
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్)కు విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇచ్చిన సమాచారాన్ని మళ్లీ ధ్రువీకరించాలని(రీ వెరిఫికేషన్ చేయాలని) నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ) సభ్య కార్యదర్శి అనిల్ కె నస్సాకు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు శనివారం లేఖ రాశారు. ఎన్‌బీఏకు 2018, 2019, 2020 సంవత్సరాల్లో గీతం సంస్థ తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు. ఆయా సంవత్సరాల్లో ఇచ్చిన సమాచారాన్ని సరిపోల్చితే అస్పష్టత కనిపిస్తుందని సూచించారు. నాలుగేళ్ల యూజీ ప్రోగ్రాంలకు అనుమతుల కోసం 2015–16, 2016–17 సంవత్సరాల్లో ఇచ్చిన సమాచారంలో, ఎన్‌ఐఆర్‌ఎఫ్ 2020, 2019 సమాచారాల్లో వ్యత్యాసం కనిపిస్తోందని తెలిపారు. ఆయా సంవత్సరాల పీజీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం సమాచారం కూడా అస్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిజ నిర్ధారణ కమిటీతో ఆ సంస్థ రికార్డులు, అకౌంట్లను మళ్లీ పరిశీలించాని కోరారు.