సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత విద్యాప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జాతీయ ర్యాంకింగ్‌లో యూనివర్సిటీలు వెనకబడుతున్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్–2023)లో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఓవరాల్ ర్యాంకులో 64కు పడిపోయింది. గతేడాది ఓయూ 46వ ర్యాంకులో నిలిచింది.
జేఎన్‌టీయూహెచ్ గతేడాది 76వ ర్యాంకుతో ఉంటే ఈ ఏడాది 98వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. అధ్యాపకుల కొరతే ఈ పరిస్థితికి కారణమని అన్ని వర్గాలూ భావిస్తున్నా ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. గతేడాది తెలంగాణ యూనివర్సిటీల కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లును అసెంబ్లీ ఆమోదించినా అది ఇంకా గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉంది. ఈ ఫైల్‌ను రాష్ట్రపతి పరిశీలనకు పంపామని గవర్నర్ పేర్కొన్నారు.
1,869 పోస్టులు ఖాళీ..
రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లోనూ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అన్నిచోట్లా కాంట్రాక్టు అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 2021 జనవరి 31 నాటికి 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉండగా వాటిలో ఏకంగా 1,869 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అంటే కేవలం 968 (34.12 శాతం) మందే రెగ్యులర్ ఆధ్యాపకులు పనిచేస్తున్నారు.
ప్రస్తుతం 157 మంది ప్రొఫెసర్లు ఉండగా మరో 238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా మరో 781 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుండగా 850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా ఇంతవరకు వాటిని భర్తీ చేయలేదు.
ప్రొఫెసర్లేరి?
♦ రాష్ట్రంలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని యూనివర్సిటీలు ఆరు ఉన్నాయి. అవి శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, ఆర్‌జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. శాతవాహన, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్‌జీయూకేటీ), బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లే లేరు.
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరే ఉన్నారు. మెుత్తంగా చూస్తే 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. మరోవైపు 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నత విద్యాశాఖ లెక్కలు వేసింది.
♦వందేళ్లకుపైగా చరిత్రగల ఉస్మానియా యూనివర్సిటీలో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో ఇప్పుడు కేవలం ఒక్కరే ప్రొఫెసర్ ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు.
శాతవాహన యూనివర్సిటీ, ఆర్‌జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కరంటే ఒక్కరూ లేరు. తెలుగు యూనివర్సిటీలో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్‌తోనే నెట్టుకొస్తున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిట్చెర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు బోధన సాగిస్తున్నారు.
క్రమబద్ధీకరణ చేయరా?
గత కొంతకాలంగా రెగ్యులర్ చేయాలని ఆందోళన చేస్తున్న యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ ఆదివారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావులను కలిసింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేసేందుకు కృషి చేయాలని వినతిపత్రం అందించింది. సోమవారం జరిగే కేబినేట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment