న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక అదరగొట్టారు. గురువారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో ఓపెన్ విభాగంలో 22 ఏళ్ల హర్ష 6.5 పాయింట్లతో రెండో స్థానంలో... మహిళల విభాగంలో ప్రియాంక 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాలను సొంతం చేసుకున్నారు.
అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే చెస్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించారు. ఓపెన్ విభాగంలో భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద 7 పాయింట్లతో... మహిళల విభాగంలో భారత్‌కే చెందిన పీవీ నందిథా 7.5 పాయింట్లతో చాంపియన్స్‌గా అవతరించారు. ఓపెన్ విభాగంలో టాప్–4 ప్లేయర్లు, మహిళల విభాగంలో టాప్–2 క్రీడాకారిణులు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించారు.
గురువారం జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో భారత్‌కే చెందిన కార్తీక్ వెంకటరామన్‌తో తలపడిన 22 ఏళ్ల హర్ష భరతకోటి 14 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆధిబన్‌తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హర్షతోపాటు ఆధిబన్, నారాయణన్, వొఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్), సేతురామన్, కార్తీక్ వెంకటరామన్ 6.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.
మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హర్ష రెండో ర్యాంక్‌లో, ఆధిబన్ మూడో ర్యాంక్‌లో, నారాయణన్ నాలుగో ర్యాంక్‌లో, వొఖిదోవ్ ఐదో ర్యాంక్‌లో, సేతురామన్ ఆరో ర్యాంక్‌లో, కార్తీక్ ఏడో ర్యాంక్‌లో నిలిచారు. ఈ టోర్నీలో హర్ష అజేయంగా నిలిచాడు. నాలుగు గేముల్లో గెలిచిన అతను మిగతా ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు.
మహిళల విభాగంలో విజయవాడకు చెందిన 20 ఏళ్ల ప్రియాంక చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో 47 ఎత్తుల్లో భారత్‌కే చెందిన పద్మిని రౌత్‌ను ఓడించింది. ప్రియాంకతోపాటు దివ్య దేశ్‌ముఖ్ (భారత్), వో థి కిమ్ ఫుంగ్ (వియత్నాం) 6.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ప్రియాంకకు రజతం, దివ్య దేశ్‌ముఖ్‌కు కాంస్యం లభించాయి. ఈ టోర్నీలో ప్రియాంక ఆరు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో రెండు గేముల్లో ఓటమి చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment