Chess championship
-
అండర్–9 జాతీయ చెస్ విజేత నిధీశ్
పుణే: జాతీయ అండర్–9 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ చిన్నారులు నిదీశ్ శ్యామల్, అదుళ్ల దివిత్ రెడ్డి అదరగొట్టారు. గురువారం ముగిసిన ఈ టోర్నీలో ఓపెన్ విభాగంలో నిధీశ్ చాంపియన్‌గా అవతరించగా... దివిత్ రెడ్డి మూడో స్థానాన్ని సంపాదించాడు. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో నిదీశ్, ఆరిత్ కపిల్ (ఢిల్లీ) 9.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... నిదీశ్‌కు టైటిల్ ఖరారైంది. ఆరిత్ రన్నరప్‌గా నిలిచాడు. 9 పాయింట్లతో దివిత్ రెడ్డి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది వరల్డ్ క్యాడెట్ అండర్–8 చాంపియన్‌షిప్‌లో దివిత్ రెడ్డి స్వర్ణ పతకం గెలిచాడు. విజేతగా నిలిచిన ని«దీశ్కు విన్నర్స్ ట్రోఫీతోపాటు రూ. 50 వేలు ప్రైజ్‌మనీ లభించింది. హైదరాబాద్‌లోని మ్యాస్ట్రో చెస్ అకాడమీలో క్యాండిడేట్ మాస్టర్ (సీఎం) అమిత్‌పాల్ సింగ్ వద్ద నిదీశ్ శిక్షణ తీసుకుంటున్నాడు. జాతీయ చాంపియన్ హోదాలో నిదీశ్ ఈ ఏడాది జరిగే ప్రపంచ, ఆసియా అండర్–9 చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. -
ఎత్తులు వేయడంలో దిట్ట.. ఆమె ఆవేదనకు సీఎం రిప్లై ఇదే(ఫొటోలు)
-
64 గళ్లపై చిన్నారి అద్భుతం
రెండేళ్ల క్రితం.. ప్రముఖ చెస్ వెబ్సైట్ చెస్ బేస్ డాట్ ఇన్ హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను నిర్వహించింది. అందులో భారత గ్రాండ్మాస్టర్లయిన అర్జున్ ఇరిగేశి, డి.గుకేశ్‌లు ఒకవైపు.. 20 మంది జూనియర్ చెస్ ఆటగాళ్లు మరోవైపు ఆడారు. ఫలితాలను పక్కన పెడితే ఇద్దరు టాప్ గ్రాండ్మాస్టర్లను కొందరు చిన్నారులు తమ ఆటతో ఆకర్షించారు. వారిలో ఆరేళ్ల ఆదుళ్ల దివిత్ రెడ్డి కూడా ఉన్నాడు. అతనిలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నట్లు గుర్తించిన ఆ ఇద్దరు గ్రాండ్మాస్టర్లూ త్వరలోనే దివిత్ పెద్ద విజయాలు సాధిస్తాడని జోస్యం చెప్పారు. రెండేళ్లు తిరిగేసరికి అది నిజమైంది. దివిత్ రెడ్డి ఇప్పుడు వరల్డ్ క్యాడెట్ అండర్–8 చాంపియన్‌షిప్‌లో సత్తా చాటాడు. కొన్ని నెలల వ్యవధిలో అతను అటు ర్యాపిడ్, ఇటు క్లాసిక్ రెండు విభాగాల్లోనూ వరల్డ్ చాంపియన్‌గా నిలవడం విశేషం. అల్బేనియా, ఇటలీలలో జరిగిన ఈ టోర్నీలో దివిత్ ప్రదర్శన చూస్తే భారత చదరంగంలో మరిన్ని సంచలనాలకు కారణం కాగల కొత్త కెరటం వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతిభను గుర్తించి..సాధారణంగా ఐదారేళ్ల చిన్నారులు స్కూల్‌తో పాటు తమ వయసుకు తగినట్లుగా తమకు నచ్చిన విధంగా ఏదో ఒక ఆటలో మునిగి తేలుతుంటారు. కానీ క్రీడలకు సంబంధించి వారిలో దాగి ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు మాత్రమే సరిగ్గా గుర్తించగలరు. దివిత్ తల్లిదండ్రులు మహేశ్ రెడ్డి, సింధుజ సరిగ్గా అదే పని చేశారు. అతడికి చదరంగంపై ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు, ఆ క్రీడలో అతను పూర్తిగా లీనమైపోతున్నట్లు ఆరంభంలోనే గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అయిన వీరిద్దరూ చెస్‌కు సంబంధించిన పజిల్స్‌ను పరిష్కరించడంలో దివిత్కున్న ప్రత్యేక ప్రతిభను పసిగట్టగలిగారు. అందుకే తమ అబ్బాయిని పూర్తిగా చదరంగం వైపు మళ్లిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. దానికి ఎగ్జిబిషన్ టోర్నీ మరింత స్ఫూర్తినిచ్చింది. కోచ్ రామకృష్ణ వద్ద శిక్షణ ఇప్పించారు. రెండేళ్ల పాటు ఆయన శిక్షణలో దివిత్ మరింత రాటుదేలాడు. దాంతో టోర్నీల్లో ఆడించడం మొదలుపెట్టారు. వరుస విజయాలతో..రాష్ట్ర స్థాయి టోర్నీల్లో విజేతగా నిలిచిన తర్వాత దివిత్ జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. అక్కడి ప్రదర్శన ఆ చిన్నారిలోని అపార ప్రతిభను చాటింది. ఫలితంగా వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అల్బేనియాలో జరిగిన టోర్నీ ద్వారా దివిత్ టాలెంట్‌కి మరింత గుర్తింపు దక్కింది. అండర్–8 చాంపియన్‌షిప్‌లో అతను ర్యాపిడ్ విభాగంలో విజేతగా నిలిచాడు. రెండు నెలల తర్వాత జార్జియాలో జరిగిన వరల్డ్ కప్‌లో కూడా అతనికి రెండో స్థానం దక్కింది. తాజాగా ఇటలీలో అండర్–8 క్లాసికల్లో వరల్డ్ చాంపియన్‌షిప్ సాధించడం అతడి ఆటను మరో మెట్టు ఎక్కించింది. తర్వాతి వయో విభాగాలైన అండర్–10, అండర్–12లలో ఇదే తరహా ఆటను కొనసాగిస్తే దివిత్ కెరీర్ మరింత వేగంగా దూసుకుపోవడం ఖాయం. అన్నింటా అండగా నిలుస్తూ..తన గెలుపు విలువేమిటో ఎనిమిదేళ్ల దివిత్‌కు తెలియకపోవచ్చు. కానీ అతని తల్లిదండ్రులు ఆ గెలుపు స్థాయిని గుర్తించారు. అందుకే కెరీర్లో ముందుకు తీసుకెళ్లేందుకు వారు తమ వైపునుంచి ఎలాంటి లోటు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో పెరిగే పోటీని దృష్టిలో ఉంచుకొని కొత్త కోచ్‌తో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. చెస్‌లో కోచింగ్ అంటే ఆర్థికపరంగా కూడా అమిత భారమే! దీంతో పాటు వరుస టోర్నీల్లో పాల్గొంటేనే ఫలితాలు రావడంతో పాటు రేటింగ్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలా చేయాలంటే పెద్ద సంఖ్యలో వేర్వేరు దేశాల్లో పోటీ పడటం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ తమ చిన్నారి కోసం వాటన్నిటినీ ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం సొంత డబ్బులతోనే ముందుకు సాగుతున్న వీరు మున్ముందు దివిత్ మంచి ఫలితాలు సాధిస్తే స్పాన్సర్షిప్ చాన్స్ రావచ్చనే విశ్వాసంతో ఉన్నారు. అన్నింటినీ మించి వారు తమ అబ్బాయి ఆటను నమ్ముతున్నారు.గ్రాండ్‌మాస్టర్ లక్ష్యంగా..‘చెస్ అంటే చాలా ఇష్టం. ఎన్ని గంటలైనా ఆడుతూనే ఉంటా..’ ఇదీ చిన్నారి దివిత్ మాట. ప్రస్తుతం అతను రోజుకు 7–8 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. మధ్యలో కొద్దిసేపు విరామం మినహా అతనికిప్పుడు చదరంగపు గళ్ళే లోకం. అతని ఫలితాలు చూస్తేనే అతను ఎంతగా కష్టపడుతున్నాడో అర్థమవుతోంది. సిసిలియన్ డిఫెన్స్ తన ఫేవరిట్ అని చెబుతున్న దివిత్.. ప్రస్తుత భారత టాప్ ఆటగాడు అర్జున్ ఇరిగేశి స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నాడు. ఆటలో విజయాలతో పాటు ఓటములు కూడా సహజం. సాధారణంగా వేర్వేరు ఏజ్ గ్రూప్ చెస్ టోర్నీలు జరుగుతున్నప్పుడు పరాజయం ఎదురైతే చిన్నారులు ఏడుస్తూ బయటకు రావడం చాలా చోట్ల కనిపించే దృశ్యం. కానీ దివిత్ ఏరోజూ అలా చేయలేదని తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. గేమ్ ఓడిన తర్వాత కూడా ప్రశాంతంగా వచ్చి నేను ఓడిపోయాను, తర్వాతి గేమ్‌కు ప్రిపేర్ అవుతాను అని చెప్పడం ఎనిమిదేళ్ల చిన్నారి స్థితప్రజ్ఞకు నిదర్శనం. చెస్‌కు ఎక్కువ సమయం కేటాయించేందుకు దివిత్ పేరెంట్స్ అతని స్కూల్ చదువును ఆన్లైన్ క్లాస్‌ల ద్వారా కొనసాగిస్తున్నారు. రెండో తరగతి చదువుతున్న దివిత్.. వచ్చే రెండేళ్ల పాటు తనకిష్టమైన చెస్‌లో మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తే ఆపై చదువును, ఆటను సమన్వయం చేసుకుంటూ వెళ్లవచ్చనేది వారి ఆలోచన. దివిత్ కూడా దానికి తగినట్లుగా సాధన చేస్తున్నాడు. పిన్న వయసులోనే దివిత్‌ను గ్రాండ్‌మాస్టర్‌గా చూడాలనేది తల్లిదండ్రుల కోరిక. ప్రస్తుతం 1876 రేటింగ్ ఉన్న అతను జీఎమ్ కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
విజేత అర్జున్... రన్నరప్ సరయు
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆదిరెడ్డి అర్జున్, వేల్పుల సరయు అదరగొట్టారు. హరియాణాలోని కర్నాల్ పట్టణంలో జరిగిన ఈ టోరీ్నలో ఓపెన్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఆదిరెడ్డి అర్జున్ టైటిల్‌ను నిలబెట్టుకోగా... వరంగల్ జిల్లాకు చెందిన సరయు రన్నరప్‌గా నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 14 ఏళ్ల అర్జున్ 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అర్జున్ 8 గేముల్లో గెలిచి, 3 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించాడు. సౌరత్ బిశ్వాస్ (పశ్చిమ బెంగాల్; 8.5 పాయింట్లు) రెండో స్థానంలో, జైవీర్ మహేంద్రు (మహారాష్ట్ర; 8.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో సరయు నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9 పాయింట్లతో మృతిక మల్లిక్ (పశ్చిమ బెంగాల్)తో కలిసి సంయుక్తంగా టాప్ ర్యాంక్‌లో నిలిచింది. అయితే చాంపియన్‌ను నిర్ణయించేందుకు మైరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. మెరుగైన టైబ్రేక్ స్కోరుతో మృతిక టైటిల్ సొంతం చేసుకోగా... సరయుకు రెండో స్థానంతో రన్నరప్ ట్రోఫీ దక్కింది. సరయు తొమ్మిది గేముల్లో గెలిచి, రెండు గేముల్లో ఓడిపోయింది. విజేత అర్జున్, రన్నరప్ సరయులను తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ అభినందించారు. -
Divya Deshmukh: ప్రపంచ చాంపియన్.. ఈ విషయాలు తెలుసా?
గాంధీనగర్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత యువ చెస్ తార దివ్య దేశ్‌ముఖ్ తన కెరీర్లో గొప్ప ఘనత సాధించింది. ప్రపంచ జూనియర్ మహిళల అండర్–20 చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా అవతరించింది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 18 ఏళ్ల దివ్య 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.చివరిదైన 11వ రౌండ్లో దివ్య 57 ఎత్తుల్లో క్రస్తెవా బెలోస్లావా (బల్గేరియా)పై గెలిచింది. నాగపూర్‌కు చెందిన దివ్య ఈ టోర్నీలో తొమ్మిది గేముల్లో నెగ్గి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది.క్రచ్యాన్ మరియం (అర్మేనియా; 9.5 పాయింట్లు) రెండో స్థానాన్ని దక్కించుకోగా... అలవెర్దియెవా అయాన్ (అజర్బైజాన్; 8.5 పాయింట్లు) మూడో స్థానాన్ని సంపాదించింది. విజేతగా నిలిచిన దివ్యకు 2000 యూరోల (రూ. 1 లక్షా 79 వేలు) ప్రైజ్‌మనీతోపాటు స్వర్ణ పతకం, విన్నర్స్ ట్రోఫీ లభించాయి. విజయానంతరం దివ్య మాట్లాడుతూ.. ‘‘ఒత్తిడిని ఎలా అధిగమించాలో నాకు తెలుసు. ఆటను ఎలా ఆడాలో కూడా పూర్తిగా నేర్చుకున్న తర్వాతే నేను రంగంలోకి దిగాను’’ అంటూ హర్షం వ్యక్తం చేసింది.18 ఏళ్ల ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య సాధించిన విజయాలు2020- ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్(టీమ్)- స్వర్ణం2022- వుమెన్స్ ఇండియన్ చెస్ చాంపియన్‌షిప్- విజేత2022- చెస్ ఒలింపియాడ్(వ్యక్తిగత విభాగం)- కాంస్యం2023- ఆసియా మహిళా చెస్ చాంపియన్‌షిప్- విజేత2023- టాటా స్టీల్ ఇండియా చెస్ టోర్నమెంట్(వుమెన్స్ రాపిడ్)- ప్రథమ స్థానం2024- ఫిడే వరల్డ్ అండర్ 20 గర్ల్స్ చెస్ చాంపియన్‌షిప్- చాంపియన్. -
వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న దివ్య
గుజరాత్‌లోని గాంధీ నగర్లో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ జూనియర్ (అండర్-20 అమ్మాయిల విభాగం) చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత నంబర్ 3 క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ విజేతగా నిలిచింది. 18 ఏళ్ల దివ్య.. ఫైనల్ రౌండ్లో బల్గేరియాకు చెందిన బెలొస్లావా క్రస్టేవాపై విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. మొత్తం 11 పాయింట్లకు గానూ 10 పాయింట్లు సాధించిన దివ్వ టాప్ ప్లేస్‌లో నిలిచింది.ఈ పోటీలో దివ్య తెల్ల పావులతో బరిలోకి దిగింది. గత నెలలో షార్జా ఛాలెంజర్స్ టైటిల్ గెలిచిన తర్వాత దివ్యకు ఇది వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో దివ్య తర్వాతి స్థానంలో 20 ఏళ్ల ఆర్మేనియా క్రీడాకారిణి మరియమ్ నిలిచింది. మరియమ్ 11 పాయింట్లకు గాను 9.5 పాయింట్లు సాధించింది. మూడో స్థానంలో అజర్ బైజాన్‌కు చెందిన అయాన్ అల్లావెర్దియేవా నిలిచింది. ఈమె ఖాతాలో 8.5 పాయింట్లు ఉన్నాయి. భారత్‌కు చెందిన షుబి గుప్తా, రక్షిత రవి 8, 7.5 పాయింట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన దివ్య రెండు డ్రాలు, తొమ్మిది విజయాలు సాధించి, తన ఎనిమిదో జూనియర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
Chess Championship: రాజా రిత్విక్‌కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ కాంస్య పతకం సాధించాడు. నాసిక్‌లో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత రిత్విక్ 8.5 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... ఆరోణ్యక్ ఘోష్ (రైల్వేస్)కు రెండో ర్యాంక్, రిత్విక్‌కు మూడో ర్యాంక్ దక్కాయి. 9 పాయింట్లతో దీప్తాయన్ ఘోష్ (రైల్వేస్) విజేతగా నిలిచాడు. రిత్విక్ ఆడిన 11 గేముల్లో ఏడింటిలో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. కాంస్యం నెగ్గిన రిత్విక్‌ను తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ అభినందించారు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కార్తీక్ వెంకటరామన్, నూతక్కి ప్రియాంక 13వ, 14వ ర్యాంక్‌ల్లో నిలిచారు. సహజ శుభారంభం నాగ్‌పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో సహజ 3–6, 6–1, 6–1తో భారత్‌కే చెందిన వైదేహి చౌదరీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. న్యూజిలాండ్‌తో భారత్ తొలి పోరు లుసానె (స్విట్జర్లాండ్): పారిస్ ఒలింపిక్స్ పురుషుల హాకీ ఈవెంట్ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. పూల్ ‘బి’లో ఉన్న భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూలై 27న న్యూజిలాండ్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత జట్టు తమ రెండో మ్యాచ్‌ను జూలై 29న అర్జెంటీనాతో (సాయంత్రం గం. 4:15 నుంచి)... మూడో మ్యాచ్‌ను జూలై 30న ఐర్లాండ్‌తో (సాయంత్రం గం. 4:45 నుంచి)... నాలుగో మ్యాచ్‌ను ఆగస్టు 1న బెల్జియంతో (మధ్యాహ్నం గం. 1:30 నుంచి)... ఐదో మ్యాచ్‌ను ఆగస్టు 2న ఆ్రస్టేలియా తో (సాయంత్రం గం. 4:45 నుంచి) ఆడుతుంది. -
అర్జున్ ఆరో స్థానంలో... హారిక ఏడో స్థానంలో
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు విశేషంగా రాణించినా పతకాలు మాత్రం సాధించలేకపోయారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఓపెన్ విభాగంలో భారత్ నుంచి తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ అత్యుత్తమంగా ఆరో స్థానాన్ని సాధించాడు. నిర్ణీత 21 రౌండ్ల తర్వాత అర్జున్ 14 పాయింట్లతో మరో ముగ్గురితో (నెపోమ్నిషి, లెవాన్ అరోనియన్, డెనిస్ లాజావిక్) కలిసి ఉమ్మడిగా ఐదో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా నెపోమ్నిషికి ఐదో ర్యాంక్, అర్జున్‌కు ఆరో ర్యాంక్, అరోనియన్‌కు ఏడో ర్యాంక్, డెనిస్‌కు ఎనిమిదో ర్యాంక్‌లు ఖరారయ్యాయి. భారత్‌కే చెందిన ఇతర గ్రాండ్‌మాస్టర్లు అరవింద్ చిదంబరం 14వ ర్యాంక్‌లో, ప్రజ్ఞానంద 28వ ర్యాంక్‌లో, నారాయణన్ 35వ ర్యాంక్‌లో, గుకేశ్ 38వ ర్యాంక్‌లో నిహాల్ సరీన్ 43వ ర్యాంక్‌లో నిలిచారు. మహిళల విభాగంలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక అత్యుత్తమ ప్రదర్శన చేసింది. నిర్ణీత 17 రౌండ్ల తర్వాత హారిక 11 పాయింట్లతో ఏడో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. హారికతోపాటు మరో ఎనిమిది మంది క్రీడాకారిణులు కూడా 11 పాయింట్లు స్కోరు చేశారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హారికకు ఏడో ర్యాంక్ దక్కింది. భారత్‌కే చెందిన దివ్య దేశ్‌ముఖ్ 13వ ర్యాంక్‌లో, కోనేరు హంపి 17వ ర్యాంక్‌లో, సాహితి వర్షిణి 27వ ర్యాంక్‌లో, వైశాలి 36వ ర్యాంక్‌లో, ప్రియాంక నూతక్కి 46వ ర్యాంక్‌లో నిలిచారు. -
నేటి నుంచి ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ
ఈ ఏడాదిని ఘనంగా ముగించేందుకు భారత చెస్ క్రీడాకారులు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఐదు రోజులపాటు ఉజ్బెకిస్తాన్లోప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ జరగనుంది. భారత్ నుంచి ఓపెన్ విభాగంలో 18 మంది, మహిళల విభాగంలో 11 మంది బరిలోకి దిగుతున్నారు. మహిళల ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలిల నుంచి పతకాలు ఆశించవచ్చు. -
రన్నరప్ ఆదర్శ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–13 చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో తెలంగాణ కుర్రాడు ఉప్పల ఆదర్శ్ శ్రీరామ్ రన్నరప్‌గా నిలిచాడు. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత వీరేశ్ శరణార్థి (మహారాష్ట్ర), ఆదర్శ్ శ్రీరామ్ 9.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. వీరేశ్ విజేతగా అవతరించాడు. ఆదర్శ్ శ్రీరామ్ రన్నరప్‌గా నిలిచాడు. తమిళనాడుకు చెందిన రాఘవ్ తొమ్మిది పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. బాలికల విభాగంలో మహారాష్ట్రకు చెందిన శ్రేయ విజేతగా నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత శ్రేయ 9.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నైనా గొర్లి ఏడో స్థానాన్ని పొందింది. తెలంగాణకు చెందిన కీర్తిక ఎనిమిదో స్థానంలో, దీక్షిత పదో స్థానంలో, శివాంశిక 12వ స్థానంలో నిలిచారు. -
అజేయంగా కీర్తిక
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–13 చెస్ చాంపియన్‌షిప్ బాలికల విభాగంలో తెలంగాణ అమ్మాయి బి.కీర్తిక ఐదో విజయం సాధించింది. గురువారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో కీర్తిక 44 ఎత్తుల్లో మీరా సింగ్ (ఢిల్లీ)పై గెలిచింది. ఏడో రౌండ్ తర్వాత నిహిరా కౌల్ (మహారాష్ట్ర), ఆముక్త (ఆంధ్రప్రదేశ్)లతో కలసి కీర్తిక ఆరు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉంది. కీర్తిక ఐదు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నైనా గొర్లి 6.5 పాయింట్లతో రెండో స్థానంలో... శ్రేయా హిప్పరాగి (మహారాష్ట్ర) 7 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తెలంగాణకే చెందిన సంహిత పుంగవనం, శివాంశిక 5.5 పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి ఉమ్మడిగా నాలుగో స్థానంలో ఉన్నారు. -
నేటి నుంచి జాతీయ చెస్ పోటీలు
విశాఖ స్పోర్ట్స్: జాతీయ అండర్–11 చెస్ చాంపియన్‌షిప్ ఆదివారం విశాఖ పోర్ట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆంధ్ర చెస్ సంఘం, ఆల్ విశాఖ చెస్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీల్లో 27 రాష్ట్రాలకు చెందిన ఫిడే రేటింగ్ చిన్నారులు పోటీపడనున్నారు. పదకొండు రౌండ్ల పాటు సాగే ఈ పోటీలు 7వ తేదీతో ముగుస్తాయని ఆంధ్ర చెస్ సంఘం అధ్యక్షుడు కె.వి.వి.శర్మ తెలిపారు. విజేతకు రూ.70 వేల ప్రోత్సాహకం అందించనుండగా ఏడు నుంచి ఇరవై స్థానాల్లో నిలిచిన బాల బాలికలకు సైతం రూ.పదేసి వేల ప్రోత్సాహకం అందించనున్నామన్నారు. 386 మంది అండర్ 11 బాలబాలికలు పోటీ పడుతున్నారు. టోర్నీ టాప్ రేటింగ్‌తో కర్ణాటకకు చెందిన అపార్ పోటీ పడుతుండగా ఏపీ తరఫున అందాలమాల 17వ ర్యాంక్‌తో ఎత్తులు ప్రారంభించనున్నారు. -
విజేత మౌనిక అక్షయ.. కుశాగ్ర మోహన్‌కు రజతం
జంషెడ్పూర్: టాటా స్టీల్ ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల బ్లిట్జ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మిని మౌనిక అక్షయ విజేతగా అవతరించింది. గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల మౌనిక అక్షయ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 7.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. మౌనిక అక్షయ ఏడు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత్‌కే చెందిన భాగ్యశ్రీ పాటిల్, బ్రిస్టీ ముఖర్జీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను దక్కించుకున్నారు. కుశాగ్ర మోహన్‌కు రజతం బ్లిట్జ్ ఓపెన్ విభాగంలో తెలంగాణకు చెందిన కుశాగ్ర మోహన్ రజత పతకం సాధించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అలెక్సీ గ్రెబనోవ్ (రష్యా), కుశాగ్ర మోహన్ 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా... గ్రెబనోవ్కు స్వర్ణం ఖరారైంది. కుశాగ్ర మోహన్‌కు రజతం లభించింది. క్వార్టర్స్‌లో ఓడిన అభిమన్యు బెల్గ్రేడ్: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు నలుగురు భారత రెజ్లర్లు నిరాశపరిచారు. ఆకాశ్ దహియా (61 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో, అభిమన్యు (70 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో... సందీప్ మాన్ (86 కేజీలు) రెండో రౌండ్లో... సుమిత్ మలిక్ (125 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. ఒలింపిక్ వెయిట్ కేటగిరీల్లో సందీప్, సుమిత్‌లపై నెగ్గిన రెజ్లర్లు ఫైనల్ చేరుకోకపోవడంతో భారత రెజ్లర్లకు ‘రెపిచాజ్’ రౌండ్లలో ఆడే అవకాశం కూడా రాలేదు. అభిమన్యు క్వార్టర్ ఫైనల్లో 2–9తో అలెన్ రూథర్‌ఫర్డ్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. అలెన్ ఫైనల్ చేరుకోవడంతో అభిమన్యుకు నేడు ‘రెపిచాజ్’ బౌట్లలో పోటీపడే అవకాశం లభించింది. -
జాతీయ స్కూల్స్ చెస్‌లో తెలంగాణకు ఏడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్స్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాల పంట పండించారు. తమిళనాడులో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణకు ఏడు పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం ఉన్నాయి. అండర్–15 బాలుర విభాగంలో వేముల అద్వైత్ విఘ్నేశ్ (7.5 పాయింట్లు)... అండర్–15 బాలికల విభాగంలో యశ్వి జైన్ (7 పాయింట్లు)... అండర్–13 బాలుర విభాగంలో చల్లా సహర్ష (8 పాయింట్లు)... అండర్–11 బాలికల విభాగంలో మోదిపల్లి దీక్షిత (7.5 పాయింట్లు)... అండర్–9 బాలికల విభాగంలో పుంగవనం సంహిత (8 పాయింట్లు) పసిడి పతకాలు గెలిచారు. అండర్–7 బాలుర విభాగంలో ఆదుళ్ల దివిత్ రెడ్డి (7.5 పాయింట్లు) కాంస్యం, అండర్–7 బాలికల విభాగంలో బోగా వంశిక (7 పాయింట్లు) రజతం సాధించారు. పతకాలు సాధించిన వారికి నెలనెలా భారత గ్రాండ్‌మాస్టర్ ఎం.శ్యామ్సుందర్తో ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ ప్రకటించారు. -
'ఇరాన్లో అడుగుపెడితే చంపేస్తాం'
ఇరాన్‌కు చెందిన చెస్ ప్లేయర్ సారా ఖాదిమ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొందరు ఆకతాయిలు వెంటనే ఇరాన్‌కు తిరిగి రావాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొందరేమో ఇరాన్ అడుగుపెడితే చంపేస్తాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. సారా ఖాదిమ్ తల్లిదండ్రులకు కూడా ఇదే మాదిరి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో కజకిస్తాన్ పోలీసుల సహకారంతో చెస్ ఆటగాళ్లకు భద్రత కల్పించేందుకు టోర్నమెంట్ నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా సారా ఖాదిమ్ ఉంటున్న హోటల్ గది వెలుపల నలుగురు సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. ఇరాన్‌కు చెందిన స్టార్ చెస్ ప్లేయర్ సారా ఖాదిమ్ ప్రస్తుతం కజికిస్తాన్‌లోని ప్రపంచ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్నది. అయితే, చెస్ టేబుల్‌పై ఆమె తలకు హిజాబ్ ధరించకుండా కూర్చుండి ఆడుతున్న ఫొటోలు మీడియాలో ప్రత్యక్ష్యమయ్యాయి. దాంతో ఆమెకు బెదిరింపు కాల్స్ మొదలయ్యాయి. హిజాబ్ ధరించకుండా చెస్ పోటీల్లో ఎలా పాల్గొంటామని ఆకతాయిలు హెచ్చరిస్తున్నారు. పోటీలను అర్దాంతరంగా ముగించి వెంటనే స్వదేశానికి రావాలని కొందరు హెచ్చరిస్తుండగా.. మరికొందరేమో ఇక్కడికి వస్తే నీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. -
సవిత శ్రీ అరుదైన ఘనత.. నిరాశపరిచిన హారిక! ఐదో స్థానంలో అర్జున్
FIDE World Rapid Championship- అల్మాటీ (కజకిస్తాన్): ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో మహిళల ఈవెంట్లో భారత్‌కు చెందిన 15 ఏళ్ల టీనేజర్ సవిత శ్రీ గ్రాండ్మాస్టర్లను ఢీకొట్టి కాంస్య పతకం సాధించింది. విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి తర్వాత వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన మూడో భారత క్రీడాకారిణిగా సవిత శ్రీ నిలిచింది. మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన సవిత ఈ టోర్నీలో 36వ సీడ్‌గా బరిలోకి దిగి మూడో స్థానంలో నిలిచింది. బుధవారం జరిగిన మూడు రౌండ్లలో ఆమె 1.5 పాయింట్లు సాధించింది. దీంతో మొత్తం 8 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. తొమ్మిదో రౌండ్లో జాన్సయ అబ్దుమలిక్ (కజకిస్తాన్) చేతిలో ఓడటంతో ఆమె రజత అవకాశానికి గండి పడింది. నిరాశపరిచిన హారిక పదో రౌండ్లో క్వియాన్యున్ (సింగపూర్)పై గెలిచిన సవిత... ఆఖరి రౌండ్లో దినార సదుకసొవా (కజకిస్తాన్)తో గేమ్‌ను డ్రా చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సీనియర్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి కూడా 8 పాయింట్లు సాధించినప్పటికీ సూపర్ టై బ్రేక్ స్కోరు ఆధారంగా ఏపీ అమ్మాయి ఆరో స్థానంలో నిలిచింది. ద్రోణవల్లి హారిక 29వ స్థానంతో నిరాశపరిచింది. విజేత కార్ల్సన్ ఓపెన్ కేటగిరీలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ (9) ఐదో స్థానంలో నిలిచాడు. 8 రౌండ్లలో గెలిచి 3 ఓడిన అర్జున్ 2 రౌండ్లు డ్రా చేసుకున్నాడు. ఈ విభాగంలో ఇందులో ప్రపంచ నంబర్‌వన్, చాంపియన్ కార్ల్సన్ (10) విజేతగా నిలిచాడు. భారత సీనియర్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 77వ స్థానంలో నిలిచాడు. చదవండి: IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. -
సత్తా చాటిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చెస్ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ తన కెరీర్లో మరో అంతర్జాతీయ టోర్నీ టైటిల్‌ను సాధించాడు. స్పెయిన్‌లో జరిగిన సన్వే సిట్‌గెస్ ఓపెన్ అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల రాజా రిత్విక్ చాంపియన్‌గా అవతరించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత రాజా రిత్విక్ 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 30 దేశాల నుంచి 120 మంది అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో రిత్విక్ అజేయంగా నిలిచాడు. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థి అయిన రిత్విక్ ఈ టోర్నీలో ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రముఖ కోచ్ ఎన్.రామరాజుకు చెందిన రేస్ చెస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న రిత్విక్... ఈ టోరీ్నలో ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు ఆధిబన్, అరవింద్ చిదంబరం (భారత్), స్వెన్ ఫ్రెడరిక్ (జర్మనీ)పై గెలిచి మరో గ్రాండ్‌మాస్టర్ అర్జున్ కల్యాణ్ (భారత్)తో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. -
Champions Tour Finals Chess Tourney: తొలి రౌండ్లోనే ఓడిన అర్జున్, ప్రజ్ఞానంద
చాంపియన్స్ టూర్ ఫైనల్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద తొలి రౌండ్లో ఓడిపోయారు. అమెరికాలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్ మ్యాచ్‌లో అర్జున్ 0.5–2.5తో క్రిస్టాఫ్ డూడా (పోలాండ్) చేతిలో... ప్రజ్ఞానంద 1.5–2.5తో షఖిర్యార్ (అజర్బైజాన్) చేతిలో ఓడారు. -
Asian Continental Chess: మెరిసిన హర్ష, ప్రియాంక
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక అదరగొట్టారు. గురువారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఓపెన్ విభాగంలో 22 ఏళ్ల హర్ష 6.5 పాయింట్లతో రెండో స్థానంలో... మహిళల విభాగంలో ప్రియాంక 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాలను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే చెస్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించారు. ఓపెన్ విభాగంలో భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద 7 పాయింట్లతో... మహిళల విభాగంలో భారత్‌కే చెందిన పీవీ నందిథా 7.5 పాయింట్లతో చాంపియన్స్‌గా అవతరించారు. ఓపెన్ విభాగంలో టాప్–4 ప్లేయర్లు, మహిళల విభాగంలో టాప్–2 క్రీడాకారిణులు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించారు. గురువారం జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్లో భారత్‌కే చెందిన కార్తీక్ వెంకటరామన్‌తో తలపడిన 22 ఏళ్ల హర్ష భరతకోటి 14 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆధిబన్‌తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హర్షతోపాటు ఆధిబన్, నారాయణన్, వొఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్), సేతురామన్, కార్తీక్ వెంకటరామన్ 6.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హర్ష రెండో ర్యాంక్‌లో, ఆధిబన్ మూడో ర్యాంక్‌లో, నారాయణన్ నాలుగో ర్యాంక్‌లో, వొఖిదోవ్ ఐదో ర్యాంక్‌లో, సేతురామన్ ఆరో ర్యాంక్‌లో, కార్తీక్ ఏడో ర్యాంక్‌లో నిలిచారు. ఈ టోర్నీలో హర్ష అజేయంగా నిలిచాడు. నాలుగు గేముల్లో గెలిచిన అతను మిగతా ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల విభాగంలో విజయవాడకు చెందిన 20 ఏళ్ల ప్రియాంక చివరిదైన తొమ్మిదో రౌండ్లో 47 ఎత్తుల్లో భారత్‌కే చెందిన పద్మిని రౌత్‌ను ఓడించింది. ప్రియాంకతోపాటు దివ్య దేశ్‌ముఖ్ (భారత్), వో థి కిమ్ ఫుంగ్ (వియత్నాం) 6.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ప్రియాంకకు రజతం, దివ్య దేశ్‌ముఖ్‌కు కాంస్యం లభించాయి. ఈ టోర్నీలో ప్రియాంక ఆరు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో రెండు గేముల్లో ఓటమి చవిచూసింది. -
వరల్డ్ చాంపియన్‌ను మట్టి కరిపించిన 16 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్
ప్రపంచ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు మరోసారి గట్టి షాక్ తగిలింది. ఎయిమ్‌చెస్ ర్యాపిడ్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన పోటీలో 16 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్ డోనరుమ్మ గుకేష్ 9వ రౌండ్లో కార్ల్‌సన్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచాడు. కాగా గుఖేష్ తెల్ల పావులతో బరిలోకి దిగి సంచలన విజయం నమోదు చేశాడు. శనివారం 19 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగిసే కార్ల్‌సన్‌ను ఓడించిన ఒక్కరోజు వ్యవధిలోనే గుకేష్ కూడా ప్రపంచచాంపియన్ను చిత్తు చేయడం విశేషం. కాగా కార్ల్‌సన్‌ను ఓడించిన యంగ్ గ్రాండ్‌మాస్టర్‌గా గుఖేష్ నిలిచాడు. ఈ చెస్ చాంపియన్‌షిప్‌లో మొత్తం 16 మంది ఆటగాళ్లు ఉండగా.. అందులో ఐదుగురు భారత్ నుంచే ఉన్నారు. కాగా, ఇటీవలి కాలంలో వరల్డ్ ఛాంపియన్ కార్ల్సన్.. భారత గ్రాండ్‌మాస్టర్ల చేతిలో తరుచూ ఓడిపోతున్నాడు. నెల రోజుల వ్యవధిలో కార్ల్సన్ భారత గ్రాండ్‌మాస్టర్ల చేతిలో ఓడిపోవడం ఇది ఐదోసారి. 17 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. మూడు సార్లు కార్ల్‌సన్‌పై విజయం సాధించగా, అర్జున్ ఇరగైసి కార్ల్‌సన్‌ను ఓడించగా.. తాజాగా వీరి సరసన గుఖేష్ చోటు సంపాదించాడు. -
ప్రజ్ఞానంద ‘హ్యాట్రిక్’ విజయం.. దిగ్గజ ఆటగాడితో సంయుక్తంగా
మయామి: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ‘హ్యాట్రిక్’ విజయం సాధించాడు. తొలి రెండు రౌండ్లలోనూ మేటి ర్యాంకర్లకు చెక్ పెట్టిన ఈ టీనేజ్ సంచలనం గురువారం జరిగిన మూడో రౌండ్లో 2.5–1.5తో అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ హాన్స్ నీమన్‌పై విజయం సాధించాడు. వరుస విజయాలతో 17 ఏళ్ల ప్రజ్ఞానంద ఇప్పుడు వరల్డ్ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో కలిసి 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ నాలుగు ర్యాపిడ్ గేమ్‌లు జరిగే ఈ టోర్నీలో గురువారం జరిగిన పోరులో మొదటి గేమ్‌లో ఓడినప్పటికీ భారత ఆటగాడు అద్భుత ప్రదర్శనతో పుంజుకున్నాడు. రెండు, నాలుగో గేముల్లో గెలిచాడు. మూడో గేమ్ డ్రా అయ్యింది. తాజా విజయంతో అతని ఖాతాలో మరో రూ. 5.94 లక్షలు (7500 డాలర్లు) ప్రైజ్‌మనీ జమ అయ్యింది. -
Chess Olympiad 2022: అజేయంగా భారత్ ‘ఎ’
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’ ఖాతాలో నాలుగో విజయం చేరింది. మంగళవారం జరిగిన ఐదో రౌండ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 2.5–1.5తో రొమేనియాపై గెలిచింది. పెంటేల హరికృష్ణ–బొగ్డాన్ గేమ్ 31 ఎత్తుల్లో... విదిత్–లుపులెస్కు గేమ్ 31 ఎత్తుల్లో... నారాయణన్–జియాను గేమ్ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగియగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 46 ఎత్తుల్లో పరిల్‌గ్రాస్‌ను ఓడించి భారత్‌కు విజయాన్ని అందించాడు. మరో మ్యాచ్‌లో భారత్ ‘బి’ 2.5–1.5తో స్పెయిన్‌పై గెలిచి ఈ టోర్నీలో వరుసగా ఐదో విజయం నమోదు చేయగా...భారత్ ‘సి’ 2.5–1.5తో చిలీపై నెగ్గింది. మహిళల విభాగంలో భారత్ ‘ఎ’ 2.5–1.5తో ఫ్రాన్స్‌పై గెలుపొందగా... భారత్ ‘బి’ 1–3తో జార్జియా చేతిలో ఓడిపోయింది. భారత్ ‘సి’–బ్రెజిల్ మధ్య మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. -
సంయుక్తంగా అగ్రస్థానంలో అర్జున్
జాతీయ సీనియర్ పురుషుల చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్, తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ 8 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. కాన్పూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పదో రౌండ్లో అర్జున్ 41 ఎత్తుల్లో ఇనియన్ (తమిళనాడు)తో ‘డ్రా’ చేసుకోగా... గుకేశ్ 64 ఎత్తుల్లో అభిజిత్ గుప్తా (పీఎస్‌పీబీ)పై గెలిచాడు. నేడు చివరిదైన 11వ రౌండ్ గేముల్లో సేతురామన్ (పీఎస్‌పీబీ)తో అర్జున్, ఆర్యన్ చోప్రా (ఢిల్లీ)తో గుకేశ్ ఆడతారు. -
కాంస్య పతకంతో మెరిసిన ప్రియాంక
భువనేశ్వర్: జాతీయ సీనియర్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి నూతక్కి ప్రియాంక కాంస్య పతకంతో మెరిసింది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన 19 ఏళ్ల ప్రియాంక ఏడు పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రకు చెందిన దివ్యా దేశ్‌ముఖ్ 8 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించింది. 103 మంది క్రీడాకారిణులు తొమ్మిది రౌండ్లపాటు పోటీపడిన ఈ టోర్నీ లో ప్రియాంక ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోయింది. చదవండి: ITF Tournament: ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యూష -
హైదరాబాద్ ఎఫ్‌సీ భారీ విజయం; చెస్‌లో అదరగొట్టిన ఇమ్రోజ్, సరయు!
Indian Super League: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా గోవాలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) 5–1తో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టుపై నెగ్గింది. హైదరాబాద్ తరఫున సానా (12వ ని.లో), అనికేత్ (90వ ని.లో), సివెరియో (90వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఒగ్బెచె (27వ, 78వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. చాంప్స్ ఇమ్రోజ్, సరయు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్ –19 జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో బాలుర విభాగంలో మొహమ్మద్ బాషిఖ్ ఇమ్రోజ్ (నల్లగొండ–6.5 పాయింట్లు), బాలికల విభాగంలో వేల్పుల సరయు (వరంగల్–5.5 పాయింట్లు) చాంపియన్స్‌గా నిలిచారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన శిబి శ్రీనివాస్ ఐన్‌స్టీన్ రెడ్డి (బద్రుకా కాలేజీ) 6 పాయింట్లతో తొలి రన్నరప్‌గా, సూరపనేని చిద్విలాస్ సాయి (హైదరాబాద్) రెండో రన్నరప్‌గా నిలిచారు. కర్రి శరత్చంద్ర (రంగారెడ్డి) నాలుగో స్థానాన్ని పొందాడు. టాప్–4లో నిలిచిన ఈ నలుగురూ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. బాలికల విభాగంలో సరయు, గంటా కీర్తి (మేడ్చల్), లేళ్లపల్లి దుర్గా కార్తీక, ఎ.సాయి మహతి (రంగారెడ్డి) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ నలుగురు కూడా జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు తరఫున బరిలోకి దిగుతారు. విజేతలకు టీఎస్‌సీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ బహుమతులు అందజేశారు. చదవండి: Trolls On Rohit Sharma: వైస్ కెప్టెన్ కాదు.. ముందు ఫిట్‌గా ఉండు.. కోహ్లితో పెట్టుకున్నావు.. ఇదో గుణపాఠం! అయినా ఆ స్కోర్లేంటి బాబూ! -
Qatar Grand Prix 2021: హామిల్టన్‌కే ‘పోల్’
దోహా: ఫార్ములావన్ సీజన్లో తొలిసారి జరుగుతున్న ఖతర్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ పోల్ పొజిషన్‌తో మెరిశాడు. ప్రస్తుత సీజన్లో చివరిసారిగా హంగేరి గ్రాండ్‌ప్రిలో పోల్‌ను సొంతం చేసుకున్న హామిల్టన్... మళ్లీ ఎనిమిది గ్రాండ్ప్రిల తర్వాత ఆ ఘనతను అందుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్ చివరి రౌండ్లో అతడు ల్యాప్‌ను అందరికంటే ముందుగా ఒక నిమిషం 20.827 సెకన్లలో పూర్తి చేసి పోల్‌ను అందుకున్నాడు. సీజన్లో హామిల్టన్‌కిది నాలుగో పోల్‌కాగా... ఓవరాల్‌గా 102వది. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ రెండో స్థానం నుంచి మొదలుపెడతాడు. మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నేటి ప్రధాన రేసును రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ హెచ్డి–2, హాట్స్టార్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ‘బ్లిట్జ్’ విభాగంలోనూ అర్జున్ జోరు... టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్ (జీఎం), తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్ శనివారం మొదలైన ‘బ్లిట్జ్’ టోర్నమెంట్లోనూ ఆకట్టుకున్నాడు. 18 రౌండ్లపాటు జరుగుతున్న బ్లిట్జ్ టోర్నీలో తొలి రోజు 9 రౌండ్లు ముగిశాయి. తొమ్మిదో రౌండ్ తర్వాత 18 ఏళ్ల అర్జున్ 6.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉన్నాడు. సామ్ షాంక్లాండ్ (అమెరికా), గుకేశ్ (భారత్), విదిత్ (భారత్), ద్రోణవల్లి హారిక (భారత్)లపై గెలిచిన అర్జున్... నిహాల్ సరీన్ (భారత్), çమగ్సూద్లూ (ఇరాన్), రౌనక్ సాధ్వాని (భారత్), లెవాన్ అరోనియన్ (అర్మేనియా), క్వాంగ్ లీమ్ (వియత్నాం)లతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. నేడు మరో తొమ్మిది రౌండ్లు జరుగుతాయి. -
తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ సంచలనం...
Telangana Gm Erigaisi Arjun: లాత్వియాలో జరిగిన లిండోరస్ అబ్బె బ్లిట్జ్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) ఎరిగైసి అర్జున్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. 18 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 18 ఏళ్ల అర్జున్ 13.5 పాయింట్లు సాధించాడు. అర్జున్ 13 గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని మరో నాలుగు గేముల్లో ఓడాడు. మేటి ప్లేయర్లు కరువానా (అమెరికా), అరోనియన్ (అర్మేనియా) తదితరులపై అర్జున్ గెలిచాడు. షెవ్చెంకో (ఉక్రెయిన్–14 పాయింట్లు) విజేతగా నిలిచాడు. చదవండి: T20 World Cup 2021: అలసటా.. టాస్ ప్రభావమా.. అసలు ధోని ఏం చేశాడు? కారణాలేంటి? -
కోవాగ్జిన్ టీకా తీసుకున్న హంపి.. మేటి పోటీకి దూరం
సాక్షి, హైదరాబాద్: భారత మహిళల చెస్ నంబర్‌వన్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి స్పెయిన్‌లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్ కోసం బాగా సన్నద్ధమైంది. అందుబాటులో ఉన్న ఆన్లైన్ టోర్నీ ల్లో చురుగ్గా పోటీపడింది. అయితే తీరా స్పెయిన్ ఈవెంట్ ఆడదామనుకుంటే ఆమె తీసుకున్న టీకా వల్ల ఆంక్షలు ఎదురయ్యాయి. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హంపి భారత్‌లో తయారైన కోవాగ్జిన్ టీకా తీసుకుంది. కానీ దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు లేదు. దీని వల్ల ఆమె స్పెయిన్ వెళ్లాలనుకుంటే మునుపటిలాగే కరోనా ప్రొటోకాల్ పాటించాలి. 10 రోజుల పాటు కఠిన క్వారంటైన్లో గడపాలి. ఈ విషయాలన్నీ హంపికి స్పెయిన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తేనే తెలిశాయి. ‘నార్త్ మెసిడోనియా మీదుగా స్పెయిన్ వెళ్లాలనుకున్నా. కానీ అక్కడా స్పెయిన్ మాదిరిగానే ఆంక్షలు ఉన్నాయి. అక్కడా పది రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చేది. ఆంక్షలు సడలించే అవకాశం ఉందేమోనని భారత చెస్ సమాఖ్య కూడా జోక్యం చేసుకుంది. కానీ వారి ప్రయత్నం కూడా ఫలించలేదు’ అని హంపి వివరించింది. కోవాగ్జిన్‌పై ఉన్న ఆంక్షల వల్ల ఆమె ఓ మేటి ఈవెంట్లో పాల్గొనలేకపోయింది. ఆమె స్థానం భర్తీ చేసేందుకు ఎంపిక చేసిన పద్మిని రౌత్‌కు అదే సమస్య ఎదురైంది. కోవాగ్జిన్‌తో ఆమె కూడా స్పెయిన్ పయనం కాలేకపోయింది. డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన కోవిషీల్డ్‌ను వేయించుకున్న వారికి 122 దేశాలు ఆంక్షలు సడలించాయి. చదవండి: Koneru Humpy: థ్యాంక్యూ సాక్షి.. న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు -
Women World Chess Championship: భారత్‌కు మిశ్రమ ఫలితాలు
సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అర్మేనియాతో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో 2.5–1.5తో గెలిచిన భారత జట్టు... రష్యాతో జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 1–3తో పరాజయం పాలైంది. అర్మేనియాతో మ్యాచ్‌లో హారిక తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకోగా... వైశాలి ఓడిపోయింది. తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి తమ ప్రత్యర్థులపై నెగ్గి భారత్‌కు విజయాన్ని అందించారు. రష్యాతో మ్యాచ్‌లో హారిక, మేరీఆన్ గోమ్స్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... తానియా, వైశాలి ఓడిపోయారు. నేడు ఐదో రౌండ్లో ఫ్రాన్స్‌తో భారత్ ఆడుతుంది. కాగా అజర్‌బైజాన్‌తో జరిగిన పూల్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకున్న భారత్... రెండో లీగ్ మ్యాచ్‌లో 2.5–1.5తో స్పెయిన్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: Ashwin Vs Morgan: అందుకే ఆ గొడవ జరిగింది: దినేశ్ కార్తిక్ The battles of the FIDE Women's World Team Championship are finished for today. Results of Round 4 of the group stage: Pool A Spain ½:3½ Armenia CFR Team 3:1 India France 3½:½ Azerbaijan Pool B Poland 2:2 Georgia FIDE Americas 2:2 Germany Ukraine 2½:1½ Kazakhstan pic.twitter.com/pdcmsOr5mP — International Chess Federation (@FIDE_chess) September 28, 2021 -
12 ఏళ్ల 4 నెలల 25 రోజుల వయస్సు.. ప్రపంచ రికార్డు!
బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ చెస్ చరిత్రలో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందిన పిన్న వయస్కుడిగా భారత సంతతికి చెందిన అమెరికా చిన్నారి అభిమన్యు మిశ్రా రికార్డు నెలకొల్పాడు. వెజెర్కెప్కో జీఎం టోర్నీలో భాగంగా తొమ్మిదో రౌండ్లో అభిమన్యు మిశ్రా 55 ఎత్తుల్లో భారత గ్రాండ్‌మాస్టర్ లియోన్ ల్యూక్ మెండోంకాపై గెలుపొంది గ్రాండ్‌మాస్టర్ హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను దక్కించుకున్నాడు. అభిమన్యు జీఎం హోదా 12 ఏళ్ల 4 నెలల 25 రోజుల వయస్సులో అందుకొని రష్యాకు చెందిన సెర్గీ కర్జాకిన్ (12 ఏళ్ల 7 నెలలు) పేరిట 2002 నుంచి ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక్కడ చదవండి: జొకోవిచ్ జోరు -
ఇకనైనా గుర్తించాలి
చెన్నై: అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో మనోళ్లు అడుగుపెడితే పతకాలతోనే తిరిగి రావడం అలవాటుగా మార్చుకున్నారు. కానీ చెస్ క్రీడాకారుల విజయాలను మాత్రం కేంద్ర ప్రభుత్వంలోని క్రీడాధికారులు గుర్తించడం లేదు. అందుకే ఏడేళ్లుగా ఒక్క చెస్ ప్లేయర్‌కు ‘ఖేల్‌రత్న’గానీ, ‘అర్జున అవార్డు’గానీ, కోచ్‌లకు ‘ద్రోణాచార్య’ అవార్డుగానీ, చెస్ క్రీడాభివృద్ధికి పాటుపడిన వారికి ‘ధ్యాన్‌చంద్’ అవార్డుగానీ రాలేదు. అయితే ఆదివారం ముగిసిన ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో కనబరిచిన ప్రదర్శనతో వచ్చే ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల విషయంలో చెస్ ఆటగాళ్ల నిరీక్షణకు తెరపడే అవకాశాలున్నాయని భారత సూపర్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కరోనా వల్ల ముఖాముఖి టోర్నీలు లేకపోవడంతో ఆన్లైన్ ఒలింపియాడ్ నిర్వహించగా భారత్... రష్యాతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో వెటరన్ గ్రాండ్‌మాస్టర్ ఓ ఇంటర్వూ్యలో పలు అంశాలపై తన అభిప్రాయాలు వెలిబుచ్చాడు. ► ఒలింపియాడ్ విజయంతో చెస్‌పట్ల అంతా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నాను. చెస్ ఆటగాళ్లకు ‘అర్జున’, కోచ్‌ల ‘ద్రోణాచార్య’ అవార్డులు వస్తాయని నమ్మకంతో ఉన్నాను. కొన్నిసార్లు కొందరికి మన ఉనికిని చాటు చెప్పాల్సి ఉంటుంది. తాజా ఒలింపియాడ్ స్వర్ణంతో పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశాభావంతో ఉన్నాను. కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో చెస్ క్రీడాకారులు విజయాలు సాధిస్తున్నా క్రీడా మంత్రిత్వ శాఖ అస్సలు గుర్తించడం లేదు. ► ఇక అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్)లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సమాఖ్య వారు ఈ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యలపై సుదీర్ఘ లేఖలు రాసే బదులు ఇలాంటి విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించాలి. ► ఈ టోర్నమెంట్లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేను. నిజానికి నేను జట్టును ముందుండి నడిపించాలి. కానీ అలా జరగలేదు. ఈ ఏడాది ముఖాముఖిగా జరగాల్సిన రెగ్యులర్ చెస్ ఒలింపియాడ్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దాని బదులు ఆన్లైన్లో నిర్వహించడం నిజంగా అద్భుతం. ఈ 2020లో ముఖాముఖి టోర్నీలకైతే చోటే లేదు. దీంతో ఈ ఏడాది ఆసాంతం ఇక ఆన్లైన్ టోర్నీలే నిర్వహించాలి. ► భారత క్రీడాకారులంతా ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. నేను ఆట మధ్యలో సహచరుల ఎత్తుల్ని గమనించాను. నిజంగా ప్రతి ఒక్కరు వేసిన ఎత్తులు నన్ను ఆశ్చర్యపరిచాయి. ► సీనియర్లే కాదు... భారత్‌లో జూనియర్లు, బాలబాలికలంతా బాగా ఆడుతున్నారు. దీంతో మన బెంచ్ పరిపుష్టిగా ఉంది. దీనివల్ల భవిష్యత్‌లో మన చెస్‌కు, మేటి ఫలితాలకు ఢోకా ఉండదు. ► భారత్, రష్యాల మధ్య జరిగిన ఫైనల్ రౌండ్ పోటీలను దేశవ్యాప్తంగా 60 వేల పైచిలుకు వీక్షించడం సంతోషించదగ్గ విషయం. ఇంతటి ఆదరణ నేను ఊహించలేదు. ఇక భారత్ విషయానికొస్తే ఈ విజయంతో కొత్త తరం కూడా భాగస్వాములవడం సానుకూలాంశం. ► సీనియర్లే కాదు... భారత్‌లో జూనియర్లు, బాలబాలికలంతా బాగా ఆడుతున్నారు. దీంతో మన బెంచ్ పరిపుష్టిగా ఉంది. దీనివల్ల భవిష్యత్‌లో మన చెస్‌కు, మేటి ఫలితాలకు ఢోకా ఉండదు. ► భారత్, రష్యాల మధ్య జరిగిన ఫైనల్ రౌండ్ పోటీలను దేశవ్యాప్తంగా 60 వేల పైచిలుకు వీక్షించడం సంతోషించదగ్గ విషయం. ఇంతటి ఆదరణ నేను ఊహించలేదు. ఇక భారత్ విషయానికొస్తే ఈ విజయంతో కొత్త తరం కూడా భాగస్వాములవడం సానుకూలాంశం. -
వైశాలి సంచలనం... ప్రపంచ ఏడో ర్యాంకర్‌పై విజయం
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళల స్పీడ్ చెస్ ఆన్లైన్ రెండో గ్రాండ్‌ప్రి చాంపియన్‌షిప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) ఆర్.వైశాలి సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో చెన్నైకి చెందిన 19 ఏళ్ల వైశాలి 6–4 పాయింట్ల తేడాతో ప్రపంచ ఏడో ర్యాంకర్, 2016 ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్ అనా ముజిచుక్ (ఉక్రెయిన్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. హారిక 4–7 పాయింట్ల తేడాతో అనా ఉషెనినా (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. -
ప్రపంచ మాజీ చాంపియన్‌పై హంపి విజయం
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, మహిళల విభాగంలో భారత నంబర్‌వన్ కోనేరు హంపి మూడో విజయం నమోదు చేసింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో హంపి 61 ఎత్తుల్లో గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఖాతాలో నాలుగో ‘డ్రా’ చేరింది. ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ (చైనా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను హారిక 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్ తర్వాత హంపి, జూ వెన్జున్ నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. హారిక మూడు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. -
జీఎం హోదాకు చేరువలో రాహుల్ శ్రీవత్సవ్
సాక్షి, హైదరాబాద్: చదరంగంలో తెలంగాణ నుంచి త్వరలోనే మరో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) అవతరించనున్నాడు. హైదరాబాద్ క్రీడాకారుడు, 18 ఏళ్ల రాహుల్ శ్రీవత్సవ్ ఈ హోదాకు చేరువయ్యాడు. వెనిస్ వేదికగా జరిగిన మోంట్బెలూనా ఓపెన్ చెస్ టోర్నీలో మెరుగ్గా రాణించిన ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) రాహుల్... గ్రాండ్ మాస్టర్ హోదా పొందడానికి అవసరమైన మూడో నార్మ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో తనకన్నా మెరుగైన ప్రత్యర్థులతో ఆడిన రాహుల్ నాలుగు గేమ్‌ల్లో గెలుపొంది, ఐదు గేమ్‌ల్ని డ్రా చేసుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లు ముగిశాక 6.5 పాయింట్లతో అతను మూడో స్థానంలో నిలిచాడు. తొలి రెండు గేమ్‌ల్లో సాహిన్ ఓజ్గన్ (టర్కీ), ఐఎం సంకల్ప్ గుప్తా (భారత్)లపై గెలుపొందిన రాహుల్ మూడు, నాలుగు గేమ్‌ల్లో వరుసగా మార్టినెజ్ జోస్ ఎడ్యుర్డో (పెరూ), ఓజెన్ డెనిజ్ (టర్కీ)లతో డ్రా చేసుకున్నాడు. తర్వాతి రెండు గేమ్‌లలో బర్సెయాన్ హరుత్యున్ (ఫ్రాన్స్), నికోలోవ్స్కీ నికోలా (మసెడోనియా)లపై నెగ్గాడు. తర్వాత వరుసగా ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు స్మిర్నోవ్ అంటోన్ (ఆస్ట్రేలియా), జనన్ ఇవ్‌జెనీ (ఇజ్రాయెల్), టెర్ సమక్యాన్ సామ్వెల్ (అర్మేనియా)లతో గేమ్‌లను డ్రా చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం గ్రాండ్‌మాస్టర్ హోదా పొందడానికి మూడు జీఎం నార్మ్‌లతో పాటు 2500 ఎలో రేటింగ్ పాయింట్లు కచ్చితంగా సాధించాల్సి ఉంది. అయితే రాహుల్ మరో 31 ఎలో రేటింగ్ పాయింట్లు వెనుకబడి ఉండటంతో జీఎం హోదా పొందడానికి మరింత కాలం ఆగాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే రాహుల్ ఇటలీలో జరిగే మరిన్ని టోర్నీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. రాహుల్ అనుకున్నది సాధిస్తే... ఇరిగైసి అర్జున్, హర్ష భరతకోటి తర్వాత తెలంగాణ తరఫున మూడో గ్రాండ్‌మాస్టర్‌గా అవతరిస్తాడు. -
దూసుకెళుతోన్న హంపి, హారిక
మాస్కో: ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. టోర్నీలో ఎనిమిది రౌండ్ల అనంతరం వీరిద్దరూ 6 పాయింట్లతో సమంగా నిలిచినప్పటికీ... ర్యాంకుల్ని వర్గీకరించగా హంపి ఐదో స్థానంలో, హారిక ఎనిమిదో స్థానంలో ఉన్నారు. 6.5 పాయింట్లతో రొమేనియా ప్లేయర్ బల్మగ ఇరినా అగ్రస్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం మొత్తం నాలుగు రౌండ్లు జరుగగా హంపి ఐదో గేమ్‌లో గిర్యా ఓల్గాపై గెలుపొంది, ఆరో గేమ్‌లో బల్మగ ఇరినా చేతిలో ఓడిపోయింది. ముజిచుక్ అనాతో ఏడో గేమ్‌ను డ్రా చేసుకున్న ఆమె.. ఎనిమిదో గేమ్‌లో జనిజె ననాపై గెలుపొందింది. మరోవైపు హారిక మూడు గేమ్‌ల్ని డ్రా చేసుకొని ఒక గేమ్‌లో గెలుపొందింది. గలియామోవా అలీసా (ఆరో గేమ్)పై గెలుపొందిన హారిక... కశ్లిన్స్కాయా అలీనా (ఐదో గేమ్), పొగోనినా నటలిజా (ఏడో గేమ్), లగ్నో కాటెరినా (ఎనిమిదో గేమ్)లతో మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. -
టైటిల్‌తో సీజన్ ముగించేనా?
మాస్కో: ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ఈ సంవత్సరంలో చివరి టోర్నమెంట్‌కు సిద్ధమయ్యారు. మాస్కోలో నేడు మొదలయ్యే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో హంపి, హారిక టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. ర్యాపిడ్ విభాగంలో మొత్తం 121 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 12 రౌండ్లపాటు టోర్నీ జరుగుతుంది. గురు, శుక్ర, శనివారాల్లో నాలుగు రౌండ్ల చొప్పున గేమ్‌లు జరుగుతాయి. ఈనెల 29, 30వ తేదీల్లో బ్లిట్జ్ విభాగం గేమ్‌లను నిర్వహిస్తారు. బ్లిట్జ్ కేటగిరీలో 17 రౌండ్లు ఉంటాయి. ఇక ఓపెన్ విభాగంలో భారత్ నుంచి గ్రాండ్‌మాస్టర్లు విదిత్ సంతోష్ గుజరాతి, ఆధిబన్, కృష్ణన్ శశికిరణ్, సూర్యశేఖర గంగూలీ, సేతురామన్, శ్రీనాథ్ నారాయణన్, అరవింద్ చిదంబరం, విష్ణుప్రసన్న, హర్ష భరతకోటి, రౌనక్ సాధ్వాని, నిహాల్ సరీన్, డి.గుకేశ్ ఉన్నారు. -
చెస్ చాంపియన్ శ్రీశ్వాన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఎం. శ్రీశ్వాన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఎల్బీ స్టేడియంలోని యోగా హాల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో శ్రీశ్వాన్ విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. టోర్నీలో నిర్ణీత 6 రౌండ్ల అనంతరం శ్రీశ్వాన్ 5.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 5 పాయింట్లతో వి. వరుణ్, శ్రీ సాయి బశ్వంత్, భరత్ కుమార్‌రెడ్డి రెండో స్థానం కోసం పోటీపడ్డారు. మెరుగైన టైబ్రేక్ స్కోర్ ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా వరుణ్ రన్నరప్‌గా నిలిచాడు. సాయి బశ్వంత్, భరత్ కుమార్ వరుసగా మూడు, నాలుగు స్థానాలతో సంతృప్తిపడ్డారు. వీరు నలుగురు త్వరలో జరుగనున్న జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. శనివారం జరిగిన చివరిదైన ఆరో రౌండ్ గేమ్‌లో వరుణ్‌తో ఆడిన శ్రీశ్వాన్ మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. అంతకుముందు ఐదో గేమ్‌లో శ్రీ సాయి బశ్వంత్‌పై, నాలుగోరౌండ్లో అమిత్ పాల్ సింగ్‌పై, మూడో రౌండ్లో శిబి శ్రీనివాస్ ఐన్‌స్టీన్‌పై విజయాలు నమోదు చేశాడు. ఆరో రౌండ్ గేమ్ ఇతర బోర్డుల్లో సరయుపై శ్రీ సాయి బశ్వంత్, శ్రీకర్‌పై భరత్‌కుమార్ రెడ్డి, ప్రణయ్‌పై షణ్ముఖ, శ్రీథన్‌పై శరత్ చంద్ర, శిబి శ్రీనివాస్‌పై రిషిపాల్ సింగ్, అష్మితా రెడ్డిపై అకీరా నెగ్గారు. టోర్నీ ముగింపు కార్యక్రమంలో హ్యాండ్‌బాల్ జాతీయ కోచ్ రవి కుమార్, దీపక్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ఆనంద్ వేసిన ఎత్తులు...
న్యూఢిల్లీ: భారత సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వేసే ఎత్తుకు పైఎత్తులు, విజయాలు, గెలుపోటములకు సంబంధించిన పోరాటాన్ని తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆనంద్ తన అనుభవాలకు అక్షర రూపమిచ్చాడు. ఇదే పుస్తకంగా మార్కెట్లోకి రానుంది. ‘మైండ్‌మాస్టర్’– విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఎ చాంపియన్స్ లైఫ్ (విజేత జీవితంలోని విజయ పాఠాలు) అనే పేరుతో డిసెంబర్ నెలలో మార్కెట్లోకి రానుంది. అదే నెల 11న అధికారికంగా ‘మైండ్‌మాస్టర్’ పుస్తకాన్ని లాంఛనంగా విడుదల చేయనున్నట్లు పబ్లికేషన్ సంస్థ తెలిపింది. జర్నలిస్ట్ సుశాన్ నినన్కు తెలిపిన తన కెరీర్ అనుభవాలను ఆ విలేకరి అక్షరగ్రంథంగా మలచగా... దీన్ని హాచెట్ ఇండియా సంస్థ ముద్రించింది. -
చాంపియన్ అర్ఘ్యసేన్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత బిలో 1400 ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో పశ్చిమ బెంగాల్ క్రీడాకారుడు అర్ఘ్యసేన్ విజేతగా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 9 రౌండ్ల అనంతరం 8.5 పాయింట్లతో అతను అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో చివరి వరకు పోరాడిన తెలుగు క్రీడాకారిణి తేజశ్రీకి నిరాశ తప్పలేదు. తమిళనాడుకు చెందిన భరత్ రాజ్ రన్నరప్‌గా నిలవగా... ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పి. తేజశ్రీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. వీరిద్దరితో పాటు ఎస్. ఉన్నిక్రిష్ణన్ (కేరళ), ఎంఏ సమీ (కేరళ) 8 పాయింట్లు సాధించి సంయుక్తంగా రెండో స్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా భరత్, తేజ వరుసగా రెండు, మూడు స్థానాల్లో... ఉన్నిక్రిష్ణన్, సమీ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. విజేతగా నిలిచిన అర్ఘ్యసేన్‌కు టైటిల్‌తో పాటు రూ. 50,000 ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్‌కు రూ. 25,000, తేజశ్రీకి రూ. 13,000 నగదు బహుమతిగా అందజేశారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ దీపక్, టీఎస్‌సీఏ కార్యదర్శి కేఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశ్వాన్‌కు కాంస్యం
ముంబై: సొంతగడ్డపై జరిగిన ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు మెరిశారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు లభించాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాడు మరాలాక్షికరి శ్రీశ్వాన్ అండర్–14 ఓపెన్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత నిజామాబాద్ జిల్లాకు చెందిన 13 ఏళ్ల శ్రీశ్వాన్ 8 పాయింట్లతో మరో ఐదుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... శ్రీశ్వాన్‌కు మూడో స్థానం లభించింది. భారత్‌కే చెందిన ఎల్.ఆర్.శ్రీహరి (తమిళనాడు) రెండో స్థానంలో నిలిచి రజతం గెల్చుకున్నాడు. ఈ విభాగంలో అజర్‌బైజాన్‌కు చెందిన ఐదిన్ సులేమాన్లి 9 పాయింట్లతో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ టోరీ్నలో శ్రీశ్వాన్ ఏడు గేముల్లో గెలుపొంది, రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. మరో రెండు గేముల్లో ఓడిపోయాడు. ఈ ఏడాది జూలైలో బార్సిలోనాలో జరిగిన టోరీ్నలో శ్రీశ్వాన్ మూడో అంతర్జాతీయ నార్మ్ (ఐఎం)ను సాధించి... తెలంగాణ తరఫున పిన్న వయస్సులో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా పొందిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అండర్–18 ఓపెన్ విభాగంలో 14 ఏళ్ల తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రజ్ఞానంద ఏడు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అండర్–18 బాలికల విభాగంలో వంతిక అగర్వాల్ భారత్‌కు రజతం అందించింది. అండర్–14 బాలికల విభాగంలో దివ్య దేశ్‌ముఖ్ రెండో స్థానంలో, రక్షిత మూడో స్థానంలో నిలిచి వరుసగా రజత, కాంస్య పతకాలు అందించారు. అండర్–16 ఓపెన్ విభాగంలో అరోన్యాక్ ఘోష్ కాంస్యం గెలిచాడు. -
భరత్‌కుమార్ రెడ్డికి మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులకు నిరాశే ఎదురైంది. చివరి వరకు టైటిల్ బరిలో నిలిచిన భరత్‌కుమార్ రెడ్డి, వి. వరుణ్, సుమేర్ అర్ష్ అనుకున్నది సాధించలేకపోయారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కౌస్తవ్ కుందు ఈ టోర్నీలో చాంపియన్‌గా అవతరించాడు. ప్రకాశ్ రామ్ (పంజాబ్) రన్నరప్‌గా నిలవగా, భరత్‌కుమార్ రెడ్డి మూడోస్థానంతో సంతృప్తి పడ్డాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోరీ్నలో నిర్ణీత 9 రౌండ్ల అనంతరం కౌస్తవ్ 8 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 7.5 పాయింట్లు సాధించిన ప్రకాశ్ రామ్, భరత్ కుమార్ రెడ్డి, వి. వరుణ్, షేక్ సుమేర్ అర్ష్ ముసిని అజయ్ (ఏపీ) రెండో స్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోర్ ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా ప్రకాశ్, భరత్‌కుమార్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో... సుమేర్, అజయ్ వరుసగా నాలుగు, ఐదు స్థానాలలో నిలిచారు. విజేతగా నిలిచిన కౌస్తవ్ ట్రోఫీతో పాటు రూ. 50,000 ప్రైజ్‌మనీ అందుకోగా... ప్రకాశ్ రామ్‌కు రూ. 25,000, భరత్ రూ. 13,000 బహుమతిగా అందుకున్నారు. -
చాంపియన్ జ్యోతి
సాక్షి, హైదరాబాద్: పాఠశాల క్రీడా సమాఖ్య హైదరాబాద్ జిల్లా అండర్–19 చెస్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజి (మెహిదీపట్నం) క్రీడాకారులు సత్తా చాటారు. తొలి ఐదు స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకుని హైదరాబాద్ జట్టుకు ఎంపికయ్యారు. నృపతుంగా జూనియర్ కాలేజి వేదికగా శుక్రవారం జరిగిన ఈ టోర్నీలో నిరీ్ణత మూడు రౌండ్ల అనంతరం జ్యోతి (సెయింట్ ఆన్స్) 3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2.5 పాయింట్లు సాధించిన జయశ్రీ (సెయింట్ ఆన్స్), డి. చేతన (భవన్స్ జూనియర్ కాలేజి) సంయుక్తంగా రెండో స్థానం కోసం పోటీపడ్డారు. మెరుగైన టైబ్రేక్ స్కోర్ ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా జయశ్రీ రన్నరప్‌గా నిలిచింది. చేతన మూడో స్థానంలో తృప్తి పడింది. సాదియా ఫాతిమా (సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజి), సంధ్య (మహబూబ్ కాలేజి) 2 పాయింట్లతో వరుసగా నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నారు. ఈ టోర్నీలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే హైదరాబాద్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. సంగారెడ్డిలో అక్టోబర్ 3నుంచి 5వరకు తెలంగాణ రాష్ట్ర అండర్–19 చెస్ టోర్నీ జరుగుతుంది. -
28 నుంచి చెస్ సెలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–11 చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టు కోసం ఈనెల 28 నుంచి సెలక్షన్ ట్రయల్స్ జరుగనున్నాయి. వరంగల్ జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో కాజీపేట్‌లోని బిషప్ బెరెట్టా పాఠశాల వేదికగా రెండు రోజుల పాటు ఈ ఎంపిక పోటీలను నిర్వహిస్తారు. అండర్–7, 9, 11 బాలబాలికల విభాగాల్లో ఈ టోర్నీలో ప్రతి కేటగిరీలోనూ తొలి రెండు స్థానాల్లో నిలిచిన బాలబాలికలు రాష్ట్ర జట్టుకు ఎంపికవుతారు. ఆసక్తి గల వారు ఈనెల 27లోగా తమ ఎంట్రీలను పంపించాలి. 2009 జనవరి 1 తర్వాత జన్మించిన వారు మాత్రమే ఈ టోర్నీలో పాల్గొనేందుకు అర్హులు. మరిన్ని వివరాలకు 90665 67567, 98494 94999, 94920 27919ను సంప్రదించాలి. 29 నుంచి రాష్ట్రస్థాయి చెస్ టోర్నీ టీఎస్‌సీఏ ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి రాష్ట్రస్థాయి జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ జరుగనుంది. ఎల్బీ స్టేడియంలోని టీఎస్‌సీఏ కార్యాలయంలో అండర్–19 బాలబాలికల విభాగంలో రెండు రోజుల పాటు ఈ టోర్నీని నిర్వహిస్తారు. స్విస్ లీగ్ ఫార్మాట్లో పోటీలు జరుగుతాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర జట్టుకు ఎంపికవుతారు. ఆసక్తి గల వారు ఈనెల 28లోగా ఎంట్రీలను పంపించాలి. స్పాట్ ఎంట్రీలకు అనుమతి లేదు. వివరాలకు www.chesstelangana.com వెబ్సైట్లో లేదా 73375 78899, 73373 99299 నంబర్లలో సంప్రదించాలి. -
చాంపియన్ ఆడమ్
సాక్షి, హైదరాబాద్: టెట్రాసాఫ్ట్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌మాస్టర్ చెస్ టోర్నమెంట్లో ఉక్రెయిన్ గ్రాండ్ మాస్టర్ ఆడమ్ టుఖెవ్ అగ్రస్థానంలో నిలిచాడు. హోటల్ మారియట్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 9 రౌండ్ల అనంతరం ఆడమ్ (ఉక్రెయిన్) 8 పాయింట్లతో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. పోటీల చివరిరోజు సోమవారం తొమ్మిదో రౌండ్ గేమ్‌లో ఇరాన్ గ్రాండ్‌మాస్టర్ మసౌద్పై 44 ఎత్తుల్లో ఆడమ్ గెలుపొందాడు. సావ్చెంకో బోరిస్, అలెగ్జాండర్, ఖుసెన్ఖోజెవ్ ముహమ్మద్, కౌస్తుభ్, హరి మాధవన్ 7 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఇతర గేముల్లో తమిళనాడుకు చెందిన ముత్తయ్యపై కుశాగ్ర మోహన్ (తెలంగాణ, 6.5 పాయింట్లు), మొహమ్మద్ అనీస్ (తమిళనాడు, 5.5 పాయింట్లు)పై రాజా రిత్విక్ (తెలంగాణ, 6.5 పాయింట్లు), జేకే రాజు (తెలంగాణ, 5 పాయింట్లు)పై స్మిర్నోవ్ పావెల్ (రష్యా, 6 పాయింట్లు), కార్తీక్ సాయి (తెలంగాణ, 5 పాయింట్లు)పై రామకృష్ణ (ఆంధ్రా బ్యాంక్, 6 పాయింట్లు), శరత్ చంద్ర (తెలంగాణ, 5 పాయింట్లు)పై కిరణ్ మనీషా (ఎల్ఐసీ, 6 పాయింట్లు), భరత్ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్, 6 పాయింట్లు)పై సావ్చెంకో బోరిస్ (రష్యా, 7 పాయింట్లు), అతుల్ (మహారాష్ట్ర, 6 పాయింట్లు)పై ట్రియాపిస్కో అలెగ్జాండర్ (రష్యా, 7 పాయింట్లు), వాసెజ్ రోడ్రిగో (చిలీ, 5.5 పాయింట్లు)పై కౌస్తుభ్ (పశ్చిమ బెంగాల్, 7 పాయింట్లు) విజయం సాధించారు. -
తెలంగాణ రాష్ట్ర చెస్ జట్టులో ఉమేశ్, కీర్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అమెచ్యూర్ ఓపెన్ చెస్ సెలక్షన్ టోర్నమెంట్లో కె. ఉమేశ్, జి. కీర్తి మెరుగైన ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరిద్దరితో పాటు అభిరామ్ ప్రమోద్, అంకిత గౌడ్ కూడా జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ సెలక్షన్స్‌లో నిర్ణీత 8 రౌండ్ల అనంతరం బాలుర విభాగంలో ఉమేశ్ 7 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచాడు. అభిరామ్ 6.5 పాయింట్లతో రన్నరప్ ట్రోఫీని అందుకున్నాడు. బాలికల కేటగిరీలో కీర్తి 6 పాయింట్లతో, అంకిత 5.5 పాయింట్లతో తొలి రెండు స్థానాలను దక్కించుకుని రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ టోర్నీలో తొలి 13 స్థానాల్లో నిలిచిన పురుషులకు, తొలి 8 స్థానాలను దక్కించుకున్న మహిళలకు రూ. 1000 ప్రైజ్‌మనీగా అందజేశారు. చివరిదైన ఎనిమిదో రౌండ్లో వినోద్ (6)పై ఉమేశ్ (7), ధ్రువ (6)పై అభిరామ్ (6.5), అంకిత (5.5)పై అద్వయ్ (6.5), నేత్ర (5)పై సుబ్బరాజు (6), అధ్వర శిరీష్ (5)పై కీర్తి (6), రోహిత్ (5)పై సత్యనారాయణ (6), గౌతమ్ (5)పై సూర్య (6), రవితేజ (5)పై సంకేత్‌రెడ్డి (6), శశాంక్ (5)పై విఘ్నేశ్ (6), జ్ఞానిత(4.5) శ్రీధన్వి (5.5), బ్రహ్మానందం (4)పై హర్షిత (5.5)పై గెలుపొందారు. -
అర్జున్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–9 ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆదిరెడ్డి అర్జున్, ఆకుల సుహాస్ మెరుగైన ప్రదర్శన కనబరిచారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈటోర్నీలో అర్జున్ రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని సాధించగా... సుహాస్ కాంస్యాన్ని అందుకున్నాడు. టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల అనంతరం అర్జున్, సుహాస్ 9 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగై టై బ్రేక్ ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా అర్జున్ రెండో స్థానంలో, సుహాస్ మూడో స్థానంలో నిలిచారు. తమిళనాడుకు చెందిన జి. ఆకాశ్ 9.5 పాయింట్లతో చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. అర్జున్, సుహాస్‌లిద్దరూ 8 గేముల్లో గెలిచి, మరో రెండు గేముల్ని డ్రాగా ముగించారు. చెరో గేమ్‌లో ఓడిపోయారు. -
శ్రీథన్‌కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–25 యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుడు సాయ్‌పురి శ్రీథన్ రాణించాడు. జమ్మూ వేదికగా జరిగిన ఈ టోర్నీలో 15 ఏళ్ల శ్రీథన్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఏడు రౌండ్లపాటు జరిగిన పోటీల్లో శ్రీథన్ 6 పాయింట్ల సాధించి మూడో స్థానంలో నిలిచాడు. నిర్ణీత 7 రౌండ్ల అనంతరం ఎస్ కుమార్ (తమిళనాడు), మోహిత్ కుమార్ సోని (బిహార్), శ్రీథన్ తలా 6 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా కుమార్ చాంపియన్‌గా, మోహిత్ కుమార్ రన్నరప్‌గా నిలిచారు. శ్రీథన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పోటీల్లో భాగంగా 5 విజయాలు నమోదు చేసిన శ్రీథన్ మరో రెండు గేముల్ని డ్రాగా ముగించి టోర్నీలో అజేయంగా నిలిచాడు. తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ ఆర్ఎస్ శరణ్ 5 పాయింట్లతో 12వ స్థానానికి పరిమితం కాగా... పవన్‌తేజ 4 పాయింట్లతో 32వ స్థానంలో నిలిచాడు. -
చెస్ విజేతలు లక్ష్మి, ధ్రువ్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (డీఎస్ఈ, అత్తాపూర్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్లో లక్ష్మీ సమిరాజ్ (భారతీ విద్యాభవన్, జూబ్లీహిల్స్), ధ్రువ్ (సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్) ఆకట్టుకున్నారు. సీనియర్స్ విభాగంలో ధ్రువ్ చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మోక్షజ్ఞ (గౌతమి విద్యాక్షేత్ర), బి. అఖిల్ (డీపీఎస్), హైదర్ (డీఎస్ఈ, అత్తాపూర్) వరుసగా తర్వాతి స్థానాలను సాధించారు. జూనియర్స్ కేటగిరీలో లక్ష్మి అగ్రస్థానాన్ని దక్కించుకోగా.... బి. ధ్రువన్ రెడ్డి (డీపీఎస్) రన్నరప్‌గా నిలిచాడు. ఫోనిక్స్ గ్రీన్స్‌కు చెందిన ఆదిత్య సాయి, కెన్నడీ విద్యాభవన్ ప్లేయర్ శ్రీవర్ష వరుసగా మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 39 పాఠశాలలకు చెందిన మొత్తం 256 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
సహజశ్రీకి డబ్ల్యూఐఎం హోదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి మహిళా అంతర్జాతీయ మాస్టర్ (డబ్ల్యూఐఎం)గా కరీంనగర్ అమ్మాయి చొల్లేటి సహజశ్రీ అవతరించింది. తాజాగా చెక్ రిపబ్లిక్ వేదికగా జరిగిన చెక్ ఓపెన్ చెస్ టోర్నీలో పాల్గొన్న ఆమె మెరుగైన ప్రదర్శన కనబరిచి చివరిదైన మూడో డబ్ల్యూఐఎం నార్మ్‌తోపాటు తొలి మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) నార్మ్‌ను సంపాదించింది. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన తెలంగాణ తొలి మహిళా చెస్ ప్లేయర్‌గా నిలిచింది. చెక్ ఓపెన్‌లో 9 రౌండ్ల పాటు పోటీలు జరగగా... సహజశ్రీ 5 పాయింట్లు సాధించి 102వ స్థానంతో టోర్నీని ముగించింది. ఈ టోర్నీలో భాగంగా ఇద్దరు గ్రాండ్మాస్టర్లతో తలపడిన సహజశ్రీ మెరుగైన ఫలితాలు సాధించింది. తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకటరామన్‌పై గెలుపొంది, రష్యా జీఎం సెర్గీ డోమోగెవ్‌తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకుంది. ఓవరాల్‌గా మూడు గేముల్లో గెలుపొంది, రెండు గేముల్లో పరాజయం పాలైంది. మిగతా నాలుగు గేముల్ని డ్రాగా ముగించింది. , , -
ప్రత్యూషకు నాలుగో స్థానం
కరైకుడి (తమిళనాడు): జాతీయ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష నాలుగో స్థానంలో నిలిచింది. శనివారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో ప్రత్యూష ఎనిమిది పాయింట్లు సాధించింది. 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రత్యూష ఏడు గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో రెండింటిలో పరాజయం పాలైంది. 10 పాయింట్లు సాధించిన డిఫెండింగ్ చాంపియన్ భక్తి కులకర్ణి (ఎయిరిండియా) టైటిల్ నిలబెట్టుకోగా... 8.5 పాయింట్లతో వంతిక అగర్వాల్ (ఢిల్లీ), దివ్య దేశ్‌ముఖ్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా వంతిక రన్నరప్‌గా నిలిచింది. దివ్య దేశ్‌ముఖ్‌కు మూడో స్థానం లభించింది. ఈ టోర్నీలో పోటీపడిన ఇతర ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు జి.హర్షిత (7.5 పాయింట్లు) పదో స్థానంలో, వి.తోషాలి (6 పాయింట్లు) 38వ స్థానంలో నిలిచారు. -
శ్రీశ్వాన్‌కు ఐఎం హోదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ క్రీడాకారుడు మాస్టర్ ఎం. శ్రీశ్వాన్ తన ప్రొఫెషనల్ చెస్ కెరీర్లో మరో ఘనత సాధించాడు. స్పెయిన్‌లోని బార్సిలోనా చెస్ టోర్నీలో పాల్గొన్న శ్రీశ్వాన్ అద్భుతంగా రాణించి ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) హోదాను పొందడానికి అవసరమైన మూడో నార్మ్‌ను అందుకున్నాడు. తద్వారా తెలంగాణ నుంచి అతిపిన్న వయస్సులో ఐఎం హోదాను సంపాదించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం 13 ఏళ్ల 5 నెలల 10 రోజుల వయస్సున్న శ్రీశ్వాన్ ఐఎం హోదాను అందుకోవడానికి అవసరమైన 2400 ఎలో రేటింగ్ పాయింట్లను దాటేశాడు. అతని ఖాతాలో ఇప్పుడు 2461 ఎలో రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. శ్రీశ్వాన్ తెలంగాణ తరఫున ఏడో ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) ప్లేయర్ కావడం విశేషం. -
చాంపియన్ కార్తీక్ సాయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో సీహెచ్ కార్తీక్ సాయి విజేతగా నిలిచాడు. స్ఫూర్తి చెస్ అకాడమీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్లో నిర్ణీత 8 రౌండ్ల అనంతరం 7 పాయింట్లతో కార్తీక్ సాయి, పి. అభినవ్, సాయ్‌పురి శ్రీథన్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా కార్తీక్ చాంపియన్‌గా నిలవగా... అభినవ్, శ్రీథన్ వరుసగా రెండు, మూడు స్థానాలతో సరిపెట్టుకున్నారు. చివరిదైన ఎనిమిదో రౌండ్లో శ్రీహిత్రెడ్డిపై కార్తీక్‌సాయి, విశ్వక్సేన్పై అభినవ్, నరేన్‌పై శ్రీథన్, సుశాంత్‌పై బషిక్ ఇమ్రోస్, నటురా బేతిపై సుబ్బరాజు గెలుపొందారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్ ఎండీ ఎ. దినకర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం కార్యదర్శి కేఎస్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు కేఏ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చాంపియన్ సాయి అచ్యుత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర యూత్ అండర్–25 ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో సాయి అచ్యుత్ చాంపియన్‌గా నిలిచాడు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం కార్యాలయంలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 7 రౌండ్ల అనంతరం 6.5 పాయిం ట్లతో సాయి అచ్యుత్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం చివరిదైన ఏడో రౌండ్లో అకీరా సౌమ్యనాథ్‌తో జరిగిన మ్యాచ్‌ను సాయి అచ్యుత్ డ్రా చేసుకున్నాడు. పవన్ తేజ 6 పాయింట్లతో రన్నరప్‌గా నిలవగా... 5.5 పాయింట్లు సాధించిన శిబి శ్రీనివాస్ (లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజి), అకీరా సౌమ్యనాథ్ (తక్షశిల పబ్లిక్ స్కూల్) వరుసగా మూడు, నాలుగు స్థానాలను సంపాదించుకున్నారు. వీరంతా తొలి నాలుగు స్థానాల్లో నిలిచి జాతీయ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఇతర ఏడో రౌండ్ మ్యాచ్‌ల్లో ధ్రువపై పవన్‌తేజ, నరేశ్‌పై శ్రేయ, అక్షయ్‌పై శ్రీనందన్, నికుంజ్‌పై హర్షిత అగర్వాల్ విజయం సాధించారు. శిబి శ్రీనివాస్‌తో జరిగిన గేమ్‌ను బిపిన్‌రాజ్ డ్రాగా ముగించాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం ఉపాధ్యక్షుడు మేజర్ శివప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
అకీరాపై ధ్రువ గెలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్–25 ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో ధ్రువ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేశాడు. రాష్ట్ర చెస్ సంఘం కార్యాలయంలో శనివారం జరిగిన మూడోరౌండ్ గేమ్‌లో అకీరా సౌమ్యనాథ్‌పై ధ్రువ గెలుపొందాడు. ఇతర బోర్డుల్లో విశ్వతేజపై బిపిన్ రాజ్, శ్రీ చరణ్‌పై శిబి శ్రీనివాస్, శ్రేయపై నాగ సాయి, శ్రీకాంత్‌పై పవన్ తేజ నెగ్గారు. మూడో రౌండ్ అనంతరం 3 పాయింట్లతో ధ్రువ, బిపిన్ రాజ్, నాగ సాయి, శిబి శ్రీనివాస్, పవన్ తేజ, నికుంజ్, సాయి అచ్యుత్ సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచారు. ఏడు రౌండ్ల పాటు జరుగనున్న ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికవుతారు. జాతీయ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఈ జట్టు తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తుంది. -
అగ్రస్థానంలో హరిణి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో హరిణి నరహరి ఆకట్టుకునే ప్రదర్శన కనబరుస్తోంది. అబిడ్స్‌లోని తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) కార్యాలయంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మూడు రౌండ్లు ముగిసేసరికి 3 పాయింట్లతో హరిణి అగ్రస్థానంలో నిలిచింది. వి. నందిత, స్నేహా వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. శనివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో అభిరామి (2)పై హరిణి (2), శీతల్ (2)పై నందిత (2), శ్రీశాంతి (2)పై స్నేహ, శాన్వి (1.5)పై రచిత గెలుపొందారు. ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికవుతారు. -
ఆసియా చెస్ బ్లిట్జ్ చాంపియన్ నిహాల్
జింగ్‌తాయ్ (చైనా): భారత యువ గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సరీన్ ఆసియా చెస్ చాంపియన్‌షిప్‌లో బ్లిట్జ్ విభాగంలో టైటిల్ సాధించాడు. శనివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో నిహాల్ ఎనిమిది పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 14 ఏళ్ల నిహాల్ ఏడు గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. భారత్‌కే చెందిన ఎస్.ఎల్.నారాయణన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకోగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ 6.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు క్లాసిక్ విభాగం ఓపెన్ కేటగిరీలో భారత గ్రాండ్‌మాస్టర్స్ కార్తికేయ మురళి, సేతురామన్ వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. కార్తికేయ, సేతురామన్తోపాటు నారాయణన్ కూడా వరల్డ్ కప్ చెస్ టోర్నమెంట్‌కు అర్హత పొందారు. -
చాంపియన్ శ్రీశ్వాన్
శ్రీలంక: ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ ప్లేయర్ శ్రీశ్వాన్ సత్తాచాటాడు. శ్రీలంకలోని వాస్కదువా వేదికగా జరిగిన ఈ టోర్నీలో 2 స్వర్ణాలు, ఒక కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అండర్–14 బాలుర వ్యక్తిగత విభాగంలో శ్రీశ్వాన్ చాంపియన్‌గా నిలిచాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల అనంతరం 8 పాయింట్లతో అగ్రస్థానాన్ని అం దుకున్నాడు. అతను ఏడు గేముల్లో గెలిచి రెండింటిని డ్రా చేసుకొని అజేయంగా నిలిచాడు. మరోవైపు క్లాసికల్ టీమ్ కేటగిరీలో స్వర్ణాన్ని కైవసం చేసుకున్న శ్రీశ్వాన్... ర్యాపిడ్ టీమ్ విభాగంలో కాంస్య పతకా న్ని సాధించాడు. అండర్–8 బాలుర విభాగంలో మేకల మహేంద్ర తేజ రన్నరప్‌గా నిలిచాడు. అతను 7 పాయింట్లతో రెండోస్థానాన్ని దక్కించుకున్నాడు. అండర్–16 బాలుర విభాగంలో కుషాగ్ర మోహన్ 5 పాయింట్లతో పదకొండో స్థానంలో నిలిచాడు. -
అనయ, అక్షయలకు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్స్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు రాణించారు. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ టోర్నీలో 6 పతకాలను సాధించారు. ఇందులో 4 రజతాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. అండర్–7 బాలికల విభాగంలో నిర్ణీత 9 రౌండ్లకుగాను 7.5 పాయింట్లు సాధించిన అక్షయ (కింగ్స్ చెస్ అకాడమీ) రజతాన్ని గెలుచుకోగా... అత్తాపూర్‌కు చెందిన అనయ (మేస్ట్రో చెస్ అకాడమీ) 7 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించింది. నగరానికే చెందిన మరో చిన్నారి హారిక 6 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. అండర్–9 బాలుర కేటగిరీలో కింగ్స్ అకాడమీకి చెందిన సుహాస్ రెండోస్థానాన్ని దక్కించుకున్నాడు. అండర్–11 బాలికల కేటగిరీలో జి. శ్రీశాంతి, బాలుర విభాగంలో షేక్ సుమేర్ అర్‡్ష (రేస్ చెస్ అకాడమీ) 7.5 పాయింట్లతో రజత పతకాలను సాధించారు. ఎస్. నాగలక్ష్మి 6.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. అండర్–13 విభాగంలో సరయు 7 పాయింట్లతో కాంస్యాన్ని గెలుచుకోగా... సేవిత విజు, మైత్రి, కీర్తి వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలను సంపాదించారు. బాలుర విభాగంలో జేఎస్ఎస్ శ్రీకర్ ఆరోస్థానంలో నిలిచాడు. అండర్–15 బాలుర కేటగిరీలో సృజన్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. అండర్–17 విభాగంలో కె. శరత్చంద్ర కుమార్ 6 పాయింట్లు స్కోర్ చేసి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
చెస్ చాంప్స్ శ్రీథన్, అస్మిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్కూల్స్ చెస్ చాంపియన్‌షిప్‌లో శ్రీథన్, అస్మిత చాంపియన్లుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో అండర్–15 బాలుర విభాగంలో శ్రీథన్ 5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఉమేశ్ 4 పాయింట్లతో రన్నరప్‌గా నిలవగా, బి. సాయి అచ్యుత్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. బాలికల విభాగంలో అస్మితా రెడ్డి, వర్షిత 3.5 పాయింట్లతో సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా అస్మితా విజేతగా నిలవగా, వర్షిత రన్నరప్‌తో సరిపెట్టుకుంది. నటురా బేతి మూడో స్థానాన్ని దక్కించుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నీథమ్ డైరెక్టర్ సి. చిన్నం రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్-7 బాలురు: 1. నిహాల్ గౌతమ్, 2. కార్తికేయన్ నందన్; బాలికలు: 1. అభిగ్య, 2. పూజిత. అండర్-9 బాలురు: 1. సుహాన్, 2. అద్వయ్; బాలికలు: 1. యోగహర్షిణి, 2. రుషిత. అండర్-11 బాలురు: 1. సుశాంత్, 2. విఘ్నేశ్; బాలికలు: 1. జాహ్నవి, నాగలక్ష్మి. అండర్–13 బాలురు: 1. శ్రీశ్వాన్, 2. అభినవ్; బాలికలు: 1. కీర్తి, 2. గీతిక. -
విజేత పీఎస్‌పీబీ
కోల్‌కతా: జాతీయ సీనియర్ టీమ్ చెస్ చాంపియన్ షిప్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) జట్లు మహిళల, పురుషుల విభాగాల్లో టైటిల్స్ సొంతం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బొడ్డ ప్రత్యూష, పద్మిని రౌత్, ఇషా కరవాడే, సౌమ్య స్వామినాథన్, మేరీ ఆన్‌గోమ్స్ సభ్యులుగా ఉన్న పీఎస్‌పీబీ జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి 14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సూర్యశేఖర గంగూలీ, అరవింద్ చిదంబరం, జీఎన్ గోపాల్, కార్తికేయన్ మురళీ, దీప్ సేన్‌గుప్తాలతో కూడిన పీఎస్‌పీబీ పురుషుల జట్టు 17 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. -
స్వర్ణాలు నెగ్గిన గుకేశ్, సవితశ్రీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత చెస్ క్రీడాకారులు మెరిశారు. స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్‌షిప్ అండర్ –12 ఓపెన్ విభాగంలో డి.గుకేశ్... బాలికల విభాగంలో సవితశ్రీ స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత గుకేశ్ 10 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చెన్నైకు చెందిన 12 ఏళ్ల గుకేశ్ కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గుకేశ్ మొత్తం పది విజయాలు సాధించి, ఒక గేమ్‌లో ఓడిపోయాడు. అండర్–12 బాలికల విభాగంలో చెన్నై అమ్మాయి సవితశ్రీ 10 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. ఆమె తొమ్మిది గేమ్‌ల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. ఈ మెగా ఈవెంట్లో అండర్–8, అండర్–10, అండర్–12 విభాగాల్లో పోటీలను నిర్వహించారు. 86 దేశాల నుంచి 861 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఓవరాల్‌గా చైనా రెండు స్వర్ణాలు, కాంస్యంతో తొలి స్థానంలో నిలువగా... రెండు స్వర్ణాలతో భారత్ రెండో స్థానంలో... స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలతో అమెరికా మూడో స్థానంలో నిలిచాయి. -
జీఎం టైటిల్‌కు చేరువలో హర్ష
ఇస్తాంబుల్ (టర్కీ): గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా ఖరారు చేసుకోవడానికి తెలంగాణ చెస్ ప్లేయర్ హర్ష భరతకోటి మరింత చేరువయ్యాడు. ఇప్పటికే మూడు జీఎం నార్మ్‌లు దక్కించుకున్న హర్ష ఎలో రేటింగ్ 2500 లేకపోవడంతో జీఎం టైటిల్ ఇంకా లభించలేదు. శనివారం ముగిసిన ప్రపంచ అండర్–20 చెస్ చాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల హర్ష ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హర్ష 7.5 పాయింట్లతో మరో పది మందితో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హర్ష తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ మెగా ఈవెంట్లో ఆరు గేముల్లో గెలిచిన అతను, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో రెండు గేముల్లో ఓడిపోయాడు. ఆరుగురు గ్రాండ్మాస్టర్లతో ఆడిన హర్ష... అలెన్ పిచోట్ (అర్జెంటీనా), సునీల్‌దత్ లైనా నారాయణన్ (భారత్), లియాంగ్ అవండర్ (అమెరికా)లపై గెలుపొంది... అలెగ్జాండర్ డాన్‌చెంకో (జర్మనీ)తో గేమ్‌ను ‘డ్రా’గా ముగిం చాడు. పర్హామ్ మగ్సూద్లు (ఇరాన్), ఆమిన్ (ఇజ్రాయెల్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఓవరాల్‌గా ఈ ప్రదర్శనతో హర్ష 18 పాయింట్లు సంపాదించి తన ఓవరాల్ ఎలో రేటింగ్‌ను 2492కు పెంచుకున్నాడు. తదుపరి టోర్నీల్లో హర్ష మరో ఎనిమిది పాయింట్లు సాధిస్తే అతనికి అధికారికంగా జీఎం టైటిల్ ఖాయమవుతుంది. మరోవైపు ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో భారత్‌కే చెందిన అభిమన్యు పురాణిక్ రజత పతకం సాధించాడు. 8.5 పాయింట్లతో అతను రెండో స్థానంలో నిలిచాడు. ఇరాన్‌కు చెందిన పర్హామ్ మగ్సూద్లు 9.5 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. -
సాయి కార్తీక్‌కు పదోస్థానం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–15 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారుడు సీహెచ్ సాయి కార్తీక్ రాణించాడు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ టోర్నీలో కింగ్స్ చెస్ అకాడమీకి చెందిన కార్తీక్ పదోస్థానంలో నిలిచాడు. దీంతో అతని ఎలో రేటింగ్ పాయింట్లలో గణనీయమైన పురోగతి లభించింది. అతని రేటింగ్ 1810 పాయింట్లు నుంచి 2070 పాయింట్లకి పెరిగింది. -
చాంప్స్ జాహ్నవి, ప్రణీత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్–11 చెస్ చాంపియన్‌షిప్‌లో జాహ్నవి శ్రీ లలిత, ప్రణీత్ ఉప్పల చాంపియన్లుగా నిలిచారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో బాలికల విభాగంలో 5.5 పాయింట్లతో జాహ్నవి, సేవితా విజు తొలి స్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా జాహ్నవి విజేతగా నిలవగా, సేవిత రన్నరప్‌తో సరిపెట్టుకుంది. నేత్ర, నాగలక్ష్మి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి తెలంగాణ రాష్ట్ర బాలికల జట్టుకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో నిర్ణీత ఏడు రౌండ్లకుగానూ ఏడు పాయింట్లు సాధించిన ప్రణీత్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చిద్విలాస్ (6 పాయింట్లు) రన్నరప్‌గా నిలిచాడు. వీరిద్దరూ రాష్ట్ర బాలుర జట్టుకు ఎంపికయ్యారు. ఈ జట్లు కరైకుడిలో ఈనెల 28న జరిగే జాతీయ అండర్–11 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తాయి. -
ఈ నెల 14 నుంచి చెస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: మల్క లక్ష్మి స్మారక ఆలిండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ బుధవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. పల్లవి చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 4.2 లక్షలు. ఎంట్రీ ఫీజు రూ. 2 వేలు. ఫిడే రేటింగ్ 1500 కంటే తక్కువ ఉన్న క్రీడాకారులు మాత్రమే ఈ టోర్నీలో పాల్గొనేందుకు అర్హులు. ఆసక్తి గల వారు ఈ నెల 10లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. స్పాట్ ఎంట్రీలకు ప్రవేశం లేదు. క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రాలు తప్పక తీసుకురావాలి. మరిన్ని వివరాలకు 8919377311 నంబర్లో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, టోర్నీ నిర్వాహకులు పాల్గొన్నారు. -
చాంప్స్ ప్రణీత, సంకేత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ జిల్లా అండర్–11 చెస్ సెలక్షన్ టోర్నీలో ప్రణీత ప్రియ, సంకేత్ రెడ్డి చాంపియన్లుగా నిలిచారు. టీఎస్‌సీఏ కార్యాలయం వేదికగా జరిగిన ఈ టోర్నీ బాలికల విభాగంలో 4 పాయింట్లతో ప్రణీత అగ్రస్థానంలో నిలిచింది. ఆమె తలపడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఎస్. అనీష్క, జి. ఇషాన్వి, జి. శరణ్య వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి హైదరాబాద్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో నిర్ణీత 5 రౌండ్లకుగానూ 5 పాయింట్లు సాధించి సంకేత్ విజేతగా నిలిచాడు. ఎస్. చిద్విలాస్ రెండోస్థానాన్ని దక్కించుకోగా... కె. అవనీశ్, విశ్వ తర్వాతి స్థానాలను సాధించారు. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఈ నలుగురూ హైదరాబాద్ జిల్లా బాలుర జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్లు రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తాయి. -
రెండో స్థానంలో లలిత్‌బాబు
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్ లలిత్‌బాబు సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీలోని లీలా అంబియెన్స్ కన్వెన్షన్ హోటల్లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఏడు రౌండ్లు ముగిసేసరికి 5.5 పాయింట్లతో లలిత్ మరో నలుగురితో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన ఏడో రౌండ్లో మాజీ జాతీయ చాంపియన్ జి. ఆకాశ్‌పై లలిత్‌బాబు విజయం సాధించాడు. సంకల్ప్ గుప్తా, దేబాశిష్ దాస్, పి. కార్తీకేయన్, నుబర్షా షేక్ కూడా 5.5 పాయింట్లతో ఉన్నారు. ఆరు పాయింట్లు సాధించిన వైభవ్, నితిన్ ప్రస్తుతం ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. -
‘గ్రాండ్‌మాస్టర్’ ప్రజ్ఞానంద
న్యూఢిల్లీ: ప్రపంచ చెస్ చరిత్రలో పిన్న వయస్సులో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందిన రెండో ప్లేయర్‌గా... భారత్ తరఫున జీఎం అయిన పిన్న వయస్కుడిగా చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. ఇటలీలో జరుగుతున్న గ్రెడైన్ ఓపెన్‌లో శనివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో ప్రజ్ఞానంద 33 ఎత్తుల్లో ఇటలీ గ్రాండ్‌మాస్టర్ లూకా మోరోనిపై గెలుపొందాడు. ఈ ప్రదర్శనతో ప్రజ్ఞానందకు జీఎం హోదా లభించేందుకు అవసరమైన మూడో జీఎం నార్మ్ ఖాయమైంది. 12 ఏళ్ల 10 నెలల 14 రోజుల వయస్సులో ప్రజ్ఞానంద జీఎం హోదా పొంది... భారత్ తరఫున జీఎం అయిన పిన్న వయస్కుడిగా ఇప్పటిదాకా పరిమార్జన్ నేగి (ఢిల్లీ–13 ఏళ్ల 4 నెలల 22 రోజులు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. మరోవైపు ప్రపంచంలో పిన్న వయస్సులో జీఎం అయిన రికార్డు సెర్గీ కర్జాకిన్ (రష్యా–12 ఏళ్ల 7 నెలలు) పేరిట ఉంది. -
శ్రీశ్వాన్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–13 జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాళ్లకు రెండు పతకాలు లభించాయి. గుజరాత్లో శుక్రవారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో ఓపెన్ విభాగంలో ఎం.శ్రీశ్వాన్ (9.5 పాయింట్లు) రజతం... జి. ఆదిత్య వరుణ్ (9 పాయింట్లు) కాంస్యం సాధించారు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత శ్రీశ్వాన్ 9.5 పాయింట్లతో ఆర్యన్ (ఢిల్లీ)తో కలసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా ఆర్యన్ విజేతగా... శ్రీశ్వాన్ రన్నరప్‌గా నిలిచారు. -
12 ఏళ్ల తర్వాత...
చెన్నై: సుదీర్ఘ విరామం అనంతరం భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొననున్నాడు. అతడు 2006 లో చివరిసారిగా ఈ మెగా టోర్నీలో ఆడాడు. ఈసారి తాను ఒలింపియాడ్‌లో ఆడేందుకు సిద్ధం గా ఉన్నట్లు సూచించడంతో అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ఆనంద్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జార్జియాలో జరిగే ప్రపంచ చెస్ ఒలింపియాడ్ కోసం ఏఐసీఎఫ్ బుధవారం ఐదుగురు చొప్పున సభ్యులున్న పురుషుల, మహిళల జట్లను ప్రకటించింది. పురుషుల జట్టుకు ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ప్రస్తుత 14వ ర్యాంకర్ విశ్వనాథన్ ఆనంద్ సార థ్యం వహించనున్నాడు. ఈ జట్టులో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, విదిత్ సంతోష్ గుజరాతి, బి.అధిబన్, శశికిరణ్ ఉన్నారు. భారత మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఇషా కరవాడే, తానియా సచ్దేవ్, పద్మిని రౌత్ ఉన్నారు. ఈ మెగా టోర్నీకి రామ్‌కో గ్రూప్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోందని ఏఐసీఎఫ్ కార్యదర్శి భరత్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు కూడా అందనున్నాయి. పురుషుల్లో 2,650 రేటింగ్ పాయింట్ల కంటే ఎక్కువ ఉన్న వారికి రూ. 2 లక్షలు, 2,600 రేటింగ్ పాయింట్ల కంటే ఎక్కువ ఉన్నవారికి రూ. 1.50 లక్షలు... మహిళల్లో 2,400 రేటింగ్ పాయింట్లు దాటిన వారికి రూ. 1 లక్ష, 2,000 రేటింగ్ పాయింట్లు దాటిన వారికి రూ. 80 వేలు లభించనున్నాయి. ఇవికాక టోర్నీలో జట్టు స్వర్ణం నెగ్గితే రూ. 3 లక్షలు, రజతం నెగ్గితే రూ. 1.50 లక్షలు, కాంస్యం నెగ్గితే రూ. 75 వేలు ఏఐసీఎఫ్ తరఫున ఇవ్వనున్నారు. ఈ టోర్నీకి ముందు క్రీడాకారుల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు చౌహాన్ తెలిపారు. -
ఆడవలసింది!
భారతీయ ఉమన్ గ్రాండ్ మాస్టర్ సౌమ్య స్వామినాథన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే ఆ జల్లులు ‘ఆడబోవడం లేదు’ అని ఆమె ప్రకటించినందుకు కాకుండా, ఆడి ఏదైనా సాధించినందుకు కురుస్తున్నట్లయితే మరింత బాగుండేది. జూలై 26 నుంచి ఆగస్టు 4 వరకు ఇరాన్‌లోని హమదాన్‌లో ఏషియన్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. అక్కడ చాంపియన్‌గా నిలిచిన టీమ్ ‘వరల్డ్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సంపాదిస్తుంది. అయితే భారతీయ ఉమన్ గ్రాండ్‌మాస్టర్, ఒకప్పటి వరల్డ్ జూనియర్ గర్ల్స్ చాంపియన్ సౌమ్య స్వామినాథన్ ఆకస్మిక నిర్ణయంగా తన ఇరాన్ ప్రయాణాన్ని మానుకున్నారు! ఇరాన్ సంప్రదాయం ప్రకారం క్రీడాకారిణులు తప్పనిసరిగా తలగుడ్డను (హెడ్ స్కార్ఫ్) ధరించి ఆటలో కూర్చోవాలన్న నిబంధన తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌమ్య ఫేస్బుక్లో ప్రకటించారు. భారత జట్టు సభ్యురాలిగా సౌమ్య మొదట ఈ పోటీలకు ఆమోదం తెలిపినప్పుడు అవి బంగ్లాదేశ్‌లో జరుగుతున్నట్లు ఆలిండియా చెస్ ఫెడరేషన్ ఆమెకు తెలిపింది. ఈవెంట్ ఇరాక్‌కు మారిందని తెలిసిన వెంటనే సౌమ్య కేవలం ఈ ఒక్క హెడ్ స్కార్ఫ్ నిబంధన కారణంగానే ఈ పోటీల నుంచి తప్పుకుంటున్నానని తన పోస్ట్‌లో వెల్లడించారు. సౌమ్య (29) పుణె యువతి. ఇండియాలో నెం.5, వరల్డ్‌లో నెం.95 ర్యాంకు ఉన్న చెస్ ప్లేయర్. దేశానికే ప్రతిష్ట. అలాంటి అమ్మాయి తన వ్యక్తిస్వేచ్ఛకు చెక్ చెప్పుకోలేనని చెప్పి, దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడంపై భారతీయులు ఇప్పుడేమీ రెండు జట్లుగా విడిపోలేదు! సౌమ్య రైట్ అని అంతా ఒక జట్టుగా ఉండి, ఆమెను అభినందిస్తున్నారు. ‘‘నిర్బంధంగా నేను స్కార్ఫ్ ధరించలేను. ఇష్టం లేని పని చెయ్యడం అంటే నన్ను నేను అగౌరవ పరచుకోవడం. మనిషిగా నా హక్కును నేనే ఉల్లంఘించుకోవడం. నా గొంతును నేనే నొక్కేసుకోవడం. నా ఆలోచనల్ని నేనే మింగేసుకోవడం. నా మనస్సాక్షిని నేనే మోసం చేసుకోవడం. నా మతాన్ని నేనే తక్కువ చేసుకోవడం. ఇరాన్ వెళ్లి ఆడి.. నాకు నేను లేకుండా పోవడం కన్నా, వెళ్లకుండా నాకు నేను మిగిలిపోవడం ముఖ్యం అనుకున్నాను’ అనే అర్థంలో సౌమ్య తన మనోభావాలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఏ దేశపు వస్త్ర సంప్రదాయాలు ఆ దేశానికి ఉంటాయి. బయటి నుంచి వచ్చినవారు తమ సంప్రదాయాలను అనుసరించాలని ఆ దేశాలు ఆకాంక్షించడం సహజమే. ఆకాంక్ష వరకైతే ఇబ్బంది లేదు. పట్టింపయితేనే అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇరాన్లో స్కార్ఫ్‌పై పట్టింపు ఉంది. ఆ దేశ మహిళలు, బయటి దేశాల నుంచి వచ్చిన మహిళలు తప్పనిసరిగా తలను, రెండు చెవుల్నీ కప్పుతూ చున్నీ లాంటి వస్త్రాన్ని చుట్టుకోవాలి. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలనే లౌక్యం లాంటిది కాదది. సంప్రదాయానికి వాళ్లు ఇచ్చుకుంటున్న గౌరవం, మర్యాద. విదేశీయుల్ని కూడా వాటిని ఇచ్చిపుచ్చుకోమంటున్నారు. అయితే వ్యక్తికి ఉండవలసిన గౌరవ మర్యాదల మాటేమిటన్నది సౌమ్యలాంటి క్రీడాకారిణుల ప్రశ్న. ‘క్రీడా వేదికను మార్చడంపై ఆలిండియా చెస్ ఫెడరేషన్ కూడా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసి ఉండవలసిందా?’ అని అమిత్ కర్మాకర్ అనే మీడియా ప్రతినిధి అడిగినప్పుడు.. ‘ప్రతి ఒక్కరూ నాలాగే అనుకోవాలని నేనెందుకు భావిస్తాను?’ అన్నారు సౌమ్య. (నాజీ పైకిడ్జే, మరియా మఝిచెక్, అన్నా మఝిచెక్ : హెడ్స్కార్ప్తో ఆడేందుకు నిరాకరించినవారు ) (పద్మినీ రౌత్, హారిక : హెడ్‌స్కార్ఫ్‌తో ఆడివచ్చినవారు) హెడ్‌స్కార్ఫ్ ధరించడం ఇష్టం లేకనే గత ఏడాది టెహ్రాన్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అమెరికన్ చెస్ క్రీడాకారిణి నాజీ పైకిడ్జే కూడా ఆట నుంచి తప్పుకున్నారు. (అదే ఆటకు మన దేశం నుండి వెళ్లిన హారిక, పద్మినీ రౌత్ చక్కగా తల చుట్టూ వస్త్రాన్ని కప్పుకుని చెస్ బోర్డు ముందు కూర్చున్నారు). సౌదీ అరేబియాలో జరిగిన ప్రీమియర్ టోర్నమెంట్‌కు ఉబ్జెకిస్తాన్ నుంచి ఎంపికైన ఇద్దరు అక్కచెల్లెళ్లు అన్నా మఝిచెక్, మరియా ముఝిచెక్ కూడా స్కార్ఫ్‌తో ఆడేది లేదని ఆట నుంచి నిష్క్రమించారు. ‘‘టీమ్ డ్రెస్, ఫార్మల్స్, స్పోర్ట్స్ డ్రెస్ వీటిని ధరించాలని చాంపియన్‌షిప్ నిర్వాహకులు అనడంలో అర్థం ఉంది. కానీ మతపరమైన వస్త్రధారణను నిబంధనగా పెట్టడం ఏమిటి?!’ అని సౌమ్య ఆవేదన. ఈ ఆవేదన అసంబద్ధమని ఎక్కడా ఒక్క కామెంట్ కూడా రాలేదు. మతాలకు, జాతీయతలకు అతీతులైన ఒకరిద్దరు శుద్ధ సంప్రదాయవాదులు మాత్రం ‘స్కార్ఫ్ కట్టుకుని ఆడితే ఏం పోయిందీ పిల్లకు!’ అని ఆశ్చర్యపోయారు. స్పోర్టివ్‌గా తీసుకోవడం అది. సౌమ్య కూడా హెడ్‌స్కార్ఫ్ నిబంధనను తేలిగ్గా తీసుకుని (స్పోర్టివ్‌గా) ఆడి రావచ్చు. లౌకిక భాషలో ఈ స్పోర్టివ్‌నెస్‌కు అర్థం ‘పర మత సహనం’. మతపరమైన దేశంలో మతానికి ప్రాధాన్యం ఉన్నట్లే.. లౌకికరాజ్యంలో పర మత సహనం ఉంటుంది. దేశంలో ఉన్నవాళ్లతో కలిసి ఉండడం మాత్రమే కాదు, దేశం వెళ్లినప్పుడు అక్కడివాళ్లతో కలిసిపోవడం కూడా పర మత సహనమే. కాబట్టి ఒక లౌకికరాజ్య పౌరురాలిగా సౌమ్య హెడ్‌స్కార్ఫ్ కట్టుకుని ఆడి వస్తే తప్పేం అవదు. ఆటల్ని, మతాన్ని కలిపిచూడ్డం సరికాదని సౌమ్య అంటున్నారు. రైట్, ఆ దేశం కలిపి చూసింది. ఒక క్రీడాకారిణిగా తను చేసిందీ అదే! మతం నుంచి ఆటను వేరు చేసి చూడలేకపోవడం. అందువల్లనే కదా తను ఆట నుంచి విరమించుకున్నారు!! - మాధవ్ శింగరాజు -
చాంప్స్ వశిష్ట రమణ, నందిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంతర్ జిల్లా చెస్ చాంపియన్‌షిప్‌కు వశిష్ట రమణ, వి. నందిత, సశ్య, శ్రీనిథ్ ఎంపికయ్యారు. బాలాపూర్‌లోని విస్రా జూనియర్ కాలేజిలో నిర్వహించిన అండర్–7, అండర్–15 రంగారెడ్డి చెస్ టోర్నీలో విజేతలుగా నిలిచిన వీరు అంతర్ జిల్లా చెస్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. మంగళవారం ముగిసిన ఈ పోటీల్లో అండర్–7 బాలుర విభాగంలో శ్రీనిథ్ విజేతగా నిలవగా... ఉదయ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బాలికల విభాగంలో సశ్య అగ్రస్థానంలో నిలిచింది. అండర్–15 బాలుర విభాగంలో వశిష్ట రమణ విజేతగా, అమన్ జాషువ రన్నరప్‌గా నిలిచారు. పవన్ కుమార్, శ్రీరామ్, సోహైల్ వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాలు దక్కించుకున్నారు. బాలికల విభాగంలో వి. నందిత టైటిల్ నెగ్గగా... సాయి శ్రీ చరిత వరేణ్య రన్నరప్‌గా నిలిచింది. స్నేహ సాయి శ్రావణి, మమత శ్రీ వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. వీరు ఈ నెల 8 నుంచి 10 వరకు అబిడ్స్‌లోని డైమండ్ జూబ్లీ హైస్కూల్లో నిర్వహించనున్న తెలంగాణ అంతర్ జిల్లా చెస్ టోర్నీలో పాల్గొననున్నారు. -
చాంపియన్ లలిత్‌బాబు
అహ్మదాబాద్: జాతీయ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌తో తెలుగు కుర్రాడు గ్రాండ్‌మాస్టర్ ముసు నూరి రోహిత్ లలిత్‌బాబు విజేతగా నిలిచాడు. గుజరాత్లో శుక్రవారం జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌లో గ్రాండ్‌మాస్టర్ స్వప్నిల్ దోపాడే (ఇండియన్ రైల్వేస్)పై లలిత్‌బాబు (పీఎస్‌పీబీ) విజయం సాధించాడు. దీంతో 9.5 పాయింట్లతో అరవింద్ చిదంబరంతో కలిసి లలిత్‌బాబు సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా లలిత్ టైటిల్‌ను దక్కించుకోగా అరవింద్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. -
చాంప్స్ సాహితి, రాజా రిత్విక్
సాక్షి, హైదరాబాద్: ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. థాయ్‌లాండ్‌లో ముగిసిన ఈ టోర్నీలో బాలుర అండర్–14 క్లాసిక్ విభాగంలో రాజా రిత్విక్ (హైదరాబాద్)... అండర్–12 విభాగంలో డి.గుకేశ్ (ఆంధ్రప్రదేశ్)... అండర్–12 బాలికల విభాగంలో ఎం. సాహితి వర్షిణి (ఆంధ్రప్రదేశ్) విజేతలుగా నిలిచారు. సాహితి ర్యాపిడ్ విభాగంలో స్వర్ణం, బ్లిట్జ్ ఈవెంట్లో కాంస్యం కూడా సాధించడం విశేషం. బాలుర అండర్–8 క్లాసిక్ విభాగంలో ఆదిరెడ్డి అర్జున్, అండర్–14 విభాగంలో కుశాగ్ర మోహన్ కాంస్యాలు సాధించారు. -
చాంప్స్ సృజన్ కీర్తన్, అద్వైత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ క్రీడాకారులు ఎస్. సృజన్ కీర్తన్, అద్వైత శర్మ పురుషుల, మహిళల విభాగాల్లో చాంపియన్లుగా నిలిచారు. తద్వారా జాతీయ చెస్ టోర్నీలో పాల్గొనే రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు పురుషుల విభాగంలో రెండో స్థానంలో నిలిచిన ఎం. విశ్వనాథ్ (కరీంనగర్), డి. నాగ శశాంక్ (మూడో స్థానం, రంగారెడ్డి), వెటరన్ ప్లేయర్ వి. దివాకర్ (నాలుగో స్థానం, హైదరాబాద్), పి. షణ్ముఖ తేజ (ఐదో స్థానం, హైదరాబాద్) కూడా రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. మహిళల విభాగంలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన కె. అద్వైత శర్మ, పి. యజ్ఞప్రియ (హైదరాబాద్), వి. చైతన్య (రంగారెడ్డి), టి. విజ్ఞశ్రీ (రంగారెడ్డి), టి. జయశ్రీ తరణి ప్రియ (రంగారెడ్డి) తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఫిబ్రవరి 7 నుంచి భువనేశ్వర్‌లో జాతీయ స్థాయి చెస్ టోర్నీ జరుగుతుంది. -
చతురంగ తరంగం
ఆడపిల్లలని వివక్ష చూపకుండా గోరంత ప్రోత్సాహమిస్తే, కొండంత ఉత్సాహం తెచ్చుకుని, పుట్టినింటి పేరునే కాదు, పుట్టిన దేశానికే ప్రపంచ స్థాయిలో పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టగలరు. రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్‌షిప్ ఐదుసార్లు సాధించిన ఈ చిచ్చర పిడుగే అందుకు నిదర్శనం. ఇటీవల జాతీయ స్థాయిలో ఓరుగల్లు కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన సరయు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడానికి పావులు కదుపుతోంది. గ్రాండ్‌మాస్టర్ కావడమే లక్ష్యమని చెబుతోంది చిన్నారి చతురంగ తరంగం... వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన వేల్పుల రజిత–సంపత్ దంపతులకు సరయు, శరణ్య కవల పిల్లలు. 7వ తరగతి చదువుతున్న సరయు చదరంగంలో రాణిస్తుండగా శరణ్య క్లాసికల్ డాన్స్‌లో దిట్ట. తల్లి రజిత గృహిణి, తండ్రి సంపత్ ఆర్ఎంపీ. డాక్టర్‌గా మొండ్రాయి గ్రామంలో క్లినిక్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.‘అప్పుడు సరయు 4వ తరగతి చదువుతోంది. ఒక రోజు తండ్రి సంపత్, మేనమామ రవి, బాబాయి సలెందర్ చదరంగం ఆడుతున్నారు. ఈ క్రమంలో వారి ఆటను గమనిస్తున్న సరయు ఓడిపోతున్న తండ్రిని తన ఎత్తులతో గెలిపించింది’.తర్వాత సరయును గొర్రెకుంటలోని విజ్ఞాన్స్కూల్లో చేర్పించారు. ప్రిన్సిపాల్ గిరిధర్, పీఈటీ సునీల్‌లకు తన కూతురుకు చెస్ అంటే ఇష్టమని చెప్పారు. దాంతో వారు చెస్టోర్నమెంట్లకు తరచూ తీసుకుని వెళ్తుండేవారు. ఆ తర్వాత తేజస్వీ హైస్కూల్లో చేర్పించారు. అక్కడ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్‌రావు సరయు ప్రతిభను గుర్తించి ఉచిత విద్యనందించడంతోపాటు టోర్నీలకు అయ్యే ఖర్చులను భరిస్తూ ప్రోత్సహించారు. ఎలాంటి శిక్షణ లేకుండానే 2015 సంవత్సరం గోవాలో నిర్వహించిన చాంపియన్‌షిప్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. శిక్షణ ఇప్పిస్తే మరింత రాణిస్తుందని సంపత్ అనే కోచ్వద్ద శిక్షణ ఇప్పించారు. ప్రత్యర్థి ఎత్తుగడలను, ఆలోచనలు, ఊహలను ముందే పసిగడుతూ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ చిచ్చర పిడుగు సరయూ చదరంగంలో రాణిస్తున్న సరయు అంతర్జాతీయ క్రీడాకారులు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, అర్జున్‌ల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో రాణించి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. 2018 ఏప్రిల్‌లో ఏషియన్ స్థాయిలో థాయిలాండ్‌లో జరిగే అండర్ 12 విభాగం, 2018 నవంబర్‌లో గ్రీస్‌లో జరిగే అంతర్జాతీయ స్థాయి అండర్ 12 విభాగం పోటీల్లో సరయు పాల్గొననుంది. రాష్ట్ర స్థాయిలో చాంపియన్... 2015లో వరంగల్‌లో జరిగిన అండర్–9 విభాగం పోటీల్లో, 2016 సంవత్సరం హైదరాబాద్‌లో జరిగిన అండర్–11 విభాగంలో చాంపియన్‌షిప్, 2017 సెప్టెంబర్ హైదరాబాద్‌లో అండర్విభాగంలో రెండో స్థానం, ఇదే నెలలో ఖమ్మంలో జరిగిన అండర్ 17 విభాగంలో చాంపియన్, అక్టోబర్‌లో వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్11 విభాగంలో చాంపియన్, వరంగల్ రూరల్ జిల్లాలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్–14 క్రీడా పోటీల్లో చాంపియన్‌గా నిలిచింది. – గజ్జెల శ్రీనివాస్, సంగెం, సాక్షి వరంగల్ రూరల్ గ్రాండ్మాస్టర్అవుతాను – సరయు ఇప్పటివరకు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించాను. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి గ్రాండ్‌మాస్టర్ కావాలన్నది నా లక్ష్యం. పెద్దలెవరైనా అండదండలు అందిస్తే నా చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యసాధనకు కృషి చేస్తాను. జాతీయస్థాయి పోటీల్లో... తొలిసారిగా 2015 గోవాలో జరిగిన అండర్–9 విభాగంలో పాల్గొంది. 2016 సంవత్సరం నాగపూర్‌లో జరిగిన అండర్–11 విభాగంలో పాల్గొంది. ఇదే సంవత్సరం మేలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అండర్–11 విభాగంలో పాల్గొంది. 2017 జనవరి మహారాష్ట్రలో జరిగిన అండర్–11 విభాగంలో 5వ స్థానంలో నిలిచింది. 2017 జూన్‌లో పంజాబ్‌లో జరిగిన అండర్–13 విభాగంలో పాల్గొంది. 2017 నవంబర్23–30 వరకు పుణేలో జరిగిన జాతీయ స్థాయి అండర్11 విభాగం చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రెండోస్థానంలో నిలచి అంతర్జాతీయ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైంది. అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇప్పించాలి నా కూతురు సరయూకు చదరంగం అంటే ప్రాణం. ఆమె ఆసక్తిని గమనించి ప్రోత్సహించాను. నా శక్తిమేర మూడేళ్లుగా శిక్షణ ఇప్పిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ఉన్నతస్థాయిలో శిక్షణ అవరం. అందుకు లక్షల్లో ఖర్చవుతుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాకు ఇది శక్తికి మించిన పని. ప్రభుత్వం సరయూ ప్రతిభను గుర్తించి శిక్షణకు అయ్యే ఖర్చును భరించి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. – వేల్పుల సంపత్, సరయు తండ్రి -
రజతం నెగ్గిన సంధ్య
విజయవాడ, స్పోర్ట్స్: ఆసియా అమెచ్యూర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి గోలి సంధ్య రజత పతకం గెలిచింది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ టోర్నమెంట్లో సంధ్య నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 7.5 పాయింట్లతో క్యూజోన్ లోరెషిల్ (ఫిలిప్పీన్స్)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. సంధ్య ఏడు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా లోరెషిల్కు స్వర్ణం, సంధ్యకు రజతం ఖాయమయ్యాయి. భారత్‌కే చెందిన అపరాజిత గోచికర్ ఏడు పాయింట్లతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తాజా ప్రదర్శనతో సంధ్య వచ్చే ఏడాది ఇటలీలో జరిగే ప్రపంచ అమెచ్యూర్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. గతేడాది ఇరాన్లో జరిగిన ఆసియా అమెచ్యూర్ చాంపియన్‌షిప్‌లో సంధ్య కాంస్య పతకం గెలిచింది. -
చెస్ చాంప్స్ హిమేశ్, ఆదిత్య
సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ఇ. హిమేశ్, జి. ఆదిత్య వరుణ్ విజేతలుగా నిలిచారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన ఈ టోర్నీ జూనియర్స్ విభాగంలో కేంద్రీయ విద్యాలయకు చెందిన హిమేశ్ నిర్ణీత ఆరు రౌండ్లలో 6 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నికుంజ్, సి. హేమ సాయి వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించారు. ఓపెన్ కేటగిరీలో 5.5 పాయింట్లు సాధించిన ఆదిత్య విజేతగా నిలవగా, సృజన్ కీర్తన్, కె. తరుణ్ తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–14 బాలురు: 1. చైతన్య కుమార్, 2. భరత్ కుమార్; బాలికలు: 1. ఎ. శ్రీద, 2. ఎస్. స్థాపిక. n అండర్–12 బాలురు: 1. నికుంజ్, 2. సి. హేమసాయి; బాలికలు: 1. భిల్వ నిలయ, 2. మౌనిక. n అండర్–10 బాలురు: 1. పి. తనుశ్, 2. సీహెచ్. అనిరుధ్; బాలికలు: 1. జి. ఈశ్వాని, 2. ఎం. వేద శ్రుతి. n అండర్–8 బాలురు: 1. విఘ్నేశ్ అద్వైత్, 2. నందసాయి వినీశ్; బాలికలు: 1. ఆర్. సమీర, 2. తనుశ్రీ. n అండర్–6 బాలురు: 1. పవన్ కార్తికేయ, 2. డి. పార్థివ్. -
విజేత లలిత్ బాబు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబు దేశవాళీ ప్రతిష్టాత్మక జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. బిహార్‌లోని పట్నాలో శుక్రవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో లలిత్ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 14 మంది అగ్రశ్రేణి క్రీడాకారుల మధ్య 13 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 24 ఏళ్ల లలిత్ బాబు పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆరు గేముల్లో గెలిచిన అతను ఒక గేమ్‌లో ఓడిపోయి, మరో ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) గ్రాండ్‌మాస్టర్ స్వప్నిల్ ధోపాడేతో జరిగిన చివరిదైన 13వ రౌండ్ గేమ్‌ను లలిత్ కేవలం 14 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. అంతకుముందు లలిత్ 44 ఎత్తుల్లో ఎస్. నితిన్ (ఆర్ఎస్పీబీ)పై; 29 ఎత్తుల్లో దేబాశిష్ దాస్ (ఒడిశా)పై; 57 ఎత్తుల్లో ఆర్.ఆర్. లక్ష్మణ్ (ఆర్ఎస్పీబీ)పై; 46 ఎత్తుల్లో అరవింద్ చిదంబరం (తమిళనాడు)పై; 54 ఎత్తుల్లో జయకుమార్ (మహారాష్ట్ర)పై; 39 ఎత్తుల్లో సునీల్‌దత్ నారాయణన్ (కేరళ)పై గెలిచాడు. శ్యామ్ నిఖిల్ (ఆర్ఎస్పీబీ)తో 26 ఎత్తుల్లో; హిమాంశు శర్మ (ఆర్ఎస్పీబీ)తో 57 ఎత్తుల్లో; ఆర్గ్యదీప్ దాస్ (ఆర్ఎస్పీబీ)తో 21 ఎత్తుల్లో; అభిజిత్ కుంతే (పీఎస్‌పీబీ)తో 28 ఎత్తుల్లో; దీపన్ చక్రవర్తి (ఆర్ఎస్పీబీ)తో 56 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మురళి కార్తికేయన్ (తమిళనాడు) చేతిలో మాత్రం 31 ఎత్తుల్లో ఓడిపోయాడు. మరోవైపు 8.5 పాయింట్లతో అరవింద్ చిదంబరం రన్నరప్‌గా నిలువగా... 7.5 పాయింట్లతో మురళి కార్తికేయన్ మూడో స్థానాన్ని సంపాదించాడు. ఎన్నాళ్లకెన్నాళ్లకు... జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌కు 62 ఏళ్ల చరిత్ర ఉంది. ఆంధ్ర స్టేట్ చెస్ సంఘం ఆధ్వర్యంలో 1955లో ఏలూరులో తొలిసారి ఈ చాంపియన్‌షిప్ జరిగింది. రామచంద్ర సాప్రే (మహారాష్ట్ర), డి. వెంకయ్య (ఆంధ్రప్రదేశ్) సంయుక్త విజేతలుగా నిలిచారు. 1955లో వెంకయ్య తర్వాత ఈ పోటీల్లో లలిత్ బాబు రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్‌కు టైటిల్ దక్కడం విశేషం. మాన్యుయల్ ఆరోన్ (తమిళనాడు) అత్యధికంగా తొమ్మిదిసార్లు ఈ టైటిల్‌ను దక్కించుకోగా... ప్రవీణ్ థిప్పే (మహారాష్ట్ర) ఏడుసార్లు, సూర్యశేఖర గంగూలీ (బెంగాల్) ఆరుసార్లు, కృష్ణన్ శశికిరణ్ (తమిళనాడు) నాలుగుసార్లు, విశ్వనాథన్ ఆనంద్ (తమిళనాడు) మూడుసార్లు ఈ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచారు. తొలిసారి జాతీయ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. గత రెండేళ్లుగా నా ప్రదర్శన ఆశించినస్థాయిలో లేదు. తాజా ఫలితం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం రెండు నెలలుగా కోచ్ మురళీకృష్ణతో కలిసి ప్రాక్టీస్ చేశాను. ఈ సన్నాహాలు టోర్నీ సందర్భంగా ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ టోర్నీలో నేను తొమ్మిది మంది గ్రాండ్మాస్టర్లతో తలపడ్డాను. నలుగురిపై గెలిచి, మరో నలుగురితో గేమ్‌లు ‘డ్రా’ చేసుకున్నాను. వచ్చే సీజన్లోనూ మరింత నిలకడగా ఆడి మరిన్ని విజయాలు సాధించాలని పట్టుదలతో ఉన్నాను. – ‘సాక్షి’తో లలిత్ బాబు -
విశ్వక్ సేన్‌కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–9 చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో తెలంగాణ ప్లేయర్‌కు కాంస్య పతకం లభించింది. హరియాణా చెస్ సంఘం ఆధ్వర్యంలో గురుగ్రామ్‌లో శుక్రవారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఆటగాడు విశ్వక్ సేన్ తొమ్మిది పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. తెలంగాణకే చెందిన ఆదిరెడ్డి అర్జున్ కూడా తొమ్మిది పాయింట్లు సాధించగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా విశ్వక్ సేన్‌కు కాంస్య పతకం ఖాయమైంది. అర్జున్‌కు నాలుగో స్థానం లభించింది. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో విశ్వక్ సేన్ ఎనిమిది గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. ఓం మనీశ్ కదమ్ (9.5 పాయింట్లు–మహారాష్ట్ర), అక్కరకమ్ జాన్ వేని (9.5 పాయింట్లు–కేరళ) సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా మనీశ్‌కు స్వర్ణం, జాన్‌కు రజతం లభించాయి.