Dronacharya Award
-
హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ‘ఖేల్‌రత్న’ అవార్డు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటనకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 12 మంది సభ్యుల సెలక్షన్ కమిటీ అర్జున, ఖేల్‌రత్న, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ తదితర అవార్డులకు సంబంధించిన నామినేషన్ల జాబితాను ప్రభుత్వానికి అందించింది. మార్పులు లేకుండా దాదాపు ఇదే జాబితా ఖాయమయ్యే అవకాశం ఉంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేరును ‘ఖేల్‌రత్న’ పేరు కోసం ప్రతిపాదించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన 28 ఏళ్ల హర్మన్‌ప్రీత్... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో భారత్ పతకాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. హర్మన్‌తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ‘ఖేల్‌రత్న’ కోసం సిఫారసు చేసింది. పారిస్ పారాలింపిక్స్ హైజంప్ (టి64 క్లాస్)లో ప్రవీణ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు సాధించిన షూటర్ మనూ భాకర్ పేరు ఖేల్‌రత్న జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న ప్లేయర్‌గా మరో చర్చ లేకుండా ‘ఖేల్ రత్న’ అవార్డుకు ఆమె అర్హురాలు. అయితే మనూ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని క్రీడా మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. దానిని మనూ తండ్రి రామ్‌కిషన్ ఖండించారు. తాను సరైన ఫార్మాట్లోనే అప్లికేషన్ అందించామని స్పష్టం చేశారు. ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోయినా ... ప్రదర్శనను బట్టి అవార్డుకు ఎంపిక చేసే అధికారం జ్యూరీకి ఉంది. కాబట్టి మనూ సాధించిన ‘డబుల్ ఒలింపిక్ మెడల్’ ఘనతను బట్టి చూస్తే ఆలస్యంగానైనా ఆమె పేరు ఈ జాబితాలో చేరవచ్చు. ‘అర్జున’ జాబితాలో 30 మంది కమిటీ ప్రతిపాదించిన ‘అర్జున’ అవార్డీల జాబితాలో 13 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, మరో 17 మంది పారా ఆటగాళ్లు ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న అమన్ (రెజ్లింగ్), సరబ్జోత్, స్వప్నిల్ కుసాలే (షూటింగ్) పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పారా ఆటగాళ్లలో తెలంగాణకు చెందిన దీప్తి జివాంజికి ‘అర్జున’ దక్కనుండటం విశేషం. వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి పారిస్ పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు (టి20)లో కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు ఆసియా పారా క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో ఆమె ఖాతాలో రెండు స్వర్ణాలు ఉన్నాయి. పారా షూటింగ్ కోచ్ సుభాష్ రాణా పేరును ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం కమిటీ సిఫారసు చేసింది. ఈ జాబితాలో మరో కోచ్ అమిత్ కుమార్ సరోహా పేరు కూడా ఉండటం చర్చకు దారి తీసింది. అతను ఎప్పుడూ అధికారికంగా కోచ్‌గా పని చేయలేదని... పైగా ఇటీవల పారిస్‌లోనూ ఆటగాడిగా బరిలోకి దిగాడు కాబట్టి ద్రోణాచార్య అవార్డుకు అర్హుడు కాదని విమర్శలు వస్తున్నాయి. -
టాప్–10లో నిలవాలి
న్యూఢిల్లీ: 2028 ఒలింపిక్ క్రీడల్లో భారత్ పతకాల జాబితాలో టాప్–10లో నిలుస్తుందనే నమ్మకముందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రానున్న కాలంలో మన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికల్లో కొత్త చరిత్ర లిఖిస్తారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మానసిక శక్తితో ఆటగాళ్లు కోవిడ్–19ను దీటుగా ఎదుర్కోవాలని ఆకాంక్షించారు. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ 115వ జయంతి వేడుకల సందర్భంగా ఆయనను కోవింద్ స్మరించుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జాతీయ క్రీడా పురస్కారాలను అందజేశారు. ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికైన ఆటగాళ్లను, కోచ్‌లను అభినందించారు. క్రీడాకారులంతా అద్వితీయ ప్రదర్శనలతో భారతీయులందరికీ మరపురాని మధుర స్మృతులను అందించారని కొనియాడారు. ‘వర్చువల్’గా అవార్డుల స్వీకరణ 44 ఏళ్ల ఈ అవార్డుల చరిత్రలో కరోనా కారణంగా కొత్త సంప్రదాయానికి తెర తీయాల్సి వచ్చింది. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో జరగాల్సిన ఈ వేడుకలు సాంకేతిక హంగులతో ముందుకొచ్చాయి. వర్చువల్ (ఆన్లైన్) పద్ధతిలో అలరించాయి. దీనికి దేశంలోని 11 భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రాలు వేదికలుగా నిలిచాయి. రాష్ట్రపతి భవన్‌తో అనుసంధానమైన సాయ్ కేంద్రాలు అత్యంత సురక్షిత వాతావరణంలో వేడుకల్ని నిర్వహించాయి. మొత్తం 74 (5 ఖేల్‌రత్న, 27 అర్జున, 13 ద్రోణాచార్య, 15 ధ్యాన్‌చంద్ ) మంది ఈ ఏడాది జాతీయ అవార్డులను గెలుచుకోగా శనివారం 60 మంది ఈ పురస్కారాలను స్వీకరించారు. ఖేల్‌రత్నకు ఎంపికైన మహిళా హాకీ ప్లేయర్ రాణి రాంపాల్, పారాలింపియన్ తంగవేలు సాయ్ పుణే కేంద్రం నుంచి... టీటీ ప్లేయర్ మనికా బాత్రా బెంగళూరు నుంచి ఈ అవార్డులను అందుకున్నారు. దుబాయ్‌లో ఉండటంతో రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, కరోనా సోకడంతో వినేశ్ ఫొగాట్, ఏపీ బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ తమ అవార్డులను అందుకోలేదు. భారీగా పెరిగిన ప్రైజ్‌మనీ అవార్డు విజేతలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మరో తీపి కబురు అందించింది. జాతీయ క్రీడా అవార్డుల ప్రైజ్‌మనీ భారీగా పెంచినట్లు మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే దీనిని అమల్లోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. నూతన విధానం ప్రకారం ఖేల్‌రత్న పురస్కారానికి రూ. 25 లక్షల ప్రైజ్‌మనీగా చెల్లించనున్నారు. గతంలో ఇది రూ. 7.5 లక్షలుగా ఉంది. దీనితో పాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డుల ప్రైజ్‌మనీలో కూడా మార్పులు చేశారు. గతేడాది వరకు ఈ అవార్డులకు రూ. 5 లక్షలు చొప్పున చెల్లిస్తుండగా... ఈ ఏడాది నుంచి అర్జున, ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం గ్రహీతలకు రూ. 15 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. ద్రోణాచార్య (రెగ్యులర్), ధ్యాన్‌చంద్ అవార్డు విజేతలు రూ. 10 లక్షల చొప్పున అందుకోనున్నారు. దీనిపై మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ ‘చివరిసారిగా 2008లో ప్రైజ్‌మనీలో మార్పులు జరిగాయి. ప్రతీ పదేళ్లకోసారి ఈ మొత్తాన్ని సమీక్షించాల్సిన అవసరముంది. ప్రతీ రంగంలోని నిపుణుల సంపాదనలో ఏటికేడు వృద్ధి ఉంటున్నప్పుడు క్రీడాకారులకు ఎందుకు ఉండకూడదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఈసారి ఎక్కువ సంఖ్యలో అవార్డు విజేతలను ఎంపిక చేయడం పట్ల వస్తోన్న విమర్శలను ఆయన తప్పి కొట్టారు. ‘ప్రపంచ వేదికపై మన అథ్లెట్ల ప్రదర్శన గణనీయంగా మెరుగైంది. అందుకే వారి కృషికి గుర్తింపునిచ్చాం. అథ్లెట్ల ఘనతల్ని ప్రభుత్వం గుర్తించకపోతే వారిని నిరాశపర్చినట్లే. గత నిర్ణయాలతో తాజా వాటిని పోల్చకూడదు’ అని ఆయన స్పష్టం చేశారు. -
నాకేమోగానీ... నా కోచ్‌కు ఇవ్వండి
న్యూఢిల్లీ: ఏడేళ్ల క్రితంనాటి డోపింగ్ ఉదంతంతో ‘అర్జున’ పురస్కారానికి దూరమైన భారత బాక్సర్ అమిత్ పంఘాల్ తన కోచ్‌ను గుర్తించాలని కోరుతున్నాడు. రష్యాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో అమిత్ 52 కేజీల కేటగిరీలో రజతం నెగ్గాడు. దీంతో మెగా ఈవెంట్ చరిత్రలో రజతం నెగ్గిన తొలి భారత బాక్సర్‌గా అతను ఘనతకెక్కాడు. ఈ ఏడాది అర్జున పరిశీలనలో ఉన్నప్పటికీ 2012లో డోపీ అయినందుకు అతడికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో అతను మాట్లాడుతూ ‘నా అవార్డుల గురించి నేను పట్టించుకోవడం లేదు. కానీ నా కోచ్ అనిల్ ధన్కర్ను గుర్తించాలని అభ్యర్థిస్తున్నా. ఆటగాళ్ల గురువులకు ఇచ్చే ‘ద్రోణాచార్య’ అవార్డుకు నా కోచ్‌ను ఎంపిక చేయాలని కోరుతున్నా. నేను బాక్సింగ్ నేర్చుకుంటున్న తొలినాళ్లలో ఆయనే నా ప్రతిభను గుర్తించి, నా ప్రదర్శనకు మెరుగులు దిద్దారు. ధన్కరే లేకుంటే నేను పతకాలు గెలిచే బాక్సర్‌గా ఎదిగేవాణ్నే కాదు’ అని వివరించాడు. ఆయనకు పురస్కారం దక్కితే తనకు దక్కినట్లే అని చెప్పుకొచ్చాడు. 45 ఏళ్ల అనిల్ ధన్కర్ ఇంతవరకు జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించలేదు కానీ... ఆయన బరిలో ఉన్న రోజుల్లో జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. తన శిష్యుడైన అమిత్ గతేడాది ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించాడు. భారత బాక్సింగ్ సమాఖ్య కూడా అతని పేరును అర్జున కోసం క్రీడాశాఖకు యేటా సిఫార్సు చేస్తూనే ఉంది. కానీ ఆ ఒక్క మరకతో పురస్కారం దక్కడం లేదు. -
అర్జున జాబితాలో రవీంద్ర జడేజా
గోపీచంద్ అకాడమీ ఆణిముత్యం, తెలుగుతేజం సాయిప్రణీత్‌కు భారత ప్రభుత్వం నుంచి ఘనమైన గుర్తింపు లభించనుంది. యేటికేడు తన రాకెట్ పదును పెంచుకుంటున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్‌కు ‘అర్జున’ అవార్డు ఖాయమైంది. పారాలింపియన్ దీప మాలిక్ రెండో ‘ఖేల్‌రత్న’గా ఎంపిక కాగా... బ్యాడ్మింటన్ గురువు విమల్ కుమార్ ద్రోణాచార్యుడయ్యాడు. క్రికెటర్లు రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ అర్జునలుగా నిలిచారు. అయితే ఎప్పటిలాగే చిన్నపాటి అసంతృప్తుల సమేతంగానే ఈ సారి కూడా క్రీడా పురస్కారాల జాబితా వెలువడింది. న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారానికి మరో తెలుగు షట్లర్ ఎంపికయ్యాడు. భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంటాబయటా నిలకడగా రాణిస్తున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్ ప్రతిభను అవార్డుల కమిటీ గుర్తించింది. 2017లో ప్రణీత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నిలకడైన ప్రదర్శనతో సింగపూర్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్లలో టైటిల్స్ గెలిచాడు. సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. పారాలింపియన్ దీపా మాలిక్‌కు భారత అత్యున్నత క్రీడాపురస్కారం దక్కనుంది. రియో పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన ఆమెను ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు నామినేట్ చేశారు. ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆ అవార్డుకు ఎంపికవగా ఈ ఏడాది సంయుక్తంగా ఇద్దరికి ఆ పురస్కారం లభించనుంది. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్‌లు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని అవార్డుల కమిటీ 19 మందిని ‘అర్జున’కు, ఇద్దరిని ‘ఖేల్‌రత్న’కు ఎంపిక చేసింది. మరో ముగ్గురిని ‘ద్రోణాచార్య’కు నామినేట్ చేసింది. దీపకు మూడో పురస్కారం పారా అథ్లెట్ దీప 2012లో అర్జున అవార్డు అందుకుంది. రెండేళ్ల క్రితం 2017లో భారత పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని దక్కించుకుంది. వరుసగా మూడు పారా ఆసియా గేమ్స్ (2010, 2014, 2018)లో పతకాలు గెలిచిన భారత మహిళా అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. జకార్తా (2018) ఈవెంట్లో ఆమె డిస్కస్ త్రో, జావెలిన్ త్రోలో కాంస్యాలు గెలిచింది. గడిచిన నాలుగేళ్ల ప్రదర్శన ఆధారంగా ఇచ్చే ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఆమె అర్హురాలని కమిటీ నిర్ణయించింది. పూనియాతో పాటు ఆమెను ఎంపిక చేసింది. మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ ఐసీసీ ఈవెంట్లలో పరుగుల ప్రవాహం సృష్టించడంతో ‘అర్జున’కు ఎంపికైంది. మహిళల భారత జట్టు 2017లో వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్, గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. విమల్‌కు ద్రోణాచార్య సైనా నెహ్వాల్ మాజీ కోచ్ విమల్ కుమార్ ‘ద్రోణాచార్య’కు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), మొహిందర్ సింగ్ ధిల్లాన్ (అథ్లెటిక్స్) కోచ్‌లకు ఇచ్చే పురస్కారానికి ఎంపికయ్యారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కోచ్ సంజయ్ భరద్వాజ్, మెర్జ్బన్ పటేల్, రణ్బిర్సింగ్ ఖోఖర్ జీవిత సాఫల్య పురస్కారాలకు నామినేట్ అయ్యారు. కమిటీ నామినీల జాబితాను కేంద్ర క్రీడాశాఖ ఆమోదించిన వెంటనే అధికారికంగా విజేతలను ప్రకటిస్తారు. యేటా హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 23)ని జాతీయ క్రీడాదినోత్సవంగా నిర్వహిస్తారు. ఆ రోజు రాష్ట్రపతి భవన్లో ఘనంగా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఖేల్‌రత్న విజేతకు పతకంతో రూ.7.5 లక్షలు, అర్జున, ద్రోణాచార్యలకు మెమెంటో, రూ. 5 లక్షలు బహుమతిగా అందజేస్తారు. మేరీ తప్పుకుంది... భారత చాంపియన్ బాక్సర్ మేరీకామ్ అవార్డుల కమిటీలో ప్రధాన సభ్యురాలు. కానీ ఆమె శనివారం ‘ద్రోణాచార్య’ ఎంపికలో పాలుపంచుకోలేదు. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ బాక్సర్ వ్యక్తిగత కోచ్ చోటేలాల్ యాదవ్ కూడా ‘ద్రోణాచార్య’ ప్రతిపాదిత జాబితాలో ఉన్నారు. దీంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు దూరంగా ఉండాలని భావించిన ఆమె ఎంపిక ప్రక్రియ నుంచి స్వయంగా తప్పుకుంది. అవార్డు నామినీల జాబితా రాజీవ్ ఖేల్‌రత్న: బజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీపామాలిక్ (పారా అథ్లెట్). అర్జున: సాయిప్రణీత్ (బ్యాడ్మింటన్), రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ (క్రికెట్), తేజిందర్‌పాల్ సింగ్, మొహమ్మద్ అనస్ యాహియా, స్వప్న బర్మన్ (అథ్లెటిక్స్), సోనియా లాతర్ (బాక్సింగ్), చింగ్లేశన సింగ్ (హాకీ), అజయ్ ఠాకూర్ (కబడ్డీ), గౌరవ్‌సింగ్ గిల్ (మోటార్ స్పోర్ట్స్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), సుందర్‌సింగ్ గుర్జార్ (పారా అథ్లెట్), అంజుమ్ మోద్గిల్ (షూటింగ్), హర్మీత్ దేశాయ్ (టేబుల్ టెన్నిస్), పూజ ధండ (రెజ్లింగ్), ఫౌవాద్ మిర్జా (ఈక్వెస్ట్రియన్), గుర్‌ప్రీత్‌సింగ్ సంధు (ఫుట్‌బాల్), సిమ్రన్‌సింగ్ షెర్గిల్ (పోలో). ఆర్డీటీకి పురస్కారం క్రీడలను ప్రోత్సహించడంలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ సంస్థను అవార్డు కమిటీ ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’కు ఎంపిక చేసింది. ఐదు దశాబ్దాల క్రితం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’గా మొదలైన ఈ స్వచ్ఛంద సంస్థ మొదట్లో ప్రజల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం శ్రమించింది. కాలక్రమంలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్‌గా మారాక గత 20 ఏళ్లుగా క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 2002లో స్పోర్ట్స్ సెంటర్‌ను ప్రారంభించింది. 32 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పరచింది. సకల సౌకర్యాలతో క్రీడలకు, క్రీడాకారులకు ఎనలేని సేవలందజేస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన నిరుపేద బాలబాలికల్లో ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తోంది. ‘‘చాలా సంతోషంగా ఉంది. సరైన సమయంలో ఈ అవార్డుకు ఎంపికయ్యాను. రాబోయే టోర్నీల్లో మరింత పట్టుదలతో రాణించేందుకు ఈ అవార్డు ఊతమిస్తుంది’’ – ‘సాక్షి’తో సాయి ప్రణీత్ ‘‘మన దేశంలో తమవాళ్లకే అవార్డులు ఇచ్చుకుంటారు. అంటే కమిటీలో మనవారుంటే గుర్తిస్తారు. అంతే తప్ప ప్రదర్శనతోనూ, ప్రతిభతోనూ కాదు. ఇండియాలో ఇంతే. ఎవరేం చేయలేరు. మన పని మనం చేసుకోవాల్సిందే’’ – ట్విట్టర్లో హెచ్.ఎస్.ప్రణయ్ ఆవేదన ‘‘ఆటగాళ్ల విజయంలో కోచ్‌ల పాత్ర ఎంతో ఉంటుంది. నేను ఆ కోచ్‌ల వల్లే ఎదిగాను. జస్పాల్రాణా షూటింగ్లో ఉత్తమ కోచ్. మను భాకర్, సౌరభ్ చౌదరి, అనీశ్ భన్వాలాలను ప్రపంచశ్రేణి షూటర్లుగా తీర్చిదిద్దారు. అలాంటి రాణాను విస్మరించడం సరికాదు. ఇలాంటి తప్పటడుగులు టోక్యో ఒలింపిక్స్‌లో ప్రభావం చూపిస్తాయి’’ – ఒలింపిక్స్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా దీప, జడేజా, పూనమ్, అజయ్, బర్మన్ -
‘ద్రోణాచార్య’కు నాగరాజ్ పేరు సిఫారసు
సాక్షి, హైదరాబాద్: ఎంతోకాలంగా టెన్నిస్‌కు విశేష సేవలందిస్తోన్న హైదరాబాద్ నగర కోచ్ సీవీ నాగరాజ్ సేవలకు గుర్తింపు దక్కింది. ఆయన ఈ ఏడాదికి గానూ ద్రోణాచార్య అవార్డు కోసం నామినేట్ అయ్యారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ద్రోణాచార్య అవార్డు కోసం ఆయన పేరును సిఫారసు చేసింది. ఈ సందర్భంగా నాగరాజ్ ‘ఐటా’కు కృతజ్ఞతలు తెలిపారు. -
ద్రవిడ్ వ్యవహారంతో బీసీసీఐలో చీలిక
సాక్షి, ముంబై: భారత మాజీ కెప్టెన్, టీమిండియా అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరును ద్రోణాచార్య అవార్డుకు నామినేట్ చేయటం వివాదాస్పదంగా మారింది. ఏకంగా బీసీసీఐలోనే ఈ వ్యవహారం చీలిక తీసుకొచ్చింది. కోచ్‌గా అంతగా అనుభవం లేని వ్యక్తిని ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ ఎలా చేస్తారంటూ ఓ వర్గం అభ్యంతరం లేవనెత్తగా.. మరో వర్గం ద్రవిడ్ పేరును బలపరుస్తోంది. ‘ద్రవిడ్‌ను ద్రోణాచార్య పురస్కారానికి నామినేట్ చేయటం సమంజసం కాదు. కోచ్‌గా కనీసం ఆయనకు మూడేళ్ల అనుభవం కూడా లేదు. ఈ నిర్ణయం ఆటగాళ్లను చిన్నతనంలోనే సానబెట్టే గురువులకు అన్యాయం చేయటమే అవుతుంది. అలాగని ద్రవిడ్ బీసీసీఐకి అందిస్తున్న సేవలను నేను తక్కువ చేయటం లేదు. కానీ, ఆయనను అవార్డుకు నామినేట్ చేయటం మాత్రం సమంజం కాదని చెబుతున్నా’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. సుప్రీం కోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ మాత్రం ద్రవిడ్.. ద్రోణాచార్య అవార్డుకు అన్ని విధాల అర్హుడంటూ వాదిస్తోంది. కమిటీ చీఫ్ వినోద్ రాయ్ గురువారం ద్రవిడ్ పేరును నామినేట్ చేసినట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాయ్.. ద్రవిడ్‌పై ప్రశంసలు గుప్పించాడు. ఇక ఈ వ్యవహారం ముదరకుండా ఇరు వర్గాలు భేటీ కావాలని నిర్ణయించాయి. క్రీడా మార్గదర్శకాల ప్రకారం ఏదైనా ఆటలో 20 ఏళ్లు కోచ్‌గా అనుభవం ఉన్న వ్యక్తులనుగానీ లేదా తక్కువ సమయంలో గొప్ప ఆటగాళ్లను తయారు చేసే కోచ్‌ల పేర్లను ద్రోణాచార్య అవార్డుకు ప్రతిపాదించొచ్చు. -
కోహ్లికి ఖేల్ రత్న.. ద్రవిడ్‌కు ద్రోణాచార్య
కోల్కత్తా: రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి పేరును, భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పేరు ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డుకు, ధ్యాన్‌చంద్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డుకు లెజెండరీ ఓపెనర్ సునీల్ గావస్కర్ పేరును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సిఫార్సు చేసింది. భారత క్రికెట్ టీంలో విరాట్ కొంతకాలం నుంచి ముఖ్యభూమిక పోషిస్తున్నాడు. క్రికెట్లో బ్యాట్‌తో రాణిస్తూ దిగ్గజ ఆటగాడు సచిన్‌ను మరిపిస్తున్నాడు. దీన్ని పరిగణలోనికి తీసుకుని ఈ అవార్డుకు కోహ్లి అర్హుడని భావించి ఆయన పేరును ప్రతిపాదించారు. రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న అండర్-19 టీం ఇటీవల ప్రపంచ కప్ నెగ్గిన సంగతి తెల్సిందే. భారత క్రికెట్‌కు గావస్కర్ చేసిన సేవలకు గానూ, 70,80వ దశలకాల్లో బ్యాట్‌తో రాణించి భారత్‌కు పేరు ప్రఖ్యాతులు తెచ్చింనందకు గానూ ఆయన పేరును ధ్యాన్‌చంద్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డుకు ప్రతిపాదించారు. -
రమేశ్‌కు 25 లక్షల పారితోషికం
సాక్షి, హైదరాబాద్: ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ అథ్లెటిక్ కోచ్ నాగపైరి రమేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పారితోషికాన్ని మంజూరు చేసింది. ఈ ఫైలుపై మంగళవారం సీఎం కేసీఆర్ సంతకం చేశారు. గతేడాది రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులకు రమేశ్ శిక్షణ ఇచ్చారు. క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయనకు పారితోషికాన్ని మంజూరు చేసింది. -
జిల్లా వాసిగా గర్విస్తున్నా
తెలంగాణ బిడ్డలకు పురస్కారం అంకితం ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేశ్ నాగపురి సాక్షి, హన్మకొండ : ‘వరంగల్ గడ్డ మీద పుట్టినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. మన నీళ్లు, మన నేలకు పోరాట స్వభావం ఉంది. అందుకే అండ లేకున్నా, అడ్డంకులు ఎదురైనా పోరాడుతూ ఈ స్థాయికి చేరుకున్నా’ అని ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ అన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. తన ఎదుగుదలకు కారణమైన వరంగల్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతన్నానని అన్నారు. ఈ ప్రాంతానికి ఉన్న పోరాట స్వభావం వల్లే ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించడం నేర్చుకున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే తన ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2006లో రాష్ట్రస్థాయిలో బెస్ట్కోచ్గా కృపాచార్య అవార్డుకు తనను ఎంపిక చేశారని, మెమెంటో ఇచ్చారని అయితే, రివార్డుగా ఇవ్వాల్సిన రూ. 50 వేలు ఇంతవరకు అందలేదని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలంటే నిర్లక్ష్యం ఉండేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న వారందరికీ తన అవార్డును అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. -
అసాధారణ ద్రోణచార్యుడు
అపజయం నుంచి విజయం వైపు అంకితభావంతో ఆంగ్లంపై పట్టు స్ట్రీట్ఫైట్లను వద్దని మైదానానికి అంకితం భద్రకాళి గుట్టలపై రన్నింగ్ ప్రాక్టీస్ సవాల్‌గా ద్యుతిచంద్‌కు శిక్షణ వీవీఎస్ లక్ష్మణ్‌కు పర్సనల్ ఫిట్నెస్ కోచ్‌గా ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేశ్ నగరంలోని కాపువాడలో పెంకుటిల్లులో నివాసం.. గ్యాస్ దీపం కింద చదువు.. పెళ్లిళ్లలో బరాత్‌కు డ్యాన్సు లు చేసే సామాన్యుడు నాగపూరి రమేశ్. పరుగు పందెంపై ఉన్న మక్కువ ఆయన జీవిత గమనాన్ని మార్చేసింది. రన్నింగ్ ప్రాక్టీస్ కోసం భద్రకాళి దేవస్థానం గుట్టలపైకి పరుగెత్తడం ప్రారంభించి చివరకు.. దేశ రాజధాని ఢిల్లీలో ద్రోణాచార్య అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. ఈనెల 29న రాష్ట్రప్రతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న నేపథ్యంలో నాగపూరి రమేష్ ‘సాక్షి’తో తన అనుభవాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే.. –సాక్షి, హన్మకొండ ఒక మనిషి జీవితంలో అతడు పుట్టిన ప్రదేశం, తల్లిదండ్రులు, స్నేహితులు, ఇష్టాఇష్టాలు, వ్యక్తుల పరిచయాలు, కష్టాలు, సవాళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. వీటికి మనం ఎలా స్పందిస్తామనే అంశంపై మన జీవితం ఆధారపడి ఉంటుంది. నా జీవితంలో ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సాధారణంగా క్రీడారంగంలో కఠోరమైన శ్రమ ఉండాలి. పోటీల్లో ఎప్పటికప్పుడు నైపుణ్యత ప్రదర్శించాలి. అప్పుడే ఆటల్లో గెలిచి పతకాలు సాధించవచ్చు. మంచి పేరు సంపాదించవచ్చు. గోడకు కొట్టిన బంతిలా 2014లో జరిగిన కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో 400 ‘ 4 రన్నింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ లక్ష్యంగా రెండేళ్లకు పైగా శ్రమించి మంచి అథ్లెటిక్స్ టీమ్‌ను తయారు చేశాను. రేయింబవళ్లు క్రీడాకారుల ఫిట్నెస్ను కాపాడుతూ శిక్షణ ఇచ్చాను. దురదృష్టం కొద్ది కామన్వెల్త్ గేమ్స్‌లో మా టీమ్ అనుకున్న ఫలితాలు సాధించలేదు. దీనికి నన్ను బాధ్యుడిని చేస్తూ స్పోర్ట్స్ అధికారులు ఏషియన్ గేమ్స్ జాతీయ శిబిరం శిక్షణ బాధ్యతల నుంచి తప్పించారు. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత నాలుగు వారాల వ్యవధిలోనే ఏషియన్ గేమ్స్ ఉండడంతో అథ్లెటిక్స్‌కు మరో కోచ్‌ను నియమించారు. ఈ ఆటల్లో 400 ‘ 4 విభాగంలో గోల్డ్‌మెడల్‌తో పాటు ఏషియన్ గేమ్స్ రికార్డు బద్దలు అయింది. ఈ క్రెడిట్ అంతా కొత్తగా వచ్చిన కోచ్‌కు వెళ్లింది. రెండేళ్ల నా శ్రమ మరుగున పడిపోయింది. ఈ సమయంలో ఎంతో బాధగా అనిపించింది. నా కష్టం గోడకు కొట్టిన బంతిలాగా వెనక్కి వచ్చింది. సవాల్‌గా ద్యుతిచంద్‌కు శిక్షణ కోచ్ బాధ్యతల నుంచి స్పోర్ట్స్ అధికారులు నన్ను తప్పించడంతో కొన్ని నెలలపాటు నేను ఖాళీగా ఉన్నాను. ఈ సమయంలో ఇండియా బ్యాడ్మింటన్ లెజండ్, కోచ్ గోపీచంద్ నన్ను పిలిచి తన అకాడమీలో క్రీడాకారులకు ఫిట్నెస్ శిక్షణ ఇవ్వాలని కోరాడు. అలా 2014 నుంచి గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో క్రీడాకారులకు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇస్తున్నాను. నేను అక్కడ పనిచేస్తున్న సమయంలోనే అథ్లెట్ ద్యుతిచంద్ తన స్వరాష్ట్రం ఒడిషా నుంచి నాకు ఫోన్ చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్), ఇతర క్రీడా సంస్థలు పట్టించుకోకపోవడంతో తన ¿¶ విష్యత్ ప్రమాదంలో పడిందని చెప్పింది. ఈ విషయంపై గోపీచంద్‌తో మా ట్లాడగా.. తన అకాడమీలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ద్యుతిచంద్ను హైదరాబాద్‌కు రప్పించి ఆమె శిక్షణను సవాల్‌గా స్వీకరించాను. 2015 జనవరి నుంచి ద్యుతికి 100 మీటర్ల స్ప్రింట్ విభాగంలో ఉదయం, సాయంత్రం వేళల్లో అత్యున్నత శిక్షణ ఇచ్చాను. ఈ మేరకు గత జూన్‌లో జరిగిన రియో ఒలింపిక్స్ అర్హత పోటీలో ఆమె విజయం సాధించింది. 32 ఏళ్ల తర్వాత పీటీ ఉష అనంతరం ఈ ఘనత సాధించిన అథ్లెట్‌గా ద్యుతిచంద్ గుర్తింపు పొందింది. వీవీఎస్ లక్ష్మణ్‌కు ఫిట్నెస్ కోచ్‌గా.. 1996–99 కాలంలో హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో పనిచేశాను. ఈ సమయంలో స్కూల్ ప్రిన్సిపాల్, సాయ్ రీజినల్ డైరెక్టర్ మధ్య జరిగిన ఆధిపత్య పోరులో నేను బలయ్యాను. ఈ సందర్భంగా అకారణంగా నన్ను బెంగళూరు స్పోర్ట్స్ స్కూల్‌కు సరెండర్ చేశారు. అక్కడ 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌కు వెళ్తున్న హాకీ జట్టుకు ఫిట్నెస్ కోచ్‌గా పని చేశాను. ఈ ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఒక సారి విమానంలో హాకీ జట్టు ఇండియా కెప్టెన్ ముకే ష్, హైదరాబాద్ స్టార్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రయాణించారు. ఈ సందర్భంగా ముకేష్ ఫిట్నెస్ గురించి లక్ష్మణ్ వాకబు చేయగా.. ఆయన నా పేరు చెప్పారు. దీంతో 2000లో వీవీఎస్ లక్ష్మణ్‌కు పర్సనల్ ఫిట్నెస్ కోచ్‌గా పనిచేశాను. ఏడాది వ్యవధిలోనే ఆయన ఫిట్నెస్ మెరుగుపడింది. 2001లో కోల్‌కతాలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆయన 271 పరుగులు సాధించారు. అలా ఆనాడు ఆయనతో ఏర్పడిన బంధం క్రికెట్‌కు రిటైర్డ్మెంట్ ప్రకటించే వరకు కొనసాగింది. ఇంగ్లిష్తో ఇబ్బంది జాతీయ జట్టు కోచ్‌గా వ్యవహరించే వారు వివిధ భాషలు మాట్లాడే వారితో పనిచేయాల్సి ఉంటుంది. నేను ఇంగ్లిష్‌లో పట్టు సాధించేందుకు హన్మకొండ బాలసముద్రానికి చెందిన మల్లేశం సారు, నా సీనియర్, గైడ్ ప్రదీప్లే కారణం. డిగ్రీలో ఉన్నప్పుడు బాలసముద్రంలో మల్లేశం సారు దగ్గర మూడు నెలలపాటు స్పోకెన్ ఇంగ్లిష్‌లో కోచింగ్ తీసుకున్నాను. దీనికి ఫీజు ప్రదీప్ కట్టాడు. ఎంపీఈడీ చేసేందుకు తమిళనాడులోకి కారైకుడికి వెళ్లినప్పుడు తొలిసారిగా నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. వాళ్లకు తెలుగురాదు.. నాకు తమిళం రాదు. మల్లేశం సారు చెప్పిన పాఠాలు గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా ఇంగ్లిష్‌లో మాట్లాడం అలవాటు చేసుకున్న. హిందూ పేపర్, ఇంగ్లిష్ వార్తా చానళ్లు చూస్తూ ఆ భాషపై పట్టు సాధించాను. స్ఫూర్తి నింపిన స్నేహం హన్మకొండలోని కాపువాడలో మా ఇల్లు. సాయంత్రం అయితే మా వీధి పోరగాళ్లు టిప్‌టాప్‌గా తయారై అలంకార్ సెంటర్లో ఉన్న క్యాంటీన్, డబ్బాల కాడికి పోతుండేవాళ్లు. నేను స్పోర్ట్స్ బనీను, షార్ట్ వేసుకుని రన్నింగ్ ప్రాక్టీస్‌కు పోతుండేవాడిని. నేను వాళ్లలాగా ఎంజాయ్ చేయలేకపోతున్నానని అని అప్పుడప్పుడు అనిపించేంది. మా వాడకు చెందిన పిల్లలు ఎక్కువ స్ట్రీట్ఫైట్లకు వెళ్లేవారు. నేను ఉదయం, సాయంత్రం గ్రౌండ్లో ఉండడం వల్ల, ఆ ప్రభావం నా మీద పడలేదు. మైదానంలో నా సీనియర్, జాతీయస్థాయి క్రీడాకారుడు ప్రదీప్ నాకు పరిచయమయ్యారు. అతడి ప్రభావం నాపై ఎక్కువ పడింది. తను కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేస్తుండేవారు. తనతో పాటు ఆయన నన్ను యూనివర్సిటీకి తీసుకెళ్లేవారు. అక్కడ పీజీ చేసే వాళ్లను చూస్తే నాకు గొప్పగా అనిపించేది. ఇక ప్రదీప్ వాళ్ల ఇంటికి వెళితే.. వాళ్ల ఫ్యామిలీలో డాక్టర్లు, ఇంజినీర్లు ఉండేవాళ్లు. వాళ్లను చూస్తే కొత్త ఉత్సాహం కలిగేది. అప్పుడే ఆటల మోజులో పడి చదువును నిర్లక్ష్యం చేయెుద్దని నిర్ణయించుకున్న. మా నాన్న హన్మకొండ నక్కలగుట్ట కరెంటాఫీసులో అటెండర్‌గా పని చేస్తుండే వారు. సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తూ గ్రౌండ్‌కు వచ్చి నా ప్రాక్టీస్‌ను చూసి సంబరపడేవారు. వీధిలో మిగతా పిల్లలకు భిన్నంగా నేను గ్రౌండ్లో చెమటోడ్చడం ఆయనకు నచ్చేది. మడికొండ దాకా ఉరుకుడే ఆ రోజుల్లో వరంగల్‌లో ప్రొఫెషనల్ కోచ్‌లు అందరికీ అందుబాటులో లేరు. రామకృష్ణ సార్ కోచింగ్‌లో నేను రన్నింగ్‌లో మెళకువలు, ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచుకున్న. మంచి ఎన్విరాన్మెంట్ కండీషన్, ఫుడ్ లభించడం కష్టంగా ఉండేది. అయినప్పటికీ రన్నింVŠ పై ఇష్టంతో ఉదయం, సాయంత్రం గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ రోజుల్లో ప్రాక్టీస్ చేసేందుకు హన్మకొండ జేఎన్ఎస్ నుంచి మడికొండ వరకు 20 కిలోమీటర్లు, జేఎన్ఎస్ నుంచి హంటర్‌రోడ్డులోని రైస్‌మిల్లుల వరకు 12 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తేవాడిని. ఈ శ్రమ ఫలించి 3000 మీటర్ల పరుగు పందెలో ఆలిండియా జూనియర్ లెవల్లో బంగారు పతకం, ఆలిండియా యూనివర్సిటీ లెవల్లో చాంపియన్‌గా నిలిచాను. ఆడలేను అనుకున్నా.. నేను డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ కోసం భద్రకాళీ గుట్టల్లో పరుగెత్తేవాడిని. ఒక సారి జారి పడితే కాలు ఫ్రాక్చర్ అయింది. 21 రోజులు పూర్తిగా మంచంపైనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఆటలే లోకంగా బతికాను. నా కాలు విరగడంతో భవిష్యత్ ఏమవుతుందో అన్ని భయపడ్డాను. ఆ తర్వాత ఆటగాడిగా, కోచ్‌గా నా ప్రస్థానం ద్రోణాచార్య అవార్డు అందుకునే వరకు వచ్చింది. ఈ అవార్డు నా జీవితంలో మరిచిపోలేనిది. నేను ఈ స్థాయికి చే రేందుకు ప్రోత్సహించిన అమ్మానాన్న, స్నేహితులు, కోచ్‌లు, కుటుంబసభ్యులకు జీవితాంతం రుణపడి ఉంటాను. -
కోహ్లీ 10 ఏళ్ల వయసులో నావద్దకు వచ్చాడు
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి శిష్యుడని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ కితాబిచ్చాడు. కోహ్లీ 10 ఏళ్ల వయసులో క్రికెట్ నేర్చుకునేందుకు తన దగ్గరకు వచ్చాడని, ఇప్పుడు టీమిండియా కెప్టెన్ అయినా అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పురాలేదని, చిన్నప్పటి కోహ్లీలాగే కనిపిస్తాడని శర్మ అన్నాడు. ద్రోణాచార్య అవార్డు తనకు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని, మరింతమంది విరాట్లను తయారు చేయాల్సిన బాధ్యతను పెంచిందని ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ చెప్పాడు. ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన గురువు రాజ్‌కుమార్ శర్మను విరాట్ అభినందించాడు. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న కోహ్లీ గురువుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపాడు. దీనిపై శర్మ స్పందిస్తూ కోహ్లీతో తన అనుబంధాన్ని వెల్లడించాడు. తల్లిదండ్రులకు, కోచ్‌కు తేడా ఉండదని, విరాట్‌ను సొంతబిడ్డలా చూసుకున్నానని చెప్పాడు. 'విరాట్ పదేళ్ల వయసులో తొలిసారి నా కోచింగ్ క్యాంప్‌నకు వచ్చాడు. ఈ రోజు టీమిండియా కెప్టెన్ అయ్యాడు. అతను నెట్ సెషన్‌కు వస్తుంటాడు. కోహ్లీలో ఏమాత్రం తేడా కనిపించదు. నాకు ఇప్పటికీ పదేళ్ల విరాట్‌లానే ఉంటాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు. 2013లో కోహ్లీ అర్జున అవార్డు అందుకున్నప్పుడు రాష్ట్రపతి భవన్‌లోనే ఉన్నా. ఈసారి నేను ద్రోణాచార్య అవార్డు తీసుకునే సమయంలో కోహ్లీ హాజరవుతాడు' అని శర్మ చెప్పాడు. -
ద్రోణాచార్య.. నాగపురి రమేష్
జిల్లాకు తొలిసారిగా దక్కిన గౌరవం హన్మకొండలో పుట్టి పెరిగిన రమేష్ కనీస సౌకర్యాలు లేని రోజుల్లో భద్రకాళి గుట్టల్లో ప్రాక్టీస్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన శిష్యులు ఏషియన్, కామన్వెల్త్, ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం సాక్షి, హన్మకొండ : వరంగల్ పరుగుల యంత్రం నాగపూరి రమేష్‌కు క్రీడారంగంలో దేశంలో అత్యున్నత పురస్కారమైన ద్రోణాచార్య అవార్డు వరించింది. అథ్లెటిక్స్ విభాగంలో ఇరవై రెండేళ్ల ప్రస్థానంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఆయనను ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేసింది. ఆగస్టు 29న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. జిల్లా నుంచి ద్రోణాచార్య అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా నాగపూరి రమేష్ గుర్తింపు పొందారు. హన్మకొండ మచిలీబజార్ ఆయన స్వస్థలం కాగా తల్లిదండ్రులు నాగపూరి మల్లయ్య, ఉప్పలమ్మ. వీరికి ఐదుగురు సంతానంలో నాలుగో వాడైన నాగపూరి రమేష్ చిన్నతనం నుంచే క్రీడలపై మక్కువ ప్రదర్శించేవారు. అలా జాతీయ స్థాయి అథ్లెట్‌గా ఎదిగారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 1992 నుంచి అథ్లెట్ కోచ్‌గా పని చేస్తున్నారు. ఇరవై రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా మట్టిలో మాణిక్యాలుగా ఉన్న క్రీడాకారులను సానబెట్టి ఏషియన్, కామన్వెల్త్ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో బంగారు పతకాలు సాధించేలా తీర్చిదిద్దారు. ఒలంపిక్‌లో అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించింది తక్కువ. ఇందులో నాగపూరి రమేష్ శిక్షణలో రాటుదేలిన సత్తి గీత, ద్యుతిచంద్ ఏథెన్స్, రియోడిజనీరో ఒలింపిక్‌లో పాల్గొనడం విశేషం. భద్రకాళి గుట్టల్లో ప్రాక్టీస్ ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన సందర్భంగా ‘సాక్షి’ నాగపూరి రమేష్‌ను ఫోన్లో పలకరించింది. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన అంశాలు రమేష్ మాటల్లోనే... నేను పుట్టి పెరిగింది హన్మకొండలోని మచిలీబజార్. చిన్నప్పటి నుంచి నాకు రన్నింగ్‌పై ఆసక్తి ఉండేది. మా ఇంటికి దగ్గర్లో ఉన్న భద్రకాళి గుట్టల వైపు వెళ్లి రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. తర్వాత జేఎన్ఎస్ స్టేడియంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేశాను. 1985–87 సమయంలో జాతీయ స్థాయిలో జూనియర్ లెవల్లో 3000 మీటర్ల పరుగు పందెం, ఆలిండియా యూనివర్సిటీ పోటీలో చాంపియన్‌గా నిలిచాను. శిక్షకుడిగా.. నేను ఆటగాడిగా ఎదిగే రోజుల్లో రామకృష్ణ సార్ నాకు కోచింగ్ ఇచ్చారు. నా సీనియర్లు సారంగపాణి, ప్రదీప్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ముఖ్యంగా ప్రదీప్ నుంచి స్ఫూర్తి పొందాను. 1990 తర్వాత తమిళనాడులోని కారైకుడిలో ఎంపీఈడీ పూర్తి చేశాను. ఆ తర్వాత బెంగళూరులో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోచింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాను. ఇక్కడ నాకు గోల్డ్‌మెడల్ వచ్చింది. దీంతో 1992లో స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అథ్లెటిక్స్ కోచ్‌గా త్వరగా ఉద్యోగం వచ్చింది. అలా అథ్లెటిక్ శిక్షకుడిగా నా పరుగు మొదలైంది. విజయ పరంపర.. శిక్షకుడిగా నా ప్రస్థానంలో తొలి విజయం 1996 న్యూఢిల్లీలో జరిగిన జూనియర్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో లభించింది. హన్మకొండకే చెందిన అథ్లెట్ మాధవి లాంగ్‌జంప్‌లో పతకం సాధించింది. దీంతో జాతీయస్థాయిలో కోచింగ్ ఇచ్చే బాధ్యతలు వరించాయి. 2002, 2006, 2010, 2014 వరుసగా నాలుగు ఏషియన్ గేమ్స్‌లో నా శిష్యులు సత్తి గీత, మృదుల, సౌజన్య, మౌనిక, మాధవి 4“400 రిలే పోటీలో బంగారు పతకాలు సాధించారు. 2004, 2008ల్లో ఏథెన్స్, బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో సత్తి గీత ప్రాతినిధ్యం వహించింది. పీఈటీలకు అంకితం.. ఎటువంటి స్వార్థం లేకుండా పని చేసే పీఈటీలు, ఎలాంటి అండదండలు లేని క్రీడాకారులను గుర్తించి, వారికి వెన్నుదన్నుగా నిలిచే పీఈటీలకు నాకు వచ్చిన ద్రోణాచార్య అవార్డును అంకితం ఇస్తున్నాను. వీరితో పాటు జూనియర్ క్రీడాకారులకు మార్గదర్శులుగా నిలుస్తూ, జూనియర్ల ప్రతిభకు మెరుగులు దిద్దే సీనియర్ క్రీడాకారులకు ఈ అవార్డు అంకితం. శిష్యుల విజయాలనే తమ విజయాలుగా భావించే పీఈటీలు, సీనియర్ ప్లేయర్లు ఎంతో మంది ఉన్నారు. పీటీ ఉష తర్వాత రమేష్ శిష్యురాలే.. ప్రస్తుతం రియోలో జరుగుతున్న ఒలింపిక్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌లో రమేష్ శిక్షణలో రాటుదేలిన ద్యుతీచంద్ ప్రాతినిధ్యం వహించింది. పీటీ ఉష తర్వాత 32 ఏళ్లకు ఈ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం ద్యుతీకి రావడం విశేషం. అయితే, రియోకు క్రీడాకారులను పంపించే సమయంలో ద్యుతీచంద్, రమేష్‌ను ఒకేసారి కాకుండా వేర్వేరుగా పంపించారు. ఒలింపిక్స్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు విమర్శలు వచ్చాయి. అయితే, ఒలింపిక్స్‌లో ద్యుతీ విఫలమైంది. కానీ ద్యుతీ, రమేష్‌ను ఒకేసారి రియోకు పంపిస్తే ఫలితం వేరేగా రావడంతో పాటు సింధు విషయంలో గోపీచంద్‌కు దక్కిన ప్రశంసలే రమేష్‌కు కూడా దక్కేవన్న అభిప్రాయం క్రీడాభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రొఫైల్ పేరు : నాగపురి రమేష్ తల్లిదండ్రులు : ఉప్పలమ్మ–మల్లయ్య స్వస్థలం : మచిలీబజార్, హన్మకొండ భార్య : విద్యుల్లత పిల్లలు : అనూష, సాయిభవిత -
ఎస్‌సీఎఫ్‌కు కేంద్ర అవార్డు
ఐదుగురికి ద్రోణాచార్య పురస్కారం న్యూఢిల్లీ : క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారికి అత్యున్నత స్థాయిలో శిక్షణ ఇస్తున్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్సీఎఫ్)కు కేంద్ర పురస్కారం దక్కింది. హైదరాబాద్‌లో సేవలందిస్తున్న ఈ సంస్థకు ‘స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్’ విభాగంలో క్రీడా శాఖ అవార్డును ప్రకటించింది. క్రికెట్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో ఎస్సీఎఫ్ శిక్షణ ఇస్తూ అర్హులైన వారికి స్కాలర్‌షిప్‌లతో ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఈ ఏడాది ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు కోసం ఎంపిక చేసిన ఐదుగురి పేర్లను క్రీడాశాఖ ఆమోదించింది. రెజ్లింగ్ కోచ్ అనూప్ సింగ్, పారాలింపిక్స్ కోచ్ నావల్ సింగ్‌ల పేర్లను ప్రస్తుత ప్రదర్శన (2011-2014) ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక చేయగా జీవిత సాఫల్య పురస్కారం విభాగంలో నిహర్ అమీన్ (స్విమ్మింగ్), ఎస్ఆర్ సింగ్ (బాక్సింగ్), హర్బన్స్ సింగ్ (అథ్లెటిక్స్)లకు దక్కనుంది. వీరికి తలా రూ.5 లక్షల నగదు, ప్రతిమను అందిస్తారు. సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, సత్యవర్త్ కడియన్, బజరంగ్, అమిత దహియాలను రెజ్లర్లుగా తీర్చిదిద్దడంలో కోచ్ అనూప్ కుమార్ పాత్ర ఉంది. ధ్యాన్‌చంద్ అవార్డు కోసం రోమియో జేమ్స్ (హాకీ), ఎస్పీ మిశ్రా (టెన్నిస్), టీపీపీ నాయర్ (వాలీబాల్) పేర్లను ఖరారు చేశారు. -
సోధికి ఖేల్త్న్ర, కోహ్లికి అర్జున
ఘనంగా క్రీడా అవార్డుల ప్రదానం రాష్ర్టపతి చేతులమీదుగా అందజేత న్యూఢిల్లీ: ఆయా క్రీడల్లో తమ అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి వన్నె తెచ్చిన ఆటగాళ్లను కేంద్ర ప్రభుత్వం అవార్డులతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్లో శనివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్త్న్రను షూటర్ రంజన్ సింగ్ సోధి అందుకున్నాడు. వరుసగా మూడోసారి కూడా ఈ అవార్డు ఓ షూటర్‌కే దక్కడం విశేషం. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో స్వర్ణాలు నెగ్గిన ఏకైక భారత షూటర్‌గా రికార్డులకెక్కిన సోధికి ఈ అవార్డు కింద రూ.7.5 లక్షల నగదు, పతకం, మెమొంటో అందజేశారు. ఇక భారత క్రికెట్ భవిష్యత్ కెప్టెన్‌గా పిలువబడుతున్న విరాట్ కోహ్లి అర్జున అవార్డును అందుకున్నాడు. ఈ సమయంలో అక్కడున్న వారు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. కోహ్లితో పాటు మరో 13 మంది కూడా అర్జున అవార్డులు అందుకున్నారు. అర్జున దక్కించుకున్న వారికి రూ.5 లక్షల చొప్పున నగదు, మెమొంటో, విగ్రహం అందజేశారు. అవార్డీల జాబితా రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర: రంజన్ సింగ్ సోధి అర్జున అవార్డు: విరాట్ కోహ్లి (క్రికెట్), పీవీ సింధు (బ్యాడ్మింటన్), జ్యోత్స్న చినప్ప (స్క్వాష్), కవితా చాహల్ (బాక్సింగ్), సాబా అంజుమ్ (హాకీ), నేహా రాఠి (రెజ్లింగ్), రాజ్‌కుమారి రాథోడ్ (షూటింగ్), చెక్రవోలు సువురో (ఆర్చరీ), మౌమా దాస్ (టేబుల్ టెన్నిస్), రూపేశ్ షా (బిలియర్డ్స్ అండ్ స్నూకర్), అభిజిత్ గుప్తా (చెస్), గగన్ జీత్ భుల్లార్ (గోల్ఫ్), ధర్మేందర్ దలాల్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ సరోహ (పారా అథ్లెటిక్స్). ద్రోణాచార్య అవార్డు: పూర్ణిమ మహతో (ఆర్చరీ), మహావీర్ సింగ్ (బాక్సింగ్), నరీందర్ సింగ్ సైనీ (హాకీ), రాజ్ సింగ్ (రెజ్లింగ్), కేపీ థామస్ (అథ్లెటిక్స్). ధ్యాన్‌చంద్ అవార్డు: మేరీ డి సౌజా సెక్వేరియా (అథ్లెటిక్స్), సయ్యద్ అలీ (హాకీ), అనిల్ మాన్ (రెజ్లింగ్), గిరిరాజ్ సింగ్ (పారా స్పోర్ట్స్). రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: పుల్లెల గోపీచంద్ - నిమ్మగడ్డ ఫౌండేషన్ అకాడమీ ఆఫ్ బ్యాడ్మింటన్, హైదరాబాద్.