Harsha Bharatkoti
-
కోనేరు హంపితో ప్రియాంక పోటీ! ముగిసిన హర్ష భరతకోటి కథ..
బకూ (అజర్బైజాన్): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో రెండో రౌండ్‌కు చేరుకుంది. మరీనా బ్రునెల్లో (ఇటలీ)తో జరిగిన తొలి రౌండ్లో ప్రియాంక ర్యాపిడ్ ఫార్మాట్ టైబ్రేక్‌లో 1.5–0.5తో గెలుపొందింది. టైబ్రేక్ తొలి గేమ్‌ను 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న ప్రియాంక, రెండో గేమ్‌లో 45 ఎత్తుల్లో మరీనాను ఓడించి ఓవరాల్‌గా 2.5–1.5తో విజయం అందుకుంది. క్లాసికల్ ఫార్మాట్లో వీరి ద్దరి మధ్య జరిగిన తొలి రెండు గేమ్‌లు ‘డ్రా’గా ముగియడంతో విజేతను నిర్ణయించేందుకు ర్యాపిడ్ గేమ్‌లను నిర్వహించారు. రెండో రౌండ్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌కే చెందిన కోనేరు హంపితో ప్రియాంక తలపడుతుంది. ఓపెన్ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి కథ తొలి రౌండ్లోనే ముగిసింది. లెవాన్ పాంట్సులెయ (జార్జియా)తో టైబ్రేక్ తొలి గేమ్‌లో హర్ష 75 ఎత్తుల్లో ఓడిపోయి, రెండో గేమ్‌ను 66 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని 0.5–1.5తో ఓటమి చవిచూశాడు. -
హర్ష భరతకోటి శుభారంభం
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి శుభారంభం చేశాడు. లెవాన్ పాంట్సులయ (జార్జియా)తో ఆదివారం జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్‌లో హర్ష 40 ఎత్తుల్లో గెలిచాడు. గ్రెగరీ కైదనోవ్ (అమెరికా)తో జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ 38 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. భారత గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్, విదిత్, నిహాల్ సరీన్, ప్రజ్ఞానందలకు నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ కేటాయించారు. మహిళల విభాగంలో మరీనా బ్రునెల్లో (ఇటలీ)తో జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నూతక్కి ప్రియాంక 27 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలిలకు నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ లభించింది. -
Asian Continental Chess: మెరిసిన హర్ష, ప్రియాంక
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక అదరగొట్టారు. గురువారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఓపెన్ విభాగంలో 22 ఏళ్ల హర్ష 6.5 పాయింట్లతో రెండో స్థానంలో... మహిళల విభాగంలో ప్రియాంక 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాలను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే చెస్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించారు. ఓపెన్ విభాగంలో భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద 7 పాయింట్లతో... మహిళల విభాగంలో భారత్‌కే చెందిన పీవీ నందిథా 7.5 పాయింట్లతో చాంపియన్స్‌గా అవతరించారు. ఓపెన్ విభాగంలో టాప్–4 ప్లేయర్లు, మహిళల విభాగంలో టాప్–2 క్రీడాకారిణులు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించారు. గురువారం జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్లో భారత్‌కే చెందిన కార్తీక్ వెంకటరామన్‌తో తలపడిన 22 ఏళ్ల హర్ష భరతకోటి 14 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆధిబన్‌తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హర్షతోపాటు ఆధిబన్, నారాయణన్, వొఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్), సేతురామన్, కార్తీక్ వెంకటరామన్ 6.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హర్ష రెండో ర్యాంక్‌లో, ఆధిబన్ మూడో ర్యాంక్‌లో, నారాయణన్ నాలుగో ర్యాంక్‌లో, వొఖిదోవ్ ఐదో ర్యాంక్‌లో, సేతురామన్ ఆరో ర్యాంక్‌లో, కార్తీక్ ఏడో ర్యాంక్‌లో నిలిచారు. ఈ టోర్నీలో హర్ష అజేయంగా నిలిచాడు. నాలుగు గేముల్లో గెలిచిన అతను మిగతా ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల విభాగంలో విజయవాడకు చెందిన 20 ఏళ్ల ప్రియాంక చివరిదైన తొమ్మిదో రౌండ్లో 47 ఎత్తుల్లో భారత్‌కే చెందిన పద్మిని రౌత్‌ను ఓడించింది. ప్రియాంకతోపాటు దివ్య దేశ్‌ముఖ్ (భారత్), వో థి కిమ్ ఫుంగ్ (వియత్నాం) 6.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ప్రియాంకకు రజతం, దివ్య దేశ్‌ముఖ్‌కు కాంస్యం లభించాయి. ఈ టోర్నీలో ప్రియాంక ఆరు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో రెండు గేముల్లో ఓటమి చవిచూసింది. -
Netherlands International Open Chess Tournament: చాంపియన్ హర్ష
సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి తన కెరీర్లో మరో టైటిల్‌ను సాధించాడు. నెదర్లాండ్స్‌లో జరిగిన హెచ్‌జెడ్ యూనివర్సిటీ అప్లయిడ్ సైన్సెస్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 22 ఏళ్ల హర్ష చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో హర్ష మొత్తం ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి రెండు వేల యూరోలు (రూ. లక్షా 63 వేలు) ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హర్ష ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌లో ఓడిపోయాడు. తొలి రౌండ్లో క్లీన్ జోరిక్ (నెదర్లాండ్స్)పై 35 ఎత్తుల్లో... రెండో రౌండ్లో ఎడువార్డ్ కోనెన్ (నెదర్లాండ్స్)పై 28 ఎత్తుల్లో... ఎస్పెర్ వాన్ బార్ (నెదర్లాండ్స్)పై 24 ఎత్తుల్లో గెలిచిన హర్ష నాలుగో రౌండ్లో శ్రేయస్ రాయల్ (ఇంగ్లండ్) చేతిలో 25 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఐదో రౌండ్లో తేరుకున్న హర్ష కేవలం 14 ఎత్తుల్లో రెనీ డచెన్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. ఆరో రౌండ్లో హర్ష 61 ఎత్తుల్లో రొలాండ్ ఒలెన్బర్గర్ (జర్మనీ)పై, ఏడో రౌండ్లో 63 ఎత్తుల్లో విలియమ్ షక్వర్డియాన్ (నెదర్లాండ్స్)పై, ఎనిమిదో రౌండ్లో 53 ఎత్తుల్లో థామస్ బీర్డ్సెన్ (నెదర్లాండ్స్)పై, చివరిదైన తొమ్మిదో రౌండ్లో 33 ఎత్తుల్లో లలిత్ బాబు (భారత్)పై గెలుపొందాడు. ఇదే టోర్నీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు, అంతర్జాతీయ మాస్టర్ ధూళిపాళ్ల బాలచంద్ర 6.5 పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించగా లలిత్ బాబు తొమ్మిదో ర్యాంక్‌లో, బాలచంద్ర 11వ ర్యాంక్‌లో నిలిచారు. ఏడు పాయింట్లతో రుస్లాన్ పొనొమరియోవ్ (ఉక్రెయిన్), లియామ్ వ్రోలిక్ (నెదర్లాండ్స్), థామస్ బీర్డ్సెన్, వ్లాదిమిర్ బాక్లాన్ (ఉక్రెయిన్), టిమ్ గ్రుటెర్ (నెదర్లాండ్స్), వ్యాచెస్లావ్, ఖోయ్ ఫామ్ (నెదర్లాండ్స్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా పొనొమరియోవ్ రన్నరప్‌గా నిలువగా, లియామ్‌కు మూడో ర్యాంక్ దక్కింది. -
రన్నరప్ హర్ష భరతకోటి
సాక్షి, హైదరాబాద్: పారిస్ ఐడీఎఫ్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి రన్నరప్‌గా నిలిచాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హర్ష, ఆండ్రీ షెచకచెవ్ (ఫ్రాన్స్) 6.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించగా షెచకచెవ్కు టాప్ ర్యాంక్ దక్కగా... హర్షకు రెండో స్థానం ఖరారైంది. ఈ టోర్నీలో హర్ష నాలుగు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. రన్నరప్ హర్షకు 1,200 యూరోలు (రూ. 97 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
హర్ష ‘హ్యాట్రిక్’ గెలుపు
వార్సా (పోలాండ్): ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి అద్భుత ఆటతీరు కనబరుస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో తొలి రోజు హర్ష తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న గ్రాండ్మాస్టర్లతో ఆడిన మూడు గేముల్లోనూ విజయం సాధించాడు. మూడు పాయింట్లతో మరో తొమ్మిది మందితో కలిసి ఈ హైదరాబాద్ ప్లేయర్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం 2484 రేటింగ్ ఉన్న హర్ష తొలి గేమ్‌లో 51 ఎత్తుల్లో రవూఫ్ మమెదోవ్ (అజర్ బైజాన్–2690)పై... రెండో గేమ్‌లో 54 ఎత్తుల్లో వ్లాదిస్లావ్ కొవలెవ్ (రష్యా– 2647)పై... మూడో గేమ్‌లో 56 ఎత్తుల్లో ఒనిష్చుక్ (ఉక్రెయిన్ –2687)పై గెలుపొందాడు. తెలంగాణకే చెం దిన మరో గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ రెండు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కోనేరు హంపి తొలి రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని జైనాబ్ (అజర్బైజాన్)తో జరిగిన మూడో గేమ్‌లో ఓడిపోయింది. -
శభాష్... హర్ష
నిరీక్షణ ముగిసింది. హైదరాబాద్ చెస్ క్రీడాకారుడు హర్ష భరతకోటి అనుకున్నది సాధించాడు. భారత్ నుంచి 56వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. ఎరిగైసి అర్జున్ తర్వాత తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఆగస్టులో అబుదాబి మాస్టర్స్ టోర్నీలో హర్ష మూడో జీఎం నార్మ్ సంపాదించినా... జీఎం హోదా ఖాయం కావడానికి అవసరమైన 2500 రేటింగ్ పాయింట్లు ఆ సమయానికి అతని ఖాతాలో లేకపోవడంతో జీఎం టైటిల్ రాలేదు. ఆ తర్వాత ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచిన హర్ష తన రేటింగ్ పాయింట్లను 2492కు పెంచుకున్నాడు. తాజాగా గుజరాత్ ఓపెన్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో హర్ష వరుసగా నాలుగో విజయం సాధించి మరో 8 రేటింగ్ పాయింట్లు సంపాదించాడు. ఈ క్రమంలో జీఎం టైటిల్ ఖరారు కావడానికి అవసరమైన 2500 పాయింట్ల మైలురాయి దాటి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: చెస్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వారందరూ ఏనాటికైనా గ్రాండ్‌మాస్టర్ (జీఎం) కావాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే మేధో క్రీడ అయిన చెస్‌లో ఈ ఘనత సాధించడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఎన్నో ప్రతికూలతలు ఉన్నా... కష్టాన్ని ఇష్టంగా మలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. కాస్త ఆలస్యమైనా అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటాం. హైదరాబాద్ చెస్ ప్లేయర్ హర్ష భరతకోటి విషయంలో అదే జరిగింది. గత ఆగస్టులోనే జీఎం హోదా దక్కాల్సినా... అవసరమైన రేటింగ్ పాయింట్లు లేకపోవడంతో ఈ ఘనత అందుకోలేకపోయాడు. అయితేనేం తన ఆటతీరుకు మరింత పదునుపెట్టి... తనకంటే మేటి ఆటగాళ్లను మట్టికరిపించి... రెండు నెలల వ్యవధిలోనే 2500 మైలురాయిని అందుకున్నాడు. గ్రాండ్‌మాస్టర్ (జీఎం) అయ్యాడు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న గుజరాత్ ఓపెన్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నమెంట్లో 18 ఏళ్ల హర్ష వరుసగా నాలుగో విజయం సాధించాడు. తజకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్, 2651 రేటింగ్ ఉన్న ఫారూఖ్ అమనతోవ్తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడుతూ 32 ఎత్తుల్లో గెలిచి సంచలనం సృష్టించాడు. అంతకుముందు హర్ష మూడో రౌండ్లో పరాబ్ రిత్విజ్ (భారత్)పై 48 ఎత్తుల్లో... రెండో రౌండ్లో రక్షిత రవి (భారత్)పై 32 ఎత్తుల్లో... తొలి రౌండ్లో చంద్రేయి హజ్రాపై గెలిచాడు. నాలుగో రౌండ్ తర్వాత హర్ష నాలుగు పాయింట్లతో మరో ఐదుగురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ... తొమ్మిదేళ్ల ప్రాయంలో చెస్ ఆడటం ప్రారంభించిన హర్ష రెండేళ్లు తిరిగేలోపు జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించాడు. కోచ్ ఎన్వీఎస్ రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న హర్ష క్రమం తప్పకుండా తన ఆటతీరుకు మెరుగులు దిద్దుకున్నాడు. అటాకింగ్ గేమ్‌ను ఇష్టపడే ఈ హైదరాబాద్ అబ్బాయి గేమ్ పరిస్థితిని బట్టి వెంటవెంటనే వ్యూహాలు మార్చి ఫలితాన్ని తారుమారు చేయగల సమర్థుడు. ఏడేళ్లుగా చెస్‌లో ఉన్న హర్ష ఇప్పటివరకు 25 మంది కంటే ఎక్కువ మంది గ్రాండ్మాస్టర్లను ఓడించాడు. 2017 అక్టోబరులో ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ టోర్నీలో తొలి జీఎం నార్మ్ పొందిన హర్ష... ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన దుబాయ్ ఓపెన్‌లో రెండో జీఎం నార్మ్... ఆగస్టులో అబుదాబి మాస్టర్స్ టోర్నీలో మూడో జీఎం నార్మ్ సంపాదించాడు. హర్ష భరతకోటి ముఖ్య విజయాలు ∙2011: జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం. ∙2012: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ అండర్–12 ర్యాపిడ్ విభాగంలో స్వర్ణం. ∙2012: కామన్వెల్త్ చాంపియన్‌షిప్ అండర్–12 విభాగంలో స్వర్ణం. ∙2013: జాతీయ జూనియర్ అండర్–13 చాంపియన్‌షిప్‌లో స్వర్ణం. 2014: ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం ∙2016: ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం ∙2017: జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం ∙2017: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో బ్లిట్జ్ విభాగంలో రజతం ∙2017: ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ టోర్నీలో తొలి జీఎం నార్మ్ ∙2018: కఠ్మాండూ ఓపెన్‌లో స్వర్ణం ∙ 2018: దుబాయ్ ఓపెన్‌లో రెండో జీఎం నార్మ్ ∙2018: అబుదాబి మాస్టర్స్ టోర్నీలో మూడో జీఎం నార్మ్. ‘గ్రాండ్‌మాస్టర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నా కలను సాకారం చేసుకునేందుకు పదేళ్లుగా శ్రమిస్తున్నాను. నేనీస్థాయికి చేరుకోవడం వెనుక కోచ్ ఎన్వీఎస్ రామరాజు కృషి ఎంతో ఉంది. ఆటపరంగానూ, ఆర్థికంగానూ ఆయన నాకెంతో సహాయం చేశారు. జీఎం లక్ష్యం నెరవేరడంతో మున్ముందు నా రేటింగ్‌ను మరింత పెంచుకుంటాను. 2700 రేటింగ్‌ను అందుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతాను. ఈ క్రమంలో ఎవరైనా స్పాన్సర్లు ఆర్థికంగా అండగా నిలవాలని కోరుకుంటున్నాను.’ – ‘సాక్షి’తో హర్ష -
జీఎం టైటిల్‌కు చేరువలో హర్ష
ఇస్తాంబుల్ (టర్కీ): గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా ఖరారు చేసుకోవడానికి తెలంగాణ చెస్ ప్లేయర్ హర్ష భరతకోటి మరింత చేరువయ్యాడు. ఇప్పటికే మూడు జీఎం నార్మ్‌లు దక్కించుకున్న హర్ష ఎలో రేటింగ్ 2500 లేకపోవడంతో జీఎం టైటిల్ ఇంకా లభించలేదు. శనివారం ముగిసిన ప్రపంచ అండర్–20 చెస్ చాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల హర్ష ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హర్ష 7.5 పాయింట్లతో మరో పది మందితో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హర్ష తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ మెగా ఈవెంట్లో ఆరు గేముల్లో గెలిచిన అతను, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో రెండు గేముల్లో ఓడిపోయాడు. ఆరుగురు గ్రాండ్మాస్టర్లతో ఆడిన హర్ష... అలెన్ పిచోట్ (అర్జెంటీనా), సునీల్‌దత్ లైనా నారాయణన్ (భారత్), లియాంగ్ అవండర్ (అమెరికా)లపై గెలుపొంది... అలెగ్జాండర్ డాన్‌చెంకో (జర్మనీ)తో గేమ్‌ను ‘డ్రా’గా ముగిం చాడు. పర్హామ్ మగ్సూద్లు (ఇరాన్), ఆమిన్ (ఇజ్రాయెల్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఓవరాల్‌గా ఈ ప్రదర్శనతో హర్ష 18 పాయింట్లు సంపాదించి తన ఓవరాల్ ఎలో రేటింగ్‌ను 2492కు పెంచుకున్నాడు. తదుపరి టోర్నీల్లో హర్ష మరో ఎనిమిది పాయింట్లు సాధిస్తే అతనికి అధికారికంగా జీఎం టైటిల్ ఖాయమవుతుంది. మరోవైపు ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో భారత్‌కే చెందిన అభిమన్యు పురాణిక్ రజత పతకం సాధించాడు. 8.5 పాయింట్లతో అతను రెండో స్థానంలో నిలిచాడు. ఇరాన్‌కు చెందిన పర్హామ్ మగ్సూద్లు 9.5 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. -
హర్ష భరతకోటి ‘హ్యాట్రిక్’ గెలుపు
కోల్‌కతా: కోల్‌కతా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ ప్లేయర్ హర్ష భరతకోటి వరుసగా మూడో విజయం నమోదు చేశాడు. ప్రసాద్ (భారత్)తో శుక్రవారం జరిగిన ఐదో రౌండ్లో హర్ష 58 ఎత్తుల్లో గెలుపొందాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో హర్షకిది నాలుగో విజయం. ఫహాద్ (బంగ్లాదేశ్)తో జరిగిన మరో గేమ్‌లో తెలంగాణకే చెందిన ఎరిగైసి అర్జున్ 45 ఎత్తుల్లో నెగ్గాడు. ఐదో రౌండ్ తర్వాత హర్ష, అర్జున్ 4 పాయింట్లతో మరో 13 మందితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. -
చదరంగం చిరుత
సరదాగా మొదలుపెట్టిన ఆట... అతడి కెరీర్‌గా మారింది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ చిరు ప్రాయంలోనే అపార నైపుణ్యంతో మేటి ఆటగాళ్లకు ‘చెక్’ పెట్టే స్థాయికి తీసుకెళ్లింది. ఒక్కో పావును కదుపుతూ, ప్రత్యర్థుల ఆట కట్టిస్తూ చెస్ క్రీడాకారులు కలలు కనే గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా దిశగా అడుగులు వేయిస్తోంది. ఆ కుర్రాడే హర్ష భరతకోటి...! కొన్నాళ్లుగా అంతర్జాతీయ చెస్‌లో నిలకడగా రాణిస్తూ భవిష్యత్ తారగా కితాబు అందుకుంటున్నాడితడు. ఇప్పటికే రెండు జీఎం నార్మ్‌లు సొంతం చేసుకుని చిరకాల స్వప్నానికి మరో అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు గ్రాండ్ మాస్టర్లైన కోనేరు హంపి, పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక, లలిత్‌బాబు ఆంధ్రప్రదేశ్ వారు. అంతా సవ్యంగా జరిగితే త్వరలోనే హర్ష భరతకోటి రూపంలో తెలంగాణ నుంచి తొలి గ్రాండ్ మాస్టర్‌ను మనం చూడవచ్చు. సాక్షి, హైదరాబాద్ : ప్రతిభ ఉన్నా సరైన సమయంలో గుర్తింపు రాకపోతే అది మరుగున పడిపోతుంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే నైపుణ్యానికి నిత్యం పదును పెట్టుకుంటూ ఉండాలి. ప్రతిభావంతులకు తగిన చేయూత లభించాలి. మన దగ్గర వ్యవస్థ ద్వారా కాకుండా స్వయంకృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రీడాకారులెందరో ఉన్నారు. మేధో క్రీడ చెస్లోనూ ఇలాంటి వారెందరో కనిపిస్తారు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మొదలు తాజా గ్రాండ్‌మాస్టర్ హిమాన్షు శర్మ వరకు ఎన్నో అవాంతరాలను అధిగమించి అనుకున్న స్థానానికి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అపార ప్రతిభ ఉన్న యువ చెస్ ఆటగాళ్ల కోవలోకే వస్తాడు 18 ఏళ్ల హర్ష భరతకోటి. ఇటీవలే నేపాల్‌లో జరిగిన కఠ్మాండూ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన హర్ష కొన్నేళ్లుగా తన ఖాతాలో క్రమం తప్పకుండా విజయాలు జమ చేసుకుంటున్నాడు. తొమ్మిదేళ్ల ప్రాయంలో చెస్ పట్ల ఆకర్షితుడైన హర్ష కోచ్ ఎన్వీఎస్ రామరాజు శిక్షణలో రాటు దేలాడు. ఓనమాలు నేర్చుకున్న రెండేళ్ల తర్వాత జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగి కాంస్య పతకం సాధించాడు. తర్వాత పలు ర్యాంకింగ్ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. అటాకింగ్ ఆటతో దూసుకెళ్లే అలవాటున్న హర్ష పరిస్థితిని బట్టి వ్యూహాలను మార్చేసి ఫలితాన్ని తారుమారు చేసే సత్తాగలవాడు. ఏడేళ్లుగా చెస్ టోర్నీలు ఆడుతున్న తను ఇప్పటివరకు 20 కంటే ఎక్కువమంది గ్రాండ్మాస్టర్లను ఓడించడం విశేషం. ప్రస్తుతం 2463 ఎలో రేటింగ్ పాయింట్లతో ఉన్న హర్ష 2500 మార్క్‌ను అందుకొని గ్రాండ్‌మాస్టర్ హోదా పొందాలనే లక్ష్యంతో సాగుతున్నాడు. రోజూ తొమ్మిది గంటల పాటు సాధనతో రాబోయే రెండు నెలల కాలంలో కోల్‌కతా, ఒడిశా, ముంబైలలో జరిగే టోర్నీల్లో పాల్గొననున్నాడు. ఒక్కో పర్యటనకు భారీ మొత్తం... భారత్‌లో ప్రస్తుతం చెస్ టోర్నీల సంఖ్య భారీగా పెరిగింది. అయితే రేటింగ్ పాయింట్లు పెంచుకోవాలంటే తమకంటే రేటింగ్ ఎక్కువ ఉన్న క్రీడాకారులు పాల్గొనే టోర్నీల్లో ఆడాల్సి ఉంటుంది. యూరోప్‌లో గ్రాండ్‌మాస్టర్స్ ఎక్కువ పాల్గొనే టోర్నీలు చాలా జరుగుతాయి. ఇలాంటి టోర్నీల్లో పాల్గొనడం అందరివల్ల అయ్యే పనికాదు. రానుపోను ఖర్చులు, వసతి, టోర్నీ సందర్భంగా చెస్ సహాయకులతో (సెకండ్స్) శిక్షణ... ఇలా ఒక్కో పర్యటనకు కనీసం ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇంత మొత్తం భరించడం ఔత్సాహిక యువ క్రీడాకారులకు సాధ్యమయ్యే పనికాదు. కార్పొరేట్ సంస్థలు, క్రీడాభిమానులు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) ముందుకువచ్చి తమవం తుగా ఆర్థిక సహాయం చేస్తే హర్ష కెరీర్ మరింత వెలిగిపోతుంది. కార్ల్‌సన్‌నే ఆకట్టుకున్నాడు... అది 2017 ఐల్ ఆఫ్ మ్యాన్ టోర్నీ వేదిక... ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), హికారు నకముర (అమెరికా), విశ్వనాథన్ ఆనంద్ తదితర దిగ్గజాలు పాల్గొన్న ఈ టోర్నీలో హర్ష కూడా బరిలోకి దిగాడు. తొలి ఐదు రౌండ్లలో ఐదుగురు గ్రాండ్మాస్టర్స్తో తలపడి, అందులో ఇద్దరిని ఓడించి, మరో ఇద్దరితో ‘డ్రా’ చేసుకొని మరో గేమ్‌లో ఓడిపోయాడు. అప్పటి హర్ష ఎలో రేటింగ్ (2394)ను బట్టి చూస్తే అతని ప్రదర్శన అద్భుతమని ఆ టోర్నీలో పాల్గొన్న చెస్ పండితులు కితాబిచ్చారు. హర్ష గేమ్‌లు ఆడతున్న సమయంలో ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ హర్ష బోర్డు వద్దకు వచ్చి అతని ఎత్తులను పరిశీలించి వెళ్లడం జరిగింది. హర్ష భరతకోటి విజయాలు... 2011: అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో అండర్–11 విభాగంలో కాంస్య పతకం. 2012: శ్రీలంక ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్‌షిప్‌లో అండర్–12 ర్యాపిడ్ విభాగంలో స్వర్ణం. 2012: చెన్నైలో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో అండర్–12 విభాగంలో స్వర్ణం. 2013: పాండిచ్చేరిలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో అండర్–13 విభాగంలో స్వర్ణం. 2014: న్యూఢిల్లీలో జరిగిన ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం. 2016: న్యూఢిల్లీలో జరిగిన ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం. 2017: పాట్నాలో జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం. 2017: ఇరాన్లో జరిగిన ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో బ్లిట్జ్ విభాగంలో రజతం. 2017: ఐల్ ఆఫ్ మ్యాన్ టోర్నీలో తొలి జీఎం నార్మ్ సొంతం. 2018: దుబాయ్ ఓపెన్‌లో రెండో జీఎం నార్మ్ సొంతం. -
హర్ష సంచలనం
సాక్షి, హైదరాబాద్: ఐల్ ఆఫ్ మ్యాన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ హర్ష భరత్‌కోటి సంచలనం సృష్టించాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో... భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్, 2670 ఎలో రేటింగ్ కలిగిన ఆదిబన్తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా, 2394 ఎలో రేటింగ్ ఉన్న హర్ష కేవలం 40 ఎత్తుల్లో విజయం సాధించాడు. అయితే భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతితో జరిగిన ఆరో రౌండ్లో హర్ష 42 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఆరో రౌండ్ తర్వాత హర్ష నాలుగు పాయింట్లతో 17వ ర్యాంక్‌లో ఉన్నాడు. -
జాతీయ జూనియర్ చెస్ చాంప్ హర్ష
పట్నా: జాతీయ జూనియర్ అండర్–19 ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఆటగాడు హర్ష భరతకోటి విజేతగా నిలిచాడు. 11 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో అతను 9.5 పాయింట్లతో అజేయంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్తీక్ వెంకట రామన్ కూడా సరిగ్గా 9.5 పాయింట్లు సాధించాడు. అయితే ఈ టోర్నీలో అతనిపై ముఖాముఖి పోరులో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎమ్) హర్ష గెలుపొందడంతో అతడిని విజేతగా డిక్లేర్ చేశారు. దీంతో కార్తీక్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో టాప్–5 స్థానాలు తెలుగు ఆటగాళ్లవే కావడం విశేషం. ఏపీ క్రీడాకారులు కృష్ణతేజ (8), ప్రణవానంద (8) వరుసగా మూడు, నాలుగు స్థానాలు పొందగా, రాజా రిత్విక్ (తెలంగాణ) ఐదో స్థానంలో నిలిచాడు. బాలికల కేటగిరీలో మహాలక్ష్మి (తమిళనాడు) చాంపియన్‌గా నిలిచింది.