుదేలాలి. ఉత్తమ బాక్సర్‌గా ఎదగాలంటే మంచి కోచ్ వద్ద ట్రెయినింగ్ తప్పనిసరి. సుశిక్షితుడైన కోచ్ దొరికితే ఎలా సన్నద్ధం కావాలో నాకు తెలుసు’ అని రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్ జరీన్ వివరించింది.
చదవండి: మహారాజు కాబోతున్న టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరంటే?
భిన్నశైలి బాక్సర్లతో విభిన్నమైన పద్ధతుల్లో తలపడితేనే ఆటతీరు మారుతుందని ఆమె ఆశిస్తోంది. తనలో లోపాలున్న చోట సరిదిద్దుకునే పనిలో ఉన్నానని ముందుగా బలంగా తయారయ్యేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పింది. తద్వారా పంచ్ పవర్‌ను పెంచుకోవచ్చని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment