
పట్నంబజారు: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రీజినల్ కో –ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సమన్వయకర్తలతో సమీక్షాసమావేశం జరిగింది. అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, పరిశీలకులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు, లోక్‌సభ స్థానం గెలుపే లక్ష్యంగా దృష్టి సారించి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఏడు సీట్లలో విజయం తధ్యమని, మంగళగిరిని సైతం గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీకి అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. సీట్ల మార్పు అంశంలో ఎవరైతే గెలుస్తారో, వారిని మార్పు చేశామని, మిగతా వారు అలాగే అభ్యర్థులుగా కొనసాగుతారని తెలిపారు.
ఈ సమావేశంలో శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, మేకతోటి సుచరిత, అన్నాబత్తుని శివకుమార్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవరప్రసాద్, జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనిక్రిస్టినా, సమన్వయకర్తలు బలసాని కిరణ్‌కుమార్, షేక్ నూరిఫాతిమా, గంజి చిరంజీవి, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, పార్టీ నేత రావెల కిషోర్‌బాబు, విడదల గోపి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్‌లు, వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment