International chess tournament
-
సింగపూర్‌లో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్
న్యూఢిల్లీ: భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్, క్యాండిడేట్స్ టోర్నీ విజేత దొమ్మరాజు గుకేశ్‌కు స్వదేశంలో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఆడే అవకాశం లభించలేదు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా), చాలెంజర్ గుకేశ్ మధ్య ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ ఆతిథ్య హక్కులు సింగపూర్‌కు లభించాయి. ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కుల కోసం అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్), తమిళనాడు ప్రభుత్వం, సింగపూర్ పోటీపడ్డాయి. బిడ్లను పరిశీలించాక ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు సింగపూర్‌కు కేటాయిస్తున్నట్లు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 వరకు గుకేశ్, డింగ్ లిరెన్ మధ్య 25 లక్షల డాలర్ల (రూ. 20 కోట్ల 85 లక్షలు) ప్రైజ్‌మనీతో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతుంది. ఇద్దరి మధ్య 14 రౌండ్లు నిర్వహిస్తారు. తొలుత 7.5 పాయింట్లు సంపాదించిన ప్లేయర్‌ను విశ్వవిజేతగా ప్రకటిస్తారు. 14 రౌండ్ల తర్వాత ఇద్దరూ సమంగా నిలిస్తే టైబ్రేక్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు క్లాసికల్ ఫార్మాట్లో భారత్ నుంచి విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఆనంద్ ఐదుసార్లు (2000, 2007, 2008, 2010, 2012) విశ్వవిజేతగా నిలిచాడు. -
Tepe Sigeman And Co 2023 R4: అర్జున్‌కు మూడో పరాజయం
టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో పరాజయం చవిచూశాడు. స్వీడన్లో సోమవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో అర్జున్ 51 ఎత్తుల్లో జోర్డాన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. భారత సంతతికి చెందిన అమెరికా గ్రాండ్‌మాస్టర్ అభిమన్యు మిశ్రా, భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ మధ్య జరిగిన గేమ్ 42 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఐదో రౌండ్ తర్వాత గుకేశ్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో, అర్జున్ రెండు పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. -
అంతర్జాతీయ చెస్ టోర్నీలో సత్తా చాటుతున్న తెలంగాణ గ్రాండ్ మాస్టర్
టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ రెండో విజయం సాధించాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌తో ఆదివారం స్వీడన్లో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో అర్జున్ 38 ఎత్తుల్లో గెలుపొందాడు. నాలుగు రౌండ్ల తర్వాత అర్జున్ రెండు పాయింట్లతో ఐదో స్థానంలో, గుకేశ్ 2.5 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో ఉన్నారు. -
International Chess Tourney: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్‌కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: బుకారెస్ట్ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ కాంస్య పతకం సాధించాడు. రొమేనియాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 10 రౌండ్ల తర్వాత మాక్సిమ్ చిగయెవ్ (రష్యా), డేనియల్ బొగ్డాన్ (రొమేనియా), హరికృష్ణ 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. చిగయెవ్కు టాప్ ర్యాంక్ దక్కగా... బొగ్డాన్కు రెండో ర్యాంక్, హరికృష్ణకు మూడో ర్యాంక్ లభించాయి. హరికృష్ణ మొత్తం ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ రౌనక్‌తో జరిగిన గేమ్‌లో ఓడిపోయాడు. -
మూడో స్థానంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్
సాటీ జుల్డిజ్ అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ టోర్నీలో 11 రౌండ్లు ముగిశాక తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ 7 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. కజకిస్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం అర్జున్ ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మూడు గేముల్లో ఓడిపోయాడు. సిందరోవ్, హు ఇఫాన్, బిబిసారా, గెల్ఫాండ్, క్రామ్నిక్, కాటరీనా లాగ్నోలపై అర్జున్ నెగ్గాడు. నేడు జరిగే మరో 11 రౌండ్లతో టోర్నీ ముగుస్తుంది. -
International Chess Federation: రన్నరప్ హంపి
మ్యూనిక్ (జర్మనీ): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరిగిన మహిళలగ్రాండ్ప్రి సిరీస్ రెండో టోర్నమెంట్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో హంపి 7 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. తాన్ జోంగీ (చైనా)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌ను హంపి 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి అజేయంగా నిలిచింది. ఎనిమిది గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హంపి మూడు గేముల్లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 6 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. 11వ రౌండ్లో నానా జాగ్‌నిద్జెతో జరిగిన గేమ్‌ను హారిక 11 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. హారిక కూడా ఈ టోర్నీలో ఒక్క గేమ్‌లోనూ ఓడిపోలేదు. 10 గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హారిక ఒక గేమ్‌లో గెలిచింది. 7.5 పాయింట్లతో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) విజేతగా అవతరించింది. చివరి గేమ్‌లో అలెగ్జాండ్రా కొస్టెనిక్ 64 ఎత్తుల్లో జినెల్ జు (చైనా) చేతిలో ఓడిపోయింది. నాలుగు గ్రాండ్‌ప్రి సిరీస్‌లలో భాగంగా మూడో టోర్నీ వచ్చే నెలలో భారత్‌లో జరుగుతుంది. -
FTX Crypto Cup: ప్రజ్ఞానంద ఓటమి
మయామి: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ టోర్నీలో వరుసగా నాలుగు విజయాలు సాధించిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద ఐదో రౌండ్లో వియత్నాం గ్రాండ్‌మాస్టర్ క్వాంగ్ లియెమ్ లీ చేతిలో 0.5–2.5తో ఓడిపోయాడు. ప్రస్తుత ఆసియా చాంపియన్ అయిన క్వాంగ్ లియెమ్ లీ, ప్రజ్ఞానంద మధ్య తొలి గేమ్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. రెండో గేమ్‌లో క్వాంగ్ 50 ఎత్తుల్లో... మూడో గేమ్‌లో 43 ఎత్తుల్లో ప్రజ్ఞానందపై గెలుపొందాడు. ఫలితం తేలిపోవడంతో నాలుగో గేమ్‌ను నిర్వహించలేదు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత కార్ల్సన్ (నార్వే) 13 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... ప్రజ్ఞానంద 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. -
ప్రజ్ఞానంద మరో సంచలన విజయం.. ఈసారి ఎనిమిదో ర్యాంకర్‌పై..!
మయామి: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద వరుసగా రెండో విజయం నమోదు చేశాడు. తొలి రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)ను ఓడించిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద... రెండో రౌండ్లో ఎనిమిదో ర్యాంకర్ అనీశ్ గిరి (నెదర్లాండ్స్)పై గెలిచాడు. నేపాల్ సంతతికి చెందిన అనీశ్ గిరితో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 89వ ర్యాంకర్ ప్రజ్ఞానంద 2.5–1.5తో నెగ్గాడు. తొలి మూడు గేమ్‌లు ‘డ్రా’ కాగా నాలుగో గేమ్‌లో ప్రజ్ఞానంద 81 ఎత్తుల్లో గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానందకు 7,500 డాలర్లు (రూ. 5 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. రెండో రౌండ్ తర్వాత ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ (నార్వే), ప్రజ్ఞానంద ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నారు. -
ప్రజ్ఞానంద సంచలనం
మయామి: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద సంచలనంతో శుభారంభం చేశాడు. అమెరికా వేదికగా ఎనిమిది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్ మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద 2.5–1.5తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. ఈ విజయంతో ప్రజ్ఞానందకు 7,500 డాలర్ల (రూ. 5 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), లెవాన్ అరోనియన్ (అమెరికా), జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్), లియెమ్ లీ (వియత్నాం), హాన్స్ నీమెన్ (అమెరికా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్) కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు. -
Netherlands International Open Chess Tournament: చాంపియన్ హర్ష
సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి తన కెరీర్లో మరో టైటిల్‌ను సాధించాడు. నెదర్లాండ్స్‌లో జరిగిన హెచ్‌జెడ్ యూనివర్సిటీ అప్లయిడ్ సైన్సెస్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 22 ఏళ్ల హర్ష చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో హర్ష మొత్తం ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి రెండు వేల యూరోలు (రూ. లక్షా 63 వేలు) ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హర్ష ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌లో ఓడిపోయాడు. తొలి రౌండ్లో క్లీన్ జోరిక్ (నెదర్లాండ్స్)పై 35 ఎత్తుల్లో... రెండో రౌండ్లో ఎడువార్డ్ కోనెన్ (నెదర్లాండ్స్)పై 28 ఎత్తుల్లో... ఎస్పెర్ వాన్ బార్ (నెదర్లాండ్స్)పై 24 ఎత్తుల్లో గెలిచిన హర్ష నాలుగో రౌండ్లో శ్రేయస్ రాయల్ (ఇంగ్లండ్) చేతిలో 25 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఐదో రౌండ్లో తేరుకున్న హర్ష కేవలం 14 ఎత్తుల్లో రెనీ డచెన్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. ఆరో రౌండ్లో హర్ష 61 ఎత్తుల్లో రొలాండ్ ఒలెన్బర్గర్ (జర్మనీ)పై, ఏడో రౌండ్లో 63 ఎత్తుల్లో విలియమ్ షక్వర్డియాన్ (నెదర్లాండ్స్)పై, ఎనిమిదో రౌండ్లో 53 ఎత్తుల్లో థామస్ బీర్డ్సెన్ (నెదర్లాండ్స్)పై, చివరిదైన తొమ్మిదో రౌండ్లో 33 ఎత్తుల్లో లలిత్ బాబు (భారత్)పై గెలుపొందాడు. ఇదే టోర్నీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు, అంతర్జాతీయ మాస్టర్ ధూళిపాళ్ల బాలచంద్ర 6.5 పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించగా లలిత్ బాబు తొమ్మిదో ర్యాంక్‌లో, బాలచంద్ర 11వ ర్యాంక్‌లో నిలిచారు. ఏడు పాయింట్లతో రుస్లాన్ పొనొమరియోవ్ (ఉక్రెయిన్), లియామ్ వ్రోలిక్ (నెదర్లాండ్స్), థామస్ బీర్డ్సెన్, వ్లాదిమిర్ బాక్లాన్ (ఉక్రెయిన్), టిమ్ గ్రుటెర్ (నెదర్లాండ్స్), వ్యాచెస్లావ్, ఖోయ్ ఫామ్ (నెదర్లాండ్స్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా పొనొమరియోవ్ రన్నరప్‌గా నిలువగా, లియామ్‌కు మూడో ర్యాంక్ దక్కింది. -
రన్నరప్ హర్ష భరతకోటి
సాక్షి, హైదరాబాద్: పారిస్ ఐడీఎఫ్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి రన్నరప్‌గా నిలిచాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హర్ష, ఆండ్రీ షెచకచెవ్ (ఫ్రాన్స్) 6.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించగా షెచకచెవ్కు టాప్ ర్యాంక్ దక్కగా... హర్షకు రెండో స్థానం ఖరారైంది. ఈ టోర్నీలో హర్ష నాలుగు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. రన్నరప్ హర్షకు 1,200 యూరోలు (రూ. 97 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
Norway Chess: ఆనంద్ అదరహో
స్టావెంజర్: నార్వే ఓపెన్ క్లాసికల్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ గెలుపొందాడు. వారం రోజుల వ్యవధిలో కార్ల్‌సన్‌పై ఆనంద్‌కిది రెండో గెలుపు కావడం విశేషం. ఇదే వేదికపై జరిగిన బ్లిట్జ్ కేటగిరీ టోర్నీలోనూ కార్ల్‌సన్‌పై ఆనంద్ విజయం సాధించాడు. క్లాసికల్ టోర్నీలో 31 ఏళ్ల కార్ల్సన్తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను తెల్లపావులతో ఆడిన 52 ఏళ్ల ఆనంద్ 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. అయితే ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయిన గేమ్‌లో ఫలితం వచ్చేందుకు ప్రత్యేకంగా ‘అర్మగెడాన్’ గేమ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ‘అర్మగెడాన్’ గేమ్ నిబంధనల ప్రకారం తెల్ల పావులతో ఆడే ప్లేయర్‌కు 10 నిమిషాలు, నల్ల పావులతో ఆడే ప్లేయర్‌కు 7 నిమిషాలు కేటాయిస్తారు. తెల్ల పావులతో ఆడుతున్న ప్లేయర్ గెలిస్తేనే అతనికి విజయం ఖరారవుతుంది. ఒకవేళ గేమ్ ‘డ్రా’ అయితే మాత్రం తక్కువ సమయం పొందినందుకుగాను నల్ల పావులతో ఆడిన ప్లేయర్‌ను గెలిచినట్లు ప్రకటిస్తారు. రెగ్యులర్ గేమ్‌లో ఏ రంగు పావులతో ఆడారో అదే రంగును అర్మగెడాన్ గేమ్‌లోనూ కేటాయిస్తారు. దాంతో కార్ల్సన్తో అర్మగెడాన్ గేమ్‌లో ఆనంద్ తెల్ల పావులతో ఆడాల్సి వచ్చింది. ఈ గేమ్‌లో ఆనంద్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా చకచకా ఎత్తులు వేస్తూ కార్ల్‌సన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. చివరకు ఆనంద్ 50 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను ఓడించాడు. ఈ టోర్నీలో రెగ్యులర్ గేమ్‌లో విజయానికి మూడు పాయింట్లు కేటాయిస్తున్నారు. గేమ్ ‘డ్రా’ అయి అర్మగెడాన్ గేమ్‌లో గెలిస్తే 1.5 పాయింట్లు లభిస్తాయి. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత ఆనంద్ 10 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలో ఉన్నాడు. 9.5 పాయింట్లతో కార్ల్సన్ రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. -
విజేత శశికిరణ్
చెన్నై: ఫాగర్నెస్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ కృష్ణన్ శశికిరణ్ విజేతగా నిలిచాడు. నార్వేలో ముగిసిన ఈ టోర్నీలో శశికిరణ్ నిర్ణీత 9 రౌండ్ల తర్వాత 7 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ఆర్యన్ చోప్రా కూడా 7 పాయింట్లు సాధించినా మెరుగైన టైబ్రేక్ స్కోరుతో శశికిరణ్కు టైటిల్ దక్కింది. ఆర్యన్ చోప్రాకు రెండో ర్యాంక్ లభించింది. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ 6.5 పాయింట్లతో 5వ ర్యాంక్‌లో నిలిచాడు. -
అర్జున్‌కు తొలి విజయం
టాటా స్టీల్ చాలెంజర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ తొలి విజయం నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన అర్జున్ 25 ఎత్తుల్లో మాక్స్ వార్మెర్డమ్ (నెదర్లాండ్స్)పై గెలిచాడు. లుకాస్ వాన్ ఫారెస్ట్ (నెదర్లాండ్స్)తో జరిగిన తొలి గేమ్‌ను అర్జున్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. -
Arjun Erigaisi: క్వార్టర్ ఫైనల్లో అర్జున్
సాక్షి, హైదరాబాద్: ఆసియా ర్యాపిడ్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ ప్రిలిమినరీ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ (జీఎం), భారత యువతార అర్జున్ ఇరిగైసి ఎనిమిదో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 16 మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో వరంగల్ జిల్లాకు చెందిన అర్జున్ 15 రౌండ్లకుగాను 8 పాయింట్లు స్కోరు చేసి నాకౌట్ దశకు అర్హత సాధించిన ఏకైక భారత ప్లేయర్‌గా నిలిచాడు. సోమవారం ఆడిన ఐదు గేమ్‌లను 17 ఏళ్ల అర్జున్ (2567 ఎలో రేటింగ్) ‘డ్రా’ చేసుకోవడం విశేషం. 14వ రౌండ్ గేమ్‌లో ప్రస్తుతం క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో ప్రపంచ చాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్సన్ (నార్వే–2847 రేటింగ్)ను అర్జున్ 63 ఎత్తుల్లో నిలువరించి ‘డ్రా’ చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది. సో వెస్లీ (అమెరికా–2770)తో 11వ గేమ్‌ను 11 ఎత్తుల్లో... స్విద్లెర్ (రష్యా– 2714)తో 12వ గేమ్‌ను 40 ఎత్తు ల్లో... సలీమ్ (యూఏఈ–2682)తో 13వ గేమ్‌ను 36 ఎత్తుల్లో... అనీశ్ గిరి (నెదర్లాండ్స్–2780)తో జరిగిన చివరిదైన 15వ గేమ్‌ను అర్జున్ 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో అరోనియన్‌తో అర్జున్; కార్ల్సన్తో సో వెస్లీ; లిరెన్ డింగ్‌తో జాన్ క్రిస్టాఫ్; వ్లాదిస్లావ్తో అనీశ్ గిరి తలపడతారు. భారత్‌కే చెందిన విదిత్ 10వ ర్యాంక్‌లో, గుకేశ్ 12వ ర్యాంక్‌లో, ఆధిబన్ 15వ ర్యాంక్‌లో నిలిచి నాకౌట్ దశకు అర్హత పొందలేకపోయారు. -
తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ సంచలనం
సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌మనీ ఆసియా ర్యాపిడ్ ఆన్లైన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ (జీఎం), భారత యువతార అర్జున్ ఇరిగైసి సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. టోర్నీ రెండో రోజు ఆదివారం ఐదు గేమ్‌లు ఆడిన అర్జున్ (2567 ఎలో రేటింగ్) రెండు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోయాడు. ఎనిమిదో రౌండ్ గేమ్‌లో, పదో రౌండ్ గేమ్‌లో అర్జున్ అద్భుతాలు చేశాడు. పదో గేమ్‌లో మహిళల ప్రస్తుత వరల్డ్ నంబర్‌వన్, ప్రపంచ మాజీ చాంపియన్ హు ఇఫాన్ (చైనా–2658 ఎలో రేటింగ్)పై 33 ఎత్తుల్లో... ఎనిమిదో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ (2726)పై 65 ఎత్తుల్లో అర్జున్ గెలుపొందాడు. గుకేశ్ (భారత్–2578)తో ఆరో గేమ్‌ను, అలీరెజా ఫిరూజా (ఇరాన్–2759)తో తొమ్మిదో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న అర్జున్... ఏడో గేమ్‌లో అరోనియన్ (అర్మేనియా–2781) చేతిలో ఓడిపోయాడు. 16 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో పది రౌండ్లు ముగిశాక అర్జున్ 5.5 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. -
మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నీకి కోనేరు హంపి, హారిక అర్హత
చెన్నై: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరగనున్న మహిళల ప్రపంచకప్ టోర్నమెంట్‌కు భారత స్టార్ క్రీడాకారిణులు, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక అర్హత సాధించారు. ఈ ఇద్దరితోపాటు పద్మిని రౌత్, భక్తి కులకర్ణి భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. ప్రపంచ ర్యాంకింగ్, రేటింగ్ ప్రకారం హంపి, హారిక బెర్త్‌లు దక్కించుకోగా... ఆసియా జోనల్ కోటా ద్వారా పద్మిని, భక్తి అర్హత పొందారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం హంపి మూడో ర్యాంక్‌లో, హారిక తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ జూలై 10 నుంచి ఆగస్టు 3 వరకు రష్యాలోని సోచి నగరంలో జరగనుంది. ఈ టోర్నీకి అర్హత సాధించిన క్రీడాకారిణుల జాబితాను ‘ఫిడే’ విడుదల చేసింది. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో మొత్తం ఏడు రౌండ్లు ఉంటాయి. ప్రతి రౌండ్లో రెండు గేమ్‌ల చొప్పున జరుగుతాయి. ఒకవేళ ఇద్దరి మధ్య స్కోర్లు సమం గా నిలిస్తే టైబ్రేక్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. -
రన్నరప్ హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: కరోనా క్లిష్ట సమయంలో నాలుగు నెలల విరామం తర్వాత జరిగిన తొలి ముఖాముఖి అంతర్జాతీయ టోర్నమెంట్ బీల్ చెస్ ఫెస్టివల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రన్నరప్‌గా నిలిచాడు. స్విట్జర్లాండ్‌లోని బీల్ నగరంలో బుధవారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 34 ఏళ్ల హరికృష్ణ 36.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 37 పాయింట్లతో పోలాండ్ గ్రాండ్‌మాస్టర్ రాడోస్లా వొజ్తాసెక్ ఓవరాల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ర్యాపిడ్, బ్లిట్జ్, క్లాసికల్ విభాగాల్లో టోర్నీలు నిర్వహించి... ఈ మూడు కేటగిరీల్లో ఆటగాళ్లు సాధించిన మొత్తం పాయింట్ల ఆధారంగా ఫైనల్ ర్యాంకింగ్స్‌ను నిర్ధారించారు. హరికృష్ణ ర్యాపిడ్ విభాగంలో 10 పాయింట్లు ... బ్లిట్జ్ విభాగంలో 6 పాయింట్లు... క్లాసికల్ విభాగంలో 20.5 పాయింట్లు స్కోరు చేశాడు. బుధవారం జరిగిన చివరిదైన ఏడో రౌండ్ క్లాసికల్ గేమ్‌లో ప్రపంచ 26వ ర్యాంకర్ హరికృష్ణ 31 ఎత్తుల్లో డేవిడ్ గిజారో (స్పెయిన్)పై గెలుపొందాడు. అయితే మరోవైపు వొజ్తాసెక్ కూడా తన చివరి రౌండ్ గేమ్‌లో తన ప్రత్యర్థి నోయల్ స్టుడెర్ (స్విట్జర్లాండ్)ను ఓడించడంతో హరికృష్ణ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ వొజ్తాసెక్ గేమ్ ‘డ్రా’ అయిఉంటే హరికృష్ణకు టైటిల్ లభించేంది. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం క్లాసికల్ విభాగంలో విజయానికి 4 పాయింట్లు, ‘డ్రా’కు ఒకటిన్నర పాయింట్లు... ర్యాపిడ్ విభాగంలో విజయానికి 2 పాయింట్లు, ‘డ్రా’కు ఒక పాయింట్... బ్లిట్జ్ విభాగంలో విజయానికి 1 పాయింట్, ‘డ్రా’కు అరపాయింట్ కేటాయించారు. చాంపియన్ వొజ్తాసెక్కు 10 వేల స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 8 లక్షల 20 వేలు), రన్నరప్ హరికృష్ణకు 7,500 స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 6 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓవరాల్ ఫైనల్ ర్యాంకింగ్స్ 1. రాడోస్లా వొజ్తాసెక్ (పోలాండ్–37 పాయింట్లు); 2. పెంటేల హరికృష్ణ (భారత్–36.5 పాయింట్లు); 3. మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్–35.5 పాయింట్లు); 4. విన్సెంట్ కీమెర్ (జర్మనీ–28 పాయింట్లు); 5. అర్కాదిజ్ నైదిష్ (అజర్బైజాన్–22.5 పాయింట్లు); 6. డేవిడ్ గిజారో (స్పెయిన్–22 పాయింట్లు); 7. రొమైన్ ఎడువార్డో (ఫ్రాన్స్–17.5 పాయింట్లు); 8. నోయల్ స్టుడెర్ (స్విట్జర్లాండ్–15 పాయింట్లు). ఆడటంలోనే ఆనందం దక్కింది... బీల్ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం సంతోషం. త్రుటిలో ఓవరాల్ చాంపియన్‌షిప్ కోల్పోయాను. అయితే ఎలాంటి నిరాశా లేదు. మూడు ఫార్మాట్లలో (ర్యాపిడ్, బ్లిట్జ్, క్లాసికల్) కూడా బాగా ఆడాను. బ్లిట్జ్‌లో మాత్రం కాస్త వెనుకబడటంతో ఓవరాల్ టైటిల్ చేజారింది. మొత్తంగా నా ప్రదర్శన అయితే చాలా బాగుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీ విజయాలు, ఫలితాలకంటే ముఖాముఖి చెస్ ఆడటంలో నాకు కలిగిన ఆనందం చాలా ఎక్కువ. ఫిబ్రవరిలో చివరి టోర్నమెంట్ బరిలోకి దిగాను. బీల్ నుంచి ‘సాక్షి’తో హరికృష్ణ ► కోవిడ్–19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా మా టోర్నీలు కూడా రద్దు కావడంతో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సమయంలో అనేక కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు ఓపెనింగ్స్‌పై ఒక పుస్తకం కూడా రాశాను. త్వరలో అది ప్రచురితమవుతుంది. ► ప్రస్తుతం ప్రాగ్ (చెక్ రిపబ్లిక్ రాజధాని)లో ఉంటున్నా. కరోనాకు సంబంధించి స్విట్జర్లాండ్ ప్రభుత్వ నిబంధనలను నిర్వాహకులు పూర్తిగా పాటించారు. మాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు వారే చూసుకోవడం వల్ల మేం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం రాలేదు. బ్లిట్జ్ మినహా మిగిలిన ఫార్మాట్లకు ఇద్దరు ఆటగాళ్ల మధ్య మందమైన ప్లాస్టిక్ తెరలాంటిది ఉంచారు. బ్లిట్జ్ చాలా వేగంగా ముగిసిపోతుంది కాబట్టి మాస్క్‌లు వేసుకొని ఆడామంతే. ► కరోనా విరామం సమయంలో మూడు ఆన్లైన్ టోర్నీల్లో పాల్గొన్నాను. అయితే అవి నాకు సంతృప్తినివ్వలేదు. కంప్యూటర్ ముందు కూర్చుంటే పోటీ పడుతున్నట్లుగా అనిపించలేదు. ఆన్లైన్ ఆడగలిగే అవకాశం చెస్‌కు ఉన్నా... ఎదురుగా మరో ఆటగాడు కూర్చొని ఉంటేనే ఆ అనుభూతి లభిస్తుంది. ప్రత్యర్థిని చూస్తూ, అతని ముఖకవళికలను పరిశీలించడం కూడా చెస్ వ్యూహప్రతివ్యూహాల్లో భాగమే. అందుకే బీల్ నిర్వాహకులు పిలవగానే ఆడేందుకు సిద్ధమయ్యా. ► మొత్తంగా బీల్ టోర్నీ భిన్నమైన అనుభవమే అయినా మరీ కొత్తగా అనిపించలేదు. ఇప్పుడు సంతృప్తిగా వెనుదిరుగుతున్నా. ఇప్పుడు ఒలింపియాడ్ కోసం సన్నద్ధమవుతా. భారత్ ఉన్న గ్రూప్ మ్యాచ్‌లు ఆగస్టు 19 నుంచి ఉన్నాయి కాబట్టి నాకు తగినంత సమయం ఉంది. ఒలింపియాడ్ కూడా తొలిసారి ఆన్లైన్లో నిర్వహించబోతున్నారు. జట్టుగా ఇది ఎలా ఉండబోతోందో అని నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. -
విజేత ఉషెనినా
చెన్నై: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల స్పీడ్ చెస్ ఆన్లైన్ చాంపియన్‌షిప్ తొలి అంచె టోర్నీలో ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ అనా ఉషెనినా విజేతగా నిలిచింది. వాలెంటినా గునీనా (రష్యా)తో ఆదివారం జరిగిన ఫైనల్లో ఉషెనినా 7–4తో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఉషెనినాకు 12 గ్రాండ్‌ప్రి పాయింట్లతోపాటు 3 వేల డాలర్ల (రూ. 2 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఈ టోర్నీలో భారత్ తరఫున హంపి, వైశాలి బరిలోకి దిగారు. -
హరికృష్ణకు నిరాశ
చెన్నై: చెసేబుల్ మాస్టర్స్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు నిరాశ ఎదురైంది. గ్రూప్ ‘ఎ’ లీగ్ దశ గేమ్‌లు ముగిశాక హరికృష్ణ మొత్తం మూడు పాయింట్లతో తన గ్రూప్‌లో చివరిదైన ఆరో స్థానంలో నిలిచి నిష్క్రమించాడు. ఆరో రౌండ్లో హరికృష్ణ 47 ఎత్తుల్లో వ్లాదిస్లావ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. ఏడో రౌండ్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో గేమ్‌ను 67 ఎత్తుల్లో; ఎనిమిదో రౌండ్లో డానిల్ దుబోవ్ (రష్యా)తో గేమ్‌ను 36 ఎత్తుల్లో; తొమ్మిదో రౌండ్లో హికారు నకముర (అమెరికా)తో గేమ్‌ను 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ చివరిదైన పదో రౌండ్లో 30 ఎత్తుల్లో అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా) చేతిలో ఓటమి పాలయ్యాడు. గ్రూప్ ‘ఎ’లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన కార్ల్సన్, వ్లాదిస్లావ్, నకముర, గ్రిషుక్... గ్రూప్ ‘బి’లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన మాక్సిమి లాగ్రేవ్ (ఫ్రాన్స్), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), కరువానా (అమెరికా), లిరెన్ డింగ్ (చైనా) నాకౌట్ దశకు అర్హత సాధించారు. -
ఎస్పీఎఫ్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నీ విజేత ప్రియాంక
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: ప్రపంచ మహిళల చెస్ మాజీ చాంపియన్, గ్రాండ్‌మాస్టర్ సుసాన్ పోల్గర్ ఫౌండేషన్ (ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఆన్లైన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి నూతక్కి ప్రియాంక విజేతగా నిలిచింది. ప్రస్తుతం మహిళా అంతర్జాతీయ మాస్టర్ (డబ్ల్యూఐఎం) హోదా కలిగిన ఈ విజయవాడ అమ్మాయి అర్మేనియా అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) అనా సార్గిసియాన్‌తో జరిగిన అర్మగెడాన్ గేమ్‌లో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. విజేత హోదాలో 18 ఏళ్ల ప్రియాంకకు అమెరికాలోని వెబ్‌స్టెర్ యూనివర్సిటీకి చెందిన 60 వేల డాలర్ల స్కాలర్షిప్ లభించింది. 600 డాలర్ల ప్రైజ్‌మనీ గెల్చుకోవడంతోపాటు ఈ ఏడాది అమెరికాలోనే జరిగే స్పైస్ కప్ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. చిరుప్రాయం నుంచే చెస్‌లో రాటుదేలిన ప్రియాంక గతంలో అండర్–10 బాలికల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అండర్–9, అండర్–11, అండర్–13 విభాగంలో జాతీయ చాంపియన్‌షిప్ టైటిల్స్ సొంతం చేసుకుంది. -
హరికృష్ణకు మిశ్రమ ఫలితాలు
న్యూఢిల్లీ: చెసేబుల్ మాస్టర్స్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు మిశ్రమ ఫలితాలు లభించాయి. టోర్నీ రెండో రోజు ఆదివారం హరికృష్ణ ఒక గేమ్‌ను ‘డ్రా’గా ముగించి, మరో గేమ్‌లో గెలిచాడు. తొలి రోజు ఆడిన మూడు గేముల్లోనూ ఓడిపోయిన హరికృష్ణ నాలుగో రౌండ్ గేమ్‌లో హికారు నకముర (అమెరికా)తో 60 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 28 ఎత్తుల్లో విజయం సాధించాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు ఉన్న గ్రూప్ ‘ఎ’లో హరికృష్ణ ఒకటిన్నర పాయింట్లతో చివరిస్థానంలో ఉన్నాడు. గ్రూప్ ‘బి’లో మరో ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు ఉన్నారు. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ గేమ్‌లు పూర్తయ్యాక రెండు గ్రూపుల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన వారు క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశకు అర్హత సాధిస్తారు. రెండో విడత గేమ్‌లు మిగిలి ఉండటంతో హరికృష్ణకు నాకౌట్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. -
ఆన్లైన్లో అంతర్జాతీయ చెస్ టోర్నీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే), చెస్.కామ్ సంయుక్త ఆధ్వర్యంలో దిగ్గజ చెస్ క్రీడాకారులతో కూడిన ఆరు జట్ల మధ్య ఆన్లైన్లో నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. మే 5 నుంచి 10 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్, రష్యా, యూరప్, చైనా, అమెరికా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ జట్లు పాల్గొంటాయి. ర్యాపిడ్ ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో ముందుగా డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ తర్వాత తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య 10న సూపర్ ఫైనల్ జరుగుతుంది. ప్రతి జట్టులో నలుగురు ఆటగాళ్లు ఉంటారు. ఇందులో ఒక మహిళా క్రీడాకారిణికి స్థానం తప్పనిసరి. మొత్తం లక్షా 80 వేల డాలర్ల (రూ. కోటీ 38 లక్షలు) ప్రైజ్‌మనీతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. చెస్ దిగ్గజాలు, ప్రపంచ మాజీ చాంపియన్స్ గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథన్ ఆనంద్, వ్లాదిమిర్ క్రామ్నిక్ తదితరులు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. -
కెయిన్స్ చాంపియన్‌గా హంపి
సెయింట్ లూయిస్ (అమెరికా): గతేడాది చివర్లో ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో విశ్వవిజేతగా అవతరించిన భారత నంబర్‌వన్ చెస్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి.. ఈ ఏడాది తొలి టైటిల్‌ను సాధించారు. కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో హంపి విజేతగా నిలిచారు. తొమ్మిదిరౌండ్ల తర్వాత ఆరు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో భాగంగా సహచర క్రీడాకారిణి ద్రోణవల్లి హారికతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న హంపి టైటిల్‌ను గెలుచుకున్నారు. దాంతో ఐదు రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకున్న హంపి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి రెండో స్థానాన్ని సాధించారు. టైటిల్ గెలిచిన తర్వాత హంపి మాట్లాడుతూ.. ‘కెయిన్స్ కప్ సాధించడం ఒక సరికొత్త అనుభూతిని తీసుకొచ్చింది. నేను వరల్డ్ చాంపియన్‌గా బరిలోకి దిగినా అది నాపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు. ఏడో రౌండర్లో అలెగ్జాండర్ కౌస్టినియక్తో జరిగిన మ్యాచ్ చాలా కఠినంగా జరిగింది. అయినా ఆమెపై ఉన్న విజయాల రికార్డును కొనసాగించి గెలుపును అందుకున్నాను. అదే నేను టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది’ అని హంపి తెలిపారు. ఇక హారిక 4.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. -
ఆధిక్యంలో హంపి
సెయింట్ లూయిస్ (అమెరికా): ఈ ఏడాది తొలి టైటిల్‌కు ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్, భారత మహిళల నంబర్‌వన్ కోనేరు హంపి విజయం దూరంలో ఉంది. కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఎనిమిదో రౌండ్ తర్వాత హంపి 5.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచింది. వాలెంటినా గునీనా (రష్యా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హంపి 35 ఎత్తుల్లో విజయం సాధించింది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో హంపి తలపడుతుంది. ఈ గేమ్‌లో హంపి గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా విజేతగా అవతరిస్తుంది. మరోవైపు హారిక ఈ టోర్నీలో ఆరో ‘డ్రా’ నమోదు చేసుకుంది. హారిక ప్రపంచ మాజీ చాంపియన్ మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను హారిక 58 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఎనిమిదో రౌండ్ తర్వాత హంపి 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఐదు పాయింట్లతో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) రెండో స్థానంలో, 4.5 పాయింట్లతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ (చైనా), మరియా ముజిచుక్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. నాలుగు పాయింట్లతో హారిక ఆరో స్థానంలో ఉంది. పాయింట్ల పరంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అగ్రస్థానంలో నిలిస్తే ప్లే ఆఫ్ గేమ్‌ల (ర్యాపిడ్, బ్లిట్జ్, అర్మగెడాన్) ద్వారా ఏకైక విజేతను నిర్ణయిస్తారు. -
రన్నరప్ హంపి
మోంటెకార్లో: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 7 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 5.5 పాయింట్లతో ఆరో స్థానాన్ని సంపాదించింది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి 7 పాయింట్లతో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా), అలెగ్జాండ్రా గొర్యాచికినా (రష్యా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే టోర్నీ టైబ్రేక్ నిబంధనల ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... కొస్టెనిక్ విజేతగా నిలిచింది. హంపి రన్నరప్‌గా నిలువగా... గొర్యాచికినా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌లో గొర్యాచికినాపై హంపి 68 ఎత్తుల్లో గెలిచింది. అంతకుముందు వాలెంటినా గునీనా (రష్యా), మరియా ముజిచుక్ (ఉక్రెయిన్), జావో జుయ్ (చైనా)లపై కూడా నెగ్గిన హంపి... హారిక (భారత్), నానా జాగ్‌నిద్జె (జార్జియా), అనా ముజిచుక్ (ఉక్రెయిన్), కాటరీనా లాగ్నో (రష్యా), కొస్టెనిక్ (రష్యా), పియా క్రామ్లింగ్ (స్వీడన్)లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ఎలిజబెత్ పాట్జ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. ఓవరాల్‌గా హంపి నాలుగు గేముల్లో గెలిచి, ఆరింటిని ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడింది. హారిక 11 గేములు ఆడి మూడింటిలో (ఎలిజబెత్, గునీనా, మరియాలపై) విజయం సాధించింది. నానా జాగ్‌నిద్జె, పియా క్రామ్లింగ్, అనా ముజిచుక్, హంపి, లాగ్నోలతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హారిక... గొర్యాచికినా, కొస్టెనిక్, జావో జుయ్లతో జరిగిన మూడు గేముల్లో ఓడిపోయింది. నాలుగు గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నమెంట్లలో భాగంగా రెండు టోర్నీలు ముగిశాక హంపి మొత్తం 293 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. గత సెప్టెంబర్‌లో రష్యాలో జరిగిన తొలి గ్రాండ్‌ప్రి టోర్నీలో హంపి విజేతగా నిలిచింది. గ్రాండ్‌ప్రి సిరీస్‌లో మొత్తం 15 మంది క్రీడాకారిణులు గరిష్టంగా మూడు టోర్నీల్లో ఆడతారు. ఇప్పటికే రెండు టోర్నీలు ఆడిన హంపి వచ్చే ఏడాది మే నెలలో ఇటలీలో జరిగే చివరిదైన నాలుగో గ్రాండ్‌ప్రి టోర్నీలో పాల్గొంటుంది. హారిక మాత్రం వచ్చే ఏడాది మార్చిలో స్విట్జర్లాండ్‌లో జరిగే మూడో గ్రాండ్‌ప్రి టోర్నీలో ఆడుతుంది. ప్రస్తుతం హారిక 120 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో ఉంది. టాప్–2లో నిలిచిన వారు క్యాండిడేట్ చెస్ టోర్నీకి అర్హత సాధిస్తారు. క్యాండిడేట్ టోర్నీ విజేత ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ప్రస్తుత మహిళల ప్రపంచ చాంపియన్‌తో 12 గేమ్‌లు ఆడుతుంది. -
హరికృష్ణ ఖాతాలో వరుసగా నాలుగో విజయం
షెన్జెన్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తన విజయపరంపర కొనసాగిస్తున్నాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో మంగళవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 43 ఎత్తుల్లో దిమిత్రీ జకొవెంకో (రష్యా)పై గెలుపొందాడు. ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్ తర్వాత హరికృష్ణ 4.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉన్నాడు. నాలుగు పాయింట్లతో అనీశ్ గిరి (నెదర్లాండ్స్) రెండో స్థానంలో... మూడు పాయింట్లతో లిరెన్ డింగ్ (చైనా) మూడో స్థానంలో ఉన్నారు. -
హరికృష్ణకు మూడో గెలుపు
న్యూఢిల్లీ: షెన్జెన్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ వరుసగా మూడో విజయం సాధించాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం యు యాంగి (చైనా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 76 ఎత్తుల్లో గెలుపొందాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. ఐదో రౌండ్ తర్వాత హరికృష్ణ 3.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలోకి వచ్చాడు. నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనీశ్ గిరి మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. -
హరికృష్ణకు తొలి గెలుపు
న్యూఢిల్లీ: షెన్జెన్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి విజయం నమోదు చేశాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో హరికృష్ణ 55 ఎత్తుల్లో రిచర్డ్ రాపోర్ట్ (హంగేరి)పై గెలిచాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. దిమిత్రీ జకోవెంకో (రష్యా)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... రెండో రౌండ్ గేమ్‌లో 40 ఎత్తుల్లో అనీశ్ గిరి (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడ -
కార్తీక్‌కు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: బ్యాంకాక్ చెస్ క్లబ్ ఓపెన్ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ మూడో స్థానాన్ని సంపాదించాడు. థాయ్‌లాండ్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో తిరుపతికి చెందిన 20 ఏళ్ల కార్తీక్ ఏడు పాయింట్లు సాధించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో కార్తీక్‌తోపాటు మరో ముగ్గురు కూడా ఏడు పాయింట్లు సాధించారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా కార్తీక్‌కు మూడో స్థానం ఖాయమైంది. 17 గ్రాండ్మాస్టర్లతో కలిపి మొత్తం 150 మంది పాల్గొన్న ఈ టోర్నీలో భారత్‌కే చెందిన దీప్‌సేన్ గుప్తా, జాన్ గుస్తాఫ్సన్ (జర్మనీ) 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. టైబ్రేక్ ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా గుస్తాఫ్సన్ చాంపియన్‌గా అవతరించాడు. దీప్‌సేన్ గుప్తా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు 6.5 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. -
చెన్నై కుర్రాడు... చరిత్రకెక్కాడు
చెన్నై: తమిళనాడు కుర్రాడు డి.గుకేశ్ పన్నెండేళ్ల వయసులోనే గ్రాండ్‌మాస్టర్ హోదాతో రికార్డులకెక్కాడు. 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో ఈ ఘనత సాధించిన అతిపిన్న భారతీయ గ్రాండ్‌మాస్టర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. తన రాష్ట్ర సహచరుడు ఆర్.ప్రజ్ఞానంద జూన్‌లో సాధించిన రికార్డు (12 ఏళ్ల 10 నెలల వయసులో)ను ఏడాది తిరగకుండానే చెరిపేశాడు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో మంగళవారం తొమ్మిదో రౌండ్లో డి.కె.శర్మను ఓడించడం ద్వారా గుకేశ్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందాడు. మొత్తం మీద భారత చదరంగ క్రీడాకారుల్లో అతను 59వ జీఎం. 2002లో ఉక్రెయిన్‌కు చెందిన సెర్గీ కర్యాకిన్ 12 ఏళ్ల ఏడు నెలల వయసులో సాధించిన జీఎం ఘనత ప్రపంచ అతిపిన్న రికార్డు కాగా, గుకేశ్ కేవలం 17 రోజుల తేడాతో ఆ రికార్డుకు దూరమయ్యాడు. నిజానికి గత నెలలోనే గుకేశ్‌కు ‘ప్రపంచ రికార్డు’ అవకాశం వచ్చినా... తృటిలో చేజార్చుకున్నాడు. డిసెంబర్లో జరిగిన బార్సిలోనా టోర్నీలో అతను మూడో రౌండ్లో ఇటలీ గ్రాండ్‌మాస్టర్ డానియెల వొకటురో (ఇటలీ) చేతిలో ఓడిపోవడంతో మూడో జీఎం నార్మ్‌తో పాటు ‘ప్రపంచ అతిపిన్న’ ఘనత చేజారింది. తిరిగి నెల వ్యవధిలోనే తమిళ తంబి తన ఎత్తులకు పదును పెట్టాడు. తల్లిదండ్రులతో ఆడుతూనే... ఎత్తులు–పైఎత్తులతో ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తున్న ఈ చిచ్చర పిడుగు ‘చెస్’ నేపథ్యం కేవలం ఓ ‘ఆటవిడుపు’గా మొదలైంది. గుకేశ్ తల్లి పద్మ, తండ్రి రజినీకాంత్ ఇద్దరూ వైద్యులే. వాళ్లిద్దరు ఇంట్లో ఆడుతుంటే చూసిన చిన్నారి గుకేశ్ సరదాగా ఎత్తులు వేశాడు. ఆ తర్వాత తల్లిదండ్రులతో దీటుగా పోటీపడ్డాడు. అతని ఎత్తులకు, ఓర్పుగా దెబ్బతీసే పైఎత్తులకు వాళ్లిద్దరూ అబ్బురపడేవారు. అతని ఆసక్తిని ఆటవిడుపుకే పరిమితం కాకుడదని భావించిన తల్లిదండ్రులు తమ చిన్నారిని చెస్ అకాడమీలో చేర్పించారు. ఇక అక్కడ్నుంచి ఆట కాస్త చెస్ బాట అయ్యింది. ఇక ఆనంద్ సర్‌తో ఆడతా చాలా సంతోషంగా ఉంది. గ్రాండ్మాస్టరైనందుకు ఎంతో ఉద్విగ్నంగా ఉంది. మూడో జీఎం నార్మ్‌తో పాటు గ్రాండ్‌మాస్టర్ టైటిల్ దక్కింది. ఇక విశ్వనాథన్ ఆనంద్ సర్‌తో తలపడాలనుకుంటున్నా. ఈ గేమ్ (9వరౌండ్)కు ముందు నేనేమీ ఒత్తిడిని ఎదుర్కోలేదు. అయితే ఆటమధ్యలో కాస్త ఎదురైనప్పటికీ ఆటపైనే దృష్టిపెట్టి ముందడుగు వేశాను. స్పెయిన్ (బార్సిలోనా)లోనే కర్యాకిన్ రికార్డును చెరిపేసే అవకాశం చేజార్చినందుకు నిరాశగా ఉంది. ఆ తర్వాత ముంబై టోర్నీలోను సాంకేతిక కారణాల వల్ల ప్రపంచ రికార్డును కోల్పోయాను’ – గుకేశ్ -
రన్నరప్ హరికృష్ణ
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్ర ప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఆదివారం ముగిసిన ఈ ర్యాపిడ్ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హరికృష్ణ 5.5 పాయింట్లతో లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే టైబ్రేక్ ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... ముఖాముఖి పోరులో అరోనియన్‌పై హరికృష్ణ గెలిచినందుకు హరికృష్ణకు రెండో స్థానం ఖాయమైంది. అరోనియన్ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఆదివారం జరిగిన మూడు గేముల్లో హరికృష్ణ రెండింటిలో గెలిచి, ఒకదాంట్లో ఓడిపోయాడు. సెర్గీ కర్జాకిన్ (రష్యా)తో జరిగిన ఏడో గేమ్‌లో హరికృష్ణ 53 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. అయితే ఎనిమిదో గేమ్‌లో హరికృష్ణ 95 ఎత్తుల్లో అరోనియన్‌పై... చివరిదైన తొమ్మిదో గేమ్‌లో అతను 37 ఎత్తుల్లో విదిత్ (భారత్)పై గెలిచాడు. 6 పాయింట్లతో హికారు నకముర (అమెరికా) చాంపియన్‌గా నిలిచాడు. ఇతర భారత ఆటగాళ్లు విశ్వనాథన్ ఆనంద్, విదిత్, నిహాల్ సరీన్, సూర్యశేఖర గంగూలీ వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. విజేత నకమురకు 10 వేల డాలర్లు (రూ. 7 లక్షల 26 వేలు), రన్నరప్ హరికృష్ణకు 5 వేల డాలర్లు (రూ. 3 లక్షల 63 వేలు), అరోనియన్‌కు 4 వేల డాలర్లు (రూ. 2 లక్షల 90 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సోమవారం విశ్రాంతి దినం తర్వాత మంగళ, బుధ వారాల్లో 18 రౌండ్ల బ్లిట్జ్ టోర్నీ జరుగుతుంది. -
అర్జున్‌కు రెండో గెలుపు
న్యూఢిల్లీ: అబుదాబి మాస్టర్స్ చెస్ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ యువతార ఎరిగైసి అర్జున్ వరుసగా రెండో విజయం నమోదు చేశాడు. బుధవారం అబుదాబిలో జరిగిన రెండో గేమ్‌లో అర్జున్ 36 ఎత్తుల్లో భారత్‌కే చెందిన రక్షితపై గెలుపొందాడు. తొలి రౌండ్లో అర్జున్ 34 ఎత్తుల్లో దుష్యంత్ శర్మను ఓడించాడు. తెలంగాణకే చెందిన హర్ష భరతకోటి, రాజా రిత్విక్ విశేష ప్రతిభ కనబరిచారు. తొలి రౌండ్లో మిచెల్లి కాథరీనాపై రాజా రిత్విక్ గెలిచి... రొమేనియా గ్రాండ్‌మాస్టర్ కాన్స్టన్టిన్తో జరిగిన రెండో గేమ్‌ను ‘డ్రా’గా ముగించడం విశేషం. మరోవైపు మూడో జీఎం నార్మ్ సాధించాలనే పట్టుదలతో ఉన్న హర్ష తొలి రౌండ్లో లియోన్ ల్యూక్‌ను ఓడించి... అర్మేనియా గ్రాండ్‌మాస్టర్ గాబ్రియేల్ సర్గాసియాన్తో జరిగిన రెండో గేమ్‌ను 49 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు తొలి గేమ్‌లో వంతిక అగర్వాల్‌పై గెలిచి... రాహుల్‌తో జరిగిన రెండో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. -
ఆనంద్‌కు మరో ‘డ్రా’
స్టావెంజర్ (నార్వే): ఆల్టిబాక్స్ నార్వే అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా నాలుగో ‘డ్రా’ నమోదు చేశాడు. సో వెస్లీ (అమెరికా)తో శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన ఆనంద్ 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత ఆనంద్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. శనివారం జరిగే ఐదో రౌండ్లో ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ (నార్వే)తో ఆనంద్ ఆడతాడు. ఈ టోర్నీలో గురువారం విశ్రాంతి రోజు కావ డంతో మొత్తం పది మంది ఆటగాళ్లను ఐదు గ్రూప్‌లుగా విభజించి సరదాగా వంటల పోటీ నిర్వహించారు. ఇందులో ఆనంద్–లిరెన్ డింగ్ (చైనా) జంట చేసిన వంటకానికి ప్రథమ బహుమతి లభించింది. -
అర్జున్ సంచలనం
కోల్‌కతా: కోల్‌కతా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ సంచలనం సృష్టించాడు. గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబుపై అద్భుత విజయం సాధించాడు. సోమవారం జరిగిన ఎనిమిదో రౌండ్లో తెల్లపావులతో ఆడిన 15 ఏళ్ల అర్జున్ కేవలం 23 ఎత్తుల్లో లలిత్ బాబు ఆట కట్టించి ఈ టోర్నీలో ఆరో విజయం నమోదు చేశాడు. మరో గేమ్‌లో తెలంగాణకే చెందిన హర్ష భరతకోటి 49 ఎత్తుల్లో ఆరాధ్య గార్గ్‌ను ఓడించాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత అర్జున్ 6.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో... హర్ష 6 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. నేడు చివరి రౌండ్ గేమ్‌లు జరుగుతాయి. -
లలిత్‌కు మూడో గెలుపు
కోల్‌కతా: కోల్‌కతా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు మూడో విజయం నమోదు చేశాడు. నితిన్ (రైల్వేస్)తో ఆదివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన లలిత్ 34 ఎత్తుల్లో గెలుపొందాడు. రత్నాకరన్ (భారత్)తో జరిగిన మరో గేమ్‌లో తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్ 42 ఎత్తుల్లో విజయం సాధించాడు. హర్ష భరతకోటి, రవితేజ మధ్య జరిగిన గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఏడో రౌండ్ తర్వాత లలిత్, అర్జున్ 5.5 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. -
హర్ష భరతకోటి ‘హ్యాట్రిక్’ గెలుపు
కోల్‌కతా: కోల్‌కతా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ ప్లేయర్ హర్ష భరతకోటి వరుసగా మూడో విజయం నమోదు చేశాడు. ప్రసాద్ (భారత్)తో శుక్రవారం జరిగిన ఐదో రౌండ్లో హర్ష 58 ఎత్తుల్లో గెలుపొందాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో హర్షకిది నాలుగో విజయం. ఫహాద్ (బంగ్లాదేశ్)తో జరిగిన మరో గేమ్‌లో తెలంగాణకే చెందిన ఎరిగైసి అర్జున్ 45 ఎత్తుల్లో నెగ్గాడు. ఐదో రౌండ్ తర్వాత హర్ష, అర్జున్ 4 పాయింట్లతో మరో 13 మందితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. -
అండర్–14 చాంప్స్ అర్జున్, జిషిత
సాక్షి, హైదరాబాద్: ముంబై ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జిషిత ఆకట్టుకున్నారు. అండర్–14 ఓపెన్ విభాగంలో అర్జున్... అండర్–14 బాలికల విభాగంలో జిషిత అగ్రస్థానాన్ని సంపాదించారు. ముంబైలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో అర్జున్ తొమ్మిది రౌండ్లకుగాను 6.5 పాయింట్లు సంపాదించి ఓవరాల్‌గా 16వ స్థానంలో... తన విభాగంలో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. నాలుగు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని ఈ టోర్నీలో అర్జున్ అజేయంగా నిలిచాడు. జిషిత 5.5 పాయింట్లు సంపాదించింది. ఆమె ఐదు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మూడు గేముల్లో ఓడిపోయింది. అండర్–14 ఓపెన్ విభాగంలో హైదరాబాద్‌కే చెం దిన రాజా రిత్విక్ 6 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. అండర్–20 బాలికల విభాగం లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బొడ్డ ప్రత్యూష ఆరు పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. -
ప్రపంచ చాంపియన్ కార్ల్‌సన్‌ను నిలువరించిన విదిత్
ఐల్ ఆఫ్ మ్యాన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి నిలకడగా రాణిస్తున్నాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో శుక్రవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను విదిత్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రస్తుతం విదిత్ 5.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు క్రామ్నిక్ (రష్యా)తో జరిగిన గేమ్‌లో హారిక 53 ఎత్తులో ఓడిపోయింది. -
హర్ష సంచలనం
సాక్షి, హైదరాబాద్: ఐల్ ఆఫ్ మ్యాన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ హర్ష భరత్‌కోటి సంచలనం సృష్టించాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో... భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్, 2670 ఎలో రేటింగ్ కలిగిన ఆదిబన్తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా, 2394 ఎలో రేటింగ్ ఉన్న హర్ష కేవలం 40 ఎత్తుల్లో విజయం సాధించాడు. అయితే భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతితో జరిగిన ఆరో రౌండ్లో హర్ష 42 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఆరో రౌండ్ తర్వాత హర్ష నాలుగు పాయింట్లతో 17వ ర్యాంక్‌లో ఉన్నాడు. -
కాపాబ్లాంకా స్మారక చెస్ టోర్నీ విజేత శశికిరణ్
చెన్నై: ప్రపంచ మాజీ చాంపియన్ కాపాబ్లాంకా (క్యూబా) స్మారకార్థం నిర్వహించిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ కృష్ణన్ శశికిరణ్ విజేతగా నిలిచాడు. క్యూబాలోని వారాడెరోలో ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరిగింది. పది రౌండ్ల తర్వాత శశికిరణ్ 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టోర్నీ లో శశికిరణ్ మూడు గేముల్లో గెలిచి, ఏడింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. తద్వారా 1962 నుంచి జరుగుతోన్న కాపాబ్లాంకా చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా శశికిరణ్ గుర్తింపు పొందాడు. -
హారికకు మూడో విజయం
న్యూఢిల్లీ: ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రాంట్ అరాఖమియా (స్కాట్లాండ్)తో బుధవారం జరిగిన ఐదో రౌండ్లో హారిక 30 ఎత్తుల్లో గెలిచింది. ప్రస్తుతం హారిక ఖాతాలో 3.5 పారుుంట్లు ఉన్నారుు. మరోవైపు మాస్కోలో జరుగుతున్న తాల్ స్మారక చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఖాతాలో ఐదో ‘డ్రా’ చేరింది. ఇయాన్ నెపోమ్నియాచి (రష్యా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేశాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత ఆనంద్ 4.5 పారుుంట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. -
మెదడుకు పదును పెడితేనే విజయం
– అంతర్జాతీయ రేటింగ్ చెస్ టోర్నీ విజేత హైదరాబాద్ కుర్రాడు – ముగిసిన అంతర్జాతీయ రేటింగ్ చెస్ టోర్నమెంట్ ధర్మవరం అర్బన్ : చదరంగం ఆట మొత్తం మేథాశక్తితో కూడుకున్నది.. మెదడుకు పదును పెడితే విజయం వరిస్తుందని ఏపీ చెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వైడీ రామారావు తెలిపారు. పట్టణంలోని ఆర్యవైశ్య కొత్త సత్రంలో శ్రీసత్యసాయి ఫిడే ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. టోర్నీలో ఓపెన్ క్యాటగిరిలో హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారుడు షణ్ముఖతేజ 9 పాయింట్లకు 8.5 పాయింట్లు సాధించి, మొదటి బహుమతి సాధించాడు. రూ.30 వేల నగదుతోపాటు ట్రోపీని ఏపీ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు, టోర్నమెంట్ ఆర్గనైజర్ శింగనమల రామకష్ణ, యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు పోలా ప్రభాకర్, కార్యదర్శి వై.కె.శ్రీనివాసులు, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు ఈశ్వరప్ప, టెన్నికాయిట్ రాష్ట్ర కార్యదర్శి ముస్తఫ అలీఖాన్, చెన్నేకొత్తపల్లి మండల ఎన్జీవో సంఘం అధ్యక్షుడు నారాయణస్వామి, చీఫ్ అడ్వయిజర్ బీవీ ప్రకాష్, కోచ్ జాకీర్‌హుసేన్ చేతులమీదుగా బహుమతులను అందజేశారు. అన్‌రేటెడ్ బహుమతిని ధర్మవరానికి చెందిన నాగశేషుకు రూ.5 వేలు నగదు, ట్రోపీని అందించారు. 13 జిల్లాల క్రీడాకారులతోపాటు 10 రాష్ట్రాల నుంచి 354 మంది చెస్ క్రీడాకారులు టోర్నీలో పాల్గొన్నారు. మొత్తం బహుమతులు విలువ రూ.2.18 లక్షలుకాగా నగదు బహుమతులు 64 మందికి, 11 ట్రోపీలను యువర్స్‌ఫౌండేషన్ సహకారంతో అందించారు. కార్యక్రమానికి ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ హాజరై మాట్లాడారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రామారావుతో కలిసి ఎమ్మెల్యే చెస్ ఆడారు. ప్రథమ బహుమతి షణ్ముఖతేజ (తెలంగాణా), ద్వితీయ బహుమతి సాల్మన్(ఆంధ్రప్రదేశ్), తతీయ బహుమతి పవన్ తేజ (తెలంగాణ), నాల్గవ బహుమతి గౌరవ్‌శర్మ(ఉత్తరప్రదేశ్), ఐదో బహుమతి సూర్యప్రకాష్(తమిళనాడు), ఆరో బహుమతి రంజిత్ కలియరసన్(తమిళనాడు), ఏడో బహుమతి శ్రీశైలం చంద్రమోహన్(ఆంధ్రప్రదేశ్, ధర్మవరం), 8వ బహుమతి కబిల్(తమిళనాడు), 9వ బహుమతి రజత్‌యాదవ్ (మధ్యప్రదేశ్), 10వ బహుమతి విశ్వనాథ్‌కన్నమ్ (తెలంగాణ)లు బహుమతులను కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హేమాద్రి, లెక్చరర్ సోమశేఖర్‌ప్రసాద్, పురుషోత్తం, ఆదిరత్నం, గజేంద్రన్ పాల్గొన్నారు. -
హరికృష్ణ జోరు
హుఅయాన్ (చైనా): ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఐఎంఎస్‌ఏ) ఎలైట్ మైండ్‌గేమ్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ బ్లిట్జ్ ఈవెంట్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలిరోజు ఆదివారం 10 రౌండ్లు పూర్తయ్యాక రెండో స్థానంలో నిలిచిన హరికృష్ణ... సోమవారం 20 రౌండ్లు ముగిశాక రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం హరికృష్ణ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. రెండో రోజు జరిగిన 10 రౌండ్ల గేముల్లో హరికృష్ణ నాలుగింటిలో గెలిచి, ఐదింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. మహిళల బ్లిట్జ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 20 రౌండ్ల తర్వాత 9.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. మంగళవారం మరో 10 రౌండ్లు జరుగుతాయి. -
రెండో స్థానంలో హరికృష్ణ
హుఅయాన్ (చైనా): ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఐఎంఎస్‌ఏ) ఎలైట్ మైండ్‌గేమ్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ బ్లిట్జ్ ఈవెంట్లో రాణించాడు. ఆదివారం 10 రౌండ్లు ముగిశాక హరికృష్ణ ఏడు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రికృష్ణ ఆరు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. మరో గేమ్‌లో ఓడిపోయాడు. సోమవారం మరో పది రౌండ్లు, మంగళవారం మిగతా పది రౌండ్లు జరుగుతాయి. మహిళల బ్లిట్జ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 10 రౌండ్ల తర్వాత 4.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. -
హారికకు కాంస్య పతకం
లింజెన్ (జర్మనీ): లెవ్ గుట్మన్ జూబ్లీ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కాంస్య పతకాన్ని సాధించింది. బుధవారం ముగిసిన ఈ తొమ్మిది రౌండ్ల టోర్నమెంట్లో హారిక ఐదు పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్లతోపాటు ఫిడే మాస్టర్ (ఎఫ్ఎం), ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) పాల్గొన్న ఈ టోర్నీలో హారిక రెండు గేముల్లో నెగ్గి, ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయింది. హారికతోపాటు హెమన్ (జర్మనీ), అలెగ్జాండర్ (రష్యా), విక్టర్ (ఇజ్రాయెల్) కూడా ఐదు పాయింట్లు సంపాదించినా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హారికకు మూడో స్థానం ఖాయమైంది. ఆరు పాయింట్లతో స్టెలియోస్ (గ్రీస్), అలోన్ గ్రీన్ఫెల్డ్ (ఇజ్రాయెల్) సంయుక్త విజేతలుగా నిలిచారు. -
ఆనంద్‌కు మరో డ్రా
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్యూ ఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు వరుసగా ఆరోసారి డ్రా ఎదురైంది. టోర్నీలో టాపర్‌గా ఉన్న లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో జరిగిన ఎనిమిదో రౌండ్లో ఆనంద్ 31 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. తొలి రెండు రౌండ్లలో పరాజయాలను ఎదుర్కొన్న ఆనంద్ ప్రస్తుతం మూడు పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇక చివరి రౌండ్లో తను ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఎదుర్కోనున్నాడు. -
ఆనంద్‌కు మళ్లీ డ్రా
సెయింట్ లూయిస్ : సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. ఆదివారం నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనిష్ గిరితో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ రౌండ్ అనంతరం విషీ రెండు పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. నల్లపావులతో ఆడిన ఆనంద్‌కు ఈ టోర్నీలో పెద్దగా కలిసి రావడం లేదు. తొలి రెండు గేమ్‌ల్లో ఓడిన అతను తర్వాత డ్రాలతో సరిపెట్టుకుంటున్నాడు. మరోవైపు తెల్లపావులతో గిరి.. స్లావ్ డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇతర గేమ్‌ల్లో లాగ్రావి (ఫ్రాన్స్-3.5)... తపలోవ్ (బల్గేరియా-3)పై; నకమురా (అమెరికా-3.5)... వెస్లీ సో (అమెరికా-1.5)పై; గ్రిస్చుక్ (రష్యా-3)... కరుణ (అమెరికా-2)పై నెగ్గగా; ఆరోనియన్ (ఆర్మేనియా-4)... కార్ల్సన్ (నార్వే-4)ల మధ్య గేమ్ డ్రాగా ముగిసింది. -
ఆనంద్‌కు రెండో పరాజయం
సెయింట్ లూయిస్ (అమెరికా) : సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూశాడు. అలెగ్జాండర్ గ్రిష్చుక్ (రష్యా)తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 35 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఇతర గేముల్లో వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా) 73 ఎత్తుల్లో హికారు నకముర (అమెరికా)పై, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) 40 ఎత్తుల్లో ఫాబియానో (అమెరికా)పై గెలుపొందగా... మాక్సిమి లాగ్రేవ్ (ఫ్రాన్స్)- అరోనియన్ (అర్మేనియా); అనీష్ గిరి (నెదర్లాండ్స్)-సో వెస్లీ (అమెరికా)ల మధ్య జరిగిన గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. -
రన్నరప్ ఆనంద్
షామ్‌కిర్ (అజర్బైజాన్): వుగార్ గషిమోవ్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో ఆనంద్ ఆరు పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) ఏడు పాయిం ట్లతో విజేతగా అవతరించాడు. కరువానా (ఇటలీ)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 36 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. 10 మంది మేటి గ్రాం డ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ అజేయంగా నిలిచాడు. ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఈ ప్రపంచ రెండో ర్యాంకర్ మిగతా మూడు గేముల్లో గెలుపొందాడు.