కోహ్లీ 10 ఏళ్ల వయసులో నావద్దకు వచ్చాడు
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి శిష్యుడని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ కితాబిచ్చాడు. కోహ్లీ 10 ఏళ్ల వయసులో క్రికెట్ నేర్చుకునేందుకు తన దగ్గరకు వచ్చాడని, ఇప్పుడు టీమిండియా కెప్టెన్ అయినా అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పురాలేదని, చిన్నప్పటి కోహ్లీలాగే కనిపిస్తాడని శర్మ అన్నాడు. ద్రోణాచార్య అవార్డు తనకు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని, మరింతమంది విరాట్లను తయారు చేయాల్సిన బాధ్యతను పెంచిందని ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ చెప్పాడు.
ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన గురువు రాజ్కుమార్ శర్మను విరాట్ అభినందించాడు. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న కోహ్లీ గురువుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపాడు. దీనిపై శర్మ స్పందిస్తూ కోహ్లీతో తన అనుబంధాన్ని వెల్లడించాడు. తల్లిదండ్రులకు, కోచ్కు తేడా ఉండదని, విరాట్ను సొంతబిడ్డలా చూసుకున్నానని చెప్పాడు. 'విరాట్ పదేళ్ల వయసులో తొలిసారి నా కోచింగ్ క్యాంప్నకు వచ్చాడు. ఈ రోజు టీమిండియా కెప్టెన్ అయ్యాడు. అతను నెట్ సెషన్కు వస్తుంటాడు. కోహ్లీలో ఏమాత్రం తేడా కనిపించదు. నాకు ఇప్పటికీ పదేళ్ల విరాట్లానే ఉంటాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు. 2013లో కోహ్లీ అర్జున అవార్డు అందుకున్నప్పుడు రాష్ట్రపతి భవన్లోనే ఉన్నా. ఈసారి నేను ద్రోణాచార్య అవార్డు తీసుకునే సమయంలో కోహ్లీ హాజరవుతాడు' అని శర్మ చెప్పాడు.