భారత ప్రొఫెషనల్ బాక్సర్ మన్‌దీప్ జాంగ్రా అంతర్జాతీయ బాక్సింగ్ వేదికపై అపూర్వ విజయం సాధించాడు. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (డబ్ల్యూబీఎఫ్) సూపర్ ఫెదర్ వెయిట్‌లో మన్‌దీప్ ప్రపంచ చాంపియన్‌గా ఆవిర్భవించాడు. కేమన్ ఐలాండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్ టైటిల్ పోరులో బ్రిటన్ బాక్సర్ కొనొర్ మెకింటోష్‌ను మన్‌దీప్ కంగుతినిపించాడు. 31 ఏళ్ల ఈ హరియాణా స్టార్ పంచ్ పవర్ ముందు బ్రిటన్ ప్రత్యర్థి నిలువలేకపోయాడు.
ఆరంభ రౌండ్ నుంచి ప్రత్యర్థిపై ముష్టిఘాతాలు కురిపించిన భారత బాక్సర్ మొత్తం పది రౌండ్ల పాటు మెకింటోష్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగాడు. రౌండ్ రౌండ్‌కు తన పంచ్ పదును పెరిగిపోవడంతో ప్రత్యర్థికి ఎటు పాలుపోలేదు. అమెచ్యూర్ సర్క్యూట్‌లో 12 సార్లు రింగ్‌లోకి దిగితే కేవలం ఒకే ఒక్కసారి ఓడిన మన్‌దీప్ 11 సార్లు ఘనవిజయం సాధించాడు.
కాగా2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో జాంగ్రా రజత పతకం గెలిచాడు. మాజీ ఒలింపిక్ రజత పతక విజేత రాయ్ జోన్స్ జూనియర్... మన్‌దీప్‌ను చాంపియన్‌గా మలిచాడు. ‘నా కెరీర్లోనే ఇదే అతిపెద్ద విజయం. ఎన్నో ఏళ్లపాటు కఠోరంగా శ్రమించినందుకు దక్కిన ఫలితమిది. భారత ప్రతిష్ట పెంచిన విజయమిది. నన్ను ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు’ అని మన్‌దీప్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment