డిగ్రీ ‘ఆన్‌లైన్’ ఆగమాగం! | degree of 'online' problems! | Sakshi
Sakshi News home page

డిగ్రీ ‘ఆన్‌లైన్’ ఆగమాగం!

Published Fri, Jun 10 2016 4:15 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

డిగ్రీ ‘ఆన్‌లైన్’ ఆగమాగం! - Sakshi

డిగ్రీ ‘ఆన్‌లైన్’ ఆగమాగం!

ఇటు భారీగా సీట్లు.. అటు అందని అఫిలియేషన్లు
* మరోవైపు కొనసాగుతున్న విజిలెన్స్ తనిఖీలు
* కాలేజీ, సీటు ఎంచుకున్నాక అఫిలియేషన్ రాకపోతే పరిస్థితేమిటి?
* ఆందోళనలో విద్యార్థులు.. స్పష్టత ఇవ్వని ఉన్నత విద్యాశాఖ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల పరిస్థితి గందరగోళంగా తయారైంది. అటు ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది.. ఇటు డిగ్రీ కాలేజీల అనుబంధ గుర్తింపు రెన్యువల్ ప్రక్రియ పూర్తి కాలేదు. మరోవైపు విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ తనిఖీలు పూర్తయ్యాక ఆ నివేదికల ఆధారంగా రాష్ట్రంలో ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉంటాయి, ఎన్ని కాలేజీల్లో ఎన్ని కోర్సులు, ఎన్ని సీట్లు ఉంటాయి, ఎన్ని రద్దవుతాయన్నది తేలనుంది. అయితే విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం వెబ్ ఆప్షన్ల ద్వారా కాలేజీలను, కోర్సులను ఎంచుకుంటున్నారు. త్వరలోనే సీట్లను కేటాయించేందుకు ఉన్నత విద్యాశాఖ సిద్ధమవుతోంది. మరి విద్యార్థులు ఎంచుకున్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాకపోతే పరిస్థితి ఏమిటి, విజిలెన్స్ తనిఖీల్లో లోపాలు బయటపడి ఆయా కాలేజీలు లేదా విద్యార్థులు ఎంచుకున్న కోర్సులు రద్దయితే ఎలాగన్న దానిపై అస్పష్టత నెలకొంది. దీంతో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోతున్నారు.
 
యూనివర్సిటీ తప్పిదాలు మరిన్ని..
మరోవైపు యూనివర్సిటీలు కూడా డిగ్రీ సీట్ల విషయంలో తప్పిదానికి పాల్పడ్డాయి. కాలేజీల్లో పరిమితికి మించిన సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉన్నట్లు వెబ్‌సైట్‌లో (వెబ్ ఆప్షన్ల కోసం) అప్‌లోడ్ చేశాయి. నిబంధనల ప్రకారం ప్రతి కాలేజీలో ఒక్కో సెక్షన్‌కు ఆర్ట్స్, కామర్స్ గ్రూపులైతే 60 సీట్లు, సైన్స్ గ్రూపులైతే 50 సీట్లకు అనుమతివ్వాలి. అవసరమైతే మరో అదనపు సెక్షన్‌కు అనుమతించాలి. అంటే రెండు సెక్షన్లు కలిపి ఆర్ట్స్, కామర్స్ గ్రూపుల్లో 120 సీట్లకు, సైన్స్ గ్రూపుల్లో 100 సీట్లకు మించి ఉండరాదు. కానీ అనేక కాలేజీల్లో ఒక్కో గ్రూపులో 150 సీట్ల నుంచి 450 సీట్ల వరకు ఉన్నట్లు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

కాలేజీలు ఇచ్చిన సమాచారాన్ని యథాతథంగా యూనివర్సిటీలు అప్‌లోడ్ చేశాయే తప్ప.. నిబంధనలను పట్టించుకోలేదు. ఇలా ఇష్టారాజ్యంగా సీట్ల సంఖ్యను వెబ్‌సైట్‌లో ఎలా పెట్టారంటూ యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి లేఖలు కూడా రాసింది. దీంతో మరింత గందరగోళం నెలకొంది. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో సీట్లున్నాయనే ఆలోచనతో టాప్ కాలేజీల్లో చేరేందుకు ఆప్షన్లు ఇచ్చే అవకాశముంది. మరి ఆ సీట్లు లేవని తేలితే ఎలాగన్న ది ప్రశ్నార్థకంగా మారింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో సీట్ల కేటాయింపును వాయిదా వేస్తే మంచిదని ఉన్నత విద్యాశాఖ వర్గాలు పేర్కొం టున్నాయి. కాలేజీల గుర్తింపు, సీట్ల సంఖ్య తేలాక.. మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించి సీట్లు కేటాయించాలని చెబుతున్నా యి. లేకపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి.
 
ముందుకెళుతున్న విద్యాశాఖ
ఉన్నత విద్యా శాఖ ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను కొనసాగిస్తోంది. కాలేజీలకు అనుమతుల ప్రక్రియ పూర్తి కాకుండానే, వాటిల్లో సీట్ల లెక్క తేలకుండానే... గతేడాది లెక్కలను తీసుకుని కాలేజీలు, సీట్ల వివరాలను ఆన్‌లై న్‌లో అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా 1,103 డిగ్రీ కాలేజీల్లో 3,94,575 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. దీంతో విద్యార్థులు ఆయా కాలేజీలు, సీట్లలో చేరేందుకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకుంటున్నారు.

ఇక త్వరలోనే సీట్లను కూడా కేటాయించేందుకు ఉన్నత విద్యాశాఖ సిద్ధమవుతోంది. అయితే కాలేజీలకు అఫిలియేషన్లు పూర్తికాకపోవడం, విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతుండడంతో... ఏవైనా కాలేజీలు, సీట్లు రద్దయితే వాటిని ఎంచుకున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటన్నది అర్థం కాక అధికారులే తల పట్టుకుంటున్నారు. లోపాలు వెల్లడైనా కాలేజీలపై చర్యలు చేపట్టకుండా వదిలేస్తారా, విద్యార్థులను వేరే కాలేజీల్లోకి మార్చుతారా అన్నది తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement