హాకీలో.. జట్టు విజయంలో డ్రాగ్‌ఫ్లికర్ పాత్ర ఎంతో కీలకం. పెనాల్టీలను గోల్స్‌గా మలచడానికి ఉండాల్సిన అసాధారణ నైపుణ్యం వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. సుదీర్ఘ కాలం హాకీని శాసించిన యూరోపియన్ టీమ్‌లు అత్యుత్తమ డ్రాగ్‌ఫ్లికర్‌లతో ఫలితాలు సాధించాయి. మన జట్టు కూడా ఒక దశలో జుగ్‌రాజ్ సింగ్, సందీప్ సింగ్‌లాంటి ఆటగాళ్లతో దూసుకుపోయింది. అయితే వీరిద్దరూ నిష్క్రమించిన తర్వాత మన టీమ్‌లో ఒకరకమైన స్తబ్దత ఆవరించింది.
కొందరు ఆటగాళ్లతో చేసిన ప్రయోగాలు విఫలం కావడంతో.. భారత్ విజయాల్లో వెనుకబడిపోయింది. ఇలాంటి సమయంలో దూసుకొచ్చిన ఆటగాడు హర్మన్‌ప్రీత్ సింగ్. జూనియర్ స్థాయి పోటీల్లో సత్తా చాటి తన ప్రతిభను ప్రపంచానికి ప్రదర్శించిన అతను ఆ తర్వాత సీనియర్ టీమ్‌లోకి వచ్చి డ్రాగ్‌ఫ్లికర్‌గా తన బాధ్యతను సమర్థంగా నెరవేరుస్తున్నాడు. గత కొన్నేళ్లలో హర్మన్ ఆటతోనే భారత్ పలు కీలక విజయాలు సాధించింది. ఇందులో రెండు ఒలింపిక్స్ పతకాలు కూడా ఉండటం విశేషం. ఆటగాడిగానే కాదు గత రెండేళ్లుగా భారత జట్టు కెప్టెన్‌గా కూడా హర్మన్ తనదైన ముద్రతో జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు.
కెప్టెన్‌గా మిశ్రమ ఫలితాలతో..
రెండేళ్ల క్రితం హర్మన్‌ప్రీత్ సింగ్ భారత హాకీ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో హర్మన్‌ప్రీత్ జట్టును సమర్థంగా నడిపించాడు. ఆ మెగా ఈవెంట్‌లో భారత్ స్వర్ణపతకం గెలుచుకోవడంతో పాటు పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత సాధించింది. దాంతో హర్మన్‌కు మంచి ప్రశంసలు లభించాయి. అయితే కొద్ది రోజులకే వరల్డ్ కప్ రూపంలో మరో సవాలు వచ్చిపడింది. పరిస్థితి ఒక్కసారిగా ప్రతికూలంగా మారిపోయింది. సొంతగడ్డపై పేలవ ప్రదర్శనతో జట్టు క్వార్టర్ ఫైనల్‌కు ముందే నిష్క్రమించింది. 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో హర్మన్ నాయకత్వంపై విమర్శలు మొదలయ్యాయి.
ఒలింపిక్స్ పతకాన్ని అందించి..
వరల్డ్ కప్‌లో జట్టు ఓడినా నిజానికి ఆ ఏడాదంతా హర్మన్ ప్రదర్శన చాలా బాగుంది. 33 మ్యాచ్‌లలో అతను 42 గోల్స్‌తో సత్తా చాటాడు. ఇదే ప్రేరణగా అతను పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యాడు. వరల్డ్ కప్ ఓటమి తర్వాత.. ఒక పెద్ద విజయం సాధిస్తేనే జట్టు స్థాయి నిలబడుతుందని, అందుకు కెప్టెన్‌గా తన వంతు పాత్ర పోషించాల్సి ఉందని హర్మన్ గట్టిగా నమ్మాడు. అతని కెప్టెన్సీలో భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఆ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో అతను చెలరేగాడు. సహచరులూ హర్మన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. దాంతో పారిస్ క్రీడల్లో భారత్ కాంస్య పతకాన్ని అందుకొని సగర్వంగా నిలిచింది. 10 గోల్స్‌తో హర్మన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వాటిల్లో ఆస్ట్రేలియాపై 1972 తర్వాత ఒలింపిక్స్‌లో గెలిచేందుకు ఉపకరించిన రెండు గోల్స్‌తో పాటు కాంస్య పతక పోరులో స్పెయిన్‌పై అతను సాధించిన రెండు కీలక గోల్స్ కూడా ఉండటం విశేషం. ఇదే ఫామ్‌ను ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో కూడా కొనసాగించి భారత్‌ను విజేతగా నిలిపాడు. అప్పుడు కూడా 7 గోల్స్‌తో అతను టాప్‌స్కోరర్‌గా నిలవడం విశేషం.
సంగీతం నుంచి హాకీ వైపు..
హర్మన్‌ప్రీత్ స్వస్థలం అమృత్‌సర్ సమీపంలోని టిమ్మోవాల్. వ్యవసాయ కుటుంబం. హర్మన్‌కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే బాగా ఇష్టం. ఊర్లో జాతర మొదలు ఎక్కడికి వెళ్లినా హార్మోనియం లేదా మరేదైనా సంగీత పరికరాన్ని కొనిపెట్టమని పోరు పెట్టేవాడట. హర్మన్ వాళ్ల నాన్న సరబ్‌జిత్ సింగ్ కూడా కొడుకు కోరికను ఎప్పుడూ కాదనలేదు. ఆ సంగీతపరికరాలను వాయిస్తూ తనకు నచ్చిన పాటలు పాడుకుంటూ మైమరచిపోయేవాడు. అయితే స్కూల్‌లో పీఈటీ టీచర్ హర్మన్‌ను మార్చాడు. పాటలు గీటలు జీవితంలో పనికొచ్చేవి కావు.. ఏదైనా ఆటలోకి ప్రవేశించు, భవిష్యత్తు బాగుంటుందంటూ సూచించాడు. అంతేకాదు అప్పటికే భారత హాకీలో దిగ్గజాలుగా నిలిచిపోయిన పలువురు పంజాబ్ ఆటగాళ్ల గురించి వివరించి అతనిలో స్ఫూర్తి నింపాడు.
దాంతో పదేళ్ల వయసులో హర్మన్ చేతిలోంచి హార్మోనియం పెట్టె పోయి హాకీ స్టిక్ వచ్చింది. స్కూల్‌లో సాధనతోనే సరిపెట్టకుండా హర్మన్‌ను పూర్తిస్థాయి ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు తండ్రీ సిద్ధమైపోయాడు. ఫలితంగా పంజాబ్‌లోని ప్రముఖ శిక్షణా కేంద్రం సుర్జీత్ సింగ్ అకాడమీలో అతడిని చేర్పించాడు. అక్కడే హర్మన్ ఆటగాడిగా రాటుదేలాడు. హర్మన్ డ్రాగ్‌ఫ్లికర్‌గా రాణించడం వెనుక ఆసక్తికర నేపథ్యం ఉంది. చిన్న వయసులోనే పొలాల్లో అతను ట్రాక్టర్‌తో వ్యవసాయం చేస్తున్నప్పుడు బలమైన గేర్ రాడ్‌ను పదేపదే వాడాల్సి వచ్చేది. దాంతో అతని భుజాలు మరింత బలంగా మారాయి. అదే డ్రాగ్‌ఫ్లికింగ్‌లో ఉపయోగపడిందని కోచ్‌లు చెబుతారు. సాధన సమయంలోనూ సాధారణ బంతి కంటే బరువైన బంతులతో హర్మన్ ప్రాక్టీస్ చేయడం కూడా అతని సాఫల్యానికి మరో కారణం.
తిరుగులేని కెరీర్..
భారత జూనియర్ జట్టులో 15 ఏళ్ల వయసులో మొదటిసారి స్థానం దక్కిన తర్వాత హర్మన్‌ప్రీత్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. యూత్ టోర్నీ సుల్తాన్ జౌహర్ కప్‌లోనే 2014లో 9 గోల్స్ కొట్టి భారత్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత భారత జూనియర్ జట్టు ఆసియా కప్‌ను, వరల్డ్ కప్‌ను గెలుచుకోవడంలో కూడా హర్మన్ కీలక పాత్ర పోషించాడు. సహజంగానే ఈ ప్రదర్శనలు అతడిని సీనియర్ టీమ్‌లోకి ఎంపికయ్యేలా చేశాయి. 2015లో 19 ఏళ్ల వయసులో హర్మన్ మొదటిసారి జపాన్‌పై భారత్ తరఫున అరంగేట్రం చేశాడు.
ఆ తర్వాత గత తొమ్మిదేళ్లుగా ఇంతింతై వటుడింతై అంటూ తన ఆటకు మెరుగులు దిద్దుకుంటూ ఇప్పుడు టీమ్‌లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. సుదీర్ఘ కెరీర్‌లో హర్మన్ ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించాడు. టీమ్ సభ్యుడిగా అతను 2 ఒలింపిక్స్ పతకాలు, 2 చాంపియన్స్ ట్రోఫీ పతకాలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఆసియా కప్, ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, జూనియర్ వరల్డ్ కప్‌లలో అతను భాగస్వామి కావడం విశేషం. మూడుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా అంతర్జాతీయ హాకీ సమాఖ్య అవార్డునూ అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment