NIRF
-
NIRF: ఈ విధానం లోపభూయిష్టం..
2024 సంవత్సరానికిగాను దేశీయ విద్యా సంస్థలకు అందించే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు విడుదలయ్యాయో లేదో, వాటి ఆధారంగా సామాజిక మాధ్యమాల్లో ప్రైవేటు విద్యాసంస్థల ప్రచార హోరు ఆకాశాన్ని తాకుతోంది. ఈ ర్యాంకులను ఒకసారి పరిశీలిస్తే, 2024లో మొదటి 100 ర్యాంకులు పొందిన విద్యా సంస్థలు 7 రాష్ట్రాల్లోనే విస్తరించి ఉన్నాయి. ఆ రాష్ట్రాలు తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లు. టాప్ 30 ర్యాంక్‌లు పొందిన విద్యా సంస్థలలో 8 డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలు, 10 ఐఐటీలు ఉన్నాయి.ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు నిర్ణయించే ముఖ్యమైన పారామితులు తప్పుగా రూపొందించబడ్డాయి అనిపిస్తోందనీ, ర్యాంకింగ్‌ని నిర్ణయించడానికి వీటిని మరింత తెలివిగా సమీక్షించడం, నిర్వచించడం చాలా ముఖ్యమని విద్యావేత్త్తలు అభిప్రాయ పడుతున్నారు. విద్యాసంస్థలను మూల్యాంకనం చేయడానికి 16 పారామితులను పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో కొన్ని అసంబద్ధంగా ఉన్నాయని మేధావులు పేర్కొంటున్నారు. వాటిలో మొదటిది ‘సమాజలో గుర్తింపు లేదా కీర్తి’ అనేది. దీన్ని ‘సర్వే’ ద్వారా నిర్ణయిస్తారు. కాని, దాని వివరాలు బయటికి తెలియవు. బిట్స్ పిలానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్), ధన్‌బాద్; వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి కొన్ని పాత ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్ల కంటే కొత్తగా ఏర్పాటైన కొన్ని ప్రైవేట్ సంస్థలు త్వరగా పేరు తెచ్చుకోవడానికి అవి సొంతంగా ప్రచారం చేసుకోవడమే కారణం. ప్రభుత్వ సంస్థలు ఇటువంటి ప్రచారం చేసుకోకపోవడం గమనార్హం.పరిశోధన ఫలితాల ప్రచురణల నాణ్యత – వాటి సంఖ్య ముఖ్యమైన పారామితులలో ఒకటి. ఈ విషయంలో చాలా ప్రైవేట్ యూనివర్సిటీలు తమ ర్యాంకింగ్స్‌ను గణనీయంగా పెంచుకున్నాయి. ఫ్యాకల్టీ నాణ్యత, అనుభవం అనేది విద్యార్థుల దృక్కోణం నుండి చాలా ముఖ్యమైన పారామితులలో ఒకటి. అయితే, ఎన్ఐఆర్ఎఫ్ నిర్వచనం ప్రకారం, సవిత ఇన్స్టిట్యూట్ భారతదేశంలో అత్యుత్తమ ఫ్యాకల్టీ నాణ్యతను కలిగి ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (11వ ర్యాంక్), ఐఐటీ మద్రాస్ (55వ ర్యాంక్) వంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లు ఈ విషయంలో వెనుకబడిపోయాయి. అందుకే ఈ పారామితిని ఎన్ఐ ఆర్ఎఫ్ సరిగ్గా నిర్వచించిందా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.అలాగే విద్యార్థి సంఖ్యాబలం కూడా యూని వర్శిటీల ర్యాంకులు పెరగడానికి ఒక కారణం. విద్యా ర్థులను చేర్చుకునే విషయంలో ప్రైవేటు విద్యా సంస్థలకు ఎటువంటి నిబంధనలు లేవు. కాని, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అనేక నిబంధనలు అడ్డు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వ విశ్వ విద్యాలయాల కంటే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. తమిళనాడు వంటి ప్రాంతాలలోని సంస్థలు తమ చివరి సంవత్సరం విద్యార్థులను ఒకటి లేదా రెండు సెమిస్టర్ల ఇంటర్న్‌షిప్‌ల కోసం విదేశీ సంస్థలకు పంపడం ఒక సాధారణ అభ్యాసం– ఇది గ్లోబల్ ఎక్స్ పోజర్‌ను పెంచే చొరవ. సీబీసీఎస్ విధానాన్ని వీఐటీ అనుసరించి తమ విద్యార్థులను విదేశాలకు పంప డాన్ని చూసి తమిళనాడు లోని ఇతర సంస్థలు కూడా సీబీసీఎస్ విధానాన్ని త్వరగా అనుసరించి సామూహిక వృద్ధి స్ఫూర్తిని నేర్చుకున్నాయి. అందు వల్ల ఎన్ఐఆర్ఎఫ్ టాప్ 100లో ఎక్కువ సంస్థలు తమిళనాడుకు చెందినవి కావడంలో ఆశ్చర్యం లేదు.పారామితులను తప్పుగా నిర్వచించడమే కాకుండా, విశ్వవిద్యాలయాలు సమర్పించిన డేటా కచ్చితత్వాన్ని సరిగా నిర్ధారించకపోవడం వల్ల ప్రైవేట్ సంస్థలు మంచి ర్యాంకులు సొంతం చేసుకుంటున్నాయనేది ఒక అభియోగం. 410 మందితో ఇండియా రీసెర్చ్ వాచ్ నిర్వహించిన ఒక సర్వేలో, చాలా మంది (39 శాతం) ఎన్‌ఐఆర్‌ఎఫ్‌కు సమర్పించిన డేటా తప్పు అని భావించారు.పైన పేర్కొన్నవే కాక అనేక ఇతర కారణాల వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు మంచి ర్యాంకులు సాధించగా... ప్రభుత్వ సంస్థలు ఎంత నాణ్యమై నవైనా తగిన ర్యాంకులను సాధించలేక పోయాయి.– ప్రొ. ఈదర శ్రీనివాస రెడ్డి, వ్యాసకర్త, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ -
NIRF rankings 2024: ఐఐటీ మద్రాస్ టాప్
న్యూఢిల్లీ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)–2024 ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఓవరాల్‌తోపాటు ఇంజినీరింగ్ కేటగిరీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ వరుసగా ఆరోసారి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఐఐటీ హైదరాబాద్‌కు 8వ ర్యాంకు దక్కింది. ఉత్తమ యూనివర్సిటీగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) బెంగళూరు వరుసగా 9వసారి మొదటి స్థానం సంపాదించుకుంది. అదేవిధంగా, ఓవరాల్ కేటగిరీలో ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) రూపొందించిన ఈ ర్యాంకింగ్స్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం విడుదల చేశారు. ఓవరాల్ టాప్–10 జాబితాలో 8 ఐఐటీలతోపాటు ఢిల్లీ ఎయిమ్స్, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ చోటుసంపాదించాయి. యూనివర్సిటీల కేటగిరీలో టాప్–3లో బెంగళూరు ఐఐఎస్సీ, ఢిల్లీలోని జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియాలున్నాయి. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ తర్వాత ఐఐటీ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీల్లో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు ఆరు, విశాఖపట్టణంలోని ఆంధ్రా వర్సిటీకి ఏడో ర్యాంకు దక్కాయి.ఫార్మసీ విభాగంలో... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఎన్ఐపీఈఆర్)హైదరాబాద్ ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయింది. ఈసారి మొదటి స్థానాన్ని జామియా హందర్డ్ దక్కించుకోగా బిట్స్ పిలానీ మూడో ర్యాంకు సాధించింది. లా యూనివర్సిటీల్లో నల్సార్ హైదరాబాద్‌కు మూడో ర్యాంకు దక్కింది. -
బోధన.. వేదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత విద్యాప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జాతీయ ర్యాంకింగ్‌లో యూనివర్సిటీలు వెనకబడుతున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023)లో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఓవరాల్ ర్యాంకులో 64కు పడిపోయింది. గతేడాది ఓయూ 46వ ర్యాంకులో నిలిచింది. జేఎన్టీయూహెచ్ గతేడాది 76వ ర్యాంకుతో ఉంటే ఈ ఏడాది 98వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. అధ్యాపకుల కొరతే ఈ పరిస్థితికి కారణమని అన్ని వర్గాలూ భావిస్తున్నా ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. గతేడాది తెలంగాణ యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లును అసెంబ్లీ ఆమోదించినా అది ఇంకా గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉంది. ఈ ఫైల్‌ను రాష్ట్రపతి పరిశీలనకు పంపామని గవర్నర్ పేర్కొన్నారు. 1,869 పోస్టులు ఖాళీ.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లోనూ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అన్నిచోట్లా కాంట్రాక్టు అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 2021 జనవరి 31 నాటికి 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉండగా వాటిలో ఏకంగా 1,869 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అంటే కేవలం 968 (34.12 శాతం) మందే రెగ్యులర్ ఆధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 157 మంది ప్రొఫెసర్లు ఉండగా మరో 238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా మరో 781 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుండగా 850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా ఇంతవరకు వాటిని భర్తీ చేయలేదు. ప్రొఫెసర్లేరి? ♦ రాష్ట్రంలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని యూనివర్సిటీలు ఆరు ఉన్నాయి. అవి శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. శాతవాహన, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ), బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లే లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరే ఉన్నారు. మెుత్తంగా చూస్తే 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. మరోవైపు 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నత విద్యాశాఖ లెక్కలు వేసింది. ♦వందేళ్లకుపైగా చరిత్రగల ఉస్మానియా యూనివర్సిటీలో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో ఇప్పుడు కేవలం ఒక్కరే ప్రొఫెసర్ ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు. శాతవాహన యూనివర్సిటీ, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కరంటే ఒక్కరూ లేరు. తెలుగు యూనివర్సిటీలో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్‌తోనే నెట్టుకొస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిట్చెర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు బోధన సాగిస్తున్నారు. క్రమబద్ధీకరణ చేయరా? గత కొంతకాలంగా రెగ్యులర్ చేయాలని ఆందోళన చేస్తున్న యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ ఆదివారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావులను కలిసింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేసేందుకు కృషి చేయాలని వినతిపత్రం అందించింది. సోమవారం జరిగే కేబినేట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరింది. -
జాతీయ ర్యాంకుల్లో పడిపోయిన రాష్ట్ర యూనివర్సిటీలు.. కారణం అదేనా!
సాక్షి, హైదరాబాద్: అధ్యాపకుల కొరత రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మరోసారి రుజువైంది. తాజాగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023) నివేదికలో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియాతోపాటు జేఎన్టీయూహెచ్ ర్యాంకులు కూడా తగ్గాయి. జాతీయ ఓవరాల్ ర్యాంకుల్లోనే కాదు.. పరిశోధన, యూనివర్సిటీ స్థాయి ప్రమాణాల్లోనూ విశ్వవిద్యాలయాలు వెనుకంజలో ఉన్నాయి. అన్నింటికన్నా ఐఐటీ–హైదరాబాద్ అన్ని విభాగాల్లోనూ దూసుకుపోవడం విశేషం. గత మూడేళ్ల విద్యా ప్రమాణాల ఆధారంగా ఎన్ఐఆర్ఎఫ్ ఏటా ర్యాంకులు ఇస్తుంది. ఐఐటీ–హైదరాబాద్ దూకుడు.. ఓయూ వెనక్కు జాతీయస్థాయిలో వంద యూనివర్సిటీల్లో ఐఐటీ–హైదరాబాద్ గత ఏడాది మాదిరిగానే 14వ స్థానంలో నిలిచింది. ఈ సంస్థలో 2019లో 144 మంది రూ.17 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. 2020–21లో 185 మంది రూ.16 లక్షలకుపైగా, 2021–22లో 237 మంది రూ.20 లక్షలకుపైగా ప్యాకేజీతో ఉపాధి పొందారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోనూ విద్యార్థులు అత్యధికంగా రూ.40 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. నిట్ వరంగల్‌లో అత్యధికంగా యూజీ విద్యార్థులు ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో ఈ సంస్థ మంచి ప్రమాణాలు నెలకొల్పినట్టు నివేదిక పేర్కొంది. అయినప్పటికీ ఈ సంస్థలో అధ్యాపకుల కొరత వల్ల రీసెర్చ్‌లో వెనుకబడింది. ఫలితంగా నిట్ వరంగల్ జాతీయర్యాంకు 2022లో 45 ఉండగా, ఈసారి 53కు చేరింది. ఉస్మానియా వర్సిటీ ఓవరాల్ ర్యాంకులో గత ఏడాది 46 ఉంటే, ఈసారి 64 దక్కింది. ఇక్కడా పరిశోధనల్లో నెలకొన్న మందకొడితనమే జాతీయ ర్యాంకుపై ప్రభావం చూపింది. ఈసారి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు ఓవరాల్ ర్యాంకులో గతంలో మాదిరిగానే 20వ ర్యాంకు వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10 ర్యాంకుతో నిలకడగా ఉంది. హైదరాబాద్ ట్రిపుల్ఐటీ జాతీయస్థాయిలో 84వ ర్యాంకు పొందింది. చదవండి: విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో హైదరాబాద్‌కు దక్కని చోటు ఇంజనీరింగ్‌లో వెనుకబాటుతనం ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ సరికొత్త బోధన విధానాలతో 9లో ఉన్న ర్యాంకును 8కి తేగలిగింది. ఎక్కువ ఇంజనీరింగ్ అనుబంధ కాలేజీలున్న జేఎన్టీయూ–హెచ్ 76 నుంచి 98కి పడిపోయింది. నిట్ వరంగల్ 21వ ర్యాంకుతో నిలిచింది. ఈసారి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ జాతీయస్థాయి కాలేజీల విభాగంలో 98 ర్యాంకును సాధించింది. పరిశోధన విభాగంలో ట్రిపుల్ఐటీ హైదరా బాద్ ర్యాంకు 12 నుంచి 14కు చేరింది. అధ్యాపకుల కొరతే కారణం: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో వెనుకబడటానికి ప్రధాన కారణం అధ్యాపకుల కొరత. కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడం వల్ల పరిశోధనలో వెనుకబడిపోతున్నాం. అయినప్పటికీ బోధనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. -ప్రొ.డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ ర్యాంకు సాధించని వ్యవసాయ వర్సిటీ దేశంలో టాప్–40 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చోటు దక్కలేదు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో వ్యవసాయ వర్సిటీ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై వర్సిటీ వర్గాలను ఆరా తీయగా, సమాధానం లభించలేదు. వర్సిటీ ప్రమాణాలు తగ్గుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అడ్రస్ లేని మెడికల్ కాలేజీలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో దేశంలో టాప్ 50లో చోటు దక్కని వైనం సాక్షి, హైదరాబాద్: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చేసిన దేశంలోని టాప్–50 మెడికల్ కాలేజీల్లో రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క మెడికల్ కాలేజీ చోటు దక్కించుకోలేకపోయింది. రాష్ట్రం నుంచి నాలుగు కాలేజీలు... ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, కరీంనగర్‌లోని చలిమెడ ఆనందరావు మెడికల్ కాలేజీ, హైదరాబాద్‌కు చెందిన మల్లారెడ్డి, అపోలో మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. మిగిలిన కాలేజీలకు కనీసం దరఖాస్తు చేసుకునే స్థాయి కూడా లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. టాప్–50 ర్యాంకింగ్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్ మొదటి ర్యాంకు, చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రెండో ర్యాంకు, తమిళనాడులోని వెల్లూరుకు చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజీ మూడో ర్యాంకు, బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నాలుగో ర్యాంకు, పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐదో ర్యాంకు సాధించాయి. డెంటల్ ర్యాంకుల్లో మాత్రం తెలంగాణకు ఊరట కలిగింది. సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌కు 33 ర్యాంకు దక్కింది. 176 మెడికల్ కాలేజీలు, 155 డెంటల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్రంలో వైద్య పరిశోధన దాదాపు ఎక్కడా లేదని, అలాగే, విద్యార్థులు–అధ్యాపకుల నిష్పత్తి కూడా దారుణంగా ఉందన్న విమర్శలున్నాయి. -
విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో హైదరాబాద్‌కు దక్కని చోటు
సాక్షి, న్యూఢిల్లీ/రాయదుర్గం: దేశంలోని విద్యాసంస్థల్లో అన్ని విభాగాల్లో కలిపి ఐఐటీ–మద్రాస్ అత్యుత్తమ విద్యాసంస్థగా నిలిచింది. మొత్తం విభాగాల్లో ఐఐటీ–మద్రాస్‌కు మొదటిస్థానం దక్కడం ఇది ఐదోసారి కాగా, ఇంజనీరింగ్ విభాగంలోనూ వరుసగా ఎనిమిదోసారి నంబర్‌వన్ స్థానాన్ని నిలుపుకోవడం విశేషం. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023) నివేదికను విద్య, విదేశీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్ సోమవారం విడుదల చేశారు. బోధనా అభ్యాసం, మౌలిక వసతులు, పరిశోధన, వృత్తిపరమైన అభ్యాసం, గ్రాడ్యుయేషన్ ఫలితం, విద్యార్థులు పొందే ఉపాధి అవకాశాలు వంటి అంశాల ఆధారంగా విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, లా, మెడికల్ కాలేజీలకు ర్యాంకులను ప్రకటించారు. వీటిలో అన్ని కేటగిరీల్లో ఐఐటీ–మద్రాస్ తొలిస్థానంలో ఉండగా, ఐఐఎస్సీ–బెంగళూరు రెండో స్థానంలో, ఐఐటీ–ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఐఐటీ–హైదరాబాద్ 14వ స్థానం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) 20వ స్థానం, నిట్–వరంగల్ 53, ఉస్మానియా యూనివర్సిటీ 64, వడ్డేశ్వరంలోని కేఎల్ కాలేజ్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ 50, వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచాయి. ర్యాంకింగ్స్ కోసం 200కు పైగా యూనివర్సిటీలను సర్వేచేశారు. దరఖాస్తు చేసిన దాదాపు 8వేల సంస్థల నుంచి 2023 ర్యాంకులను ప్రకటించారు. అత్యుత్తమ వర్సిటీల విభాగంలో... ఇక అత్యుత్తమ వర్సిటీల విభాగంలో ఐఐఎస్సీ–బెంగళూరు తొలి స్థానంలో ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీ 36, హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 84వ స్థానంలో నిలిచింది. ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ 43, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 60వ స్థానం దక్కించుకున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 8వ, నిట్–వరంగల్ 21వ స్థానంలో ఉన్నాయి. పరిశోధన విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 14వ స్థానంలో, హెచ్‌సీయూ 25వ స్థానంలో నిలిచాయి. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం–వైజాగ్ 29వ, ఐసీఎఫ్ఏఐ–హైదరాబాద్ 40వ స్థానంలో ఉన్నాయి. ఫార్మసీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–హైదరాబాద్ తొలి స్థానంలో ఉండగా, న్యాయ విభాగంలో నల్సార్ యూనివర్సిటీ 3వ స్థానంలో ఉంది. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. వ్యవసాయ విభాగంలో.. ఇక వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల్లో గుంటూరులోని ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ 20వ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 31వ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్–హైదరాబాద్ 32వ స్థానంలో ఉన్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కోసం https://www.nirfindia.org/ వెబ్సైట్లో చూడొచ్చు. సమష్టి కృషితోనే సాధ్యం జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మంచి గుర్తింపే లక్ష్యం. సమష్టి కృషితోనే సాధ్యం. దేశంలో టాప్– 10 విశ్వవిద్యాలయాల్లో హెచ్సీయూకు మళ్లీ ర్యాంక్‌ను పొందడం ఆనందంగా ఉంది. ఉత్తమ పద్ధతులు, నాణ్యతతో కూడిన బోధన, పరిశోధనల కారణంగా ఈ ర్యాంకు సాధ్యమైంది. భవి ష్యత్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తాం. -ప్రొ. బీజే రావు, వైస్‌చాన్స్‌లర్ హెచ్‌సీయూ మానవాళి కోసం టెక్నాలజీ ఈ విజయంలో విద్యార్థులు, అధ్యాపకులతోపాటు, పూర్వ విద్యార్థుల కృషి కూడా ఉంది. మానవాళి కోసం సాంకేతిక పరిజ్ఞానం అనే నినాదంతో ఐఐటీహెచ్ ముందుకెళ్తోంది. – ప్రొ. బీఎస్ మూర్తి, ఐఐటీహెచ్ డైరెక్టర్ IIT Madras ranked best institution followed by IISC Bengaluru and IIT Delhi as per the NIRF Ranking released by the Union Ministry of Education pic.twitter.com/yAKN3uVnuU— ANI (@ANI) June 5, 2023 IISC, Bangalore ranked best university followed by JNU and Jamia Millia Islamia as per the NIRF Ranking released by the Union Ministry of Education pic.twitter.com/Jvr1OixSHz— ANI (@ANI) June 5, 2023 ఫార్మసీ విభాగంతో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి స్థానంలో నిలిచింది. జామియా హమ్దర్ద్, బిట్స్ పిలానీ రెండో, మూడో స్థానాలు సాధించాయి.న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ‘నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా’ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దీనికి సంబంధించిన సమగ్ర వార్తకథనం మా ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో చదవండి -
ఇంజనీరింగ్, ఫార్మసీల్లో.. ఏపీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు ఉన్నత విద్యాసంస్థలు ఈ విద్యా సంవత్సరంలో కూడా ‘నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్’ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులను సొంతం చేసుకున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ విభాగాల్లో గతంలో కన్నా ఈసారి ఎక్కువ సంస్థలు ర్యాంకుల సాధనలో ముందంజలో ఉన్నాయి. పది అంశాలను ప్రామాణికంగా తీసుకుని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులను ఏటా ప్రకటిస్తోంది. ఈ రెండు విభాగాల్లో ఏపీకి చెందిన సంస్థలు గతంలో కన్నా ఎక్కువగా ఎంపికయ్యాయి. చదవండి: సీఎం జగన్ రుణం తీర్చుకోలేనిది: పాలిటెక్నిక్ అధ్యాపకులు మరోవైపు.. ఓవరాల్ విభాగంలో స్కోరు సాధించిన ఆంధ్రా యూనివర్సిటీ టాప్ 100లో చోటు సంపాదించింది. ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం) 47.97 స్కోరు పాయింట్లతో 71వ ర్యాంకు సాధించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ఈ ఎన్ఐఆర్ఎఫ్–2022 ర్యాంకులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఈ ర్యాంకుల కోసం 1,875 సంస్థలు పోటీపడ్డాయి. యూనివర్సిటీల విభాగంలో ఏపీలోని 5 సంస్థలకు ఈ ర్యాంకులు దక్కాయి. ఆంధ్రా యూనివర్సిటీ 50.52 స్కోరుతో 36వ ర్యాంకు, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి)æ 45.07 స్కోరుతో 67వ ర్యాంకును సొంతం చేసుకున్నాయి. కాలేజీల విభాగంలో విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీ ఒక్కటే నిలిచి 94వ స్థానాన్ని దక్కించుకుంది. ‘ఇంజనీరింగ్’ విభాగంలో పెరిగిన ర్యాంకులు ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలో ఈసారి రాష్ట్రానికి ఎక్కువ ర్యాంకులు దక్కాయి. గత ఏడాది ఏపీలోని ఆరు సంస్థలు చోటు సంపాదించుకోగా ఈసారి ఆ సంఖ్య పదికి పెరిగింది. ప్రభుత్వ సంస్థలైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తిరుపతి 48.16 స్కోరుతో 56వ ర్యాంకు, ఏయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (విశాఖపట్నం) 42.76 స్కోరుతో 77వ ర్యాంకు, జేఎన్టీయూ కాకినాడ 37.79 స్కోరుతో 129వ ర్యాంకు సాధించాయి. మేనేజ్మెంటు విభాగంలో విశాఖపట్నంలోని జాతీయ విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు సంస్థ 33వ ర్యాంకులో నిలిచింది. ఫార్మసీ విభాగంలో రాష్ట్రానికి తొమ్మిది ర్యాంకులు దక్కాయి. ప్రభుత్వ సంస్థలైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్సు (గుంటూరు)కు 51వ ర్యాంకు, తిరుపతిలోని శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయానికి 66, శ్రీ వేంకటేశ్వర వర్సిటీకి 89వ ర్యాంకు లభించాయి. ఇక ఆర్కిటెక్చర్ విభాగంలో విజయవాడలోని జాతీయ విద్యాసంస్థ అయిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా–ఎస్పీఏ) 7వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ ఐఐటీ అదుర్స్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో తెలంగాణలోని హైదరాబాద్ ఐఐటీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు ర్యాంకులు సాధించాయి. అన్ని విభాగాలకు కలిపి (ఓవరాల్) ఇచ్చిన ర్యాంకుల్లో ఐఐటీ (హెచ్) 14వ ర్యాంకును (గతేడాది 16వ ర్యాంకు) సొంతం చేసుకుంది. ఈ సంస్థకు 62.86 జాతీయ స్కోర్ లభించింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలో ఐఐటీ (హెచ్) టాప్–10లో నిలిచి 9వ ర్యాంకు పొందింది. అలాగే పరిశోధన విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. యూనివర్సిటీల వారీగా చూస్తే జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. ఓవరాల్ విభాగంలో 20వ ర్యాంకును, రీసెర్చ్ విభాగంలో 27వ ర్యాంకును సాధించింది. మరోవైపు వర్సిటీల ర్యాంకుల్లో ఉస్మానియా యూనివర్సిటీ 22వ ర్యాంకు పొందింది. -
‘గీతం’ సమాచారాన్ని మళ్లీ ధ్రువీకరించాలి
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)కు విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇచ్చిన సమాచారాన్ని మళ్లీ ధ్రువీకరించాలని(రీ వెరిఫికేషన్ చేయాలని) నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) సభ్య కార్యదర్శి అనిల్ కె నస్సాకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం లేఖ రాశారు. ఎన్బీఏకు 2018, 2019, 2020 సంవత్సరాల్లో గీతం సంస్థ తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు. ఆయా సంవత్సరాల్లో ఇచ్చిన సమాచారాన్ని సరిపోల్చితే అస్పష్టత కనిపిస్తుందని సూచించారు. నాలుగేళ్ల యూజీ ప్రోగ్రాంలకు అనుమతుల కోసం 2015–16, 2016–17 సంవత్సరాల్లో ఇచ్చిన సమాచారంలో, ఎన్ఐఆర్ఎఫ్ 2020, 2019 సమాచారాల్లో వ్యత్యాసం కనిపిస్తోందని తెలిపారు. ఆయా సంవత్సరాల పీజీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం సమాచారం కూడా అస్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిజ నిర్ధారణ కమిటీతో ఆ సంస్థ రికార్డులు, అకౌంట్లను మళ్లీ పరిశీలించాని కోరారు. -
టాప్‌లో నిలిచిన ఐఐటీ మద్రాస్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ 2020 ఏడాదికి గాను నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) జాబితాను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాలు, కళాశాలలకు సంబంధించిన ర్యాంకులను వెల్లడించింది. ఈ జాబితాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీ మద్రాస్) మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం ట్విటర్లో వెబ్‌కాస్ట్ ద్వారా ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సంజయ్ ధోత్రే, ఏఐసీటీఐ చైర్మన్ అనిల్ సహస్రబుధే, యూజీసీ చైర్మన్ డీపీ సింగ్ పాల్గొన్నారు. (ప్రధాని హత్య.. 34 ఏళ్ల తర్వాత కేసు క్లోజ్ ) ఉన్నత విద్యా సంస్థల జాబితాలో ఐఐఎస్సీ బెంగళూరు రెండో స్థానంలో నిలవగా, ఐఐటీ ఢిల్లీ మూడో స్థానాన్నిదక్కించుకుంది. ఐఐటీ బొంబాయి, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్ నాలుగు, అయిదు, ఆరవ స్థానంలో ఉన్నాయి. ఏడవ స్థానంలో జేఎన్‌యూ, ఎమిమిదవ స్థానంలో న్యూఢిల్లీ, తొమ్మిదవ స్థానంలో ఐఐటీ గువాహటి, పదవ స్థానంలో బనారస్ హిందూ విశ్వ విద్యాలయం వారణాసి నిలిచాయి. కాగా కాలేజీలకు, వర్సిటీలకు జాతీయ స్థాయిలో సొంత ర్యాంకింగ్ వ్యవస్థ ఉండాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ గతంలో నిర్ణయించింది. ఇందులో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) పేరుతో 2016 నుంచి తొమ్మిది విభాగాల్లో ర్యాంకులను కేటాయిస్తోంది. (అద్భుతమైన ఎంఐ నోట్‌బుక్స్ లాంచ్) నేషనల్యూ ఇన్నిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 6 యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. వాటిలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 15 స్థానం, ఐఐటీ హైదరాబాద్ 17వ స్థానం,ఆంధ్రా యూనివర్సిటీ 36వ స్థానం ఎన్ఐటీ 46వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీ 53 స్థానం, కేఎల్ ఎడ్యూకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ 70 వ స్థానంలో ఉన్నాయి. -
టాప్–40 బిజినెస్ స్కూళ్లలో ఎల్పీయూ
జలంధర్: నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)ర్యాంకింగ్‌లలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మిట్టల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ దేశంలోని టాప్–40 బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా నిలిచింది. ఎల్పీయూ ఫార్మసీ డిపార్ట్మెంట్ 26వ స్థానంలో నిలిచింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ ర్యాంకులను ప్రకటించింది. పంజాబ్ యూనివర్సిటీ, ఐఐఎం రాంచీ, బిట్స్ లాంటి ఉన్నత విద్యా సంస్థలను అధిగమించి ఎల్పీయూ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ పంజాబ్ రీజియన్‌లో అగ్రస్థానం దక్కించుకుంది. ‘ఔట్రీచ్ అండ్ ఇంక్లూజివిటీ’ విభాగంలో అన్ని ఐఐఎంలను దాటుకుని తొలిస్థానంలో నిలిచింది. -
అత్యుత్తమ విద్యాసంస్థ ఐఐఎస్సీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిలిచింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) ద్వారా దేశంలోని వివిధ విద్యా సంస్థలకు ఇచ్చిన ర్యాంకులను ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మంగళవారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యాసంస్థలకు మొత్తం 9 విభాగాల్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు కేటాయించింది. సమగ్ర (ఓవరాల్) ఉత్తమ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, మెడికల్, ఆర్కిటెక్చర్, లా, కళాశాలలు అనే 9 విభాగాల వారీగా ర్యాంకులు విడుదలయ్యాయి. గతేడాది మాదిరిగానే ఇప్పుడు కూడా ఓవరాల్‌తోపాటు విశ్వవిద్యాలయాల విభాగంలోనూ ఐఐఎస్సీ తొలిస్థానం సాధించింది. అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థగా ఐఐటీ–మద్రాస్, అత్యుత్తమ మేనేజ్మెంట్ విద్యాసంస్థగా ఐఐఎం–అహ్మదాబాద్, అత్యుత్తమ వైద్య విద్యాసంస్థగా ఢిల్లీలోని ఎయిమ్స్ నిలిచాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 301 విశ్వవిద్యాలయాలు, 906 ఇంజినీరింగ్, 487 మేనేజ్మెంట్, 286 ఫార్మసీ, 101 వైద్య, 71 లా, 59 ఆర్కిటెక్చర్ విద్యాసంస్థలతోపాటు 1087 సాధారణ డిగ్రీ కళాశాలలను అనేక అంశాలవారీగా పరిశీలించిన అనంతరం ఎన్ఐఆర్ఎఫ్ ఈ ర్యాంకులు ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలూ ర్యాంకుల కేటాయింపు కోసం ఎన్‌ఐఆర్‌ఎఫ్‌కు దరఖాస్తులు పంపించాల్సిందేననీ, లేకుంటే వాటికి నిధులను నిలిపేస్తామని జవదేకర్ చెప్పారు. ఓవరాల్ కేటగిరీలో టాప్–5 1.ఐఐఎస్సీ–బెంగళూరు, 2.ఐఐటీ–మద్రాస్, 3.ఐఐటీ–బాంబే, 4.ఐఐటీ–ఢిల్లీ, 5.ఐఐటీ–ఖరగ్‌పూర్ ఇంజనీరింగ్ విద్యలో టాప్–5 1.ఐఐటీ–మద్రాస్, 2.ఐఐటీ–బాంబే, 3.ఐఐటీ–ఢిల్లీ, 4.ఐఐటీ–ఖరగ్‌పూర్, 5.ఐఐటీ–కాన్పూర్ వైద్యవిద్యలో టాప్–5 1.ఎయిమ్స్–ఢిల్లీ, 2.పీజీఐఎంఈఆర్–చండీగఢ్, 3.సీఎంసీ–వేలూరు, 4.కేఎంసీ–మణిపాల్, 5.కేజేఎంయూ–లక్నో మేనేజ్మెంట్ విద్యలో టాప్–5 1.ఐఐఎం–అహ్మదాబాద్, 2.ఐఐఎం–బెంగళూరు, 3.ఐఐఎం–కలకత్తా, 4.ఐఐఎం–లక్నో, 5.ఐఐటీ–బాంబే న్యాయ విద్యలో టాప్–5 1.ఎన్ఎల్ఎస్ఐయూ–బెంగళూరు, 2.ఎన్ఎల్యూ–ఢిల్లీ, 3.నల్సార్ యూనివర్సిటీ–హైదరాబాద్, 4.ఐఐటీ–ఖరగ్‌పూర్, 5.ఎన్ఎల్యూ–జోధ్‌పూర్ ఫార్మసీ విద్యలో టాప్–5 1.ఎన్ఐపీఈఆర్–మొహాలీ, 2.జామియా హందర్ద్–ఢిల్లీ,3.పంజాబ్ యూనివర్సిటీ–చండీగఢ్, 4.ఐసీటీ–ముంబై, 5.బిట్స్–పిలానీ టాప్–5 విశ్వవిద్యాలయాలు: 1.ఐఐఎస్సీ–బెంగళూరు, 2.జేఎన్‌యూ–ఢిల్లీ, 3.బీహెచ్‌యూ–వారణాసి, 4.అన్నా యూనివర్సిటీ–చెన్నై, 5.హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీ. -
అగ్ర స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు
-
అగ్ర స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు
న్యూఢిల్లీ: బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)కి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని అత్యుత్తమ యూనివర్శిటీల్లో ఐఐఎస్సీ బెంగళూరు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ఐదు కేటగిరీల్లో 3,300 విద్యా సంస్థలపై చేసిన అధ్యయనం ద్వారా రూపొందించిన ర్యాంకుల నివేదికను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం విడుదల చేశారు. ఈ విభాగంలో అత్యుత్తమ కాలేజీగా ఐఐటీ మద్రాస్ రెండవ స్థానంలో, ఐఐటీ బాంబే మూడవ స్థానంలో నిలిచాయి. అలాగే ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ మద్రాస్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా, రెండోస్థానంలో ఐఐటీ ముంబై నిలిస్తే, ఐఐటీ హైదరాబాద్ పదోస్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ మొదటి స్థానంలో, ఉస్మానియా యూనివర్శిటీకి 23, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్శిటీలకు 43వ స్థానాల్లో దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ వార్షిక ప్రక్రియగా ర్యాంకు విధానాన్ని ప్రారంభించామని, ఎక్కువ కేటగిరీ లను చేర్చడం ద్వారా విద్యార్థులు అడ్మిషన్ పొందడానికి ముందే ఆ విద్యా సంస్థకు సంబంధించి అన్ని విషయాలను తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుందని చెప్పారు. కాగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు, తదితరుల పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించారు. ఓవరాల్ ర్యాంకులు 1. ఐఐఎస్సీ-బెంగళూరు 2 . ఐఐటీ-చెన్నై 3. ఐఐటీ-బాంబే 4. ఐఐటీ-ఖరగ్‌పూర్ 5. ఐఐటీ-ఢిల్లీ 6. జేఎన్‌యూ-ఢిల్లీ 7. ఐఐటీ-కాన్పూర్ 8. ఐఐటీ -గౌహతి 9. ఐఐటీ-రూర్కీ 10. ఐఐటీ- బెనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)-వారణాసి బెస్ట్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్స్ 1. ఐఐఎం-అహ్మదాబాద్ 2. ఐఐఎం-బెంగళూరు 3. ఐఐఎం-కోల్‌కతా 4. ఐఐఎం-లక్నో 5. ఐఐఎం-కాజీకోడ్ 6. ఐఐటీ-ఢిల్లీ 7. ఐఐటీ- ఖరగ్‌పూర్ 8. ఐఐటీ- రూర్కీ 9. జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్- జమ్షెడ్పూర్ 10. ఐఐఎం- ఇండోర్ టాప్ యూనివర్శిటీలు 1. ఐఐఎస్ఈ-బెంగళూరు 2. జేఎన్‌యూ-న్యూఢిల్లీ 3. బీహెచ్‌యూ-వారణాసి టాప్ కళాశాలలు జాబితా 1. మిరాంద హౌస్ -ఢిల్లీ 2. లయోలా కాలేజ్-చెన్నై 3. శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్-ఢిల్లీ టాప్ ఫార్మా ఇనిస్టిట్యూట్స్ 1.జమియా హమ్దర్ద్-న్యూఢిల్లీ 2. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పార్మాస్యూటికల్స్ ఎడ్యూకేషన్ అండ్ రీసెర్చ్- మొహాలి 3. యూనివర్శిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పార్మాస్యూటికల్స్ సైన్సెస్