న్యూఢిల్లీ: ఏడేళ్ల క్రితంనాటి డోపింగ్ ఉదంతంతో ‘అర్జున’ పురస్కారానికి దూరమైన భారత బాక్సర్ అమిత్ పంఘాల్ తన కోచ్‌ను గుర్తించాలని కోరుతున్నాడు. రష్యాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో అమిత్ 52 కేజీల కేటగిరీలో రజతం నెగ్గాడు. దీంతో మెగా ఈవెంట్ చరిత్రలో రజతం నెగ్గిన తొలి భారత బాక్సర్‌గా అతను ఘనతకెక్కాడు. ఈ ఏడాది అర్జున పరిశీలనలో ఉన్నప్పటికీ 2012లో డోపీ అయినందుకు అతడికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో అతను మాట్లాడుతూ ‘నా అవార్డుల గురించి నేను పట్టించుకోవడం లేదు. కానీ నా కోచ్ అనిల్ ధన్కర్‌ను గుర్తించాలని అభ్యర్థిస్తున్నా. ఆటగాళ్ల గురువులకు ఇచ్చే ‘ద్రోణాచార్య’ అవార్డుకు నా కోచ్‌ను ఎంపిక చేయాలని కోరుతున్నా.
నేను బాక్సింగ్ నేర్చుకుంటున్న తొలినాళ్లలో ఆయనే నా ప్రతిభను గుర్తించి, నా ప్రదర్శనకు మెరుగులు దిద్దారు. ధన్కరే లేకుంటే నేను పతకాలు గెలిచే బాక్సర్‌గా ఎదిగేవాణ్నే కాదు’ అని వివరించాడు. ఆయనకు పురస్కారం దక్కితే తనకు దక్కినట్లే అని చెప్పుకొచ్చాడు. 45 ఏళ్ల అనిల్ ధన్కర్ ఇంతవరకు జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించలేదు కానీ... ఆయన బరిలో ఉన్న రోజుల్లో జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. తన శిష్యుడైన అమిత్ గతేడాది ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించాడు. భారత బాక్సింగ్ సమాఖ్య కూడా అతని పేరును అర్జున కోసం క్రీడాశాఖకు యేటా సిఫార్సు చేస్తూనే ఉంది. కానీ ఆ ఒక్క మరకతో పురస్కారం దక్కడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment