
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే), చెస్.కామ్ సంయుక్త ఆధ్వర్యంలో దిగ్గజ చెస్ క్రీడాకారులతో కూడిన ఆరు జట్ల మధ్య ఆన్‌లైన్‌లో నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. మే 5 నుంచి 10 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్, రష్యా, యూరప్, చైనా, అమెరికా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ జట్లు పాల్గొంటాయి. ర్యాపిడ్ ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ముందుగా డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ తర్వాత తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య 10న సూపర్ ఫైనల్ జరుగుతుంది. ప్రతి జట్టులో నలుగురు ఆటగాళ్లు ఉంటారు. ఇందులో ఒక మహిళా క్రీడాకారిణికి స్థానం తప్పనిసరి. మొత్తం లక్షా 80 వేల డాలర్ల (రూ. కోటీ 38 లక్షలు) ప్రైజ్‌మనీతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. చెస్ దిగ్గజాలు, ప్రపంచ మాజీ చాంపియన్స్ గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథన్ ఆనంద్, వ్లాదిమిర్ క్రామ్నిక్ తదితరులు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment