
కెరీర్‌కు వీడ్కోలు పలకనున్న భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం
చెన్నై డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీయే చివరిది
కామన్వెల్త్ గేమ్స్‌లో 7 పసిడి పతకాలు... మరో 3 రజతాలు, 3 కాంస్యాలు...ఆసియా క్రీడల్లో 2 కాంస్య పతకాలు..ఆసియా చాంపియన్‌షిప్‌లో 4 కాంస్యాలు...ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 30వ స్థానం...10 సార్లు జాతీయ సీనియర్ చాంపియన్‌గా ఘనత... ఐదుసార్లు ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం...అర్జున, ఖేల్‌రత్నతో పాటు పద్మశ్రీ పురస్కారం కైవసం...2024 పారిస్ ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకధారిగా భారత బృందానికి నాయకత్వం వహించడం...
ఒక క్రీడాకారుడి కెరీర్‌లో ఇంతకుమించి ఏం కావాలి! భారత టేబుల్ టెన్నిస్ (టీటీ)కు వన్నెతెచి్చన ఆచంట శరత్ కమల్ ఇవన్నీ సాకారం చేసుకున్నాడు. రెండు దశాబ్దాలుగా భారత టీటీ ముఖచిత్రంగా ఉన్న శరత్ కమల్ ఆట ముగించాలని నిర్ణయం తీసుకున్నాడు. స్వస్థలం చెన్నైలో ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు జరిగే వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో చివరిసారి బరిలోకి దిగుతానని శరత్ బుధవారం ప్రకటించాడు. 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో లెక్కకు మిక్కిలి పతకాలు నెగ్గిన శరత్ ఘనతలను ఒకసారి గుర్తుచేసుకుంటే...
సాక్షి క్రీడావిభాగం : భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) దిగ్గజం ఆచంట శరత్ కమల్ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. మార్చి 25 నుంచి 30 వరకు చెన్నై వేదికగా జరగనున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీ అనంతరం ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు వెల్లడించాడు. రెండు దశాబ్దాలకు పైగా దేశ అత్యుత్తమ ప్యాడ్లర్‌గా కొనసాగిన 42 ఏళ్ల శరత్ కమల్... కామన్వెల్త్ క్రీడల్లో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు.
ఆసియా క్రీడల్లోనూ అదరగొట్టిన శరత్ కమల్... 2018 జకార్తా గేమ్స్‌లో పురుషుల టీమ్ విభాగంతో పాటు... మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో 4 కాంస్య పతకాలు సాధించిన శరత్ కమల్... ఐదుసార్లు ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. విశ్వక్రీడల్లో శరత్ పతకం సాధించనప్పటికీ అతడి ఘనతలను పతకాలతో కొలవలేం.

సుదీర్ఘ కాలంగా అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ... కెరీర్‌లో అత్యుత్తమంగా ప్రపంచ 30వ ర్యాంక్‌కు చేరుకున్న శరత్ కమల్... దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’తో పాటు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ కూడా దక్కించుకున్నాడు. శరత్ స్ఫూర్తితోనే టేబుల్ టెన్నిస్ వైపు అడుగులు వేసిన మనిక బత్రా, ఆకుల శ్రీజ అంతర్జాతీయ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో దూసుకెళ్తున్నారు.
‘ఆట నుంచి పూర్తిగా తప్పుకుంటానని చెప్పడం లేదు కానీ, ఇకపై పెద్ద టోర్నీలు, జనసమూహాల ముందు జరిగే మ్యాచ్‌ల్లో ఆడను. నా రాకెట్‌కు కొంత విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నా. టేబుల్ టెన్నిస్ నాకు ఇచ్చిన ఆనందం, అభిమానం వెలకట్టలేనిది. దాన్ని మాటల్లో వర్ణించలేను’ అని శరత్ పేర్కొన్నాడు. ‘1998లో చెన్నై వేదికగానే ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌తో నా అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమైంది.
2025లో చెన్నై వేదికగానే డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ ద్వారా నా కెరీర్‌ను ముగించాలని నిర్ణయం తీసుకున్నాను. నా ఆఖరి ఆట తిలకించేందుకు నా కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులు, శ్రేయోభిలాషులు వస్తారు. అత్యుత్తమ ఆటతీరుతో సగర్వంగా కెరీర్‌కు ముగింపు పలకాలని భావిస్తున్నాను’ అని శరత్ కమల్ వివరించాడు.
» సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో 10 సార్లు విజేతగా నిలిచిన శరత్ కమల్... అంతకుముందు కమలేశ్ మెహతా నెలకొల్పిన రికార్డును (8 సార్లు) బద్దలు కొట్టాడు. ‘గత 20 ఏళ్లలో ఆటలో ఎన్నో మార్పులు సంభవించాయి. అప్పట్లో ఇలాంటి కొత్త తరహా షాట్లు ఏమీ లేవు. కానీ ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని మెరుగు పర్చుకుంటూ కొత్త ఒరవడి సృష్టించుకుంటూ వెళ్లడంతోనే శరత్ ఇంత సుదీర్ఘ కాలం రాణించగలిగాడు’ అని కమలేశ్ పేర్కొన్నాడు.
» 2015 ప్రపంచ చాంపియన్‌షిప్ సమయంలో గాయపడిన శరత్ తిరిగి కోలుకుంటాడని ఎవరూ ఊహించి ఉండరు. కండరాల సమస్య నుంచి పూర్తిగా కోలుకున్న శరత్... ఆ తర్వాత కెరీర్‌లో ఎన్నో అద్వితీయ విజయాలు సాధించాడు.
» టేబుల్ టెన్నిస్‌లో చైనా, జపాన్, దక్షిణ కొరియా ఆదిపత్యం కొనసాగుతున్న సమయంలో చైనీయులను ఓడించగలమని నిరూపించిన తొలి భారత ప్లేయర్‌గా శరత్ నిలిచాడు.
» 2018 ఆసియా క్రీడల్లో చెన్నైకే చెందిన సత్యన్‌తో కలిసి శరత్... జపాన్ ద్వయంపై విజయం సాధించి కాంస్యం గెలుచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనిది.
» జకార్తా వేదికగా జరిగిన ఆ క్రీడల్లో మనిక బత్రాతో కలిసి శరత్ మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ కాంస్యం నెగ్గాడు. అప్పటి వరకు ఏమాత్రం అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన శరత్ జంట... ఆ తర్వాత విజృంభించింది.
» 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో నాలుగు పదులు వయసు దాటిన తర్వాత కూడా శరత్ చెలరేగిపోయాడు. ఫిట్‌నెస్ రక్షించుకునేందుకు తీవ్రంగా ప్రయతి్నంచి పోటీల్లో దిగిన శరత్ కమల్... మూడు స్వర్ణాలతో అదరగొట్టాడు. తెలంగాణకు చెందిన ఆకుల శ్రీజతో కలిసి శరత్ కమల్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు.
» పెద్ద టోర్నమెంట్‌లో బరిలోకి దిగే ముందు బాగా ప్రాక్టీస్ చేసి కొత్త షాట్లను తన అమ్ములపొదిలో చేర్చుకోవడం శరత్‌కు అలవాటు. ఈ వయసులో ఇవన్నీ ఎలా సాధ్యం అనే ప్రశ్నకు చిరునవ్వే కమల్ సమాధానం.
» అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) అథ్లెట్స్ కమిషన్‌కు ఎంపికైన తొలి భారత అథ్లెట్‌గా శరత్ ఘనత సాధించాడు.
» ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో సభ్యుడిగా ఉన్న శరత్ కమల్... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లోనూ చోటు దక్కించుకోవాలని భావిస్తున్నాడు.
» ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు (ఎస్‌డీఏటీ) సహకారంతో మెలకొట్టాయుర్‌లోని తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శరత్ సొంతంగా హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌ను నెలకొల్పనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment