చెన్నై: 1986 జులై 1... చదరంగ మేధావి విశ్వనాథన్ ఆనంద్ భారత నంబర్‌వన్ ఆటగాడిగా మొదటిసారి గుర్తింపు తెచ్చుకున్న రోజు. నాటినుంచి ఇప్పటి వరకు అతనిదే అగ్ర స్థానం. అతని తర్వాత భారత్‌నుంచి పెద్ద సంఖ్యలో కుర్రాళ్లు సత్తా చాటుతూ వచ్చినా... వారితో పోటీ పడుతూ సత్తా చాటిన ఆనంద్ 37 సంవత్సరాలుగా ‘టాప్’లోనే నిలిచాడు. ఒక తరం పాటు ఆటను శాసించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆనంద్ ఇప్పుడు తొలిసారి తన భారత నంబర్‌వన్ స్థానాన్ని కోల్పోయాడు.
17 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్ ఇప్పుడు టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) శుక్రవారం అధికారికంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రకటించింది. ఇందులో గుకేశ్ 8వ ర్యాంక్‌లో నిలవగా... విశ్వనాథన్ ఆనంద్ 9వ ర్యాంక్‌లో ఉన్నాడు. గుకేశ్ రేటింగ్ 2758 కాగా, ఆనంద్ రేటింగ్ 2754గా ఉంది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ సమయంలోనే ‘లైవ్ రేటింగ్’లో ఆనంద్‌ను గుకేశ్ అధిగమించాడు.
అయితే ఇప్పుడు ‘ఫిడే’ ర్యాంకింగ్ ద్వారా అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. టాప్–30 ర్యాంకింగ్స్‌లో వీరిద్దరితో పాటు భారత్ నుంచి ఆర్. ప్రజ్ఞానంద (19), విదిత్ గుజరాతీ (27), అర్జున్ ఎరిగైశి (29) ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 31వ స్థానంలో కొనసాగుతున్నాడు. 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల గ్రాండ్‌మాస్టర్‌గా మారిన గుకేశ్ అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment