ఇంజనీరింగ్ హబ్... హైదరాబాద్ | Hub Hyderabad to go to finishi | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్ హబ్... హైదరాబాద్

Published Thu, Jun 26 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

ఇంజనీరింగ్ హబ్... హైదరాబాద్

ఇంజనీరింగ్ హబ్... హైదరాబాద్

టాప్ స్టోరీ: శ్రీకాంత్ ఎంసెట్‌లో టాప్ ర్యాంకు సాధించాడు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీ ఇంజనీరింగ్ క్యాంపస్ కళాశాలల్లో సీటు లభించే అవకాశం ఉంది. కానీ, అతను మాత్రం హైదరాబాద్‌లోని ప్రముఖ యూనివర్సిటీ క్యాంపస్‌కే తొలి ప్రాధాన్యత ఇచ్చాడు. ఒక్క శ్రీకాంతే కాదు.. చాలా మంది విద్యార్థుల ఇంజనీరింగ్ విద్యకు హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలలకు నెలవై... భావి ఇంజనీర్ల భవిష్యత్తుకు భరోసా ఇస్తోంది. నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు
 అందించి సమర్థ ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతోంది!   
 
 సుమారు వందకు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్ పరిధిలోనే కొలువుదీరాయి. వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో హైదరాబాద్... ఇంజనీరింగ్ విద్యకు హబ్‌గా మారిందనడంలో అతిశయోక్తి లేదు! గత విద్యాసంవత్సరాల్లో జరిగిన ప్రవేశాలే ఇందుకు నిదర్శనం. టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో 60 శాతం మంది హైదరాబాద్‌నే తమ కెరీర్ ప్రస్థానానికి కేంద్ర స్థానంగా ఎంచుకుంటున్నారు.
 
 సొంతూరి అనుభూతి:
 ‘హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదవడానికి బయలుదేరినప్పుడు కలిగిన సందేహాలు, మానసిక ఆందోళనలూ ఇప్పుడు లేవు. ఇక్కడి వాతావరణం కొన్ని నెలల్లోనే సొంతూరిలో ఉన్న అనుభూతిని కలిగించింది. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు స్నేహపూర్వకంగా మసలుకుంటారు’ అంటూ తన అనుభవాన్ని తెలిపాడు ఖమ్మం జిల్లాకు చెందిన వి.వినీత్. ఎంసెట్-2013లో 447 ర్యాంకు సాధించి  హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సీటును సొంతం చేసుకున్నాడు. ‘కోరుకున్న కళాశాలలో సీటు లభించిందన్న ఆనందంతోపాటు సొంతూరును వదిలి వస్తున్నాననే ఆందోళన కూడా మనసులో మొదలైంది. బిడియం, బెదురుతో హైదరాబాద్‌లో అడుగు పెట్టాను.  కొద్ది రోజుల్లోనే ఇక్కడి కల్చర్, పద్ధతుల తో మమేకమైపోయా. స్వేచ్ఛగా, ధైర్యంగా చదువుపై దృష్టిపెట్టా. ఇంజనీరింగ్ తొలి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమవుతున్నా’ అని వినీత్ తెలిపాడు.
 
 నైపుణ్యాల సాధన:
 ‘మూడేళ్ల క్రితం.. ఇంజనీరింగ్‌లో ప్రవేశించేటప్పుడు కమ్యూనికేషన్‌లో నేను చాలా వీక్‌గా ఉన్నా. తెలుగు మీడియం బ్యాగ్రౌండ్ నుంచి రావడం కూడా అందుకు కారణం కావొచ్చు. కానీ, హైదరాబాద్‌కు వచ్చాక  నా ఇంగ్లిష్ మెరుగైంది. ఇప్పుడు నేను ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాను’ అని అదే క్యాంపస్‌లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న మహబూబ్‌నగర్  జిల్లాకు చెందిన పి.సందీప్ తెలిపాడు. ఇంజనీరింగ్ విద్యార్థికి కావాల్సిన నైపుణ్యాలకు వేదికగా కూడా హైదరాబాద్ నిలుస్తోంది. ‘క్యాంపస్‌లో నిర్వహించే సీఆర్‌టీ (క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్) అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఏయే అంశాల్లో బలహీనమో వాటిలో నైపుణ్యాలు సాధించేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యాను. హైదరాబాద్... భవిష్యత్తుపై నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపింది’ అని చెప్పాడు సందీప్.  
 
 ఇంజనీరింగ్ విద్య:
 హైదరాబాద్ పరిధిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్య ఎక్కువే. జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ట్రిపుల్ ఐటీ,  బిట్స్‌తోపాటు క్యాంపస్ కాలేజీలైన ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లు, ఇంకా పలు పేరున్న ప్రయివేట్ ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థుల టాప్ డెస్టినేషన్‌‌సగా నిలుస్తున్నాయి.   ‘హైదరాబాద్.. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్‌కు కేంద్ర బిందువుగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తగిన మౌలిక సదుపాయాలు, విద్యాసేవలు అందుబాటులో ఉండడం ఇక్కడి ప్రత్యేకత’ అని ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఎం.వెంకట్ దాస్ అన్నారు.
 
  ‘జేఎన్‌టీయూ, ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల, ఇతర ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల తరహాలో విద్యా ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత అన్ని ఇంజనీరింగ్ కళాశాలలపై ఉంది. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం- నిపుణులైన అధ్యాపకులను నియమించి, తగిన మౌలిక సదుపాయాలను కల్పించినప్పుడే ఇంజనీరింగ్ నిపుణులను తీర్చిదిద్దగలుగుతాం. నాణ్యమైన ఇన్‌పుట్‌తోనే నాణ్యమైన అవుట్‌పుట్ సాధ్యమవుతుంది. ఇక్కడ ఇన్‌పుట్ అంటే విద్యార్థులు, ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలే. అవన్నీ ఉన్నప్పుడే నాణ్యమైన అవుట్‌పుట్ వెలువడుతుంది’ అని అభిప్రాయపడ్డారు.  
 
 ఉద్యోగావకాశాలు:
 ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు ఎక్కువే. ముఖ్యంగా ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, నిర్మాణ రంగ కంపెనీలు ఎక్కువగా అవకాశాలు కల్పిస్తున్నాయి. హైటెక్ పథంలో దూసుకుపోతున్న నగర పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు పోటీపడతాయి. ‘క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఎంపిక చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఐబీఎం, గూగుల్, టెక్ మహీంద్రా తదితర సంస్థలు ఆకర్షణీయ వేతనాలు చెల్లిస్తున్నాయి. వాటితో పోల్చినప్పుడు వేదాంత, సుజుకీ మోటార్ కార్పొరేషన్, ఐడియా సెల్యులార్ తదితర కోర్ కంపెనీల్లో మరింత ఎక్కువ పే ప్యాకేజ్‌లు అందుబాటులో ఉంటున్నాయి’ అని ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్లేస్‌మెంట్ ఆఫీసర్ వి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు అన్ని స్థాయిల్లో రాణించి సమున్నత భవిష్యత్తును సొంతం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
 
 లైఫ్ స్టైల్:
 నవీన నాగరికత విషయంలో హైదరాబాద్ ముందంజలోనే ఉంటోంది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఇక్కడ ఎక్కువే. అది పరిధి దాటితే విద్యార్థులపై దుష్ర్పభావం చూపే ప్రమాదమూ ఉంది. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ‘మితిమీరిన ఇంటర్నెట్ వినియోగం జోలికి పోకుండా కళాశాలలో అందుబాటులో ఉండే కంప్యూటర్స్‌ను ఉపయోగించి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై పట్టు సాధించాలి. సిటీ విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటికల్ స్కిల్స్‌లో వెనుకబడి ఉంటున్నారు. వాటిలో మెరుగుపడాలి’ అని వెంకట్‌దాస్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement