సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ మొదలైంది. విశ్వవిద్యాలయాలు ఇప్పటికే కాలేజీల నుంచి సమాచారం సేకరించాయి. వాటిని సంబంధిత నిపుణులు పరిశీలిస్తున్నారు. అత్యధిక కాలేజీలు అనుబంధంగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్) ఈ ప్రక్రియలో ముందుంది.
కాలేజీల నుంచి సేకరించిన సమాచారాన్ని సిబ్బంది కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. దీని ఆధారంగా ప్రతీ కాలేజీకి ముగ్గురు చొప్పున ఫ్యాకల్టీ నిపుణులు వెళ్తారని జేఎన్‌టీయూహెచ్ అధికారులు తెలిపారు. మరోవైపు డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించుకుని, డిమాండ్ ఉన్న వాటిల్లో పెంచుకునేందుకు కాలేజీలు ప్రయ త్నిస్తున్నాయి.
అయితే, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో సీట్లు పూర్తిగా తగ్గించేందుకు అధికారులు ఒప్పుకోవడం లేదు. ఆయా కోర్సుల్లో 30 శాతం సీట్లు ఉండి తీరాలని చెబుతున్నారు. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికే అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
200కు పైగా కాలేజీల్లో తనిఖీలకు సిద్ధం
జేఎన్‌టీయూహెచ్ పరిధిలో 145 వరకూ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. మరో 70 వరకూ ఫార్మసీ కాలేజీలున్నాయి. వీటిల్లో ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, దానికి అనుబంధంగా వచ్చి న కొత్త కోర్సుల విషయంలోనే అధికారులు దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి కోర్సుల్లో అవసరమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఫ్యాకల్టీ సరైనది ఉందా? మౌలిక సదుపాయాలు ఏమేర ఉన్నాయి? అనే అంశాలను తనిఖీ బృందాలు నిశితంగా పరిశీలించాలని ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించారు.
బయోమెట్రిక్ హాజరు విధానాన్ని యూనివర్సిటీలు తప్పనిసరి చేసినా, పలు కాలేజీలు దీన్ని అనుసరించడం లేదు. ఈ ఏడాది నుంచి దీనిని కచ్చి తంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు జేఎన్‌టీయూహెచ్ అధికారులు తెలిపారు. ఈ అంశాన్ని కూడా పరిశీలనలో భాగం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఫ్యాకల్టీ ప్రతిభ, ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే వీలుందని చెబుతున్నారు. మిగతా యూనివర్సిటీలు కూడా తనిఖీలకు రంగం సిద్ధం చేస్తున్నాయి.
సదుపాయాలు లేకుండా గుర్తింపు కష్టం
తనిఖీల విషయంలో యూనివర్సిటీలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. తనిఖీ బృందాలు కాలేజీ యాజమాన్యాలతో మిలాఖత్ అవుతున్నాయని, మౌలిక సదుపాయాలు లేకున్నా అనుమతిస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కాలేజీలో బోధించే సిబ్బంది వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడమే కాకుండా, వారి వ్యక్తిగత పాన్ కార్డుల ఆధారంగా ఆదాయ పన్నుశాఖ ద్వారా తనిఖీలు చేయాలనే యోచనలో ఉన్నారు.
ఫ్యాకల్టీ కాలేజీలో బోధిస్తున్నాడా? ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని, కాలేజీలో ఫ్యాకల్టీగా నమోదు చేసుకున్నాడా అనే అంశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెలాఖరుకల్లా తనిఖీలు పూర్తి చేయాలని యూనివర్సిటీల అధికారులు భావిస్తున్నారు.
మే రెండో వారంకల్లా పూర్తి చేస్తాం
కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను మే రెండో వారంకల్లా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కాలేజీల్లో ఫ్యాక ల్టి, వసతులపై డేటా తెప్పించాం. నిబంధనల ప్రకారం మౌలిక వసతులు లేని కాలేజీలు గుర్తింపు తేదీ నాటికి ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ప్రతీ కాలేజీకి ముగ్గురు చొప్పున నిపుణులు వెళ్తారు. అన్నీ పరిశీలించి, నిబంధనల మేరకు సరిగా ఉంటేనే గుర్తింపు ఇస్తాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (జేఎన్‌టీయూహెచ్ వీసీ)
Comments
Please login to add a commentAdd a comment