affiliation
-
Telangana: అఫిలియేషన్లు లేకున్నా... అడ్మిషన్లు షురూ!
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షలు పూర్తవ్వడంతో ప్రైవేటు ఇంటర్ కాలేజీలు ప్రవేశాల ప్రక్రియను ముమ్మరం చేశాయి. నిబంధనల ప్రకారం ఇంటర్ బోర్డ్ నుంచి అనుబంధ గుర్తింపు పొందాల్సి ఉన్నా, దీన్ని పట్టించుకోవడం లేదు. కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఏకంగా బ్రిడ్జ్, క్రాష్ కోర్సులంటూ తరగతులు కూడా నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి జూన్ 1 నుంచి మాత్రమే అన్ని కాలేజీలూ ప్రారంభించాలని ఇంటర్ బోర్డ్ షెడ్యూల్ కూడా ఇచ్చింది. ఈలోపు అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పింది. గుర్తింపు లేకుండా అడ్మిషన్లు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఒకవేళ గుర్తింపు రాని పక్షంలో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. కాలేజీ యాజమాన్యాలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. మండువేసవిలో తరగతులు నిర్వహిస్తున్నా, అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. రూ. లక్షల్లో ఫీజులు: ప్రైవేటు కాలేజీలు ఈసారి ఫీజులు భారీగా పెంచాయి. ఐఐటీ, నీట్, ఇంటెన్సివ్ కోర్సులంటూ విభాగాల వారీగా ధరలు నిర్ణయించాయి. ఓ కార్పొరేట్ కాలేజీ గత ఏడాది సంవత్సరానికి రూ.1.25 లక్షలు తీసుకోగా, ఈసారి రూ.1.75 లక్షలు డిమాండ్ చేస్తోంది. జేఈఈ కోచింగ్‌తో కలిపితే రూ. 2.25 లక్షలు చెబుతోంది. సాధారణ కాలేజీలు కూడా ఏడాదికి రూ.75 వేల నుంచి రూ. 1.25 లక్షలు డిమాండ్ చేస్తున్నాయి. రవాణా చార్జీలు కూడా 20 శాతం పెంచారని తల్లిదండ్రులు చెబుతున్నారు. హాస్టల్ కోసం ఏటా రూ.1.25 లక్షలు అడుగుతున్నారు. మొత్తం మీద ఇంటర్ పూర్తయ్యే వరకూ రూ.2 నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. గుర్తింపు ఇవ్వకుండానే...? రాష్ట్రవ్యాప్తంగా 3,111 ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీలున్నాయి. వీటిలో ప్రభుత్వ కాలేజీలు తీసివేస్తే దాదాపు 1,516 ప్రైవేటు కాలేజీలు అనుబంధ గుర్తింపు పొందాల్సి ఉంటుంది. అవసరమైన మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ, లేబొరేటరీలు అన్నీ పరిశీలించిన తర్వాతే గుర్తింపు ఇస్తారు. గత ఏడాది 416 కాలేజీలకు పరీక్ష ఫీజు గడువు ప్రకటించే వరకూ గుర్తింపు ఇవ్వలేదు. బహుళ అంతస్తుల భవనాల్లో నడుస్తున్నాయని, అగ్రిప్రమాదాలను నివారించే వ్యవస్థ లేదనే అభ్యంతరాలున్నాయి. దీంతో లక్ష మంది విద్యార్థులు ఫీజు కట్టేందుకు ఆఖరి క్షణం వరకూ ఆందోళనకు గురయ్యారు. ఈ ఏడాది మూడేళ్ల కాలపరిమితితో అఫ్లియేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రైవేటు కాలేజీలు ఇంకా గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే దశలోనే ఉన్నాయి. అయినా పెద్దఎత్తున విద్యార్థులను చేర్చుకోవడం విమర్శలకు తావిస్తోంది. టెన్త్ ఫలితాలొచ్చేలోగా గుర్తింపు పూర్తి: నవీన్ మిత్తల్ (ఇంటర్ బోర్డ్ కార్యదర్శి) అనుబంధ గుర్తింపు వచ్చిన తర్వాతే బోర్డ్ నిర్దేశించిన మేరకు ఫస్టియర్ ప్రవేశాలు చేపట్టాలి. ఇందుకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపట్టినా, క్లాసులు నిర్వహించినా చర్యలుంటాయి. గతంలో మాదిరిగా కాకుండా, ఈసారి టెన్త్ ఫలితాలు వచ్చిన వెంటనే గుర్తింపు ప్రక్రియను పూర్తిచేస్తాం. ఆ తర్వాత అఫ్లియేషన్ ఇవ్వం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గుర్తింపు వచ్చిన తర్వాతే విద్యార్థులను కాలేజీల్లో చేర్చాలని కోరుతున్నాం. ఉల్లంఘనులపై చర్యలుండాలి: మాచర్ల రామకృష్ణగౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్) గుర్తింపు రాకుండా ప్రైవేటు కాలేజీలు ఇష్టానుసారం అడ్మిషన్లు తీసుకోవడం చట్టవిరుద్ధం. అధికారులు ఇలాంటి కాలేజీలపై దృష్టి పెట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలి. టెన్త్ ఫలితాలు రాకుండా ఇంటర్ క్లాసులు నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. -
అఫిలియేషన్ ప్రక్రియ మొదలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ మొదలైంది. విశ్వవిద్యాలయాలు ఇప్పటికే కాలేజీల నుంచి సమాచారం సేకరించాయి. వాటిని సంబంధిత నిపుణులు పరిశీలిస్తున్నారు. అత్యధిక కాలేజీలు అనుబంధంగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) ఈ ప్రక్రియలో ముందుంది. కాలేజీల నుంచి సేకరించిన సమాచారాన్ని సిబ్బంది కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. దీని ఆధారంగా ప్రతీ కాలేజీకి ముగ్గురు చొప్పున ఫ్యాకల్టీ నిపుణులు వెళ్తారని జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. మరోవైపు డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించుకుని, డిమాండ్ ఉన్న వాటిల్లో పెంచుకునేందుకు కాలేజీలు ప్రయ త్నిస్తున్నాయి. అయితే, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో సీట్లు పూర్తిగా తగ్గించేందుకు అధికారులు ఒప్పుకోవడం లేదు. ఆయా కోర్సుల్లో 30 శాతం సీట్లు ఉండి తీరాలని చెబుతున్నారు. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికే అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 200కు పైగా కాలేజీల్లో తనిఖీలకు సిద్ధం జేఎన్టీయూహెచ్ పరిధిలో 145 వరకూ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. మరో 70 వరకూ ఫార్మసీ కాలేజీలున్నాయి. వీటిల్లో ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, దానికి అనుబంధంగా వచ్చి న కొత్త కోర్సుల విషయంలోనే అధికారులు దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి కోర్సుల్లో అవసరమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఫ్యాకల్టీ సరైనది ఉందా? మౌలిక సదుపాయాలు ఏమేర ఉన్నాయి? అనే అంశాలను తనిఖీ బృందాలు నిశితంగా పరిశీలించాలని ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించారు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని యూనివర్సిటీలు తప్పనిసరి చేసినా, పలు కాలేజీలు దీన్ని అనుసరించడం లేదు. ఈ ఏడాది నుంచి దీనిని కచ్చి తంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. ఈ అంశాన్ని కూడా పరిశీలనలో భాగం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఫ్యాకల్టీ ప్రతిభ, ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే వీలుందని చెబుతున్నారు. మిగతా యూనివర్సిటీలు కూడా తనిఖీలకు రంగం సిద్ధం చేస్తున్నాయి. సదుపాయాలు లేకుండా గుర్తింపు కష్టం తనిఖీల విషయంలో యూనివర్సిటీలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. తనిఖీ బృందాలు కాలేజీ యాజమాన్యాలతో మిలాఖత్ అవుతున్నాయని, మౌలిక సదుపాయాలు లేకున్నా అనుమతిస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కాలేజీలో బోధించే సిబ్బంది వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడమే కాకుండా, వారి వ్యక్తిగత పాన్ కార్డుల ఆధారంగా ఆదాయ పన్నుశాఖ ద్వారా తనిఖీలు చేయాలనే యోచనలో ఉన్నారు. ఫ్యాకల్టీ కాలేజీలో బోధిస్తున్నాడా? ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని, కాలేజీలో ఫ్యాకల్టీగా నమోదు చేసుకున్నాడా అనే అంశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెలాఖరుకల్లా తనిఖీలు పూర్తి చేయాలని యూనివర్సిటీల అధికారులు భావిస్తున్నారు. మే రెండో వారంకల్లా పూర్తి చేస్తాం కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను మే రెండో వారంకల్లా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కాలేజీల్లో ఫ్యాక ల్టి, వసతులపై డేటా తెప్పించాం. నిబంధనల ప్రకారం మౌలిక వసతులు లేని కాలేజీలు గుర్తింపు తేదీ నాటికి ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ప్రతీ కాలేజీకి ముగ్గురు చొప్పున నిపుణులు వెళ్తారు. అన్నీ పరిశీలించి, నిబంధనల మేరకు సరిగా ఉంటేనే గుర్తింపు ఇస్తాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (జేఎన్టీయూహెచ్ వీసీ) -
సీబీఎస్ఈ అఫిలియేషన్‌లో మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలో ఏర్పాటు కానున్న విద్యాసంస్థలకు గుర్తింపు (అఫిలియేషన్) మంజూరు ప్రక్రియలో పలు మార్పులు చేసినట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. అఫిలియేషన్ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. జాతీయ నూతన విద్యా విధానం–2020 ప్రకారం సీబీఎస్ఈ బైలాలో పలు మార్పులు చేసింది. ఈ విషయాలతో తన అధికారిక వెబ్సైట్లో తాజాగా ఒక నోటిఫికేషన్ పొందుపరిచింది. 2021 మార్చి 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. వివిధ కమిటీల సిఫార్సుల మేరకు నూతన విద్యా విధానంలో చేసిన సూచనల ప్రకారం ఈ మార్పులు చేస్తున్నట్టు సీబీఎస్ఈ పేర్కొంది. పునర్వ్యవస్థీకరణ లక్ష్యం ఇలా.. సీబీఎస్ఈ గుర్తింపు మంజూరుకు 2006 నుంచి ఆన్లైన్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం పూర్తిగా డిజిటలైజేషన్, డేటా అనలటిక్స్ ఆధారంగా తక్కువ మానవ వనరుల వినియోగంతో గుర్తింపు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు సీబీఎస్ఈ వివరించింది. త్వరితగతిన గుర్తింపు పొందడం, ఆటోమేటెడ్, డేటా డ్రైవన్ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం, పారదర్శకత పెంచడం, మొత్తం అఫిలియేషన్ విధానంలో అకౌంట్‌బిలిటీని పెంచడం, త్వరితంగా, కాల పరిమితిలోగా దరఖాస్తులను పరిష్కరించడం లక్ష్యంగా కొత్త విధానాన్ని చేపడుతున్నట్టు పేర్కొంది. ఇందుకు పూర్తి నిర్దేశిత సమయాలను పాటించనుంది. ఆయా విద్యాసంస్థలు అవసరమైన డాక్యుమెంట్లను సీబీఎస్ఈ వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించింది. చదవండి: వివాదాస్పద తీర్పుపై సుప్రీంకోర్టు స్టే -
ఇంటర్ బోర్డు అధికారుల ‘గుర్తింపు’ దందా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) వ్యవహారంలో మరో అక్రమానికి తెరలేచింది. అనేక లోపాల కారణంగా ‘గుర్తింపు’పొందని కాలేజీల్లో భారీగా విద్యార్థుల అడ్మిషన్లు జరిగిపోతున్నాయి. ఇలా చేరిపోయిన ‘విద్యార్థుల భవిష్యత్తు’దెబ్బతింటుందనే సాకుతో ఆయా కాలేజీలకు ‘గుర్తింపు’ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆయా కాలేజీల యాజమాన్యాలతో ఇంటర్మీడియట్ బోర్డులోని కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని... ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీల్లోనూ కొన్నింటిలో లోపాలున్నా.. ముడుపులు పుచ్చుకుని అఫిలియేషన్ ఇచ్చినట్టుగా విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు బోర్డు కార్యదర్శికి ఉండాల్సిన అఫిలియేషన్ జారీ అధికారాన్ని ఇతర అధికారులకు కట్టబెట్టి మరీ అక్రమాలకు తెరతీసినట్టు బోర్డు వర్గాలే పేర్కొంటున్నాయి. అఫిలియేషన్ అధికారాలను పొందిన సదరు అధికారిని కలసి ముడుపులు ముట్టజెప్పితేనే ‘పని’జరుగుతోందని.. లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తోందని కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు పేర్కొంటుండటం గమనార్హం. గడువు ముగిసిపోయినా.. రాష్ట్రంలో మొత్తం 1,640 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా.. ఇంటర్ బోర్డు ఈసారి పలు సడలింపులతో 1,303 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. వాటికి ఫిబ్రవరి 21వ తేదీ నాటికే అఫిలియేషన్లను పూర్తి చేయాల్సి ఉన్నా.. కాలేజీల విజ్ఞప్తి మేరకు అంటూ మార్చి 31 వరకు గడువు పొడిగించింది. అయినా అనేక లోపాల కారణంగా 337 కాలేజీలకు గుర్తింపు లభించలేదు. గత నెల 21న ఇంటర్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు నాటికి కూడా ఆయా కాలేజీలు సరైన డాక్యుమెంట్లు సమర్పించకపోవడంతో ‘గుర్తింపు’అవకాశం కోల్పోయాయి. కానీ తాజాగా ‘విద్యార్థుల భవిష్యత్తు’దెబ్బతింటుందనే పేరుతో ఆయా కాలేజీలకు గుర్తింపు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరో రెండు మూడు నెలల్లో లోపాలన్నీ సవరించుకుంటామంటూ కాలేజీలు అఫిడవిట్ ఇస్తే.. వాటికి ‘గుర్తింపు’ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అటు ఆయా కాలేజీలు కూడా ‘బోర్డు ఇచ్చిన సమయంలోగా లోపాలను సవరించుకోకున్నా పోయేదేమీ లేదని.. విద్యా సంవత్సరం మధ్యలో కాలేజీలను మూసివేసే అవకాశం ఉండదని.. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకున్నా విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తారా? అన్న సాకుతో యాజమాన్యాలు ఆందోళన చేయవచ్చని..’కొందరు అధికారులే కాలేజీల యాజమాన్యాలకు సూచిస్తూ అక్రమాలకు తెరతీసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సగం వరకు కార్పొరేట్ కాలేజీలే.. అనుబంధ గుర్తింపు లభించని 337 కాలేజీల్లో సగం వరకు కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన కాలేజీలే ఉన్నట్టు తెలిసింది. దీంతో భారీగా సొమ్ము దండుకోవచ్చన్న ఆశతోనే అధికారులు కుమ్మక్కైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు ఈ కాలేజీలన్నీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఉన్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ఇంటర్ బోర్డుకు చెందిన క్షేత్ర స్థాయి అధికారుల నుంచి పైస్థాయి అధికారుల దాకా భాగస్వామ్యం ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. అందువల్లే పలు కాలేజీలు తమకు అనుబంధ గుర్తింపు లేకపోయినా అడ్మిషన్లు చేసుకోవడం మొదలుపెట్టాయని.. ఇది తెలిసినా అధికారులెవరూ పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా ప్రారంభించినా.. అంతే! ప్రైవేటు కాలేజీలు ఏటా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందాలి. ఇందుకోసం తొలుత ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ ఇస్తే.. యాజమాన్యాలు దరఖాస్తు చేసుకుంటాయి. సాధారణంగా జూన్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందన్నది తెలిసిందే. అయినా నాలుగైదేళ్లుగా అధికారులు ముందుగానే అనుబంధ గుర్తింపు ప్రక్రియ చేపట్టకుండా జాప్యం చేశారు. కానీ ఈసారి మాత్రం మార్చి 31 నాటికే ‘గుర్తింపు’ప్రక్రియ పూర్తిచేసి.. గుర్తింపు పొందిన, గుర్తింపు రాని కాలేజీల జాబితాలను వెబ్సైట్లో పెడతామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గతేడాది ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరం కోసం గతేడాది డిసెంబర్లోనే అఫిలియేషన్ల దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన ఇంటర్ బోర్డు.. ఫిబ్రవరి నాటికే ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించింది. కానీ జాప్యం చేసింది. ‘గుర్తింపు’లేని జాబితా ఏదీ? ఇంటర్ బోర్డు మార్చి 31 నాటికి 1,303 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. వాటి జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కానీ గుర్తింపు పొందని కాలేజీల జాబితాను మాత్రం వెబ్సైట్లో పెట్టకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ కాలేజీలు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి.. ఈ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ కాలేజీలకు గుర్తింపు రాకపోతే ఎలా? అనుబంధ గుర్తింపు లభించని కాలేజీల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో వనస్థలిపురంలోని ఓ కాలేజీ విషయంగా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. మామూళ్లకు అలవాటు పడిన అధికారులు.. గుర్తింపు లేకున్నా ఆ కాలేజీ ప్రవేశాలు చేపట్టడాన్ని చూసీ చూడనట్టు వదిలేశారు. చివరికి విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన సమయం వచ్చే సరికి.. అధికారులు చేతివాటం చూపారు. అడిగిన మొత్తం ఇవ్వకపోవడంతో తమ విద్యార్థుల వివరాలు అప్లోడ్ చేసేందుకు, ఫీజు చెల్లించేందుకు ఆ కాలేజీకి లాగిన్ ఐడీ ఇవ్వలేదు. దాంతో విద్యార్థులకు హాల్‌టికెట్లు రాక ఆందోళనకు దిగారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని.. వారందరినీ హయత్‌నగర్ ప్రభుత్వ కాలేజీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించింది. దీనివల్ల ఆ విద్యార్థులు ఎంసెట్ ర్యాంకుల్లో తీవ్రంగా నష్టపోయారు కూడా. తాజాగా అనుబంధ గుర్తింపు పొందని 337 ఇంటర్మీడియట్ కాలేజీల్లోనూ వేల మంది విద్యార్థులు చేరినట్టు అంచనా. ఇప్పుడు వీరి భవిష్యత్తు ఏమిటన్నది ఆందోళనకరంగా మారింది. -
కాలేజీలకు కొత్త ‘గుర్తింపు’
జనగామ అర్బన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల గుర్తింపు (అఫిలియేషన్) కోసం ప్రత్యేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అఫిలియేషన్ కోసం గతంలో మాదిరిగా హైదరాబాద్ బోర్డు కార్యాలయం చుట్టూ తిరుగకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే గుర్తింపు అధికారాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారులకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 22న జిల్లా డీఐఈఓ వి.ఇంద్రాణి జిల్లాలోని 21 ప్రైవేట్ జూనియర్ కళాశాలతో పాటు 10 మోడల్, 04 సాంఘిక సంక్షేమ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్‌తో సమావేశాన్ని నిర్వహించి గుర్తింపు మార్గదర్శకాలను, విధివిధానాలను వివరించారు. మారిన ప్రక్రియ... ఇంటర్ కళాశాలలకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు గతంలో మాదిరిగా కాకుండా ఈసారి దాదాపు 14 పేజీలు ఉన్న ఒకే ఒక ఫారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అప్లోడ్ చేసిన ఫారంతో ఇంటర్మీడియట్ అధికారులు సంబంధిత కళాశాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ పేర్కొన్న అంశాలు అన్నీంటిన్ని క్షుణంగా పరీశీలించిన అనంతరం గుర్తింపు ఫీజును ప్రభుత్వానికి కట్టడానికి అనుమతిస్తారు. గతంలో గుర్తింపు ఫీజును కట్టిన తరువాతే కళాశాలలను పర్యవేక్షించే విధానానికి ప్రభుత్వం ఈసారి స్వస్తి పలికింది. కాగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రతి సంవత్సరం లేని గుర్తింపు ప్రక్రియను ప్రైవేట్ కళాశాలలకు ఆపాదించడంపై కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ విడుదల... జిల్లాలోని ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలు (ఒకేషనల్ కళాశాలలతో సహా) గుర్తింపు కోసం చేసుకునే దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవడానికి ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణీత షెడ్యూల్ ప్రకటించారు. గుర్తింపు కోసం అపరాధ రుసుం లేకుండా 11 జనవరి 2018 వరకు, రూ.1000 అపరాధ రుసుముతో 18 జనవరి వరకు, రూ.3 వేల ఆపరాధ రుసుముతో జనవరి 25 వరకు, రూ.5 వేలతో 1 ఫిబ్రవరి 2018 వరకు, రూ.10 వేలతో 08 ఫిబ్రవరి వరకు, రూ.15 వేల అపరాధ రుసుముతో 15 ఫిబ్రవరి వరకు, రూ.20 వేల అపరాధ రుసుముతో 22 ఫిబ్రవరి 2018 వరకు చెల్లించుకోవచ్చునని ఉత్తర్వులను జారీ చేశారు. కాగా గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన ఆన్లైన్ ఫాంను నేరుగా ఇంటర్ బోర్డు కార్యాలయానికి తీసుకుని వస్తే తిరస్కరిస్తామని స్పష్టంగా హెచ్చరించింది. వసతి గృహాలు ఉన్న ప్రైవేట్ కళాశాలల వారు 2018–19 గుర్తింపు కోసం 5 జనవరి 2018 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు పెర్కొన్నారు. నిబంధనల ప్రకారమే గుర్తింపు... జిల్లాలోని ఇంటర్ కళాశాలల గుర్తింపు (ఆఫిలియేషన్) ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేసి అన్నీ వసతులు ఉంటేనే ఆఫిలియేషన్ జారీ చేస్తాం. – వి.ఇంద్రాణి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సంస్కరణలను స్వాగతిస్తున్నాం... ప్రైవేట్ కళాశాలల గుర్తింపు విషయంలో ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలను స్వాగతిస్తున్నాం. ఇదే క్రమంలో ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు అందజేస్తున్న స్కాలర్‌షిప్‌ల విషయంలో కూడా చొరవ తీసుకుని విడుదల చేస్తే కళాశాలలకు ఆర్థిక భారం తగ్గుతుంది. – ఆర్.బ్రహ్మచారి, ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజామాన్య అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
అఫిలియేషన్లలో ‘అవినీతి’ లేదు
ఆన్లైన్ ద్వారానే గుర్తింపు పొందే ఏర్పాట్లు చేశాం: ఇంటర్ బోర్డు ⇒ బోర్డుకు వచ్చి ఎవరినీ కలవాల్సిన అవసరం లేదు ⇒ 29 కార్పొరేట్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు.. ⇒ అవన్నీ నారాయణ, శ్రీచైతన్య కాలేజీలే ⇒ వాటికి రూ. 1.62 కోట్ల జరిమానా విధించాం.. చెల్లిస్తేనే అఫిలియేషన్ ⇒ ఆ కాలేజీల్లోని విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల నుంచి పరీక్షలు రాయిస్తాం సాక్షి, హైదరాబాద్ జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే విషయంలో వస్తున్న అవినీతి ఆరోపణలు నిరాధారమని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. కాలేజీ యాజమాన్యాలు ఇంట ర్మీడియెట్ బోర్డుకు రావాల్సిన అవసరమే లేకుండా ఆన్లైన్ ద్వారానే అఫిలియేషన్ల కోసం దరఖాస్తు చేసుకొని అనుబంధ గుర్తింపు పొందేలా ఏర్పాట్లు చేశామన్నారు. బోర్డు కార్యాలయానికి వచ్చి ఎవరినీ కలవాల్సిన అవసరం లేదన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 1,600 వరకు ఉన్న ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఇప్పటివరకు 1,205 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చామని తెలిపారు. మిగతా కాలేజీలకు ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఇచ్చామని, నిర్ణీత వ్యవధిలో లోపాలను సరిదిద్దుకుంటామని హామీ ఇస్తే అనుబంధ గుర్తింపు ఇస్తామన్నారు. 10లోగా అలా హామీ ఇవ్వని కాలేజీలపై కఠిన చర్యలు చేపడతామన్నారు. ఫైర్ సేప్టీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వాటికి, రేకుల షెడ్డుల్లో నడుస్తున్న 85 కాలేజీలకు మాత్రమే షరతులతో కూడిన అనుబంధ గుర్తింపు ఇవ్వాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారన్నారు. సేల్ లేదా అగ్రిమెంట్ డీడ్ లేని వాటికి, ఆర్అండ్డీ లేని వాటికి అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ఆయన చెప్పలేదన్నారు. ఈసారి ఎన్రోల్మెంట్ పెరిగింది.. రాష్ట్రంలో నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 29 కార్పొరేట్ కాలేజీలకు ఈసారి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని అశోక్ వెల్లడించారు. నారాయణ విద్యా సంస్థలకు చెందిన 13 కాలేజీలు, శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 16 కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాయన్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడం, ల్యాబ్‌లు లేకపోవడం, అనుమతి లేకుండా అదనపు సెక్షన్లు కొనసాగించడం వంటి తప్పిదాలకు పాల్పడ్డాయన్నారు. విజిలెన్స్ విచారణలో ఇది బయటపడటంతో వారికి నోటీసులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. అంతేగాకుండా నారాయణ విద్యా సంస్థకు చెందిన కాలేజీలకు రూ.62.72 లక్షలు, శ్రీచైతన్య కాలేజీలకు రూ.1.04 కోట్ల జరిమానా విధించినట్టు చెప్పారు. ఆ జరిమానాను ఆ కాలేజీలు ఇంతవరకు చెల్లించలేదని, అందుకే వాటికి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని, వాటిల్లో ప్రవేశాలకు లాగిన్ ఐడీ ఇవ్వలేదని వివరించారు. జరిమానా చెల్లిస్తేనే వాటికి అనుబంధ గుర్తింపు ఇస్తామని స్పష్టంచేశారు. ఈ నెల 10లోగా ఆయా కాలేజీలు జరిమానా చెల్లించాలని, లేదంటే కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. ఇప్పటికే ఆయా కాలేజీల్లో విద్యార్థులు చేరిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. అవసరమైతే ఆయా విద్యార్థులను ప్రభుత్వ కాలేజీల నుంచి పరీక్షలకు అనుమతిస్తామన్నారు. ఈసారి ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగిందని, సంఖ్య 98 వేలు దాటిందని చెప్పారు. ఎన్రోల్మెంట్ 2014లో 60 వేలు ఉండగా.. 2015లో 80 వేలకు, 2016లో 92 వేలకు చేరిందన్నారు. ఈ ఏడాది మరింత పెరిగిందన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఉచిత విద్యతోపాటు అన్ని సదుపాయాలు కల్పించడం ద్వారా ఇది సాధ్యమైందన్నారు. అలాగే ఈసారి ప్రథమ సంవత్సరంలో 65 శాతం, ద్వితీయ సంవత్సరంలో 75 శాతం ఫలితాల సాధన లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. వచ్చేనెల నుంచి ప్రభుత్వ కాలేజీల్లో డిజిటల్ బోధన, వర్చువల్ తరగతుల నిర్వహణను చేపడతామన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రైవేటు కాలేజీల్లోనూ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. -
డిగ్రీ ‘ఆన్లైన్’ ఆగమాగం!
ఇటు భారీగా సీట్లు.. అటు అందని అఫిలియేషన్లు * మరోవైపు కొనసాగుతున్న విజిలెన్స్ తనిఖీలు * కాలేజీ, సీటు ఎంచుకున్నాక అఫిలియేషన్ రాకపోతే పరిస్థితేమిటి? * ఆందోళనలో విద్యార్థులు.. స్పష్టత ఇవ్వని ఉన్నత విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల పరిస్థితి గందరగోళంగా తయారైంది. అటు ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది.. ఇటు డిగ్రీ కాలేజీల అనుబంధ గుర్తింపు రెన్యువల్ ప్రక్రియ పూర్తి కాలేదు. మరోవైపు విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తనిఖీలు పూర్తయ్యాక ఆ నివేదికల ఆధారంగా రాష్ట్రంలో ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉంటాయి, ఎన్ని కాలేజీల్లో ఎన్ని కోర్సులు, ఎన్ని సీట్లు ఉంటాయి, ఎన్ని రద్దవుతాయన్నది తేలనుంది. అయితే విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం వెబ్ ఆప్షన్ల ద్వారా కాలేజీలను, కోర్సులను ఎంచుకుంటున్నారు. త్వరలోనే సీట్లను కేటాయించేందుకు ఉన్నత విద్యాశాఖ సిద్ధమవుతోంది. మరి విద్యార్థులు ఎంచుకున్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాకపోతే పరిస్థితి ఏమిటి, విజిలెన్స్ తనిఖీల్లో లోపాలు బయటపడి ఆయా కాలేజీలు లేదా విద్యార్థులు ఎంచుకున్న కోర్సులు రద్దయితే ఎలాగన్న దానిపై అస్పష్టత నెలకొంది. దీంతో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోతున్నారు. యూనివర్సిటీ తప్పిదాలు మరిన్ని.. మరోవైపు యూనివర్సిటీలు కూడా డిగ్రీ సీట్ల విషయంలో తప్పిదానికి పాల్పడ్డాయి. కాలేజీల్లో పరిమితికి మించిన సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉన్నట్లు వెబ్సైట్లో (వెబ్ ఆప్షన్ల కోసం) అప్లోడ్ చేశాయి. నిబంధనల ప్రకారం ప్రతి కాలేజీలో ఒక్కో సెక్షన్‌కు ఆర్ట్స్, కామర్స్ గ్రూపులైతే 60 సీట్లు, సైన్స్ గ్రూపులైతే 50 సీట్లకు అనుమతివ్వాలి. అవసరమైతే మరో అదనపు సెక్షన్‌కు అనుమతించాలి. అంటే రెండు సెక్షన్లు కలిపి ఆర్ట్స్, కామర్స్ గ్రూపుల్లో 120 సీట్లకు, సైన్స్ గ్రూపుల్లో 100 సీట్లకు మించి ఉండరాదు. కానీ అనేక కాలేజీల్లో ఒక్కో గ్రూపులో 150 సీట్ల నుంచి 450 సీట్ల వరకు ఉన్నట్లు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. కాలేజీలు ఇచ్చిన సమాచారాన్ని యథాతథంగా యూనివర్సిటీలు అప్లోడ్ చేశాయే తప్ప.. నిబంధనలను పట్టించుకోలేదు. ఇలా ఇష్టారాజ్యంగా సీట్ల సంఖ్యను వెబ్సైట్లో ఎలా పెట్టారంటూ యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి లేఖలు కూడా రాసింది. దీంతో మరింత గందరగోళం నెలకొంది. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో సీట్లున్నాయనే ఆలోచనతో టాప్ కాలేజీల్లో చేరేందుకు ఆప్షన్లు ఇచ్చే అవకాశముంది. మరి ఆ సీట్లు లేవని తేలితే ఎలాగన్న ది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీట్ల కేటాయింపును వాయిదా వేస్తే మంచిదని ఉన్నత విద్యాశాఖ వర్గాలు పేర్కొం టున్నాయి. కాలేజీల గుర్తింపు, సీట్ల సంఖ్య తేలాక.. మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించి సీట్లు కేటాయించాలని చెబుతున్నా యి. లేకపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ముందుకెళుతున్న విద్యాశాఖ ఉన్నత విద్యా శాఖ ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను కొనసాగిస్తోంది. కాలేజీలకు అనుమతుల ప్రక్రియ పూర్తి కాకుండానే, వాటిల్లో సీట్ల లెక్క తేలకుండానే... గతేడాది లెక్కలను తీసుకుని కాలేజీలు, సీట్ల వివరాలను ఆన్లై న్లో అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా 1,103 డిగ్రీ కాలేజీల్లో 3,94,575 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. దీంతో విద్యార్థులు ఆయా కాలేజీలు, సీట్లలో చేరేందుకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకుంటున్నారు. ఇక త్వరలోనే సీట్లను కూడా కేటాయించేందుకు ఉన్నత విద్యాశాఖ సిద్ధమవుతోంది. అయితే కాలేజీలకు అఫిలియేషన్లు పూర్తికాకపోవడం, విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతుండడంతో... ఏవైనా కాలేజీలు, సీట్లు రద్దయితే వాటిని ఎంచుకున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటన్నది అర్థం కాక అధికారులే తల పట్టుకుంటున్నారు. లోపాలు వెల్లడైనా కాలేజీలపై చర్యలు చేపట్టకుండా వదిలేస్తారా, విద్యార్థులను వేరే కాలేజీల్లోకి మార్చుతారా అన్నది తేలాల్సి ఉంది. -
ఆ సీన్ చూసి...
అమ్మ మనసు బాలీవుడ్ ‘బిగ్ బీ’ అమితాబ్ బచ్చన్‌కు తల్లి తేజీ బచ్చన్‌తో గాఢమైన అనుబంధం ఉంది. అమితాబ్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ కవి. ఆయన మొదటి భార్య చనిపోయిన తర్వాత తేజీ ఆయనను పెళ్లాడారు. సంపన్న కుటుంబానికి చెందిన తన తల్లి అన్నీ వదులుకుని తన తండ్రితో పెళ్లికి సిద్ధపడిందని, తనను తన తమ్ముడు అజితాబ్‌ను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడేదని అమితాబ్ తన బ్లాగులో రాసుకున్నారు. సినీరంగంలో ప్రవేశించిన తొలినాళ్లలో విజయాల కోసం పరితపించిన రోజుల్లో తనకు ధైర్యం చెప్పేదని గుర్తు చేసుకున్నారు. ‘దీవార్’ సినిమా చూసిన తర్వాత తన తల్లి వెక్కివెక్కి ఏడ్చిందని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాలో అమితాబ్ పాత్ర మరణించిన దృశ్యం ఆమెను విపరీతంగా కదిలించింది. -
షరతులు వర్తిస్తాయి!
* 269 ఇంజనీరింగ్, 104 ఫార్మసీ కాలేజీలకు షరతులతో అఫిలియేషన్ * పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ అధికారులకు చేరిన కళాశాలల జాబితా * లోపాలున్న కాలేజీలకు మళ్లీ నోటీసులిచ్చిన జేఎన్టీయూహెచ్ * రేపటిలోగా వివరాలు సమర్పించాలని ఆదేశం * గేట్, జీప్యాట్ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా సాక్షి, హైదరాబాద్: పీజీ కళాశాలల అఫిలియేషన్ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. లోపాలను సరిదిద్దుకోని కళాశాలలనూ వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని జేఎన్టీయూహెచ్ను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. తమ పరిధిలో ఉన్న 269 ఇంజనీరింగ్, 104 ఫార్మసీ కళాశాలలకు వర్సిటీ అధికారులు షరతులతో కూడిన అఫిలియేషన్ మంజూరు చేశారు. అనంతరం సదరు జాబితాను బుధవారం పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ అధికారులకు అందజేశారు. అయితే, మరికొన్ని గంటల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో అఫిలియేటెడ్ కళాశాలల జాబితా రావడంతో గేట్, జీప్యాట్ అభ్యర్థుల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6, 7 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసుకున్న గేట్, జీప్యాట్ ర్యాంకర్లకు బుధ, గురువారాల్లో ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లిన అభ్యర్థులు వెబ్సైట్లో ఉన్న వాయిదా సమాచారం చూసి నిరాశగా వెనుతిరిగారు. వాయిదా పడిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో అధికారులు స్పష్టం చేయలేదు. కాగా, ఈనెల 12 నుంచి ప్రారంభమయ్యే పీజీఈ సెట్ అభ్యర్థుల వెబ్ ఆప్షన్ల షెడ్యూల్లో ఎలాంటి మార్పూ లేదని అధికారులు పేర్కొన్నారు. ఆ కాలేజీలకు నోటీసులు... జేఎన్టీయూహెచ్ పరిధిలో పీజీ కోర్సులు నిర్వహిస్తున్న 272 ఇంజనీరింగ్ కళాశాలల్లో 145 కాలేజీలు మాత్రమే ప్రమాణాలు పాటిస్తున్నాయని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మిగిలినవాటిలో 124 కళాశాలలకు జేఎన్టీయూహెచ్ బుధవారం మరోసారి నోటీసులు జారీచేసింది. మౌలిక వసతులు, ఫ్యాకల్టీ నిష్పత్తి, బోధనేతర సిబ్బంది తదితర అంశాలపై తాజా సమాచారాన్ని అందజేయాలని అందులో ఆదేశించింది. మూడు కళాశాలల యాజమాన్యాలు మాత్రం తాము పీజీ కోర్సులు నిర్వహించేందుకు సుముఖంగా లేమని జేఎన్టీయూహెచ్కు స్పష్టంచేశాయి. కాగా, ఎంఫార్మసీ నిర్వహిస్తున్న 104 కళాశాలల్లో లోపాలున్నట్లుగా చెబుతున్న 54 కాలేజీలకు కూడా నోటీసులు జారీఅయ్యాయి. నోటీసులు అందుకున్న కాలేజీల యాజమాన్యాలు సదరు సమాచారాన్ని శుక్రవారంలోగా యూనివర్సిటీకి అందజేయాలని అధికారులు స్పష్టంచేశారు. తీర్పునకు లోబడే ప్రవేశాలు.. పీజీఈసెట్‌లో కొన్ని కళాశాలలకు షరతులతో కూడిన అనుమతి లభించినప్పటికీ, హైకోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడే అభ్యర్థులకు అడ్మిషన్లు ఉంటాయని కన్వీనర్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చే ముందు అడ్మిషన్ల విషయమై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. సదరు సమాచారాన్ని వెబ్సైట్ లో కూడా పెట్టామని వెల్లడించారు. -
లోపాలున్నా అఫిలియేషన్!
సాక్షి, హైదరాబాద్: ప్రమాణాలు పాటించడం లేదంటూ పలు ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ రద్దు చేసిన జేఎన్టీయూహెచ్.. మరికొన్ని కాలేజీలను ప్రమాణాలు పాటించకపోయినా వెబ్‌కౌన్సెలింగ్‌కు అనుమతించినట్లు తాజాగా వెలుగుచూసింది. ఆ తప్పును దిద్దుకునేందుకు వర్సిటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునేందుకు గురువారం మధ్యాహ్నం సమావేశమైన వర్సిటీ స్టాండింగ్ కమిటీ సభ్యులు సుదీ ర్ఘంగా చర్చించారు. కాలేజీల్లో నిర్వహించిన తని ఖీల రిపోర్టులను, నోటీసులను అర్ధరాత్రి వరకూ పరిశీలించారు. ఈ ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో శుక్రవారం కూడా దీన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భం గా ప్రమాణాలు పాటించలేదంటూ 174 ఇంజినీరింగ్ కాలేజీలను దూరంగా ఉంచిన సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో లోపాలున్న కాలేజీలను ఏవిధంగా మొదటి విడత కౌన్సెలింగ్‌కు అనుమతించారో, అలాగే మలిదశ కౌన్సెలింగ్‌కు, పీజీ ఈసెట్ కౌన్సెలింగ్‌కూ తమనూ అనుమతించాలని పలు యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నా యి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో కేడర్ రేషియో, ఫ్యాకల్టీ ర్యాటిఫికేషన్, స్పెషలైజేషన్లు, ఏఐసీటీఈ వేతన స్కేలు అమలు, ఫ్యాకల్టీ వయస్సు, బోధనా సిబ్బంది కొరత, టీచింగ్ స్టాఫ్‌ను అడ్మినిస్ట్రేషన్‌కు వినియోగించడం తదితర ఏడు అంశాల్లో లోపాలున్నట్లు గుర్తించిన కాలేజీలనూ వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతించారని బాధిత యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. -
ఇక పీజీ కాలేజీల వంతు!
లోపాలను సరిదిద్దుకునేందుకు రెండు రోజులు గడువు.. లేకపోతే అఫిలియేషన్‌కు నో! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ, పుట్టెడు లోపాలతో కొనసాగుతున్న ప్రైవేటు పీజీ కళాశాలలపై వేటు వేసేందుకు జేఎన్టీయూహెచ్ సన్నద్ధమైంది. ఇప్పటికే బీటెక్ కోర్సులు నిర ్వహిస్తున్న 174 ప్రైవేటు ఇంజనీరింగ్ క ళాశాలలకు అఫిలియేషన్ నిరాకరించి సంచలనం సృష్టించిన వర్సిటీ అధికారులు.. తాజాగా ఇంజనీరింగ్, ఫార్మసీల్లో పీజీ స్థాయి కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలలపై దృష్టిపెట్టారు. ఈ నెల 6నుంచి పీజీఈసెట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకుకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టాల్సిన అఫిలియేటెడ్ కళాశాలల జాబితాపై జేఎన్టీయూహెచ్ కసరత్తు ప్రారంభించింది. మౌలిక వసతులు, లేబొరేటరీలు, బోధనా సిబ్బంది తదితర అంశాలపై ఇటీవలి తనిఖీల్లో గుర్తించిన లోపాలపై వివరణ కోరుతూ... 370 కళాశాలలకు బుధవారం నోటీసులు జారీచేసింది. ఎంటెక్ కోర్సులు నిర్వహిస్తున్న 250 ఇంజనీరింగ్ కళాశాలలు, 40 ఎంబీఏ, 20 ఎంసీఏ, 60 ఎంఫార్మసీ కళాశాలలు ఈ నోటీసులు అందుకున్న జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రాని కల్లా లోపాలను సరిదిద్దుకొని డెఫిషియెన్సీ కాంప్లెయిన్స్ రిపోర్టులను సమర్పించాలని వర్సిటీ ఆదేశించింది. లేనిపక్షంలో పీజీఈసెట్‌కు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అఫిలియేషన్ రాని ప్రైవేటు కళాశాలలకు తాజాగా మరో దెబ్బ తగిలింది. -
అన్ని కాలేజీలూ కౌన్సెలింగ్‌లోకి!
* గుర్తింపు లభించని కాలేజీల నుంచి ‘బాండ్’లు తీసుకుని అనుమతి * నెల రోజుల్లో లోపాలు సవరించుకోవాలని షరతు * రూ. 100 బాండ్ పేపర్‌పై యాజమాన్యాల నుంచి అండర్ టేకింగ్ * వీటన్నింటినీ రెండో దశ వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పెద్ద సంఖ్యలో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలకు అఫిలియేషన్ నిరాకరణ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. లోపాలను సరిదిద్దుకున్న కాలేజీలతో పాటు మిగతా కళాశాలలకు కూడా కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చేందుకు జేఎన్టీయూహెచ్ అంగీకరించింది. అయితే ఆయా కళాశాలల్లో తనిఖీల సందర్భంగా గుర్తించిన లోపాలన్నింటినీ నెలరోజుల్లోగా పూర్తిగా సరిదిద్దుకుంటామని యాజమాన్యాల నుంచి హామీ తీసుకుంది. దీంతో యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి లభించినట్లయింది. ఇందులో 130 కళాశాలలకు స్క్రూటిని అనంతరం బుధవారం అర్ధరాత్రి అనుమతి ఇచ్చారు. మిగతా కళాశాలలను కూడా వీలయినంత త్వరగా వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చనున్నారు. వెబ్ కౌన్సెలింగ్ తొలిదశ గురువారంతో పూర్తికానుండడంతో.. రెండో దశలో ఈ కాలేజీలను చేర్చాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకూ కొన్ని కళాశాలలకే ఆప్షన్లు ఇచ్చుకున్న అభ్యర్థులు... తమ ఆప్షన్లను తాజాగా అనుమతి లభించిన కళాశాలలకు మార్చుకొనేందుకు వీలు కల్పించే అవకాశముంది. వర్సిటీ వద్ద పడిగాపులు.. అర్హతలున్న ఇంజనీరింగ్ కళాశాలలను ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతించాలంటూ రెండ్రోజుల కిందట హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తమ కాలేజీలకు అఫిలియేషన్‌ను పునరుద్ధరించాలని కోరుతూ.. ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు జేఎన్టీయూహెచ్కు విజ్ఞప్తి చేశాయి. వెబ్ కౌన్సెలింగ్‌కు ఆయా కాలేజీలను అనుమతించే విషయమై తాము సానుకూలంగానే ఉన్నట్లు మంగళవారం రాత్రి వీసీ రామేశ్వరరావు యాజమాన్యాలకు చెప్పారు. బుధవారం ఉదయం 10 గంటలకల్లా తాము కోరిన విధంగా అండర్‌టేకింగ్‌లు సమర్పించాలని సూచించారు. దీంతో బుధవారం 9 గంటల వరకే కాలేజీ యాజమాన్య ప్రతినిధులు అండర్ టేకింగ్ పత్రాలు తీసుకుని యూనివర్సిటీకి వచ్చారు. కానీ సాయంత్రం 4 గంటల వరకు అటు వీసీగానీ, ఇటు రిజిస్ట్రార్గానీ అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన చెందారు. అయితే జేఎన్టీయూహెచ్ వీసీ రామేశ్వరరావు అండర్‌టేకింగ్ ఫార్మాట్‌ను రూపొందించి, సాంకేతిక విద్యాశాఖ నుంచి ఆమోదం పొందారు. అనంతరం ఆ ఫార్మాట్లను యాజమాన్యాలకు అందజేసి.. అండర్‌టేకింగ్ తీసుకున్నారు. 130 కాలేజీలకు అనుమతి.. ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతించే విషయమై ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి అండర్ టేకింగ్ తీసుకున్న జేఎన్టీయూహెచ్... లోపాలు సరిదిద్దుకున్నట్లుగా పేర్కొంటూ పలు కాలేజీలు ఇచ్చిన నివేదికల పరిశీలన చేపట్టింది. బుధవారం ఆయా కాలేజీల యాజమాన్యాలు ఈ రిపోర్ట్‌లను అందజేయగా... అర్ధరాత్రి వరకు అధికారులు స్క్రూటినీ నిర్వహించి 130 కాలేజీలకు అనుమతి ఇచ్చారు. మిగతా వాటిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జేఎన్టీయూ అధికారులు తెలిపారు. సవరించుకోకుంటే చర్యలు తీసుకోండి.. ‘ఏఐసీటీఈ నిర్దేశించిన ప్రమాణాలు, జేఎన్టీయూహెచ్ నిబంధనల మేరకు.. ర్యాటిఫైడ్ ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బంది, లేబొరేటరీలు, పుస్తకాలు, జర్నల్‌లు, మౌలిక వసతులు, అకడమిక్ రెగ్యులేషన్స్ తదితర అంశాల్లో తనిఖీ కమిటీలు(ఎఫ్ఎఫ్సీ) గుర్తిం చిన లోపాలను నెల లోపు సరిదిద్దుకుంటాం. ఆ తర్వాత ఏ సమయంలోనైనా వర్సిటీ అధికారులు తనిఖీలు నిర్వహించి.. లోపాలను గుర్తిస్తే చర్యలు తీసుకునే అధికారం వర్సిటీకి ఉంది’.. అని సంబంధిత ఇంజనీరింగ్ కళాశాలల నిర్వాహకులు రూ. 100 బాండ్‌పేపర్లపై పేర్కొని సంతకం చేసి అండర్‌టేకింగ్‌లను వర్సిటీ రిజిస్ట్రార్‌కు సమర్పించారు. ఆ కాలేజీల్లో సీట్ల తగ్గింపు సబబే! హైకోర్టు ధర్మాసనం ముందు జేఎన్టీయూహెచ్ అప్పీల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల సీట్ల సంఖ్యను తగ్గించడం సబబేనని హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) పేర్కొంది. ఈ విషయంలో తమ నిర్ణయాన్ని తప్పుబడుతూ సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను గురువారం ఉదయం న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. -
అప్పటినుంచి కాలేజీలది దాటవేత ధోరణే
ఇంజనీరింగ్ కాలేజీలు 2012 నుంచి దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయని తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఇంజినీరింగ్ కాలేజిల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు, సౌకర్యాలు కూడా లేవని ఆయన చెప్పారు. ఏమాత్రం అర్హత లేనివారిని అధ్యాపకులుగా నియమించుకుంటున్నాయని, వాస్తవానికి అక్కడ ప్రిన్సిపల్‌గా పీహెచ్డీ, లెక్చరర్లుగా పీజీ పూర్తి చేసిన వారినే నియమించాలని ఆయన తెలిపారు. కాలేజీలు ఇచ్చిన అండర్ టేకింగ్ పత్రాలకే విలువ లేకుండా పోయిందని ఏజీ రామకృష్ణారెడ్డి విమర్శించారు. నాణ్యమైన విద్య లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆయన చెప్పారు. -
అధికార పార్టీకి ‘అఫిలియేషన్’ షాక్!
* గుర్తింపు రాని ఇంజనీరింగ్ కాలేజీల్లో టీఆర్ఎస్ నేతలవే అధికం * టీడీపీ ఎంపీ మల్లారెడ్డి కాలేజీలన్నింటికీ అఫిలియేషన్లు * కాంగ్రెస్, బీజేపీ నేతల కళాశాలలకూ గుర్తింపు * ఎక్కువ లోపాలతోపాటు చిన్న లోపాలున్న వాటికీ నిరాకరణ * లోపాలు సరిదిద్దుకుంటామన్న 34 కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే చాన్స్ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల అఫిలియేషన్ల వ్యవహారంలో ఈసారి రాజకీయ పార్టీల నేతలకు పెద్దగానే షాక్ తగిలింది. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల కాలేజీలకే అఫిలియేషన్లు లభించకపోగా, ఇతర పార్టీలకు చెందిన నేతల కాలేజీలు దాదాపు అన్నింటికీ అఫిలియేషన్లు రావడంపై అధికార, విద్యావర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, ఆయన బంధువులకు సంబంధించిన దాదాపు అన్ని కాలేజీలతోపాటు ఇతర పార్టీలకు చెందిన నాయకుల కళాశాలలకు అఫిలియేషన్లు లభించాయి. అయితే, టీఆర్ఎస్కి చెందిన నేతల కాలేజీలకు మాత్రం కత్తెర పడింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఆయా కళాశాలల యాజమాన్యాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కౌన్సెలింగ్ ముగిసేలోపే ఇవ్వండి... లోపాలను తెలియజేయకుండా, సరిదిద్దుకునే అవకా శం ఇవ్వకుండా, నోటీసులైనా జారీచేయకుండా అఫిలి యేషన్లను నిరాకరించడాన్ని సవాలు చేస్తూ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పరిస్థితుల్లో జేఎన్టీయూహెచ్ సదరు కాలేజీలకు లోపాలపై తాజాగా నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఆ లోపాలను సరిదిద్దుకుంటామన్న మరో 34 కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ నెల 25న మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తికానుందని,దానికి ముందే అఫిలియేషన్లు ఇవ్వాలని చిన్నచిన్న లోపాలున్న యాజమాన్యాలు కోరుతున్నాయి. అఫిలియేషన్ల వ్యవహారంలో ప్రధాన అంశాలు.. రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మహేందర్‌రెడ్డికి చెందిన మూడు కాలేజీలకు అఫిలియేషన్లు రాలేదు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి చెందిన రెండు కళాశాలలకు గుర్తింపు నిరాకరించారు. ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ నాగేశ్వర్‌కు చె ందిన రెండు కాలే జీలకు అఫిలియేషన్లు ఇవ్వలేదు. టీఆర్ఎస్ నేత మహబూబ్ అలీఖాన్‌కు చెందిన మూడు కాలేజీలకు కూడా గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిసింది. టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, ఆయన బంధువులకు సంబంధించిన దాదాపు 15 కాలేజీలకు అఫిలియేషన్లు లభించగా.. తీగల కృష్ణారెడ్డికి సంబంధించిన కళాశాలలకు గుర్తింపు వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల కాలేజీలకూ అఫిలియేషన్లు లభించాయి.