
బెస్ట్ యూనివర్సిటీగా బెంగళూరు ఐఐఎస్‌సీ
ఎన్‌ఐఆర్‌ఎఫ్–2024 ర్యాంకుల వెల్లడి
న్యూఢిల్లీ: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్)–2024 ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఓవరాల్‌తోపాటు ఇంజినీరింగ్ కేటగిరీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ వరుసగా ఆరోసారి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఐఐటీ హైదరాబాద్‌కు 8వ ర్యాంకు దక్కింది. ఉత్తమ యూనివర్సిటీగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) బెంగళూరు వరుసగా 9వసారి మొదటి స్థానం సంపాదించుకుంది.
అదేవిధంగా, ఓవరాల్ కేటగిరీలో ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్‌బీఏ) రూపొందించిన ఈ ర్యాంకింగ్స్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం విడుదల చేశారు. ఓవరాల్ టాప్–10 జాబితాలో 8 ఐఐటీలతోపాటు ఢిల్లీ ఎయిమ్స్, ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ చోటుసంపాదించాయి.
యూనివర్సిటీల కేటగిరీలో టాప్–3లో బెంగళూరు ఐఐఎస్‌సీ, ఢిల్లీలోని జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియాలున్నాయి. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ తర్వాత ఐఐటీ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీల్లో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు ఆరు, విశాఖపట్టణంలోని ఆంధ్రా వర్సిటీకి ఏడో ర్యాంకు దక్కాయి.
ఫార్మసీ విభాగంలో... నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఎన్‌ఐపీఈఆర్)హైదరాబాద్ ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయింది. ఈసారి మొదటి స్థానాన్ని జామియా హందర్డ్ దక్కించుకోగా బిట్స్ పిలానీ మూడో ర్యాంకు సాధించింది. లా యూనివర్సిటీల్లో నల్సార్ హైదరాబాద్‌కు మూడో ర్యాంకు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment