ఫైనల్ స్కోరు 0–5... దీనిని చూస్తే ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ తుది పోరు ఏకపక్షంగా సాగిందనిపిస్తుంది. కానీ మ్యాచ్‌ను చూస్తే అది వాస్తవం అనిపించదు... భారత స్టార్ తుదికంటా పోరాడాడు, ఆత్మవిశ్వాసంతో ప్రత్యరి్థపై దూకుడు ప్రదర్శించాడు, తనదైన శైలిలో చురుకైన పంచ్‌లు విసిరి పాయింట్లు సాధించాడు...అయితే అవన్నీ స్వర్ణం నెగ్గేందుకు సరిపోలేదు...ఐదుగురు జడ్జీలు ఇచ్చిన పాయింట్ల మధ్య పెద్దగా అంతరం లేకున్నా వారి దృష్టిలో అమిత్ విజేత కాలేకపోయాడు. చివరకు రజత పతకం సాధించి ఈ ఘనత అందుకున్న తొలి భారతీయుడిగా సగర్వంగా మెగా టోర్నీని ముగించాడు.
ఎకటెరిన్‌బర్గ్ (రష్యా): వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత బాక్సర్‌గా నిలవాలన్న అమిత్ పంఘాల్ కల ఫలించలేదు. అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరిన అతను తుదిపోరులో ఓడి రెండో స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. శనివారం జరిగిన 52 కేజీల విభాగం ఫైనల్లో షఖోబిదిన్ జొయిరొవ్ (ఉజ్బెకిస్తాన్) 30–27, 30–27, 29–28, 29–28, 29–28 (5–0) స్కోరుతో అమిత్‌ను ఓడించాడు. అయితే అమిత్ సాధించిన ఈ ఘనత చిన్నదేమీ కాదు. ఇప్పటి వరకు విశ్వ వేదికపై కాంస్య పతకాలకే భారత బాక్సర్లు పరిమితం కాగా... 24 ఏళ్ల అమిత్ తొలిసారి దేశానికి రజత పతకం అందించాడు. ఈ టోర్నీలో శుక్రవారం సెమీస్‌లో ఓడిన మనీశ్ కౌశిక్‌కు దక్కిన కాంస్యంతో కలిపి భారత్ తొలిసారి ఒకే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించడం విశేషం.
ఫైనల్లోనూ అమిత్‌కు తనకంటే ఎంతో పొడగరి అయిన బాక్సర్ ఎదురయ్యాడు. తొలి మూడు నిమిషాల్లో ఇద్దరు బాక్సర్లు జాగ్రత్తగా ఆడుతూ దూకుడుకు అవకాశం ఇవ్వలేదు. రెండో రౌండ్‌లో అమిత్ తన ప్రత్యరి్థపై ఆధిక్యం ప్రదర్శించే ప్రయత్నం చేసినా షఖోబిదిన్ వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. అమిత్ కొట్టిన కొన్ని పంచ్‌లు సరైన దిశలో వెళ్లకపోవడంతో తగిన పాయిం ట్లు దక్కలేదు. మూడో రౌండ్‌లో ఇద్దరూ ఒకరిపై మరొకరు విరుచుకు పడ్డారు. భారత బాక్సర్ చెలరేగి ఉజ్బెక్ బాక్సర్‌ను పదే పదే బలంగా దెబ్బకొట్టినా... చివరకు స్కోరింగ్ పంచ్‌లు మాత్రం షఖోబిదిన్‌వే అయ్యాయి. రిఫరీ ఓటమి ప్రకటనతో అమిత్ నిరాశగా వెనుదిరిగాడు.
మరో మాటకు తావు లేకుండా నా కెరీర్‌లో ఇదే అతి పెద్ద విజయం. ఈ పతకం దేశానికి అంకితమిస్తున్నా. ఈ రోజు నా పంచ్‌లలో కొంత పదును లోపించిందేమో. ప్రత్యర్థి చాలా కాలంగా ఇదే కేటగిరీలో ఆడుతుండటం వల్ల ఆ అనుభవం అతనికి పనికొచ్చింది. కెరీర్ ఆరంభంలో నా ప్రవర్తన పట్ల కోచ్‌లు విసుగు చెందిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు చాలా మారిపోయాను. ఇంకా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయించమని వారిని సతాయిస్తున్నా. దాని ఫలితం ఇక్కడ కనిపించింది. నేను ఎన్ని తప్పులు చేసినా నాపై నమ్మకాన్ని కోల్పోని కోచ్‌లకు కృతజ్ఞతలు.’
–అమిత్
Comments
Please login to add a commentAdd a comment