
ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన యువ గ్రాండ్‌మాస్టర్
నిలకడగా విజయాలు సాధించడమే లక్ష్యమంటున్న చెన్నై కుర్రాడు
ఆరేళ్ల వయసులో ఎత్తులు వేయడం నేర్చుకున్న ఆ చిన్నారి... పదహారేళ్లు వచ్చేసరికి గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. మ్యాచ్‌కు ముందు పావులతో ప్రాక్టీస్ చేయడం పక్కనపెట్టి క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇలా వేర్వేరు ఆటల్లో నిమగ్నమయ్యే అలవాటున్న ఆ కుర్రాడు... తాజాగా మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. విశ్వ చదరంగ వేదికపై భారత జోరు సాగుతున్న క్రమంలో... ఆ కుర్రాడు ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు.
ఇటీవల మోంటెనిగ్రోలో జరిగిన ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ అండర్–20 ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచిన ఆ కుర్రాడే... ప్రణవ్ వెంకటేశ్! రెండేళ్ల క్రితమే గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న ఈ తమిళనాడు యువ సంచలనం... భవిష్యత్తులో నిలకడగా విజయాలు సాధించడమే తన లక్ష్యమని అంటున్నాడు. చదరంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన చెన్నైకి చెందిన ఈ కుర్రాడి ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి క్రీడావిభాగం
జూనియర్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ప్రారంభానికి సరిగ్గా ఏడాది క్రితం... ప్రణవ్ ప్రయాణం క్రికెట్ మైదానంలో మొదలైంది. అదేంటి అప్పటికే గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న ప్రణవ్ క్రికెట్ గ్రౌండ్ నుంచి ప్రాక్టీస్ ప్రారంభించడం ఏంటి అని సందేహిస్తున్నారా? ప్లేయర్లు ఆటవిడుపు కోసం అప్పుడప్పుడు వేరే క్రీడలు ఆడటం పరిపాటే! అలాగే చెన్నైలోని పెరంబూరు సమీపంలోని చెస్ అకాడమీలో సీనియర్ గ్రాండ్‌మాస్టర్ శ్యామ్‌సుందర్ నిర్వహిస్తున్న కోచింగ్‌కు వరుణ్ హాజరయ్యాడు.
ఆటగాళ్లను శారీరకంగా చురుకుగా ఉంచడంతో పాటు వారిలో ఉత్సాహం నింపేందుకు నిర్వహిస్తున్న క్యాంప్‌లో ప్రణవ్ క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాడు. అప్పటి వరకు శ్యామ్‌సుందర్ వద్ద శిక్షణ తీసుకోని వరుణ్... ఆ తర్వాత అతడితో అనుబంధం పెంచుకున్నాడు. గతంలో ఇతర కోచ్‌ల వద్ద ట్రైనింగ్ తీసుకున్న అతడు... శ్యామ్‌లో ఓ సోదరుడిని చూసుకున్నాడు. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న శ్యామ్‌తో ప్రయాణం తనకు లాభసాటి అని భావించి తండ్రి వెంకటేశ్ అనుమతితో అతడి దగ్గర శిష్యరికం ప్రారంభించాడు.
క్లాసికల్ కష్టమైనా...
బ్లిట్జ్ గేమ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన ప్రణవ్ ఇప్పటికే ఆన్‌లైన్ మ్యాచ్‌ల్లో మాగ్నస్ కార్ల్‌సన్ వంటి ప్రపంచ చాంపియన్‌లపై విజయాలు సాధించాడు. ప్రారంభంలో బ్లిట్జ్ నుంచి క్లాసికల్‌కు మారేందుకు కాస్త సమయం తీసుకున్న ప్రణవ్... ఆ తర్వాత ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మెరుగైన ఆటతీరు కనబర్చడం ప్రారంభించాడు. శ్యామ్ వద్ద శిక్షణ ప్రారంభించిన రెండు నెలలకే స్పెయిన్ వేదికగా జరిగిన టోర్నీల్లో పాల్గొనేందుకు వరుణ్ విరామం తీసుకున్నాడు.
ఆ సమయంలో సరైన ఫలితాలు రాకపోవడంతో... మరింత సమయం తీసుకున్న శ్యామ్... వరుణ్ ఆటతీరుకు తగ్గట్లు ప్రణాళికలు రూపొందించడం ప్రాంరభించాడు. ఆ దిశగా కసరత్తు చేయడంతో... దుబాయ్ చాంపియన్‌షిప్, షార్జా మాస్టర్స్‌లో అతడు విజేతగా నిలిచాడు. గతేడాది డిసెంబర్‌లో చెన్నై చాలెంజర్స్ ఇన్విటేషనల్ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా ప్రణవ్ ప్రతిష్టాత్మక చెన్నై మాస్టర్స్ టోర్నీకి అర్హత సాధించాడు.
బాటిల్ మూతలతో క్రికెట్...
మ్యాచ్‌కు ముందు ఆటవిడుపుగా క్రికెట్, టేబుల్ టెన్నిస్, షటిల్ ఆడటం ప్రణవ్‌కు అలవాటు. దీంతో హోటల్ రూమ్‌లో బాటిల్ మూతలను బాల్‌గా భావించి మంచి నీళ్ల సీసాలతోనే కోచ్ శ్యామ్‌తో కలిసి క్రికెట్ ఆడేవాడు. దీంతోనే ఇతర ఆలోచనలు దరిచేరనివ్వకుండా మనసును లగ్నం చేసుకునే వాడు. సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉండేవాడు.
ప్రపంచ జానియర్ చెస్ చాంపియన్‌సిప్ ప్రారంభానికి ముందు కొన్ని ఆన్‌లైన్ సెషన్‌లలో పాల్గొన్న ప్రణవ్... ప్రత్యర్థిపై కాస్త ఆధిక్యం దక్కినా... దాన్ని కొనసాగిస్తూ మరిన్ని అవకాశాలు సృష్టించుకోవడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. శిక్షణ సమయంలో విభిన్న ప్రత్యామ్నాయాలను ప్రయత్నించే ప్రణవ్... ఒక్కసారి మ్యాచ్ ప్రారంభమైతే... ప్రత్యర్థి ఆటతీరును బట్టి ప్రణాళికలు మార్చుకోవడంలో ఆరితేరాడు.
దాని ఫలితమే... విశ్వనాథన్ ఆనంద్ (1987), పెంటేల హరికృష్ణ (2004), అభిజిత్ గుప్తా (2008) తర్వాత... ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌గా నిలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా ప్రణవ్ గుర్తింపు పొందాడు.
అజేయంగా...
తాజా ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ అండర్–20 ఓపెన్ విభాగంలో మొత్తం 11 రౌండ్ల పాటు పోటీలు జరగగా... ప్రణవ్ 9 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 7 గేమ్‌లు గెలిచిన ప్రణవ్... మిగిలిన 4 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా వరల్డ్ చాంపియన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ‘ఆటలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా... ఏమాత్రం వెనక్కి తగ్గని ప్రణవ్... ఏ క్షణంలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోడు.
ఇద్దరం తమిళనాడుకు చెందిన వాళ్లమే కావడంతో... తమిళంలోనే మాట్లాడుకుంటాం. దీంతో ఒకరి భావాలు మరొకరం సులభంగా అర్థం చేసుకుంటాం. కామెడీ సినిమాలను ఎక్కువ ఇష్టపడే ప్రణవ్... ఆట తప్ప వేరే ఆలోచనలను దరిచేరనివ్వడు. ఆ క్రమశిక్షణే అతడిని ఈ స్థాయికి తెచ్చింది. చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తరహాలో నిలకడ కొనసాగించడమే ప్రణవ్ లక్ష్యం’ అని 32 ఏళ్ల శ్యామ్ వివరించాడు.
క్రికెట్‌కు వీరాభిమాని...
క్రికెట్‌ను విపరీతంగా అభిమానించే ప్రణవ్ కు... నేటి తరం ప్రేక్షకుల్లాగే టెస్టుల కన్నా... వన్డే, టి20 ఫార్మాట్‌లంటేనే ఎక్కువ ఇష్టం. చదరంగంలో క్లాసికల్ గేమ్ టెస్టుల మాదిరి కాగా... వన్డే, టి20ల వంటి ర్యాపిడ్, బ్లిట్జ్‌లో ప్రణవ్ వేగం శ్యామ్‌సుందర్‌ను ఆకట్టుకుంది. కాస్త సానబెడితే అద్భుతాలు సాధించగల సత్తా అతడిలో ఉందని గుర్తించిన శ్యామ్ ఆ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ఏడాది శిక్షణలో అతడికిష్టమైన ర్యాపిడ్ బ్లిట్జ్‌లో మరింత మెరుగు పరుస్తూనే... సంపద్రాయ క్లాసికల్‌పై కూడా ఆసక్తి పెరిగేలా చేశాడు.
‘గత సంవత్సరం జనవరి నుంచి అధికారికంగా మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. అప్పటికే గ్రాండ్‌మాస్టర్ అయిన ప్రణవ్‌ను మరింత మెరుగు పర్చేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాను. టి20 క్రికెట్‌లో దూకుడుగా ఆడేందుకు వీలుంటుంది. అదే టెస్టు క్రికెట్‌లో ఓపిక ముఖ్యం. ప్రణవ్ కూడా క్విక్ ఫార్మాట్‌లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. కానీ సుదీర్ఘ ఫార్మాట్ వంటి క్లాసికల్‌లో మరింత ప్రావీణ్యం పొందే విధంగా తర్ఫీదునిచ్చాను’ అని శ్యామ్ సుందర్ విరించాడు.
Comments
Please login to add a commentAdd a comment