Indian boxer
-
వరల్డ్ టైటిల్ నెగ్గిన భారత బాక్సర్ మన్దీప్
భారత ప్రొఫెషనల్ బాక్సర్ మన్దీప్ జాంగ్రా అంతర్జాతీయ బాక్సింగ్ వేదికపై అపూర్వ విజయం సాధించాడు. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (డబ్ల్యూబీఎఫ్) సూపర్ ఫెదర్ వెయిట్లో మన్దీప్ ప్రపంచ చాంపియన్‌గా ఆవిర్భవించాడు. కేమన్ ఐలాండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్ టైటిల్ పోరులో బ్రిటన్ బాక్సర్ కొనొర్ మెకింటోష్ను మన్దీప్ కంగుతినిపించాడు. 31 ఏళ్ల ఈ హరియాణా స్టార్ పంచ్ పవర్ ముందు బ్రిటన్ ప్రత్యర్థి నిలువలేకపోయాడు.ఆరంభ రౌండ్ నుంచి ప్రత్యర్థిపై ముష్టిఘాతాలు కురిపించిన భారత బాక్సర్ మొత్తం పది రౌండ్ల పాటు మెకింటోష్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగాడు. రౌండ్ రౌండ్‌కు తన పంచ్ పదును పెరిగిపోవడంతో ప్రత్యర్థికి ఎటు పాలుపోలేదు. అమెచ్యూర్ సర్క్యూట్లో 12 సార్లు రింగ్‌లోకి దిగితే కేవలం ఒకే ఒక్కసారి ఓడిన మన్దీప్ 11 సార్లు ఘనవిజయం సాధించాడు.కాగా2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో జాంగ్రా రజత పతకం గెలిచాడు. మాజీ ఒలింపిక్ రజత పతక విజేత రాయ్ జోన్స్ జూనియర్... మన్‌దీప్‌ను చాంపియన్‌గా మలిచాడు. ‘నా కెరీర్లోనే ఇదే అతిపెద్ద విజయం. ఎన్నో ఏళ్లపాటు కఠోరంగా శ్రమించినందుకు దక్కిన ఫలితమిది. భారత ప్రతిష్ట పెంచిన విజయమిది. నన్ను ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు’ అని మన్దీప్ వ్యాఖ్యానించాడు. -
అది తలచుకుంటేనే బాధేస్తుంది: బాక్సర్ నిఖత్ జరీన్
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ నుంచి చేదు ఫలితంతో తిరిగొచ్చిన ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ త్వరలోనే పంచ్ పవర్‌ను పెంచుకొని రింగ్‌లోకి దిగుతానని చెప్పింది. ఇందుకోసం వ్యక్తిగత కోచ్ అవసరమని... ప్రస్తుతం కోచ్‌ను నియమించుకునే పనిలో నిమగ్నమైనట్లు నిఖత్ వెల్లడించింది. మహిళల 50 కేజీల ఈవెంట్లో భారత్ ఆమెపై ఆశలు పెట్టుకుంది. ఈ చాంపియన్ బాక్సర్ తప్పకుండా పతకం సాధిస్తుందనే అంచనాలతో బరిలోకి దిగగా ఊహించని స్థాయిలో భారత శిబిరానికి నిరాశ ఎదురైంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆరుగురిలో అందరికంటే ముందుగా బెర్తు సాధించిన తెలంగాణ స్టార్... పారిస్‌లో ప్రిలిమినరీ దశలో ఆసియా క్రీడల చాంపియన్ వూ యు (చైనా) చేతిలో కంగుతింది.‘లోపాలు లేకుండా ఎవరూ ఉండరు. పైగా ఆ రోజు నాకు కలిసిరాలేదు. నేను అన్‌సీడెడ్ ప్లేయర్ కాబట్టి ఆరంభంలోనే నాకు క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురైంది. చిత్రమేమిటంటే ఈ ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వారెవరైతే ఉన్నారో వాళ్లను గతంలో నేను ఓడించాను. ఇది తలచుకుంటేనే బాధేస్తుంది. ఏదేమైనా జీవితంలో అన్నింటిని స్వీకరించాలి గెలుపైనా... ఓటమైనా! నాతో ఎలాంటి ప్రణాళిక లేదు. కానీ ఎలా ఎదగాలో... ఎలా పుంజుకోవాలో తెలుసు. ఇప్పటివరకు నాకు వ్యక్తిగత కోచ్ లేడు. నేను నా శక్తిసామర్థ్యాలు పెంచుకోవాలంటే కోచ్ కావాల్సిందే. అతని శిక్షణతో రాటుదేలాలి. ఉత్తమ బాక్సర్‌గా ఎదగాలంటే మంచి కోచ్ వద్ద ట్రెయినింగ్ తప్పనిసరి. సుశిక్షితుడైన కోచ్ దొరికితే ఎలా సన్నద్ధం కావాలో నాకు తెలుసు’ అని రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్ జరీన్ వివరించింది.చదవండి: మహారాజు కాబోతున్న టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరంటే?భిన్నశైలి బాక్సర్లతో విభిన్నమైన పద్ధతుల్లో తలపడితేనే ఆటతీరు మారుతుందని ఆమె ఆశిస్తోంది. తనలో లోపాలున్న చోట సరిదిద్దుకునే పనిలో ఉన్నానని ముందుగా బలంగా తయారయ్యేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పింది. తద్వారా పంచ్ పవర్‌ను పెంచుకోవచ్చని తెలిపింది. -
నిశాంత్ దేవ్‌కు పారిస్ ‘టికెట్’
బ్యాంకాక్: భారత బాక్సర్ నిశాంత్ దేవ్ పారిస్ విమానం ఎక్కనున్నాడు. ప్రతిష్టాత్మక విశ్వ క్రీడలకు అతను అర్హత సంపాదించాడు. మెగా ఈవెంట్‌కు ఆఖరి అర్హత టోర్నీ అయిన ‘వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్’లో నిశాంత్ పురుషుల 71 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరడం ద్వారా బెర్త్ దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అతను 5–0తో వాసిల్ సె»ొటరి (మాల్దొవా)పై ఏకపక్ష విజయం సాధించాడు. మహిళల 60 కేజీల క్వార్టర్స్‌లో అంకుశిత 2–3తో అగ్నెస్ (స్వీడన్) చేతిలో ఓడి... అరుంధతి 1–4తో జెస్సికా (స్లొవేకియా) చేతిలో ఓడి ఒలింపిక్స్‌కు దూరమయ్యారు. పురుషుల 51 కేజీల ప్రిక్వార్టర్స్‌లో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంఘాల్ 5–0తో కిమ్ ఇంక్యూ (కొరియా)పై గెలిచి ‘పారిస్’కు అడుగు దూరంలో ఉన్నాడు. 57 కేజీల క్వార్టర్స్‌లో సచిన్ సివాచ్ 4–1 తో శామ్యూల్ కిస్తోహరీ (ఫ్రాన్స్)పై గెలిచి సెమీస్ చేరాడు. ఈ వెయిట్ కేటగిరీలో మూడు బెర్త్‌లు మాత్రమే ఉండటంతో సచిన్ ఫైనల్ చేరాలి లేదంటే ‘బాక్స్ ఆఫ్’ బౌట్లో గెలిస్తే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాడు. పురుషుల 92 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ సంజీత్ 0–5తో అల్ఫోన్సో (అజర్బైజాన్) చేతిలో ఓడిపోయాడు. -
సచిన్ టెండూల్కర్‌ని కలిసిన బాక్సింగ్ క్వీన్ (ఫొటోలు)
-
‘పారిస్’ బెర్త్‌కు విజయం దూరంలో...
బుస్టో అర్సిజియో (ఇటలీ): పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు భారత బాక్సర్ నిశాంత్ దేవ్ విజయం దూరంలో నిలిచాడు. ఒలింపిక్స్ వరల్డ్ క్వాలిఫయింగ్ తొలి టోరీ్నలో 23 ఏళ్ల ఈ హరియాణా బాక్సర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నిశాంత్ 5–0తో క్రిస్టోస్ కరైటిస్ (గ్రీస్)పై గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో అమెరికా బాక్సర్ ఒమారి జోన్స్‌తో నిశాంత్ తలపడతాడు. ఈ బౌట్లో గెలిచి సెమీఫైనల్ చేరుకుంటే నిశాంత్‌కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారవుతుంది. ఈ క్వాలిఫయింగ్ టోరీ్నలో భారత్ నుంచి తొమ్మిది మంది బాక్సర్లు బరిలోకి దిగగా ఎనిమిది మంది తొలి రౌండ్లోనే ఓడిపోవడం గమనార్హం. ఇప్పటి వరకు భారత్ నుంచి కేవలం మహిళల విభాగంలో మాత్రమే నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), పర్వీన్ హుడా (57 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. -
మేరీ కోమ్.. బాక్సింగ్ రింగ్‌ను శాశించిన ఉక్కు మహిళ
చుంగ్ (ఎత్తుగా), నియ్ (సంపద ఉన్న), జాంగ్ (దృఢమైన).. ఈ మూడు కలిపితే ‘చుంగ్నీజాంగ్’.. తన కూతురికి తండ్రి పెట్టిన పేరది! ఆ సమయంలో ఆ చిన్నారి గురించి, ఆమె భవిష్యత్తు గురించి ఆయన ఏమీ ఆలోచించలేదు. నామకరణంలోనే ఘనకీర్తి రాసిపెట్టి ఉందని ఆయనకు తెలియదు. అప్పటి వరకు మగపిల్లాడు పుడితే బాగుండనుకున్న తల్లి కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్న అమ్మాయిని చూసి సంబరంగా గుండెకు హత్తుకుంది. కొన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి ‘మరింత వేగంగా, మరింత ఎత్తుకు, మరింత బలంగా’.. అంటూ నినాదం నింపుకున్న విశ్వక్రీడల్లో మెరిసింది.. తన దృఢ సంకల్పంతో విజయాలతో పాటు సంపదనూ మోసుకొచ్చింది. ఆ అమ్మాయే మంగ్తె చుంగ్నీజాంగ్ మేరీ కోమ్.. దేశంలో బాక్సింగ్ ఆటకు, మహిళలకు భూమ్యాకాశాలకు ఉన్నంత అంతరం ఉన్న సమయంలో ఆటకు పర్యాయపదంగా నిలిచింది. దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరుసార్లు ప్రపంచ చాంపియన్... క్రీడాకారులంతా కలలుగనే ఒలింపిక్ క్రీడల్లో కాంస్యపతకంతో భారత జెండా రెపరెపలాడించిన క్షణం.. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో కలిపి మరో 12 పతకాలు.. 19 ఏళ్ల వయసులో అంతర్జాతీయ వేదికపై మొదలైన ఈ విజయ ప్రస్థానం 39 ఏళ్ల వయసు వరకూ సాగింది. ఈ మధ్యలో అమ్మతనం కూడా ఆమె ఆటకు అడ్డుగా మారలేదు. అసాధారణ ప్రదర్శనతో మేరీ కోమ్ బాక్సింగ్ రింగ్‌ను శాసించింది. ఆమె సాధించిన ఘనతల విలువ రికార్డు పుస్తకాలకే పరిమితం కాదు. వాటి వెనక ఉన్న అపార పట్టుదల, పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం. క్రీడల్లో రాణించలేకపోవటానికి సౌకర్యాలు లేకపోవడమే కారణమని సాకులు చెప్పే ఎందరికో మేరీ కోమ్ జీవితం ఒక పాఠం, గుణపాఠం నేర్పిస్తుంది. ఆమె నేపథ్యం, ప్రతికూల పరిస్థితులను దాటి వచ్చిన తీరు అనితరసాధ్యం. బాక్సింగ్‌నే ఇష్టపడి.. డింకో సింగ్.. 1998 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన మణిపూర్ బాక్సర్. అతను ఆ విజయంతో తిరిగి వచ్చిన సమయంలో స్వరాష్ట్రంలో సంబరాలు జరిగాయి. అప్పుడు 16 ఏళ్లు ఉన్న మేరీ వాటన్నింటినీ చూసి ఒక అభిమానిలా గంతులు వేసింది. అంతే తప్ప అప్పటి వరకు కూడా ఆమె బాక్సింగ్‌లో కెరీర్ గురించి ఆలోచించనే లేదు. తండ్రి ఒక వ్యవసాయ కూలీ. సహజంగానే ఆర్థిక ఇబ్బందులు. అయితే ఆయన ఎప్పుడూ దానిని సమస్యగా భావించలేదు. కష్టపడి కుటుంబాన్ని పోషించుకోగలిగితే చాలనుకునే వ్యక్తి. ఇలాంటి నేపథ్యంలో స్కూల్లో పోటీలు తప్ప మేరీకి క్రీడల గురించి మరేమీ తెలీదు. చిన్నప్పటి నుంచి బలంగా ఉన్న ఆమెకు అథ్లెటిక్స్‌లో పోటీపడి గెలవడం చిటికెలో పనిగా మారింది. అయితే ఒక రోజు డింకో సింగ్‌ను చూసిన తర్వాత తనకు సరైన ఆట బాక్సింగ్ అనే భావించింది. ఆ పంచ్‌లు, బలంగా ప్రత్యర్థిపై విరుచుకుపడే తత్వం మేరీని ఆకర్షించాయి. అయితే నాన్నకు తెలిస్తే కోప్పడతాడేమోనని తన ఆసక్తిని రహస్యంగానే ఉంచింది. మేరీ దూకుడు, పోరాటతత్వం బాక్సింగ్‌కు సరిపోతాయని గుర్తించి ఆమెను కోచ్‌లు.. కొసానా మీటీ, నర్జిత్ సింగ్ ప్రోత్సహించారు. అదే చివరకు మేరీని ప్రపంచ చాంపియన్ దిశగా నడిపించింది. సాధనలోనే ఒక రోజు తన కూతురి బాక్సింగ్ గురించి తెలుసుకున్న తండ్రి కొంత ఆందోళన చెందినా.. చివరకు సరైన మార్గం ఎంచుకుందని స్థిమితపడ్డాడు. పతకాల ప్రవాహం.. 2001 అక్టోబర్.. పెన్సిల్వేనియాలో మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్.. 48 కేజీల విభాగంలో సత్తా చాటిన మేరీ కోమ్ ఫైనల్ చేరింది. తుది పోరులో ఓడినా రజతం సాధించి గర్వంగా నిలబడింది. అయితే అది ఆరంభం మాత్రమే. పతకధారణ అంతటితో ఆగిపోలేదు. తొలిసారి సాధించిన రజతం ఆ తర్వాత బంగారమైంది. ఆ వేదికపై మరో ఐదుసార్లు మేరీ మెడలో స్వర్ణం మెరిసింది. 2002, 2005, 2006, 2008, 2010, 2018లలో ఏకంగా ఆరుసార్లు ఆమె ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ ఇదే తరహాలో ఐదు స్వర్ణాలతో మేరీ తానేంటో చూపించింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు, వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ ఒక ఎత్తు కాగా.. 2012 లండన్ ఒలింపిక్స్ సాధించిన కాంస్య పతకం మేరీ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. వరుస విజయాలతో సెమీస్ చేరిన తర్వాత నికోలా ఆడమ్స్ (యూకే) చేతిలో ఓడటంతో మేరీ ఫైనల్ ఆశలు నెరవరలేదు. అయితేనేమి ఎక్కడో మణిపురి కోమ్ తెగలో పుట్టి లండన్ వేదికపై ఒలింపిక్ కాంస్య పతకం అందుకుంటున్న క్షణాన ఆమె కళ్ళల్లో కనిపించిన మెరుపు ఆ కంచు పతకం విలువేమిటో చెబుతుంది. బాక్సింగ్ పంచ్ ద్వారా మెగా ఈవెంట్లో భారత జెండా ఎగరేసిన క్షణం అపురూపం. అడ్డు రాని అమ్మతనం.. బాక్సర్‌గా ఎదుగుతున్న దశలో పరిచయమైన ఫుట్‌బాల్ ప్లేయర్ కరుంగ్ ఓన్లర్‌ను మేరీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2005లో పెళ్లి జరిగేనాటికే ఆమె ప్రపంచ చాంపియన్ కూడా. పెళ్లి తర్వాత ఆటకు మేరీ విరామమిచ్చింది. చాలామంది ఆమె బాక్సింగ్ ముగిసిపోయిందనే భావించారు. ఇతర క్రీడల సంగతేమో కానీ బాక్సింగ్‌లాంటి ఆటలో తల్లిగా మారిన తర్వాత అదే తరహా బలాన్ని ప్రదర్శించడం, శరీరంలో వచ్చే మార్పులతో కలిగే ఇబ్బందులను అధిగమించాల్సి రావడం చాలా కష్టం. కానీ మేరీ పోరాటతత్వం ముందు అవన్నీ చిన్నవిగా మారిపోయాయి. కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సాధన మొదలు పెట్టింది. పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత ఆమె నాలుగు ప్రపంచ చాంపియన్ షిప్‌లు, ఒలింపిక్ పతకం గెలుచుకోవడం మరో పెద్ద విశేషం. ఈ దంపతులకు ఆ తర్వాత మరో కొడుకు పుట్టగా, ఒక అమ్మాయిని వీరు దత్తత తీసుకున్నారు. అవార్డుల పంట.. క్రీడాకారులకు ఇచ్చే అర్జున, ఖేల్రత్నలు సహజంగానే మేరీని వెతుక్కుంటూ వచ్చాయి. భారత ప్రభుత్వం ఇచ్చే నాలుగు అత్యుత్తమ పౌర పురస్కారాల్లో భారతరత్న మినహా మిగతా మూడు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లు మేరీని వరించాయి. క్రీడల్లో ఆమె చేసిన సేవలకుగాను ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయగా 2016–2022 మధ్య ఆమె ఈ బాధ్యతలను నిర్వర్తించింది. వెండితెర కథగా.. మేరీకోమ్ జీవితం ఆధారంగా 2014లో సినిమా వచ్చింది ఉమంగ్ కుమార్ దర్శకత్వంలో! ప్రియాంక చోప్రా అందులో మేరీ పాత్రను పోషించింది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలి సహ నిర్మాతగా కూడా ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ఆమె ఆత్మకథ ‘అన్ బ్రేకబుల్’ పేరుతో పుస్తకంగా కూడా ప్రచురితమైంది. చిన్నారులకు స్ఫూర్తిని అందించే కథల సంకలనం ‘గుడ్‌నైట్ స్టోరీస్ ఫర్ రెబల్ గర్ల్స్’లో కూడా మేరీకి చోటు దక్కింది. - మొహమ్మద్ అబ్దుల్ హాది -
బీఎఫ్ఐ అధికారులు వేధిస్తున్నారు.. స్టార్ మహిళా బాక్సర్ సంచలన ఆరోపణలు
బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) అధికారులపై టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ సంచలన ఆరోపణలు చేసింది. బీఎఫ్ఐ అధికారులు తన ఇద్దరు కోచ్‌లను పదేపదే తొలగిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ట్విటర్ వేదికగా ఆరోపణాస్త్రాలను సంధించింది. తాను ఒలింపిక్ పతకం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన కోచ్ సంధ్యా గురుంగ్జీని కామన్ వెల్త్ విలేజ్‌లోకి అనుమతించడం లేదని, మరో కోచ్ రఫేల్ బెర్గమొస్కోను ఇండియాకు పంపించేశారని ఆమె వాపోయింది. 🙏 pic.twitter.com/2NJ79xmPxH — Lovlina Borgohain (@LovlinaBorgohai) July 25, 2022 ఈ కారణంగా తన ప్రాక్టీస్ ఆగిపోయిందని, వరల్డ్ ఛాంపియన్షిప్ సమయంలో కూడా బీఎఫ్ఐ ఇలాగే తనతో డర్టీ పాలిటిక్స్ చేసిందని పేర్కొంది. బీఎఫ్ఐ ఎన్ని నీచ రాజకీయాలు చేసినా తాను కామన్ వెల్త్ క్రీడల్లో పతకం తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతానని ఆశాభావం వ్యక్తం చేసింది. మరో మూడు రోజుల్లో (జులై 28) కామన్ వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లవ్లీనా ఆరోపణలు క్రీడా వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. చదవండి: రిటైర్మెంట్ ప్రకటనపై యూ టర్న్ తీసుకోనున్న మిథాలీ రాజ్..? -
తిరిగి రింగ్‌లోకి అడుగుపెట్టనున్న స్టార్ బాక్సర్
భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ స్వల్ప విరామం తర్వాత స్వదేశంలో మరో ప్రొ బాక్సింగ్ బౌట్లో తలపడనున్నాడు. ఆగస్టులో రాయ్‌పూర్ వేదికగా తొలిసారి జరిగే ప్రొఫెషనల్ బాక్సింగ్ బౌట్‌కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన విజేందర్ 2015లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాడు. వరుసగా 12 బౌట్లలో గెలిచాడు ప్రస్తుతం మాంచెస్టర్‌లో శిక్షణ పొందుతున్నానని రాయ్‌పూర్ బౌట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని విజేందర్ చెప్పాడు. -
ఒలంపిక్ పతకం సాధిస్తా.. నాకు మరింత మద్దతు కావాలి: నిఖత్ జరీన్
సాక్షి, న్యూఢిల్లీ: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత నిఖత్ జరీన్‌కు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సన్మానం చేశారు. ఆమెతో పాటు ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్ నేతృత్వంలో పలువురు బాక్సర్లను సన్మానించారు. కాంస్య పతక విజేతలు మనీషా , పర్వీన్‌కు ఆయన సన్మానం చేశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఒలంపిక్ పతకం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించడం ఆనందంగా ఉంది. నా తదుపరి లక్ష్యం కామన్వెల్త్ పోటీలు. ఇక ఒలంపిక్ పతకం సాధించేందుకు రెట్టింపు కృషి అవసరం. ఇందుకు నాకు ఇంకా చాలా మద్దతు కావాలి. ముస్లిం మహిళగా ఈ క్రీడల్లో రాణించే అంశంపై ఇబ్బందులు ఎదురైనా అన్నింటినీ అధిగమించాను. మా నాన్న కేవలం ఆటపై మాత్రమే దృష్టి సారించమన్నారు. రోజూ ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటల పాటు సాధన చేశా. నా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం, స్పాన్సర్లు మద్దతుతో ఇక్కడి వరకు రాగలిగాను. 2014లో తెలంగాణ ప్రభుత్వం నాకు ఆర్థిక సహాయం చేసింది. ఒలంపిక్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని ఆశిస్తున్నా’’ అని జరీన్ పేర్కొన్నారు. చదవండి👉🏾IPL 2022- CSK: వచ్చే ఏడాది జడేజా కెప్టెన్‌గా ఉండబోడు.. 16 కోట్లు మిగులుతాయి.. కానీ! చదవండి👉🏾Hijab Row: హిజాబ్‌పై స్పందించిన నిఖత్ జరీన్.. ఆమె ఏమన్నారంటే..? -
Tokyo Olympics: ముఖానికి 13 కుట్లు.. అయినా సరే పోరాటం
టోక్యో: శరీరానికి ఒకట్రెండు కుట్లు పడితేనే విలవిల్లాడుతాం. విశ్రాంతికే పరిమితమవుతాం. ఏకంగా 13 కుట్లు పడితే ఎవరైనా బాక్సింగ్ చేస్తారా! కచ్చితంగా చేయరు. కానీ భారత బాక్సర్ సతీశ్ బాక్సింగ్ బరిలో దిగాడు. ప్రత్యర్థి పంచ్‌లకు తన ముఖానికి పడిన కుట్లు ఎంతగా బాధిస్తున్నా ఆఖరి దాకా పోరాడాడు. చివరకు ఫలితం ఓటమి అయినా... ప్రదర్శనతో గెలిచాడు. పురుషుల ప్లస్ 91 కేజీల క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ బఖోదిర్ జలొలోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన పోరులో సతీశ్ కుమార్ స్ఫూర్తిదాయక పోరాటం ముగిసింది. రింగ్‌లో ఈ ఆర్మీ బాక్సర్ తన ఆర్మీ నైజాన్ని చాటాడు. యుద్ధభూమిలో బుల్లెట్లు దిగినా ఊపిరి ఉన్నంతవరకు పోరాడే తత్వాన్ని టోక్యో ఒలింపిక్స్‌లో చూపాడు. గత ప్రిక్వార్టర్స్ మ్యాచ్ సందర్భంగా అతని కంటిపై భాగానికి (నుదురు), గవదకు గాయాలయ్యాయి. దీంతో ఆ రెండు చోట్ల కుట్లు వేయాల్సి వచ్చింది. ఇంతటి కఠిన పరిస్థితుల్లో బరిలోకి దిగే సాహసం చేసిన 32 ఏళ్ల సతీశ్ 0–5తో బఖోదిర్ చేతిలో ఓడిపోయాడు. గాయపడిన విషయం తెలియగానే సతీశ్ భార్య, తండ్రి ప్రిక్వార్టర్స్ విజయం దగ్గరే ఆగిపోమన్నారు. క్వార్టర్స్ బరిలో దిగొద్దని పదేపదే వారించారు. అయినాసరే ఇవేవి లెక్కచేయకుండా దేశం కోసం అతను ప్రాతినిధ్యం వహించిన తీరు అసమాన్యం. అందుకే టోక్యోలో ఉన్న కోచ్‌లు సహా భారత్‌లో ఉన్న బాక్సింగ్ సమాఖ్య చీఫ్ అజయ్ సింగ్ అతని పోరాటాన్ని ఆకాశానికెత్తారు. కాగా... పతకాల ఆశలెన్నో పెట్టుకున్న బాక్సింగ్‌లో భారత్‌కు ఒకే ఒక్క పతకం ఖాయమైంది. మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు) సెమీస్ చేరింది. మిగిలిన వారంతా సతీశ్ కంటే ముందే ఇంటిదారి పట్టేశారు. పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ అమిత్ పంఘాల్ (52 కేజీలు), వికాస్ కృషన్ (69 కేజీలు), మనీశ్ కౌశిక్ (63 కేజీలు), ఆశిష్ చౌదరి (75 కేజీలు), మహిళల విభాగంలో దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ (51 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), సిమ్రన్‌జీత్ కౌర్ (60 కేజీలు) ఓడిపోయారు. -
అంచనాలు లేకుండా బరిలోకి.. పంచ్ మాత్రం అదిరింది
టోక్యో: ఒలింపిక్స్‌లో భారత మహిళా బాక్సర్ లవ్లినా బోర్గోహైన్ సంచలనం సృష్టించింది. అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా ఎలాంటి అంచనాలు లేకుండానే ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది. తాజాగా 69 కేజీల విభాగంలో పోటీపడిన లవ్లీనా సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ఫైనల్లో మాజీ వరల్డ్ చాంపియన్.. చైనీస్ తైపీ ప్లేయర్ చెన్ నైన్ చిన్‌పై 4-1 తేడాతో ఆమె ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో లవ్లీనా బాక్సింగ్ విభాగంలో కనీసం క్యాంస్యం పతకం గెలుచుకునే అవకాశం లభించింది. సెమీస్‌లో ఒకవేళ లవ్లీనా ఓడినా.. క్యాంసం దక్కడం ఖాయం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లవ్లీనా మూడు రౌండ్లలోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రౌండ్లో 3:2 తో ఆధిక్యంలో ఉండగా.. రెండో రౌండ్లో మొత్తం ఐదుగురు జడ్జీలు లవ్లీనాకే 10 స్కోరు ఇచ్చారు. ఇక మూడో రౌండ్లో నలుగురు లవ్లీనా వైపే మొగ్గారు. దీంతో ఆమె 4-1తో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక ఆగస్టు 4న జరగనున్న సెమీఫైనల్లో టర్కీకి చెందిన సుర్మెనెలి బుసెనాజ్తో తలపడనుంది. కిక్ బాక్సర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి.. 1997 అక్టోబర్ 2న అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో టికెన్- మామోని దంపతులకు లవ్లీనా బోర్గోహైన్ జన్మించింది. లవ్లీనాకు కవలలైన ఇద్దరు అక్కలు ఉన్నారు. లవ్లీనా తండ్రి టికెన్ బోర్గోహైన్ ఒక చిన్న వ్యాపారి. టికెన్‌కు ఎన్ని ఆర్థిక కష్టాలు ఎదురైనా తన ముగ్గురు కూతుళ్లను బాక్సర్లుగా తయారు చేయాలనే పట్టుదలను మాత్రం వదల్లేదు. ఆయన కోరికకు తగ్గట్టే లిచా, లిమాలు కిక్ బాక్సింగ్‌లో నేషన్ల్ లెవల్ పోటీల్లో పాల్గొన్నారు. అయితే వివాహం తర్వాత వారిదరు బాక్సింగ్‌ను పక్కనపెట్టారు. అయితే లవ్లీనా మాత్రం కిక్ బాక్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినా కొంతకాలానికి బాక్సింగ్‌లో అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అందులోకి మారింది. 2011లో లవ్లీనా బర్తాపూర్ బాలిక పాఠశాలలో చదువుతున్నప్పుడు బాక్సింగ్ ఈవెంట్లో పాల్గొని గెలుపొందింది. ఈ విజయంతో ఆమె తొలిసారి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టిలో పడింది. ఆ తర్వాత భారత బాక్సింగ్స్ వుమెన్స్ చీఫ్ కోచ్ శివ్ సింగ్ వద్ద ఆమె కోచింగ్ తీసుకుంది. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో దేశానికి పతకం అందించునున్న మూడో బాక్సర్‌గా లవ్లీనా నిలవనుంది. ఇంతకముందు 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్ బాక్సింగ్ విభాగం నుంచి క్యాంస్యం గెలుపొందారు. ఇక 69 కేజీల విభాగంలో మనకు క్యాంస్య పతకం రానుండడం ఇదే తొలిసారి. లవ్లీనా సాధించిన పతకాలు 2018లో ఏఐబీఏ వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్యాంస్య పతకం 2019లో ఏఐబీఏ వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్యాంస్య పతకం 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో క్వార్టర్‌పైనల్లో ఓటమి -
మేరీ పంచ్ అదిరె...
టోక్యో: భారత సీనియర్ బాక్సర్, 2012 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్ టోక్యోలో తొలి అడుగును విజయవంతంగా వేసింది. రెండో ఒలింపిక్ పతకాన్ని ఆశిస్తున్న భారత బాక్సింగ్ దిగ్గజం ఆదివారం జరిగిన 51 కేజీల విభాగం తొలి రౌండ్లో 4–1 తేడాతో మిగులినా హెర్నాండెజ్ (డొమినికన్ రిపబ్లిక్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 38 ఏళ్ల మేరీకోమ్ ముందు 23 ఏళ్ల మిగులినా నిలవలేకపోయింది. తర్వాతి పోరులో కొలంబియాకు చెందిన మూడో సీడ్ ఇన్‌గ్రిట్ వలెన్సియాతో తలపడుతుంది. పురుషుల 63 కేజీలవిభాగంలో భారత బాక్సర్ మనీశ్ కౌశిక్‌కు చుక్కెదురైంది. తొలి పోరులోనే అతను ఓటమిపాలై నిష్క్రమించాడు. బ్రిటన్‌కు చెందిన ల్యూక్ మెక్‌కార్మాక్ 4–1తో మనీశ్‌ను ఓడించాడు. -
సచిన్ పసిడి పంచ్
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. పోలాండ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల 56 కేజీల ఫైనల్లో భారత యువ బాక్సర్ సచిన్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. యెర్బోలాత్ సాబిర్ (కజకిస్తాన్)తో జరిగిన టైటిల్ పోరులో సచిన్ 4–1తో నెగ్గాడు. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్లో భారత్‌కిది ఎనిమిదో స్వర్ణ పతకం కావడం విశేషం. గురువారం మహిళల విభాగంలో భారత బాక్సర్లు బరిలోకి దిగిన ఏడు వెయిట్ కేటగిరీల్లోనూ బంగారు పతకాలు గెల్చుకున్న సంగతి తెలిసిందే. పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి భారత్ ఎనిమిది స్వర్ణాలు, మూడు కాంస్యాలతో 11 పతకాలు దక్కించుకొని టాప్ ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల విభాగంలో అంకిత్ నర్వాల్ (64 కేజీలు), బిశ్వామిత్ర చోంగ్తోమ్ (49 కేజీలు), విశాల్ గుప్తా (91 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ మెగా టోర్నీలో 52 దేశాల నుంచి మొత్తం 414 మంది బాక్సర్లు పాల్గొన్నారు. -
అమిత్ నంబర్‌వన్
న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో రజత పతకం నెగ్గిన ఏకైక భారత బాక్సర్‌గా గుర్తింపు పొందిన అమిత్ పంఘాల్ మరో ఘనత సాధించాడు. సోమవారం విడుదల చేసిన అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ–ఐబా) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అమిత్ పురుషుల 52 కేజీల విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. జకార్తా–2018 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన ఈ హరియాణా బాక్సర్ ఖాతాలో 1300 పాయింట్లు ఉన్నాయి. అమిత్ చిరకాల ప్రత్యర్థి ప్రస్తుత ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ జైరోవ్ షకోబిదిన్ (ఉజ్బెకిస్తాన్) 1200 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోగా... అసెనోవ్ పనేవ్ (బల్గేరియా) 1000 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. రోహతక్‌కు చెందిన 24 ఏళ్ల అమిత్ రెండేళ్లుగా భారత స్టార్ బాక్సర్‌గా రూపాంతరం చెందాడు. అతను 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, ఆసియా క్రీడల్లో స్వర్ణం, ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించాడు. ఆర్థిక అవకతవకల కారణంగా గతేడాది ‘ఐబా’పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సస్పెన్షన్ విధించింది. అనంతరం ఐఓసీ ప్రపంచ బాక్సింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు బాక్సింగ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. బాక్సింగ్ టాస్క్‌ఫోర్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ అమిత్ నంబర్‌వన్‌గా నిలిచాడు. తాజాగా ‘ఐబా’ ప్రకటించిన అధికారిక ర్యాంకింగ్స్‌లోనూ అమిత్ ‘టాప్’లో నిలువడం విశేషం. మొత్తం తొమ్మిది వెయిట్ కేటగిరీలకుగాను నాలుగింటిలో భారత బాక్సర్లు టాప్–10లో ఉన్నారు. దీపక్ (49 కేజీలు) ఆరో ర్యాంక్‌లో, కవీందర్ బిష్త్ (56 కేజీలు) నాలుగో ర్యాంక్‌లో, మనీశ్ కౌశిక్ (64 కేజీలు) ఆరో ర్యాంక్‌లో నిలిచారు. గత ఏడాది జనవరిలో ‘ఐబా’ ప్రకటించిన ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌లో ఉన్న భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు) తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయింది. ఇదే విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 21వ ర్యాంక్‌లో నిలిచింది. -
బాక్సర్ సుమీత్‌పై ఏడాది నిషేదం
న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ మాజీ రజత పతక విజేత, భారత బాక్సర్ సుమీత్ సాంగ్వాన్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) గురువారం ఏడాది నిషేధాన్ని విధించింది. గత అక్టోబర్ నెలలో అతని నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా... అందులో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో ఉన్న ‘ఎసిటజొలమైడ్’ ఉన్నట్లు తేలింది. దీంతో అతనిపై నిషేధం విధిస్తున్నట్లు ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ప్రకటించారు. దీంతో 91 కేజీల విభాగంలో ఒలింపిక్స్ అర్హత పోటీలకు నిర్వహించే ట్రయల్స్‌కు సుమీత్ దూరమయ్యాడు. -
డోపీలు సుమీత్, రవి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత బాక్సర్ సుమీత్ సాంగ్వాన్... షూటర్ రవి కుమార్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డారు. వీరిద్దరు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత ఔషధాల జాబితాలో ఉన్నవాటిని వినియోగించినట్టు డోప్ పరీక్షల్లో తేలింది. సుమీత్ 2017 ఆసియా ఛాంపియన్ షిప్ లో రజతం గెలిచాడు. సుమీత్ ఎక్టెజోలామైడ్ ఉత్ప్రేరకం వాడినట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తెలిపింది. గత ఏడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకాలు గెలిచిన షూటర్ రవి కుమార్ ప్రొప్రానోలోల్ ట్యాబ్లెట్‌ను వాడినట్లు డోప్ పరీక్షలో తేలింది. మైగ్రేన్ తలనొప్పి వచ్చినపుడు డాక్టర్ వద్దకు వెళ్లగా అతను ఈ ట్యాబ్లెట్ రాసిచ్చాడని రవి తెలిపాడు. -
సిల్వర్ పంచ్
ఫైనల్ స్కోరు 0–5... దీనిని చూస్తే ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ తుది పోరు ఏకపక్షంగా సాగిందనిపిస్తుంది. కానీ మ్యాచ్‌ను చూస్తే అది వాస్తవం అనిపించదు... భారత స్టార్ తుదికంటా పోరాడాడు, ఆత్మవిశ్వాసంతో ప్రత్యరి్థపై దూకుడు ప్రదర్శించాడు, తనదైన శైలిలో చురుకైన పంచ్‌లు విసిరి పాయింట్లు సాధించాడు...అయితే అవన్నీ స్వర్ణం నెగ్గేందుకు సరిపోలేదు...ఐదుగురు జడ్జీలు ఇచ్చిన పాయింట్ల మధ్య పెద్దగా అంతరం లేకున్నా వారి దృష్టిలో అమిత్ విజేత కాలేకపోయాడు. చివరకు రజత పతకం సాధించి ఈ ఘనత అందుకున్న తొలి భారతీయుడిగా సగర్వంగా మెగా టోర్నీని ముగించాడు. ఎకటెరిన్‌బర్గ్ (రష్యా): వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత బాక్సర్‌గా నిలవాలన్న అమిత్ పంఘాల్ కల ఫలించలేదు. అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరిన అతను తుదిపోరులో ఓడి రెండో స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. శనివారం జరిగిన 52 కేజీల విభాగం ఫైనల్లో షఖోబిదిన్ జొయిరొవ్ (ఉజ్బెకిస్తాన్) 30–27, 30–27, 29–28, 29–28, 29–28 (5–0) స్కోరుతో అమిత్‌ను ఓడించాడు. అయితే అమిత్ సాధించిన ఈ ఘనత చిన్నదేమీ కాదు. ఇప్పటి వరకు విశ్వ వేదికపై కాంస్య పతకాలకే భారత బాక్సర్లు పరిమితం కాగా... 24 ఏళ్ల అమిత్ తొలిసారి దేశానికి రజత పతకం అందించాడు. ఈ టోర్నీలో శుక్రవారం సెమీస్‌లో ఓడిన మనీశ్ కౌశిక్‌కు దక్కిన కాంస్యంతో కలిపి భారత్ తొలిసారి ఒకే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించడం విశేషం. ఫైనల్లోనూ అమిత్‌కు తనకంటే ఎంతో పొడగరి అయిన బాక్సర్ ఎదురయ్యాడు. తొలి మూడు నిమిషాల్లో ఇద్దరు బాక్సర్లు జాగ్రత్తగా ఆడుతూ దూకుడుకు అవకాశం ఇవ్వలేదు. రెండో రౌండ్లో అమిత్ తన ప్రత్యరి్థపై ఆధిక్యం ప్రదర్శించే ప్రయత్నం చేసినా షఖోబిదిన్ వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. అమిత్ కొట్టిన కొన్ని పంచ్‌లు సరైన దిశలో వెళ్లకపోవడంతో తగిన పాయిం ట్లు దక్కలేదు. మూడో రౌండ్లో ఇద్దరూ ఒకరిపై మరొకరు విరుచుకు పడ్డారు. భారత బాక్సర్ చెలరేగి ఉజ్బెక్ బాక్సర్‌ను పదే పదే బలంగా దెబ్బకొట్టినా... చివరకు స్కోరింగ్ పంచ్‌లు మాత్రం షఖోబిదిన్వే అయ్యాయి. రిఫరీ ఓటమి ప్రకటనతో అమిత్ నిరాశగా వెనుదిరిగాడు. మరో మాటకు తావు లేకుండా నా కెరీర్లో ఇదే అతి పెద్ద విజయం. ఈ పతకం దేశానికి అంకితమిస్తున్నా. ఈ రోజు నా పంచ్లలో కొంత పదును లోపించిందేమో. ప్రత్యర్థి చాలా కాలంగా ఇదే కేటగిరీలో ఆడుతుండటం వల్ల ఆ అనుభవం అతనికి పనికొచ్చింది. కెరీర్ ఆరంభంలో నా ప్రవర్తన పట్ల కోచ్‌లు విసుగు చెందిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు చాలా మారిపోయాను. ఇంకా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయించమని వారిని సతాయిస్తున్నా. దాని ఫలితం ఇక్కడ కనిపించింది. నేను ఎన్ని తప్పులు చేసినా నాపై నమ్మకాన్ని కోల్పోని కోచ్‌లకు కృతజ్ఞతలు.’ –అమిత్ -
అమెరికాలో విజేందర్ అరంగేట్రం ఖరారు
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ అమెరికన్ ఫ్రొఫెషనల్ సర్క్యూట్ బరిలోకి దిగేందుకు రంగం సిద్ధమైంది. ఇంకా ప్రత్యర్థి ఖరారు కానప్పటికీ వచ్చే నెల 12న అక్కడి స్టేపుల్స్ సెంటర్లో అతని పోరు జరుగనుంది. ఎనిమిది రౌండ్ల పాటు ఈ ప్రొఫెషనల్ బౌట్ జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఇందుకోసం బాక్సింగ్‌లో కోవిదుడైన విశిష్ట కోచ్ ఫ్రెడ్డీ రోచ్ వద్ద భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ శిక్షణ తీసుకుంటున్నాడు. గతంలో రోచ్ బాక్సింగ్ దిగ్గజాలు మైక్ టైసన్, పకియావోలకు శిక్షణ ఇచ్చారు. ప్రొఫెషనల్ కెరీర్లో విజేందర్ అజేయంగా కొనసాగుతున్నాడు. ఇప్పటిదాకా 10 బౌట్లలో విజయం సాధించిన భారత బాక్సర్ ఇటీవల లాస్ ఏంజిల్స్‌లోని ది వైల్డ్‌కార్డ్ బాక్సింగ్ క్లబ్లో శిక్షణ మొదలుపెట్టాడు. 2012లో అంతర్జాతీయ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ (ఐబీహెచ్ఓఎఫ్)లోకి ఎంపికైన రోచ్... విజేందర్ పంచ్‌లకు పదును పెంచుతున్నాడు. 32 ఏళ్ల సుదీర్ఘ కోచింగ్ కెరీర్లో రోచ్.. విజయవంతమైన శిక్షకుడిగా ఘనతకెక్కాడు. -
‘పసిడి’ పోరుకు బాక్సర్ అమిత్
భారత బాక్సర్ అమిత్ పంఘాల్ (49 కేజీలు) ఆసియా క్రీడల ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీస్‌లో అమిత్ 3–2తో కార్లో పాలమ్ (ఫిలిప్పీన్స్)పై గెలిచి పసిడి పోరుకు అర్హత సాధించాడు. ఈ ఏషియాడ్‌లో భారత్ తరఫున ఫైనల్ చేరిన ఏకైక బాక్సర్‌గా నిలిచాడు. నేడు జరిగే ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ దుస్మతోవ్ హసన్‌బాయ్ (ఉజ్బెకిస్తాన్)తో అమిత్ తలపడతాడు. మరో భారత బాక్సర్ వికాస్ కృషన్ (75 కేజీలు) ఎడమ కంటి గాయం కారణంగా సెమీస్ బరిలోకి దిగలేదు. దీంతో అతనికి కాంస్య పతకం ఖాయమైంది. వికాస్ శుక్రవారం సెమీఫైనల్లో అబిల్‌ఖాన్ (కజకిస్తాన్)తో తలపడాల్సి ఉం డగా... గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను పోటీ నుంచి తప్పుకున్నాడు. ఈ పతకంతో వికాస్ వరుసగా మూడు ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారతీయ బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. -
ఫైనల్లో హుస్సాముద్దీన్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల 56 కేజీల విభాగం సెమీఫైనల్లో బల్గేరియా బక్సార్ స్టీఫెన్ ఇవనోవ్‌పై హస్సాముద్దీన్ గెలుపొందాడు. ఫైనల్లో ఉక్రెయిన్‌కి చెందిన మైకోలా బుత్సెన్‌కోతో హుస్సాముద్దీన్ తలపడనున్నాడు. మరోవైపు భారత్‌కే చెందిన అమిత్ పన్‌గల్ (49 కేజీలు), మీనా కుమారి (54 కేజీలు) సెమీఫైనల్స్‌లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. -
స్వర్ణమే నా టార్గెట్: భారత బాక్సర్
రియో డిజెనీరో: ఒలింపిక్స్‌లో పతకం కోసం మొహం వాచి ఎదురుచూస్తున్న భారత క్రీడాభిమానుల్లో కొద్దికొద్దిగా కాంతిరేఖలు వికసిస్తున్నాయి. ఇప్పటికే మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న జోడీ సెమీస్‌లోకి ఎంటరైంది. వీరికి మరో విజయం దూరంలో ఒలింపిక్స్ పతకం ఊరిస్తోంది. ఈ జోడీ ఫైనల్లోకి వెళితే.. పతకం ఖాయం. ఒకవేళ ఓడినా కాంస్యం దక్కే చాన్స్ ఉంది. ఇక భారత బాక్సర్ వికాస్ కిషన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అతడు ఇంకో విజయం సాధిస్తే భారత్ ఖాతాలో పతకం చేరుతుంది. 75 కేజీల మిడిల్ వెయిట్ బౌట్లో ప్రీక్వార్టర్ ఫైనల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన వికాస్.. టర్కీకి చెందిన ఒండర్ సిపాల్పై అలవోకగా విజయం సాధించాడు. 3-0 తేడాతో సంపూర్ణ విజయాన్ని సొంతం చేసుకున్న వికాస్.. భారత్ తరఫున స్వర్ణపతకాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం గెలువాలనే తాను కోరుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశాడు. ఉజ్బెకిస్థాన్ బాక్సర్ బెక్టెమిర్ మెలికుజీవ్తో బౌట్లో విజయం సాధిస్తే తాను తప్పకుండా ఒలింపిక్స్ స్వర్ణంతో భారత్‌లో అడుగుపెడతానని ఆయన పేర్కొన్నాడు. 'మెలికుజీవ్ గ్రూప్ విభాగంలో చాలా టఫ్‌గా కనిపించాడు. క్వార్టర్ ఫైనల్లో నేను కనుక అతన్ని ఓడిస్తే స్వర్ణంతో భారత్‌లో అడుగుపెడతాను. నేను చెప్పిన ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రజతం కానీ, కాంస్యంతో కానీ నేను సరిపెట్టుకోను. ఒకవేళ ఉత్త చేతులతో వస్తా లేదా స్వర్ణపతకంతో దేశంలో అడుగుపెడతా. అతన్ని ఓడిస్తే స్వర్ణాన్ని గెలువడం ఖాయం' అని 24 ఏళ్ల వికాస్ ధీమా వ్యక్తం చేశాడు. మరీ వికాస్ కచ్చితంగా గెలువాలని కోరుకుంటూ మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం! -
‘రియో’కు చేరువలో మనోజ్, సుమిత్
బాకు (అజర్బైజాన్): మరో విజయం సాధిస్తే భారత బాక్సర్లు మనోజ్ కుమార్ (64 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు) రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో ఈ ఇద్దరు బాక్సర్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మనోజ్ 2-1తో ఇస్మెతోవ్ ఐరిన్ స్మెతోవ్ (బల్గేరియా)ను ఓడించగా... సుమిత్ 3-0తో సందాగ్సురెన్ ఎర్దెనెబాయెర్ (మంగోలియా)పై విజయం సాధించాడు. 75 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన వికాస్ కృషన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాడు. 49 కేజీల విభాగంలో దేవేంద్రో సింగ్ సెమీఫైనల్‌కు చేరాడు. ఫైనల్‌కు చేరితేనే దేవేంద్రోకు రియో బెర్త్ ఖాయమవుతుంది. -
'అతడి బొక్కలు విరగ్గొట్టి భారత్ కు పంపిస్తా'
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన ప్రొఫెషనల్ కెరీర్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. ఆరో బౌట్ కు సిద్ధంగా ఉన్న విజేందర్ తన చివరి బౌట్ లో ఫ్రాన్స్‌కు చెందిన మటియోజ్ రోయర్ పై విజయం సాధించాడు. దీంతో అతను వరుసగా ఐదో టెక్నికల్ నాకౌట్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆటగాడయ్యాడు. తొలిసారి ఆరు రౌండ్ల బౌట్లో పాల్గొన్న విజేందర్ మరో రౌండ్ మిగిలి ఉండగానే విజేతగా నిలిచాడు. . ఆరో బౌట్ లో పోలాండ్ కు చెందిన ఆండ్రిజెజ్ సోల్డ్రాతో పోటీ పడనున్నాడు. ఆరో రౌండ్ మాత్రం అంత సులువుకాదంటూ అతడి ప్రత్యర్థి సవాలు చేస్తున్నాడు. బోల్టాన్ లోని ప్రీమియర్ సూట్ మాక్రాన్ స్టేడియంలో సోల్డ్రాతో తలపడేందుకు కసరత్తులు చేస్తున్నాడు. మొత్తం 14 రౌండ్లు ఆడిన విజేందర్ వరుసగా ఐదు విజయాలను సాధించాడు. ప్రత్యర్థి సోల్డ్రా మ్యాచ్ వీడియోలు చూశాను. ఆరో బౌట్ గెలవాలని తాను చాలా ఆసక్తిగా ఉన్నానని చెబుతండగా, తనలాంటి ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ కు ఇంతకుముందు ఎదురుకాలేదని బౌట్ రోజు తన సత్తా చూపిస్తానంటూ సవాల్ విసిరాడు. విజేందర్ బొక్కలు విరగ్గొట్టి భారత్ కు పంపిస్తానంటూ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీంతో మే 13న జరగనున్న వీరి పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది. -
గౌరవ్ కు వెండి పతకం
అపియా: కామన్వెల్త్ యూత్ గేమ్స్ లో భారత్ బాక్సర్ గౌరవ్ సోలంకి- వెండి పతకం గెల్చుకున్నాడు. 52 కిలోల విభాగంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా బాక్సర్ జాక్ బొవెన్ చేతిలో 0-3 తేడాతో పరాజయం పాలయ్యాడు. దీంతో అతడికి వెండి పతకం దక్కింది. ఈ టోర్నిలో భారత్ తరపున గౌరవ్ సోలంకి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఇదే విభాగంలో 49 కిలోల కేటగిరిలో భీంచంద్ సింగ్, 64 కిలోల విభాగంలో ప్రజ్ఞాన్ చౌహాన్ సెమీస్ లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. బాక్సింగ్ లో భారత్ కు మొత్తం మూడు పతకాలు దక్కాయి. -
కాంస్యంతో సరిపెట్టుకున్న సరిత, రాణి
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత మహిళా బాక్సర్లు ఎల్. సరితా దేవి, పూజా రాణి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. 60 కేజీల విభాగంలో మంగళవారం జరిగిన సెమీస్ లో కొరియా బాక్సర్ జినా పార్క్ చేతిలో సరితా దేవి పరాజయం పాలయింది. మరో భారత మహిళా బాక్సర్ పూజా రాణి కూడా 75 కేజీల విభాగం సెమీస్‌లో లి కియాన్ (చైనా) చేతిలో పూజ ఓడిపోయింది. సెమీ ఫైనల్లో ఓటమి పాలవడంతో సరితా దేవి, పూజా రాణిలకు కాంస్య పతకాలు దక్కాయి.