సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్–2022 తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తయింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 1,12,683 మంది విద్యార్థులకు ప్రాధాన్యతాక్రమంలో సీట్లు కేటాయించారు. ఈ మేరకు దోస్త్–2022 కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌తో కలసి శనివారం వివరాలను విడుదల చేశారు. దోస్త్–2022 ఫేజ్–1లో మొత్తం 1,44,300 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1,18,898 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. 6,215 మంది విద్యార్థులు సరైనవిధంగా ఆప్షన్లు ఇవ్వకపోవడంతో వారికి సీట్లు రాలేదు.
కామర్స్, ఆర్ట్స్ గ్రూపుల్లో అధికంగా...
దోస్త్–2022 తొలివిడతలో సీట్లు పొందిన 1,12,683 మంది విద్యార్థుల్లో పురుషులు 45,743(40.59%), మహిళలు 66,940(59.41%) ఉన్నారు. అడ్మిషన్లు పొందినవారిలో అత్యధికంగా ఆర్ట్స్, కామర్స్ గ్రూపులవారే ఉన్నారు. సైన్స్ గ్రూప్‌ల అడ్మిషన్లు రెండోస్థానంలో ఉన్నాయి. మీడియాలవారీగా పరిశీలిస్తే ఇంగ్లిష్ మీడియంలో 1,02,418 మంది విద్యార్థులు, తెలుగు మీడియంలో 9,304, ఉర్దూ మీడియంలో 10, హిందీ మీడియంలో 951 మందికి సీట్లు కేటాయించారు.
దోస్త్–2022లో మొత్తం 978 కాలేజీల్లో 510 కోర్సులున్నాయి. మొత్తం 4,20,318 సీట్లలో తొలివిడత 1,12,683 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు, ఇంజనీరింగ్, మెడికల్ సీట్లకు కౌన్సెలింగ్ పూర్తయ్యాక డిగ్రీ ప్రవేశాల వేగం పుంజుకుంటుందని నవీన్ మిట్టల్ తెలిపారు. ఇప్పటివరకు 51 కాలేజీల్లో ఎలాంటి ప్రవేశాలు జరగలేదు.
సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే సీటు
డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థులు లాగిన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియతో సీటు రిజర్వ్ చేసుకోవాలి. ప్రభుత్వకాలేజీల్లో సీటుపొంది ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలతో ఉచితంగా, మిగతా విద్యార్థులు రూ.500 లేదా రూ.1,000 చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్‌తో సీటు రిజర్వ్ చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్‌లో విఫలమైతే సీటు రద్దవుతుంది. దోస్త్–2022 ఫేజ్–2 రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 7 నుంచి 22వ తేదీ వరకు కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment