న్యూఢిల్లీ: 2028 ఒలింపిక్ క్రీడల్లో భారత్ పతకాల జాబితాలో టాప్–10లో నిలుస్తుందనే నమ్మకముందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రానున్న కాలంలో మన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికల్లో కొత్త చరిత్ర లిఖిస్తారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మానసిక శక్తితో ఆటగాళ్లు కోవిడ్–19ను దీటుగా ఎదుర్కోవాలని ఆకాంక్షించారు. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ 115వ జయంతి వేడుకల సందర్భంగా ఆయనను కోవింద్ స్మరించుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జాతీయ క్రీడా పురస్కారాలను అందజేశారు. ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికైన ఆటగాళ్లను, కోచ్‌లను అభినందించారు. క్రీడాకారులంతా అద్వితీయ ప్రదర్శనలతో భారతీయులందరికీ మరపురాని మధుర స్మృతులను అందించారని కొనియాడారు.
‘వర్చువల్’గా అవార్డుల స్వీకరణ
44 ఏళ్ల ఈ అవార్డుల చరిత్రలో కరోనా కారణంగా కొత్త సంప్రదాయానికి తెర తీయాల్సి వచ్చింది. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరగాల్సిన ఈ వేడుకలు సాంకేతిక హంగులతో ముందుకొచ్చాయి. వర్చువల్ (ఆన్‌లైన్) పద్ధతిలో అలరించాయి. దీనికి దేశంలోని 11 భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రాలు వేదికలుగా నిలిచాయి. రాష్ట్రపతి భవన్‌తో అనుసంధానమైన సాయ్ కేంద్రాలు అత్యంత సురక్షిత వాతావరణంలో వేడుకల్ని నిర్వహించాయి. మొత్తం 74 (5 ఖేల్‌రత్న, 27 అర్జున, 13 ద్రోణాచార్య, 15 ధ్యాన్‌చంద్ ) మంది ఈ ఏడాది జాతీయ అవార్డులను గెలుచుకోగా శనివారం 60 మంది ఈ పురస్కారాలను స్వీకరించారు. ఖేల్‌రత్నకు ఎంపికైన మహిళా హాకీ ప్లేయర్ రాణి రాంపాల్, పారాలింపియన్ తంగవేలు సాయ్ పుణే కేంద్రం నుంచి... టీటీ ప్లేయర్ మనికా బాత్రా బెంగళూరు నుంచి ఈ అవార్డులను అందుకున్నారు. దుబాయ్‌లో ఉండటంతో రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, కరోనా సోకడంతో వినేశ్ ఫొగాట్, ఏపీ బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ తమ అవార్డులను అందుకోలేదు.
భారీగా పెరిగిన ప్రైజ్‌మనీ
అవార్డు విజేతలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మరో తీపి కబురు అందించింది. జాతీయ క్రీడా అవార్డుల ప్రైజ్‌మనీ భారీగా పెంచినట్లు మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే దీనిని అమల్లోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. నూతన విధానం ప్రకారం ఖేల్‌రత్న పురస్కారానికి రూ. 25 లక్షల ప్రైజ్‌మనీగా చెల్లించనున్నారు. గతంలో ఇది రూ. 7.5 లక్షలుగా ఉంది. దీనితో పాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డుల ప్రైజ్‌మనీలో కూడా మార్పులు చేశారు. గతేడాది వరకు ఈ అవార్డులకు రూ. 5 లక్షలు చొప్పున చెల్లిస్తుండగా... ఈ ఏడాది నుంచి అర్జున, ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం గ్రహీతలకు రూ. 15 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. ద్రోణాచార్య (రెగ్యులర్), ధ్యాన్‌చంద్ అవార్డు విజేతలు రూ. 10 లక్షల చొప్పున అందుకోనున్నారు.
దీనిపై మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ ‘చివరిసారిగా 2008లో ప్రైజ్‌మనీలో మార్పులు జరిగాయి. ప్రతీ పదేళ్లకోసారి ఈ మొత్తాన్ని సమీక్షించాల్సిన అవసరముంది. ప్రతీ రంగంలోని నిపుణుల సంపాదనలో ఏటికేడు వృద్ధి ఉంటున్నప్పుడు క్రీడాకారులకు ఎందుకు ఉండకూడదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఈసారి ఎక్కువ సంఖ్యలో అవార్డు విజేతలను ఎంపిక చేయడం పట్ల వస్తోన్న విమర్శలను ఆయన తప్పి కొట్టారు. ‘ప్రపంచ వేదికపై మన అథ్లెట్ల ప్రదర్శన గణనీయంగా మెరుగైంది. అందుకే వారి కృషికి గుర్తింపునిచ్చాం. అథ్లెట్ల ఘనతల్ని ప్రభుత్వం గుర్తించకపోతే వారిని నిరాశపర్చినట్లే. గత నిర్ణయాలతో తాజా వాటిని పోల్చకూడదు’ అని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment