సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి తన కెరీర్‌లో మరో టైటిల్‌ను సాధించాడు. నెదర్లాండ్స్‌లో జరిగిన హెచ్‌జెడ్ యూనివర్సిటీ అప్లయిడ్ సైన్సెస్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 22 ఏళ్ల హర్ష చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో హర్ష మొత్తం ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి రెండు వేల యూరోలు (రూ. లక్షా 63 వేలు) ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు.
నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హర్ష ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌లో ఓడిపోయాడు. తొలి రౌండ్‌లో క్లీన్ జోరిక్ (నెదర్లాండ్స్)పై 35 ఎత్తుల్లో... రెండో రౌండ్‌లో ఎడువార్డ్ కోనెన్ (నెదర్లాండ్స్)పై 28 ఎత్తుల్లో... ఎస్పెర్ వాన్ బార్ (నెదర్లాండ్స్)పై 24 ఎత్తుల్లో గెలిచిన హర్ష నాలుగో రౌండ్‌లో శ్రేయస్ రాయల్ (ఇంగ్లండ్) చేతిలో 25 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఐదో రౌండ్‌లో తేరుకున్న హర్ష కేవలం 14 ఎత్తుల్లో రెనీ డచెన్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు.
ఆరో రౌండ్‌లో హర్ష 61 ఎత్తుల్లో రొలాండ్ ఒలెన్‌బర్గర్ (జర్మనీ)పై, ఏడో రౌండ్‌లో 63 ఎత్తుల్లో విలియమ్ షక్‌వర్డియాన్ (నెదర్లాండ్స్)పై, ఎనిమిదో రౌండ్‌లో 53 ఎత్తుల్లో థామస్ బీర్డ్‌సెన్ (నెదర్లాండ్స్)పై, చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో 33 ఎత్తుల్లో లలిత్ బాబు (భారత్)పై గెలుపొందాడు. ఇదే టోర్నీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు, అంతర్జాతీయ మాస్టర్ ధూళిపాళ్ల బాలచంద్ర 6.5 పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు.
అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించగా లలిత్ బాబు తొమ్మిదో ర్యాంక్‌లో, బాలచంద్ర 11వ ర్యాంక్‌లో నిలిచారు. ఏడు పాయింట్లతో రుస్లాన్ పొనొమరియోవ్ (ఉక్రెయిన్), లియామ్ వ్రోలిక్ (నెదర్లాండ్స్), థామస్ బీర్డ్‌సెన్, వ్లాదిమిర్ బాక్లాన్ (ఉక్రెయిన్), టిమ్ గ్రుటెర్ (నెదర్లాండ్స్), వ్యాచెస్లావ్, ఖోయ్ ఫామ్ (నెదర్లాండ్స్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా పొనొమరియోవ్ రన్నరప్‌గా నిలువగా, లియామ్‌కు మూడో ర్యాంక్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment