
హరికృష్ణకు నాలుగో స్థానం
‘ఫిడే’ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నాలుగో స్థానంలో నిలిచాడు.
జెనీవా (స్విట్జర్లాండ్): ‘ఫిడే’ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నాలుగో స్థానంలో నిలిచాడు. 18 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య స్విస్ ఫార్మాట్‌లో తొమ్మిది రౌండ్‌లపాటు ఈ టోర్నీ జరిగింది. హరికృష్ణ రెండు గేముల్లో గెలిచి, ఆరింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయి ఐదు పాయింట్లు సంపాదించాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో దిమిత్రి జకోవెంకో (రష్యా)తో తెల్ల పావులతో ఆడిన హరికృష్ణ 115 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. హరికృష్ణతోపాటు మరో ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు ఐదు పాయింట్లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు.
అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్స్‌ను వర్గీకరించగా హరికృష్ణకు నాలుగో స్థానం లభించింది. ఆరు పాయింట్లు సాధించిన తెమూర్ రద్జబోవ్ (అజర్‌బైజాన్) విజేతగా నిలువగా... 5.5 పాయింట్లతో అలెగ్జాండర్ గ్రిష్‌చుక్ (రష్యా), నెపోమ్‌నియాచి (రష్యా) వరుసగా రెండు, మూడు స్థానాలను పొందారు. ‘చివరి గేమ్‌లో గెలిచుంటే నాకు రెండో స్థానం లభించేది. నాలుగో స్థానం పొందినందుకు కూడా ఆనందంగా ఉంది. మాస్కో గ్రాండ్‌ప్రి టోర్నీకంటే ఇక్కడ నా ప్రదర్శన బాగుంది. మమెదైరోవ్, ఆడమ్స్‌లతో జరిగిన గేముల్లో గెలిచే అవకాశాలను వదులుకున్నాను’ అని హరికృష్ణ వ్యాఖ్యానించాడు. నాలుగు గ్రాండ్‌ప్రి సిరీస్‌లలో భాగంగా ఇప్పటికి మూడు ముగిశాయి. చివరి గ్రాండ్‌ప్రి టోర్నీ స్పెయిన్‌లో నవంబర్ 16 నుంచి 27 వరకు జరుగుతుంది. నాలుగు సిరీస్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు వచ్చే ఏడాది క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి అర్హత సాధిస్తారు.