top rank
-
NIRF rankings 2024: ఐఐటీ మద్రాస్ టాప్
న్యూఢిల్లీ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)–2024 ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఓవరాల్‌తోపాటు ఇంజినీరింగ్ కేటగిరీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ వరుసగా ఆరోసారి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఐఐటీ హైదరాబాద్‌కు 8వ ర్యాంకు దక్కింది. ఉత్తమ యూనివర్సిటీగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) బెంగళూరు వరుసగా 9వసారి మొదటి స్థానం సంపాదించుకుంది. అదేవిధంగా, ఓవరాల్ కేటగిరీలో ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) రూపొందించిన ఈ ర్యాంకింగ్స్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం విడుదల చేశారు. ఓవరాల్ టాప్–10 జాబితాలో 8 ఐఐటీలతోపాటు ఢిల్లీ ఎయిమ్స్, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ చోటుసంపాదించాయి. యూనివర్సిటీల కేటగిరీలో టాప్–3లో బెంగళూరు ఐఐఎస్సీ, ఢిల్లీలోని జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియాలున్నాయి. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ తర్వాత ఐఐటీ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీల్లో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు ఆరు, విశాఖపట్టణంలోని ఆంధ్రా వర్సిటీకి ఏడో ర్యాంకు దక్కాయి.ఫార్మసీ విభాగంలో... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఎన్ఐపీఈఆర్)హైదరాబాద్ ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయింది. ఈసారి మొదటి స్థానాన్ని జామియా హందర్డ్ దక్కించుకోగా బిట్స్ పిలానీ మూడో ర్యాంకు సాధించింది. లా యూనివర్సిటీల్లో నల్సార్ హైదరాబాద్‌కు మూడో ర్యాంకు దక్కింది. -
కాలుష్య రాజధానిగా ఢిల్లీ
న్యూఢిల్లీ: ‘అత్యంత కాలుష్య దేశ రాజధాని’ అప్రతిష్ట కిరీటాన్ని ఢిల్లీ మరోసారి తన నెత్తిన పెట్టుకుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్ సంస్థ ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక–2023లో పలు అంశాలను ప్రస్తావించింది. నివేదికలో వెల్లడైన వివరాల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో నిండిన మెట్రోపాలిటన్ ప్రాంతంగా బిహార్‌లోని బెగుసరాయ్ నిలిచింది. ఘనపు మీటర్‌కు 54.4 మైక్రోగ్రామ్‌ల చొప్పున వార్షిక సూక్ష్మధూళికణాల(పీఎం 2.5) గాఢత ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 79.9 మైక్రోగ్రామ్‌లతో బంగ్లాదేశ్ తొలిస్థానంలో, 73.7 మైక్రోగ్రామ్‌లతో పాకిస్థాన్ రెండోస్తానంలో నిలిచింది. గత ఏడాది ఘనపు మీటర్‌కు కేవలం 53.4 మైక్రోగ్రామ్‌ల వార్షిక సూక్ష్మధూళి కణాల(పీఎం 2.5)గాఢతతో భారత్ ఎనిమిదో స్థానంలో ఉండగా ఇటీవలికాలంలో దేశంలో కాలుష్యం విపరీతంగా కమ్ముకుని భారత స్థానం దారుణంగా మూడో స్థానానికి ఎగబాకడం ఆందోళనకరం. ఇక బిహార్‌లోని బెగుసరాయ్ గత ఏడాది కాలుష్యప్రాంతాల జాబితాలోనే లేదు. కానీ ఈ ఏడాది ఘనపు మీటర్‌కు 118.9 మైక్రోగ్రామ్‌ల పీఎం2.5 గాఢతతో ప్రపంచంలోనే అతి కాలుష్య మెట్రోపాలిటన్ పట్టణంగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఆ తర్వాతి స్థానాలో గువాహటి, ఢిల్లీ, పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్ నిలిచాయి. నాలుగుసార్లు టాప్ ర్యాంక్ ఢిల్లీ పీఎం2.5 గాఢత గత ఏడాది 89.1 మైక్రోగ్రాములు ఉంటే ఈసారి మరికాస్త పెరిగి 92.7 మైక్రోగ్రాములకు చేరుకుంది. దీంతో విపరీతమై కాలుష్యం కారణంగా 2018 ఏడాది నుంచి చూస్తే నాలుగుసార్లు మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ కిరీటాన్ని ఢిల్లీకే కట్టబెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక ఘనపు మీటర్‌కు 5 మైక్రోగ్రాములకు మించి సూక్ష్మధూళి కణాలు ఉండకూడదు. కానీ భారత్‌లోని 136 కోట్ల ప్రజలు అధిక వాయుకాలుష్యం బారిన పడ్డారని తాజా నివేదిక ఘోషిస్తోంది. దేశ జనాభాలో 96 శాతం మంది అంటే 133 కోట్ల మంది డబ్ల్యూహెచ్‌వో పరిమితికి ఏడు రెట్లు మించి కాలుష్యమయ వాతావరణంలో జీవిస్తున్నారు. భారత్‌లోని 66 శాతం నగరాలు సగటున ఘనపు మీటర్‌కు 35 మైక్రోగ్రామ్‌ల ధూళికణాలున్న వాయుకాలుష్యం బారిన పడ్డాయి. విభిన్న మార్గాల్లో, విస్తృతస్థాయి డేటా ప్రపంచవ్యాప్తంగా 134 దేశాల్లో ఏర్పాటుచేసిన 30,000 వాయునాణ్యతా ప్రమాణాల స్టేషన్లు, సెన్సార్లు సేకరించిన డేటాను క్రోడీకరించి ఈ నివేదికను తయారుచేసినట్లు ఐక్యూఎయిర్ తెలిపింది. అధ్యయన సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వేతర లాభాపేక్షలేని సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, పౌర శాస్త్రవేత్తల నుంచి తీసుకున్న డేటాను ఈ నివేదిక కోసం వినియోగించినట్లు సంస్థ పేర్కొంది. ఆసియా ‘100’లో 83 భారత్‌లోనే ప్రపంచవ్యాప్తంగా కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా భారత్ పేరుమోస్తోంది. ఆసియాలో అత్యంత కాలుష్యమయ 100 నగరాల జాబితా ప్రకటించగా అందులో 83 నగరాలు భారత్‌లో ఉండటం దారుణ పరిస్థితికి దర్పణం పడుతోంది. కొన్ని నగరాల్లో కాలుష్యం డబ్ల్యూహెచ్‌వో పరిమితిని పది రెట్లు దాటేయడం గమ నార్హం. కాలుష్యానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 7,800 నగరాలను పరిశీలిస్తే అందులో డబ్ల్యూహెచ్‌వో పరిమితికి లోబడి కేవలం 9 శాతం నగరాలు ఉండటం చూస్తే పరిస్థితి చేయిదాటిపోయిందని అర్ధమవుతోంది. ‘ ఫిన్లాండ్, ఎస్తోనియా, ప్యూర్టోరీకో, ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్, బెర్ముడా, గ్రెనెడా, ఐస్‌ల్యాండ్, మారిషస్, ప్రెంచ్ పాలినేసియా దేశాల్లో మాత్రం వాయు నాణ్యత బాగుంది. -
ఢిల్లీ పొల్యూషన్.. వరల్డ్‌లోనే టాప్ ర్యాంక్ !
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని స్విస్‌కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023లో వెల్లడించింది. ఈ సర్వేలో 2018 నుంచి వరుసగా నాలుగుసార్లు ఢిల్లీ అత్యంత కాలుష్య రాజధానిగా టాప్‌లో ఉంటూ వస్తోంది. 2022లో ఢిల్లీ పీఎం 2.5 లెవెల్స్ క్యూబిక్ మీటర్‌కు 89.1 మైక్రో గ్రాములు ఉండగా 2023లో ఇది 92.7 గ్రాములకు చేరింది. ఇక బీహార్‌లోని బెగుసరాయ్ పట్టణం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పట్టణమని ఐక్యూ ఎయిర్ తెలిపింది. క్యూబిక్ మీటర్‌కు 54.4 మైక్రోగ్రాముల పీఎం 2.5 కాన్సంట్రేషన్తో ప్రపంచంలోనే మూడవ అత్యంత కాలుష్య దేశంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ల తర్వాత భారత్ ఉందని వెల్లడించింది. ఐక్యూ ఎయిర్ కాలుష్య దేశాల ర్యాంకుల్లో 2022లో భారత్ ర్యాంకు 8గా ఉండగా 2023లో 3వ ర్యాంకుకు ఎగబాకింది. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి.. వందేళ్ల కక్రితం కరెంట్ లేకుండానే పనిచేసిన ఫ్రిడ్జ్ -
ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో 'స్మార్ట్‌ఫోన్' జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. డిజిటల్ ప్రపంచంలో మొబైల్స్ ఎంత వేగంగా అప్డేట్ అవుతున్నాయి, వాటికి అనుగుణంగా కొత్త కొత్త యాప్స్ పుట్టుకొచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన యాప్‌లలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి అనే సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. 2022లో జనాదరణ పొందిన యాప్స్ 2020లో భారత్ నిషేదించిన 'టిక్‌టాక్' 2022లో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ ఎంటర్టైన్మెంట్ యాప్. ఈ వీడియో ప్లాట్‌ఫామ్‌ను ఏకంగా 672 మిలియన్ యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు సమాచారం. బిజినెస్ ఆఫ్ యాప్స్ ప్రకారం దీని వార్షిక ఆదాయం 9.4 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. (భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 783 వేల కోట్ల కంటే ఎక్కువ) ఇక అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న టాప్ 5 సోషల్ మీడియా యాప్‌ల స్థానంలో ఇన్స్టాగ్రామ్ (547 మిలియన్స్), ఫేస్బుక్ (449 మిలియన్స్), వాట్సాప్ (424 మిలియన్స్), టెలిగ్రామ్ (310 మిలియన్స్), ఫేస్బుక్ మెసెంజర్ (210 మిలియన్స్) ఉన్నాయి. షాపింగ్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది యూజర్స్ డౌన్లోడ్ చేసుకున్న యాప్‌గా 'షీఇన్' (Shein) నిలిచింది. ఈ యాప్ సుమారు 229 మిలియన్ల వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ తరువాత స్థానంలో మీషో (Meesho) 210 మిలియన్స్ డౌన్లోడ్స్ పొందింది. భారతదేశంలో కూడా ఈ యాప్ ఎక్కువమంది వినియోగిస్తున్నట్లు సమాచారం. గేమ్స్ విభాగంలో ఎక్కువ మంది యూజర్లను ఆకర్శించిన యాప్ 'సబ్వే సర్ఫర్స్' (Subway Surfers). దీనిని 304 మిలియన్ల వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 'క్యాండీ క్రష్'ను ప్రపంచ వ్యాప్తంగా 138 మిలియన్ల యూజర్లు వినియోగిస్తున్నట్లు సమాచారం. మనీ ట్రాన్స్ఫర్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్స్ వాడుతున్న యాప్‌గా 'ఫోన్ పే' (PhonePe) నిలిచి సుమారు 94 మిలియన్ల డౌన్లోడ్స్ పొందింది. ఆ తరువాత పేపాల్ (92 మిలియన్స్), గూగుల్ పే (69 మిలియన్స్), పేటీఎమ్ (60 మిలియన్స్) వంటివి ఉన్నాయి. ట్రావెల్ విభాగంలో గూగుల్ మ్యాప్ (113 మిలియన్స్), ఫుడ్ విభాగంలో ఎంసీడోనాల్డ్ (127 మిలియన్స్), మ్యూజిక్ విభాగంలో స్పాటిఫై (238 మిలియన్స్), విద్యకు సంబంధించిన యాప్‌లో డుయోలింగో (98 మిలియన్స్), ఆరోగ్యానికి సంబంధించిన విభాగంలో స్వెట్‌కాయిన్ (52 మిలియన్స్) అగ్ర స్థానాల్లో నిలిచాయి. ఇదీ చదవండి: కోడలి గురించి 'సుధామూర్తి' మనసులో మాట - ఏం చెప్పిందంటే? ఏఐ యాప్‌లకు పెరిగిన ఆదరణ ప్రస్తుతం టెక్నాలజీ మరింత వేగంగా ఉంది. ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ ఉపయోగించడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. నేడు ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా వెంటనే 'చాట్‌జీపీటీ' మీద ఆధారపడిపోతున్నారు. రానున్న రోజుల్లో వీటి ఆదరణ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
‘విషీ’ని దాటిన గుకేశ్
చెన్నై: 1986 జులై 1... చదరంగ మేధావి విశ్వనాథన్ ఆనంద్ భారత నంబర్‌వన్ ఆటగాడిగా మొదటిసారి గుర్తింపు తెచ్చుకున్న రోజు. నాటినుంచి ఇప్పటి వరకు అతనిదే అగ్ర స్థానం. అతని తర్వాత భారత్‌నుంచి పెద్ద సంఖ్యలో కుర్రాళ్లు సత్తా చాటుతూ వచ్చినా... వారితో పోటీ పడుతూ సత్తా చాటిన ఆనంద్ 37 సంవత్సరాలుగా ‘టాప్’లోనే నిలిచాడు. ఒక తరం పాటు ఆటను శాసించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆనంద్ ఇప్పుడు తొలిసారి తన భారత నంబర్‌వన్ స్థానాన్ని కోల్పోయాడు. 17 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్ ఇప్పుడు టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) శుక్రవారం అధికారికంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రకటించింది. ఇందులో గుకేశ్ 8వ ర్యాంక్‌లో నిలవగా... విశ్వనాథన్ ఆనంద్ 9వ ర్యాంక్‌లో ఉన్నాడు. గుకేశ్ రేటింగ్ 2758 కాగా, ఆనంద్ రేటింగ్ 2754గా ఉంది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ సమయంలోనే ‘లైవ్ రేటింగ్’లో ఆనంద్‌ను గుకేశ్ అధిగమించాడు. అయితే ఇప్పుడు ‘ఫిడే’ ర్యాంకింగ్ ద్వారా అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. టాప్–30 ర్యాంకింగ్స్‌లో వీరిద్దరితో పాటు భారత్ నుంచి ఆర్. ప్రజ్ఞానంద (19), విదిత్ గుజరాతీ (27), అర్జున్ ఎరిగైశి (29) ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 31వ స్థానంలో కొనసాగుతున్నాడు. 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల గ్రాండ్‌మాస్టర్‌గా మారిన గుకేశ్ అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లో టాప్
న్యూఢిల్లీ: మారి్టగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌ను విలీనం చేసుకున్న ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభాల రీత్యా టాప్ ర్యాంకుకు చేరింది. మార్చితో ముగిసిన గతేడాది(2022–23)లో రూ. 60,000 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) రూ. 50,232 కోట్ల నికర లాభంతో ద్వితీయ ర్యాంకులో నిలిచింది. అయితే మొత్తం బిజినెస్(డిపాజిట్లు, అడ్వాన్సులు)లో ఎస్బీఐ 70.3 లక్షల కోట్లతో అగ్రపథాన నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు మొత్తం డిపాజిట్లు, రుణాలు రూ. 41 లక్షల కోట్లు మాత్రమే. కాగా.. విలీనానంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా ప్రపంచ రుణదాత సంస్థలలో నాలుగో ర్యాంకును సొంతం చేసుకుంది. నెట్‌వర్త్ రూ. 4.14 లక్షల కోట్లను తాకింది. విలీనంలో భాగంగా హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారులకు ప్రతీ 25 షేర్లకుగాను 42 బ్యాంకు షేర్లను కేటాయించనున్న సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులో హెచ్డీఎఫ్సీ వాటా 41 శాతానికి చేరనుండగా.. పబ్లిక్ వాటాదారుల వాటా 100 శాతంగా నమోదుకానుంది. బ్యాంకు షేర్ల జారీకి ఈ నెల 13 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. షేర్ల మారి్పడి ద్వారా విలీనానికి తెరతీయగా.. లావాదేవీ విలువ 40 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద డీల్‌కాగా.. 4,000 మంది హెచ్డీఎఫ్సీ ఉద్యోగులు బ్యాంకుకు బదిలీకానున్నారు. -
ఎస్సీ సబ్‌ప్లాన్ అమల్లో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం
-
World Athletics Championships: ‘టాప్’ లేపిన అమెరికా
యుజీన్ (అమెరికా): తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన అమెరికా చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో అమెరికా 13 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఒకే చాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన జట్టుగా అమెరికా రికార్డు నెలకొల్పింది. 1987లో తూర్పు జర్మనీ అత్యధికంగా 31 పతకాలు సాధించింది. పోటీల చివరిరోజు రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. పురుషుల పోల్‌వాల్ట్ ఈవెంట్లో అర్మాండ్ డుప్లాంటిస్ (స్వీడన్)... మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో టోబీ అముసాన్ (నైజీరియా) కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. ప్రపంచ రికార్డులు సృష్టించినందుకు డుప్లాంటిస్, టోబీ అముసాన్లకు లక్ష డాలర్ల చొప్పున (రూ. 79 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఆఖరి రోజు ఎనిమిది విభాగాల్లో ఫైనల్స్ జరిగాయి. మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో తలీతా డిగ్స్, అబీ స్టెనర్, బ్రిటన్ విల్సన్, సిడ్నీ మెక్లాఫ్లిన్లతో కూడిన అమెరికా జట్టు 3ని:17.79 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సాధించింది. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలోనూ అమెరికాకే స్వర్ణం లభించింది. పురుషుల పోల్‌వాల్ట్ ఫైనల్లో డుప్లాంటిస్ 6.21 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 6.20 మీటర్లతో తన పేరిటే ఉన్న రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ సెమీఫైనల్లో టోబీ అముసాన్ 12.12 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు లిఖించింది. ఫైనల్ రేసును టోబీ 12.06 సెకన్లలోనే ముగించి మరోసారి ప్రపంచ రికార్డు సాధించి, బంగారు పతకం గెలిచినా... రేసు జరిగిన సమయంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె రికార్డును గుర్తించలేదు. స్వర్ణంతో ఫెలిక్స్ రిటైర్... అమెరికా మహిళా దిగ్గజ అథ్లెట్ అలీసన్ ఫెలిక్స్ తన కెరీర్‌ను స్వర్ణ పతకంతో ముగించింది. 36 ఏళ్ల అలీసన్ ఫెలిక్స్ 4్ఠ400 మీటర్ల ఫైనల్లో స్వర్ణం నెగ్గిన అమెరికా రిలే జట్టులో పోటీపడలేదు. అయితే ఆమె హీట్స్‌లో బరిలోకి దిగడంతో ఫెలిక్స్‌కు కూడా పసిడి పతకాన్ని ఇచ్చారు. అంతకుముందు ఆమె 4్ఠ400 మిక్స్డ్ రిలేలో కాంస్య పతకం సాధించింది. ఓవరాల్‌గా పది ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న ఫెలిక్స్ మొత్తం 20 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు) సాధించింది. -
నా దారి రహదారి: ఈలాన్ మస్క్ మరో ఘనత
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఈలాన్ మస్క్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా నిలిచారు. స్పేస్ ఎక్స్, టెస్లా, ది బోరింగ్ కంపెనీ, స్టార్‌లింక్ సంస్థల వ్యవస్థాపకుడు 2021వ సంవత్సరంలో అత్యధికంగా జీతం పొందిన ఫార్చ్యూన్-500 టాప్-10 సీఈవోల తాజా జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో 2021లో ఫార్చ్యూన్ 500 టాప్ సీఈవోల యాపిల్ సీఈవో టిమ్ కుక్, నెటిఫ్లిక్స్ రీడ్ హేస్టింగ్స్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల సహా ఇతర టెక్నాలజీ, బయోటెక్నాలజీ రంగాలకు చెందిన వారున్నారు. 2021లో ఎలాన్‌మస్క్ పొందిన వేతనం 23.5 బిలియన్ల డాలర్లు. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో టెస్లా 65వ స్థానంలో నిలిచింది. 2020తో పోలిస్తే 71 శాతం ఆదాయంపెంచుకున్న టెస్లా గతేడాది ఆదాయం 53. 8 బిలియన్ డాలర్లు. గతేడాది టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేతనం 770.5 మిలియన్ల డాలర్లు. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో ఆపిల్‌కు మూడో స్థానం ఉంది. అంతర్జాతీయంగా చిప్ కొరత సమస్యను ఎదుర్కొన్నా ఆపిల్ మాత్రం టాప్ ర్యాంకులోనే కొనసాగుతోంది. ఇంకా న్విదియా సంస్థ కో ఫౌండర్ హాంగ్, నెట్‌ఫ్లిక్స్ సీఈవో రీడ్ హాస్టింగ్స్ వేతనాల్లో మూడో, నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. టాప్-5 చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు టెస్లా సీఈవో ఈలాన్ మస్క్ 2021లో వేతనం పరంగా ఈలాన్ మస్క్ టాప్-1 ప్లేస్‌లో ఉన్నారు. టెస్లా కంపెనీ సాధించిన ఘనమైన ఆదాయాల నేపథ్యంలో 53.8 బిలియన్ల డాలర్ల మొత్తం రాబడి 2020 నుండి 71శాతం పెరిగింది. ప్రపంచంలోని అత్యంత విలువైన కార్ల కంపెనీ 2021లో కీలకమైన యూరోపియన్ ,చైనీస్ మార్కెట్లలో 936,000 వాహనాలను డెలివరీ చేసింది. ఇది 87 శాతం జంప్. యాపిల్ సీఈవో టిమ్ కుక్: 2011 నుండి కుక్ ఆపిల్ సీఈవోగా ఉన్న కుక్ ఈ జాబితాలో సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. 2021లో ఆయన వేతనం 770.5 మిలియన్ డాలర్లు. ఈ 10 సంవత్సరాల్లో 1.7 బిలియన్ల షేర్లను ఆయనకు దక్కాయి. అలాగే కుక్ హయాంలో యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో ఆపిల్ 2వ స్థానంలో నిలిచింది. 95 బిలియన్ల డాలర్ల లాభాలను ఆర్జించింది. న్విదియా, జెన్సన్ హువాంగ్ షీల్డ్ గేమింగ్ కన్సోల్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్కి ప్రసిద్ధి చెందిన టెక్ కంపెనీ న్విదియా సహ వ్యవస్థాపకుడు హువాంగ్ వేతనం 561 మిలియన్ డాలర్లు స్వీకరించాడు. సుమారుగా 60 రెట్లు పెరిగింది. నెట్‌ఫ్లిక్స్, రీడ్ హేస్టింగ్స్ :2021లో నెట్‌ఫ్లిక్స్ సహ-వ్యవస్థాపకుడు సీఈవో రీడ్ హేస్టింగ్స్ వతేనం 453.5 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్, లియోనార్డ్ ష్లీఫెర్ ఆస్తమా, క్యాన్సర్, దీర్ఘకాలిక నొప్పులకు చికిత్స చేసే వివిధ రకాల ఔషధాలను తయారు చేసే బయోటెక్ సంస్థ రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ సహ వ్యవస్థాపకుడు ఫార్చ్యూన్ 500 జాబితాలో ఐదవ అత్యంత వేతనం పొందిన స సీఈవోగా అయిదో స్థానంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన సత్య నాదెళ్ల 309.4 మిలియన డాలర్లతో ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచారు. -
Superbet Rapid Chess: సూపర్‌బెట్ చెస్ టోర్నీ విజేత ఆనంద్
వార్సా (పోలాండ్): సూపర్‌బెట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ విజేతగా అవతరించాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఆనంద్ 14 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. శనివారం జరిగిన మూడు గేముల్లో ఆనంద్ ఒక విజయం, ఒక ‘డ్రా’, ఒక పరాజయం నమోదు చేశాడు. ఈ టోర్నీలో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’కు ఒక పాయింట్ కేటాయించారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఆనంద్ ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. 13 పాయింట్లతో రిచర్డ్ రాపోట్ (హంగేరి) రెండో స్థానంలో, 12 పాయింట్లతో డూడా జాన్ క్రిస్టాఫ్ (పోలాండ్) మూడో స్థానంలో నిలిచారు. నేటి నుంచి బ్లిట్జ్ విభాగంలో టోర్నీ జరుగుతుంది. -
Superbet Rapid Chess: ఆధిక్యంలో ఆనంద్
వార్సా (పోలాండ్): సూపర్‌బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఆరు రౌండ్ల తర్వాత ఆనంద్ 12 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. శుక్రవారం జరిగిన మూడు గేముల్లో ఆనంద్ రెండు విజయాలు (షెవ్చెంకో, లెవాన్ అరోనియన్), ఒక ‘డ్రా’ (జాన్ క్రిస్టాఫ్ డూడా) నమోదు చేశాడు. ఈ టోర్నీలో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’కు ఒక పాయింట్ కేటాయిస్తున్నారు. -
సత్తా చాటిన విశాఖ; అన్నింటా స్టార్‌గా..
సువిశాల సాగరతీరం.. ఎటుచూసినా కనువిందు చేసే సోయగాలు.. అడుగడుగునా ఆహ్లాదం.. ఇవి కేవలం విశాఖకే సొంతం. అందుకే ఎంతోమంది అందమైన ఈ మహానగరంలో జీవించాలని కోరుకుంటారు. ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన సుందరనగరి నీతి ఆయోగ్ ప్రకటించిన పట్టణ సుస్థిరాభివృద్ధి సూచికలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంక్‌ను, జాతీయస్థాయిలో 18వ ర్యాంకును సాధించింది. మొత్తం 14 విభాగాల్లో పరిశీలించగా.. 12 విభాగాల్లో 60 శాతానికిపైగా మార్కులు సాధించి.. హైదరాబాద్‌ను సైతం వెనక్కు నెట్టింది. సాక్షి, విశాఖపట్నం: నీతి ఆయోగ్ ఇటీవల వెల్లడించిన పట్టణ సుస్థిరాభివృద్ధి సూచిక ర్యాంకుల్లో విశాఖ సత్తా చాటింది. దేశంలోని రాష్ట్రాల రాజధానులు, 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలు కలిపి మొత్తం 56 నగరాలకు ర్యాంకులు ఇవ్వగా.. విశాఖ 18వ ర్యాంకు సొంతం చేసుకుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ఎన్సీఆర్బీ, జిల్లాస్థాయి విద్యా సమాచారం, వివిధ మంత్రిత్వశాఖలు, ప్రభుత్వాల నుంచి అందిన అధికారిక సమాచారం ఆధారంగా మొత్తం 14 విభాగాల్లో 77 కొలమానాల్ని ప్రాతిపదికగా తీసుకుని నీతిఆయోగ్ ఈ ర్యాంకులు ప్రకటించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించిన నగరాలకు పురోగతిని బట్టి 100 వరకు మార్కులు ఇచ్చారు. 100 మార్కులు సంపాదించిన నగరాలు ఇప్పటికే లక్ష్యాలను చేరుకున్నట్లుగా నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. 65–99 మార్కులు సాధించిన నగరాలు ఫ్రంట్ రన్నర్‌గా, 50–64 మార్కులు సాధించినవి కాస్త మంచి పనితీరు కనబరిచినట్లు, 0–49 మార్కులు సాధించిన నగరాలు వెనుకబడినట్లు పేర్కొంది. 68.14 మార్కులతో విశాఖపట్నం ఫ్రంట్ రన్నర్ జాబితాలో నిలిచింది. ప్రశాంతతకు పట్టుగొమ్మగా పేరొందిన నగరంలో విపత్కర పరిస్థితులు తలెత్తవనే నమ్మకమే విశాఖని దేశంలోని మెట్రో సిటీలతో పోటీపడేలా చేస్తోంది. టైర్–1 సిటీల కంటే ద్వితీయ శ్రేణిలో ఉన్న వైజాగ్ అందర్నీ ఆకర్షిస్తోంది. (చదవండి: ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు: సీఎం వైఎస్ జగన్) అందరూ హాయిగా జీవించేలా.. విశాఖ నగరం సామాన్యుడికి స్వాగతం పలుకుతుంది.. బిలియనీర్‌కి రెడ్ కార్పెట్ వేస్తుంది. నెలకు రూ.3 వేల వేతనంతో జీవించే సగటు జీవి దర్జాగా బతకగల సౌకర్యాలున్నాయి. నెలకు రూ.3 లక్షల వేతనం తీసుకునే ఉద్యోగి విలాసంగా జీవించే ఆధునికతా విశాఖ నగరం సొంతం. అందుకే.. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా భాసిల్లుతున్నట్లే విశాఖ మహానగరం కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని సొంతం చేసుకుంది. ఇరుగుపొరుగు జిల్లాల ప్రజలే కాదు.. తమిళనాడు నుంచి కాశ్మీరం వరకు, రాజస్థాన్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు.. అనేక ప్రాంతాలవారు ఇక్కడ నివసిస్తున్నారు. సిటీకి సలాం చేస్తున్నారు. ప్రతి 100 మందిలో 10 మంది వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన సెటిలర్సే ఉన్నారంటే.. విశాఖ ఎలా విశాల నగరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: తిరుపతిలో వింత ఘటన.. చూసేందుకు ఎగబడుతున్న జనం) మహా నగరాలతో పోటీపడుతూ... ద్వితీయశ్రేణి నగరమే అయినా విశాఖ.. మహా నగరాలతో పోటీపడేలా మౌలిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలను సొంతం చేసుకుంది. నౌకా వాణిజ్యానికి, పర్యాటకరంగానికి కేంద్ర బిందువైంది. విస్తరిస్తున్న రియల్ రంగం, సినీ స్టూడియోల నిర్మాణంతో నగరం బ్రాండ్ విలువ క్రమంగా పెరుగుతోంది. కొలువుల విషయంలోనూ విశాఖ పోటీపడుతోంది. పారిశ్రామిక రంగాల్లోను, అరకు వ్యాలీ, సింహాచలం, రుషికొండ, రామకృష్ణ, భీమిలీ బీచ్‌లతో విశాఖ అందాలు, పర్యాటక, హోటల్ రంగాల్లో కొత్త కొలువులను సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ తర్వాత ఐటీ రంగానికి అనువైన ప్రాంతంగా సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలు భావిస్తుండటం కూడా స్టార్టప్ కంపెనీల రాకకు ఊతమిస్తోంది. ఆ రెండింటిలో మినహా.. అన్నింటా స్టార్‌గా.. నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకుల్లోని 14 విభాగాల్లో విశాఖ నగరం సత్తా చాటింది. రెండు విభాగాలు మినహాయిస్తే.. మిగిలిన అన్నింటిలోను వైజాగ్ తన ప్రత్యేకతని చాటుకుంది. క్లీన్‌వాటర్ అండ్ శానిటేషన్, మంచి జీవన ప్రమాణాల విభాగంలో ఏకంగా 80కి పైగా మార్కులు సొంతం చేసుకుంది. క్లీన్ ఎనర్జీ విషయంలో అత్యల్పంగా 40 మార్కులు సాధించింది. అదేవిధంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల్లో వెనుకబడిన విశాఖ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. అందుకే ఈ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనలో 46 మార్కులకే పరిమితమైంది. మెట్రో నగరమైన హైదరాబాద్‌తోపాటు విజయవాడ నగరంతో పోలిస్తే.. విశాఖ అన్ని విభాగాల్లోను పైచేయి సాధించింది. 100 మార్కులకుగాను వైజాగ్‌కు 68.14 మార్కులు లభించాయి. 66.93 మార్కులతో హైదరాబాద్ 22వ ర్యాంకులో, 65.07 మార్కులతో విజయవాడ 30వ ర్యాంకులో ఉన్నాయి. -
IES Examination: చదువంటే ఇష్టం; ఆ ఇష్టమే ఈరోజు
కశ్మీర్: తన చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించాడు జమ్మూ కశ్మీర్‌కు చెందిన తన్వీర్ అహ్మద్‌ఖాన్. తాజాగా విడుదలైన ప్రతిష్టాత్మక ఇండియన్ ఎకనమిక్ సర్వీస్(ఐఈఎస్) పరీక్షలో రెండో ర్యాంకు సాధించాడు. తన్వీర్ తండ్రి వ్యవసాయం చేసుకుంటూనే రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషించాడు. అహ్మద్ ఖాన్ విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే కొనసాగింది. అనంత్ నాగ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి 2016లో బీఏ ఉత్తీర్ణత సాధించాడు. మొదటి నుంచి అత్యంత ప్రతిభావంతుడైన ఖాన్.. కశ్మీర్ యూనివర్సిటీలో ఎంఏ ఎకానమిక్స్‌లో ప్రవేశం పొందాడు. గతేడాది జేఆర్ఎఫ్ సాధించాడు. కోల్‌కతాలో ఎంఫిల్ పూర్తి చేశాడు. ఎంఫీల్ పట్టాను 2021, ఏప్రిల్‌లో పొందాడు. ఇక కోవిడ్ సమయంలో ఎంఫిల్ చేస్తూనే.. ఐఈఎస్ కోసం కఠినంగా చదివాడు. ప్రణాళికబద్ధంగా చదవడంతో మొదటి ప్రయత్నంలోనే ఐఈఎస్ పరీక్షలో రెండో ర్యాంకు సాధించి అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఇదే విషయమై అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం. నాన్న వ్యవసాయం చేస్తూ.. రిక్షా నడుపుతూ మమ్మల్ని పోషించాడు. తాను చదువుకోలేకపోయానని బాధపడిన నాన్న మాకు ఆ కష్టం రానివ్వలేదు. ఆయన శ్రమకు తగ్గ ఫలితం ఈరోజు లభించింది. ఇక ప్రణాళికబద్ధంగా చదవడంతోనే ఈరోజు ఐఈఎస్ పరీక్షలో రెండో ర్యాంక్‌ను సాధించాను.. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన్వీర్ అహ్మద్‌ఖాన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. తన్వీర్ కృషి, పట్టుదల, ప్రతిభను నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. -
టాప్ లేపిన మిథాలీ.. మూడేళ్ల తర్వాత అగ్రపీఠం కైవసం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్, యువ ఓపెనర్ షెఫాలీ వర్మ దుమ్ము లేపారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుతంగా రాణించిన మిథాలీ.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడేళ్ల తర్వత మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా చిచ్చర పిడుగు షెఫాలీ టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన.. 701 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 💥 @M_Raj03 is the new No.1 💥In the latest @MRFWorldwide ICC Women's ODI Player Rankings for batting, the India skipper climbs to the 🔝 of the table.Full list: https://t.co/KjDYT8qgqn pic.twitter.com/2HIEC49U5i— ICC (@ICC) July 6, 2021 బౌలింగ్ విభాగంలో జూలన్ గోస్వామి(694 పాయింట్లు) 4వ స్థానంలో, పూనమ్ యూదవ్(617 పాయింట్లు) 9వ ర్యాంక్‌లో నిలిచారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బౌలర్లు జెస్ జొనాస్సెన్ (808 పాయింట్లు), మేఘన్ షట్(762 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మ(331 పాయింట్లు) ఐదో ర్యాంకును దక్కించుకోగా.. మరిజన్నె కప్ (సౌతాఫ్రికా), ఎలిసా పెర్రి(ఆస్ట్రేలియా) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక, టీ20 ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో ఇద్దరు భారత మహిళా బ్యాటర్లు టాప్ -10లో నిలిచారు. టీమిండియా చిచ్చర పిడుగు షెఫాలీ వర్మ 776 రేటింగ్ పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలువగా, మరో స్టార్ బ్యాటర స్మృతి మంధాన(693 పాయింట్లు) నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. ఈ ఫార్మాట్లోని బౌలింగ్ విభాగంలో భారత బౌలర్లు దీప్తి శర్మ 5వ ర్యాంక్‌లో, రాధా యాదవ్ 6వ స్థానంలో ఉన్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ.. 304 పాయింట్లతో ఐదో ర్యాంకులో ఉంది. -
కైనన్ షెనాయ్ పసిడి గురి
కువైట్: ఆసియా ఆన్లైన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. కువైట్‌లో రెండు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 11 పతకాలు గెల్చుకున్న భారత్ టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఇందులో నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. పురుషుల ట్రాప్ ఈవెంట్లో తెలంగాణ షూటర్ కైనన్ షెనాయ్ చాంపియన్‌గా నిలిచాడు. 34 మంది షూటర్లు పాల్గొన్న ట్రాప్ ఈవెంట్లో 30 ఏళ్ల కైనన్ 150 పాయింట్లకుగాను 145 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఈ హైదరాబాద్ షూటర్ ఆరు రౌండ్లలో వరుసగా 24, 24, 24, 25, 24, 24 పాయింట్లు సాధించాడు. నసీర్ (కువైట్–144 పాయింట్లు) రజతం, పృథ్వీరాజ్ (భారత్–143 పాయింట్లు) కాంస్య పతకం నెగ్గారు. భారత్‌కే చెందిన సౌరభ్ (10 మీ. ఎయిర్ పిస్టల్), దివ్యాంశ్ (10 మీ. ఎయిర్ రైఫిల్), రాజేశ్వరి (మహిళల ట్రాప్ ఈవెంట్) కూడా బంగారు పతకాలు నెగ్గారు. 22 దేశాల నుంచి 274 మంది షూటర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. ముంబై సిటీ జట్టుకు షాక్ బంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో ముంబై సిటీ జట్టుకు రెండో ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు 2–1తో ముంబై జట్టును ఓడించింది. 30 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ముంబై జట్టుకు ఈ టోర్నీలో ఎదురైన రెండు పరాజయాలు నార్త్ ఈస్ట్ జట్టు చేతిలోనే రావడం గమనార్హం. నవంబర్ 21న తాము ఆడిన తొలి లీగ్ మ్యాచ్‌లోనూ ముంబై 0–1తో నార్త్ ఈస్ట్ జట్టు చేతిలో ఓడింది. -
న్యూజిలాండ్ నంబర్‌వన్
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ (6/48) మళ్లీ నిప్పులు చెరగడంతో పాకిస్తాన్ కుప్పకూలింది. దీంతో ఆఖరి టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ 176 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో ఆతిథ్య జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం ఓవర్‌నైట్ స్కోరు 8/1తో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 81.4 ఓవర్లలో 186 పరుగులు చేసి ఆలౌటైంది. అజహర్ అలీ (37; 6 ఫోర్లు), జాఫర్ గోహర్ (37; 7 ఫోర్లు), ఫహీమ్ అష్రఫ్ (28; 3 ఫోర్లు) మినహా మిగతా వారెవరూ ఆతిథ్య బౌలర్లకు ఎదురునిలిచే సాహసం చేయలేకపోయారు. జేమీసన్ 6 వికెట్లు పడగొట్టగా... సీనియర్ సీమర్ బౌల్ట్ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌ల్లో పాకిస్తాన్ 297 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 659/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. జేమీసన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... విలియమ్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు గెల్చుకున్నారు. ఆసీస్‌ను వెనక్కినెట్టి ‘టాప్’లోకి... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రపంచ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇన్నాళ్లు అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో పాయింట్ల పరంగా న్యూజిలాండ్ (116 పాయింట్లు) సమంగా నిలిచింది. అయితే డెసిమల్ పాయింట్ల తేడాతో రెండో స్థానానికి పరిమితమైన న్యూజిలాండ్ ఇప్పుడు స్పష్టమైన తేడాతో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. పాక్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా న్యూజిలాండ్ 118 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. ఆసీస్ (116), భారత్ (114) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు పాక్‌తో రెండు టెస్టుల్లో కలిపి 388 పరుగులు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్ లో 890 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. -
మొదటి అడుగు ముంబైదే!
మరోసారి అద్భుత ప్రదర్శన నమోదు చేసిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్–2020లో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. జోరుమీదున్న బెంగళూరుకు బుమ్రా బ్రేకులేయగా... సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్‌తో ముంబైని లక్ష్యఛేదనలో నిలబెట్టాడు. దాంతో ఎనిమిదో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో ఒంటరిగా టాప్ ర్యాంక్‌లోకి వెళ్లింది. అయితే మరో నాలుగు జట్లకూ 16 పాయింట్లు చేరుకునే అవకాశం ఉండటంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అయితే అన్ని జట్లకంటే ఎంతో మెరుగైన రన్‌రేట్ కలిగిన ముంబై జట్టుకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయినా ప్లే ఆఫ్ బెర్త్ విషయంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. అబుదాబి: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లోనూ అదరగొడుతోంది. ఎనిమిదో గెలుపుతో ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. దేవ్‌దత్ (45 బంతుల్లో 74; 12 ఫోర్లు, 1 సిక్స్) చక్కని పోరాటం చేశాడు. జోరుగా సాగే బెంగళూరు ఇన్నింగ్స్‌ను బుమ్రా (3/14) అనూహ్యంగా కట్టడి చేశాడు. తర్వాత ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 79 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) జట్టు గెలిచేదాకా అజేయంగా నిలిచాడు. దేవ్‌దత్ పోరాటం... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు దేవ్‌దత్, జోష్ ఫిలిప్ (24 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం అందించారు. బౌండరీతో ఖాతా తెరిచిన దేవ్‌దత్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కృనాల్ మూడో ఓవర్లో వరుసగా 2 ఫోర్లు బాదాడు. తర్వాత ప్యాటిన్సన్ బౌలింగ్‌లోనూ రెండు బౌండరీలు కొట్టాడు. మరో ఓపెనర్ ఫిలిప్... బౌల్ట్ ఓవర్లో భారీ సిక్స్, ఫోర్ కొట్టడంతో పవర్ ప్లేలో (54/0) ఓవర్‌కు 9 పరుగుల రన్‌రేట్ నమోదైంది. ఇలా ధాటిగా సాగిపోతున్న బెంగళూరు జోరుకు ఫిలిప్‌ను ఔట్ చేయడం ద్వారా రాహుల్ చహర్ బ్రేక్ వేశాడు. దీంతో 71 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత కోహ్లి (9) సహా ఎవరూ నిలబడలేదు. పరుగులు జతచేయలేదు. దేవ్‌దత్ మాత్రం 30 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. డివిలియర్స్ (15), దూబే (2), మోరిస్ (4) విఫలమయ్యారు. కోహ్లి ఔట్... రన్‌రేట్ డౌన్ రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్ చక్కగా మొదలైంది. పరుగులు చకచకా వచ్చాయి. బౌండరీలతో రన్‌రేట్ ఊపందుకుంది. సిక్సర్లు అరకొరే అయినా వేగం ఎక్కడా తగ్గలేదు. ఇలా దేవ్‌దత్, జోష్ ఫిలిప్‌ల ఓపెనింగ్ జోడి పటిష్టమైన పునాది వేసింది. దీంతో ఒకదశలో అద్భుతంగా బెంగళూరు ఇన్నింగ్స్ సాగిపోయింది. ఫిలిప్ ఔటయినపుడు జట్టు స్కోరు 71. కోహ్లి వెనుదిరిగినపుడు వందకు చేరువైంది. 11.2 ఓవర్లలో బెంగళూరు 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు. కానీ అనూహ్యంగా కోహ్లి వికెట్‌తో పాటే బెంగళూరు ఇన్నింగ్స్ పతనమైంది. పరుగుల రాక కష్టమైంది. దాంతో బెంగళూరు జట్టు చివరి 5 ఓవర్లలో 35 పరుగులే చేసింది. ‘సూర్య’ కిరణాలు బెంగళూరులాగే ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ ఆడారు. అక్కడ... ఇక్కడ... ఆడింది ఒక్కరే! సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇన్నింగ్స్ అసాంతం నిలబడి... బెంగళూరు బౌలర్లతో తలపడి జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. ఓపెనర్లు డికాక్ (18), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎంతో సేపు నిలువలేదు. పవర్ ప్లేలోనే డికాక్ ఔట్కాగా... కాసేపటికే ఇషాన్ కిషన్ వికెట్ సమర్పించుకున్నాడు. తర్వాత వచ్చిన వారిలో సౌరభ్ తివారి (5), పాండ్యా బ్రదర్స్ కృనాల్ (10), హార్దిక్ (15) పెద్దగా స్కోర్లు చేయలేదు. కానీ వీళ్లు చేసిన ఈ కాసిన్ని పరుగులకు సూర్య కుమార్ మెరుపులు జతకావడంతో లక్ష్యం ఏ దశలోనూ కష్టమవలేదు. ఆద్యంతం ధాటిగా ఆడిన అతను 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. చహల్ ఓవర్లలో సిక్స్‌లు బాదిన ప్రత్యర్థి జట్టుకు చెందిన ప్రతి బౌలర్‌ను సాధికారికంగా ఎదుర్కొన్నాడు. చేయాల్సిన పరుగుల రన్‌రేట్ పెరిగిపోకుండా జాగ్రత్తపడ్డాడు. 17వ ఓవర్ వేసిన మోరిస్ 8 పరుగులు ఇవ్వడంతో ఆఖరి మూడు ఓవర్లలో 18 బంతుల్లో 27 పరుగులుగా సమీకరణం మారింది. అయితే స్టెయిన్ 18వ ఓవర్లో యాదవ్ సిక్స్ కొట్టడం ద్వారా 11 పరుగులు రాబట్టాడు. తర్వాత ఓవర్లో సిక్స్ కొట్టిన హార్దిక్ ఔటైనప్పటికీ పొలార్డ్ 4 బాదడంతో 13 పరుగులు వచ్చాయి. దీంతో 6 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన దశలో సిరాజ్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతినే యాదవ్ బౌండరీకి తరలించడంతో ముంబై విజయం సాధించింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: జోష్ ఫిలిప్ (స్టంప్డ్) డికాక్ (బి) రాహుల్ చహర్ 33; దేవదత్ పడిక్కల్ (సి) బౌల్ట్ (బి) బుమ్రా 74; కోహ్లి (సి) సౌరభ్ తివారీ (బి) బుమ్రా 9; డివిలియర్స్ (సి) రాహుల్ చహర్ (బి) పొలార్డ్ 15; శివమ్ దూబే (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 2; మోరిస్ (సి) ప్యాటిన్సన్ (బి) బౌల్ట్ 4; గురుకీరత్ సింగ్ (నాటౌట్) 14; వాషిం్టగ్టన్ సుందర్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–71, 2–95, 3–131, 4–134, 5–134, 6–138. బౌలింగ్: బౌల్ట్ 4–0–40–1, బుమ్రా 4–1–14–3, కృనాల్ 4–0–27–0, ప్యాటిన్సన్ 3–0–35–0, రాహుల్ చహర్ 4–0–43–1, పొలార్డ్ 1–0–5–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) గురుకీరత్ (బి) సిరాజ్ 18; ఇషాన్ కిషన్ (సి) మోరిస్ (బి) చహల్ 25; సూర్యకుమార్ (నాటౌట్) 79; సౌరభ్ తివారీ (సి) పడిక్కల్ (బి) సిరాజ్ 5; కృనాల్ (సి) మోరిస్ (బి) చహల్ 10; హార్దిక్ (సి) సిరాజ్ (బి) మోరిస్ 17; పొలార్డ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.1 ఓవర్లలో 5 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–37, 2–52, 3–72, 4–107, 5–158. బౌలింగ్: మోరిస్ 4–0–36–1, స్టెయిన్ 4–0–43–0, సుందర్ 4–0–20–0, సిరాజ్ 3.1–0–28–2, చహల్ 4–0–37–2. -
జేఈఈ–అడ్వాన్స్డ్ టాపర్ చిరాగ్
న్యూఢిల్లీ/పుణే: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–అడ్వాన్స్డ్ పరీక్షలో మహారాష్ట్రలోని పుణే విద్యార్థి చిరాగ్ ఫలోర్ టాపర్‌గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన గంగుల భువన్‌రెడ్డి రెండో ర్యాంకు, బిహార్‌కు చెందిన వైభవ్‌రాజ్ మూడో ర్యాంకు సాధించారు. ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ–ఢిల్లీ సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది జేఈఈ–అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ–ఢిల్లీ నిర్వహించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1.6 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 1.5 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 43 వేల మందికిపైగా అర్హత సాధించారు. వీరిలో 6,707 మంది బాలికలు ఉన్నారు. మొదటి ర్యాంకు సాధించిన చిరాగ్ ఫలోర్ మొత్తం 396 మార్కులను గాను 352 మార్కులు సాధించాడు. 17వ ర్యాంకర్ కనిష్కా మిట్టల్ బాలికల్లో అగ్రస్థానంలో నిలిచారు. అమె 315 మార్కులు సాధించారు. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ అభినందనలు తెలియజేశారు. ఆయన సోమవారం ట్వీట్ చేశారు. సమీప భవిష్యత్తులో ఆత్మ నిర్భర్ భారత్ కోసం పని చేయాలని కోరారు. పరీక్షలో కోరుకున్న ర్యాంకు పొందలేకపోయిన వారికి ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాలు పొందనున్నారు. ఎంఐటీలోనే చదువు కొనసాగిస్తా: చిరాగ్ జేఈఈ–అడ్వాన్స్డ్ టెస్టులో తనకు మొదటి ర్యాంకు దక్కినప్పటికీ అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లోనే చదువు కొనసాగిస్తానని చిరాగ్ ఫలోర్ తెలిపాడు. ఈ ఏడాది మార్చి లో ఎంఐటీలో అడ్మిషన్ పొందానని, ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా క్లాస్‌లకు హాజరవుతున్నానని వెల్లడించాడు. జేఈఈ–మెయిన్‌లో 12వ ర్యాంకు పొందిన చిరాగ్ అడ్వాన్స్‌డ్‌లో ఏకంగా ఫస్టు ర్యాంకు సొంతం చేసుకోవడం విశేషం. ఐఐటీల్లో సీటు దక్కించుకోవడం చాలా కష్టమైన విషయమని చిరాగ్ వివరించాడు. ప్రతిభకు మెరుగుదిద్దే విద్యావిధానం ఉన్న ఎంఐటీలోనే చదువు కొనసాగిస్తానని పేర్కొన్నాడు. ఎంఐటీ ప్రవేశ పరీక్ష కంటే జేఈఈ టెస్టే కఠినంగా ఉంటుందని, ఈ పరీక్ష తనకు భిన్నమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. చిరాగ్ ఫలోర్ ఢిల్లీని ప్రగతి పబ్లిక్ స్కూల్, పుణేలోని సెయింట్ ఆర్నాల్డ్ సెంట్రల్ స్కూల్లో చదివాడు. 2019లో హంగేరీలో జరిగిన 13వ అస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ ఇంటర్నేషనల్ ఒలంపియాడ్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. 2019లో అమెరికన్ మ్యాథమెటిక్స్ పోటీలో ఫస్టు ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 2020 సంవత్సరానికి గాను బాలశక్తి పురస్కారం స్వీకరించాడు. ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. జాతీయ స్థాయిలో టాప్ 10 ర్యాంకర్లు... 1. చిరాగ్ ఫాలర్ (మహారాష్ట్ర) 2. గంగుల భువన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) 3. వైభవ్‌రాజ్ (బిహార్) 4. ఆర్.మహేందర్‌రాజ్ (రాజస్తాన్) 5. కేశవ్ అగర్వాల్ (హరియాణా) 6. హర్ధిక్ రాజ్‌పాల్ (తెలంగాణ) 7. వేదాంగ్ ధీరేంద్ర అస్గోవాంకర్ (మహారాష్ట్ర) 8. స్వయం శశాంక్ చూబే (మహారాష్ట్ర) 9. హర్షవర్ధన్ అగర్వాల్ (హరియాణా) 10. ధ్వనిత్ బేనీవాల్ (హరియాణా) -
సంప్రాస్‌ను దాటిన జొకోవిచ్
రోమ్: ఈ ఏడాది ఓటమి లేకుండా తన జైత్రయాత్ర కొనసాగిస్తున్న సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తన కెరీర్లో మరో మైలురాయి అందుకున్నాడు. సోమవారం ఇటాలియన్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో విజేతగా నిలిచిన జొకోవిచ్ అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ నంబర్‌వన్ ర్యాంకర్ మరో ఘనత వహించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టిన తర్వాత అత్యధిక వారాలపాటు టాప్ ర్యాంక్‌లో నిలిచిన రెండో ప్లేయర్‌గా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ టాప్ ర్యాంక్‌లో నిలువడంతో అతను ఈ స్థానంలో 287 వారాలు ఉన్నట్టయింది. దాంతో 286 వారాలతో ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న అమెరికా దిగ్గజం పీట్ సంప్రాస్ మూడో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో 310 వారాలతో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తొలి స్థానంలో ఉన్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో ‘టాప్ ర్యాంక్’ ఘనత స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ–377 వారాలు) పేరిట ఉంది. -
కూలీ కూతురు.. టాపర్
నంగునూరు(సిద్దిపేట): కూలీ పనులు చేస్తేనే పూట గడిచే కుటుంబం.. పైగా నిరక్ష్యరాస్యులు.. తమలాగ పిల్లలు కూలీ పనులు చేయకుండా చదివి ప్రయోజకులు కావాలని కలలు కన్నారు. వారి కలను నిజం చేస్తూ ఇంటర్లో మండల టాపర్‌గా దేవర రమ్య నిలిచింది. మండల కేంద్రం నంగునూరుకు చెందిన దేవర ఉప్పలయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఉప్పలయ్య స్థానికంగా ఇనుప సామాను వ్యాపారం చేయడంతో పాటు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తుండగా అతని భార్య పద్మ బీడీలు చుట్టడంతో పాటు కూలీ పనులకు వెళ్తూ పిల్లలను చదివిస్తున్నారు. వారి పెద్ద కూతురు రమ్య అక్కేపల్లి మోడల్స్కూల్లో చేరి పదో తరగతిలో మంచి జీపీఏ సాదించింది. అదే స్ఫూర్తితో ఇంటర్ బైపీసీలో 920 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. పేదరికంతో ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల బాధ చూసి చక్కగా చదివి మంచి ఉద్యోగం చేయాలనే పట్టుదలతో చదివానని ఆమె పేర్కొంది. కాగా రెండవ కూతురు రవళి గతేడాది పదో తరగతిలో పది జీపీఏ సాదించి బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించింది. రైతు కుటుంబంలో విద్యాకుసుమం : రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంక్ సాధించిన సువర్ణ హుస్నాబాద్: వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఇర్రి సువర్ణ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంక్ సాధించింది. హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదివిన సువర్ణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ (ఇంగ్లీష్ మీడియం)లో 978/1000 మార్కులు సాధించింది. అక్కన్నపేట మండలం రేగొండ గ్రామానికి చెందిన ఇర్రి మల్లారెడ్డి, పద్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద అమ్మాయి డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేసింది. రెండవ కుమార్తె అపర్ణ కూడా హుస్నాబాద్ ప్రభుత్వ కళాశాలలో 2017–2019 సంవత్సరంలో ఎంపీసీలో 922 మార్కులు సాధించి జిల్లా స్ధాయిలో ర్యాంకర్‌గా నిలిచింది. సువర్ణ గత విద్యా సంవత్సరంలో ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 456/470 మార్కులు సాధించి సిద్దిపేట జిల్లా ప్రభుత్వ కళాశాలల విభాగంలో జిల్లా టాపర్‌గా నిలిచింది. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ ముగ్గురు కూతుళ్లకు ఎలాంటి లోటు రాకుండా చదివిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత చదువులు చదివి భవిష్యత్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే లక్ష్యమని సువర్ణ తెలిపారు. -
ఫెడరర్ సంపాదన రూ. 803 కోట్లు
వాషింగ్టన్: ఏడాది కాలంలో అత్యధిక ఆర్జనగల క్రీడాకారుల జాబితాలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తొలిసారి టాప్ ర్యాంక్‌లో వచ్చాడు. ‘ఫోర్బ్స్’ పత్రిక విడుదల చేసిన టాప్–100 క్రీడాకారుల జాబితాలో ఫెడరర్ ఐదో స్థానం నుంచి అగ్రస్థానానికి ఎగబాకాడు. 2019 జూన్ నుంచి 2020 జూన్ కాలానికి ఫెడరర్ మొత్తం 10 కోట్ల 63 లక్షల డాలర్లు (రూ. 803 కోట్లు) సంపాదించాడు. ఇందులో 10 కోట్ల డాలర్లు ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చాయి. మిగతా 63 లక్షల డాలర్లు టోర్నీలు ఆడటం ద్వారా గెల్చుకున్న ప్రైజ్‌మనీ. గతేడాది ‘టాప్’లో నిలిచిన పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 10 కోట్ల 50 లక్షల డాలర్ల ఆర్జనతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ కెప్టెన్ లియోనెల్ మెస్సీ (10 కోట్ల 40 లక్షల డాలర్లు) మూడో ర్యాంక్‌లో నిలిచాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఏకంగా 34 స్థానాలు ఎగబాకాడు. గతేడాది 100వ ర్యాంక్‌లో నిలిచిన కోహ్లి ఈసారి 2 కోట్ల 60 లక్షల డాలర్ల (రూ. 196 కోట్లు) ఆర్జనతో 66వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. కోహ్లికి ఎండార్స్మెంట్ల ద్వారా 2 కోట్ల 40 లక్షల డాలర్లు లభించగా... 20 లక్షల డాలర్లు ప్రైజ్‌మనీ, వేతనం ద్వారా వచ్చాయి. టాప్–100లో నిలిచిన ఏకైక క్రికెటర్, భారత్ నుంచి ఏకైక క్రీడాకారుడు కోహ్లినే కావడం విశేషం. -
‘టాప్’తో ముగించిన కోహ్లి
దుబాయ్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఈ ఏడాదిని టెస్టుల్లో ‘టాప్’ ర్యాంక్‌తో ముగించాడు. సోమవారం విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి 928 రేటింగ్ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్–822 పాయింట్లు) మూడో స్థానంలో... ఆస్ట్రేలియా తాజా సంచలనం లబ్‌షేన్ నాలుగో స్థానంలో నిలిచారు. చతేశ్వర్ పుజారా 791 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. -
‘టాప్’తో ముగించిన కోహ్లి
దుబాయ్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్రస్థానంతో 2019ను ముగించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తాజా వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అతను 887 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకులో నిలిచాడు. కోహ్లి సహచరుడు, వైస్‌కెప్టెన్ రోహిత్ (873) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల టెస్టుల్లోను విరాట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మూడు ఫార్మాట్లలో ఈ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా రోహిత్ (2442 పరుగులు) లంక మాజీ ఓపెనర్ జయసూర్య (2387; 1997లో) 22 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. అయితే ఓవరాల్‌గా 2455 పరుగులతో ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు. ఈ రెండు రికార్డులు విండీస్ తో జరిగిన ఆఖరి వన్డేలో నమోదయ్యాయి. -
‘ఇండియా జస్టిస్’లో మహారాష్ట్ర టాప్
సాక్షి, న్యూఢిల్లీ: టాటా ట్రస్ట్ రూపొందించిన ‘ఇండియా జస్టిస్’ ర్యాంకింగ్స్‌లో 18 పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మహారాష్ట్ర నంబర్ 1 స్థానంలో నిలిచింది. తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్‌కు 13వ స్థానాలు దక్కాయి. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి. పౌరులకు న్యాయ సేవలు అందుతున్న తీరుకు అద్దం పట్టే ఈ నివేదికను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ ఆవిష్కరించారు. వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో టాటా ట్రస్టు ఈ నివేదిక రూపొందించింది. నాలుగు కేటగిరీలుగా.. పోలీస్, ప్రిజన్స్, జ్యుడీషియరీ, లీగల్ ఎయిడ్ అనే నాలుగు కేటగిరీలకు వచ్చిన స్కోర్ల ఆధారంగా.. 2015–16, 2016–17, 2017–18, 2018–19 సం వత్సరాల డేటా ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ఆయా కేటగిరీల్లో బడ్జెట్, భిన్నత్వం, మానవ వనరులు, మౌలిక వసతులు, పని భారం అంశాల్లో మెరుగైన పనితీరుకు స్కోరు అందించారు. నాలుగు కేటగిరీల్లో వచ్చిన స్కోరు ఆధారంగా ర్యాంకు కేటాయించారు. 18 పెద్ద, మధ్యస్థాయి రాష్ట్రాలను ఒక విభాగంగా, 7 చిన్న రాష్ట్రాలను మరొక విభాగంగా చేసి ర్యాంకులు ప్రకటించారు. లీగల్ ఎయిడ్ అంశంలో మెరుగైన పనితీరుతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలవగా.. పోలీస్ అంశంలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచింది. -
గేట్‌మ్యాన్ కొడుకు సినిమా చూపిస్తున్నాడు
టిక్‌టాక్... ఇటీవల వచ్చిన ఒక పెద్ద ప్రభంజనం. చాలామంది వారి వారి ప్రతిభను ఇందులో పొందుపరుస్తు్తన్నారు. ఐదు నెలల క్రితం టిక్‌టాక్‌లో జోకులు పెట్టడం ప్రారంభించిన భార్గవ్ చిప్పాడ ఇప్పుడు ‘సౌత్ ఇండియా టిక్ టాక్’ గా టాప్ ర్యాంకులో ఉన్నాడు. 43 లక్షల వ్యూయర్స్‌తో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ర్యాంకులో నిలిచాడు. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన భార్గవ్ చిప్పాడ సాధించిన ఈ విజయాల గురించి అతడి మాటల్లోనే... ‘‘మా నాన్న (ఆదినారాయణరావు) కొత్తవలస శ్రీలక్ష్మీనరసింహ థియేటర్లో గేట్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. మా అమ్మ (లక్ష్మి) ‘జామీ హైస్కూల్’లో అటెండర్‌గా పనిచేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఏదో ఒకటి సాధించాలనే కోరిక. అప్పటికప్పుడు జోకులు వేయడం నాకు వచ్చిన విద్య. దీన్నే ఉపయోగించాలనుకున్నాను. చాన్స్ కోసం చూస్తుండగా వైజాగ్‌లో జూనియర్ ఆర్టిస్టుగా పని దొరికింది. లెజెండ్, మళ్లీమళ్లీ ఇది రాని రోజు, తమిళంలో ఒక సినిమాలో నటించా. ఆ తరవాత జూనియర్ ఆర్టిస్టుల సప్లయర్‌గా పనిచేశాను. అదంతగా నచ్చలేదు. సొంతంగా ఏదో చేయాలనే తపన బలపడింది. ‘మోడీ ఈజ్ మై డాడీ’ 2014లో హైదరాబాద్ చేరుకున్నాను. అదే సంవత్సరం ‘మోడీ ఈజ్ మై డాడీ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించాను. ఆ చిత్ర నిర్మాత దగ్గరే ఒక యేడాది ఆఫీసు బాయ్‌గా పనిచేశాను. కాని నా గోల్ వేరు కదా. ఒక్క చాన్స్ ఇవ్వమని ఎవరి దగ్గరకు వెళ్లినా ‘ఇంతకుముందు చేసిన వీడియోలు ఏమైనా ఉన్నాయా’ అని అడగటం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే ‘సినిమాలోకి దారేది’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించే అవకాశం వచ్చింది. అందులో అన్నిరకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఆ సినిమా తీసుకుని అందరినీ కలిశాను. హర్ష అన్నవరపు అనే అతను నన్ను గుర్తించారు. 2016లో ‘ఫన్ బకెట్’ పేరుతో మొత్తం 180 ఎపిసోడ్స్ చేశాను. ‘దేశముదురు’ ప్రోగ్రామ్‌లో ధనరాజ్‌తో చేశాను. నాకు పేరు వచ్చింది. అక్కడ నుంచి జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది. అప్పుడు మొదలైంది.. అప్పుడే టిక్‌టాక్ ఒక ప్రభంజనంలా వచ్చింది. అందరూ ఆ యాప్‌ను వాడుకుంటూ, వారి వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. నా సొంత జోకులతో నేనూ ఇందులో అప్లోడ్ చేయొచ్చుగా అనుకున్నాను. స్టార్ట్ చేశాను కూడా. 2019, ఏప్రిల్ ఒకటో తేదీన ఒక ఏప్రిల్ ఫూల్ జోకు చేశాను. అది అంతర్జాతీయంగా బాగా వైరల్ అయ్యింది.49 లక్షల వ్యూస్ వచ్చాయి. దాంతో నాకు వచ్చిన పేరును నిలబెట్టుకోవాలనుకున్నాను. ‘అమ్మాయి – అబ్బాయి’ పేరుతో ఒక సిరీస్‌గా స్టార్ట్ చేశాను. ఇది తెలుగులో బాగా వైరల్ అయ్యింది. అందరికీ తెలిసిన పదాలతోనే పంచెస్ వేయడం వల్ల నా వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ‘విగో యాప్ వాళ్లు పిలిచారు ‘విగో’ ఆప్ వాళ్లు పిలిచారు. నెల జీతం ఇవ్వడం ప్రారంభించారు. ‘రేస్ గేమ్’ వాళ్లకి ప్రకటన చేశాను. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ నిత్యశ్రీతో కలిసి ఇంగ్లీషులో చేసిన టిక్‌టాక్ కూడా బాగా వైరల్ అయ్యింది. ఆస్ట్రేలియా, అమెరికాల నుంచి కూడా మెసేజెస్ రావడం మొదలైంది. నన్నిప్పుడు ‘సౌతిండియా టిక్‌టాక్ స్టార్’ అంటున్నారు. – వైజయంతి పురాణపండ నా సినిమాకు నాన్న టికెట్ చింపారు ‘నాయుడుతోట’లో ఆఫీస్ ఓపెన్ చేశాను. రేస్ గేమ్, స్విగ్గీ, మిస్టర్ రమ్మీలకి ప్రమోషన్ యాడ్ చేశాను. వీటి వల్ల డౌన్లోడ్స్ పెరిగి, సర్వర్ డౌన్ అయిపోవడంతో, సర్వర్ నుంచి వాళ్లు ఫోన్ చేసి, ‘రెక్టిఫై చేస్తున్నాం, కంగారు పడకండి’ అన్నారు. అంత బాగా చూశారు ఈ ప్రకటనలను. ఒంటరిగా బయలుదేరిన నేను టీమ్ భార్గవ్‌గా అయ్యాను. ‘కిర్రాక్ పార్టీ’ సినిమా నాన్నగారు పనిచేస్తున్న థియేటర్లో రిలీజ్ అయ్యింది. నా సినిమాకు నాన్న టికెట్ చింపారు. అదొక అనుభూతి. అలాగే సుబ్రహ్మణ్యపురం, మిస్టర్ మజ్ను, హిప్పి సినిమాలు కూడా నాన్న పనిచేస్తున్న థియేటర్లోనే విడుదలయ్యాయి. ‘ఫన్ బకెట్’ భార్గవ్ చిప్పాడ టిక్‌టాక్ స్టార్