Khel Ratna
-
భారత హాకీ హీరో
హాకీలో.. జట్టు విజయంలో డ్రాగ్‌ఫ్లికర్ పాత్ర ఎంతో కీలకం. పెనాల్టీలను గోల్స్‌గా మలచడానికి ఉండాల్సిన అసాధారణ నైపుణ్యం వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. సుదీర్ఘ కాలం హాకీని శాసించిన యూరోపియన్ టీమ్‌లు అత్యుత్తమ డ్రాగ్ఫ్లికర్లతో ఫలితాలు సాధించాయి. మన జట్టు కూడా ఒక దశలో జుగ్రాజ్ సింగ్, సందీప్ సింగ్‌లాంటి ఆటగాళ్లతో దూసుకుపోయింది. అయితే వీరిద్దరూ నిష్క్రమించిన తర్వాత మన టీమ్‌లో ఒకరకమైన స్తబ్దత ఆవరించింది. కొందరు ఆటగాళ్లతో చేసిన ప్రయోగాలు విఫలం కావడంతో.. భారత్ విజయాల్లో వెనుకబడిపోయింది. ఇలాంటి సమయంలో దూసుకొచ్చిన ఆటగాడు హర్మన్‌ప్రీత్ సింగ్. జూనియర్ స్థాయి పోటీల్లో సత్తా చాటి తన ప్రతిభను ప్రపంచానికి ప్రదర్శించిన అతను ఆ తర్వాత సీనియర్ టీమ్‌లోకి వచ్చి డ్రాగ్ఫ్లికర్గా తన బాధ్యతను సమర్థంగా నెరవేరుస్తున్నాడు. గత కొన్నేళ్లలో హర్మన్ ఆటతోనే భారత్ పలు కీలక విజయాలు సాధించింది. ఇందులో రెండు ఒలింపిక్స్ పతకాలు కూడా ఉండటం విశేషం. ఆటగాడిగానే కాదు గత రెండేళ్లుగా భారత జట్టు కెప్టెన్‌గా కూడా హర్మన్ తనదైన ముద్రతో జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. కెప్టెన్‌గా మిశ్రమ ఫలితాలతో..రెండేళ్ల క్రితం హర్మన్‌ప్రీత్ సింగ్ భారత హాకీ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో హర్మన్‌ప్రీత్ జట్టును సమర్థంగా నడిపించాడు. ఆ మెగా ఈవెంట్లో భారత్ స్వర్ణపతకం గెలుచుకోవడంతో పాటు పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత సాధించింది. దాంతో హర్మన్‌కు మంచి ప్రశంసలు లభించాయి. అయితే కొద్ది రోజులకే వరల్డ్ కప్ రూపంలో మరో సవాలు వచ్చిపడింది. పరిస్థితి ఒక్కసారిగా ప్రతికూలంగా మారిపోయింది. సొంతగడ్డపై పేలవ ప్రదర్శనతో జట్టు క్వార్టర్ ఫైనల్‌కు ముందే నిష్క్రమించింది. 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో హర్మన్ నాయకత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ఒలింపిక్స్ పతకాన్ని అందించి..వరల్డ్ కప్‌లో జట్టు ఓడినా నిజానికి ఆ ఏడాదంతా హర్మన్ ప్రదర్శన చాలా బాగుంది. 33 మ్యాచ్‌లలో అతను 42 గోల్స్‌తో సత్తా చాటాడు. ఇదే ప్రేరణగా అతను పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యాడు. వరల్డ్ కప్ ఓటమి తర్వాత.. ఒక పెద్ద విజయం సాధిస్తేనే జట్టు స్థాయి నిలబడుతుందని, అందుకు కెప్టెన్‌గా తన వంతు పాత్ర పోషించాల్సి ఉందని హర్మన్ గట్టిగా నమ్మాడు. అతని కెప్టెన్సీలో భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఆ ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో అతను చెలరేగాడు. సహచరులూ హర్మన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. దాంతో పారిస్ క్రీడల్లో భారత్ కాంస్య పతకాన్ని అందుకొని సగర్వంగా నిలిచింది. 10 గోల్స్‌తో హర్మన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వాటిల్లో ఆస్ట్రేలియాపై 1972 తర్వాత ఒలింపిక్స్‌లో గెలిచేందుకు ఉపకరించిన రెండు గోల్స్‌తో పాటు కాంస్య పతక పోరులో స్పెయిన్‌పై అతను సాధించిన రెండు కీలక గోల్స్ కూడా ఉండటం విశేషం. ఇదే ఫామ్‌ను ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో కూడా కొనసాగించి భారత్‌ను విజేతగా నిలిపాడు. అప్పుడు కూడా 7 గోల్స్‌తో అతను టాప్‌స్కోరర్‌గా నిలవడం విశేషం. సంగీతం నుంచి హాకీ వైపు..హర్మన్‌ప్రీత్ స్వస్థలం అమృత్సర్ సమీపంలోని టిమ్మోవాల్. వ్యవసాయ కుటుంబం. హర్మన్‌కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే బాగా ఇష్టం. ఊర్లో జాతర మొదలు ఎక్కడికి వెళ్లినా హార్మోనియం లేదా మరేదైనా సంగీత పరికరాన్ని కొనిపెట్టమని పోరు పెట్టేవాడట. హర్మన్ వాళ్ల నాన్న సరబ్జిత్ సింగ్ కూడా కొడుకు కోరికను ఎప్పుడూ కాదనలేదు. ఆ సంగీతపరికరాలను వాయిస్తూ తనకు నచ్చిన పాటలు పాడుకుంటూ మైమరచిపోయేవాడు. అయితే స్కూల్లో పీఈటీ టీచర్ హర్మన్‌ను మార్చాడు. పాటలు గీటలు జీవితంలో పనికొచ్చేవి కావు.. ఏదైనా ఆటలోకి ప్రవేశించు, భవిష్యత్తు బాగుంటుందంటూ సూచించాడు. అంతేకాదు అప్పటికే భారత హాకీలో దిగ్గజాలుగా నిలిచిపోయిన పలువురు పంజాబ్ ఆటగాళ్ల గురించి వివరించి అతనిలో స్ఫూర్తి నింపాడు. దాంతో పదేళ్ల వయసులో హర్మన్ చేతిలోంచి హార్మోనియం పెట్టె పోయి హాకీ స్టిక్ వచ్చింది. స్కూల్లో సాధనతోనే సరిపెట్టకుండా హర్మన్‌ను పూర్తిస్థాయి ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు తండ్రీ సిద్ధమైపోయాడు. ఫలితంగా పంజాబ్‌లోని ప్రముఖ శిక్షణా కేంద్రం సుర్జీత్ సింగ్ అకాడమీలో అతడిని చేర్పించాడు. అక్కడే హర్మన్ ఆటగాడిగా రాటుదేలాడు. హర్మన్ డ్రాగ్ఫ్లికర్గా రాణించడం వెనుక ఆసక్తికర నేపథ్యం ఉంది. చిన్న వయసులోనే పొలాల్లో అతను ట్రాక్టర్‌తో వ్యవసాయం చేస్తున్నప్పుడు బలమైన గేర్ రాడ్‌ను పదేపదే వాడాల్సి వచ్చేది. దాంతో అతని భుజాలు మరింత బలంగా మారాయి. అదే డ్రాగ్ఫ్లికింగ్లో ఉపయోగపడిందని కోచ్‌లు చెబుతారు. సాధన సమయంలోనూ సాధారణ బంతి కంటే బరువైన బంతులతో హర్మన్ ప్రాక్టీస్ చేయడం కూడా అతని సాఫల్యానికి మరో కారణం. తిరుగులేని కెరీర్..భారత జూనియర్ జట్టులో 15 ఏళ్ల వయసులో మొదటిసారి స్థానం దక్కిన తర్వాత హర్మన్‌ప్రీత్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. యూత్ టోర్నీ సుల్తాన్ జౌహర్ కప్‌లోనే 2014లో 9 గోల్స్ కొట్టి భారత్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత భారత జూనియర్ జట్టు ఆసియా కప్‌ను, వరల్డ్ కప్‌ను గెలుచుకోవడంలో కూడా హర్మన్ కీలక పాత్ర పోషించాడు. సహజంగానే ఈ ప్రదర్శనలు అతడిని సీనియర్ టీమ్‌లోకి ఎంపికయ్యేలా చేశాయి. 2015లో 19 ఏళ్ల వయసులో హర్మన్ మొదటిసారి జపాన్‌పై భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గత తొమ్మిదేళ్లుగా ఇంతింతై వటుడింతై అంటూ తన ఆటకు మెరుగులు దిద్దుకుంటూ ఇప్పుడు టీమ్‌లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. సుదీర్ఘ కెరీర్లో హర్మన్ ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించాడు. టీమ్ సభ్యుడిగా అతను 2 ఒలింపిక్స్ పతకాలు, 2 చాంపియన్స్ ట్రోఫీ పతకాలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఆసియా కప్, ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, జూనియర్ వరల్డ్ కప్‌లలో అతను భాగస్వామి కావడం విశేషం. మూడుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా అంతర్జాతీయ హాకీ సమాఖ్య అవార్డునూ అందుకున్నాడు. -
గొప్ప గుర్తింపే... కానీ ఇక్కడితోనే ఆగిపోను!
అమృత్సర్ శివారు గ్రామంలోని రైతు బిడ్డ హర్మన్‌ప్రీత్ సింగ్. హాకీలో మేటి ఆటగాడిగా ఎదిగాడు. దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్ చరిత్రలో వరుస పతకాలు సాధించిన జట్టును నడిపించిన అతన్ని ప్రతిష్టాత్మక ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపిక చేశారు. ఈసారి హర్మన్‌తో పాటు ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్, ఒలింపిక్స్ ‘డబుల్ ధమాకా’ మనూ భాకర్ (షూటింగ్), పారాలింపిక్ చాంప్ ప్రవీణ్‌లను ఆ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా తన హాకీ ప్రయాణం, ప్రతిష్టాత్మక అవార్డు సాఫల్యంపై హర్మన్ హర్షం వ్యక్తం చేశాడు. న్యూఢిల్లీ: అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’కు ఎంపికైన భారత హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తన కెరీర్లో ఇదో గొప్ప సాఫల్యమన్నాడు. అయితే ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుతోనే మురిసిపోనని, కెరీర్లో మరెన్నో మైలురాళ్లు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పాడు. టోక్యో–2020, పారిస్–2024 ఒలింపిక్స్‌లలో భారత హాకీ జట్టు వరుసగా కాంస్య పతకాలు సాధించింది. ఇందులో స్టార్ డ్రాగ్ ఫ్లికర్ హర్మన్ కీలక భూమిక పోషించాడు. భారత అత్యున్నత క్రీడా పురస్కారానికి ఎంపికైన హర్మన్ మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే... ఈ పయనం ఎంతో నేర్పింది హాకీలో నా ప్రయాణం నాకెంతో నేరి్పంది. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కొన్నింటా గెలిచాం. మరికొన్ని మ్యాచ్‌ల్లో ఓడాం. కానీ ఫలితాలేవైనా నాకన్నీ అవి అనుభవ పాఠాలే. కెరీర్ మొదలైన రోజే నేనెలా ఎలా మెరుగవ్వాలి. ఏం చేయాలని నా మనసుకు స్వీయ లక్ష్యాన్ని పెట్టుకున్నాను. ఇప్పుడు జట్టుగా... సహచరులతో కలిసికట్టుగా విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఒలింపిక్స్ పతకాల్లో, నా ‘ఖేల్‌రత్న’లో సహచరుల అండదండలున్నాయి. ప్రపంచకప్ పతకమే లక్ష్యం హాకీలో అడుగు పెట్టిన 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతీ మ్యాచ్‌ను అస్వాదించాను. విజయానుభూతిని అనుభవించాను. ఓటమిని జీర్ణించుకున్నాను. ఇలా నేనెంచుకున్న క్రీడలో ప్రతీక్షణం సంతృప్తికరంగానే గడిచింది. అయితే ఇప్పుడు నా ప్రధాన లక్ష్యం ప్రపంచకప్ పతకమే! బెల్జియంలో వచ్చే ఏడాది జరిగే ఈవెంట్లో భారత్‌ను సన్నద్ధం చేయడానికి తగిన సమయం లభించింది. ఒలింపిక్స్‌లో స్వర్ణం, మేజర్ టోర్నీల్లో విజయాలే మా జట్టు లక్ష్యాలు. దీనికోసం ఒక్కోఅడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడప్పుడే రిటైర్మెంటా? ఇప్పుడైతే దృష్టంతా ఆటపైనే ఉంది. రిటైర్మెంట్కు చాలా సమయం ఉంది. ప్రపంచకప్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు మిగిలే ఉన్నాయి. జట్టును పరిస్థితులకు తగ్గట్లుగా తయారు చేసి మేజర్ ఈవెంట్లలో గట్టి ప్రత్యర్థిగా బరిలోకి దించే కసరత్తు నిరంతరం చేస్తూనే ఉంటాం.ముఖ్యంగా మ్యాచ్‌ల్లో టీమ్ కాంబినేషనే అత్యంత కీలకమవుతుంది. గెలిచినపుడు పొంగిపోయినట్లే ఓడినపుడు కుంగిపోకుండా ఎక్కడ లోపం జరిగిందో దృష్టిపెట్టి అధిగమించాల్సి ఉంటుంది. -
హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ‘ఖేల్‌రత్న’ అవార్డు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటనకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 12 మంది సభ్యుల సెలక్షన్ కమిటీ అర్జున, ఖేల్‌రత్న, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ తదితర అవార్డులకు సంబంధించిన నామినేషన్ల జాబితాను ప్రభుత్వానికి అందించింది. మార్పులు లేకుండా దాదాపు ఇదే జాబితా ఖాయమయ్యే అవకాశం ఉంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేరును ‘ఖేల్‌రత్న’ పేరు కోసం ప్రతిపాదించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన 28 ఏళ్ల హర్మన్‌ప్రీత్... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో భారత్ పతకాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. హర్మన్‌తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ‘ఖేల్‌రత్న’ కోసం సిఫారసు చేసింది. పారిస్ పారాలింపిక్స్ హైజంప్ (టి64 క్లాస్)లో ప్రవీణ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు సాధించిన షూటర్ మనూ భాకర్ పేరు ఖేల్‌రత్న జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న ప్లేయర్‌గా మరో చర్చ లేకుండా ‘ఖేల్ రత్న’ అవార్డుకు ఆమె అర్హురాలు. అయితే మనూ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని క్రీడా మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. దానిని మనూ తండ్రి రామ్‌కిషన్ ఖండించారు. తాను సరైన ఫార్మాట్లోనే అప్లికేషన్ అందించామని స్పష్టం చేశారు. ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోయినా ... ప్రదర్శనను బట్టి అవార్డుకు ఎంపిక చేసే అధికారం జ్యూరీకి ఉంది. కాబట్టి మనూ సాధించిన ‘డబుల్ ఒలింపిక్ మెడల్’ ఘనతను బట్టి చూస్తే ఆలస్యంగానైనా ఆమె పేరు ఈ జాబితాలో చేరవచ్చు. ‘అర్జున’ జాబితాలో 30 మంది కమిటీ ప్రతిపాదించిన ‘అర్జున’ అవార్డీల జాబితాలో 13 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, మరో 17 మంది పారా ఆటగాళ్లు ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న అమన్ (రెజ్లింగ్), సరబ్జోత్, స్వప్నిల్ కుసాలే (షూటింగ్) పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పారా ఆటగాళ్లలో తెలంగాణకు చెందిన దీప్తి జివాంజికి ‘అర్జున’ దక్కనుండటం విశేషం. వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి పారిస్ పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు (టి20)లో కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు ఆసియా పారా క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో ఆమె ఖాతాలో రెండు స్వర్ణాలు ఉన్నాయి. పారా షూటింగ్ కోచ్ సుభాష్ రాణా పేరును ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం కమిటీ సిఫారసు చేసింది. ఈ జాబితాలో మరో కోచ్ అమిత్ కుమార్ సరోహా పేరు కూడా ఉండటం చర్చకు దారి తీసింది. అతను ఎప్పుడూ అధికారికంగా కోచ్‌గా పని చేయలేదని... పైగా ఇటీవల పారిస్‌లోనూ ఆటగాడిగా బరిలోకి దిగాడు కాబట్టి ద్రోణాచార్య అవార్డుకు అర్హుడు కాదని విమర్శలు వస్తున్నాయి. -
వినేశ్ కూడా వెనక్కిచ్చేసింది!
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా కేంద్ర క్రీడా అవార్డులను వెనక్కి ఇచ్చేసింది. శనివారం కర్తవ్యపథ్ వద్ద ఆమె ‘ఖేల్‌రత్న’, అర్జున అవార్డులను వదిలేసి వెళ్లింది. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పతకాలతో ఆమె దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఫొగాట్ ఘనతలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’, అర్జున అవార్డులను ఇచ్చింది. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)లో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ వర్గమే కొత్తగా ఎన్నికైంది. ఆయన విధేయుడైన సంజయ్ సింగ్ అధ్యక్షుడు అయ్యారు. దీన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ నిమిషాల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించింది. బజరంగ్ ‘పద్మశ్రీ’ని వెనక్కిచ్చాడు. బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా తన పురస్కారాన్ని వెనక్కిస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఫొగాట్ కూడా ముందు ప్రకటించినట్లే ఖేల్‌రత్న, అర్జున అవార్డుల్ని వెనక్కి ఇచ్చేందుకు ప్రధానమంత్రి నివాసానికి బయల్దేరింది. కర్తవ్యపథ్ వద్ద ఢిల్లీ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో అవార్డుల్ని రోడ్డుపైనే వదిలేసింది. ఆ పురస్కారాలు ఇప్పుడు పోలీసుల ఆ«దీనంలో ఉన్నాయి. -
టాప్–10లో నిలవాలి
న్యూఢిల్లీ: 2028 ఒలింపిక్ క్రీడల్లో భారత్ పతకాల జాబితాలో టాప్–10లో నిలుస్తుందనే నమ్మకముందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రానున్న కాలంలో మన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికల్లో కొత్త చరిత్ర లిఖిస్తారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మానసిక శక్తితో ఆటగాళ్లు కోవిడ్–19ను దీటుగా ఎదుర్కోవాలని ఆకాంక్షించారు. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ 115వ జయంతి వేడుకల సందర్భంగా ఆయనను కోవింద్ స్మరించుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జాతీయ క్రీడా పురస్కారాలను అందజేశారు. ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికైన ఆటగాళ్లను, కోచ్‌లను అభినందించారు. క్రీడాకారులంతా అద్వితీయ ప్రదర్శనలతో భారతీయులందరికీ మరపురాని మధుర స్మృతులను అందించారని కొనియాడారు. ‘వర్చువల్’గా అవార్డుల స్వీకరణ 44 ఏళ్ల ఈ అవార్డుల చరిత్రలో కరోనా కారణంగా కొత్త సంప్రదాయానికి తెర తీయాల్సి వచ్చింది. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో జరగాల్సిన ఈ వేడుకలు సాంకేతిక హంగులతో ముందుకొచ్చాయి. వర్చువల్ (ఆన్లైన్) పద్ధతిలో అలరించాయి. దీనికి దేశంలోని 11 భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రాలు వేదికలుగా నిలిచాయి. రాష్ట్రపతి భవన్‌తో అనుసంధానమైన సాయ్ కేంద్రాలు అత్యంత సురక్షిత వాతావరణంలో వేడుకల్ని నిర్వహించాయి. మొత్తం 74 (5 ఖేల్‌రత్న, 27 అర్జున, 13 ద్రోణాచార్య, 15 ధ్యాన్‌చంద్ ) మంది ఈ ఏడాది జాతీయ అవార్డులను గెలుచుకోగా శనివారం 60 మంది ఈ పురస్కారాలను స్వీకరించారు. ఖేల్‌రత్నకు ఎంపికైన మహిళా హాకీ ప్లేయర్ రాణి రాంపాల్, పారాలింపియన్ తంగవేలు సాయ్ పుణే కేంద్రం నుంచి... టీటీ ప్లేయర్ మనికా బాత్రా బెంగళూరు నుంచి ఈ అవార్డులను అందుకున్నారు. దుబాయ్‌లో ఉండటంతో రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, కరోనా సోకడంతో వినేశ్ ఫొగాట్, ఏపీ బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ తమ అవార్డులను అందుకోలేదు. భారీగా పెరిగిన ప్రైజ్‌మనీ అవార్డు విజేతలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మరో తీపి కబురు అందించింది. జాతీయ క్రీడా అవార్డుల ప్రైజ్‌మనీ భారీగా పెంచినట్లు మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే దీనిని అమల్లోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. నూతన విధానం ప్రకారం ఖేల్‌రత్న పురస్కారానికి రూ. 25 లక్షల ప్రైజ్‌మనీగా చెల్లించనున్నారు. గతంలో ఇది రూ. 7.5 లక్షలుగా ఉంది. దీనితో పాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డుల ప్రైజ్‌మనీలో కూడా మార్పులు చేశారు. గతేడాది వరకు ఈ అవార్డులకు రూ. 5 లక్షలు చొప్పున చెల్లిస్తుండగా... ఈ ఏడాది నుంచి అర్జున, ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం గ్రహీతలకు రూ. 15 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. ద్రోణాచార్య (రెగ్యులర్), ధ్యాన్‌చంద్ అవార్డు విజేతలు రూ. 10 లక్షల చొప్పున అందుకోనున్నారు. దీనిపై మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ ‘చివరిసారిగా 2008లో ప్రైజ్‌మనీలో మార్పులు జరిగాయి. ప్రతీ పదేళ్లకోసారి ఈ మొత్తాన్ని సమీక్షించాల్సిన అవసరముంది. ప్రతీ రంగంలోని నిపుణుల సంపాదనలో ఏటికేడు వృద్ధి ఉంటున్నప్పుడు క్రీడాకారులకు ఎందుకు ఉండకూడదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఈసారి ఎక్కువ సంఖ్యలో అవార్డు విజేతలను ఎంపిక చేయడం పట్ల వస్తోన్న విమర్శలను ఆయన తప్పి కొట్టారు. ‘ప్రపంచ వేదికపై మన అథ్లెట్ల ప్రదర్శన గణనీయంగా మెరుగైంది. అందుకే వారి కృషికి గుర్తింపునిచ్చాం. అథ్లెట్ల ఘనతల్ని ప్రభుత్వం గుర్తించకపోతే వారిని నిరాశపర్చినట్లే. గత నిర్ణయాలతో తాజా వాటిని పోల్చకూడదు’ అని ఆయన స్పష్టం చేశారు. -
అర్జున జాబితాలో రవీంద్ర జడేజా
గోపీచంద్ అకాడమీ ఆణిముత్యం, తెలుగుతేజం సాయిప్రణీత్‌కు భారత ప్రభుత్వం నుంచి ఘనమైన గుర్తింపు లభించనుంది. యేటికేడు తన రాకెట్ పదును పెంచుకుంటున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్‌కు ‘అర్జున’ అవార్డు ఖాయమైంది. పారాలింపియన్ దీప మాలిక్ రెండో ‘ఖేల్‌రత్న’గా ఎంపిక కాగా... బ్యాడ్మింటన్ గురువు విమల్ కుమార్ ద్రోణాచార్యుడయ్యాడు. క్రికెటర్లు రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ అర్జునలుగా నిలిచారు. అయితే ఎప్పటిలాగే చిన్నపాటి అసంతృప్తుల సమేతంగానే ఈ సారి కూడా క్రీడా పురస్కారాల జాబితా వెలువడింది. న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారానికి మరో తెలుగు షట్లర్ ఎంపికయ్యాడు. భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంటాబయటా నిలకడగా రాణిస్తున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్ ప్రతిభను అవార్డుల కమిటీ గుర్తించింది. 2017లో ప్రణీత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నిలకడైన ప్రదర్శనతో సింగపూర్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్లలో టైటిల్స్ గెలిచాడు. సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. పారాలింపియన్ దీపా మాలిక్‌కు భారత అత్యున్నత క్రీడాపురస్కారం దక్కనుంది. రియో పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన ఆమెను ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు నామినేట్ చేశారు. ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆ అవార్డుకు ఎంపికవగా ఈ ఏడాది సంయుక్తంగా ఇద్దరికి ఆ పురస్కారం లభించనుంది. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్‌లు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని అవార్డుల కమిటీ 19 మందిని ‘అర్జున’కు, ఇద్దరిని ‘ఖేల్‌రత్న’కు ఎంపిక చేసింది. మరో ముగ్గురిని ‘ద్రోణాచార్య’కు నామినేట్ చేసింది. దీపకు మూడో పురస్కారం పారా అథ్లెట్ దీప 2012లో అర్జున అవార్డు అందుకుంది. రెండేళ్ల క్రితం 2017లో భారత పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని దక్కించుకుంది. వరుసగా మూడు పారా ఆసియా గేమ్స్ (2010, 2014, 2018)లో పతకాలు గెలిచిన భారత మహిళా అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. జకార్తా (2018) ఈవెంట్లో ఆమె డిస్కస్ త్రో, జావెలిన్ త్రోలో కాంస్యాలు గెలిచింది. గడిచిన నాలుగేళ్ల ప్రదర్శన ఆధారంగా ఇచ్చే ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఆమె అర్హురాలని కమిటీ నిర్ణయించింది. పూనియాతో పాటు ఆమెను ఎంపిక చేసింది. మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ ఐసీసీ ఈవెంట్లలో పరుగుల ప్రవాహం సృష్టించడంతో ‘అర్జున’కు ఎంపికైంది. మహిళల భారత జట్టు 2017లో వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్, గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. విమల్‌కు ద్రోణాచార్య సైనా నెహ్వాల్ మాజీ కోచ్ విమల్ కుమార్ ‘ద్రోణాచార్య’కు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), మొహిందర్ సింగ్ ధిల్లాన్ (అథ్లెటిక్స్) కోచ్‌లకు ఇచ్చే పురస్కారానికి ఎంపికయ్యారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కోచ్ సంజయ్ భరద్వాజ్, మెర్జ్బన్ పటేల్, రణ్బిర్సింగ్ ఖోఖర్ జీవిత సాఫల్య పురస్కారాలకు నామినేట్ అయ్యారు. కమిటీ నామినీల జాబితాను కేంద్ర క్రీడాశాఖ ఆమోదించిన వెంటనే అధికారికంగా విజేతలను ప్రకటిస్తారు. యేటా హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 23)ని జాతీయ క్రీడాదినోత్సవంగా నిర్వహిస్తారు. ఆ రోజు రాష్ట్రపతి భవన్లో ఘనంగా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఖేల్‌రత్న విజేతకు పతకంతో రూ.7.5 లక్షలు, అర్జున, ద్రోణాచార్యలకు మెమెంటో, రూ. 5 లక్షలు బహుమతిగా అందజేస్తారు. మేరీ తప్పుకుంది... భారత చాంపియన్ బాక్సర్ మేరీకామ్ అవార్డుల కమిటీలో ప్రధాన సభ్యురాలు. కానీ ఆమె శనివారం ‘ద్రోణాచార్య’ ఎంపికలో పాలుపంచుకోలేదు. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ బాక్సర్ వ్యక్తిగత కోచ్ చోటేలాల్ యాదవ్ కూడా ‘ద్రోణాచార్య’ ప్రతిపాదిత జాబితాలో ఉన్నారు. దీంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు దూరంగా ఉండాలని భావించిన ఆమె ఎంపిక ప్రక్రియ నుంచి స్వయంగా తప్పుకుంది. అవార్డు నామినీల జాబితా రాజీవ్ ఖేల్‌రత్న: బజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీపామాలిక్ (పారా అథ్లెట్). అర్జున: సాయిప్రణీత్ (బ్యాడ్మింటన్), రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ (క్రికెట్), తేజిందర్‌పాల్ సింగ్, మొహమ్మద్ అనస్ యాహియా, స్వప్న బర్మన్ (అథ్లెటిక్స్), సోనియా లాతర్ (బాక్సింగ్), చింగ్లేశన సింగ్ (హాకీ), అజయ్ ఠాకూర్ (కబడ్డీ), గౌరవ్‌సింగ్ గిల్ (మోటార్ స్పోర్ట్స్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), సుందర్‌సింగ్ గుర్జార్ (పారా అథ్లెట్), అంజుమ్ మోద్గిల్ (షూటింగ్), హర్మీత్ దేశాయ్ (టేబుల్ టెన్నిస్), పూజ ధండ (రెజ్లింగ్), ఫౌవాద్ మిర్జా (ఈక్వెస్ట్రియన్), గుర్‌ప్రీత్‌సింగ్ సంధు (ఫుట్‌బాల్), సిమ్రన్‌సింగ్ షెర్గిల్ (పోలో). ఆర్డీటీకి పురస్కారం క్రీడలను ప్రోత్సహించడంలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ సంస్థను అవార్డు కమిటీ ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’కు ఎంపిక చేసింది. ఐదు దశాబ్దాల క్రితం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’గా మొదలైన ఈ స్వచ్ఛంద సంస్థ మొదట్లో ప్రజల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం శ్రమించింది. కాలక్రమంలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్‌గా మారాక గత 20 ఏళ్లుగా క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 2002లో స్పోర్ట్స్ సెంటర్‌ను ప్రారంభించింది. 32 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పరచింది. సకల సౌకర్యాలతో క్రీడలకు, క్రీడాకారులకు ఎనలేని సేవలందజేస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన నిరుపేద బాలబాలికల్లో ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తోంది. ‘‘చాలా సంతోషంగా ఉంది. సరైన సమయంలో ఈ అవార్డుకు ఎంపికయ్యాను. రాబోయే టోర్నీల్లో మరింత పట్టుదలతో రాణించేందుకు ఈ అవార్డు ఊతమిస్తుంది’’ – ‘సాక్షి’తో సాయి ప్రణీత్ ‘‘మన దేశంలో తమవాళ్లకే అవార్డులు ఇచ్చుకుంటారు. అంటే కమిటీలో మనవారుంటే గుర్తిస్తారు. అంతే తప్ప ప్రదర్శనతోనూ, ప్రతిభతోనూ కాదు. ఇండియాలో ఇంతే. ఎవరేం చేయలేరు. మన పని మనం చేసుకోవాల్సిందే’’ – ట్విట్టర్లో హెచ్.ఎస్.ప్రణయ్ ఆవేదన ‘‘ఆటగాళ్ల విజయంలో కోచ్‌ల పాత్ర ఎంతో ఉంటుంది. నేను ఆ కోచ్‌ల వల్లే ఎదిగాను. జస్పాల్రాణా షూటింగ్లో ఉత్తమ కోచ్. మను భాకర్, సౌరభ్ చౌదరి, అనీశ్ భన్వాలాలను ప్రపంచశ్రేణి షూటర్లుగా తీర్చిదిద్దారు. అలాంటి రాణాను విస్మరించడం సరికాదు. ఇలాంటి తప్పటడుగులు టోక్యో ఒలింపిక్స్‌లో ప్రభావం చూపిస్తాయి’’ – ఒలింపిక్స్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా దీప, జడేజా, పూనమ్, అజయ్, బర్మన్ -
హర్భజన్, ద్యుతీ చంద్ నామినేషన్లు తిరస్కరణ!
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాలకు భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్, టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్‌సింగ్ నామినేషన్లను కేంద్ర క్రీడా శాఖ తిరస్కరించింది. అర్జున అవార్డుకు ద్యుతీచంద్, ఖేల్‌రత్న అవార్డుకు హర్భజన్‌సింగ్ నామినేషన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గడువు ముగిసిన తర్వాత దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)కు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. ‘ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గడువు ముగిసిన తరువాత నామినేషన్లు దాఖలు చేయడంతో వారి పేర్లను తిరస్కరించారు. ముఖ్యంగా ద్యుతీ చంద్ విషయంలో గడువు ముగియడమే కాకుండా, ఆమె పతకాలు కూడా ర్యాంకింగ్ క్రమంలో లేవు. దీంతో మంత్రిత్వ శాఖ పతకాల ప్రకారం ర్యాంకింగ్ ఇవ్వాలని అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఐ)ను కోరింది. అయితే వచ్చిన నామినేషన్స్‌లో ఆమె ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ఆమె పేరును తిరస్కరించారు’ అని ఆ అధికారి చెప్పుకొచ్చారు. హర్భజన్ సింగ్ విషయానికి వస్తే దరఖాస్తులు స్వీకరణకు ఏప్రిల్ 30 ఆఖరి తేదీ కాగా, పంజాబ్ ప్రభుత్వం రెండు నెలలు ఆలస్యంగా పంపించింది. ఇదిలా ఉంటే, తన నామినేషన్ తిరస్కరణకు గురవడంపై ద్యుతీ చంద్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిసింది. అనంతరం మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిశాను. ఇటలీలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో నేను గెలిచిన స్వర్ణ పతాకాన్ని ఆయనకు చూపించాను. నా ఫైల్‌ను పంపించాలని కోరాను. దానికి ఆయన అర్జున అవార్డుకు నామినేషన్‌ను తిరిగి పంపిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాబోయే పోటీలకు సిద్ధమవ్వాలని సూచించారు. అర్జున అవార్డు అవకాశాన్ని ఇంకా కోల్పోలేదు. ఈ విషయంలో అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. రాష్ట్రంలో ఎన్నికలు, తుఫాను వల్ల నా నామినేషన్‌ను ఆలస్యంగా పంపించినట్లు తెలుసు’’అని అన్నారు. -
‘ఖేల్‌రత్న’కు నీరజ్
న్యూఢిల్లీ: స్టార్ జావెలిన్ త్రోయర్, గతేడాది ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా పేరును భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ప్రతిష్ఠాత్మక రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారానికి ప్రతిపాదించింది. ప్రస్తుతం దేశంలోని అతి కొద్దిమంది ప్రపంచస్థాయి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లలో ఒకడైన నీరజ్ గతేడాది కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణం సాధించడంతో ‘అర్జున అవార్డు’కు ఎంపికయ్యాడు. అప్పుడు కూడా ఖేల్‌రత్నకు పరిశీలనకు పంపినా ఆ పురస్కారం దక్కలేదు. అయితే, కొత్త జాతీయ రికార్డు (88.06 మీటర్లు)తో ఆసియా క్రీడల్లో బంగారు పతకం నెగ్గడంతో మరోసారి ప్రతిపాదించారు. ఈసారి అథ్లెటిక్స్ నుంచి ఏఎఫ్ఐ నీరజ్‌ను మాత్రమే ఖేల్‌రత్నకు పంపింది. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేతలు తేజీందర్ పాల్‌సింగ్ తూర్ (షాట్‌పుట్), అర్పిందర్ సింగ్ (ట్రిపుల్ జంప్), మన్జీత్ సింగ్ (800 మీ. పరుగు), స్వప్న బర్మన్ (హెప్టాథ్లాన్)తో పాటు ద్యుతీ చంద్ (100 మీ, 200 మీ. పరుగులో రజతం)లను అర్జున అవార్డుకు ప్రతిపాదించారు. -
‘ఖేల్‌రత్న’ రేసులో బజరంగ్, వినేశ్
న్యూఢిల్లీ: మేటి రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ పేర్లను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ప్రతిపాదించింది. గత రెండేళ్లుగా అద్భుత ప్రదర్శనరీత్యా వీరిద్దరిని ప్రతిష్టాత్మక అవార్డుకు సమాఖ్య సిఫార్సు చేసింది. ఇప్పటికే వీరు తమ దరఖాస్తులను సమర్పించినట్లు తెలిపింది. రాహుల్ అవారె, హర్‌ప్రీత్ సింగ్, దివ్య కక్రాన్, పూజా ధండా పేర్లను ‘అర్జున అవార్డు’కు, కోచ్‌లకు ప్రకటించే ద్రోణాచార్య అవార్డుకు వీరేందర్ కుమార్, సుజీత్ మాన్, నరేంద్ర కుమార్, విక్రమ్ కుమార్‌లను డబ్ల్యూఎఫ్ఐ ప్రతిపాదించింది. ధ్యాన్‌చంద్ జీవిత కాల సాఫల్య పురస్కారానికి భీమ్ సింగ్, జై ప్రకాష్ పేర్లను పంపింది. ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న 25 ఏళ్ల బజరంగ్... ఇటీవల చైనాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో పురుషుల ఫ్ట్రీసయిల్ 65 కేజీల విభాగంలో బంగారు పతకం గెల్చుకున్నాడు. గతేడాది జకార్తా ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు కైవసం చేసుకున్నాడు. ఇక వినేశ్... ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా నిలిచింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా 53 కేజీలో విభాగంలో పోటీ పడిన ఆమె కాంస్యంతో సరిపెట్టుకుంది. మరోవైపు జాతీయ షూటింగ్ సమాఖ్య... హీనా సిద్ధు, అంకుర్ మిట్టల్‌లను ‘ఖేల్‌రత్న’కు అంజుమ్ మౌద్గిల్, షాజిర్ రిజ్వీలను ‘అర్జున అవార్డు’లకు నామినేట్ చేసింది. -
ఈసారైనా కోహ్లిని వరించేనా?
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పేరును అవార్డుల సెలక్షన్ కమిటీ సిఫారుసు చేసింది. కోహ్లిని ‘ఖేల్‌రత్న’కు నామినేట్ చేయడం ఇది రెండోసారి. 2016లోనూ అతని పేరును పంపినప్పటికీ ఒలింపిక్స్ జరిగిన ఏడాది కావడంతో పతక విజేతలు పీవీ సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్)లతోపాటు దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్)కు ఉమ్మడిగా ఆ అవార్డు ఇచ్చారు. దీంతో కోహ్లికి నిరాశే ఎదురైంది. మరి ఈసారైనా ఖేల్‌రత్న అవార్డు కోహ్లికి దక్కుతుందా..లేదా అనేది కేంద్ర క్రీడాశాఖ చేతుల్లో ఉంది. మరొకవైపు వరల్డ్ చాంపియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానును కూడా ఖేల్‌రత్నకు సిఫారుసు చేశారు. గతేడాది అమెరికాలో జరిగిన ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో మీరాబాయి చాను స్వర్ణ పతకం గెలిచింది. కాగా, కోహ్లికి ఖేల్‌రత్న అవార్డు దక్కితే మాత్రం మూడో క్రికెటర్‌గా నిలుస్తాడు. గతంలో సచిన్ టెండూల్కర్(1997), ఎంఎస్ ధోని(2007)లు మాత్రమే ఖేల్‌రత్న అవార్డులు అందుకున్న క్రికెటర్లు. -
ఘనంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం
♦ ‘ఖేల్‌రత్న’ అందుకున్న జజరియా, సర్దార్ సింగ్ ♦ ‘అర్జున’ స్వీకరించిన సాకేత్, జ్యోతి సురేఖ ♦ ప్రసాద్‌కు ‘ద్రోణాచార్య’ హకీమ్‌కు ‘ధ్యాన్‌చంద్’ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ క్రీడా పురస్కారాలను స్వీకరిస్తున్న దేవేంద్ర జజరియా, సర్దార్ సింగ్ (ఖేల్‌రత్న), సాకేత్ మైనేని, జ్యోతి సురేఖ (అర్జున), గంగుల ప్రసాద్ (ద్రోణాచార్య లైఫ్‌టైమ్ అచీవ్మెంట్), హకీమ్ (ధ్యాన్‌చంద్ అవార్డు) కుడి నుంచి... న్యూఢిల్లీ: హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జరిగిన జాతీయ క్రీడా అవార్డుల పురస్కార కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకల్లో అత్యున్నత రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డును పారాలింపియన్ దేవేంద్ర జజరియాతో పాటు హాకీ సీనియర్ ఆటగాడు సర్దార్ సింగ్... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. వీరికి జ్ఞాపికతో పాటు రూ.7.5 లక్షల చొప్పున చెక్‌ను అందించారు. 2004 ఏథెన్స్, 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా జావెలిన్ త్రోయర్ జజరియా నిలిచాడు. ఇక గత కొన్నేళ్లుగా మిడ్ ఫీల్డర్ సర్దార్ సింగ్ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే 17 మంది క్రీడాకారులు అర్జున అవార్డు దక్కించుకోగా... కౌంటీ మ్యాచ్‌ల్లో ఆడుతున్న కారణంగా క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడు. మిగతా వారంతా అర్జునను స్వీకరించారు. ఇందులో తెలుగు తేజాలు సాకేత్ మైనేని (టెన్నిస్), జ్యోతి సురేఖ (ఆర్చరీ) కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన జీఎస్ఎస్వీ ప్రసాద్ ‘ద్రోణాచార్య’ (లైఫ్ టైమ్ అచీవ్మెంట్)... ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధికి గుర్తింపుగా తెలంగాణకు చెందిన ఒలింపియన్ సయ్యద్ షాహిద్ హకీమ్ ‘ధ్యాన్‌చంద్’ అవార్డులను అందుకున్నారు. రియో పారాలింపిక్స్ హైజంప్ (ఎఫ్46)లో స్వర్ణం సాధించిన మరియప్పన్ తంగవేలు అర్జున స్వీకరించేందుకు వస్తున్న సమయంలో ఆహుతుల నుంచి విశేష స్పందన కనిపించింది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డును రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ తరఫున నీతా అంబానీ స్వీకరించారు. అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు జ్ఞాపిక, సర్టిఫికెట్లతో పాటు రూ. 5 లక్షల చొప్పున చెక్‌ను అందుకున్నారు. ‘దివ్యాంగ అథ్లెట్లకు ప్రోత్సాహం అందించాలి’ భారత పారా అథ్లెట్లకు ఇది చరిత్రాత్మకమైన రోజు అని దేవేంద్ర జజరియా అభిప్రాయపడ్డాడు. ‘నాలాంటి వారు భారత్‌లో ఐదు కోట్ల మంది అథ్లెట్లు ఉన్నారు. వారికి మరింత తోడ్పాటు అవసరం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగ క్రీడాకారుల కోసం చాలా చేయాల్సి ఉంది’ అని 31 ఏళ్ల జజరియా కోరాడు. అవార్డు గ్రహీతలు ఖేల్‌రత్న: దేవేంద్ర జజరియా(పారాథ్లెట్, జావెలిన్ త్రో), సర్దార్‌సింగ్ (హాకీ). అర్జున: సాకేత్ మైనేని (టెన్నిస్), జ్యోతి సురేఖ (ఆర్చరీ), హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఖుష్బీర్ కౌర్, రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి సింగ్ (బాస్కెట్‌బాల్), దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), బెంబేమ్ దేవి (ఫుట్‌బాల్), ఎస్ఎస్పీ చౌరాసియా (గోల్ఫ్), ఎస్వీ సునీల్ (హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), ప్రకాష్ నంజప్ప (షూటింగ్), ఆంథోనీ అమల్‌రాజ్ (టీటీ), సత్యవర్త్ కడియాన్ (రెజ్లింగ్), తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెట్స్). పుజారా (క్రికెట్). ద్రోణాచార్య: దివంగత డాక్టర్ ఆర్.గాంధీ (అథ్లెటిక్స్), జీఎస్ఎస్వీ ప్రసాద్ (బ్యాడ్మింటన్), బీబీ మహంతి (బాక్సింగ్), హీరానంద్ (కబడ్డీ), రాఫెల్ (హాకీ), సంజయ్ చక్రవర్తి (షూటింగ్), రోషన్ లాల్ (రెజ్లింగ్). ధ్యాన్‌చంద్: భూపిందర్ సింగ్ (అథ్లెటిక్స్), సయ్యద్ షాహిద్ హకీమ్ (ఫుట్‌బాల్), సుమరాయ్ టెటే (హాకీ). -
ఖేల్ రత్న అవార్డులకు ప్రాతిపదిక ఏంటీ?
న్యూఢిల్లీ: క్రీడాకారులకు భారత ప్రభుత్వం ఏటా ఇచ్చే అత్యుత్తమ ‘ఖేల్ రత్న’ అవార్డును ఈసారి నలుగురు ఒలింపిక్ క్రీడాకారులకు ఇచ్చిన విషయం తెల్సిందే. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సోమవారం ఈ అవార్డు అందుకున్న గ్రహీతల్లో పీవీ సింధు, సాక్షి మాలిక్‌లు ఒలింపిక్ మెడల్స్ అందుకున్నవారుకాగా, దీపా కర్మాకర్, జీతూ రాయ్‌లు ఒలింపిక్స్‌లో గట్టి పోటీ ఇచ్చినా పతకం రానివారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి ఖేల్ రత్న అవార్డులతోపాటు రెండవ అత్యుత్తమ అవార్డు అయిన అర్జున అవార్డులను 15 మంది క్రీడాకారులకు అందజేసింది. ద్రోణాచార్య, ద్యాన్‌చంద్ లాంటి అవార్డుల విషయాన్ని పక్కన పెడితే ఖేల్ రత్న, అర్జున అవార్డులను ప్రదానం చేస్తున్న తీరును గమనిస్తే కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న క్రైటేరియా ఏమిటనే సందేహం రాకపోదు. క్రీడా రంగంలో వరుసగా నాలుగేళ్లపాటు ‘స్పెక్టాక్యులర్ (అద్భుతంగా)’, ‘అవుట్ స్టాండింగ్ (అసాధారణం)’ రాణించిన క్రీడాకారులకు ఈ అవార్డులను ఇవ్వాలని కేంద్ర క్రీడాశాఖ మార్గదర్శకాలు తెలియజేస్తున్నాయి. స్పెక్టాక్యులర్, అవుట్ స్టాండింగ్ అనే పదాలకు సరైన నిర్వచనమే మార్గదర్శకాల్లో లేదు. అంటే కేంద్రంలో అధికారంలోవున్న ఏ ప్రభుత్వమైనా ఈ పదాలను ఎలాగైనా వాడుకోవచ్చన్నమాట. ఖేల్‌రత్న, అర్జున అవార్డుల కోసం క్రీడాకారులను ఎంపిక చేయడానికి మాజీ క్రీడాకారులు, మాజీ అవార్డు గ్రహీతలు, ఒలింపియన్స్, క్రీడల జర్నలిస్టులు, నిపుణులు, క్రీడల నిర్వాహకులు, కామెంటేటర్లతో కూడిన ఓ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ అవార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుంది. వివిధ రకాల క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులు గత నాలుగేళ్లలో సాధించిన విజయాలేమిటో పరిశీలించి వాటికి 80 మార్కులు వేస్తుంది. ఆ తర్వాత వారి ఒవరాల్ ప్రతిభను పరిగణలోకి తీసుకొని మరో 20 వెయిటేజ్ మార్కులు వేసే అధికారం కమిటీకి ఉంది. ఆ తర్వాత అవార్డులకు ఎంపికైన క్రీడాకారుల జాబితాను కేంద్ర క్రీడల శాఖ మంత్రికి పంపిస్తుంది. తుది నిర్ణయం ఆ మంత్రియే తీసుకోవాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పులను సూచించే అధికారం కూడా ఆ మంత్రికి ఉంటుంది. ఇప్పటి వరకు ఖేల్‌రత్న, అర్జున అవార్డులకు ఎంపిక చేయడంలో పారదర్శకత పాటించారా? అత్యుత్తమ అవార్డు అయిన ఖేల్ రత్ననే పరిగణలోకి తీసుకుంటే ఆయా కాలాల్లో అంతర్జాతీయ క్రికెట్ రంగంలో బాగా రాణించిన రాహుల్ ద్రవిడ్ (24,208 పరుగులు), సౌరభ్ గంగూలి (18,575 పరుగులతోపాటు ఉత్తమ కెప్టెన్‌గా గుర్తింపు)కి, దేశంలోనే అత్యధిక వికెట్లు తీసుకున్న అనిల్ కుంబ్లే (956 వికెట్లు)లను ఎందుకు విస్మరించారు.? క్రికెట్లో సచిన్‌కు తప్పా ఎవరికి ఖేల్ రత్న ఇవ్వలేదని, ఆ క్రీడను అవార్డు కోసం అంతగా పరిగణలోకి తీసుకోమని సమాధానం వచ్చినట్లయితే 12 మేజర్స్‌లో విజయం సాధించిన ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ మహేశ్ భూమతిని ఎందుకు విస్మరించారనే ప్రశ్న తలెత్తక మానదు. 1999 నుంచి 2002 మధ్య ఆయన కనీసం ఐదు మేజర్స్‌లో విజయం సాధించారు. చెస్‌లో విశ్వనాథ ఆనంద్‌కు మొట్టమొదటిసారిగా 1991–1992లో ఖేల్ రత్న అవార్డు రాగా ఎక్కువ మందికి షూటింగ్‌లోనే ఖేల్ రత్న అవార్డులు వచ్చాయి. ఏ క్రీడలను ప్రోత్సాహించాలనుకుంటున్నారో, ఎవరికి అవార్డులు వస్తాయో సందేహాస్పదంగా ఉంటోంది. ఒలింపిక్స్‌లో ఉత్తమంగా రాణించారనే ఉద్దేశంలో ఈసారి నలుగురు ఒలింపియన్లకు ఖేల్ రత్న అవార్డులు ఇచ్చారని సరిపెట్టుకోవచ్చు. ప్రతిసారి అలా జరగడం లేదుకదా, ప్రతి ఏడాది ఒలింపిక్స్ ఉండవుకదా! అందుకని ఎంపిక క్రైటేరియానే మార్చాల్సి ఉంటుందేమో! -
రియో పతకం సాధిస్తే ఖేల్‌రత్న
కేంద్ర క్రీడాశాఖ నిర్ణయం న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పతకం సాధించిన వారికి వెంటనే ప్రభుత్వం నుంచి గుర్తింపు దక్కనుంది. వీరి పేర్లను ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న, అర్జున అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఈమేరకు కేంద్ర క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒలింపిక్స్ విజేతలు తమ గుర్తింపు కోసం ఏడాది పాటు నిరీక్షించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత విభాగంలో పతకం నెగ్గినవారికి ఖేల్త్న్ర దక్కనుంది. అయితే అంతకుముందు వీరు ఈ అవార్డును తీసుకుని ఉండకూడదు. అలాగే టీమ్ ఈవెంట్స్‌లో తమ ప్రతిభతో జట్టును గెలిపించిన వారికి అర్జున అవార్డును అందిస్తారు. వాస్తవానికి ఖేల్త్న్ర, అర్జున పురస్కారాలు దక్కాలంటే ఆటగాళ్లు గత నాలుగేళ్లలో చేసిన అద్భుత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటారు. -
పతకం తెస్తే పురస్కారం గ్యారంటీ!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ లో పతకాలు సాధించే క్రీడాకారులను తక్షణమే తగురీతిలో గుర్తిస్తామని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ హామీయిచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్ లో పతకాలు గెలిస్తే అవార్డులు ఇస్తామని ప్రకటించింది. విజేతల పేర్లను ఈ ఏడాది రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డులకు పరిగణన తీసుకుంటామని వెల్లడించింది. దీంతో ఒలింపిక్స్ లో ఆటగాళ్లు పతకాలు గెలిచిన తర్వాత అవార్డుల కోసం ఏడాది కాలం పాటు వేచిచూడాల్సిన అవసరం తప్పింది. వ్యక్తిగత విభాగంలో పతకాలు సాధించిన వారి పేర్లను దేశ అత్యున్నత క్రీడాపురస్కారం 'రాజీవ్ ఖేల్ రత్న'కు సిఫారసు చేస్తామని చెప్పింది. క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటనతో ఒలింపిక్స్ లో పాల్గొనబోయే ఆటగాళ్లకు సరికొత్త ప్రోత్సాహం లభించినట్టైంది. -
ఆ కొంత మందిని పట్టించుకోను!
విమర్శకులకంటే నాకు అభిమానుల సంఖ్యే ఎక్కువ నా ధ్యాసంతా ఆటపైనే మీడియాతో సానియా మీర్జా తన కెరీర్లో వివాదాలు కొత్త కాదని, అయితే తరచుగా విమర్శించే కొంత మందిని లెక్క చేయనని ప్రపంచ నంబర్‌వన్ డబుల్స్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యాఖ్యానించింది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన అనంతరం సానియా మంగళవారం తెల్లవారుజామున స్వస్థలం హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. ఈ ఏడాది తనకు అద్భుతంగా కలిసొచ్చిందని, అయితే మరికొన్ని టైటిల్స్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సానియా చెప్పింది. హైదరాబాద్ చేరుకున్న అనంతరం మీడియాతో ముచ్చటిస్తూ సానియా చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... యూఎస్ ఓపెన్ విజయంపై... ప్రతీ గ్రాండ్‌స్లామ్ విజయం ప్రత్యేకమైనదే. అయితే నాకు హార్డ్ కోర్ట్లంటే ఇష్టం. అలాంటి వేదికపై టైటిల్ సాధించడం ప్రత్యేకం. ఇతర టోర్నీలతో పోలిస్తే అమెరికాలో భారత అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. సింగిల్స్‌లో నా అత్యుత్తమ ప్రదర్శన ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది కూడా ఇక్కడే. కాబట్టి యూఎస్ ఓపెన్ రెట్టింపు ఆనందాన్నిచ్చింది. నాకు మద్దతు ఇచ్చిన భారతీయులందరికీ ఈ విజయం అంకితం. హింగిస్‌తో భాగస్వామ్యం... ప్రతీ మ్యాచ్‌కు మేం మెరుగవుతూ ఉన్నాం. ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. క్వార్టర్‌ఫైనల్ తొలి సెట్లో 0-5 నుంచి కోలుకున్నాం అంటే ఎంత బాగా ఆడామో అర్థం చేసుకోవచ్చు. జంటగా మేమిద్దరం ఇప్పటికే నంబర్‌వన్ అయినా మరికొన్ని చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉంది. వచ్చే ఏడాది కూడా మేమిద్దరం కలిసే ఆడతాం. మిక్స్‌డ్‌లో మాత్రం బ్రూనో సోరెస్‌తో కొనసాగుతానో, లేదో చెప్పలేను. ‘ఖేల్ రత్న ’ వివాదంపై... నా గురించి ఎన్నో అర్థం లేని అంశాల గురించి రాసి, చూపించిన మీడియాకు నా కెరీర్లో ఆ రకంగా నేను చాలా సహాయం చేశాను! నాకు కూడా వారు అనవసర ప్రచారం కల్పించినందుకు సంతోషం. అయినా నేను పత్రికలు పెద్దగా చదవను. నేను నా కోసం, నా దేశం కోసం టెన్నిస్ ఆడతాను. నేను ఎంచుకున్న రంగంలో విజయం కోసం కష్టపడతాను. నా ఆటతోనే ఎవరికైనా సమాధానం చెబుతా. కాబట్టి కొంత మంది తరచుగా చేసే విమర్శలను పట్టించుకోను. వారిని మినహాయిస్తే దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు నన్ను ప్రేమిస్తున్నారనేది నాకు తెలుసు. ‘రియో’ ఒలింపిక్స్‌పై... ఒలింపిక్స్‌లో వాస్తవంగా ఆలోచిస్తే మనకు మిక్స్డ్ డబుల్స్‌లో పతకం గెల్చుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే దానికి ఏడాది సమయం ఉంది. రియోలో ఆడేందుకు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొంత సమయం తర్వాతే దానిపై స్పష్టత వస్తుంది. కాబట్టి ఇప్పుడే ఆలోచించడం లేదు. డబ్ల్యూటీఏ ఫైనల్స్‌పై... డిఫెండింగ్ చాంపియన్‌గా దానిని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్నాను. ఈసారి కారా బ్లాక్ స్థానంలో హింగిస్ వచ్చింది. అయితే దానికి ముందు బీజింగ్, షాంఘై, గ్వాంగ్జూ టోర్నీలలో విజయం సాధించాల్సి ఉంది. వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఈ సీజన్‌ను నా కెరీర్లోనే అత్యుత్తమంగా చెప్పగలను. సాధ్యమైనంత కాలం నంబర్‌వన్‌గా ఉండాలని కూడా కోరుకుంటున్నా. ‘బీబీసీ’ సానియాను మళ్లీ మర్చిపోయింది! ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ ‘బీబీసీ’కు టెన్నిస్ మహిళల డబుల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ ఎవరో తెలియకుండా పోదు. వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్‌లు గెలవక ముందే సానియా మీర్జా నంబర్‌వన్ అయింది. అయితే ఈ రెండు టోర్నీలు గెలిచిన సమయంలో ఆ చానల్‌కు చెందిన న్యూస్, స్పోర్ట్స్ ట్విట్టర్ అకౌంట్లలో కనీసం సానియా పేరు కూడా ప్రస్తావించలేదు. యూఎస్ ఓపెన్ నెగ్గిన హింగిస్... హింగిస్ మళ్లీ సాధించింది... ఇలా సాగాయి ఆ చానల్ హెడింగ్స్! ట్రోఫీని ఇద్దరూ ముద్దాడుతున్న ఫొటో పెట్టి కూడా దాని కింద హింగిస్ పేరు మాత్రమే రాసింది. దీనిపై సోషల్ మీడియాలో భారతీయులు విరుచుకుపడ్డారు. ఇది పొరపాటుగా జరిగిందా లేక కావాలనే శ్వేత జాతీయేతర క్రీడాకారిణిపై ఇంకా వివక్ష కొనసాగుతోందా అనేది హాట్ టాపిక్‌గా మారింది. ‘హింగిస్ ఒక్కతే డబుల్స్ గెలిచిందా’... ‘డబుల్స్ అంటే ఇద్దరు ఆడతారనే విషయం కూడా చెప్పాలా’... ‘హింగిస్ రెండు చేతుల్లో రెండు రాకెట్లతో ఆడిందా’... ‘ప్రపంచంలో ఒంటరిగా డబుల్స్ టైటిల్ నెగ్గిన ఏకైక క్రీడాకారిణి హింగిస్’... ఇలా ట్వీట్లతో అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వింబుల్డన్ గెలిచినప్పుడు కూడా బీబీసీ ఇలాగే రాస్తే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ‘సానియా కూడా’... అంటూ విమర్శించింది. దాంతో క్షమాపణ చెబుతూ ట్వీట్ మార్చిన బ్రిటన్ న్యూస్ ఏజెన్సీ ఇప్పుడు మళ్లీ సానియాను మర్చిపోయింది. -
అవార్డుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం: సోనోవాల్
జాతీయ క్రీడా అవార్డుల ఎంపిక ప్రక్రియను సమీక్షించాల్సిన అవసరం లేదని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు. అవార్డులకు క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందన్నారు. సానియాకు ఖేల్ రత్న ఇవ్వడంపై పారాలింపియన్ గిరీష కర్ణాటక హైకోర్టుకు వెళ్లడం, రెజ్లింగ్ కోచ్ అనూప్ సింగ్‌కు ద్రోణాచార్య ఇవ్వడంపై మరో రెజ్లింగ్ కోచ్ వినోద్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం వంటి వివాదాలు ఇటీవల చోటు చేసుకున్నాయి. అయితే వీటిపై స్పందించిన మంత్రి ఎంపిక కమిటీ సరైన నిర్ణయాలే తీసుకుందని సమర్థించారు. -
‘ఖేల్ రత్న’కు ఆరు నామినేషన్లు
జాబితాలో పి.వి.సింధు అర్జున అవార్డుకు మళ్లీ మహేశ్వరి పేరు న్యూఢిల్లీ: హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ‘ఖేల్ రత్న’ అవార్డుకు నామినేట్ అయింది. ఈ ఏడాదికిగాను ఖేల్త్న్రకు ఆరుగురు క్రీడాకారుల పేర్లు నామినేట్ కాగా, వారిలో సింధుతోపాటు టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, గోల్ఫ్ ఆటగాడు జీవ్ మిల్కాసింగ్, అథ్లెటిక్స్ నుంచి కృష్ణ పూనియా, వికాస్ గౌడ, పారా అథ్లెట్ దేవేంద్ర ఝఝారియాలు ఉన్నారు. సింధు గత ఏడాదే అర్జున అవార్డు అందుకోగా, కృష్ణ పూనియా చివరి నిమిషం దాకా ఖేల్త్న్ర రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక అర్జున అవార్డుల కోసం పిస్టల్ షూటర్లు హీనా సిద్ధు, గురుప్రీత్ సింగ్, బ్యాడ్మింటన్ ఆటగాడు అరవింద్ భట్, క్రికెటర్ ఆర్.అశ్విన్ నామినేట్ అయ్యారు. మహేశ్వరిని మళ్లీ నామినేట్ చేసిన ఏఎఫ్ఐ ట్రిపుల్ జంపర్ రంజిత్ మహేశ్వరి పేరును అర్జున అవార్డు కోసం భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ) మళ్లీ ప్రతిపాదించింది. గత ఏడాది మహేశ్వరిని అర్జున అవార్డుకు ఎంపిక చేసినా గతంలో డోప్ టెస్టులో పట్టుబడిన చరిత్ర వల్ల ప్రభుత్వం అతనికి అవార్డును నిరాకరించింది. అయితే 2008లో మహేశ్వరికి శాంపిల్స్‌ను పరీక్షించిన లేబొరేటరీకి అప్పట్లో గుర్తింపు లేదని, 2009లో మాత్రమే గుర్తింపు పొందిందని ఏఎఫ్ఐ అధికారి ఒకరు చెప్పారు. -
సోధికి ఖేల్త్న్ర, కోహ్లికి అర్జున
ఘనంగా క్రీడా అవార్డుల ప్రదానం రాష్ర్టపతి చేతులమీదుగా అందజేత న్యూఢిల్లీ: ఆయా క్రీడల్లో తమ అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి వన్నె తెచ్చిన ఆటగాళ్లను కేంద్ర ప్రభుత్వం అవార్డులతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్లో శనివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్త్న్రను షూటర్ రంజన్ సింగ్ సోధి అందుకున్నాడు. వరుసగా మూడోసారి కూడా ఈ అవార్డు ఓ షూటర్‌కే దక్కడం విశేషం. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో స్వర్ణాలు నెగ్గిన ఏకైక భారత షూటర్‌గా రికార్డులకెక్కిన సోధికి ఈ అవార్డు కింద రూ.7.5 లక్షల నగదు, పతకం, మెమొంటో అందజేశారు. ఇక భారత క్రికెట్ భవిష్యత్ కెప్టెన్‌గా పిలువబడుతున్న విరాట్ కోహ్లి అర్జున అవార్డును అందుకున్నాడు. ఈ సమయంలో అక్కడున్న వారు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. కోహ్లితో పాటు మరో 13 మంది కూడా అర్జున అవార్డులు అందుకున్నారు. అర్జున దక్కించుకున్న వారికి రూ.5 లక్షల చొప్పున నగదు, మెమొంటో, విగ్రహం అందజేశారు. అవార్డీల జాబితా రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర: రంజన్ సింగ్ సోధి అర్జున అవార్డు: విరాట్ కోహ్లి (క్రికెట్), పీవీ సింధు (బ్యాడ్మింటన్), జ్యోత్స్న చినప్ప (స్క్వాష్), కవితా చాహల్ (బాక్సింగ్), సాబా అంజుమ్ (హాకీ), నేహా రాఠి (రెజ్లింగ్), రాజ్‌కుమారి రాథోడ్ (షూటింగ్), చెక్రవోలు సువురో (ఆర్చరీ), మౌమా దాస్ (టేబుల్ టెన్నిస్), రూపేశ్ షా (బిలియర్డ్స్ అండ్ స్నూకర్), అభిజిత్ గుప్తా (చెస్), గగన్ జీత్ భుల్లార్ (గోల్ఫ్), ధర్మేందర్ దలాల్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ సరోహ (పారా అథ్లెటిక్స్). ద్రోణాచార్య అవార్డు: పూర్ణిమ మహతో (ఆర్చరీ), మహావీర్ సింగ్ (బాక్సింగ్), నరీందర్ సింగ్ సైనీ (హాకీ), రాజ్ సింగ్ (రెజ్లింగ్), కేపీ థామస్ (అథ్లెటిక్స్). ధ్యాన్‌చంద్ అవార్డు: మేరీ డి సౌజా సెక్వేరియా (అథ్లెటిక్స్), సయ్యద్ అలీ (హాకీ), అనిల్ మాన్ (రెజ్లింగ్), గిరిరాజ్ సింగ్ (పారా స్పోర్ట్స్). రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: పుల్లెల గోపీచంద్ - నిమ్మగడ్డ ఫౌండేషన్ అకాడమీ ఆఫ్ బ్యాడ్మింటన్, హైదరాబాద్.