రెండేళ్ల క్రితం.. ప్రముఖ చెస్ వెబ్‌సైట్ చెస్ బేస్ డాట్ ఇన్ హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను నిర్వహించింది. అందులో భారత గ్రాండ్‌మాస్టర్లయిన అర్జున్ ఇరిగేశి, డి.గుకేశ్‌లు ఒకవైపు.. 20 మంది జూనియర్ చెస్ ఆటగాళ్లు మరోవైపు ఆడారు. ఫలితాలను పక్కన పెడితే ఇద్దరు టాప్ గ్రాండ్‌మాస్టర్లను కొందరు చిన్నారులు తమ ఆటతో ఆకర్షించారు. వారిలో ఆరేళ్ల ఆదుళ్ల దివిత్ రెడ్డి కూడా ఉన్నాడు. అతనిలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నట్లు గుర్తించిన ఆ ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లూ త్వరలోనే దివిత్ పెద్ద విజయాలు సాధిస్తాడని జోస్యం చెప్పారు. రెండేళ్లు తిరిగేసరికి అది నిజమైంది. దివిత్ రెడ్డి ఇప్పుడు వరల్డ్ క్యాడెట్ అండర్–8 చాంపియన్‌షిప్‌లో సత్తా చాటాడు. కొన్ని నెలల వ్యవధిలో అతను అటు ర్యాపిడ్, ఇటు క్లాసిక్ రెండు విభాగాల్లోనూ వరల్డ్ చాంపియన్‌గా నిలవడం విశేషం. అల్బేనియా, ఇటలీలలో జరిగిన ఈ టోర్నీలో దివిత్ ప్రదర్శన చూస్తే భారత చదరంగంలో మరిన్ని సంచలనాలకు కారణం కాగల కొత్త కెరటం వచ్చినట్లు కనిపిస్తోంది.
ప్రతిభను గుర్తించి..
సాధారణంగా ఐదారేళ్ల చిన్నారులు స్కూల్‌తో పాటు తమ వయసుకు తగినట్లుగా తమకు నచ్చిన విధంగా ఏదో ఒక ఆటలో మునిగి తేలుతుంటారు. కానీ క్రీడలకు సంబంధించి వారిలో దాగి ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు మాత్రమే సరిగ్గా గుర్తించగలరు. దివిత్ తల్లిదండ్రులు మహేశ్ రెడ్డి, సింధుజ సరిగ్గా అదే పని చేశారు. అతడికి చదరంగంపై ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు, ఆ క్రీడలో అతను పూర్తిగా లీనమైపోతున్నట్లు ఆరంభంలోనే గుర్తించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయిన వీరిద్దరూ చెస్‌కు సంబంధించిన పజిల్స్‌ను పరిష్కరించడంలో దివిత్‌కున్న ప్రత్యేక ప్రతిభను పసిగట్టగలిగారు. అందుకే తమ అబ్బాయిని పూర్తిగా చదరంగం వైపు మళ్లిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. దానికి ఎగ్జిబిషన్ టోర్నీ మరింత స్ఫూర్తినిచ్చింది. కోచ్ రామకృష్ణ వద్ద శిక్షణ ఇప్పించారు. రెండేళ్ల పాటు ఆయన శిక్షణలో దివిత్ మరింత రాటుదేలాడు. దాంతో టోర్నీల్లో ఆడించడం మొదలుపెట్టారు.
వరుస విజయాలతో..
రాష్ట్ర స్థాయి టోర్నీల్లో విజేతగా నిలిచిన తర్వాత దివిత్ జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. అక్కడి ప్రదర్శన ఆ చిన్నారిలోని అపార ప్రతిభను చాటింది. ఫలితంగా వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అల్బేనియాలో జరిగిన టోర్నీ ద్వారా దివిత్ టాలెంట్‌కి మరింత గుర్తింపు దక్కింది. అండర్–8 చాంపియన్‌షిప్‌లో అతను ర్యాపిడ్ విభాగంలో విజేతగా నిలిచాడు. రెండు నెలల తర్వాత జార్జియాలో జరిగిన వరల్డ్ కప్‌లో కూడా అతనికి రెండో స్థానం దక్కింది. తాజాగా ఇటలీలో అండర్–8 క్లాసికల్‌లో వరల్డ్ చాంపియన్‌షిప్ సాధించడం అతడి ఆటను మరో మెట్టు ఎక్కించింది. తర్వాతి వయో విభాగాలైన అండర్–10, అండర్–12లలో ఇదే తరహా ఆటను కొనసాగిస్తే దివిత్ కెరీర్ మరింత వేగంగా దూసుకుపోవడం ఖాయం.
అన్నింటా అండగా నిలుస్తూ..
తన గెలుపు విలువేమిటో ఎనిమిదేళ్ల దివిత్‌కు తెలియకపోవచ్చు. కానీ అతని తల్లిదండ్రులు ఆ గెలుపు స్థాయిని గుర్తించారు. అందుకే కెరీర్‌లో ముందుకు తీసుకెళ్లేందుకు వారు తమ వైపునుంచి ఎలాంటి లోటు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో పెరిగే పోటీని దృష్టిలో ఉంచుకొని కొత్త కోచ్‌తో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. చెస్‌లో కోచింగ్ అంటే ఆర్థికపరంగా కూడా అమిత భారమే! దీంతో పాటు వరుస టోర్నీల్లో పాల్గొంటేనే ఫలితాలు రావడంతో పాటు రేటింగ్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలా చేయాలంటే పెద్ద సంఖ్యలో వేర్వేరు దేశాల్లో పోటీ పడటం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ తమ చిన్నారి కోసం వాటన్నిటినీ ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం సొంత డబ్బులతోనే ముందుకు సాగుతున్న వీరు మున్ముందు దివిత్ మంచి ఫలితాలు సాధిస్తే స్పాన్సర్‌షిప్ చాన్స్ రావచ్చనే విశ్వాసంతో ఉన్నారు. అన్నింటినీ మించి వారు తమ అబ్బాయి ఆటను నమ్ముతున్నారు.
గ్రాండ్‌మాస్టర్ లక్ష్యంగా..
‘చెస్ అంటే చాలా ఇష్టం. ఎన్ని గంటలైనా ఆడుతూనే ఉంటా..’ ఇదీ చిన్నారి దివిత్ మాట. ప్రస్తుతం అతను రోజుకు 7–8 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. మధ్యలో కొద్దిసేపు విరామం మినహా అతనికిప్పుడు చదరంగపు గళ్ళే లోకం. అతని ఫలితాలు చూస్తేనే అతను ఎంతగా కష్టపడుతున్నాడో అర్థమవుతోంది. సిసిలియన్ డిఫెన్స్ తన ఫేవరిట్ అని చెబుతున్న దివిత్.. ప్రస్తుత భారత టాప్ ఆటగాడు అర్జున్ ఇరిగేశి స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నాడు. ఆటలో విజయాలతో పాటు ఓటములు కూడా సహజం. సాధారణంగా వేర్వేరు ఏజ్ గ్రూప్ చెస్ టోర్నీలు జరుగుతున్నప్పుడు పరాజయం ఎదురైతే చిన్నారులు ఏడుస్తూ బయటకు రావడం చాలా చోట్ల కనిపించే దృశ్యం. కానీ దివిత్ ఏరోజూ అలా చేయలేదని తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు.
గేమ్ ఓడిన తర్వాత కూడా ప్రశాంతంగా వచ్చి నేను ఓడిపోయాను, తర్వాతి గేమ్‌కు ప్రిపేర్ అవుతాను అని చెప్పడం ఎనిమిదేళ్ల చిన్నారి స్థితప్రజ్ఞకు నిదర్శనం. చెస్‌కు ఎక్కువ సమయం కేటాయించేందుకు దివిత్ పేరెంట్స్ అతని స్కూల్ చదువును ఆన్‌లైన్ క్లాస్‌ల ద్వారా కొనసాగిస్తున్నారు. రెండో తరగతి చదువుతున్న దివిత్.. వచ్చే రెండేళ్ల పాటు తనకిష్టమైన చెస్‌లో మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తే ఆపై చదువును, ఆటను సమన్వయం చేసుకుంటూ వెళ్లవచ్చనేది వారి ఆలోచన. దివిత్ కూడా దానికి తగినట్లుగా సాధన చేస్తున్నాడు. పిన్న వయసులోనే దివిత్‌ను గ్రాండ్‌మాస్టర్‌గా చూడాలనేది తల్లిదండ్రుల కోరిక. ప్రస్తుతం 1876 రేటింగ్ ఉన్న అతను జీఎమ్ కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.
∙మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment