degree college
-
గందరగోళంగా 'ఉన్నత విద్య'
డాక్టర్ ధనశ్రీ.. బయోకెమిస్ట్రీ లెక్చరర్. కర్నూలు కేవీఆర్‌లో పనిచేసేవారు. లాంగ్ స్టాండింగ్ పేరుతో 2022–23లో గుంతకల్లు డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ ఫైనలియర్లో కేవలం ఆరుగురు మాత్రమే విద్యార్థులున్నారు. వారు వెళ్లిపోయిన తర్వాత బయో కెమి్రస్టికి ఒక్క అడ్మిషన్ కూడా రాలేదు. విద్యార్థులు లేరు.. పైగా బయోకెమిస్ట్రి అక్కడ తొలగించారు. దీంతో ధనశ్రీ ఖాళీగా ఉన్నారు. పని ఉన్న కాలేజీకి బదిలీచేయాలని ఉన్నత విద్యాశాఖకు లేఖ రాయగా ఆమెను నంద్యాల డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటే లేదు. దీంతో అక్కడ కూడా ఆవిడ పనిలేకుండా ఖాళీగా ఉన్నారు. కేవీఆర్, సిల్వర్ జూబ్లీలో బయో కెమిస్ట్రి విభాగంలో ఖాళీలున్నాయి, విద్యార్థులూ ఉన్నారు. కానీ, వారికి నాణ్యమైన బోధన అందడంలేదు. భారీ వేతనాలిచ్చి సబ్జెక్ట్‌లేని కాలేజీలో పనిలేకుండా అధికారులు ఉంచడం ఎందుకో!?డాక్టర్ రవిశంకర్ శర్మ.. గుంతకల్లు డిగ్రీ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. గుంతకల్లులో ఉన్న పోస్టుల కంటే ఎక్కువగా ఫిజిక్స్ లెక్చరర్లు ఉన్నారు. దీంతో పనిలేకుండా ఖాళీగా ఉన్నానని, పత్తికొండలో పోస్టు ఖాళీగా ఉందని అక్కడికి పంపాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అయితే, శర్మను అనంతపురం డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ కూడా ఉన్న పోస్టుల కంటే ఎక్కువగానే ఉన్నారు. అక్కడా ఆయన పనిలేక ఖాళీగా ఉన్నారు. పత్తికొండలో మాత్రం ఖాళీ పోస్టును భర్తీచేయలేదు. డాక్టర్ కోటేశ్వరరావు.. గుంటూరు డిగ్రీ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్. 2022లో సర్దుబాటు పేరుతో ఇతన్ని బనగానపల్లిలో వేశారు. అక్కడ పూర్తిస్థాయిలో లెక్చరర్లు ఉన్నా అదనంగా నియమించారు. దీంతో ఏడాది పాటు పనిలేకుండా ఆయన ఖాళీగా ఉన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి అక్కడ నియమించాలని ఇక్కడ తనకు పనిలేదని కోరారు. ఏడాది తర్వాత ఆయన్ను తిరిగి డోన్‌కు పంపారు.డాక్టర్ ఫరీదా ఇంగ్లీషు లెక్చరర్. లాంగ్‌స్టాండింగ్ పేరుతో కేవీఆర్ నుంచి పాణ్యం డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ పిల్లలు లేరు. పనిలేకుండా ఫరీదా కూడా ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉన్నారని అక్కడి ప్రిన్సిపాల్ ఫరీదాకు వేతనం నిలిపేశారు. పిల్లలు లేనప్పుడు తానేం చేయాలని, తన అవసరం ఉన్న కాలేజీకి బదిలీచేయాలని ఆవిడ విన్నవించారు. కేవీఆర్‌లో ముగ్గురు కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. రెగ్యులర్ పోస్టు ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వారితో విద్యార్థులకు క్లాస్‌లు చెప్పించడం ఏమిటో!?.. ఈ నాలుగు ఉదాహరణలు పరిశీలిస్తే డిగ్రీ కాలేజీలో లెక్చరర్ల నియామకాలు, పనితీరు, విద్యార్థులకు అందుతున్న బోధన, వారి భవిష్యత్తుపై ఉన్నత విద్యాశాఖకు, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంత డొల్లగా ఉందో స్పష్టమవుతోంది. సబ్జెక్ట్‌లేని చోట సబ్జెక్ట్ లెక్చరర్‌ను నియమించడం, పిల్లలులేని చోట వారిని ఉంచడం, అవసరమైన చోట ఖాళీలు పెట్టడం చూస్తే అసలు డిగ్రీ కాలేజీల పనితీరుపై, విద్యార్థుల భవిష్యత్తుపై ఉన్నతాధికారులకు ఏమాత్రం అవగాహనలేదని తేటతెల్లమవుతోంది. – సాక్షి ప్రతినిధి, కర్నూలుఫారిన్ సర్వీసులు చేసి వస్తే సరిహద్దులకే..⇒ ఓ లెక్చరర్ విజయనగరం జిల్లా ఎస్ఎస్ఏ ఏపీసీగా పనిచేశారు. తిరిగి అతను సొంతశాఖలోకి వస్తే ఖాళీలున్నా అతన్ని మాత్రం పార్వతీపురం డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. ⇒ నంద్యాలలోని ఓ లెక్చరర్‌ను సర్దుబాటు పేరుతో విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురానికి బదిలీ చేశారు. చుట్టపక్కల కాలేజీల్లో ఖాళీలున్నా దూరానికి బదిలీ చేశారు.⇒ కర్నూలు జిల్లాలోని ఓ లెక్చరర్ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎస్ఎస్ఏ ఏపీసీగా పనిచేశారు. కర్నూలు జిల్లాలో ఖాళీలు ఉన్నప్పటికీ కడప జిల్లాకు బదిలీ చేశారు. ⇒ కర్నూలు ఎస్ఎస్ఏ ఏపీసీగా పనిచేసిన ఓ కెమిస్ట్రీ లెక్చరర్‌ను కర్నూలులోని రెండు కాలేజీల్లో ఖాళీలున్నప్పటికీ నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు బదిలీ చేశారు. డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తూ ఫారిన్ సర్విసుల కింద బయటకెళ్లిన వారందరినీ ఆయా జిల్లాల్లోని డిగ్రీ కాలేజీల్లో ఖాళీలున్నప్పటికీ ఉన్నత విద్యాశాఖాధికారులు వారిని రాష్ట్ర సరిహద్దుల్లోని డిగ్రీ కాలేజీలకు బదిలీ చేస్తున్నారు. దీనికి కారణం వారు ‘ఫారిన్ సర్విసు’లకు వెళ్లడమే. వారిపై ఉన్న కోపంతో దూర ప్రాంతాలకు బదిలీచేసే సమయంలో అక్కడ ఖాళీలున్నాయా? వారి సొంత జిల్లాల్లో ఉన్న ఖాళీల పరిస్థితి ఏంటి? ఆ ఖాళీలను అలాగే ఉంచితే అక్కడున్న విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? అని ఆలోచన చేయడంలేదు.దీంతో 13 జిల్లాల్లోని ఏ డిగ్రీ కాలేజీ లెక్చరర్ కూడా ‘ఫారిన్ సర్విసు’కు వెళ్లినా వారిని ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోకి బదిలీ చేశారని లెక్చరర్లు చర్చించుకుంటున్నారు. ఉన్నత విద్యాశాఖలో ఇటీవల బదిలీ అయిన ఓ ఉన్నతాధికారి పనిగట్టుకుని ఇదంతా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ అధ్యాపకులు అవసరం? ఎక్కడ అవసరంలేదని గ్రహించకుండా కేవలం ఫారిన్ సర్వీసుకు వెళ్లారు కాబట్టి ‘శిక్ష’గా వీరిని దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నట్లుగా ఉంది.రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నప్పుడు ‘కాంట్రాక్టు’ బోధన ఎందుకు?.. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దాదాపు 2,400 మంది రెగ్యులర్ అధ్యాపకులున్నారు. 740 మంది కాంట్రాక్టు, వెయ్యిమంది వరకు ఎయిడెడ్ లెక్చరర్లు ఉన్నారు. యూనివర్శిటీ స్థాయి పొందిన కాలేజీలో పీహెచ్డీ చేసిన అధ్యాపకులే యూజీ, పీజీ విద్యార్థులకు బోధించాలి. అయితే, రెగ్యులర్ పోస్టులున్నా వారిని ఇతర జిల్లాల్లోని డిగ్రీ కాలేజీలకు బదిలీచేసి యూనివర్శిటీ పరిధిలో కాంట్రాక్టు లెక్చరర్లతో నడిపిస్తున్నారు. వీరిలో సింహభాగం లెక్చరర్లకు పీహెచ్డీ లేదు. రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నప్పుడు వారిని ఖాళీగా ఉంచి కాంట్రాక్టు లెక్చరర్లపై ఆధారపడటం ఏమిటని మిగిలిన అధ్యాపకులు ప్రశి్నస్తున్నారు. కమిషనరేట్‌లో ఏళ్ల తరబడి డిప్యుటేషన్.. మరోవైపు.. కమిషనరేట్‌లో నలుగురు లెక్చరర్లు డిప్యుటేషన్‌పై 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు. వీరు ఉద్యోగానికి వచ్చింది విద్యార్థులకు చదువు చెప్పేందుకా? లేదంటే కమిషనరేట్‌లో డిప్యుటేషన్‌పై కొనసాగేందుకా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 15 ఏళ్లుగా వారిని ఓ స్థానంలో అదీ డిప్యుటేషన్‌పై ఎందుకు కొనసాగిస్తున్నారని తోటి లెక్చరర్లు ప్రశి్నస్తున్నారు. క్లస్టర్ యూనివర్సిటీపై శీతకన్ను.. కర్నూలు జిల్లా సిల్వర్ జూబ్లి కాలేజీని, నగరంలోని కాలేజీలను క్లస్టర్ యూనివర్సిటీగా గత ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో ఖాళీలు లేకుండా పోస్టులు కూడా భర్తీచేశారు. అయితే, ఇక్కడ ఉన్న వీసీ సాయిగోపాల్కు, ఉన్నత విద్యాశాఖ నుంచి ఇటీవల బదిలీ అయిన ఓ కీలక అధికారికి మధ్య వ్యక్తిగత విభేదాలతో ఈ కాలేజీ వారిని బయటికి పంపడం, బయటి వారిని ఇక్కడకు పంపకుండా ఖాళీలు ఉండేలా చేస్తున్నారని లెక్చరర్లు చర్చించుకుంటున్నారు. వీసీలకు, ఉన్నతాధికారులకు మధ్య విభేదాలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు యూజీ, పీజీపై సమీక్షించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ప్రిన్సిపాల్ గదిలో బీరు సీసాలు
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని బాలెంల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో మద్యం సీసాలు దర్శనమివ్వడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తరచూ మద్యం తాగుతూ ప్రిన్సిపాల్ శైలజ తమను వేధింపులకు గురిచేసు్తన్నారని వారు ఆరోపించారు. ప్రిన్సిపాల్ అర్థరాత్రి వేళ సహాయ కేర్ టేకర్ సౌమిత్రితో కలిసి మద్యం తాగుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రిన్సిపాల్ రూమ్ కు తాళం వేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఆర్డీవో వేణుమాధవ్‌రావు, కళాశాలలో ఆర్సీవో అరుణకుమారి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి, డీఎస్పీ రవికుమార్ కశాశాలకు చేరుకున్నారు. వాస్తవాలను విచారించి ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా విద్యార్థినులు శాంతించలేదు. ఈ ఘటనపై మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌ను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు పూర్తి స్థాయి విచారణ కమిటీ అధికారిగా అదనపు కలెక్టర్ బీఎస్ లతను నియమిస్తూ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రాథమిక విచారణ ఆధారంగా కళాశాల ప్రిన్సిపాల్‌ను బదిలీ చేస్తున్నట్టు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి ఒక ప్రకటనలో తెలిపారు. -
మంత్రిగారూ.. ఇవిగో పులిహోరలో పురుగులు
కర్నూలు(సెంట్రల్): ‘అయ్యా మంత్రి మనోహర్ గారు... మీరు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తే పులిహోరలో పురుగులు ఎందుకు వస్తాయి?.. అన్నం ఎందుకు ముక్కిపోయి ముద్దగా ఉంటుంది. కుల్లిపోయిన కూరగాయలతో కూరలు చేసే దుస్థితి ఎందుకు వస్తుంది...’ అని కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు మండిపడుతున్నారు. తమ కళాశాల మేనేజ్మెంట్ బాలుర, బాలికల హాస్టళ్లలో పురుగుల బియ్యంతో అన్నం వండుతున్నారని, కుళ్లిన కూరగాయలతో కూరలు చేస్తున్నారని, నాలుగైదు రోజులకొకసారి నీళ్లు వస్తుండడంతో స్నానాలు కూడా చేయకుండా కాలేజీకి వెళ్తున్నామని శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట దాదాపు 700మంది సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు.విద్యార్థుల ఆవేదనను వివరిస్తూ ‘అన్నమో చంద్రబాబూ’ అంటూ ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై శనివారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. సిల్వర్ జూబ్లీ కళాశాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేశామని విజయవాడలో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అక్కసు వెళ్లగక్కారు. అదేవిధంగా ఈ ఘటనపై విచారణ చేయాలని కర్నూలు ఆర్డీవో, పౌరసరఫరాల సంస్థ డీఎంను ఆదేశించారు.అతి ప్రధానమైన కిలో బియ్యం రూపాయికే ఇచ్చే ప్రతిపాదనపై మాత్రం మంత్రి స్పష్టత ఇవ్వలేదు. ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. దీంతో మంత్రి ప్రకటనపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తే శుక్రవారం ఉదయం వండిన పులిహోరలో పురుగులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, కుళ్లిన కూరగాయలతో వంట చేస్తున్నారనే విషయాన్ని తాము సాక్ష్యాధారాలతో కళ్లకు కట్టినట్లు ధర్నాలో వివరించినా మంత్రి వాస్తవాలు తెలుసుకోకుండా అన్నీ బాగానే ఉన్నట్లు ప్రకటన ఇవ్వడం మంచిది కాదని, వెంటనే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని పలువురు విద్యార్థులు డిమాండ్ చేశారు. బుగ్గన చొరవతో రూపాయికే కిలో బియ్యం ఇచ్చేలా ఉత్తర్వులుసిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల హాస్టల్ విద్యార్థులు నెలకు ఒక్కొక్కరూ రూ.430 మెస్ చార్జీల కోసం చెల్లిస్తారు. దానిలో అత్యధిక భాగం బియ్యం కొనుగోలుకే సరిపోతుంది. ప్రస్తుతం కళాశాల మేనేజ్మెంట్ కిలో బియ్యం రూ.45 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో మెస్‌చార్జీల డబ్బులన్నీ బియ్యం కొనుగోలుకే సరిపోతుండడంతో గ్యాస్, నూనె, కూరగాయలు, ఇతర సరుకుల కొనుగోలుకు డబ్బులు సరిపోవడంలేదు.ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ జగన్ స్పందించి సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలకు రూపాయికే కిలో బియ్యం ఇవ్వాలని ఆదేశిస్తూ 2024, మార్చి ఒకటో తేదీన మెమో నంబర్ 976211/సీఈ/ఏ1/2019 జారీ చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడంతోనే విద్యార్థులు అల్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
50 వేల డిగ్రీ సీట్లకు కోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కళాశాలల్లో డిగ్రీ సీట్లు ఈ ఏడాది దాదాపు 50 వేలు తగ్గే అవకాశం ఉంది. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే దోస్త్‌లో సీట్లను తగ్గించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్నేళ్ళుగా సీట్ల భర్తీ లేకపోవడమే దీనికి కారణంగా ఉన్నత విద్యా మండలి చెబుతోంది. గత విద్యా సంవత్సరంలో కూడా దాదాపు లక్ష సీట్లను కుదించారు.వంద కాలేజీల్లో ఆర్ట్స్ కోర్సుల్లో జీరో ప్రవేశాలు: రాష్ట్రంలో ఉన్న 1050 డిగ్రీ కాలేజీల్లో 4.60 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. కానీ ప్రతీ సంవత్సరం గరిష్టంగా 2.25 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఇందులోనూ బీకాం కోర్సులోనే ఎక్కువగా చేరుతున్నారు. తర్వాత స్థానంలో బీఎస్సీ ఉంటోంది. బీఏ కోర్సులో ప్రవేశాలు 40 శాతం మించడం లేదు. దాదాపు వంద కాలేజీల్లో ఆర్ట్స్ కోర్సుల్లో జీరో ప్రవేశాలు నమోదు అవుతున్నాయి.మరో 150 కాలేజీల్లో కనీసం 15 శాతం విద్యార్థులు కూడా చేరడం లేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీలే విద్యార్థులు ఇష్టపడుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత కాలేజీల్లో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. ఇటీవల ఉన్నత విద్యా మండలి ఈ పరిస్థితిని సమీక్షించింది.డిమాండ్ లేని కోర్సులకు సంబంధించిన బ్రాంచీలకు అనుమతించకూడదని సూత్రప్రాయంగా నిర్ణయించింది. 15 శాతం కన్నా విద్యార్థులున్న కాలేజీల్లోనూ ప్రవేశాలకు అనుమతించే అవకాశం కన్పించడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పలు కాలేజీలు ఈ ఏడాది మూతపడే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. కొత్త కోర్సులకే ప్రాధాన్యం.. డిగ్రీ తర్వాత విద్యార్థులు ఉపాధి అవకాశాలను కోరుకుంటున్నారు. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా డిగ్రీ కోర్సుల్లో కొన్నేళ్ళుగా మార్పులు తెస్తున్నారు. కొన్ని కాంబినేషన్ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 19 రకాల స్కిల్ కోర్సులను సిఫార్సు చేసింది. రిటైల్ మార్కెటింగ్, కార్పొరేట్ సెక్టార్లో అవసరమైన సేవలు అందించే టెక్నికల్ కోర్సులు, స్టార్టప్స్ పెట్టుకోగల కోర్సులను అందించాలని సూచించింది. కామర్స్‌లో ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్, బీఎస్సీలో బయో మెడికల్ వంటి కొత్త కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. రూరల్‌లో కొత్త కోర్సులు తెచ్చినా..? హైదరాబాద్ నగర పరిసరాల్లో ఉన్న ప్రైవేటు కాలేజీలు కొత్త కోర్సులపై ఆసక్తి చూపుతున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని డిగ్రీ కాలేజీలు మాత్రం ముందుకు రావడం లేదు. దీనివల్ల మౌలిక వసతుల కల్పన, అధ్యాపకుల కొరతతో పాటు ఫీజులు పెంచితే విద్యార్థులు చేరేందుకు అవకాశం లేదని ఆ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. మరోవైపు ఫీజు రీ ఎంబర్స్మెంట్ సకాలంలో ప్రభుత్వం అందించడం లేదని కాలేజీల యాజమాన్యాలు వాపోతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులకు వెళ్ళలేమని గ్రామీణ ప్రాంత డిగ్రీ కాలేజీల నిర్వాహకులు అంటున్నారు. లైప్సైన్స్ కోర్సులను గత కొన్నేళ్ళుగా అందుబాటులోకి తెచ్చినా కూడా గ్రామీణ ప్రాంత డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు 30 శాతం మించడం లేదు. మార్పులు అనివార్యండిగ్రీ కోర్సుల్లో మార్పు లు అనివార్యం. మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులు తీసుకొస్తున్నాం. కాలేజీల్లో అన్ని విధాల మౌలిక వసతులు ఉంటేనే అనుమతులు ఇస్తాం. డిమాండ్ లేని కాలేజీల్లో సీట్లు తగ్గించే ఆలోచన చేస్తున్నాం. ఏపీఈసెట్ తర్వాతే దోస్త్ నోటిఫికేషన్ ఇస్తాం.కొత్త కోర్సులను కూడా ఇందులో చేర్చే ఆలోచనలో ఉన్నాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
Minister RK Roja Photos: తాను చదువుకున్న కాలేజీకి చీఫ్‌గెస్ట్‌గా రోజా.. భావోద్వేగంతో కన్నీళ్లు (ఫొటోలు)
-
21 నుంచి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ చేసుకోనివారు, రద్దయిన అభ్యర్థులు ఈ నెల 21 నుంచి 24వ తేదీలోగా రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దోస్త్ ద్వారా మిగిలిపోయిన వివిధ కాలేజీల్లోని సీట్లకు 21 నుంచి 25 వరకూ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 29న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 30వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. వచ్చే నెల 3, 4 తేదీల్లో అన్ని ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ నిర్వహించాలని మండలి పేర్కొంది. కాగా, సీటు పొందిన కాలేజీలో వేరే బ్రాంచీకి మారాలనుకునే అభ్యర్థులు ఈ నెల 19, 20 తేదీల్లో ఇంట్రా కాలేజీ వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 21న ఇంట్రా కాలేజీ సీట్ల కేటాయింపు ఉంటుంది. -
డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్)–2023 నోటిఫికేషన్‌ను కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిత్తల్‌తో కలసి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గురువారం విడుదల చేశారు. ఇంటర్ ఉత్తీర్ణులైనవారు రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 16 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. దీనికోసం ఈసారి కొత్తగా ఈౖ ఖీ అనే యాప్‌ను ప్రవేశపెట్టారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో దీన్ని డౌన్లోడ్ చేసుకుని దోస్త్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా కూడా దోస్త్ రిజిస్ట్రేషన్ ► ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈౖ ఖీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో రిజిస్ట్రేషన్ చేసేప్పుడు విద్యార్థి ఆధార్ నంబర్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ► మీ సేవ కేంద్రాల ద్వారా దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే అక్కడ బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ► టీయాప్ ఫోలియో ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి.. విద్యార్థి ఇంటర్ హాల్‌టికెట్, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేసుకోవాలి. టీఎస్‌బీఐఈలో లభించే విద్యార్థి ఫొటో, ప్రత్యక్షంగా దిగే ఫొటో సరిపోతే.. దోస్త్ ఐడీ సమాచారం వస్తుంది. ► రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు రూ.200 రుసుమును ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. దోస్త్ ఐడీ, పిన్ నంబర్‌ను భద్రపర్చుకోవాలి. ► రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు మీసేవ నుంచి పొందిన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2022 తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని కూడా అప్లోడ్ చేయాలి. 86 వేల సీట్లు తగ్గాయ్.. ఈ ఏడాది డిగ్రీలో దాదాపు 86 వేల సీట్లు తగ్గించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. డిమాండ్ లేని కోర్సుల బదులు కొత్త కోర్సులు పెడతామంటే అనుమతులు ఇస్తామన్నారు. గత ఏడాది 4,73,214 డిగ్రీ సీట్లు ఉంటే, ఈ ఏడాది 3,86,544 అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. డిమాండ్ లేని సీట్లను గత ఏడాది కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు. -
నల్లమలలో కొత్త మొక్క
జడ్చర్ల టౌన్: నల్లమల అడవుల్లో సరికొత్త మొక్కను కనుగొన్నట్టు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర ప్రొఫెసర్ సదాశివయ్య వెల్లడించారు. తన పరిశోధక బృందంతో కలిసి గుర్తించిన ఆ మొక్కకు యూఫోర్బియా తెలంగాణేన్సిస్గా నామకరణం చేసినట్టు ప్రకటించారు. శుక్రవారం ఆ వివరాలను విలేకరులకు తెలిపారు. సదాశివయ్య బృందం, ఏపీ రాష్ట్ర జీవవైవిధ్య మండలి సభ్యుడు డాక్టర్ ప్రసాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం నుంచి నిర్మలా బాబురావు, రామకృష్ణ సంయుక్తంగా నల్లమల అటవీ ప్రాంతంలో గడ్డి జాతులపై పరిశోధన చేస్తున్నారు. అటవీశాఖ సహకారంతో చేపట్టిన ఈ పరిశోధనలో ఒక కొత్త మొక్కను గుర్తించారు. అది రాజస్తాన్‌లో ఉండే యూఫోర్బియా జోధ్పూరెన్సిస్ అనే మొక్కను పోలి ఉందని.. కానీ కొన్ని లక్షణాల్లో వైవిధ్యం ఉండటంతో కొత్త మొక్కగా తేల్చామని పరిశోధక బృందం తెలిపింది. ఈ మొక్కల సంఖ్య చాలా తక్కువగా ఉండటం, కేవలం రెండు ప్రాంతాల్లోనే లభ్యమవుతుండటంతో అంతరించిపోతున్న మొక్కల జాబితా కింద చెప్పవచ్చన్నారు.కొత్త మొక్కను కనుగొన్న పరిశోధక బృందాన్ని ఉన్నతవిద్యా శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ అభినందించారు. మరింత అధ్యయనం చేస్తాం.. నల్లమలలో కనుగొన్న కొత్త మొక్కపై మరింత అధ్యయనం అవసరమని సదాశివయ్య చెప్పారు. ఈ మొక్క సుమారు 30 సెంటీమీటర్ల పొడవు పెరిగి, మొత్తం పాల వంటి లేటెక్స్ (చిక్కని ద్రవం) ను కలిగి ఉంటుందన్నారు. ఈ మొక్క ఔషధ గుణాలు కలిగి ఉండే అవకాశాలు ఎక్కువన్నారు. గత నాలుగేళ్లలో తెలంగాణ అడవుల్లో 5 కొత్త మొక్కలను కనుగొన్నామని, రాష్ట్రంలో మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అటవీ ప్రదేశాలు చాలా ఉన్నాయని వివరించారు. కాగా.. నల్లమల అటవీప్రాంతం జీవ వైవిధ్యానికి కేంద్రమని, గతంలో అనేక ఇబ్బందికర పరిస్థితులు ఉండటం వల్ల పరిశోధనలు జరగలేదని నాగర్‌కర్నూల్ డీఎఫ్ఓ రోహిత్ గోపిడి చెప్పారు. ప్రస్తుతం మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేసే అవకాశం ఉందన్నారు. -
1.12 లక్షల మందికి డిగ్రీలో ప్రవేశాలు!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్–2022 తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తయింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 1,12,683 మంది విద్యార్థులకు ప్రాధాన్యతాక్రమంలో సీట్లు కేటాయించారు. ఈ మేరకు దోస్త్–2022 కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌తో కలసి శనివారం వివరాలను విడుదల చేశారు. దోస్త్–2022 ఫేజ్–1లో మొత్తం 1,44,300 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1,18,898 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. 6,215 మంది విద్యార్థులు సరైనవిధంగా ఆప్షన్లు ఇవ్వకపోవడంతో వారికి సీట్లు రాలేదు. కామర్స్, ఆర్ట్స్ గ్రూపుల్లో అధికంగా... దోస్త్–2022 తొలివిడతలో సీట్లు పొందిన 1,12,683 మంది విద్యార్థుల్లో పురుషులు 45,743(40.59%), మహిళలు 66,940(59.41%) ఉన్నారు. అడ్మిషన్లు పొందినవారిలో అత్యధికంగా ఆర్ట్స్, కామర్స్ గ్రూపులవారే ఉన్నారు. సైన్స్ గ్రూప్‌ల అడ్మిషన్లు రెండోస్థానంలో ఉన్నాయి. మీడియాలవారీగా పరిశీలిస్తే ఇంగ్లిష్ మీడియంలో 1,02,418 మంది విద్యార్థులు, తెలుగు మీడియంలో 9,304, ఉర్దూ మీడియంలో 10, హిందీ మీడియంలో 951 మందికి సీట్లు కేటాయించారు. దోస్త్–2022లో మొత్తం 978 కాలేజీల్లో 510 కోర్సులున్నాయి. మొత్తం 4,20,318 సీట్లలో తొలివిడత 1,12,683 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు, ఇంజనీరింగ్, మెడికల్ సీట్లకు కౌన్సెలింగ్ పూర్తయ్యాక డిగ్రీ ప్రవేశాల వేగం పుంజుకుంటుందని నవీన్ మిట్టల్ తెలిపారు. ఇప్పటివరకు 51 కాలేజీల్లో ఎలాంటి ప్రవేశాలు జరగలేదు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే సీటు డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థులు లాగిన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియతో సీటు రిజర్వ్ చేసుకోవాలి. ప్రభుత్వకాలేజీల్లో సీటుపొంది ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలతో ఉచితంగా, మిగతా విద్యార్థులు రూ.500 లేదా రూ.1,000 చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్‌తో సీటు రిజర్వ్ చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్‌లో విఫలమైతే సీటు రద్దవుతుంది. దోస్త్–2022 ఫేజ్–2 రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 7 నుంచి 22వ తేదీ వరకు కొనసాగుతుంది. -
అధ్యాపకుడి అరుదైన చదివింపు
అన్నవరం: చదువుల్లో రాణించాలని, లక్ష్యాలు సాధించాలని విద్యార్థులకు బోధించే అధ్యాపకులు చాలా కళాశాలల్లో కనిపిస్తారు. కాని కళాశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పిస్తే వారు మరింత బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకుంటారని భావించి అందుకోసం సొంత సొమ్మును ఖర్చు చేసే అధ్యాపకులు చాలా అరుదు. అటువంటి కోవలోకే వస్తారు సత్యదేవ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ భీమలింగం సూర్యనారాయణమూర్తి. ఆయన తన భార్య పద్మావతితో కలిసి సోమవారం శ్రీ సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి సత్యదేవ డిగ్రీ కళాశాల విద్యార్థుల పేరుతో రూ.ఐదు లక్షలు విరాళాన్ని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావుకు అందజేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజనం పునరుద్ధరించాలనే లక్ష్యంతో... విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పునరుద్ధరించాలనే లక్ష్యంతో తన వంతు సాయంగా ఈ విరాళాన్ని అందచేసినట్టు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. స్థానిక సత్యదేవ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా 2015–17 మధ్య సేవలందించిన సూర్యనారాయణమూర్తి ప్రస్తుతం తమ స్వగ్రామమైన పెద్దాపురం మండలంలోని సిరివాడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన సమయంలో దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని అప్పటి దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రామ్‌కుమార్, ఈఓ కాకర్ల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఫలితంగా 2016లో అక్టోబర్ నుంచి 2017 ఏప్రిల్ వరకు డిగ్రీ కళాశాల విద్యార్థులకు అన్నదానం పథకం నుంచి మధ్యాహ్న భోజనం పంపించారు. అన్నదానం పథకానికి దాతలు ఇచ్చిన విరాళాలు భక్తులకు భోజనానికి ఉపయోగించాలి తప్ప విద్యార్థుల భోజనానికి కాదని ఆడిట్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో దేవస్థానం ఆ భోజనాన్ని పంపించడం నిలిపివేసింది. 2018లో సూర్యనారాయణమూర్తి పదవీ విరమణ చేశారు. అయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పునరుద్ధరించేందుకు ఆయన చాలా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో తన వంతు విరాళంగా ఆయన రూ.ఐదు లక్షలు అందజేశారు. మధ్యాహ్న భోజన సౌకర్యం పునరుద్ధరించాలని కోరాను కళాశాలలో చదివే విద్యార్థులు 600 మందిలో 400 మంది పేద, మధ్యతరగతి వారు. వీరికి భోజన సౌకర్యం పునరుద్ధరించాలని ఆలయ పెద్దలను కోరాను. నేను ఇచ్చిన విరాళంపై వడ్డీతో రోజుకు కనీసం పది మంది విద్యార్థులకు అన్నదాన పథకంలో (కళాశాల పనిదినాలు 180 రోజుల్లో) భోజనం పెట్టమని కోరాను. – సూర్యనారాయణమూర్తి, విశ్రాంత ప్రిన్సిపాల్ కమిషనర్‌తో చర్చిస్తాం డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై గతంలో ఆడిట్ అభ్యంతరాలు రావడంతో నిలిపివేయాల్సి వచ్చింది. మళ్లీ భోజనం పెట్టాలంటే దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలివ్వాలి. ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. – చైర్మన్ రోహిత్, ఈఓ త్రినాథరావు -
‘షిఫ్ట్’లో డిగ్రీ క్లాస్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తరగతుల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి, జేఎన్టీయూ దృష్టి సారించాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10, ఆపై తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ ప్రత్యక్ష విద్యా బోధనపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. మరోవైపు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రత్యక్ష బోధనకు జేఎన్టీయూ ఏర్పాట్లు చేస్తోంది. అందరికీ ఒకేసారి కష్టమే: రాష్ట్రంలో వేయికి పైగా డిగ్రీ కాలేజీల్లో దాదాపు 7 లక్షలమంది చదువుతున్నారు. అందులో ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు 4.65 లక్షల మంది ఉండగా, ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులు 2.35 లక్షల మంది ఉన్నారు. వారందరికీ ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా శానిటైజేషన్ వంటి కోవిడ్ నిబంధనలను పాటించడం, భౌతిక దూరం నిబంధనను అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులందరినీ ఒకేసారి అనుమతించి ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే భౌతిక దూరం పాటించడం కష్టంగా మారనుంది. అందుకే షిఫ్ట్ పద్ధతుల్లో ప్రత్యక్ష బోధన విధానం అమలు చేయాలని భావిస్తోంది. దీని ప్రకారం బీఏ, బీకాం వంటి కోర్సుల విద్యార్థులకు ఉదయం సమయంలో తరగతులను నిర్వహించడం, బీఎస్సీ, బీబీఏ, వొకేషనల్, ఇతర కోర్సుల వారికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రత్యక్ష బోధన అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది. అందుకు అనుగుణంగా టైం టేబుల్‌ను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు యూనివర్సిటీ గ్రాంట్‌కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాల మేరకు యూనివర్సిటీలు, హాస్టళ్ల ప్రారంభంపైనా త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. బీటెక్ ఫస్టియర్‌కు ఫిబ్రవరి 15 నుంచి.. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తరగతుల నిర్వహణపై జేఎన్టీయూ కసరత్తు ప్రారంభించింది. అయితే దశల వారీగా ఇంజనీరింగ్‌లో (బీటెక్), బీ ఫార్మసీ తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ముందుగా బీటెక్ తృతీయ, నాలుగో సంవత్సరాల తరగతులను ప్రారంభించేలా షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. ఇక ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వారికి ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించాలని భావిస్తోంది. బీటెక్‌లోనూ షిఫ్ట్ పద్ధతిలో బోధనపైనా జేఎన్టీయూ ఆలోచనలు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహిస్తే, తృతీయ, నాలుగో సంవత్సరం వారికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తరగతులను నిర్వహిస్తే ఎలా ఉంటుందని యోచిస్తోంది. వీటిపై త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. తద్వారా మే నెలాఖరు నాటికి అన్ని సంవత్సరాల వారి బోధనను పూర్తి చేయాలని భావిస్తోంది. ఒక్కో సంవత్సరంలో రెండు సెమిస్టర్ల పరీక్షల్లో ఒక సెమిస్టర్ పరీక్షలను మార్చి నెలలో, తదుపరి సెమిస్టర్ పరీక్షలను జూన్‌లో నిర్వíßహించేలా కసరత్తు చేస్తోంది. ఇక ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే సమయంలో విద్యార్థులకు ల్యాబ్ సంబంధిత బోధన చేపట్టనుంది. మిగతా థియరీని ఆన్లైన్లో వినేలా ఏర్పాట్లు చేస్తోంది. వేసవి ఎండలు మొదలవుతాయి కనుక పరిస్థితిని బట్టి మార్చి ఒకటో తేదీ నుంచి మాత్రం అన్ని తరగతుల వారికి ప్రత్యక్ష బోధనను కొనసాగించేలా కసరత్తు చేస్తోంది. వీటికి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇక ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ తరగతులకు సంబంధించి నిర్ణయం తీసుకునే బాధ్యతలను ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకే అప్పగించింది. నేడు రిజిస్ట్రార్లతో ఉన్నత విద్యామండలి భేటీ.. డిగ్రీ, పీజీ తరగతుల నిర్వహణపై వివిధ కోణాల్లో ఆలోచిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. కోవిడ్ నిబంధనలను పాటించడం, షిఫ్ట్ పద్ధతిని అమలు చేయడం, ఇతరత్రా అంశాలపై మరింత లోతుగా చర్చించేందుకు సోమవారం (18న) ఉదయం యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో భేటీ కానున్నట్లు వెల్లడించారు. అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌లో రెండు విధానాలు.. ఇంజనీరింగ్, ఫార్మసీలో ఆన్లైన్/ఆఫ్‌లైన్ రెండు విధానాలను అమలు చేయాలని భావిస్తున్నట్లు జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రత్యక్ష విద్యా బోధనకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్ తరగతులను వింటారని, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో తరగతులు వినేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా భౌతిక దూరం పాటించడం సాధ్యమవుతుందని వివరించారు. -
‘దోస్త్’తో ఈపాస్ లింక్..!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలును సులభతరం చేయాలని, పాత పద్ధతిలో దరఖాస్తు పూరించడం, వివరాలు ఎంట్రీ చేయడంలాంటి పనులకు ఇకపై చెక్ పెట్టాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. అందులో భాగంగా దోస్త్ వెబ్‌సైట్‌ను ఈ పాస్ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరుగుతోంది. కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) వెబ్సైట్లో పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. సీటు వచ్చిన కాలేజీ వివరాలు, ఏ కోటాలో సీటు వచ్చింది, విద్యార్థి కులం, కోర్సు, ఫీజు తదితర వివరాలన్నీ ఇందులోనే ఉంటాయి. ఈ వివరాల ఆధారంగా ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు అమలు చేయవచ్చు. ఇందుకు దోస్త్ వెబ్‌సైట్‌ను ఈపాస్ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయాలని సంక్షేమ శాఖలు చర్యలు వేగవంతం చేశాయి. కౌన్సెలింగ్ నాటికి పూర్తి... లాక్డౌన్ కారణంగా ఇంటర్మీడియెట్ ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఫలితాలు వచ్చిన వెంటనే డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ వెలువడనుంది. కౌన్సెలింగ్ తేదీలు ప్రారంభమయ్యే నాటికి ఈ వెబ్సైట్ల అనుసంధానం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)తో సంక్షేమ శాఖలు పలుమార్లు చర్చలు జరిపి వెబ్సైట్ అనుసంధానంపై పలు సూచనలు చేశాయి. ఇటీవల ఈపాస్ వెబ్‌సైట్‌ను సైతం అప్డేట్ చేయడంతో లాగిన్ పేజీలో ఆప్షన్లు పెరిగాయి. తాజాగా దోస్త్ వెబ్‌సైట్‌ను అనుసంధానం చేస్తే డిగ్రీ చదివే విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కొత్తగా వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. దోస్త్ లింక్ ద్వారా ఈపాస్ పేజీ తెరిస్తే దాదాపు అన్ని వివరాలు అందులో ప్రత్యక్షమవుతాయి. అందులో పొరపాట్లు ఉంటే సరిచేయడం, అదనపు సమాచారాన్ని ఎంట్రీ చేసే వీలుంటుంది. -
డిగ్రీలో మిగులు సీట్ల భర్తీ బాధ్యత యాజమాన్యాలకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ తర్వాత డిగ్రీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు పాపిరెడ్డితో సమావేశం అయ్యారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతోపాటు కాలేజీల యాజమాన్యాలకు కొన్ని సడలింపులు ఇస్తామని పాపిరెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిసింది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ఆధ్వర్యంలో ఆన్లైన్ ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ తర్వాత మిగిలే సీట్ల భర్తీ బాధ్యతను యాజమాన్యాలకే ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. -
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు నాలుగేళ్ల డిగ్రీ హానర్స్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యకు దీటుగా సాధారణ డిగ్రీ కాలేజీల్లోనూ మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విద్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్న ఉన్నత విద్యా మండలి డిగ్రీలో బీఎస్సీ డాటా సైన్స్, బీకాం అనలిటిక్స్ కోర్సును ప్రవేశ పెట్టేందుకు ఇదివరకే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో ఉద్యోగ, ఉపాధికి వెళ్లేవారికోసం, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోసం బీటెక్ తరహాలోనే నాలుగేళ్ల డిగ్రీ హానర్స్ కోర్సులను ప్రవేశ పెట్టాలని నిర్ణయానికి వచ్చింది. బీఎస్సీ డాటా సైన్స్ హానర్స్ (నాలుగేళ్ల కోర్సు), బీకాం అనలిటిక్స్ హానర్స్ (నాలుగేళ్ల కోర్సు) డిగ్రీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలకు బీటెక్ తరహాలో నాలుగేళ్ల డిగ్రీ చదివి ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని యూనివర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో ఈ కోర్సులు అనుమతి పొందిలేవు. ఈ నేపథ్యంలో ఈ కోర్సులకు సిలబస్‌ను రూపొందించి, యూనివర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో ఆమోదం తీసుకుని ప్రవేశ పెట్టేలా కసరత్తు చేస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ఆర్.రామచంద్రం నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఈనెల 14వ తేదీన కమిటీ సమావేశం జరగనుందని, అందులో సిలబస్, ఇతరత్రా విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ సిలబస్‌కు సంబంధించి, డిగ్రీ కాలేజీల్లో ఈ సిలబస్‌ను బోధించే అధ్యాపకులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు టీసీఎస్ ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 21వ తేదీన టీసీఎస్‌తో తాము ఒప్పందం చేసుకోబోతున్నట్లు వివరించారు. ఈ కోర్సులను రాష్ట్రంలోని 50 వరకున్న అటానమస్ కాలేజీలతోపాటు, పలు ప్రభుత్వ కాలేజీలు, నాణ్యత ప్రమాణాలు పాటించే ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశ పెట్టేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. విద్యార్థులు మూడేళ్ల డిగ్రీ లేదా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీలో తాము కోరుకున్న కోర్సును చదువుకునే వెసులుబాటు కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
దరఖాస్తుపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రిన్సిపాల్ ఉద్యోగాల నియామకాలపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. గత నెల 14న ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో 19 ప్రిన్సిపాల్ పోస్టులకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదలయ్యాక ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 20న కొత్తగా ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మరో 15 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెలలో జారీ చేసిన నోటిఫికేషన్లోనే కొత్త పోస్టులను కలుపుతూ ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 34 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించేందుకు మార్చి 20 వరకు గడు వును నిర్దేశించింది. అయితే తొలుత జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఏమిటనే దానిపై బోర్డుకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. మొదటి నోటిఫికేషన్ ప్రకారం ఎస్సీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారు కొత్తగా ఎస్టీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకోవాలా అనే అం శంపై స్పష్టత లేక అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఆప్షన్లు మార్చుకుంటే సరి... గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రిన్సిపాల్ ఉద్యోగాల దరఖాస్తుపై గురుకుల బోర్డు స్పష్టత ఇచ్చింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన యంత్రాంగం.. ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి యూజర్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యాక ఆప్షన్లు మార్చుకోవాలని సూచిస్తూ వివరాలను గురుకుల బోర్డు వెబ్సైట్లో పొందుపర్చింది. మొత్తం 34 కాలేజీల్లో ప్రిన్సిపాల్ పోస్టులు భర్తీ చేస్తుండగా.. ఇందులో 5 పోస్టులు జనరల్ కాలేజీలు కాగా... మిగతా 29 మహిళా డిగ్రీ కాలేజీలు. -
ఇంజినీరింగ్ విద్యార్థుల ఫిర్యాదుపై విచారణ
పామూరు: విజయవాడ, గుంటూరు, ఒంగోలులో బీటెక్ చదువుతున్న తమ పేర్లను పట్టణంలోని బెల్లంకొండ డిగ్రీ కళాశాలలో నమోదు చేసుకున్నారని పామూరు పట్టణం, మండలంలోని ఇనిమెర్ల గ్రామాలకు చెందిన పలువురు విద్యార్థులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం కనిగిరి ఏఎస్‌డబ్ల్యూవో రాజేశ్వరి, పామూరు ఎస్ఐ చంద్రశేఖర్‌లు విచారణ చేపట్టారు. వివరాలు.. పామూరుతో పాటు మండలంలోని ఇనిమెర్ల, ఇతర గ్రామాలకు చెందిన విద్యార్థులు 2017–19 విద్యా సంవత్సరంలో పట్టణంలోని బెల్లంకొండ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియేట్ ఎంపీసీ పూర్తి చేశారు. ఆ తర్వాత సర్టిఫికెట్లు తీసుకుని విజయవాడ, ఒంగోలు, గుంటూరులోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరారు. విద్యార్థులు వేముల వాసు, వై.మోహన్‌కృష్ణ, ఎ.నరసింహ, బత్తుల రాజాలు విజయవాడ ఎంఐసీ కళాశాలలో, వల్లపుశెట్టి సతీష్ ఒంగోలు పేస్ ఇంజినీరింగ్ కళాశాలలో, ఇర్లా కల్యాణ్ గుంటూరు చలపతి కళాశాలలో బీటెక్‌లో చేరారు. వీరు ఫస్ట్ సెమ్ పరీక్షలు కూడా రాసి రెండో సెమ్ పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉండగా నవశకం కార్యక్రమంలో భాగంగా జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి మీ పేర్లు ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చూపిస్తున్నాయని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు సదరు విద్యార్థులకు సమాచారం ఇచ్చాయి. విద్యార్థులు అవాక్కై హుటాహుటిన పామూరు వచ్చి సదరు డిగ్రీ కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ప్రశ్నించిన తమను యాజమాన్యం దూషించిందని బాధిత విద్యార్థులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మంగళవారం ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ విద్యార్థులను విచారించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారు. డిగ్రీ కళాశాల నిర్వాహకులను పిలిపించి విచారణ జరిపారు. జిల్లా అధికారుల ఆదేశాలతో విచారణకు వచ్చిన కనిగిరి ఏఎస్‌డబ్ల్యూవో ఈ.రాజేశ్వరమ్మ కూడా విద్యార్థులను విచారించారు. దీనిపై విద్యార్థులు పామూరులో సదరు డిగ్రీ కళాశాల లేదని, సీఎస్‌పురంలో ఉందని తెలపగా విద్యార్థులు తెలిపిన కళాశాలలో విచారణ చేపట్టి ఆమె వెళ్లారు. దీనిపై ఎస్ఐని వివరణ కోరగా బుధవారం ఏఎస్‌డబ్ల్యూవో నివేదిక ఆధారంగా సీఐతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఏఎస్డబ్ల్యూవోను వివరణ కోరేందుకు యత్నించగా ఆమె ఫోన్ అందుబాటులోకి రాలేదు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
పామూరు: పట్టణంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల బీటెక్ విద్యార్థులతో జీవితాలతో చెలగాటం ఆడుతోంది. కొందరు విద్యార్థులు విజయవాడ, ఒంగోలులో బీటెక్ చదువుతుండగా వారి ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్ల నకలుతో ఆ డిగ్రీ కళాశాల రికార్డుల్లో నమోదు చేసుకుని ఇక్కడ చదువుతున్నట్లు కలరింగ్ ఇచ్చారు. బాధిత విద్యార్థులు ప్రశ్నిస్తే వారు ఎదురు దాడికి దిగుతున్నారు. దిక్కుతోచని స్థితిలో బాధిత విద్యార్థులు స్థానిక పోలీసుస్టేషన్లో సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం.. పామూరుతో పాటు మండలంలోని ఇనిమెర్ల, ఇతర గ్రామాలకు చెందిన విద్యార్థులు 2017–19 విద్యా సంవత్సరంలో పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ చదివారు. కోర్సు పూర్తయిన తర్వాత వారు తమ సర్టిఫికెట్లను తీసుకుని విజయవాడ, ఒంగోలులో ఇంజినీరింగ్‌లో చేరారు. వారిలో వేముల వాసు, వై.మోహన్‌కృష్ణ, ఎ.నరసింహ, బత్తుల రాజాలు విజయవాడ ఎంఐసీ కళాశాలలో 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌లో చేరారు. మరో విద్యార్థి వల్లపుశెట్టి సతీష్ ఒంగోలు ఫేస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు. బీటెక్‌లో ఫస్ట సెమ్ పరీక్షలు కూడా రాసి రెండో సెమ్ పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. వై.మోహన్‌కృష్ణ పేరున పామూరు డిగ్రీ కళాశాలలో ఫస్ట్ సెమ్ మార్కుల జాబితా, వై.మోహన్‌కృష్ణ బీటెక్ ఫస్ట్ సెమ్ మార్కుల జాబితా ఇక్కడ గుట్టురట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించేందుకు నవశకం కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రారంభించిన జగనన్న విద్యా దీవెన పథకం కింది బాధిత విద్యార్థులకు ఆర్థిక సాయం అందాల్సి ఉంది. పథకాలకు సంబంధించి ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు మీ పేర్లు ఇంజినీరింగ్‌లో చూపడం లేదని, పామూరులోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చూపిస్తున్నాయని చెప్పడంతో విద్యార్థులు ఆశ్చర్యపోయారు. వెంటనే పామూరు వచ్చి తమ ప్రాంతంలోని వలంటీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీ పేర్లు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతున్నట్లు ఉన్నాయని చెప్పడంతో వారు దిక్కుతోచని స్థితిలో కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. యాజమాన్యం స్పందించకపోగా బాధిత విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తాము డిగ్రీ ఫస్ట్ సెమ్‌లో ప్రాక్టికల్ పరీక్షలకు హాజరైనట్లు మార్కులు కూడా వేసి ఉన్నారని, తమ పేర్లను డిగ్రీ కళాశాల రికార్డుల నుంచి తొలగించాలని కోరితే వారు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. విచారించి చర్యలు తీసుకుంటాం: ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మా పేర్లు చేర్చి యాజమాన్యం మాకు అన్యాయం చేసిందని కొందరు బీటెక్ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యం చర్యలతో ప్రభుత్వ పథకాలకు దూరమయ్యాని, ప్రశ్నిస్తే దూషిస్తున్నారని విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారించేందుకు కళాశాల యాజమాన్యం అందుబాటులో లేదు. వారిని పిలిపించి రికార్డులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.చంద్రశేఖర్, ఎస్ఐ -
వ్యతిరేకించినవాళ్లే సపోర్ట్ చేస్తున్నారు
‘‘డిగ్రీ కాలేజ్’ విడుదలకు ముందు పోస్టర్స్ చూసి సినిమాని ప్రదర్శించకుండా అడ్డుకుంటామన్న విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల నాయకులే చిత్రాన్ని చూశాక మనసుకు హత్తుకునే మంచి కథ ఉందని ప్రశంసిస్తున్నారు. అప్పుడు వ్యతిరేకించినవాళ్లే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు’’ అన్నారు దర్శకుడు నరసింహ నంది. వరుణ్, దివ్యారావు జంటగా స్వీయ దర్శకత్వంలో నరసింహ నంది నిర్మించిన ‘డిగ్రీ కాలేజ్’ ఈ నెల 7న విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో నరసింహ నంది మాట్లాడుతూ– ‘‘కొన్ని రొమాంటిక్ సీన్స్ చూసి సినిమా మీద నెగటివ్ అభిప్రాయం ఏర్పరచుకోవద్దని మా మనవి. సినిమా చూశాక మాట్లాడమని కోరుతున్నాం. బలమైన కథ ఉంది. క్లైమ్యాక్స్ సీన్స్ ప్రేక్షకులను భావోద్యేగానికి గురి చేస్తున్నాయి. కుల వ్యవస్థ మీద తీసిన సినిమా ఇది. ‘1940 లో ఒక గ్రామం’ సినిమాని కుల వ్యవస్థపైనే తీశాను.. జాతీయ అవార్డు వచ్చింది కానీ డబ్బులు రాలేదు. ‘డిగ్రీ కాలేజ్’కి డబ్బులు కూడా రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
‘డిగ్రీ కాలేజి’ నిర్మాత, దర్శకులపై కేసు
అమీర్‌పేట: అమీర్‌పేట మైత్రివనమ్ కూడలిలో డిగ్రీ కాలేజ్ సినిమాకు చెందిన అశ్లీల పోస్టర్లు అతికించినందుకు సినిమా దర్శకుడు,నిర్మాతలపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెపెక్టర్ మురళీకృష్ణ తెలిపిన మేరకు.. డిగ్రీ కాలేజ్ సినిమాకు సంబంధించిన అశ్లీలంగా ఉన్న పోస్టర్లను మైత్రివనమ్ పరసర ప్రాంతాల్లో అతికించారు. వీటిని చూసి విస్తుపోయిన పలువురు పోలీసులకు సమాచారం అందించారు. టాస్క్ఫోర్సు పోలీసులు నినిమా దర్శకుడు నర్సింహ నంది, నిర్మాత శ్రీనివాస్‌రావులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు.ఈ కేసును సుమోటోగా నమోదు చేసుకున్న ఎస్ఆర్నగర్ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.కాగా నింధితుల్లో ఒకరైన దర్శకుడు నర్సింహ నంది జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకులుగా అవార్డు అందుకున్నారు. -
వాస్తవ ప్రేమకథ
వరుణ్, దివ్యారావు జంటగా ‘1940లో ఒకగ్రామం, కమలతో నా ప్రయాణం’ చిత్రాల ఫేమ్ నరసింహ నంది స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘డిగ్రీ కాలేజ్’. ఈ నెల 7న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘నా గత చిత్రాల మాదిరిగా కాకుండా కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తీశాను. ఇద్దరు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ మధ్య క్లాస్‌రూమ్‌లోనూ బయట అంకురించిన వాస్తవ ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు నరసింహæనంది. ‘‘ఈ సినిమాలో భావోద్వేగభరితమైన అంశాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ చిత్రాన్ని నా ఆధ్వర్యంలో విడుదల చేయాలనుకున్నాను’’ అన్నారు పంపిణీదారుడు బాపిరాజు. -
డిగ్రీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా!
సాక్షి, హైదరాబాద్: వచ్చే జూన్‌లో ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరంలో (2020–21) రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా అమలు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. గతేడాదే మేనేజ్మెంట్ కోటా అమలు కోసం యాజమాన్యాలు విజ్ఞప్తి చేసినా ఆచరణకు నోచుకోలేదు. ఎట్టకేలకు వచ్చే విద్యా సం వత్సరం నుంచి అమలుకు ఓకే చెప్పింది. దీంతో డిగ్రీ కాలేజీల్లోని 30 శాతం సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకునేలా అనుమతి ఇవ్వనుంది. మేనేజ్మెంట్ కోటా ద్వారా చేరే విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. దీంతో ప్రభుత్వంపై ఆర్థిక భా రం ఉండదనే ఆలోచనతో ఈ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు ఈ నిర్ణయంతో ఆర్థిక స్తోమత కలిగిన విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీల్లో చేరే వీలు ఏర్పడనుంది. అలాగే వచ్చే సంవత్సరంలో వంద శాతం విద్యార్థులు చేరిన కోర్సులకు అదనపు సెక్షన్లను ఇవ్వాలని, కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్రంలోని 9 ప్రైవేటు అటానమస్ కాలేజీ యాజమాన్య ప్రతినిధులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫె సర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి సమావేశమై చర్చించారు. ఆయా కాలేజీల్లో ఉన్న కోర్సులు, వాటి నిర్వహణ, సిలబస్, పరీక్షల నిర్వహణ, సబ్జెక్టు కాంబినేషన్, మార్కెట్లో వాటికి ఉన్న డిమాండ్, ఆయా యాజమాన్యాలు చేపడుతున్న చర్యలపై చర్చించారు. ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉపాధినిచ్చే కోర్సులను అనుమతించడం ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తేవాలన్న నిర్ణయానికి వచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్‌ను అమలు చేస్తారు. అటానమస్ కాలేజీల్లో రెండేళ్లే భాషా సబ్జెక్టులు అటానమస్ డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లిష్, తెలుగు వంటి భాషలను ఇకపై మూడేళ్లు చదవాల్సిన అవసరం లేకుండా నిబంధనలను సడలించనున్నారు. డిగ్రీలో భాషా సబ్జెక్టులు మూడేళ్లు ఉన్న కారణంగా ప్రధాన సబ్జెక్టులకు సమయం సరిపోవడం లేదని అటానమస్ కాలేజీలు ఉన్నత విద్యా మండలి దృష్టికి తెచ్చాయి. దీంతో ఆయా కాలేజీల్లో భాషా సబ్జెక్టులను రెండేళ్లు మాత్రమే చదివేలా చర్యలు చేపడతామని మండలి హామీ ఇచ్చింది. అయితే భాషా సబ్జెక్టులకు ప్రస్తుతం ఉన్న 20 క్రెడిట్స్ నిబంధనను అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది. భాషా సబ్జెక్టుకు 20 క్రెడిట్స్ లేకపోతే విద్యార్థి ఆ భాషలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసే వీలు ఉండదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న క్రెడిట్స్‌ను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. -
డిగ్రీలో సగం ఖాళీలే..!
సాక్షి, పాల్వంచ: అర్హత కలిగిన లెక్చరర్లు, అధునాతన భవన సముదాయాలు ఉన్నా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు భర్తీ కావడం లేదు. వాటిలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అయితే వీటిలో అడ్మిషన్లు సక్రమంగా లేక సుమారు సగం సీట్లు ఖాళీగానే ఉన్నాయి. దీంతో కళాశాలల మనుగడ ప్రశార్థకంగా మారే ప్రమాదం ఏర్పడింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఆన్లైన్ (దోస్త్) ద్వారా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే విద్యార్థులు నామమాత్రంగానే చేరడంతో ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బతిమిలాడాల్సి వస్తోంది. వేల రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేటు కళాశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కాలేజీలకు మాత్రం పంపించడం లేదు. కొరవడిన పర్యవేక్షణ... ప్రభుత్వ కళాశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాశాలలో సరిపడా బోధన సిబ్బంది ఉండడం లేదు. ఇక అనేక కాలేజీల్లో ఇన్చార్జ్ ప్రిన్సిపాళ్లే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 డిగ్రీ కళాశాలలు ఉండగా.. నలుగురు మాత్రమే రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు ఉన్నారు. మిగిలిన ఏడుగురు ఇన్‌చార్జీలే. ప్రభుత్వ కాలేజీల్లో ఇలాంటి సమస్యలు నెలకొనడంతో.. తమ పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రులు ఎంత కష్టమైనా భరించి ప్రైవేటు కళాశాలల్లోనే చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఖాళీ సీట్ల వివరాలిలా... పాల్వంచలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 420 సీట్లు ఉండగా అందులో 221 మాత్రమే భర్తీ అయ్యాయి. 199 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కొత్తగూడెంలోని కళాశాలలో 360 సీట్లకు 180 భర్తీ అయ్యాయి. మరో 180 ఖాళీగా ఉన్నాయి. భద్రాచలం కళాశాలలో 540 సీట్లకు 418 భర్తీ అయ్యాయి. 122 ఖాళీగా ఉన్నాయి. మణుగూరులో 420 సీట్లకు 162 మాత్రమే భర్తీ అయ్యాయి. 258 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇల్లెందు డిగ్రీ కాలేజీలో 360 సీట్లు ఉండగా 105 భర్తీ అయి, 255 ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో.. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో 1500 సీట్లకు 1391 భర్తీ కాగా, 109 ఖాళీగా ఉన్నాయి. మహిళా డీగ్రీ కళాశాలలో 480 సీట్లకు 271 మంది విద్యార్థినులు అడ్మిషన్లు పొందారు. ఇంకా 209 సీట్లు ఖాళీగా ఉన్నాయి. నేలకొండపల్లిలో 420 సీట్లు ఉండగా 39 అడ్మిషన్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ మరీ దారుణంగా 371 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మధిరలో 180 సీట్లు ఉండగా 47 అడ్మిషన్లు రాగా, 133 ఖాళీగా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్లిన గార్ల కళాశాలలో 420 సీట్లకు 35 భర్తీ అయి 385 ఖాళీగా ఉన్నాయి. సత్తుపల్లిలో 600 సీట్లకు 400 భర్తీ కాగా ఇంకా 200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. -
ఆన్లైన్లో ‘డిగ్రీ’ పాఠాలు
సాక్షి, కరీంనగర్: ఇక నుంచి డిగ్రీ పాఠాలు ఆన్లైన్లో వినవచ్చు. టీ–సాట్ ద్వారా పాఠాలు, టీఎస్కేసీ, మూక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విద్యార్థులకు నూతన టెక్నాలజీతో డిజి టల్ పాఠాలను ప్రస్తుతం బోధిస్తున్నారు. మరో అధునాతన సాంతకేక విప్లవం ప్రభుత్వ డిగ్రీ విద్యలో అందుబాటులోకి వచ్చింది. సరికొత్తగా వర్చువల్ క్లాస్ రూం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్సులకు సంబంధించిన విద్యార్థులు ఒకేసారి పాఠ్యాంశాలు వినే విధంగా రూపొందించి మరింత సులభతరంగా పాఠాలు బోధించే పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఆగస్టు 31న ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ చేతుల మీదుగా వర్చువల్ క్లాస్‌లు ప్రారంభించారు. వివిధ కోర్సులకు సంబం ధించిన విద్యార్థులకు కావాల్సిన పాఠ్యాంశాలు అధ్యాపకులు ఉన్న చోట నుంచి విద్యార్థులు ఉండి అధ్యాపకులు లేని చోట వర్చువల్ క్లాస్‌లను ఉపయోగించుకునేందుకు దీనిని మొదలు పెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 37 కళాశాలల్లో వినియోగంలోకి రానుండగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 కళాశాలల్లో అమలు కానుంది. రుసా(రాష్ట్రీయ ఉచ్చాతార్ శిక్షా అభియాన్) కేంద్ర నిధులతో వర్చువల్‌క్లాస్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు ఒక్కో కళాశాలకు దాదాపు రూ.6 లక్షల రూల వరకు ఖర్చవుతున్నట్లు సమాచారం. వివిధ సబ్జెక్టుల పాఠశాలు... వర్చువల్ క్లాస్ ద్వారా ముఖ్యంగా పలు సబ్జెక్టుల కోసం రూపొందించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జియాలజీ, సైకాలజీ, కంప్యూటర్‌సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, సోసియాలజీ, జర్నలిజంతోపాటు వివిధ సబ్జెక్టుల పాఠాలు ఆన్లైన్లో బోధించడానికి వర్చువల్ క్లాస్ రూంలు ఉపయోగించనున్నారు. ఇదే కాకుండా అందులో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన చిత్రాలు. ముఖ్యమైన గ్రాఫ్‌లు కూడా అందులో నిక్షిప్తం చేశారని తెలిసింది. కొన్ని సబ్జెక్టుల్లో బొమ్మలు వేయడానికే సమయం అంతా వృథా అయిపోతుంది. కాబట్టి అందులో నుంచి డౌన్లోడ్ చేసుకుని పాఠ్యాంశాలు బోధిస్తే సమయం ఆదాతోపాటు సులభతరంగా అర్థమవుతుంది. ఒక వేళ రెండు పిరియడ్లు ఒకే సబ్జెక్టు బోధించాలంటే ఒక పిరియడ్ బోధన రికార్డు చేసుకొని మరో పిరియడ్ అదే ప్లే చేసుకునేలా వెసులుబాటు ఉంది. కావాల్సిన పాఠాన్ని రికార్డు చేసుకొని ఎన్నిసార్లయిన వినవచ్చు. కేవలం బోధనే కాకుండా విద్యార్థులు సందేహాలను సైతం నివృత్తి చేసుకునే విధంగా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉందని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. ఐఐటీ, ఎన్ఐటీల్లో వాడే టెక్నాలజీ గ్రామీణ ప్రాంత విద్యార్థులుండే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వాడడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా గల కళాశాలల విద్యార్థులు విజ్ఞానాన్ని అందుకోవచ్చు. 7 కళాశాలల్లో అమలు... రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ తరగతులు 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో జరుగనుండగా ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 7 కళాశాలల్లో అమలు చేస్తున్నట్లు తెలిసింది. కరీంనగర్‌లోని ఎస్సారార్ ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ ఉమెన్స్ కళాశాల, జగిత్యాలలోని ఎస్కెఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వర్చువల్ క్లాస్ సదుపాయం కల్పిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 5 నుంచి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వర్చువల్ తరగతుల వల్ల ఉపయోగాలు ఒకే వద్ద నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గల కళాశాలల్లో తరగతులు వినవచ్చు. అధ్యాపకులు లేని కళాశాల విద్యార్థులకు ఉపయోగం. బోధనతోపాటు విద్యార్థులు సందేహాలు కూడా అడగవచ్చు. పాఠ్యాంశాల బోధన రికార్డు చేసుకోవచ్చు. నోట్స్‌ను స్కాన్ చేసి రాష్ట్రమంతటా షేర్ చేసుకోవచ్చు. అన్ని సబ్జెక్టుల చిత్రాలు నిక్షిప్తం అయిఉంటాయి. విద్యార్థులు తరగతికి రాకున్నా యాప్ ద్వారా మొబైల్‌కు కనెక్టు చేసుకొని తరగతులు వినవచ్చు.–మెసైజ్ క్లౌడ్ యాప్ ద్వారా విద్యార్థి మొబైల్లో చూడవచ్చు. లెక్చరర్లు లేని కోర్సుల్లో కూడా ప్రవేశాలు పెరుగుతాయి. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠాలు అందుబాటులో ఉండడంతోపాటు మరెన్నో సదుపాయాలున్నాయి. విద్యార్థులు సాంకేతికతను వినియోగించుకోవాలి విద్యార్థులకు వర్చువల్ క్లాస్‌రూం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్న వర్చువల్ తరగతులు వినియోగించుకోవాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఎదుగుతున్న సందర్భంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విజ్ఞాన సముపార్జన, విస్తృత అధ్యయనం జరుగుతుంది. – డాక్టర్ కలవకుంట రామకృష్ణ, ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ -
అరకులోయలో మహిళా డిగ్రీ కళాశాల
అరకులోయ: గతేడాది కేంద్ర ప్రభుత్వం అరకులోయలో మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేసింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. 10 ఎకరాల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో భవనాల నిర్మాణానికి రూ.12కోట్లు కేంద్రం ఇచ్చింది. ఇటీవల రెవెన్యూ అధికారులు పానిరంగిణి సమీపంలో స్థలాన్ని సేకరించారు. భవనాల నిర్మాణ పనుల ప్రారంభానికి కాంట్రాక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి తరగతులు ఈ ఏడాది నుంచి మహిళా డిగ్రీ కళాశాలలో తరగతులు ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రవేశాలు చేపడుతున్నారు. తాత్కాలికంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తరగతుల నిర్వహణకు ఉన్నత విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కళాశాలలో ప్రవేశం పొందే విద్యార్థినులకు కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే వసతి,భోజన సౌకర్యాలు కల్పించేందుకు ప్రిన్సిపాల్ కె.పద్మలత నిర్ణయించారు. ఈమేరకు కాలేజీ హాస్టల్ వార్డెన్లకు ఆదేశాలు జారీ చేశారు. అడ్మిషన్లు ప్రారంభం కొద్ది రోజుల్లో ప్రారంభించనున్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించారు. బీఏ, బీకాం, బీఎస్సీలో సీబీజడ్, ఎంపీసీ గ్రూప్‌లకు సంబంధించి 220 సీట్లను కేటాయించారు. ఇప్పటికే సీబీజడ్‌లో 60సీట్లకు అడ్మిషన్లు పూర్తయ్యాయి. మిగిలిన గ్రూపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. -
ప్రశ్నాపత్రం లీక్.. జీరాక్స్ షాపులో లభ్యం
సాక్షి, కాకినాడ: కిర్లంపూడిలోని ఎస్వీఎస్ డిగ్రీ కాళశాల సిబ్బంది నిర్వాకంతో ఏకంగా పరీక్షకు ముందే ఏకంగా ప్రశాపత్రం లీక్ కావడం కలకలం రేపుతోంది. గీతం యూనివర్సిటీ దూరవిద్య బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రశాపత్రం లీక్ అయింది. ఈ పరీక్ష మంగళవారం జరగాల్సి ఉండగా.. సమీపంలోని ఓ జీరాక్స్ సెంటర్లో ప్రశాపత్రం జీరాక్స్‌లు లభించడం తీవ్ర కలకలం రేపింది. ప్రశ్నాపత్రం లీక్ కావడంతో గుట్టుగా పేపర్ మార్చి ఎస్వీఎస్ డిగ్రీ కళాశాల పరీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. -
అశ్లీల చిత్రాలకు అడ్డుకట్ట వేయండి
ముషీరాబాద్: యువతను పెడదారి పట్టించే డిగ్రీ కాలేజీ, ఏడు చేపల కథ తదితర సినిమాలను విడుదల కాకుండా అడ్డుకోవాలని పీవైఎల్, పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల వస్తున్న అశ్లీల సినిమాలు, సన్నివేశాలను నియంత్రించాలని కోరుతూ సోమవారం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను పీవైఎల్, పీడీఎస్‌యూ ప్రతినిధి బృందం కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్ ప్రదీప్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు మాట్లాడుతూ... ఇటీవల విడుదలవుతున్న సినిమాల్లో అశ్లీల దృశ్యాలు అభ్యంతరకరంగా, ఇబ్బందికరంగా ఉంటున్నాయని, ఫోర్న్ సీన్లు ఉంటేనే సినిమాలు చూస్తున్నారని దర్శక, నిర్మాతలు బహిరంగంగా పేర్కొనడం దారుణమన్నారు. తాజాగా ‘‘ డిగ్రీ కాలేజీ’’ ‘‘ఏడు చేపల కథ’’ తదితర అశ్లీల సినిమాలు విడుదల కాబోతున్నాయన్నారు. ఈ సినిమాలు ‘ఏ’ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ, వీటికి ప్రధానంగా టీనేజీ యువతే ఆకర్షితులు అవుతున్నారని, పోస్టర్లు కూడా అసభ్యకరంగా వేస్తున్నారన్నారు. దీనిపై ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో యువత వీటికి ప్రేరేపితులై చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు., ఇలాంటి సినిమాలను నిలిపివేయాలని, సదరు దర్శక, నిర్మాతలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతినిధి బృందంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.భాస్కర్, ఓయూ నాయకురాలు జ్యోతి, పీవైఎల్ నాయకులు పి.సృజన్, కళ్యాణ్, డీవీఎస్.కృష్ణ తదితరులు ఉన్నారు. పీవైఎల్, పీడీఎస్‌యూ నాయకులు -
'డిగ్రీ కాలేజీ'లో విశృంఖలత్వం..
ముషీరాబాద్: ప్రస్తుతం విడుదలవుతున్న కొన్ని సినిమాలలో ఆశ్లీల దృశ్యాలు చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయిని, అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100 లాంటి సినిమాలతో మరింత అశ్లీలత పెరిగిందని, నేడు ‘డిగ్రీ కాలేజీ’ పేరుతో వస్తున్న సినిమాలో మరింత విశృంఖలత్వంతో కూడిన దృశ్యాలున్నాయని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సినిమా ఇటీవల ట్రైలర్ మూడు నిమిషాలే ఉందని, దానిని చూస్తేనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తోందన్నారు. బుధవారం పీవైఎల్ నాయకులు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, రీజినల్ ఆఫీసర్ రాజశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ప్రదీప్ మాట్లాడుతూ... సినిమాలలో వస్తున్న శృంగార విశృంఖలత్వం చూసి యువత చెడిపోయే ప్రమాదముందన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని సెన్సార్ బోర్డును డిమాండ్ చేశారు. పీవైఎల్ నాయకులు కె.రాజేందర్, డివిఎస్.కృష్ణ, ఎం.ఆంజనేయులు, రాకేశ్‌రెడ్డి, అశోక్, సమీర్, సాయి, సందీప్ పాల్గన్నారు. -
ట్రైలర్‌పై ఘాటుగా స్పందించిన జీవిత
అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాల తరువాత టాలీవుడ్లో బోల్డ్ కంటెంట్‌తో కూడిన సినిమాలు ఎక్కువయ్యాయి. ఇదే విషయాన్ని తాజాగా జీవితా రాజశేఖర్ ప్రస్తావించారు. ‘డిగ్రీ కాలేజ్’ చిత్ర ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె.. చిత్రయూనిట్‌పై, ట్రైలర్‌పై ఘాటుగా స్పందించారు. జీవిత మాట్లాడుతూ.. ‘ ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’ పుణ్యమా అనీ, లిప్ లాక్ లేని తెలుగు సినిమా లేకుండా పోయింది. మనం ఇల్లు కట్టుకుంటే హాలులో కూర్చుంటాము .. బెడ్ రూములో పడుకుంటాము .. బాత్ రూమ్ లో స్నానం చేస్తాము. కానీ హాల్లోకి వచ్చి స్నానం చేయం గదా. ఏ పని ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి .. రోడ్డుపై చేస్తే అసహ్యంగా ఉంటుంది. మనకూ కుటుంబాలు వున్నాయి .. ఆడపిల్లలు వున్నారు అనే సామాజిక బాధ్యతతో సినిమాలు చేయవలసిన అవసరం వుంది. ప్రతి ఒక్కరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి... సోషల్ మీడియాలో.. టీవీల్లో ఇలాంటివి ఉండటం లేదా? అని కొందరు వాదిస్తారు. నిజమే ఉన్నాయి. కానీ వాటిని మనం ఒక రూములో.. ఒక్కరం కూర్చుని చూస్తాం. సినిమా అనేది కొన్ని వందల మందితో కలిసి చూసేది. చాలామంది మధ్యలో మనం శృంగారం చేయం. అసభ్యంగా ప్రవర్తించం. మూవీలో ఇలాంటివి వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీ కార్యక్రమానికి వచ్చి నేను ఇలా మాట్లాడకూడదు. ఈ మాటలను కాంట్రవర్సీ కోసం కూడా చెప్పడం లేదు .. నా మనసుకి అనిపించింది చెప్పాను" అని అన్నారు. -
డిగ్రీలో మేనేజ్మెంట్ కోటా!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లోనూ మేనేజ్మెంట్ కోటా తెచ్చేందుకు కసరత్తు మొదలైంది. కన్వీనర్ ద్వారా భర్తీ చేస్తున్న ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో యాజమాన్య కోటాను అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఇటీవల డిగ్రీలోనూ కన్వీనర్ ద్వారా ఆన్లైన్లో ప్రవేశాలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో డిగ్రీలోనూ మేనేజ్మెంట్ కోటాను అమలు చేయాలని డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు కోరుతున్నాయి. రాష్ట్రంలో 1,100 డిగ్రీ కాలేజీలుంటే అందులో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కన్వీనర్ నేతృత్వంలో 1,084 కాలేజీల్లో దాదాపు 4 లక్షల సీట్లను ఉన్నత విద్యా మండలి గత రెండేళ్లుగా భర్తీ చేస్తోంది. 30% యాజమాన్య కోటాకు డిమాండ్ ఆన్లైన్లో దోస్త్ కన్వీనర్ ద్వారా ప్రవేశాలను చేపడుతున్నందున తమకు 30 శాతం మేనేజ్మెంట్ కోటా విధానాన్ని అమలు చేయాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే కన్వీనర్ నేతృత్వంలో కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పూర్తయ్యాక మిగిలిపోయే సీట్లను స్పాట్ అడ్మిషన్ల కింద యాజమాన్యాలే భర్తీ చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరుతున్నాయి. అయితే గత రెండేళ్లుగా స్పాట్ అడ్మిషన్లను యాజమాన్యాలు చేపట్టేందుకు ప్రభుత్వం అవకాశమివ్వడం లేదు. ఈ నేపథ్యంలో 30 శాతం యాజమాన్య కోటా విధానం లేదా స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించడం.. ఈ రెండింటిలో ఏదో ఒకదానికి అంగీకరించాలని యాజమాన్యాలు పట్టుపడుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే అనేక సార్లు డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం, కళాశాల విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలికి విజ్ఞప్తి చేశాయి. ప్రవేశాల కసరత్తు నేపథ్యంలో.. 2019–20 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం మళ్లీ కసరత్తు ప్రారంభమైన నేపథ్యంలో యాజమాన్యాలు తమ డిమాండ్‌ను మళ్లీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చాయి. దీంతో ప్రభుత్వం కూడా యాజమాన్యాలు కోరుతున్న విధానాలపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి అమలు చేయాలన్న భావనకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే త్వరలోనే జరిగే డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం ఆన్లైన్లో సీటు రాకపోతే అంతే.. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్లైన్లో చేపడుతున్నందున ప్రస్తుతం విద్యార్థికి ఏ కాలేజీలో సీటొస్తే అదే కాలేజీలో చేరాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు, మూడు దశల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నా కోరుకున్న కాలేజీలో సీటు రాకపోతే చివరగా వచ్చిన కాలేజీలోనే చేరాల్సి వస్తోంది. ఇష్టం లేకపోయినా అందులో చేరటం లేదంటే మానేయడమే ప్రత్యామ్నాయంగా ఉంది. మరోవైపు చాలా కాలేజీల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. ఆన్లైన్ ప్రవేశాల్లో వస్తే వచ్చినట్లు లేదంటే లేదు. దీంతో యాజమాన్యాలు మిగిలిన సీట్లను కూడా తమ వద్దకు వచ్చే విద్యార్థులకు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రకాశ్, ఎ.పరమేశ్వర్ తెలిపారు. మేనేజ్మెంట్ కోటా అమలు చేస్తే విద్యార్థులు కోరుకున్న కాలేజీలో ఆన్లైన్ ద్వారా కన్వీనర్ కోటాలో.. సీటు రాకపోతే కోరుకున్న కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో చేరే అవకాశం ఉంటుందని వెల్లడించారు. లేదంటే మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసే అధికారం ఇచ్చినా విద్యార్థులు కోరుకున్న కాలేజీలో చేరే అవకాశం ఉంటుందని వారు వివరించారు. -
సిద్ధార్థ మహిళా కళాశాలలో ‘మిస్ ఫెట్-2018’
-
అక్కడ ఈ ఏడాదీ డిగ్రీ క్లాసులు లేనట్టే..
బి.కొత్తకోట: ఈ ఏడాది బి.కొత్తకోట డిగ్రీ కళాశాలలో తరగతులు లేనట్టే. ఇద్దరే విద్యార్థులు చేరేందుకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వాళ్లిద్దరూ టీసీలు ఇస్తే మరో‡ కళాశాలల్లో చేరుతామంటూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపల్ వెంకట్రామకు విన్నవించారు. బుధవారం వీరికి టీసీలు ఇచ్చేయనున్నారు. దీంతో ఈ విద్యాసంవత్సరం డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభం కావన్న విషయం స్పష్టమైంది. 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు డిగ్రీ కళాశాల మంజూరుకు హామీ ఇచ్చారు. హడావుడిగా ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తూ ఉన్నత విద్యశాఖ ఆదేశాలు జారీచేసింది. తొలుత బీఏ, బీకాం, కోర్సులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టగా ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఇంటర్ టీసీలు ఇచ్చి, రూ.వెయ్యి ఫీజు చెల్లించారు. మంగళవారం నాటికీ మూడో విద్యార్థి చేరకపోవడంతో తరగతుల ప్రారంభం లేదని తేలిపోయింది. ఈ పరిస్థితిని ఇన్చార్జ్ ప్రిన్సిపల్ వెంకట్రామ ఉన్నత విద్యశాఖ కమిషనరు సుజాతాశర్మ దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం ప్రయత్నించారు. 20న సాక్షిలో ప్రచురించిన ఇద్దరే ఇద్దరు కథనం కమిషనరు దృష్టికి తీసుకెళ్లారు. డిగ్రీ కళాశాలలో చేరేందుకు వచ్చే విద్యార్థుల వివరాలు, దరఖాస్తులను నమోదు చేసేందుకు కోసం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన జూనియర్ అసిస్టెంట్ శేఖర్‌ను డెప్యూటేషన్‌పై ఇక్కడికి పంపారు. ఆయన రోజూ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కూర్చోవడం.. విద్యార్థులు రాకపోవడంతో ఉసూరుమంటూ వెళ్లిపోవడం జరుగుతూ వస్తోంది. తరగతులు ప్రారంభమయ్యే పరిస్థితులు లేనందున శేఖర్‌ను తిరిగి కుప్పంకు పంపించేయనున్నారు. -
ప్రిన్సిపాల్ వినూత్న ఆలోచన.. విమర్శలు!
లక్నో : విద్యార్థులు కాపీ కొడుతున్నారని వీటిని అరికట్టేందుకు ఓ కాలేజీ ప్రిన్సిపాల్ వినూత్నంగా ఆలోచించారు. కాలేజీ బాత్రూమ్లలో సీసీ కెమెరాలు సెట్ చేయించారు. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లోని ధరం సమాజ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హేం ప్రకాష్ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. డ్రెస్సుల్లో ఏదో విధంగా స్లిప్స్ తీసుకొస్తున్నారని, వీటిని అరికట్టేందుకు ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లదని, దాంతో విద్యార్థులు ధర్నాలు చేపట్టే అవకాశం లేదన్నారు. విద్యార్థులు చీటింగ్ చేస్తున్నారని బాయ్స్ బాత్రూముల్లో సీసీ కెమెరాలు ఫిట్ చేయించారు. అయితే కేవలం అబ్బాయిలే పరీక్షల్లో కాపీయింగ్ చేస్తారా అని కొందరు ప్రిన్సిపాల్‌ను ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిల బాత్రూమ్లలో కెమెరాలు పెట్టాలన్నది మా ఉద్దేశం కాదని, అయితే విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష హాలులోకి అనుమతించాలని సూచించారు. కాపీయింగ్ చేస్తూ దొరికిపోయే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కానీ అబ్బాయిలను అవమానించే ఇలాంటి పనులు మంచివి కాదంటూ మరికొందరు హితవు పలుకుతున్నారు. -
డిగ్రీకి క్లస్టర్ పజిల్!
ప్రకాశం, బేస్తవారిపేట: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తీసుకుంటున్న నిర్ణయాలతో డిగ్రీ కళాశాలల విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఈ విద్యా సంవత్సరం మధ్యలో 6వ సెమిస్టర్‌కు క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఫైనల్ ఇయర్లో 5, 6 సెమిస్టర్లు విద్యార్థులు రాయాల్సి ఉంది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక.. అక్టోబర్‌లో 6వ సెమిస్టర్లో భాగంగా సీబీసీఎస్ (ఛాయిస్ బేస్డు క్రెడిట్ సిస్టమ్) క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. తృతీయ సంవత్సరంలో ఆరు పేపర్లుంటాయి. సైన్స్ (బీఎస్సీ, బీజెడ్సీ) విద్యార్థులు బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో ఎదైనా ఒక సబ్జెక్ట్‌లో మూడు పేపర్లను ఎంపిక చేసుకోవాలి, మిగిలిన మూడు పేపర్లు మూడు సబ్జెక్ట్‌ల్లో ఒక్కోటి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుబాటులో లేని పుస్తకాలు ఆన్లైన్లో నవంబర్ నెలలో క్లస్టర్ పేపర్ల వివరాలు, సిలబస్‌ను యూనివర్సిటీ వెబ్సైట్లో పెట్టారు. సిలబస్ పూర్తిగా కొత్తగా, లోతైన టాపిక్లతో ఉంది. దీనిని బోధించేందుకు సరైన పుస్తకాలు లేకపోవడంతో అధ్యాపకులు కూడా తలలు పట్టుకున్నారు. అందుబాటులో ఉన్న టాపిక్‌లను చెప్పి పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. అకాడమీ పుస్తకాలు, ప్రైవేట్ పబ్లికేషన్స్ క్లస్టర్ సిలబస్ పుస్తకాలను నేటికీ విడుదల చేయలేదు. యూనివర్సిటీ అనాలోచితన నిర్ణయం ఏడాది ప్రారంభంలో కాని, వచ్చే ఏడాదికాని క్లస్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింటే విద్యార్థులకు, అధ్యాపకులకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఫైనల్ ఇయర్ మధ్యలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడంతో సిలబస్ చెప్పలేక అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రెండు నెలల వ్యవధి గడిచిపోయింది. ఏ ఒక్క సబ్జెక్ట్‌లో కనీసం సగం సిలబస్ పూర్తి చేసే పరిస్థితి లేదు. విద్యార్థుల పరిస్థితి ఇలా.. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న తృతీయ సంవత్సర విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మొదటి, రెండో సంవత్సరాల్లో సబ్జెక్ట్‌లు మిగిలినా పెద్ద నష్టం ఉండదు. కానీ ఫైనల్ ఇయర్లో సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయితే పట్టా కోల్పోవాల్సిన వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మార్చిలో పరీక్షలు పెడితే తీవ్ర నష్టం ఇప్పటికి కూడా పుస్తకాలు అందుబాటులోకి రాకపోవడంతో మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు పెడితే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. జనవరి నెలలో సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఫిబ్రవరిలో ప్రాక్టిల్స్ ఉంటాయి. ఈనెల చివరికి ప్రైవేట్ పబ్లికేషన్ పుస్తకాలను మార్కెట్లోకి విడుదల చేసిన సిలబస్ పూర్తి చేసేందుకు సరైన సమయంలేదు. హడావుడిగా అధ్యాపకులు సిలబస్‌ను పూర్తిచేసిన విద్యార్థులు చదువుకునేందుకు సమయం ఉండదు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను మార్చిలో నిర్వహించకుండ వాయిదావేయాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు. -
అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను, ఫీజులను నియంత్రించే అధికారం యూనివర్సిటీల చట్టం కింద తమకు ఉందన్న ప్రభుత్వ వాదనను ఉమ్మడి హైకోర్టు తోసిపుచ్చింది. కాలేజీల వాదనలు వినకుండా, వారి వ్యయాల గురించి తెలుసుకోకుండా ఫీజులను నిర్ణయించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తేల్చింది. న్యాయస్థానానికి వచ్చిన పలు డిగ్రీ కాలేజీలకు ఆన్లైన్ ద్వారా కాకుండా పాత విధానంలో(ఆన్లైన్ ద్వారా కాదు) ప్రవేశాలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ ప్రవేశాలన్నీ కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని, ఒకవేళ భవిష్యత్తులో కాలేజీలు ఓడిపోతే డిగ్రీ సర్టిఫికెట్లు రావన్న విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని ఆయా కాలేజీలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ రెండు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్లైన్ ద్వారా ప్రవేశాల నిమిత్తం జారీ చేసిన జీవోను.. అలాగే తమ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ పలు అన్ ఎయిడెడ్ మైనారిటీ, మైనారిటీయేతర, అటానమస్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ విచారణ జరిపారు. డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ ప్రవేశాల నిమిత్తం జీవో 67 కింద ప్రభుత్వం తీసుకొచ్చిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్), ఏ చట్టం కింద ఈ విధానాన్ని తీసుకొచ్చిందో ఎక్కడా పేర్కొనలేదని న్యాయమూర్తి ఆక్షేపించారు. యూనివర్సిటీ చట్టం కింద ఫీజులను, ప్రవేశాలను నియంత్రించే అధికారం తమకు ఉందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు చేసిన వాదన సమర్థనీయంగా లేదన్నారు. ‘యూనివర్సిటీల చట్టంలో యూనివర్సిటీ అన్న పదం పరిధిలోకి అన్ని అఫిలియేటెడ్ కాలేజీలు, వర్సిటీ కాలేజీలు, ఓరియంటల్ కాలేజీలు, అటానమస్ కాలేజీలు వస్తాయని అదనపు ఏజీ చెబుతున్నారు. ఈ వాదనను ఆమోదిస్తే రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ప్రవేశాలే కాదు పోస్టుల సృష్టి, ప్రొఫెసర్లు, రీడర్లు, పాలనా సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది, హాస్టళ్ల నిర్వహణ, ఫీజుల ఖరారు ఇలా అన్నీ విషయాల్లో కూడా అధికారాలు యూనివర్సిటీకే చెందుతాయి. వాస్తవానికి శాసనకర్త ఉద్దేశం ఇది కాదు. చట్ట ప్రకారం యూనివర్సిటీ కాలేజీలు వేరు, అఫిలియేటెడ్ కాలేజీలు, రికగ్నైజ్డ్ కాలేజీలు, మహిళా కాలేజీలు వేరు. అదనపు ఏజీ వాదన నిజమైతే చట్టంలో ఇలా ఒక్కో కాలేజీ గురించి ప్రస్తావన చేసి ఉండేవారు కాదు. యూనివర్సిటీల పరిధిని పాలనా సౌలభ్యం కోసమే నిర్ణయించారు తప్ప, ప్రవేశాలను నియంత్రించడానికి కాదు. కాబట్టి అదనపు ఏజీ వాదన సరికాదు. అటానమస్ కాలేజీలు యూజీసీ చట్ట నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం పనిచేస్తాయి. కాబట్టి ప్రవేశాలను ప్రభుత్వం నియంత్రించజాలదు. అన్ ఎయిడెడ్ మైనారిటీ విద్యా సంస్థల్లో ప్రవేశాలను ప్రభుత్వం నియంత్రంచ లేదని టీఎంఏ పాయ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది’అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మా ఇష్టం
► నిబంధనలకు విరుద్ధంగా డిగ్రీ కళాశాలల నిర్వహణ ► రెండు రోజుల క్రితం 25 కళాశాలలకు నోటీసుల జారీ ► 15 రోజుల్లో వివరణ ఇవ్వాలన్న ఉన్నత విద్యాశాఖ ► గుర్తింపు ఇవ్వొద్దని వీఎస్‌యూ అధికారులకు ఆదేశం జిల్లాలో డిగ్రీ కళాశాలల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. కాలేజీలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకున్నా యథేచ్ఛగా కళాశాలలు నిర్వహిస్తూ విద్యార్థులకు ఎర వేస్తున్నారు. చిన్న చిన్న అద్దె భవనాల్లో బోర్డులు పెట్టి కార్పొరేట్ పేరుతో కళాశాలలను నడుపుతున్నారు. విద్యార్థుల నుంచి అందినకాడికి ఫీజులు దండుకుంటూ తమ జేబులు నింపుకుంటున్నారు. నెల్లూరు (టౌన్): డిగ్రీ కళాశాలలపై పర్యవేక్షణ యూనివర్సిటీ అధికారులకు ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి ఏడాదీ కొంత మొత్తాన్ని వర్సిటీ అధికారులకు సమర్పించుకుని కళాశాల యజమానులు తమ పని చేసుకుంటున్నారు. అయితే డిగ్రీ కళాశాలల నిర్వహణపై ప్రక్షాళన చేసేందుకు ఉన్నత విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. అద్దె భవనాల నుంచి సొంత భవనాల్లోకి మార్చని, పూర్తిస్థాయిలో వసతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 25 డిగ్రీ కళాశాలల యాజమాన్యాలకు ఉన్నత విద్యాశాఖాధికారులు రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని తెలిపారు. ఈ కళాశాలలకు ఎలాంటి గుర్తింపు ఇవ్వొద్దని విక్రమ సింహపురి యూనివర్సిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న కళాశాలల యాజ మాన్యాల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో 81 డిగ్రీ కళాశాలలు జిల్లాలో మొత్తం 81 డిగ్రీ కళాశాలలున్నాయి. వాటిలో తొమ్మిది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 7 ఎయిడెడ్, 65 కార్పొరేట్, ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి. వీటిలో 32 వేలమందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. డిగ్రీలో బీఎస్సీ, ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, బీకాం కంప్యూటర్ సైన్స్, బీసీఏ, బీబీఏ, బీసీసీఏ తదితర కోర్సుల్లో విద్యార్థులు అధిక మొత్తంలో చేరుతున్నారు. డిగ్రీలోనే కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలను పొందుతున్నారు. దీనిని ఆసరా‡గా తీసుకున్న యాజమాన్యం ఇష్టారాజ్యంగా డిగ్రీ కళాశాలలను నిర్వహిస్తోంది. అయితే కార్పొరేట్ డిగ్రీ కళాశాలలు ఒక చోట అనుమతి పొంది మరొక ప్రాంతంలో కళాశాలను నిర్వహిస్తున్నారు. అదికూడా అద్దె భవనం చూపించి రెండేళ్లల్లో సొంత భవనంలోకి మారుతామని ఉన్నత విద్యాశాఖకు లేఖలు ఇచ్చారు. అయితే వీఎస్‌యూ అధికారులను లోబర్చుకుని సరిగా గాలి, వెలుతురు లేని చిన్నచిన్న భవనాల్లో కళాశాలలు నిర్వహిస్తూ విద్యార్థులనుంచి అధిక మొత్తంలో ఫీజులు దండుకుంటున్నారు. జిల్లాలో చాలా కళాశాలలకు లీజ్డీడ్ ముగిసింది. ఫైర్, శానిటరీ, స్ట్రక్చరల్ తదితర సర్టిఫికెట్లు లేకుండానే కళాశాలలను నిర్వహిస్తున్నారు. అయితే వీఎస్‌యూ అధికారులకు ప్రతి ఏడాదీ లంచం రూపంలో రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు పైగా అందజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో డిగ్రీ కళాశాలల నిర్వహణ ఏ విధంగా ఉన్నా వాటిపై వీఎస్‌యూ అధికారులు కన్నెత్తి చూడటంలేదని విమర్శలున్నాయి. నోటీసులు అందుకున్న కళాశాలలు ఇవే డిగ్రీ కళాశాలలలకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేని, నిబంధనలు అతిక్రమించిన 25 డిగ్రీ కళాశాలల యాజమాన్యాలకు ఉన్నత విద్యాశాఖ రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. ఐదేళ్లలోపు, ఐదు సంవత్సరాల నుంచి 15 ఏళ్లు పైబడి అద్దె భవనాల్లో కళాశాలలు నిర్వహిస్తున్న కళాశాలలకు నోటీసులు అందజేశారు. దీనిపై 15 రోజులలోపు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. వీటికి ఎలాంటి గుర్తింపు జారీ చేయవద్దని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఆనం సంజీవరెడ్డి డిగ్రీ కళాశాల (ఏఎస్.పేట), శాస్త్ర డిగ్రీ కళాశాల (వరిగొండ), చైతన్య డిగ్రీ కళాశాల (కావలి), విశ్వం డిగ్రీ కళాశాల (నాయుడుపేట), ఎస్.ఎస్.డిగ్రీ కళాశాల (అగ్రహార్పేట), సంజీవని డిగ్రీ కళాశాల (వెంకటాచలం), వైష్ణవి డిగ్రీ కళాశాల (వెంకటగిరి), వీఆర్‌జేసీ డిగ్రీ కళాశాల (వెంకటగిరి), ఎంఎస్సార్ డిగ్రీ కళాశాల (వింజమూరు), శ్రీసాయి డిగ్రీ కళాశాల (వింజమూరు), పి.వెంకటసబ్బమ్మ డిగ్రీ కళాశాల (ఏఎస్‌పేట), విజేత డిగ్రీ కళాశాల (జలదంకి), సి.సి.ఆర్ డిగ్రీ కళాశాల (సైదాపురం), స్వాతి డిగ్రీ కళాశాల (వెంకటాచలం), విద్యాలయ డిగ్రీ కళాళాల (గూడూరు), సీతారామ డిగ్రీ కళాశాల (సీతారామపురం), విశ్వశాంతి డిగ్రీ కళాశాల (కావలి), శ్రీ ప్రగతి డిగ్రీ కళాశాల (కోట), విజ్ఞాన డిగ్రీ కళాశాల (పొదలకూరు), విద్యాంజలి కాలేజి ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (సూళ్లూరుపేట), ఎస్పీబీవీడీ డిగ్రీ కళాశాల (పొదలకూరు), శ్రీ కరుణామయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (గూడూరు), స్వర్ణనాందభారతి డిగ్రీ కళాశాల (గూడూరు), సీవీ రామన్ డిగ్రీ కళాశాల (నాయుడుపేట), వేమ డిగ్రీ కళాశాల (నాయుడుపేట)లకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే జిల్లాలో 25 కళాశాలలకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోపు వారు వివరణ పంపాల్సి ఉంది. నోటీసులు అందుకున్న కళాశాలలకు గుర్తింపు ఇవ్వొద్దని ఆదేశాలున్నాయి. – చంద్రయ్య, రిజిస్ట్రార్, విక్రమ సింహపురి యూనివర్సిటీ -
డిగ్రీ కాలేజీల్లో పెరగనున్న 6 వేల సీట్లు
ఇదివరకే దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లోనే పెంపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 6 వేల వరకు అదనపు సీట్లు రాబోతున్నాయి. 2017–18 విద్యా సంవత్సరంలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కొత్తగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకపోయినా, ఉన్న డిగ్రీ కాలేజీల్లో అదనంగా కోర్సులను ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. అయితే అదనపు కోర్సుల ప్రారంభం కోసం తాజాగా ఇపుడు ఎలాంటి దరఖాస్తులను తీసుకోవడం లేదు. గతంలో దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో మాత్రమే కొత్తగా కోర్సులను ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చేలా ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. మరోవైపు డిగ్రీ కాలేజీల్లో పీజీ సెంటర్ల ఏర్పాటుకు గతంలో దరఖాస్తులు వచ్చినా, కొత్తగా పీజీ సెంటర్లను ఇవ్వడం లేదు. కొత్తగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ఈసారి అనుమతి ఇవ్వవద్దని నిర్ణయించింది. జెండర్ సెన్సిటైజేషన్‌పై ప్రత్యేక పుస్తకం డిగ్రీ ప్రథమ సంవత్సరం రెండో సెమిస్టర్లో జెండర్ సెన్సిటైజేషన్‌ను ప్రత్యేక సబ్జెక్టుగా ప్రవేశ పెట్టేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఇప్పటికే సిలబస్ రూపొందించి, పాఠ్యాంశాల రచనను పూర్తి చేసింది. మరికొద్ది రోజుల్లో దానిని తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ముద్రించి అందుబాటులోకి తేనుంది. -
నేడు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్ల సదస్సు
ఎస్కేయూ : వర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్ల సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు సీడీసీ డీన్ కే. లక్ష్మిదేవి తెలిపారు. ఎలక్ట్రానికల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఎగ్జామినేషన్స్ పేపర్ ( ఈడీఈపీ) విధానం అమలు చేసే విధానంపై అవగాహన కల్పిస్తామన్నారు. -
రేపు కర్నూలులో జాబ్ మేళా
కర్నూలు సిటీ: స్థానిక బిక్యాంపులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో ఆదివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అయేషాఖాతూన్, జేకేసీ సెంటర్ కో–ఆర్డినేటర్ డా.ఎం.శారదలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. డిగ్రీ విద్యార్హత (బీటెక్, ఎంబీఏ మినహా), 26 సంవత్సరాల వయస్సు ఉండి, ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు తమ బయోడెటాతో పాటు, ఆధార్ కార్డుతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని వారు పేర్కొన్నారు. -
బోధన వద్దు.. జీతం ముద్దు
► విధులు నిర్వర్తించకుండానే వేతనం ► ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో చోద్యం ► రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేక గాడి తప్పిన నిర్వహణ ►విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు ఆదిలాబాద్ టౌన్ : సమాజంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉన్న గౌరవం మరొకరికి లేదు. విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన కొందరు లెక్చరర్లు ఆ వృత్తికే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. వేలాది రూపాయలు వేతంగా పొందుతూ ఆ వృత్తికి న్యాయం చేయకపోతున్నారు. సర్కారు కళాశాలల్లో చేరేది పేద విద్యార్థులు. వారికి నాణ్యమైన విద్యనందించి ఉన్నత స్థితిలో నిలపాల్సిన లెక్చరర్లు కొందరు కళాశాలకు రాకుండా డుమ్మా లెక్చరర్లుగా మారారు. జీతం మాత్రం తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ వ్యవహారం కొన్నేళ్లుగా సాగుతోంది. కళాశాలలో కొన్నేళ్లుగా పాఠాలు చెప్పని లెక్చరర్లు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. సైన్స గ్రూప్ విద్యార్థులకు బోధించే ఓ పార్ట్‌టైం లెక్చరర్ 1995 సంవత్సరం నుంచి కళాశాలలో పని చేస్తున్నాడు. కానీ ఏనాడూ విద్యార్థులకు పాఠాలు చెప్పిన దాఖలాలు లేవు. సదరు అధ్యాపకుడు తనకు నచ్చినప్పుడు వచ్చి హాజరు పట్టికలో దర్జాగా సంతకం చేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. సైన్స విద్యార్థులు సైతం లెక్చరర్‌ను గుర్తుపట్టకపోవడం ఆయన పనితీరుకు నిదర్శనం. ఆయనతోపాటు కళాశాలలో పని చేసే మరో ఇద్దరు కాంట్రాక్టు లెక్చరర్లు కూడా సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ప్రైవేటు సంఘాల్లో తిరుగుతూ కాలం వెళ్లదీస్తున్నారు. కానీ వేతనం మాత్రం పొందుతున్నారు. నిబంధనల ప్రకారం రెగ్యులర్ లెక్చరర్లతోపాటు కాంట్రాక్టు లెక్చరర్లు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు కళాశాలలోనే ఉండాలి. కానీ మధ్యాహ్నం దాటితే సగం మంది లెక్చరర్లు కళాశాలలో కనిపించరు. లెక్చరర్లు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు చేసేదేమీ లేక ఇంటిముఖం పడుతున్నారు. గాడితప్పిన నిర్వహణ.. కొన్నేళ్లుగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కొందరు లెక్చరర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కళాశాలకు వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించడం లేదనే ఆరోపణలూ ఉన్నారుు. జిల్లాలోనే పెద్ద డిగ్రీ కళాశాల. ఇందులో దాదాపు 1500 మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 32 మంది రెగ్యులర్ లెక్చరర్లు, ఏడుగురు కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్నారు. సైన్స గ్రూప్ తరగతులు ఓ మాదిరిగా జరుగుతుండగా.. ఆర్ట్స గ్రూప్ తరగతులు నామమాత్రంగా సాగుతున్నారుు. కళాశాలకు వచ్చిన విద్యార్థులు ఆవరణలోని చెట్ల కింద కాలక్షేపం చేస్తున్నారు. కళాశాలలో కొంతమంది లెక్చరర్లు, ప్రిన్సిపాల్‌కు మధ్య విబేధాలున్నాయని సమాచారం. లెక్చరర్ల బాహాబాహీ..! విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఇద్దరు లెక్చరర్లు కళాశాలలో బాహాబాహీకి దిగినట్లు తెలిసింది. సైన్స విభాగానికి చెందిన ఇద్దరు లెక్చరర్లు మూడు రోజుల క్రితం విద్యార్థుల సమక్షంలోనే గొడవ పడ్డట్లు తెలిసింది. వీరి పంచారుుతీ పోలీసుస్టేషన్ వరకు వెళ్లి ఒకరిపై ఒకరు కేసులు కూడా నమోదు చేసుకున్నట్లు సమాచారం. విధులకు సరిగా హాజరు కానీ లెక్చరర్లలపై, కళాశాలలో నిర్వహణ తీరుపై ఉన్నత విద్యాశాఖ కమిషనర్ రాజీవ్ ఆచార్యకు కళాశాల విద్యార్థులు, కొంతమంది లెక్చరర్లు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ విచారణ చేపట్టాలని కళాశాల ప్రిన్సిపాల్ అశోక్‌కు ఆదేశాలు జారీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ కాకుండా వేరే వారిని విచారణ అధికారిగా నియమించాలని కొందరు లెక్చరర్లు కోరుతున్నారు. విచారణ చేపడుతున్నాం.. కళాశాలకు ఒక పార్ట్ టైం లెక్చరర్ విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఫిర్యాదు వెళ్లడంతో విచారణ చేపట్టాలని ఆదేశాలు వచ్చారుు. కళాశాలలో విచారణ జరిపి నివేదికను కమిషనర్‌కు సమర్పిస్తాం. కళాశాలలో ఇద్దరు లెక్చరర్ల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. - అశోక్, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ -
బాబు శంకుస్థాపన శిలాఫలకానికే పరిమితం...
సీఎం చేతుల మీదుగా మేలో జగ్గంపేట డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన ఐదునెలలు గడిచినా ప్రారంభం కాని పనులు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి అనుమానమే మోడల్ డిగ్రీ కళాశాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు మేనెలలో ఆవిష్కరించిన శిలాఫలకం జగ్గంపేట : మోడల్ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునాదిరాయి వేసి ఐదు నెలలు దాటుతున్నా పనులు మాత్రం ముందుకుసాగడం లేదు. జగ్గంపేట డిగ్రీ కళాశాల మెట్ట ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం. కాంగ్రెస్ పార్టీ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జగ్గంపేటకు డిగ్రీ కళాశాలను మంజూరు చేశారు. అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత ఎంపీ తోట నరసింహం డిగ్రీ కళాశాల తరగతులను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. చాలీచాలని గదుల్లో ఒకపూట ఇంటర్మీడియేట్, ఇంకోపూట డిగ్రీ తరగతులను నిర్వహిస్తున్నారు. సొంత భవనం కోసం అప్పట్లో తోట నరసింహం చేసిన ప్రయత్నాలు ఫలించడంతో రూ.12కోట్ల నిధులు మంజూరయ్యాయి. మోడల్ డిగ్రీ కళాశాలగా ఈ నిధులతో తీర్చిదిద్దాల్సి ఉంది. అయితే స్థలం లేకపోవడంతో గ్రామానికి సంబంధం లేనిచోట జె.కొత్తూరుకు సమీపంలో జటాద్రి కొండను ఆనుకుని కళాశాల భవన నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి తోట నరసింహం శంకుస్థాపన చేయించారు. అక్కడ భవనాలు అలంకారప్రాయమవుతాయని జగ్గంపేటను ఆనుకునే నిర్మాణాలు చేపడితే బాగుంటుందనే అభిప్రాయాలను మెజార్టీ ప్రజలు వ్యక్తం చేశారు. గత సార్వత్రిక ఎన్నికలు అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన జ్యోతుల నెహ్రూ జటాద్రి కొండ వద్ద డిగ్రీ కళాశాల పనులకు అడ్డు చెప్పారు. జగ్గంపేటలో విస్తరించి ఉన్న పోలవరం కాలువకు సేకరించిన ఉన్న స్థలంలో నిర్మాణాన్ని చేపట్టాలని పట్టుబట్టారు. ఆయన పట్టుదల నెరవేరింది. గ్రామ శివారున గోకవరం రోడ్డులో పోలవరం కాలువ మట్టినిల్వకు సేకరించిన సుమారు 10 ఎకరాల్లో మే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికి ఐదు నెలలు గడిచినా పనులు ఇంకా ప్రారంభించలేదు. స్థలంలో ఉన్న మట్టిని బయటకు పంపితేగాని పనులు ప్రారంభించే అవకాశం లేదు. నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో వచ్చే విద్యాసంవత్సరం నాటికి తరగతి గదులు అందుబాటులోకి వచ్చే అవకాశంలేదని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా పోలవరానికి సేకరించిన స్థలంలో డిగ్రీ కళాశాల నిర్మాణాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేపట్టమే కాకుండా అధికారులకు ఫిర్యాదులు చేశారు. సాధ్యమైనంత త్వరంలో డిగ్రీ కళాశాల భవనాలను నిర్మించి విద్యార్థులకు ఇరుకు గదుల సమస్యలనుంచి తప్పించాలని జనం కోరుకుంటున్నారు. -
24న కర్నూలులో జాబ్ మేళా
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : బీక్యాంపు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలో ఈ నెల 24వ తేదీన మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అయేషాఖాతూన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకు సేల్స్ ఆఫీసర్ల కోసం డిగ్రీ పాసై 26 ఏళ్లలోపు వారు అర్హులని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయోడేటా, ఆధార్‌కార్డుతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ఆమె సూచించారు. మరిన్ని వివరాల కోసం 9866078677ను సంప్రదించాలని ఆమె కోరారు. -
డిగ్రీ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్ల రెన్యూవల్‌కు ఉత్తర్వులు
విద్యారణ్యపురి : తెలంగాణ రాష్ట్రంలోని ఐదు, ఆరో జోన్ల పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను రెన్యూవల్ చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ఈమేరకు హన్మకొండలోని ఉన్నతవిద్య ఆర్జేడీ డాక్టర్ బి.దర్జన్‌కు ఉత్తర్వులు అందాయి. ఆయా జోన్లలో మెుత్తం 860 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వివిధ సబ్జెక్టులలో గత విద్యా సంవత్సరంలో బోధన చేసి ఈ విద్యాసంవత్సరంలో కొనసాగుతున్న కాంట్రాక్టు లెక్చరర్లు తమ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభు త్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, జేసీ, కళాశాల ప్రిన్సిపాల్లతో కూడిన కమిటీ ఆయా దరఖాస్తులను పరిశీలించి రెన్యూవల్ చేస్తుందని అందులో ప్రస్తావించారు. గత విద్యా సంవత్సరంలో పనిచేసి ఇప్పుడు డిస్టర్బ్ అయిన అధ్యాపకులకు సంబంధించిన దరఖాస్తులను ప్రిన్సిపాల్స్ ఉన్నత విద్య ఆర్జేడీ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. ఆయా దరఖాస్తులలో వివిధ సబ్జెక్టులలో ఎక్కడైనా జిల్లాల్లో ఖాళీగా ఉంటే అక్కడికి వారిని నియమించే అవకాశాలు ఉంటాయి. -
విద్యార్థి ఆత్మహత్య
హసన్‌పర్తి : డిగ్రీ పాస్ కానేమోనని ఆందోళనకు గురైన ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని 54వ డివిజన్ దేవన్నపేటలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దేవన్నపేటకు చెందిన కందకట్ల రాకేష్ (22) నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదివాడు. అయితే ఫైనల్æఇయర్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మళ్లీ పరీక్ష కోసం ఫీజు కట్టాడు. కాగా, త్వరలో రాసే పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయం పట్టుకుంది. ఈ క్రమంలో మంగళవారం కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లగా రాకేష్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. -
26 డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు నిల్
l కేయూ పరిధిలోని కాలేజీల్లో 67 శాతం సీట్లు ఖాళీ l రెండు దశల్లో ప్రవేశాలు పొందింది 43,401 మంది విద్యార్థులే l 27 నుంచి మూడో దశ అడ్మిషన్లు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం 67 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. మెుత్తం 305 డిగ్రీ కళాశాలల్లో 1,28,080 సీట్లు ఉన్నాయి. రెండు దశల్లో 43,401 మం ది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. 33 శా తం సీట్లే భర్తీ అయ్యాయి. 26 డిగ్రీ కళాశాలల్లో ఒక్క వి ద్యార్థి కూడా చేరలేదు. మరో 8 కళాశాలల్లో పది మంది లోపు విద్యార్థులే ప్రవేశాలు పొందారు. కొన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో స్వల్పంగానే ప్రవేశాలు.. హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో 1130 సీట్లకు 584 మంది ప్రవేశాలు పొందారు. పింగిళి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1000 సీట్లకు 441 మంది, మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 425 సీట్లకు 165 సీట్లు భర్తీఅయ్యాయి. మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220కి 28 మంది విద్యార్థులు, ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 280కి 95 మంది ,నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 600కు 127 మంది, పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 160కి 27 మంది, రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220కి 31 మంది, తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220కి 32మంది, వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 440కి 15 మంది, భూపాలపల్లి ప్రభుత్వడి గ్రీకళాశాలలో 220కి ఏడుగురు, చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 280కి 59 మంది, ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 640కి 162 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. నగరంలోని ఎల్బీ డిగ్రీ కళాశాలలో 860కి 582 మంది, సీకేఎం డిగ్రీ కళాశాలలో 780 సీట్లకు 373 మంది, హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 910 సీట్లకు 566 మంది విద్యార్థులు చేరారు. మడికొండలోని రెసిడెన్షియల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 240 సీట్లు ఉంటే కేవలం 36 మంది విద్యార్థినులే చేరారు. ఆన్‌లైన్‌పై అవగాహన లేకనే.. డిగ్రీ కళాశాలల్లో చాలా సీట్లు మిగిలిపోవడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఎంసెట్ ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాల్లో ప్రవేశాలు పూర్తికాకపోవడం లాంటి సమస్యలున్నాయి. ఆయా కోర్సుల ప్రవేశాల ప్రక్రియ పూర్తియితే మూడో దశలో కొంతమేర సీట్లు భర్తీ అవుతాయని భావిస్తున్నారు. ఆ¯Œæలైన్ దరఖాస్తులపై సరైన అవగాహన లేకపోవడంతో కొంతమంది విద్యార్థులకు రెండు దశల్లోనూ సీట్లు రాని పరిస్థితి నెలకొంది. తక్కువగా ఆప్షన్లు, ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం వలన కూడా సీట్లు పొందలేదు. మరికొందరు పాస్వర్డ్ మరిచిపోయి రెండో దశలో వెబ్ఆప్షన్లు ఇచ్చుకోలేకపోయారు. మంచి మార్కులు వచ్చి న విద్యార్థులు కొందరు తమకు ఇష్టమైన కళాశాలను ప్రా«ధాన్యత క్రమంలో ముందుగా కాకుండా తర్వాత పేర్కొనడం వలన కూడా తమకు ఇష్టం లేని కళాశాలలో సీటు రావటంతో చేరాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఓపెన్ స్కూల్ ఇంటర్ పూర్తయినవారు తప్పనిసరిగా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్‌సైన్స్ కళాశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేయకుండా కొందరు వెబ్ఆప్షన్లు ఇచ్చారు. వారికి సీట్లు కేటాయించలేదు. ఇప్పుడు వచ్చి వెరిఫికేషన్ చేయించుకుంటున్నారు. మూడో దశ అడ్మిషన్లకు ఈనెల 27 నుంచి అవకాశం కల్పించారు. మెుదటి, రెండు దశల్లో సీట్లు రాని వారు, సీట్లు పొంది కళాశాలల్లో చేరనివారు, ప్రవేశాలు పొంది ఇష్టం లేకుంటే వేరే కళాశాలల్లో చేరాలనుకునే వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియే ఇక చివరిదని భావిస్తున్నారు. -
ప్రేమ పేరుతో వంచన
► పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడు ► ప్రియురాలిపై దాడి ► పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు ఎల్లారెడ్డిపేట : ప్రేమ పేరుతో ఓ యువకుడు ఐదేళ్లుగా ఓ యువతిని వంచిం చాడు. మోజు తీరడంతో పెళ్లికి ముఖం చాటేశాడు. దీంతో ప్రేమికుడి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినా ప్రియురాలిపై కుటుంబసభ్యులతో కలిసి దాడిచేశాడు. మోసపోయిన గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లికి చెందిన దోమకొండ ఇంద్రజ బెజ్జంకి మండలం గాగిల్లపూర్‌కు చెందిన ఎర్రోల్ల తిరుపతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 2011లో కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది. క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2011 నుంచి 2013 వరకూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఏడాదిపాటు దూరంగా ఉన్నారు. రెండున్నర ఏళ్లుగా ప్రేమ పేరుతో తిరుపతి మళ్లీ ఇంద్రజ వెంటపడ్డాడు. అతడిని నమ్మిన యువతి దగ్గరైంది. ఇటీవల పెళ్లిపేరు ఎత్తగానే జారుకున్నాడు. ఈనెల 10న తిరుపతి ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై ఇంద్రజ నిలదీసింది. దీంతో తిరుపతితోపాటు అతడి కుటుంబసభ్యులు బాలమల్లవ్వ, బాలమల్లు, కొమురయ్య, తిరుమల తీవ్రంగా కొట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం జరిగిన సంఘటనపై బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఐదుగురిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. -
డిగ్రీ ‘ఆన్లైన్’ ఆగమాగం!
ఇటు భారీగా సీట్లు.. అటు అందని అఫిలియేషన్లు * మరోవైపు కొనసాగుతున్న విజిలెన్స్ తనిఖీలు * కాలేజీ, సీటు ఎంచుకున్నాక అఫిలియేషన్ రాకపోతే పరిస్థితేమిటి? * ఆందోళనలో విద్యార్థులు.. స్పష్టత ఇవ్వని ఉన్నత విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల పరిస్థితి గందరగోళంగా తయారైంది. అటు ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది.. ఇటు డిగ్రీ కాలేజీల అనుబంధ గుర్తింపు రెన్యువల్ ప్రక్రియ పూర్తి కాలేదు. మరోవైపు విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తనిఖీలు పూర్తయ్యాక ఆ నివేదికల ఆధారంగా రాష్ట్రంలో ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉంటాయి, ఎన్ని కాలేజీల్లో ఎన్ని కోర్సులు, ఎన్ని సీట్లు ఉంటాయి, ఎన్ని రద్దవుతాయన్నది తేలనుంది. అయితే విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం వెబ్ ఆప్షన్ల ద్వారా కాలేజీలను, కోర్సులను ఎంచుకుంటున్నారు. త్వరలోనే సీట్లను కేటాయించేందుకు ఉన్నత విద్యాశాఖ సిద్ధమవుతోంది. మరి విద్యార్థులు ఎంచుకున్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాకపోతే పరిస్థితి ఏమిటి, విజిలెన్స్ తనిఖీల్లో లోపాలు బయటపడి ఆయా కాలేజీలు లేదా విద్యార్థులు ఎంచుకున్న కోర్సులు రద్దయితే ఎలాగన్న దానిపై అస్పష్టత నెలకొంది. దీంతో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోతున్నారు. యూనివర్సిటీ తప్పిదాలు మరిన్ని.. మరోవైపు యూనివర్సిటీలు కూడా డిగ్రీ సీట్ల విషయంలో తప్పిదానికి పాల్పడ్డాయి. కాలేజీల్లో పరిమితికి మించిన సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉన్నట్లు వెబ్సైట్లో (వెబ్ ఆప్షన్ల కోసం) అప్లోడ్ చేశాయి. నిబంధనల ప్రకారం ప్రతి కాలేజీలో ఒక్కో సెక్షన్‌కు ఆర్ట్స్, కామర్స్ గ్రూపులైతే 60 సీట్లు, సైన్స్ గ్రూపులైతే 50 సీట్లకు అనుమతివ్వాలి. అవసరమైతే మరో అదనపు సెక్షన్‌కు అనుమతించాలి. అంటే రెండు సెక్షన్లు కలిపి ఆర్ట్స్, కామర్స్ గ్రూపుల్లో 120 సీట్లకు, సైన్స్ గ్రూపుల్లో 100 సీట్లకు మించి ఉండరాదు. కానీ అనేక కాలేజీల్లో ఒక్కో గ్రూపులో 150 సీట్ల నుంచి 450 సీట్ల వరకు ఉన్నట్లు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. కాలేజీలు ఇచ్చిన సమాచారాన్ని యథాతథంగా యూనివర్సిటీలు అప్లోడ్ చేశాయే తప్ప.. నిబంధనలను పట్టించుకోలేదు. ఇలా ఇష్టారాజ్యంగా సీట్ల సంఖ్యను వెబ్సైట్లో ఎలా పెట్టారంటూ యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి లేఖలు కూడా రాసింది. దీంతో మరింత గందరగోళం నెలకొంది. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో సీట్లున్నాయనే ఆలోచనతో టాప్ కాలేజీల్లో చేరేందుకు ఆప్షన్లు ఇచ్చే అవకాశముంది. మరి ఆ సీట్లు లేవని తేలితే ఎలాగన్న ది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీట్ల కేటాయింపును వాయిదా వేస్తే మంచిదని ఉన్నత విద్యాశాఖ వర్గాలు పేర్కొం టున్నాయి. కాలేజీల గుర్తింపు, సీట్ల సంఖ్య తేలాక.. మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించి సీట్లు కేటాయించాలని చెబుతున్నా యి. లేకపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ముందుకెళుతున్న విద్యాశాఖ ఉన్నత విద్యా శాఖ ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను కొనసాగిస్తోంది. కాలేజీలకు అనుమతుల ప్రక్రియ పూర్తి కాకుండానే, వాటిల్లో సీట్ల లెక్క తేలకుండానే... గతేడాది లెక్కలను తీసుకుని కాలేజీలు, సీట్ల వివరాలను ఆన్లై న్లో అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా 1,103 డిగ్రీ కాలేజీల్లో 3,94,575 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. దీంతో విద్యార్థులు ఆయా కాలేజీలు, సీట్లలో చేరేందుకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకుంటున్నారు. ఇక త్వరలోనే సీట్లను కూడా కేటాయించేందుకు ఉన్నత విద్యాశాఖ సిద్ధమవుతోంది. అయితే కాలేజీలకు అఫిలియేషన్లు పూర్తికాకపోవడం, విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతుండడంతో... ఏవైనా కాలేజీలు, సీట్లు రద్దయితే వాటిని ఎంచుకున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటన్నది అర్థం కాక అధికారులే తల పట్టుకుంటున్నారు. లోపాలు వెల్లడైనా కాలేజీలపై చర్యలు చేపట్టకుండా వదిలేస్తారా, విద్యార్థులను వేరే కాలేజీల్లోకి మార్చుతారా అన్నది తేలాల్సి ఉంది. -
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించారు. ఇటీవల ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారంతో ముగియగా.. పొడిగించినట్లు కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు తమ దరఖాస్తులను జాగ్రత్తగా అప్లోడ్ చేయూలని, సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు. అంతేకాకుండా ఏ కాలేజీ బాధ్యులకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 17,845 దరఖాస్తులే కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్లైన్లో ఇప్పటి వరకు 17,845 దరఖాస్తులే వచ్చాయి. మొత్తం 21,633 మంది విద్యార్థులు రూ.100 చొప్పున ఫీజు చెల్లించినా అందరూ దరఖాస్తు చేసుకోలేదు. మూడు జిల్లాల్లోని కళాశాలల్లో ఒక లక్ష 25వేల వరకు సీట్లు ఉన్నాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ ముగిసి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైతే దరఖాస్తుల సంఖ్య పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
నేటి నుంచి ఆర్యూ పీజీసెట్
► పదిరోజుల్లో ఫలితాలు ► జూన్ మొదటి వారంలో కౌన్సెలింగ్ ► కన్వీనర్ ప్రొఫెసర్ సంజీవరావు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రాయలసీమ యూనివర్సిటీ పీజీసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలను నేటి నుంచి నాలుగురోజులపాటు పకడ్బందీగా నిర్వహిస్తామని పీజీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సంజీవరావు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 19, 20, 21, 22 తేదీల్లో కర్నూలు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, నంద్యాల పీఎస్సీ అండ్ కేవీఎస్సీ కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 10.30 వరకు, 11.30 నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు మూడు సెషన్లలో పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష సమయానికి రాకుంటే అనుమతించబోమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని గంట ముందుగానే ఆయా కేంద్రాలకు చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ కాకపోతే పరీక్షకు రెండు గంటల ముందు కేంద్రం సూపరిటెండెంట్‌కు గుర్తింపు కార్డు, ఇతర ఆధారాలు చూపి తీసుకోవచ్చన్నారు. పరీక్ష హాలులోకి ఎలక్ట్రానిక్స్ వస్తువులు, సెల్ఫోన్లు అనుమతించబోమని తెలిపారు. పది రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామని చెప్పిన ఆయన జూన్ మొదటి వారంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
మేం డిగ్రీ స్పాట్ చేయం..
శ్రీకాకుళం న్యూకాలనీ: తమ సమస్యలను పరిష్కరించకపోతే డిగ్రీ మూల్యాంకనం (స్పాట్ వాల్యూషన్) చేయబోమని డిగ్రీ కళాశాలల లెక్చరర్లు తేల్చిచెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివ ర్సిటీ పరిధిలోని శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్)కళాశాలతోపాటు మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం స్పాట్ వాల్యూషన్ గురువారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఉదయం నిర్ణీత సమయానికి స్పాట్ కేంద్రాలకు చేరుకున్న అధ్యాపకులు గతంలో తాము చేసిన డిమాండ్ల సంగతి ఏమైం దని సంబంధిత క్యాంప్ ఆఫీసర్లను నిలదీశారు. యూనివర్సిటీ నుంచి ఎలాంటి లిఖిత పూర్వకమైన ఆదేశాలు లేకపోవడం, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో వారంతా మూల్యాంకనా న్ని బహిష్కరించారు. తమ డిమాండ్లను పరిష్కరించి, న్యాయం చేయాలని కోరుతూ వారంతా ప్రిన్సిపాల్ డాక్టర్ బాబూరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో నిరసన తెలియజేశారు. 40 పేపర్ద దిద్దుబాటుపై మండిపాటు.. పదో తరగతిలోగాని, ఇంటర్మీడియెట్లోగాని రోజుకు 30 పేపర్లు దాటి దిద్దుబాటు లేదని, అలాంటిది డిగ్రీ పేపర్లు మాత్రం 40 వరకు మూల్యాంకనం చేయాల్సి వస్తోందని మండిపడ్డారు. ప్రతి ఏడాది ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచుతున్న వర్సిటీ అధికారులు తమ రెమ్యూనిరేషన్, డీఏలను పెంచడంలో మాత్రం వివక్ష చూపుతున్నారని అన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు డీఏ పెంచుతామని, ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు పెంచమని సూచనప్రాయంగా తెలియజేయడంతో వారంతా భగ్గుమన్నారు. -
మంచిర్యాలలో న్యాక్ బృందం
మంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని డిగ్రీ కళాశాలను న్యాక్ బృందం బుధవారం ఉదయం సందర్శించింది. కళాశాలలో వసతులు, సమస్యలు, అధ్యాపక బృందం, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను న్యాక్ అధికారులు సేకరించారు. తరగతి గదులు, ల్యాబ్‌లను పరిశీలించిన అధికారులు ప్రిన్సిపల్‌తో చర్చలు జరుపుతున్నారు. ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచేందుకు న్యాక్ కృషి చేస్తుంది. ఈ సంస్థ సిఫారసుల ఆధారంగా యూజీసీ కళాశాలలకు గ్రాంట్ మంజూరు చేస్తుంది. -
అలరించిన ప్రెషర్స్‌డే వేడుకలు
-
డిగ్రీలోనూ సెమిస్టర్ పరీక్షలు
యూనివర్సిటీ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లోని కోర్సులకు ఆధునిక హంగులతో సరి కొత్త విధానాలను రూపొందించనున్నారు. సాంప్రదాయ కోర్సులకు విద్యా సంవత్సరం ముగింపున రాత, ప్రాక్టికల్ పరీక్షల ద్వారా ప్రతిభను గుర్తించేవారు. ఇక నుంచి ఈ విధానాలకు స్వస్తి పలికి సెమిస్టర్ విధానాన్ని అమలుపరచనున్నారు. 2015-16 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయడానికి సీడీసీ (కళాశాల అభివృద్ధి కమిటీ) కసరత్తు చేస్తోంది. బుధవారం ఎస్కేయూలోని సీడీసీ కార్యాలయంలో జరిగిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల సమావేశాన్ని సీడీసీ డీన్ ఆచార్య ఎంసీఎస్ శుభ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ , రాష్ర్ట ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు రాష్ర్ట వ్యాప్తంగా డిగ్రీ కోర్సులలో నూతన విధానాన్ని అవలంబించనున్నారు. నిన్న ఎస్వీ యూనివర్సిటీలో 13 జిల్లాలోని విశ్వవిద్యాలయాల సీడీసీ డీన్ల సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గ్రేడింగ్‌తో పాటు మార్కులు : నూతన సెమిస్టర్ విధానం 2015-16 విద్యా సంవత్సరంలో మెదటి సంవత్సరం విద్యార్థులకు వర్తిస్తుంది. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు కేటాయిస్తారు. 75 మార్కులు రాత పరీక్షలు, 25 మార్కులు సైన్స్ వారికి ప్రాక్టికల్స్ . ఆర్ట్స్ వారికి 25 మార్కులు ఇంటర్నల్ మార్కులు కేటాయించారు. మాదిరి ప్రశ్నాపత్రాలు కూడా ఎస్కేయూలో జరిగిన సమావేశంలో ఆమోదించారు. సిలబస్ రూపకల్పన పూర్తి అయింది. సెమిస్టర్ విధానానికి తగ్గట్టుగా రూపొందించారు. సైన్స్ సబ్జెక్టులలో కొన్ని ఎస్వీ యూనివర్సిటీకి అప్పగించారు. ఆంత్రోపాలజీ, జియాగ్రఫి, జియాలజీ వంటి సబ్జెక్టుల సిలబస్ రూపకల్పన చేయనున్నారు. కార్యక్రమంలో యూజీ డీన్ ఆచార్య ఎ.మల్లి ఖార్జున రెడ్డి, జువాలజీ బీఓఎస్ చైర్మన్ నాగలింగ రెడ్డి, జ్ఞానేశ్వర్ ,బోజప్ప తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఏయూలో రెండు డిగ్రీ పరీక్షలు రద్దు
శ్రీకాకుళం(ఎచ్చెర్ల): శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రెండు సబ్జెక్టుల పరీక్షలను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 27న డిగ్రీ రెండో ఏడాది ఫిజిక్స్ పరీక్షను ఇదే కారణంతో రద్దు చేసిన సంగతి విదితమే. ప్రశ్నపత్రం లీకేజీపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రశ్నపత్రం కూడా లీకైనట్లు ప్రచారం జరగడంతో సోమవారం ఉదయం జరగాల్సిన ఫిజిక్స్ తొలి ఏడాది పరీక్ష రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్ వి. కృష్ణమోహన్ ఆదివారం రాత్రి ప్రకటించారు. ఇదే కారణంతో మధ్యాహ్నం జరగాల్సిన డిగ్రీ రెండో ఏడాది కెమిస్ట్రీ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా వర్సిటీ పరిధిలో ఇలా మూడు డిగ్రీ పరీక్షలు రద్దవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రశ్నించిన పాపానికి.. ప్రాణం తీశాడు!
-
సాక్షి పుణ్యమా అని...
శుక్రవారం... సెప్టెంబర్ 5... టీచర్స్‌డే... ఉదయం ఎనిమిదన్నరకు బ్రహ్మానందం నుంచి ఫోన్ కాల్. ‘‘ఈ రోజు ‘సాక్షి’లో వచ్చిన ‘గురు బ్రహ్మి’ ఆర్టికల్ ఎక్స్లెంట్... నాకు చెప్పకుండా నా శిష్యుల ఇంటర్వ్యూలు చేసి నన్ను భలే సర్ప్రైజ్ చేశారే’’ అని ఆనందం వెలిబుచ్చారు బ్రహ్మానందం. మళ్లీ వెంటనే ఆయన ‘‘ఉదయం నుంచి ఫోన్ల మీద ఫోన్లు. నా శిష్యులు చాలా మంది మాట్లాడారు. మీ ‘సాక్షి’ పుణ్యమా అని 35 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయాను’’ అన్నారు. పత్రికల్లో వచ్చే తన ఇంటర్వ్యూలకు ఎప్పుడూ పెద్దగా స్పందించనట్టు కనపడే బ్రహ్మానందం ఈ ‘గురు బ్రహ్మి’ ఆర్టికల్ విషయంలో ఉద్వేగానికి గురయ్యారని అర్థమైంది. కట్ చేస్తే... ఆయన దగ్గర వాలిపోయాం. మళ్లీ ఆ ఆర్టికల్‌ను చూస్తూ ‘‘నేను పనిచేసిన డిగ్రీ కాలేజ్ ఫొటో, స్టాఫ్‌తో నేను దిగిన స్టిల్స్ చూస్తుంటే... నా మనసు ఆ రోజుల్లోకి వెళ్లిపోయింది’’ అన్నారు బ్రహ్మానందం. ఈలోగా ఆయన ఫోన్ మోగింది. మళ్లీ మరో అభినందన కాల్. మధ్య మధ్య అలా ఫోన్లు మాట్లాడుతూనే ‘సాక్షి’తో లెక్చరర్‌గా తన అనుభవాలను నెమరు వేసుకుంటూ... అనేక విషయాలు ముచ్చటించారు. కాలేజ్‌లో స్టూడెంట్స్‌ని మీరు బాగా డీల్ చేసేవారని మీ శిష్యులే చెప్పారు. ఆ టెక్నిక్ మీకు ఎలా అలవడింది? అది టెక్నిక్ అని నేననుకోవడం లేదు. మొదటి నుంచీ మనుషుల్ని బాగా డీల్ చేసే వరమేదో దేవుడు నాకిచ్చినట్టున్నాడు. అంతకుమించి నా వైపు ప్రిపరేషనేమీ లేదు. మామూలుగా హైస్కూలు స్టూడెంట్స్ అంటే చిన్నవాళ్లు కాబట్టి, దండించి అయినా దారిలోకి తీసుకురావచ్చు. ఇక్కడేమో డిగ్రీ స్టూడెంట్స్. టీనేజ్ దాటిపోయి ఉంటారు కాబట్టి, చెప్పిన మాట అస్సలు వినరు. కానీ మనదైన శైలిలో దారిలోకి తెచ్చుకోవాల్సిందే. మీ దగ్గర అలా తోక జాడించిన విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? ఎందుకుండరండీ... ఉంటారు. ఇట్స్ నేచురల్. ఒకసారి నేను క్లాస్ చెబుతుంటే, ఓ తుంటరి ‘‘సార్... టైమైపోయింది’’ అని అరిచాడు. నేను వెంటనే ‘‘అప్పుడే నీకు టైమ్ అయిపోవడమేంటి? నీకు చాలా భవిష్యత్తు ఉందే’’ అన్నాను. దాంతో అమ్మాయిలంతా ఘొల్లుమని నవ్వారు. అతనికి అవమానమనిపించి ‘‘నాకు కాదు సార్... బెల్ కొట్టడానికి టైమైపోయింది’’ అన్నాడు. నేను వెంటనే దానికి కౌంటర్ ఇస్తూ, ‘‘బెల్ కొట్టడానికి ఓ మనిషి ఉన్నాడుగా... నీకెందుకు కంగారు’’ అన్నాను. అంతే! ఇక మళ్లీ అతను నోరెత్తితే ఒట్టు. ఇలా సీరియస్ వేలో కాకుండా, నవ్వుతూనే చురకలంటించేవాణ్ణన్నమాట. అందుకే నా దగ్గర వాళ్లు జాగ్రత్తగా ఉండేవారు. అదే పద్ధతి సినిమా ఇండస్ట్రీలో కూడా అనుసరిస్తున్నాట్టున్నారు? తప్పదు మరి. వెంకటేశ్వరస్వామి గుడికెళ్లి ‘ఓం నమఃశివాయ’ అంటే దేవుడికి కోపం వస్తుంది కదా! ఎక్కడ చదవాల్సిన మంత్రాలు అక్కడే చదవాలి. అయినా నేనెప్పుడూ నా హద్దుల్లో నేనుంటాను. మిగతావాళ్లను కూడా హద్దులు దాటనివ్వను. ఆ సూత్రం తెలిస్తే అందరికీ హాయి. సార్! మళ్లీ మీ లెక్చరర్ రోజుల్లోకి వెళ్దాం. మీరు లేడీస్ హాస్టల్ వార్డెన్‌గా కూడా చేశారట? అవును. మా డిగ్రీ కాలేజ్‌లోనే లేడీస్ హాస్టల్ ఉంది. వాళ్ల స్కాలర్‌షిప్‌ల వ్యవహారాలతో పాటు ఎలాంటి భోజనం పెట్టాలి లాంటి అంశాలన్నీ వార్డెన్ చూసుకోవాలి. ఈ బాధ్యతలను ఒక్కోసారి ఒక్కో లెక్చరర్ చూసుకోవాలి. అలా నేను కొన్నాళ్లు వార్డెన్‌గా చేశా. అలాగే ఎన్ఎస్ఎస్ ఆఫీసర్‌గా కూడా చేశా. అప్పట్లో మీ బెస్ట్ స్టూడెంట్ ఎవరు? అలా జడ్జ్ చేయడం కష్టం. బాగా చదివేవాడికి బిహేవియర్ కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. బిహేవియర్ బాగున్నవాడు చదువులో రాణించకపోవచ్చు. మీరు మిమిక్రీ బాగా చేసేవారట కదా? అప్పట్లో ప్రముఖుల ముందు ఎప్పుడైనా చేశారా? పేర్లు గుర్తుకు రావడం లేదు. సాహితీవేత్త పురిపండా అప్పలస్వామి... ఇలా చాలామంది ఉన్నారు. జంధ్యాల గారు నా మిమిక్రీ టాలెంట్ చూసే కదా, నాకు సినిమా చాన్స్ ఇచ్చారు. రాత్రి ఎనిమిది గంటలకు మొదలుపెడితే, తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ ఆయన ముందు మిమిక్రీ చేశా. మీ స్కూల్ వైస్ ప్రెసిడెంట్‌ను కూడా అనుకరించేవారట! అదంతా సరదా కోసమే. ఆ మాత్రం సరదా లేకపోతే ఊరు కాని ఊళ్లో మనల్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి! మీ శిష్యులంతా మీకన్నా పెద్దవాళ్లలా కనిపిస్తున్నారు. మీరేమో ఇంకా...? అర్థమైంది మీ ప్రశ్న. ఇంత వయసు వచ్చినా నా ముఖంపై ముడతలు రాలేదేంటని ఈ మధ్యనే ఒకరడిగారు. దానికి నా సమాధానం ఒకటే. మనసులో మడతలు లేకపోతే, ముఖాన ముడతలు రావు. మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు మన ముఖం ఎలా ఉంటుందో, చెడ్డ ఆలోచనలతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకుంటే మనకే ఆ రహస్యం తెలిసిపోతుంది. ఓ మహానుభావుడు ఏం చెప్పాడంటే... "God is always ready with the camera. That's your responsibility to give him a good pose". మీరు రామాయణ, భారత, భాగవతాలు బాగా చదువుకున్నట్టున్నారు? చదువుకోవాలి కదండీ! వాటిపై నాకెంత పట్టు ఉందో, నాకు నేనుగా చెప్పుకోకూడదు. భాగవతం మీద కొన్ని గంటలు మాట్లాడగలను. అసలు మన దగ్గరున్న సాహితీ సంపద ఇంకెవరి దగ్గర ఉంది చెప్పండి! పోతన భాగవతంలోని ‘ఎవ్వనిచే జనియించు’ పద్యం ఒకసారి చదవండి. దీనిముందు ఓషో ఫిలాసఫీ లాంటివి ఎక్కడ నిలుస్తాయి! గురువుగా మీ ప్రత్యేక ముద్ర ఏంటి? నేను చాలా యాక్టివ్‌గా, జోవియల్‌గా ఉంటాను. నా చుట్టుపక్కల వాతావరణం డల్‌గా ఉంటే నాకస్సలు నచ్చదు. మనం యాక్టివ్‌గా ఉంటే, మన లైఫ్ కూడా యాక్టివ్గానే ఉంటుంది. ఇందిరాగాంధీ వాకింగ్ స్టయిల్ ఎప్పుడైనా చూశారా? అంత ఎనర్జీ ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో కూడా మిమ్మల్ని గురువుగా భావించేవాళ్లు ఉన్నారు. వాళ్లను మీరెలా గైడ్ చేస్తుంటారు? ఇక్కడ గైడ్లు, క్లాస్‌లూ అంటూ ఏమీ ఉండవు. మనసు విప్పి మాట్లాడుకుంటే అన్నీ తెలుస్తుంటాయ్. అన్ని సమస్యలూ పరిష్కారం అవుతుంటాయ్. అప్పుడప్పుడూ సరదాగా పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ లాంటివాళ్లు నా దగ్గరకు వస్తుంటారు. నేనేమీ వాళ్లకు గురువును కాదే! ఇది సత్సంగం లాంటిది. ఒక అంశం మీద గంటలు గంటలు మాట్లాడుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఒకసారి వాళ్లిద్దరూ ఉదయం 9 గంటలకు మా ఇంటికొచ్చి, సాయంత్రం 5 గంటల వరకు ఉన్నారు. ముగ్గురం అంతసేపూ మాట్లాడుకుంటూనే ఉన్నాం. రకరకాల టాపిక్స్ మా మధ్య నడిచాయి. అన్నట్లు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మళ్లీ పాఠం చెబుదామనిపించిందా? ఒకవేళ అనిపించినా, చెప్పలేని పరిస్థితి నాది. ఎందుకంటే బ్రహ్మానందం కామెడీ మానేసి పద్యాలూ పాఠాలూ చెబుతున్నాడని రకరకాలుగా అనుకుంటారు. ఎందుకంత బాధ! నన్ను ఇలా ఉండనివ్వండి బాబూ..! - పులగం చిన్నారాయణ సడన్‌గా శంకర్ ఫోన్... ఓ పక్క ‘సాక్షి’తో సంభాషిస్తూనే, మరోపక్క వరుసగా వస్తున్న ఫోన్లు మాట్లాడుతున్నారు బ్రహ్మానందం. దాదాపుగా అన్నీ ‘గురు బ్రహ్మి’ ఆర్టికల్ గురించే. ఒకతనైతే ఫుల్స్టాప్, కామాలు లేకుండా ఆయనను పొగుడుతూనే ఉన్నాడు. అప్పుడు చూడాలి బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్స్. ఈ హడావిడిలో ఇంకో ఫోన్ వచ్చింది. ‘‘నేను సార్... డెరైక్టర్ శంకర్‌ని’’ అనగానే, బ్రహ్మానందానికి మొదట ఏమీ అర్థం కాలేదు. ‘ ‘ఎవరు?’’ అని మళ్లీ రెట్టించి అడిగారు. ‘‘డెరైక్టర్ శంకర్‌ని సార్... చెన్నై నుంచి మాట్లాడుతున్నా’’ అనగానే, బ్రహ్మానందానికి అర్థమైపోయింది. ‘‘శంకర్గారూ... ఎలా ఉన్నారు?’’ అని ఆప్యాయంగా అడిగారు బ్రహ్మానందం. ‘‘బావున్నాను సార్... మొన్న ‘ఆగడు’ ఆడియో ఫంక్షన్‌కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవలేకపోయాను. దూకుడు, రేసుగుర్రం సినిమాల్లో మీ కామెడీ అదిరిపోయింది. నా వైఫ్, పిల్లలకు తెలుగు తెలియదు కానీ, మీ కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఫ్యామిలీ మొత్తం మీ ఫ్యాన్స్. ‘ఆగడు’లో కూడా చేశారుగా. అది కూడా చూస్తా. మీ గురించి నిర్మాత ఏఎమ్ రత్నంగారు అప్పట్లో చాలాసార్లు చెప్పారు. త్వరలో మీతో నా సినిమాలో ఫుల్ లెంగ్త్ కేరెక్టర్ చేయించుకుంటా’’ అన్నారు శంకర్. ఇలా ఇద్దరూ చాలాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. -
వేములవాడలోని ఓ కళాశాలపై ఏబీవీపీ దాడి
- మాధ్యమం మార్పులో నిర్లక్ష్య వైఖరంటూ ఆరోపణ - పోలీసుల రంగప్రవేశంతో శాంతించిన వైనం వేములవాడ : ఇంగ్లిష్ మీడియం విద్యనభ్యసించిన తమను తెలుగు మీడియంగా పరిగణించడాన్ని నిరసిస్తూ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలోని కె.వి డిగ్రీ కళాశాల విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు మద్దతిచ్చిన ఏబీవీపీ విద్యార్థుల తరఫున యాజమాన్యాన్ని నిలదీసింది. మాటామాటా పెరిగి దాడికి దారితీసింది. 2013-14 విద్యాసంవత్సరం ఓ గ్రూప్‌లో డిగ్రీ ఫస్టియర్‌లో 43 మంది విద్యార్థులు ఆంగ్లమాధ్యమంలో అభ్యసించారు. పరీక్షల సమయంలో వీరికి తెలుగు మాధ్యమంలో ప్రశ్నపత్రాలు రావడంతో ఖంగుతిన్నారు. ఈ విషయమై యాజమాన్యాన్ని నిలదీయగా యూనివర్సిటీ అధికారుల తప్పిదంతో ప్రశ్నపత్రాలు తెలుగులో వచ్చాయని మెమోల్లో ఇంగ్లిష్ మీడియంగా వస్తుందని విద్యార్థులకు నచ్చజెప్పడంతో పరీక్షలు రాశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లోనూ తెలుగు మీడియంగా రావడంతో ఏబీవీపీ నాయకులను ఆశ్రయించారు. అంతా కలిసి కళాశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ విషయమై కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా జవాబివ్వడంతో మాటామాటా పెరిగి దాడికి దారితీసింది. ఈ దాడిలో కళాశాల కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసమైంది. సమాచారమందుకున్న రూరల్ సీఐ శ్రీనివాస్ అక్కడకు చేరుకుని విద్యార్థులను చెదరగొట్టారు. అనంతరం దాడికి కారణమైన విద్యార్థులను అదుపులోకి తీసుకోవడంతో విద్యార్థినులంతా పోలీసు జీపును అడ్డగించారు. యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. -
ఎడ్‌సెట్ ప్రశాంతం
బీఎడ్‌లో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్-2014 శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 7 పరీక్షా కేంద్రాల్లో 2,634 మంది అభ్యర్థులకు గాను 254 మంది గైర్హాజరయ్యారు. 2,380 మంది హాజరై పరీక్ష రాశారు. కడప నగరంలో ప్రభుత్వ పురుషుల కళాశాల, ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాల, నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల, ఎస్వీ డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహించగా ప్రొద్దుటూలో 3 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. కడప నగరంలో 1902 మందికి గాను 184 మంది గైర్హాజరు కాగా 1718 మంది హాజరై పరీక్ష రాశారు. ప్రొద్దుటూరులోని మూడు పరీక్షా కేంద్రాల్లో 732 మందికి గాను 70 మంది గైర్హాజరు కాగా 662 మంది హాజరై పరీక్ష రాశారు. కాగా కడప నగరంలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థిని ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు.కాగా బీఎడ్ పరీక్ష అటు అభ్యర్థులతో పాటు వారి తల్లిదండ్రులు, సోదరులకు సైతం పరీక్షగా మారింది. బాలింతలు, చిన్నారుల తల్లులు బీఎడ్ ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళ్లడంతో వారి పిల్లలను తల్లిదండ్రులు లాలించారు. -
తణుకు డిగ్రి కాలేజీలో మాస్ కాపీయింగ్
-
శాంతినికేతన్లో ఘనంగా వీడ్కోలు
మిర్యాలగూడ టౌన్, : పట్టణంలోని శాంతినికేతన్ డిగ్రీ కళాశాలలో బుధవారం బీకాం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ద్వితీయ సంవత్సర విద్యార్థులు వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన ఆటా పాటా అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కోణతం కృష్ణారెడ్డి, కరస్పాండెంట్ రామకృష్ణారెడ్డి, సెక్రటరీ మాలి ధర్మపాల్‌రెడ్డి, అధ్యాపకులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, రామస్వామి, రమేష్, సైదులు, సంతోష్‌కుమార్, రత్నకుమార్, శ్రీకాంత్, సఫీ యా, నరేష్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
ధైవనామస్మరణతోనే మోక్షం
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : కలియుగంలో నిరంతరం దైవనామ స్మరణమే మోక్షానికి మార్గమని స్వామి కమలానంద భారతి పేర్కొన్నారు. కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో నాలుగు రోజులపాటు నిర్వహించిన అఖిలాంధ్ర సాధు పరిషత్ 49వ మహాసభల్లో ఆదివారం ఆచార్య శ్రీహరి తీర్థస్వామి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. సనాతన భారతీయ సంస్కృతిలో ఐక్యతనే ైదె వ గుణంగా చెప్పారని, నేడు కుటుంబాలు, మనుషులు అడ్డుగోడలు పెంచుకుని అలమటిస్తున్నారన్నారు. స్వామి శ్రీహరి తీర్థ మాట్లాడుతూ తైత్తిరీయోపనిషత్తు మనకు తల్లి,దండ్రి, గురువు అతిథులను దైవంగా సేవించాలని సూచించిందని చెప్పారు. స్వామి విరిజానందగిరి మాట్లాడుతూ భక్తిలేకపోతే కర్మ, జ్ఞానాలు ఫలించవన్నారు. స్వామి నిశ్శ్రేయసానందగిరి మాట్లాడుతూ ప్రతి జీవి ఆత్మస్వరూపమనే భావనతో మెలగాలన్నారు. మాతా త్యాగీశానందపురి, కృష్ణానందగిరి స్వామి, జగదీశ్వరానందస్వామి, యోగానంద భారతి, సత్యానందగిరిస్వామి, శివానందభారతి, చిత్ స్వరూపానందగిరిస్వామి, స్కందదేవానందగిరిస్వామి భాగవతం గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంతో మూడురోజుల మహాసభలు ముగిశాయి. -
నీకు సాటి లేర య్యా!
పాలెం గ్రామాభివృద్ధి కోసం యా వత్ జీవితాన్ని త్యాగం చేసిన మహనీయు డు సుబ్బయ్య. మా చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్న బడి, గుడిని రెండు కళ్లలా చూసుకునేవారు. ఎన్నో కష్టాలు ఎదురైనా స్కూల్, కాలేజీలను నడిపించారు. ఆయన కూతురిగా నేనెంతో గర్వపడుతున్నా. ఆయన స్థాపించిన విద్యా సంస్థలను పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు కాపాడుకోవాలి. - డాక్టర్ సుచిత్రాసంజయ్, పాలెం సుబ్బయ్య కూతురు బిజినేపల్లి, న్యూస్‌లైన్: వేంకటేశ్వరుడే జనంతో నడుస్తూ, మాట్లాడుతూ పాలెం అభివృద్ధి కోసం దివంగత సుబ్బయ్య రూపంలో ఈ నేలపై తిరుగాడారని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అన్నారు. విద్యాభివృద్ధితోపాటు గ్రామాభివృద్ధికి ఆయ న ఆనాడే పునాదులు వేశారని కొనియాడారు. 1963 లోనే స్త్రీలకు ఉన్నత చదువులు ఇక్కడ లభించడం గొప్ప విషయమన్నారు. పట్నం చదువులను పల్లెకు తీసుకొచ్చిన ఘనత సుబ్బయ్యకే దక్కిందన్నారు. పాలెం విద్యాసంస్థల 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలు స్థానిక వెంకటేశ్వర డిగ్రీకళాశాలలో ఆదివారం ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. దశాబ్దాల నాడే పాలెం గ్రామస్తులు అన్ని అభివృద్ధి పనులను అనుభవిం చడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. పాలెం అంటే చ దువు అని.. చదువు అంటే పాలెం అన్న కీ ర్తి నలుదిశలా వ్యాపిం చిందన్నారు. నేటి సమాజంలో తన కు టుంబం కోసం పరితపించే వ్యక్తులు ఉన్నారని, ఎలాంటి అవకాశాల కోసం ఎదురుచూడకుండా విద్యావైద్యం, ఉపాధి, సాంకేతికరంగాల్లో తగిన సౌకర్యాలు కల్పించిన సుబ్బయ్య ఆదర్శప్రాయుడని కొనియాడారు. వ్యవసాయమే జీవనాధారంగా బతికిన ఆ రోజుల్లో విద్యపై దృష్టిసారించిన గొప్పవ్యక్తి అన్నారు. పూర్వవిద్యార్థులు ఆయన ఆలోచనలను కొనసాగించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న పాలెంలో జూనియర్ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వపరంగా స్థలం ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానన్నారు. పాలెం పారిశ్రామిక వాడలో సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఇక్కడి వాతావరణం ఎంతో అనుకూలంగా ఉందని, పారిశ్రామిక అభివృద్ధి కోసం తనవంతుగా కృషిచేస్తానన్నారు. ఆయన శ్రమ ఫలితంగా లబ్ధిపొందిన ప్రతిపూర్వ విద్యార్థి పాలెం విద్యాసంస్థల అభివృద్ధి కోసం కృషిచేయాలని కోరారు. 50 ఏళ్లుగా విద్యనభ్యసించిన విద్యార్థులను ఒకచోటికి చేర్చడం అభినందనీయమన్నారు. సుబ్బయ్య ఆదర్శప్రాయుడు పాలమూరు యూనివర్సిటీ(పీయూ) రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటాచలం మాట్లాడుతూ.. ఆనాడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఏ కొత్త పథకాలైనా తన ఊరికే కావాలని కోరుకున్న ఆదర్శప్రాయుడు సుబ్బయ్య అని కొనియాడారు. ఆలయాన్ని, విద్యాసంస్థలను తన రెండు కళ్లుగా భావించి మహాశక్తిగా అవతరించిన వ్యక్తిగా అభివర్ణించారు. 1963లో కళాశాల స్థాపన ఆయన సాధించిన చారిత్రాత్మక విజయమని, నిరుపేదల కోసం సంక్షేమ వసతి గృహాలు నిర్మించి ఎందరో పేదవిద్యార్థులకు విద్యాప్రదాతగా నిలిచారని అన్నారు. నాన్న ఆలోచనలకు వాస్తవరూపం చూపాలి సుబ్బయ్య కూతురు డాక్టర్ సుచిత్ర మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు నాన్న ఆశయాల కోసం పాటుపడాలని, ఆయన చేసిన అభివృద్ధి నీరుగారిపోకుండా వాస్తవరూపం చూపాలన్నారు. అభివృద్ధి పనులు రాజకీయాలకు వేదికలు కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. విద్యావైద్య, ఉపాధి రంగాలు మున్ముందు ఇంకా అభివృద్ధి సాధించేందుకు ప్రతిఒక్కరి సహకారం అవసరమన్నారు. పభుత్వం పాలెం కళాశాలలపై ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధి చేసేందుకు కృషిచేయాలని కోరారు. సర్ణోత్సవ వేడుకల సందర్భంగా పూర్వ అధ్యాపకులు, ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని విద్యార్థులు సంబరాల్లో తేలిపోయారు. వేడుకల్లో జెడ్పీ మాజీచైర్మన్ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, సర్పంచ్ పి.సుమలత, మాజీ ఎమ్మెల్యే మోహన్‌గౌడ్, మొట్టమొదటి ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు, రంగాచార్యులు, ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, డాక్టర్ రాజేందర్‌సింగ్, కృష్ణగౌడ్, రాఘవేందర్, దయానంద్, తదితరులు పాల్గొన్నారు. సుబ్బయ్య మధుర స్వప్నాలకు ప్రతీక పాలెం చదువుకోవడానికి బడి కరువై జీవితాన్ని వెళ్లదీస్తున్న ఎంతో మంది నిరుపేద విద్యార్థుల కోసం సుబ్బయ్య స్థాపించిన విద్యా సంస్థలు ప్రతీకలుగా నిలిచాయి. ఓ కుగ్రామంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలను ఏర్పాటు చేసి స్వార్థరహితంగా ఎవరూ చేయలేని పనులను ఆనాడే చేసి చూపించారు. తిరుమల శ్రీవారి దేవుల సమాన సంచార పవిత్ర ప్రాంతంగా ఆయన పాలెంకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. - డాక్టర్ సి.రంగాచార్య, ప్రాచ్య కళాశాల పూర్వ ప్రధానాచార్యులు నా పూర్వజన్మ అదృష్టం తోటపల్లి సుబ్రమణ్యం స్థాపించిన విద్యా సంస్థలకు మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా పని చేయడం నా పూర్వజన్మ అదృష్టం. 16 ఏళ్లు ఒకేచోట ప్రిన్సిపాల్‌గా పనిచేయడం అంటే శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. విద్యా సంస్థల అభివృద్ధి కోసం రాత్రనక, పగలనక సుబ్బయ్యగారు ఎంతో తపించేవారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో అదనంగా మా చేత క్లాసులు పెట్టించేవారు. కుగ్రామానికి ఇన్ని వసతులు తేవడం ఊహించలేనిది. - కె.నాగేశ్వర్రావు, డిగ్రీ కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్ నిరుపేదలను ఇంజనీర్లను చేశారు నాబోటి ఎందరో నిరుపేద విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పించి ఇంజనీర్లుగా చేసేందుకు అక్షర మహాయజ్ఞాన్ని నిర్వర్తించిన మహానుభావుడు. సుబ్బయ్య అంటే ఒక సంక్షేమ రాజ్యంలో ప్రజల అవసరాలను గుర్తించి పరిపాలన అందించిన మార్గ దర్శకుడు. అన్ని వనరులున్నా ప్రభుత్వాలు నిరుపేదలకు అందించలేని విద్యను అందించారు. ఆనాడే సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేసి, పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. - బుడ్డయ్య, పూర్వ విద్యార్థి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ పాలెం విద్యాసంస్థల అభివృద్ధికి కృషిచేస్తా నా చిన్ననాడు విద్యనభ్యసించిన పాలెం కళాశాలల అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. పాలెం వేంకటేశ్వరుడే సుబ్బయ్యగారి రూపంలో నిరుపేదలకు విద్యనందించేందుకు ఇన్ని విద్యా సంస్థలు స్థాపించారు. ఆయన స్థాపించిన విద్యాలయాల్లో నా చదువులు కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన చేసిన అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు గ్రామస్తులు పాటుపడాలి. - డాక్టర్ వెంకటాచలం, రిజిస్ట్రార్, పాలమూరు యూనివర్సిటీ పేదల పెన్నిధి పాలెం విద్యా సంస్థలు ఉచిత హాస్టల్ వసతి దొరికి ఇక్కడే డిగ్రీ చదవగలిగాను. ఎందరికో పేదల పెన్నిధిగా పాలెం విద్యా సంస్థలు విద్యాబుద్ధులు చెప్పించాయి. సుబ్బయ్య గారి కృషితోనే విద్యార్థులకు ఉచిత వసతి, భోజనాలు లభించాయి. పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి సుబ్బయ్యగారు. - ఎస్.వినయ్‌కుమార్, ప్రజాశక్తి మాజీ ఎడిటర్ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారు చదువు అంటే పాలెం అన్నంతగా పేరు సంపాదించిపెట్టారు సుబ్బయ్య గారు. 1963లోనే జిల్లాలో ఎక్కడా లేనివిధంగా కళాశాలలు నిర్మించి, మహాశక్తిగా అవతరించిన మహనీయుడు. సొంత ఊరి అవసరాలను తీర్చని రోజుల్లో... కార్యదక్షత, పట్టుదలతో పాలెం గ్రామాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన వ్యక్తి. - వంగా మోహన్‌గౌడ్, పూర్వ విద్యార్థి, మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్ -
దూసుకొచ్చిన మృత్యువు
జహీరాబాద్, న్యూస్‌లైన్: పుట్టిన రోజును జరుపుకునేందుకు మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టుకు ఆటోలో వెళుతున్న విద్యార్థుల బృందానికి మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామ శివారులో తొమ్మిదో నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జహీరాబాద్‌లోని ఆచార్య డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న జేమ్స్ తన పుట్టిన రోజును పురస్కరించుకుని తొమ్మిది మంది సహచర విద్యార్థులతో కలసి మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టుకు ఆటోలో బయలుదేరారు. ఆటో కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామ శివారుకు రాగానే ముందు వెళుతున్న బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో విఠల్ (21), జేమ్స్ (21) అక్కడికక్కడే మృతి చెందగా, యాదగిరి (21) జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మేఘమాల(20), ఆటో డ్రైవర్ జహీరుద్దీన్ (40)లు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిరారు. -
అవయవదానంపై చైతన్యం తెస్తాం
నంద్యాల, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా ఐదువేల మందిని అవయవదానానికి ఒప్పించే లక్ష్యంతో సాగుతున్నట్లు సెట్కూరు పీడీ రమణయ్య తెలిపారు. నంద్యాలలో మంగళవారం నిర్వహించిన యువజన వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువకులను ఉత్తేజపరిచే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా యువజన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారోత్సవాలకు హాజరయ్యే వారిని అవయవదానానికి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 600 మంది ముందుకు వచ్చారని చెప్పిన పీడీ ఈ జాబితాలోకి ఐదువేల మంది చేరేలా కృషి చేస్తున్నామన్నారు. రక్తదాన కార్యక్రమాల ద్వారా 15వందల యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అవయవలోపాలు, రక్తం లేకపోవడం కారణంగా మరణానికి దగ్గరవుతున ్న వారికి ఊపిరి పోసే ఈ కార్యక్రమానికి యువత సహకరించాలని పిలుపునిచ్చారు. రాజీవ్ యువశక్తి యూనిట్లు మంజూరు... రాజీవ్ యువశక్తి పథకం కింద జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు 510 యూనిట్లు మంజూరైనట్లు పీడీ రమణ తెలిపారు. ఇందుకోసం రూ. 5.01 కోట్లు కేటాయించారని, ఇందులో రూ. 1.55 లక్షల సబ్సిడీ ఉంటుందని తెలిపారు. 30 శాతం మించి సబ్సిడీ ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. గత ఏడాది రూ. 4.5 కోట్లతో 450 యూనిట్లు కేటాయించగా 526 యూనిట్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ సారి కూడా 510 యూనిట్ల కంటే అధికంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ నెలాఖరుకు ఈ ప్రక్రియ ముగిస్తామన్నారు. మార్చిలో ఆర్మీ రిక్రూర్ట్మెంట్లు.. సైన్యంలో చేరాలనుకునే నిరుద్యోగుల కోసం వచ్చే ఏడాది మార్చి 15 నుంచి 22వతేది వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగ జరుగుతుందన్నారు. ఇప్పటికే ర్యాలీలు, ఇతర చైతన్య కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉన్నదని, అయితే సమైక్యాంధ్ర ఆందోళనలతో దీనిని వాయిదా వేసినట్లు తెలిపారు. ఇప్పటి నుంచే సైన్యానికి ఎంపికయ్యే అంశాలపై శిక్షణను పొందడానికి ప్రయత్నం చేస్తామని రమణయ్య తెలిపారు. -
శ్రీలతకు రెండు స్వర్ణాలు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా యువతరంగం డిగ్రీ కాలేజి క్రీడోత్సవాల్లో మహిళల అథ్లెటిక్స్ మీట్లో కస్తూర్బా గాంధీ కాలేజికి చెందిన అథ్లెట్ పి.శ్రీలత సత్తా చాటింది. ఆమె 100 మీ., 200 మీ. రేసుల్లో స్వర్ణ పతకాలు సాధించింది. జింఖానా మైదానంలో శుక్రవారం జరిగిన ఈ పోటీల ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. అథ్లెటిక్స్ మహిళల విభాగం: ఫైనల్స్ ఫలితాలు: 100 మీటర్లు: 1.పి. శ్రీలత( కస్తూర్బా గాంధీ కాలేజి), 2. ఝాన్సీ(సెయింట్ ఫాన్సిస్ కాలేజి), 3.కె.మహేశ్వరీ (ఐపీజీడీసీ). 200మీటర్లు: 1.పి.శ్రీలత (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.టి.మీనా (జీడీసీ), 3. జి.వరలక్ష్మీ (కస్తూర్బా గాంధీ కాలేజి). 400 మీటర్లు: 1.హేమలత (కస్తూర్బా గాంధీ కాలేజి), 2. బి.రాణి (జీడీసీ), 3. మరియా ఝాన్సీ (సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి). 800 మీటర్లు: 1.అమృత కుమారి(సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి), 2.కె.మహేశ్వరీ (ఐపీజీడీసీ), 3.టి.జ్యోతి (జీడీసీ). లాంగ్‌జంప్: 1.కె.అచ్యుత కుమారి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.మరియా ఝాన్సీ (సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి), 3.సి.అమృత కుమారి (సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి). షాట్‌ఫుట్: 1.కాజల్ సింగ్రోహ (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.ఆర్.కోమల్ (కస్తూర్బా గాంధీ కాలేజి), 3.ఎం.గాయత్రి (జీడీసీ). సిటీ కాలేజికి టైటిల్ పురుషుల వాలీబాల్ టీమ్ టైటిల్‌ను ప్రభుత్వ సిటీ కాలేజి జట్టు చేజిక్కించుకుంది. జింఖానా మైదానంలో జరుగుతున్న ఈ పోటీల్లో రెండో రోజు శుక్రవారం సిటీ కాలేజి జట్టు 25-20, 25-12 స్కోరుతో వివేకవర్ధిని(వీవీ) డిగ్రీ కాలేజి జట్టుపై విజయం సాధించింది. సెమీఫైనల్స్‌లో సిటీ కాలేజి జట్టు 25-12, 25-21తో ఎస్పీ కాలేజిపై.. వీవీ కాలేజి 25-15, 25-10తో ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజిపై గెలిచాయి. -
ఫీజుల కోసం ఆందోళన
పాడేరు, న్యూస్‌లైన్ : పరీక్ష ఫీజు ఐటీడీఏ చెల్లించాలంటూ పాడేరు డిగ్రీ కళాశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థులు బుధవారం కదం తొక్కారు. డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీగా వచ్చి ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఆర్వో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా సాగింది. పరీక్ష ఫీజును ఐటీడీఏ చెల్లించాలని, పెంచిన ఫీజులను ఏయూ తగ్గించాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమశాఖ డీడీ బి.మల్లికార్జునరెడ్డి విద్యార్థి సంఘాల నేతలతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆన్లైన్ జరగనందునే ఉపకార వేతనాలు బ్యాంకు ఖాతాలో జమ కాలేదని, వెంటనే సమగ్ర సమాచారంతో ఆన్లైన్ చేసుకోవాలని విద్యార్థి సంఘాలకు డీడీ సూచించారు. అయితే ఫీజు చెల్లించేందుకు గడువు లేకపోవడంతో అడ్వాన్స్ రూపంలోనైనా ఐటీడీఏ చెల్లించాలని విద్యార్థి సంఘాలు కోరాయి. చివరకు ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ విద్యార్థి సంఘాల నేతలు ఎంఎం.శ్రీను, రాధాకృష్ణ, కోడ అజయ్‌కుమార్, జె.రమణ, కె.చిన్నలతో సమస్యలపై చర్చలు జరిపారు. ఫీజుల సమస్య పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. ఏజెన్సీలోని పాడేరు, చింతపల్లి, కొయ్యూరు, అరకు ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు ఫీజుల చెల్లింపు గడువు పెంచాలని పీవో స్వయంగా ఏయూ అధికారులతో మాట్లాడారు. పీవో హమీ మేరకు ఆందోళనను విద్యార్థులు తాత్కాలికంగా విరమించారు.