కార్ల్‌సన్, ఆనంద్ మధ్య ఐదో రౌండ్ గేమ్ దృశ్యం
స్టావెంజర్: నార్వే ఓపెన్ క్లాసికల్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ గెలుపొందాడు. వారం రోజుల వ్యవధిలో కార్ల్‌సన్‌పై ఆనంద్‌కిది రెండో గెలుపు కావడం విశేషం. ఇదే వేదికపై జరిగిన బ్లిట్జ్ కేటగిరీ టోర్నీలోనూ కార్ల్‌సన్‌పై ఆనంద్ విజయం సాధించాడు.
క్లాసికల్ టోర్నీలో 31 ఏళ్ల కార్ల్‌సన్‌తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను తెల్లపావులతో ఆడిన 52 ఏళ్ల ఆనంద్ 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. అయితే ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయిన గేమ్‌లో ఫలితం వచ్చేందుకు ప్రత్యేకంగా ‘అర్మగెడాన్’ గేమ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ‘అర్మగెడాన్’ గేమ్ నిబంధనల ప్రకారం తెల్ల పావులతో ఆడే ప్లేయర్‌కు 10 నిమిషాలు, నల్ల పావులతో ఆడే ప్లేయర్‌కు 7 నిమిషాలు కేటాయిస్తారు. తెల్ల పావులతో ఆడుతున్న ప్లేయర్ గెలిస్తేనే అతనికి విజయం ఖరారవుతుంది. ఒకవేళ గేమ్ ‘డ్రా’ అయితే మాత్రం తక్కువ సమయం పొందినందుకుగాను నల్ల పావులతో ఆడిన ప్లేయర్‌ను గెలిచినట్లు ప్రకటిస్తారు.
రెగ్యులర్ గేమ్‌లో ఏ రంగు పావులతో ఆడారో అదే రంగును అర్మగెడాన్ గేమ్‌లోనూ కేటాయిస్తారు. దాంతో కార్ల్‌సన్‌తో అర్మగెడాన్ గేమ్‌లో ఆనంద్ తెల్ల పావులతో ఆడాల్సి వచ్చింది. ఈ గేమ్‌లో ఆనంద్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా చకచకా ఎత్తులు వేస్తూ కార్ల్‌సన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. చివరకు ఆనంద్ 50 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను ఓడించాడు. ఈ టోర్నీలో రెగ్యులర్ గేమ్‌లో విజయానికి మూడు పాయింట్లు కేటాయిస్తున్నారు. గేమ్ ‘డ్రా’ అయి అర్మగెడాన్ గేమ్‌లో గెలిస్తే 1.5 పాయింట్లు లభిస్తాయి. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత ఆనంద్ 10 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలో ఉన్నాడు. 9.5 పాయింట్లతో కార్ల్‌సన్ రెండో ర్యాంక్‌లో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment